Saturday, November 1, 2008

స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీకి


Left Robert C North with Innaiah N






ఎమ్.ఎన్. రాయ్ చైనాలో నిర్వహించిన పాత్రను పరిశోదించి ఒక పెద్ద గ్రంథాన్ని( M N Roy`s Mission to China 1963) ప్రమాణయుతంగా వెలువరించారు రాబర్డ్ సి. నార్త్. నేను ఇండియాలో ఆ పుస్తకం చదివాను. ఆయన్ను ఎప్పుడైనా కలుసుకోవలనుకున్నాను. 1989 ప్రాంతాల్లో బొంబాయిలో జరిగిన మానవ వాద మహాసభకు వచ్చి ఆయన పాల్గొన్నారు. కానీ నేను అప్పుడు వెళ్ళలేకపోయాను. తరువాత అమెరికా వెళ్ళినప్పుడు ఆయనను కలుసుకోవాలనుకున్నాను. ఆ విషయం తెలిసి జి.ఆర్. బాబు (ప్రపంచ మానవ వాద నైతిక సంఘంలో పనిచేస్తున్నారు) చెబుతూ, ఆయన ఇంకెక్కడున్నాడు చనిపోయాడు అన్నారు. చాలా విచారించాను. అయితే ఆయన పనిచేసిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ పోలిటికల్ సైన్స్ శాఖకు ఉత్తరం రాశాను. ఆయనకు సంబంధించిన పరిశోధనా పత్రాలు చూడాలని ఉందని రాశాను. దానికి ఆశ్చర్యకరంగా రాబర్ట్ సి. నార్త్ నుండే నాకు ఉత్తరం వచ్చింది. అదేమిటయ్యా చనిపోయాడన్నావు, ఆయనే బత్రికే ఉన్నాడని జి.ఆర్. బాబుతో చెబితే ఆయన సారీ..., నాకు వచ్చిన సమాచారం పొరపాటు అయినది అన్నాడు. రాబర్ట్ సి. నార్త్ తనను కలుసుకోవలసిందిగా ఒక తేదీ ఇచ్చారు. శాన్ ఫ్రాన్సిస్ శివార్లలో ఉన్న స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీకి వెళ్ళాను. అప్పటికి సి. నార్త్ కు 81 ఏళ్ళు. గడ్డం పెంచి ఉన్నారు. ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. పైగా అది గేర్స్ తో ఉన్న కారు. చాలా పురాతనమై నది. ప్రక్కనే ఆయన భార్య ఉన్నది. పోలిటికల్ సైన్స్ ప్యాకల్టీలో నాకు చక్కని లంచ్ ఇచ్చారు. చాలా సేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాతో పాటు వచ్చిన మేనల్లుడు రాజశేఖర్ మమ్మల్ని ఫోటోలు తీశాడు. సి. నార్త్ తన అనుభవాలు చెబుతూ 1950 ప్రాంతాల్లో ప్రకారం
హైదరాబాద్ లొ వున్నట్లు
వెల్లడిస్తే ఆశ్చర్యపోయాను. తన భార్య అప్పుడు గర్భిణిగా ఉన్నదని, నైజాంకు చెందిన ఒక నర్శింగ్ హోమ్ లో చేర్పించామని చెప్పాడు. హైదరాబాద్ గురించి అడిగి తెలుసుకున్నాడు.

ఎమ్.ఎన్. రాయ్ ని గురించి ఆయన అనుభవాలు అడిగాను. ఢిల్లీ నుండి ఒక మిత్రుడి సహాయంతో డెహరాడూన్ లో ఉన్న ఎమ్.ఎన్. రాయ్ ను కలుసుకుని ఇంటర్వ్యూ చేశామని చెప్పారు. ఆయన భార్య ఎలెన్ కూడా అనేక విషయాలు ఆసక్తికరంగా చెప్పిందన్నాడు.

ఎమ్.ఎన్. రాయ్ మొదటి భార్య ఎవిలిన్ ట్రెంట్ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన గ్రాడ్యుయేట్. ఆమె చివరి రోజుల్లో తన ఉనికిని ఇతరులకు తెలియకుండా ఉండదలచింది. ఉత్తర ప్రత్యుత్తరాలు రాబర్ట్ సి. నార్త్ ద్వారా జరిపింది. ఆ విధంగా ఆయన సన్నిహితంగా వారి విషయాలు తెలిసినవారు. అవికూడా చాలా ఆసక్తికరంగా చెప్పాడు. కమ్యూనిస్టులు కొందరు ఆమెను ఇంటర్వ్యూ చేయాలంటే సి. నార్త్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. అవన్ని ఆయన ఓపికగా నాతో చెప్పారు. ఒక పూట అంతా ఆయనతో గడపటం, గొప్ప ఆనందకరమైన అనుభవం. 2002 july 15 లో ఆయన చనిపోయారు

No comments: