Monday, September 28, 2009

ఆంధ్రలో సామాజిక విప్లవ బీజాలు -పునర్వికాసం

స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతుండగా, మరో వైపు ఆంధ్రలో సామాజిక విప్లవ బీజాలు పడ్డాయి. 1940 ప్రాంతాలలో విజృంభించిన యీ పునర్వికాసం కొందరు యువతను బాగా ఆకట్టుకున్నది. సినిమా, కళలు, సాహిత్యం, వివాహం, చదువు, పత్రికల రంగాలలో యీ పునర్వికాసం తొంగిచూచింది.

అటు బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు నుండి సామాజిక సంస్కరణ వాసనలు వచ్చి ప్రభావితం చేశాయి. ఆంధ్రకు ఎం.ఎన్. రాయ్ ను తెచ్చిన అబ్బూరి రామకృష్ణారావు, ములుకుట్ల వెంకటశాస్త్రి, వెన్నెలకంటి రాఘవయ్య అనుకోకుండా సాంఘిక విప్లవ బీజాలు నాటారు. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. అది మెచ్చిన వారు, పునర్వికాసానికి దోహదం చేశారు. ఆనాడు వారిది ఎదురీత. అయినా వారు నాటిన బీజాలు మానసిక వికాసానికి, భావ విప్లవానికి దారి తీశాయి.


బ్రిటిష్ వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండోప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, నాజీ నియంతలు, మన దేశంలో బలపడకుండా జపాన్ తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు. గుర్రం జాషువా వంటి వారికి ఆ వాదన నచ్చగా, యధాశక్తి అనుసరించారు. మరొక పక్క నాస్తిక వాదంతో గోరా, త్రిపురనేని రామస్వామి పురాణాల తిరోగమనాన్ని వ్యతిరేకిస్తుండగా స్త్రీ స్వేచ్ఛకై చలం సాహిత్య పోరాటం చేశారు. సాంఘిక ఉద్యమం తలపెట్టారు.


ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ ధోరణి, అధ్యయన తరగతులు, సాహిత్యం చాలా మందిని ఆకట్టుకున్నాయి. సినిమా రంగంలో గూడ వల్లి రాంబ్రహ్మం సంస్కరణ చిత్రాలు తీసి కొత్త వెలుగు చూపారు. ప్రజా మిత్ర పత్రిక ద్వారా ఎవరూ వెయ్యని ఎం.ఎన్. రాయ్ వ్యాసాలు, ఆయన అనుచరుల సాహిత్యాన్ని జనానికి అందించి, కళ్ళు తెరిపించారు.


ఆనాడు అదంతా ఎదురీత. స్వాతంత్ర వుద్యమ ప్రవాహం. విపరీతంగా వుండగా పునర్వికాసం సాహసోపేతంగా సేవలు అందించింది. ఎం.ఎన్. రాయ్ ఆంధ్ర పర్యటనలు కొందరు మేధావులను పురికొల్పి, ఉద్యమానికి ఉద్యుక్తుల్ని గావించింది.
అబ్బూరి రామకృష్ణారావు స్జేజి నాటక రంగంలో కొత్త దారులు చూపారు. పి.హెచ్. గుప్తా విశాఖ నుండి రామాయణ విమర్శ అందించారు.
గుంటూరులో బండారు వందనం దళితుల మధ్య పునర్వికాసానికి నాంది పలికారు. కార్మిక రంగంలో పెమ్మరాజు వెంకటరావు నెల్లి మర్ల జూట్ మిల్లు కార్మికులతో ఆరంభించి, కార్మిక పత్రిక నడిపి, చక్కని పునాదులు ఏర్పరచారు.


ఉపాధ్యాయుడుగా ఎలవర్తి రోశయ్య అనేక మంది విద్యార్థులకు అటు భావ విప్లవ సాహిత్యాన్ని పరిచయం చేసి, చదివించారు. విద్యార్థి లోకంలో సంచలనం కలిగింది. పాముల పాటి కృష్ణచౌదరి రాడికల్ విద్యార్థి పత్రిక నడిపారు.


గుత్తి కొండ నరహరి తన వుపన్యాసాలతో వ్యాసాలతో వుర్రూత లూగించారు. బండి బుచ్చయ్య నడిపిన ములుకోల అందుకు వూతంయిచ్చింది.
సాహిత్య ప్రచురణలు ఏర్పరచి కోగంటి రాధా కృష్ణ మూర్తి తెనాలి నుండి నలంధా ప్రచురణలు, ప్రజా సాహిత్య గ్రంథాలు వెలికి తెచ్చారు.
ఆవుల గోపాలకృష్ణమూర్తి వ్యాసోపన్యాసకుడుగా ఎం.ఎన్. రాయ్ భావ ప్రచారం చేసి, లౌకిక వివాహాలు జరిపాడు. కవులను, గాయకులను, చిత్ర కారులను, రచయితలను కూడ గట్టి, ఆవుల (ఎజికె అనే వారు) అధ్యయన తరగతులు నిర్వహించారు. సాహిత్యంలో ఔచిత్యం వుండాలన్నారు. త్రిపురనేని రామస్వామి సాహిత్యాన్ని, ఏటుకూరి వెంకట నరసయ్య రచనలను బాగా విస్తృతం గా జనంలోకి తీసుకెళ్ళారు.


తెనాలి కేంద్రంగా రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష, జ్యోతి, రేరాణి, సినిమా, అభిసారిక పత్రికలు వివిధ రంగాలలో శాస్త్రీయ ఆలోచనకు దోహదం చేశాయి. ఆలపాటి రవీంద్రనాధ్ జ్యోతి పత్రిక యువ రచయితలకు ఆయువు పట్టుగా, శాస్త్రీయ చింతనకు దీటుగా తోడ్పడింది. ఆనాడే కుటుంబనియంత్రణ కావాలన్న పత్రిక జ్యోతి గొప్ప మలుపు తిప్పింది.


జి.వి. కృష్ణారావు కళా సాహితీ రంగాలలో మానవ వాద ధోరణిలో మార్క్సిస్టు పంధాను విమర్శిస్తూ, కావ్య జగత్తు రాశారు. కీలు బొమ్మలు, జఘనసుందరి, కళాపూర్ణోదయ విమర్శ, పాపి కొండలు వెలువరించారు.

రాజకీయ రంగంలో కాంగ్రెస్ వ్యవస్తనూ కమ్యూనిస్టు పద్ధతుల్ని కాదని, చిన్న కథలలో రాజకీయాల్ని రాసిన గోపీ చంద్ పెద్ద సంచలనం సృష్టించారు. ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా చక్కని ఆలోచనా పూరిత రచనలు చేశారు. గోకుల్ చంద్, పి.వి. సుబ్బారావు, కోగంటి సుబ్రహ్మణ్యం ఆ కోవలోని వారే. జాస్తి జగన్నాధం విద్యార్థి దశ నుండి ఎం.ఎన్. రాయ్ రచనల్ని కొన్ని తెలుగులోకి అందించారు. చరిత్రలో శాస్త్రీయ పంధా ఎలా వుండాలో చూపారు భట్టి ప్రోలు హనుమంతరావు, కల్లూరి బసవేశ్వరరావు. ఇది ఎం.ఎన్. రాయ్ వేసిన బాట.
నాటకం, కథలు, సినీరంగంలో రాయ్ అనుచరుడుగా భావ విప్లవానికి బీజాలు వేసిన డి.వి. నరసరాజు పేర్కొన దగిన వ్యక్తి. మల్లాది రామమూర్తి మానవ వాదిగా తీవ్ర కృషి చేయగా, మల్లాది సుబ్బమ్మ ఆ కృషిని కొనసాగించింది.


రావిపూడి వెంకటాద్రి హేతువాద మానవ వాద వుద్యమాన్ని నిలబెట్టడంలో విపరీత సాహిత్య, పత్రిక, వ్యాస రంగాలను వినియోగించారు. అధ్యయన తరగతులు నిర్వహించారు.

ఎన్.వి. బ్రహ్మం మత ఛాందసాలను, బైబిల్ బండారం ద్వారా ఎండగట్టారు. సి.హెచ్. రాజారెడ్డి, కొల్లి శివరామరెడ్డి, ఎం.వి. రమణయ్య, అచ్యుత రామ్, పరమయ్య మానవ వికాస ఉద్యమ రంగంలో అనేక పరిమళాలు వెదజల్లారు. ఎ.ఎస్. అవధాని ఆ కోవలోని వారే. అలాగే ఎ.వి. మోహన్ కూడా.


తెలుగులోకి మానవ వాద సాహిత్యం అనువాదాలరూపేణా, సొంత రచనల ద్వారా రావడానికి తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్శిటి సహకరించాయి. (ఎన్. ఇన్నయ్య అనువాదాన్ని, రచనల్ని వారు వెలువరించారు).

పత్రికా రంగంలో ఎ.ఎల్. నరసింహారావు, ఎన్.కె. ఆచార్య వుద్యమాన్ని పోషించారు. ఆవుల సాంబశివరావు వివిధ పదవులు సాగిస్తూనే, మానవ వాదిగా సాహిత్యాన్ని సమాజంలోకి తెచ్చారు.

ఎం.ఎన్. రాయ్ మానవ వాద ప్రభావంతో నార్ల వెంకటేశ్వరరావు ఇంగ్లీషులో గీతపై విమర్శ గ్రంథం తెచ్చారు.
నార్ల నాటికలు, నాటకాలు, విమర్శలు, పద్యాలు బాగా పునర్వికాస మానవ వాద ధోరణి ప్రబలించాయి. నరకంలో హరిశ్చంద్ర నాటకాన్ని ఎన్. ఇన్నయ్యకు అంకితం చేశారు. అలాగే తన యితర రచనల్ని మానవ వాదులకు అంకితం చేశారు.
ఎం.ఎన్. రాయ్ మానవ వాద ధోరణి శ్లాఘిస్తూ సంజీవ దేవ్ రాశారు. లలిత కళారంగంలో కొత్త పోకడలు చూపారు. అతీంద్రియ శక్తుల ఆలోచనలో శాస్త్రీయత, లేదన్నారు. పాలగుమ్మి పద్మరాజు పుంఖాను పుంఖంగా మానవ వాద రచనలు చేసి రెండో అశోకుడి ముణ్ణాళ్ళ పాలన రచనతో పార్టీ రహిత ప్రజాస్వామ్యం చూపాడు.


కొండ వీటి వెంకట కవి, ఆలూరి బైరాగి, కవిరావు, తెలంగాణాలో ఎం. నారాయణ వై. రాఘవయ్య, ఆలంఖుందుమీరి యిలా ఎందరో యధాశక్తి పునర్వికాసానికి తోడ్పడ్డారు. విజయనగరంలో తాతా దేవకీ నందన్ మొదలు ఎందరో వుద్యమానికి ఉపకరించారు.
నేడు సమాజంలో శాస్త్రీయ ధోరణి సన్నగిల్లి, మత మౌఢ్య మోతాదు పెరిగింది. విద్యార్ధులలో వైజ్ఞానిక దృక్పధం పోతున్నది. ఎందుకని?
నేటి ఆవశ్యకత పునర్వికాసం, వైజ్ఞానిక పంధా, మానవ విలువ, అదెలా సాధ్యం? ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
పునర్వికాసం అంటే మానవ విలువలు పాటించడం చరిత్రను వైజ్ఞానికంగా రాసుకోవడం. మానవులను కించపరచే కులం, దానికి మూల మైన మతాన్ని దూరంపెట్టడం, శాస్త్రీయ పాఠ్య ప్రణాళికను ప్రాధమిక దశ నుండే అమలు పర్చాలి. ఇది కష్ట సాధ్యం అయినా అవస

No comments: