Saturday, April 4, 2009

భిన్న కోణాలలో పోలీస్ అధికారి



An idle model police office Mr Parvathaneni Koteswararao(1977 picture)


పర్వతనేని కోటేశ్వరరావు రాష్ట్రపతి, ప్రధాని అవార్డులు అందుకున్న పోలీస్ అధికారి. కృష్ణాజిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన వ్యక్తి. వృత్తి రీత్యా అనేక ఉద్యోగాలు చేశారు.

ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా వుండగా సెక్యూరిటీ ఆఫీసర్ గా వున్నారు. ఆవుల సాంబశివరావు లోకాయుక్తగా వుండగా అక్కడ ఉద్యోగం చేశారు. ఉన్నత పోలీస్ అధికారులు ఆయన్ను బాగా గౌరవించడానికి ఆయన ప్రవర్తన, తెలివితేటలు, జడ్జిమెంట్ కారణం.

కోటేశ్వరరావు మాకు సన్నిహిత కుటుంబ మిత్రులు. ఏమాత్రం అవకాశం ఉన్నా మానవవాద, సెక్యులర్ ఉపన్యాసాలకు, శిబిరాలకు వచ్చేవారు. మంచి విమర్శనాత్మక విశ్లేషణ రచనలు వ్యాసాలు చదివేవారు.

సమకాలీన రాజకీయ పార్టీల, నాయకుల విషయంలో నిశిత పరిశీలన చేసేవారు.

పోలీస్ అధికారిగా ఆయనకు తెలిసిన అనేక లోగుట్టులు చెప్పేవారు. కొన్ని వృత్తి ధర్మం రీత్యా ప్రచురించవద్దనేవారు. అప్పుడే ఆయన మేథస్సు గ్రహించగలిగాను.

ఎన్.టి. రామారావును సన్నిహితంగా చూచాడు గనుక అనేక ఆసక్తికరమైన సంగతులు చెప్పేవాడు. దాదాపు ఆరు మాసాలపాటు సన్యాసి కాషాయవస్త్రాలు సూట్ కేసులో పెట్ట్టుకుని తిరిగాడని, ఆలోచించి, చివరకు వాటిని ధరించాడని చెప్పాడు. కొందరు ఉన్నతాధికారులు రామారావును ముఖస్తుతి చేసి, తిరుపతి దేవస్థానం వంటి చోట పదవులు పొందారన్నాడు.

నాదెళ్ళ భాస్కరరావుకు కోటేశ్వరరావు అంటే యిష్టం వుండేదికాదు. చిత్తశుద్ధిగల ముక్కుసూటి ఆఫీసర్ గావడమే కోటేశ్వరరావు లోపం! అయితే రామారావు ఆయన్ను బాగా గౌరవించేవాడు.

1982 ఎన్నికల సమయంలో పోలీస్ అధికారిగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో డబ్బుల సూట్ కేసులు కళ్ళారా చూచిన కోటేశ్వరరావు ముక్కుపై వేలు వేసుకున్నాడు. ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రత్యేక విమానంలో సూట్ కేసులలో డబ్బులు తేవడం, వాటిని కాంగ్రెస్ అభ్యర్థులకు ఉద్దేశించి పోవడం జరిగింది. అయినా ఓడిపోయిన సంగతి అలా ఉంచండి.

శ్రీశ్రీ, నార్ల వెంకటేశ్వరరావు రచనలంటే కోటేశ్వరరావు యిష్టపడేవారు. మేము ఎన్నోసార్లు కలుసుకుని ముచ్చటించేవాళ్ళం. రిటైర్ అయిన కొద్ది రోజులకే (1992లో) చనిపోయారు.

No comments: