Tuesday, August 7, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -4

నేటికి కూడా ఆంగ్లాను వాదం లేని మార్క్సు రచన



కేపిటల్ మూడు సంపుటాలలో మార్క్సు స్వయంగా పరిష్కరించి ప్రచురించినది మొదటి భాగం మాత్రమే. రెండు, మూడు భాగాలను పరిష్కరించడం కారణాంతరాలచే మార్క్సుకు వీలు కాలేదు. మార్క్సు అనంతరం ఎంగెల్స్ ఆ పని పూర్తి చేశాడు.
కేపిటల్ మొదటి భాగం క్లిష్టమైనది. కష్టమైనది కూడా. మార్క్సు పరిష్కరించిన గ్రంథమే చాలా విస్తృతంగా ఉన్నది. అందుకే కాబోలు ఈ గ్రంథం చివర చేర్చాలనే దృష్టితో వ్రాసిన 200 పేజీల అధ్యాయాన్ని మార్క్సు వదిలి వేశాడు.
ఉత్పత్తి విధానాల తక్షణ ఫలితాలు అనే శీర్షిక కింద ఈ అధ్యాయం ఉంటుంది.
1933లో మొదటిసారి మాస్కో నుండి ఈ భాగం ప్రచురించారు. 1971లో ఫ్రెంచి అనువాదం వెలువడింది. ఆర్. డాంగ్ విల్ సంపాదకత్వాన ఇది వెలుగు చూచింది. ఇంకా ఆంగ్లాను వాదం రాలేదు. తెలుగులోకి ఇప్పట్లో వచ్చే ప్రశ్నే లేదేమో.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో పెట్టుబడిదారు - కార్మికుల సంబంధాలు ఎలా మారతాయి. ఈ సంబంధాలలో వైమనస్యత ఏ రకంగా రూపొందుతుంది. అనే అంశాలు చర్చించాడు. వేతనాలపై పనిచేసే కార్మికులను సాధ్యమైనంత మేరకు పెట్టుబడిదారీ విధానం ఉత్పత్తి రంగంలో ఎలా తగ్గించే ధోరణి కనిపిస్తుంది. దానికి బదులు సేవా పరిశ్రమ రంగాలలో కార్మికుల సంఖ్య ఎలా పెంచుతుంది. అనే అంశాలు మార్క్సు చర్చించాడు. ఆంగ్లంలో కొన్ని భాగాలు డేండ్ మెక్లన్ అనువదించి 1971లో ప్రచురించారు.
కార్ల్ మార్క్సు జీవిత చరిత్రను మాస్కో నుంచి ప్రోగ్రెస్ పబ్లిషర్స్ తొలిసారిగా 1973లో ఆంగ్లంలో ప్రచురించినా ఇలాంటి విషయాలేవీ అందులో మనకు లభించవు. మొత్తం మార్క్సు జీవిత చరిత్రలో అలా దాచిపెట్టినవి కోకొల్లలుగా ఉన్నవి.
కేపిటల్ తొలిభాగం ప్రచురితమయినపుడు, అట్టుడికి పోతుందని మార్క్సు భావించాడు. కాని నిరాశే ఎదురయింది. సిగరెట్ల ఖర్చుకు పెట్టిన డబ్బు అయినా రాలేదన్నాడు. మార్క్సు ఎంగెల్స్ మాత్రం ఏడు పత్రికలకు ఆయా పత్రికల ధోరణినిబట్టి ఏడు సమీక్షలు తానే రాసి ప్రచురించాడు. అయితే ఇంగ్లండులో మాత్రం ఆ ఉపాయం పనిచేయలేదు. సాటర్ డే రివ్యూలో చిన్న ప్రకటన వరకే పరిమితంగా ప్రచురితమైంది. పదేళ్ళుగా లండన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నా మార్క్సు ప్రభావం అక్కడ అంతగా లేదు. ట్రేడ్ యూనియన్ లో మార్క్సు సహచరులకు కాపిటల్ మొదటి భాగం ఏనుగును బహుమతిగా ఇచ్చినట్లయింది. వెయ్యి ప్రతులు అమ్ముడవడానికి నాలుగేళ్ళు పట్టింది.
కాపిటల్ వ్రాస్తున్నంతకాలం మార్క్సు చాలా కష్టాలలో మునిగి తేలాడు. ఎంత తొందరగా తెమల్చాలన్నా కుదిరింది కాదు. పుస్తకం దిండు అంత సైజు ఉంటే కానీ జర్మన్ లకు నచ్చదని మార్క్సుకు బాగా తెలుసు. మార్క్సు లేఖలలో ఈ విషయం బయట పెట్టాడు కూడా. ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు సృజనాత్మక రచనలు కాక చారిత్రక రచనలు చేయడం మార్క్సుకు పరిపాటి. 1862-63 సంవత్సరాలలో కాపిటల్ వ్రాస్తుండగా కష్టాలు దుర్భరమైనాయి. అందువల్ల విసిగి వేసారి ఏదో ఒక వ్యాపారంలో దిగాలని ఉన్నదని వ్రాశాడు. పచ్చపచ్చగా ఉండాలంటే వ్యాపారమొక్కటే మార్గం. కాని జీవితంలో ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించానన్నాడు.
కాపిటల్ వ్రాయడానికి మార్క్సు సేకరించిన సమాచారం వ్రాసుకున్న నోట్సు అంతా లభ్యంకాలేదు లేక బయటకు రాలేదో తెలియదు.
కాపిటల్ మొదటి భాగం అచ్చులో ఫ్రూఫులు చూడడం తప్ప ఎంగెల్స్ వాటిని వ్రాతప్రతులలో చూడలేదు. సాధారణంగా తన రచనలన్నీ ఎంగెల్స్ కు చూపే మార్క్సు ఇక్కడ ఆ పని చేయలేదు.
కాపిటల్ వ్రాస్తున్నప్పుడు, సమాచారం సేకరిస్తున్నప్పుడు మార్క్సు వంటినిండా రాచ కురుపులతో బాధ పడ్డాడు. ఆ లక్షణాలు కాపిటల్ లో ఉన్నాయంటాడు ఎంగెల్స్. అర్ధం కావడానికి తన్నుకోవలసిన భాగాలపై ఎంగెల్స్ వ్యాఖ్య అది.
ఈ రాచకురుపులు ఎంత బాధాకరంగా ఉండేవంటే కొన్ని పర్యాయాలు నిలబడి ఉండవలసిందే తప్ప కూర్చోవడానికీ, పడుకోవడానికీ ఉండేది కాదు. డాక్టరు కంటే అధికంగా ఈ రాచకురుపుల విషయం మార్క్సుకు అర్ధమైంది. ఆర్సెనిక్ నల్లమందు స్వీకరించే వాడు. రోజూ చన్నీళ్ళ స్నానం తప్పేది కాదు. సిగరెట్లు తాత్కాలికంగా మానివేయవలసి వచ్చింది. రాచకురుపులకు తరచు శస్త్ర చికిత్స అవసరమయ్యేది. దీనిని ఒక శ్రామిక రోగంగా మార్క్సు చిత్రించాడు. ఒక్కొక్క పర్యాయం తానే స్వయంగా గడ్డి కోసుకునే వాడు. మర్మావయవంపై రాచకురుపు వచ్చినప్పుడు మార్క్సు మరొక విధంగా ప్రవర్తించేవాడు. 16వ శతాబ్దపు ఫ్రెంచి అశ్లీల కవిత్వాన్ని బాగా మధించి, కొన్ని మచ్చుతునకలు ఎంగెల్సుకు పంపిస్తుండే వాడు. సముద్ర తీరాలకు వెళ్ళి మార్క్సు అప్పుడప్పుడు విశ్రాంతి పొందుతుండేవాడు. కాపిటల్ మొదటి భాగం చూసుకున్న మార్క్సు బిడ్డను కన్నతల్లివలె మురిసి పోయాడు.అదీ కాపిటల్ కథ.

మార్క్సు మరణానంతరం చాలా ఏళ్ళకు వెలువడిన గ్రంథం

మార్క్సు రచనలలో మకుటాయ మానమైన గ్రంథం రాజకీయ, ఆర్థిక నిశిత విమర్శకు ప్రాతిపదికలు. తరువాత ప్రచురితమైన రాజకీయ, ఆర్థిక నిశిత పరిశీలన కాపిటల్ కు గ్రంథం ఆధారమే కాక అవసరం కూడా. 1857-58 శీతాకాలంలో ఏడు నోట్ బుక్స్ గా మార్క్సు రాసిన ఈ ప్రాతిపదికలు ఇంచుమించు అచ్చులో ఇంచుమించు 800 పుటల గ్రంథం. 15 సంవత్సరాల కృషితో అత్యుత్తమ సమయంలో వ్రాసిన గ్రంథంగా మార్క్సు ప్రాతిపదికలను గురించి చెప్పాడు. ఈ గ్రంథానికి గల శీర్షిక మార్క్సు నిర్ణయించలేదు. మాస్కోలో తొలిసారి ప్రచురించిన ఎడిటర్లు ఈ విషయం ఈ పేరు పెట్టారు.
మార్క్సు వ్రాసిన అనంతరం 80 ఏళ్ళకు, లెనిన్ అనంతరం 15 సంవత్సరాలకు గానీ ప్రాతిపదికలు మొట్టమొదటి ప్రచురణ కాలేదు. మార్క్సు-ఎంగెల్సు-లెనిన్ సంస్థ వారు మాస్కోలో 1939, 1941లో గ్రంథాన్ని రెండు సంపుటాలుగా ప్రచురించారు. కాని, యుద్ధ సమయం కావడం వల్ల అవి రష్యా సరిహద్దులు దాటి పోలేదు. నాలుగైదు ప్రతులు పోయినా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. 1953లో బెర్లిన్ నుంచి ఈ గ్రంథం ప్రచురితమైన అనంతరం మేథావుల దృష్టి పడింది. ఆంగ్లానువాదం కొన్ని భాగాలు మాత్రం డేవిడ్ మెక్లన్ ప్రచురించాడు. 1947లో పూర్తి ఆంగ్ల ప్రతి అమెరికా, ఇంగ్లండులో బయటకు వచ్చింది.
మాస్కో నుంచి ప్రచురితమయినా దీనికి ఎన్నో కారణాలు పురస్కరించుకొని అంతగా వారు ప్రాధాన్యత ఇవ్వలేదు.
ప్రాతిపదికలు చదివితే మార్క్సుతత్వం, తర్కం పద్ధతులు బాగా అవగాహన అవుతాయి. ఇందులోని చాలా విషయాలు మరెక్కడా పునరావృతం కాలేదు. హెగెల్ ను బాగా చదివిన తరువాత గతి తార్కిక పద్ధతిని మార్క్సు ఎంత చక్కగా అన్వయించాడో గమనించాలంటే ప్రాతిపదికలు చదవాలి. మార్క్సు కొత్త ఆలోచనలు 1844, పారిస్ ప్రతుల నుంచి కొనసాగించిన భావాలు, ప్రాతిపదికలలో చూడవచ్చు.
శ్రమ స్థానే శ్రమ విలువ అని మార్క్సు తొలిసారి ప్రయోగించింది ఇందులోనే. ఆర్ధిక శాస్త్రాలకు. నీతికి విడదీయరాని సంబంధం ఉన్నదని పారిస్ ప్రతులలో విషయాన్ని ప్రాతిపదికలలో ఇంకా నొక్కి చెబుతారు.
1857లో ఐరోపా దేశాలన్నిటా తాను ఊహించిన సంక్షోభాన్ని మార్క్సు గమనించాడు. వెంటనే సిద్ధాంతాల రచనకు పూనుకున్నాడు. అప్పుడు జనించిందే ప్రాతిపదికలు. ఈ గ్రంథంలో రెండు ప్రధానాధ్యాయాలున్నాయి. ఒకటి ధనం, రెండు పెట్టుబడి. ముందుగా బ్రిటిష్ రాజకీయవేత్త డేవిడ్ రికార్డో ఫ్రెంచ్ సోషలిస్టు జోసఫ్ ప్రౌధాన్ లను మధించి బేరీజు వేశాడు మార్క్సు.
మార్క్సు తన ఆర్ధిక సిద్ధాంతాలు ఎలా ప్రతిపాదించాడు. ఆయన అనుసరించిన పద్ధతి ఏమిటి. ఈ ప్రశ్నలకు ప్రాతిపదిక చక్కని సమాధానం. మరే గ్రంథంలో కూడా మార్క్సు తన పద్ధతి ఇంత వివరణగా చూపలేదు. అదే హెగెల్ గతి తార్కిక పద్ధతి.
ప్రాతిపదికలు వ్రాస్తూనే హెగెల్ తర్కం మళ్ళీ చదివాడు మార్క్సు. అందుకే మార్క్సును అర్ధం చేసుకోవాలంటే హెగెల్ తర్కం అవగాహన కావాలంటారు. అయితే హెగెల్ ను ఆకాశం మీద నుంచి భూమిమీదకు దింపి ఆకారం సరిచేసి, తర్కాన్ని-గతితార్కిక పద్ధతిని సరిగ్గా మార్క్సు ప్రయోగించాడు. ఈ గతి తార్కికం చరిత్ర గ్రీకుల కాలం నాటిది. రెండుగా విభజించి వాదించటమని అసలు అర్ధం.
బాణం వేసినప్పుడు ఒకచోటు నుండి మరొక చోటుకు పోతుంది కదా. ఒక చోటుకు మరో చోటుకు విరుద్ధం కదలికలో బాణం ఉన్నదంటే ఇక్కడ అక్కడలను కదలిక కలిపేస్తున్నదన్నమాట. కదలికే పరస్పర విరుద్ధానికి మారురూపమవుతున్నది. ఈ విధంగా తర్కించటం చిరకాలంగా వస్తున్నదే.
హెగెల్ ఈ తర్కాన్ని స్వీకరించాడు. దేన్ని గురించైనా ఒక భావన ఏర్పడాలంటే ముందు గ్రహింపు ఉండాలి. అంటే వస్తు చలనాన్ని గ్రహించటమన్నమాట. ఇది అంతంమాత్రాన గ్రహించటం దుర్లభం. పైకి స్ధిరంగా ఉన్నట్టు కనిపించే వస్తువులు సైతం బ్రద్దలైనప్పుడో, విరిగినప్పుడో ఆ వస్తువును గురించి స్థిర భావం మనసులో హఠాత్తుగా మారుతుంది. స్థిరత్వం వెనుక తద్వ్యతిరేకమైన అస్థిరత్వ స్థితి ఉందని తెలుసుకుంటాం.
ఈ వాదనను మార్క్సు స్వీకరించి తన సిద్ధాంతాలకు అన్వయించాడు. ఉన్న స్థితికి విరుద్ధమైనదంటే హెగెల్ దృష్టిలో ఇంకా సృష్టి జరగడమే. కనుక ఉన్నదాన్ని వ్యతిరేకించడంలో చాలా ప్రాధాన్యత కలదు. పైకి కనిపించేదాన్ని దానిలో గర్భితంగా ఇమిడి ఉన్నదాన్ని వ్యతిరేకిస్తుంది. పైకి కనిపించేదాని వాస్తవం తేలిపోతుంది.
ఈ గతి తార్కిక పద్ధతిని మార్క్సు ఎలా వాడాడు. సంపూర్ణత్వాల వెనుక పరస్పర విరుద్ధాల పుట్ట వున్నదని మార్క్సు బాగా అంగీకరించాడు. అయితే హెగెల్ గతి తార్కిక పద్ధతిని తలకిందులు చేసి ఆధ్యాత్మికతకు, మార్మికదృష్టికి ప్రాధాన్యత చేకూర్చాడు. ఆ మార్మిక పొరలను తొలగించడంలో మార్క్సు గొప్పదనం అంతా ఉంది.
మార్క్సు తన గతి తార్కిక విధానానికి ప్రాతిపదికగా సమాజంలో జరిగే పదార్ధ ఉత్పత్తిని స్వీకరించాడు. ఇందుకు వ్యతిరేకమైనది వినిమయం. వినిమయం లేకుండా ఉత్పత్తి అనూహ్యం. అంటే సామాన్య సాధారణ సంబంధాలతో మొదలుపెట్టి సజీవ సంపూర్ణతల వైపుకు పయనించడం మార్క్సు అనుసరించిన పద్ధతి అన్నమాట.
ఎక్కడ ప్రారంభించాలి అన్నప్పుడు ఆయా సామాజిక స్థితిగతులలో ఆధిపత్యం వహించే స్థితినే ప్రాతిపదికగా స్వీకరించాలి. అంటే బూర్జువా ఆర్ధిక విధానాన్ని పరిశీలించాలంటే మార్పిడి విలువను అనుసరించే ఉత్పత్తి రంగంలో ప్రారంభించాలన్నమాట.
మార్క్సు తన ప్రాతిపదికగా సరుకును స్వీకరిస్తాడు. సరుకు అనేది స్పష్టంగా గమనించదగింది. ఇతమిత్థమని చెప్పగలది సరుకులో ఉపయోగం మార్పిడి అనే విరుద్ధ విలువలు ముడిపడి ఉన్నాయి. అయితే ఉత్తరోత్తరా ఈ ప్రాతిపదికను మార్క్సు విడనాడాడు. ఉపయోగపు విలువకు, మార్పిడి విలువకు గల పరస్పర విరుద్ధత్వాలు కలుస్తాయా లేక సరుకులో గల డబ్బు, మార్పిడులు ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నాయా.
పరస్పర విరుద్ధ పరిస్థితులు ఆచరణలో విఫలమై సరుకు ఉత్పత్తిలో ప్రతిష్ఠంభన వచ్చి ఉపయోగార్ధమే సరుకు ఉత్పత్తి జరగొచ్చు. పరస్పర వ్యతిరేకాల కలయిక అనేది, పోరాటాల వలన తప్పదనుకునేవి బ్రద్దలయినందున ఏర్పడుతుందంటాడు మార్క్సు. సమాజంలో విరుద్ధత్వాలు తొలగితే మారుతూ ఉండే మానసిక స్ధితి రూపొందుతుందంటాడు మార్క్సు. ప్రాతిపదికల నిండా ఈ గతి తార్కిక పద్ధతి అన్వయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది.
కార్మిక సంఘాలకు సిద్ధాంత ప్రాతిపదికలు కల్పించడం కూడా మార్క్సు ప్రాతిపదికలోనే తొలుత జరిగింది.
అలాగే వైమనస్యతపై చర్చ సాగించి, సంపూర్ణ వికాసంతో సామాజిక వ్యక్తి రూపొందాలని సిద్ధాంతీకరించడం కూడా కనబడుతుంది.
పెట్టుబడిదారీ సమాజంలో యంత్రాల అభివృద్ధిని మార్క్సు చర్చిస్తూ దీనికి ఒక పరిమితి ఉంటుందని నొక్కి చెప్పాడు.
మొత్తం మీద ఈ ప్రాతిపదికలు ఎంత ప్రాధాన్యత వహిస్తున్నాయంటే ఇది చదివితే కాని కాపిటల్ సరిగా అవగాహ కాదేమో అనిపిస్తున్నది. ప్రాతిపదికలలో చర్చించిన చాలా విషయాలు మార్క్సు చర్చించ లేదు - చివరకు కాపిటల్ లో కూడా. ప్రాతిపదికలు వ్రాయతలపెట్టిన మార్క్సు ముందుగానే తానేమి వ్రాయదలచింది ఒక పథకం వేశాడు. అనుకున్నవన్నీ వ్రాయలేక పోయాడు. కాని వ్రాసినవన్నీ మాస్కో ప్రచురించడం లేదు. ఆలస్యంగానైనా ప్రాతిపదికలు బయటపెట్టారు, సంతోషం.

మారకం రేటు సంక్షోభంపై 1854లో మార్క్సు వ్రాసిన రచనలు ఇంకా మాస్కో సంస్థలోనే మూలుగుతుండడం విచారకరం. అంతర్జాతీయ వాణిజ్యం ప్రపంచ విపణి వీధులపై మార్క్సు అభిప్రాయాలు తెలుసుకోడానికి వీలుగా ఇవి కూడా త్వరలో మనకు అందుతాయనే ఆశిద్దాం. ఏమైనా మార్క్సు కూడా కమ్యూనిస్టుల సెన్సార్ కు మించిపోబోడని రుజువైంది. (More….)

2 comments:

Anonymous said...

shaminchali nakku , telugu english lo type chesnanduku , me blog chala bagundhi , manamu vasthavalu telusukovatam chala mukhyam , mekku samayam dorikinapudu , e link thapakunda chudandi :
http://www.pseudosecularism.blogspot.com

shekhar

కొత్త పాళీ said...

I think Ranganayakamma published "Capital" in Telugu.