Sunday, August 31, 2008

విగ్రహం కన్నీరు పెడుతోంది








లోకంలో పాపం పెరిగిపోయింది. అది చూడలేక మేరీమాత విగ్రహం కన్నీరు పెట్టుకుంటున్నది. ప్రభువు ఆగ్రహిస్తాడు. పాపం పోగొట్టుకోవాలి అని క్రైస్తవ ఫాదర్ బోధిస్తున్నాడు. మేరీమాత విగ్రహం కన్నీళ్ళు పెడుతుందనే వార్త పత్రికలలో వచ్చింది. భక్త జనం తండోపతండాలుగా వచ్చి అద్భుతాన్ని తిలకించి, కానుకలు సమర్పించారు. ప్రార్థనలు చేశారు. క్షమించమని వేడుకున్నారు. ఒక రోజు కన్నీరు పెట్టుకున్న విగ్రహం మరునాడు ఆపేసింది. ఈలోగా వచ్చిన కానుకల్ని దైవకార్యం నిమిత్తం ఫాదర్ స్వీకరించాడు.
మాంత్రికుడు జేమ్స్ రాండి (అమెరికా)కి వార్త తెలిసివచ్చాడు. విగ్రహాన్ని పరిశీలిస్తానన్నాడు. వీల్లేదన్నారు. నిజంగా కన్నీరు కారుస్తుంటే, పరిశీలనకు ఆటంకం ఏమిటన్నారు. అయినా సరే ఒప్పుకోలేదు. భక్తుల విశ్వాసాన్ని ప్రశ్నించకూడదన్నారు. హేతువాదులు జేమ్స్ రాండిని వివరం అడిగారు. విగ్రహాన్ని తరువాత పరిశీలించిన రాండి విపులీకరించి, ఏం జరిగిందో తెలియపరచాడు.
మేరీమాత విగ్రహం మెడ లోపలి భాగం ఖాళీగా వుంది. తలపై చిన్న రంధ్రం పెట్టి నీళ్ళు పోశారు. తలపై ముసుగు కప్పారు. విగ్రహం రెండు కళ్ళకూ మైనం పెట్టి, నీళ్ళు పోసినప్పుడు మైనం తొలగించారు. లోన పోసిన నీరు బొట్టుబొట్టుగా బయటకు వచ్చింది. మేరీమాత ఏడుస్తున్నట్లు ప్రచారం చేసి, భక్తుల వద్ద కానుకలు స్వీకరించారు.
మైసూరులో చాముండేశ్వరి విగ్రహం యిలాగే ఏడుస్తున్నట్లు లోగడ ఒకసారి ప్రచారం చేశారు. మాంత్రికుడు యీ గుట్టు బయట పెట్టాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహమైతే, లోన ఉప్పునీరుపోస్తే, సన్నని రంధ్రాలనుండి చెమ్మ వస్తుంది. అది కూడా భక్తుల్ని నమ్మించడానికి ప్రచారం చేసేవారు. విగ్రహాలను తయారు చేసేది మనుషులే. వాటిని పూజించేది మనుషులే. విగ్రహాలను రాళ్ళుగా, బోమ్మలుగా ఆడుకునేంది పురోహిత వర్గమే.

Saturday, August 30, 2008

తాయెత్తులు, తాంత్రికుల చిత్రాలు








మన జనాల్లో, చదువుకున్న వాళ్ళతో సహా తాయెత్తులపై నమ్మకాలు ఎక్కువ. ఈ తాయెత్తులు అనేక రూపాలలో వుంటాయి. రుద్రాక్షలు, వెండి, రాగి బొమ్మలు, ఉంగారలు, మాలలు ఇంకా ఎన్నో వున్నాయి. కొందరు చిన్న కడియాలు చేతికి, కాలికి ధరిస్తారు. రాగి కడియాల వలన శరీరంపై ప్రభావం వుంటుందని నమ్ముతారు. అప్పుడప్పుడూ ఇళ్ళకు వచ్చే బాబాలు, తాంత్రికులు తాయెత్తులు యిస్తుంటారు. అవి ధరిస్తే అశుభాలు పోతాయని, మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో కాళఈమాత వంటి దేవతల ఆగ్రహాం పోగొట్టడానికి తాయెత్తులు ధరించడమే గాక, రక్తాన్ని అర్పించే క్రతువులు చేస్తుంటారు.
తాంత్రికులు తాయెత్తు మహిమ చూపే తీరులు ఎన్నో వున్నాయి. రాగి బొమ్మను ఎమిరి పేపర్ తో శుభ్రం చేసి మెర్క్యురస్ నైట్రేట్ ద్రావణంలో ముంచుతాడు. మెత్తని వస్త్రంతో బాగా రుద్దితే, వెండివలె కన్పిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ గట్టిగా చుట్టి భక్తుడికి ఇస్తారు. దానిపై ఏకాగ్రతతో ధ్యానం చేయమంటారు. పిడికిలి గట్టిగా బిగించి తాయెత్తు పట్టుకోమంటారు. కాసేపట్లో రసాయనిక మార్పువలన వేడెక్కి వెండి ఫాయిల్ తొలగించి చూస్తే, విభూతి వంటి పౌడర్ కన్పిస్తుంది. అది కళ్ళకు అద్దుకుంటారు.
ఇంట్లో శాంతి జరపడానికి తాంత్రికులు, మాంత్రికులు గమ్మత్తు పనులు చేసి తమ ముడుపులు వసూలు చేసుకుంటారు. యజ్ఞగుండం ఏర్పరచి కట్టెలలో నెయ్యి వేస్తారు. ఒక ప్లేటులో పొటాషియం పర్మాంగనేటు బొట్లు వేసి అందులో నీళ్లు పోస్తారు. రక్తం వలె కన్పించే ఆ నీటి ప్లేటులో దీపం వెలిగించి, మధ్యలో పెట్టి, దానిపై ఒక మూత వేస్తారు. పాత్రలోని ఆక్సిజన్ అయిపోగానే దీపం ఆరిపోతుంది. నీటిలో కార్పన్ డయాక్సైడ్ కలసి, శూన్య ప్రదేశం ఏర్పడగానే పాత్రలోకి నీరు పీల్చుకుంటుంది. ప్లేటులోని నీరు (రక్తం వలె కనిపించేది) పాత్రలోనికి పోగానే, దేవత శాంతించినట్లు వ్యాఖ్యానించి, డబ్బు వసూలు చేసుకొని మాంత్రికుడు నిష్ర్కమిస్తాడు. గృహస్థులు తృప్తిపడతారు. మాంత్రికుడు ఏం చేసాడో హేతువాది ప్రేమానంద్ వివరిస్తాడు. అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది.

Thursday, August 28, 2008

నా ప్రపంచం కు 10,000 పాఠకులు

symbol_of_usa

నా ప్రపంచం కు మీరు చూపుతున్న ఆదరణ దిన దిన ప్రవర్ధమానమవుతుంది. ప్రజలలో ఉన్న అంధ, మూఢ విశ్వాసాలు తొలగించటానికి, నా ప్రపంచం తన వంతు కృషి చేస్తున్నది. దీనికి వ్యాఖ్యల రూపంలో మీరిస్తున్న సహకారం ప్రోత్సాహకరంగా ఉంది. కొందరు వ్యక్తులు, అడపా దడపా, అనామకంగా, అనౌచిత భాషలో, ఉత్తరాలు రాసి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఉత్తరాలు సభ్యంగా రాయమని, అలాంటి వారికి వినతి.

మీ ఆదరణతో నా ప్రపంచం 10000 పాఠకుల సంఖ్య దాటినదని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. 10000 వ పాఠకుడి వివరాలివిగో.

Visit Detail Visit 10,000

Domain Name: gsu.edu? (Educational)

IP Address: 131.96.64. (Georgia State University)

ISP Georgia State University

Location Continent North America

Country United States (Facts)

State: Georgia

City Duluth

Lat/Long 34.0099, -84.158 (Map)

Time of Visit Aug 25 2008 10:15:35 pm

Referring URL http://koodali.org/

Visit Entry Page http://naprapamcham....08/blog-post_25.html

Visitor's Time Aug 25 2008 1:15:35 pm

Visit Number 10,000

ఈ పాఠకుడిని తన contact particulars తెలుపవలసినదిగా కోరుతాను. ఈ పాఠకుడు, ఈ సందేశం ఎదైనా కారణం వలన చూడలేకపోవచ్చు. అట్లాంటా (Georgia) పాఠకులకు విజ్ఞప్తి. మీ తెలుగు సంఘ సమావేశాల ద్వారా, మీకు ఈ సందర్శకుడు తెలిసిఉన్న పక్షంలో, వారి contact particulars మాకు తెలియ చేయ కోరుతాము. October 3 నుంచి 12 వ తేదీ దాకా నేను అట్లాంటా లో ఉంటాను. ఈ పాఠకుడిని ఆ రోజులలో కలుస్తాను. ఇన్నయ్య గారు కూడా అదే సమయంలో అమెరికాలో ఉంటారు. ఈ పాఠకుడి ఆచూకి దొరికినదానిని బట్టి, ఎలా చేస్తే బాగుంటుందో నిర్ణయిస్తాము. అదృష్ట పాఠకుడూ, మీ వివరాలు తెలుపగలరు.

అమెరికా కు నిత్యం ఎంతో మంది వెళ్లివస్తున్నారు. అమెరికా లో ఎంత కాలం ఉన్నా అది ఒక పట్టాన అర్థం కాదు. అతి పెద్ద భౌగోళిక స్వరూపం, విభిన్న ఆచారాలు, వాతావరణాలు, భాషలు, సంస్కృతి, అమెరికా అంటే ఏవిటో, అర్థం కాకపోవటానికి కారణాలవుతాయి. అమెరికాను మీకు దగ్గర చెయ్యటానికి, "మీకు తెలియని అమెరికా" అనే కొత్త శీర్షిక ఇన్నయ్య గారు ప్రారంభించబోతున్నారు. “అమెరికా కబుర్లు” నా నుంచి ఉండగలవు. అమెరికా లో ఉండే తెలుగు బ్లాగరులను, పాఠకులను, మీరు ఎక్కడున్నా (ఏ రాష్ట్రమైనా), కలవటానికి గట్టి ప్రయత్నం చేస్తాము. కెనడా, ఉత్తర అమెరికా, కాస్టా రికా దేశ వాసులు మాత్రమే సంప్రదించండి. కలుస్తాము. Jan 2009 చివరి దాకా నేను అమెరికా లో ఉంటాను. ఆసక్తి ఉన్నవారు, మీ వివరాలు పంపండి. అమెరికాలోని తెలుగు బ్లాగర్ల విషయాలు, విశేషాలు కూడా అమెరికా కబుర్లలో ఉండగలవు.

-cbrao

cbraoin at gmail.com

క్రీస్తుమహిమలు










సువార్త కూటములు జరుగుతాయనే ప్రచారం విపరీతంగా సాగింది. మారుమూల గ్రామాల నుండి క్రైస్తవులు సందేశం వినడానికి చేరుకున్నారు.
అమెరికా నుండి చాలా గొప్ప క్రైస్తవ ప్రచార బోధకుడు వచ్చాడట. ఆయన క్రీస్తు మహిమలు వివరిస్తాడట. అందువలన సువార్త కూటములకు ప్రత్యేకత సంతరిల్లింది.
ప్రార్థనలు చేసిన అనంతరం ఇంగ్లీషులో ఉపన్యాసం సాగింది. తెలుగులో అనువదించి ఒక పాస్టర్ చెబుతున్నాడు. బైబిల్ చేతుల్లో పట్టుకొని మోకాళ్ళపై కూర్చున్న భక్తులు శ్రద్ధతో ఆలకిస్తున్నారు.
ఏసుక్రీస్తు ఒక పెళ్ళి సందర్భంగా వచ్చిన వారందరికీ చాలినంత ద్రాక్ష సారాయి (వైన్)ని నీళ్ళద్వారా అందించాడట. నీరు కాస్తా ద్రాక్ష సారాయిగా మార్చడానికి ఆరు రాతి కూజాలను వాడారట. అలాగే మరో సందర్భంలో 5 రొట్టెముక్కల్ని వేలాది మందికి క్రీస్తు పంచి అద్భుతాన్ని చూపాడట. బైబిల్ ఆధారంగా యీ విషయాల్ని ఆయన వివరించాడు.
అమెరికా మాంత్రికుడు జేమ్స్ రాండి యీ విషయాలను లోగడ వివరించాడు. హేతువాది ప్రేమానంద్ సువార్త కూటాల వద్దకు రాగా, భక్తులు కొందరు ఆటంకపరచారు. బయట సభ పెట్టి క్రీస్తు మహిమల రహస్యాన్ని ఆయన వివరించాడు.
ఒక బాబాలో నీటిని ద్రాక్ష సారాయిగా మార్చవచ్చుగదా. అలాగాక, కేవలం రాతి కూజాలు అమర్చి వాటిలో నీళ్ళు పోయించి ద్రాక్షసారాయిగా ఎందుకు మార్చినట్లు? అదే రహస్యం. క్రీస్తుకు బావిలో నీటిని మార్చగల శక్తి లేదు. ఆయన తాను నేర్చిన మాంత్రికవిద్యతో ట్రిక్కు ప్రదర్శించి, ఆకర్షించాడు. ఎలాగ?
పెద్ద రాతి కూజాలలో చిన్న రాతి కూజాలు అమర్చాడు. చిన్న కూడా అంచు పెద్ద కూజా పైకి వుండేటట్లు ఏర్పరుస్తారు. చిన్న కూడా జనానికి కనిపించదు. పెద్ద కూజాలో ద్రాక్షసారాయి పోస్తారు. తరువాత చిన్న కూజా లోనపెట్టి, తలక్రిందులు చేస్తే చిన్న కూజా పెద్ద కూజాలో అతుక్కు పోతుంది. తరువాత చిన్నకూజాపై మూత పెట్టి పెద్ద కూజా మూత తీసి, అందులో ముందుగానే పోసిన ద్రాక్షరసాన్ని పంచుతారు. ఈ ట్రిక్కు తెలియక, భక్తులు అద్భుతంగా దాన్ని భావిస్తారు.

పక్షితీర్థంలో దైవం


visitors are fascinated with daily visit of bird punctually!








తమిళనాడులో చాలాకాలంగా యాత్రికులు సందర్శనం చేసే స్థలం ఒకటి వుంది. తిరుపుర కుండ్రం అనే ఈ స్థలం దగ్గర యాత్రికులు ఆగుతారు. మధ్యాహ్నం సరిగా 12 గంటలకు రెండు గద్దలు వచ్చివాలతాయి. అక్కడ పురోహితుడు యిచ్చే ప్రసాదం స్వీకరించడానికి పక్షిరూపంలో సాక్షాత్తు గరుడపక్షులు వస్తాయని కథ ప్రచారంలో వుంది. విష్ణు వాహనంగా గరుడపక్షి వుండడం పురాణకథనం కాగా, ఆ దేవాలయం విష్ణు దేవాలయం కావడం ఒక కారణంగా పేర్కొంటారు. ఏమైనా రెండు పక్షులు వేళ తప్పకుండా నిత్యమూ రావడం వాస్తవం.

ఏమిటీ విచిత్రం? హేతువాది ప్రేమానంద్ ను భక్తులు అడిగారు. హేతువాదులు కార్యకారణ అన్వేషణ సాగించారు. ప్రేమానంద్ నిశిత పరిశీలనలో తేలిన అంశం. రెండు గద్దలను పట్టుకొని వాటికి యిచ్చే ఆహారంలో నల్లమందు కలిపారు. అలా నల్లమందుకు (ఓపియం) అలవాటు పడిన రెండు పక్షులు రోజూ రావడం ఆరంభించి, అలవాటు చేసుకున్నాయి. అలవాటు అయిన తరువాత పక్షుల్ని వదిలేసినా తప్పనిసరిగా వస్తున్నాయి.

Wednesday, August 27, 2008

సంతాన ప్రాప్త -


dark inside of temple abused by priest



kaala bhairava temple sanctum sanctorium





గొడ్రాలు అంటే పాపిష్టి దానిగా చూచే సమాజం కనుక, పెళ్ళి అయిన ప్రతి స్త్రీ సంతానం కోరుకుంటుంది. ఎన్నాళ్ళకూ సంతానం కలుగకపోతే వైద్య పరీక్షలు చేయించుకొనే బదులు బాబాల దగ్గరకు పోతారు. మూఢనమ్మకాలకు ఇదొక పెద్ద నిదర్శనం బాబా చెప్పినట్లు చేస్తారు, లింగాలకు మొక్కుతారు.

కాలభైరవ రాయికి మొక్కితే పిల్లలు పుడతారని ఆంధ్రలో నమ్మకం వుంది. ఇలాంటివి ఇతర రాష్ట్రాల్లో వున్నాయి కూడా. చాలా మంది ఇది నిజం అని నమ్ముతారు. కొంత కాలంగా సంతానం లేని వారికి గర్భగుడిలో అర్థరాత్రి పూజలు చేస్తే పిల్లలు పుట్టినట్లు చెబుతారు.
ఒక పూజారి కాలభైరవ గుడిని అంటి పెట్టుకొని, సంతాన ప్రాప్తి కలిగిస్తున్నాడనే వార్త విని హేతువాది ప్రేమానంద్ వెళ్ళాడు. డబ్బు సమర్పించుకొని, తనకు సంతాన ప్రాప్తి కలిగించమని వేడుకున్నాడు. వెంట స్నేహితుడి భార్యను తీసుకెళ్ళాడు. వీరు చెప్పినదంతా విన్న అనంతరం పూజారి పంచలోహపాత్రలో బియ్యం పోసి, కత్తి మధ్యలో పెట్టి, మంత్ర పఠనం చేసి, పాత్రను కత్తితో పైకిలేపాడు. అంతకు ముందు ప్రాయశ్చిత్త క్రతువు చేశాడు. తరువాత గర్భగుడిలో ఆమెను లింగపూజ చేయమని అందరినీ వెళ్ళిపొమ్మన్నాడు. చీకట్లో ఏదో మెదులుతుండగా ఆమె ఒక పీటతో గట్టిగా మోదింది. పూజారి తల పగిలింది. లింగం కూడా పగిలింది. తలుపు కొట్టగా బయట వేచివున్న ఆమె భర్త, హేతువాది ప్రేమానంద్ తలుపు తెరిచాడు. లోగడ స్త్రీలకు సంతానప్రాప్తి ఎలా కలిగిందో దీని వలన అర్థమైంది.

మహారాష్ట్రలోని సతారాలో యిలాంటి బాబాను ఆంధశ్రద్ధ నిర్మూలన సమితి బట్టబయలు చేసింది.

Monday, August 25, 2008

రక్తంతో కైంకర్యం

గ్రామాలలో అప్పుడప్పుడు భీభత్స దృశ్యాలు చూస్తాం. జుట్టు విరబూసుకొని, చొక్కాలేకుండా, పూసలు, రుద్రాక్షలు ధరించిన భక్తుడు, మాంత్రికుడు, ఫకీరు యింకా యిలాంటివారు తమ శరీరాన్ని కొరడాతో కొట్టుకుంటారు. కొందురు కత్తితో చేతుల్ని, కాళ్ళను కోసుకొని రక్తమయం చేస్తారు. అది చూచి భక్తులు కానుకలు సమర్పిస్తారు.

శరీరం మీద గాని లేదా చేతులపై గానీ ఫెర్రోక్లోరైట్ ద్రావం పూయాలి. సోడియం సల్ఫోసనైడ్ ద్రావకంలో కత్తిని ముంచాలి. ఎక్కడ ఫెర్రిక్ క్లోరైడ్ పూసారో, అక్కడ కత్తితో నరికినట్లు నటిస్తే రక్తపు చారలు వచ్చినట్లు కనిపిస్తుంది. జనం వెళ్ళిపోయిన తరువాత తడిబట్టతో తుడిచేయవచ్చు.
మరొక తీరులో చేతిమీద లేదా శరీరంపైన ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్ ద్రావకం రాయాలి. సోడియం సాలిసిటేట్ లో కత్తిని ముంచి శరీరంపైనా, చేతిమీదా తాకిస్తే ఎర్రని మరకలు వస్తాయి. భక్తులు చందాలిచ్చి వెళ్ళిన తరువాత తడిగుడ్డతో తుడిచేయాలి. కాళీమాతను లేదా అమ్మవార్లను సంతృప్తిపరచే వంకతో కొరడాతో బాదుకొనడం మరో భక్తి నిదర్శన సంఘటనే. కొరడా చివరి వరకూ జాగ్రత్తగా మెలికలు తిప్పితే చప్పుడు వస్తుందే కాని దెబ్బ తగలదు. కొరడా చివర ముడివేస్తే అది తగిలిన చోట చర్మం చిట్లుతుంది. ఇది ప్రాక్టీసు చేసిన పూనకభక్తులు చూచేవారిని దడిపించేటట్లు మంత్రాలు ఉచ్ఛరిస్తూ, భయంకర శబ్దాలు చేస్తుంటారు.

Friday, August 22, 2008

ధ్యానంతో మనశ్శాంతి

ఇటీవల ధ్యానం మనశ్యాంతినిస్తుందని భాగా ప్రచారం చేస్తున్నారు. అది ఒక అలవాటుగా సంపన్నులలో, కొంతవరకు మధ్యతరగతిలో వ్యాపించింది. దీనికి బాబాల బలం ఉన్నది. మాతల అండ వున్నది. మతపరమైన భక్తిని చేర్చి జనాన్ని ఆకట్టుకుంటున్నారు.
ధ్యానంలో నిమగ్నమైన వారికి మెదడు నుండి సెరొటోనిన్ (Sertonin) స్రవిస్తుంది. ఇది పరిమితంగా అయితే మంచిదే. ప్రశాంతత లేని వారికి కుదుట బడడానికి యిది కొంతవరకు తోడ్పడుతుంది. కాని సెరొటోనిన్ ఎక్కువగా విడుదల అయితే ఆత్రుత - ఆందోళన విపరీతంగా పెరిగిపోతుంది. ప్రశాంతత బదులు, గందరగోళంతో చికాకుపడతారు. మనోవైకల్యం ఎక్కువ అవుతుంది. ఈ విషయమై జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీలో న్యూరోసైన్సెస్ శాఖాధిపతి డా. సాలొమన్ స్నైడర్ పరిశోధనలు చేశారు (Soloman Suyder).
విస్ కాన్సిన్ లో బౌద్ధ కేంద్రానికి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిడ్ సన్, ధ్యానం వలన దయార్ద్రత పెరుగుతుందని ఉద్రేకాలు అదుపులోకి వస్తాయన్నాడు. ఆయన పరిశోధనలు సైంటిఫిక్ అధ్యయానికి గురి చేస్తే, ఆయన చెప్పిన ఫలితాలు రాలేదు. న్యూజెర్సీలో రాబర్డ్ వుడ్ జాన్సన్ మెడికల్ స్కూలుకు చెందిన డా. నాన్సి హేస్ (Nancy Hayer) ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. కొన్ని రకాల రోగాలకు, మానసిక ఉద్రేక పరులకు ధ్యానం పనికిరాదని డేవిడ్ సన్ స్వయంగా హెచ్చరించారు.
శరీరంలో కొన్ని అంగాలు వాడకపోతే ఎలా క్రమేణా పనిచేయలేక, నిరుపయోగం అవుతాయో అలాగే మెదడులోని భాగాలు కూడా అవుతాయని ఆర్ధర్ చాపెల్ (Arthen Chappell) హెచ్చరించాడు. ఈయన గురు మహరాజ్ ప్రేమరావత్ కు లోగడ శిష్యుడు కూడా. మనసు మొద్దుబారితే ప్రమాదం అన్నాడు. Atrophy లక్ష్యం వస్తుందన్నాడు. ధ్యానం చేసే వారిలో చిన్న పనులు, లెక్కలు చేయలేకపోవడం దగ్గర వారి పేర్లు సైతం గుర్తుంచుకోపోవడం జరుగుతున్నదన్నారు.
గోయంకా విపాసన కేంద్రంలో (బుద్ధగయలో) క్రిస్టోఫర్ టిట్ మస్ (Christopher Titmless) అనుభవాలను వివరిస్తూ, విపరీత బాధలకు గురైనట్లు పేర్కొన్నాడు. (trile net) విపరీత భ్రమలు, భ్రాంతితో బాధ పడినట్లు వెల్లడించాడు. పెద్దగా అరవడం, పడిపోవడం జరిగింది. చివరకు మానసిక రోగానికి గురై చికిత్స పొందాడు. కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
Igatpuni కేంద్రంలో కొందరికి వెన్నెముక విరగడం, తల పగలడం, యిత్యాదులు జరిగాయి. కొందరు మత్తు పదార్థాలకు అలవాటుపడు తున్నారు. ఇదంతా ధ్యానకేంద్రాలో జరుగుతున్నా వేరే వాటికి ఆపాదిస్తున్నారు.
న్యూజిలండ్ విపాసన కేంద్రంలో ధ్యానం చేసిన ఒక యువకుడు కొద్ది రోజులు బాగుందంటూ, యింటికి వచ్చి మానసిక రోగిగా మారాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కుదుటబడ్డాడు.
గోయంకా విపాసన కేంద్రంలో (Black health, Blue Mecentine, Australia) జెన్ ధ్యానం అధ్యాపకుడు జెఫ్రేడాసన్ (Geobbrey Dawson) చెబుతూ 20 మంది మానసికంగా రోగులైనట్లు రికార్డు వున్నదన్నాడు. ఈ కేంద్రాలలో బాధలకు గురైన వారికి చికిత్స లేదని, ఆ విషయం గమనించాలన్నారు.
ధ్యానం చేయడానికి వచ్చేవారిని ముందుగా పరీక్షించాలని డాలోయిస్ వాండెర్ కూల్ (Dr. Lois Vanderkool) కలరెడో సైకాలజిస్ట్ చెప్పాడు.
Mary Gardner (queensland, Australia, http://www.users.bigpond.com/marygarden/index.htm.)
ఈమె పూనాలో రజనీష్ వద్ద ధ్యానం కోర్సులో 1979లో పాల్గొన్నారు.
ధ్యానం పేరిట దుర్పినియోగం వుందని కె. శ్రీ ధమ్మానంద అన్నారు. (శ్రీలంక 2006లో మరణించాడు. మలేషియాలో తేరవాద బుద్దిస్ట్).
ధ్యానం కేవలం mouk, nuns కే నని, Dr. Lorin Roche ధ్యాన టీచర్ అన్నారు. ధ్యానం చేసేవారు అత్యధికంగా depressionకు గురౌతున్నారన్నాడు. దలైలామా కూడా ధ్యానం పట్ల హెచ్చరికలు చేశాడు.
మేరీగార్డనర్ హరేకృష్ణ ఉద్యమంలోనూ వున్నారు.
ఎక్కువ సేపు కూర్చోవడం, ఒకే మంత్రం పునరుశ్చరణ గావించడం వలన అనేక బాధలకు లోనౌతున్నారు.
ధ్యానం వలన మంచి ఫలితాలు వస్తున్నాయనే ప్రచారం వింటున్నాం. కాని ధ్యాన కేంద్రాలలో ప్రవేసించిన వారు తరువాత ఎలా ఉంటున్నారో రికార్టు లేదు. ఏదైనా జరిగితే బాధ్యత వహించే వారెవరూ లేరు. సర్వే జరగలేదు. కానీ అనుకూల ప్రచారం మాత్రం ధారాళంగా సాగుతున్నది.
మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలని ఆలోచన చంపేసేయాలని క్రమేణా మోక్షానికి ధారితీయాలని ధ్యానం అందుకు నాంది అని యోగం చెబుతుంది.

Wednesday, August 20, 2008

మార్గంతర చికిత్సలు అమానుషాలా?


urine therapy


reiki


electropathy










ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 13 ప్రత్యామ్నాయ చికిత్సలు అశాస్త్రీయమని తేల్చి చెప్పారు. అఖిల భారత వైద్య నిపుణుల సంఘం నాలుగు సంవత్సరాలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించిన అంశం ఇది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఈ నివేధికను ఆమోదించాయి. అమలు పరచమని రాష్ట్రాలకు తాఖీదులిచ్చాయి.

ఏమిటాచికిత్సలు?
1. రేకి, 2. ఆక్యుపంక్చర్, 3. ప్రాణిక్ హీలింగ్, 4. ఎలక్ట్రోపతి, 5. మూత్ర వైద్యం, 6. అయస్కాంత చికిత్స, 7. హిప్నోథెరపి, 8. మ్యూజిక్, 9. రిప్లెక్సాలజీ, 10. కలర్ చికిత్స, 11. జెమ్స్ స్టోన్స్ వైద్యం, 12. ఎలక్ట్రోహోమియోపతి.
సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్లప్తత కారణంగా ఆశాస్త్రీయ వైద్యాన్ని అందిస్తూ... చాలా మంది డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. జస్టిస్ వై.కే. సభర్ వాల్, జస్టిస్ డి.యం. ధర్మాధికారి. 2004 నవంబరు 25న ఈ విషయమై శాసనం కూడా చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్గాంతర చికిత్స (ఆల్టర్ నేటివ్ మెడిసన్)కు శాస్త్రీయ పునాదుల్లేవని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.


నిర్దారించిన వారెవరు?
డా. ఎన్.కె. గంగూలీ (ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు) ఆధ్వర్యాన ఏర్పడిన నిపుణుల సంఘంలో డా. ఎస్.పి. అగర్వాల్, డా. ఆర్.ఎ. మషేల్కర్, అశ్వనీ కుమార్, ప్రొఫెసర్ బి.ఎన్. ధవన్, ప్రొఫెసర్ ఎస్.ఎస్. హండా, డా. వి.ఎన్. పాండే, డా. ఆర్.హెచ్. సింగ్, ఎస్. ఖలీఫతుల్లా, డా. ఆర్. కన్నన్, డా. లీనా మెహందలే, డా. ప్రమీలాచారీ, డా. జె.ఎన్. పాండే, డా. బి.కె. శర్మ, డా. వసంత ముత్తు స్వామి ఉన్నారు.
ఎలక్ట్రోపతి, ఎలక్ట్రోహోమియోపతి వారు తమ వైద్యాలకు కూడా ప్రభుత్వ సహాయం ఇవ్వాలని కోరినప్పుడు, ఎందుకు ఇవ్వరాదు, అవి శాస్త్రీయం అవునా కాదా అనే అంశాన్ని పరిశీలించమని ఢిల్లీ హై కోర్టు కోరింది (1998). అంతటితో వ్యవహారమంతా కదిలింది. సారాంశమేమంటే పరిశీలించిన సంఘం ఆధ్యంతాలు చూచి నిర్ణయానికి వచ్చి నివేధిక సమర్పించారు. వీటిలో శాస్త్రీయత లేదని, అవి పుట్టిన దేశాల్లోనే అక్కడి ప్రభుత్వాలు గుర్తించలేదని, ప్రజల్ని ఇలాంటి చికిత్సలతో ఆకర్షించి, మోసగించరాదని హెచ్చరించారు. ఈ చికిత్సల నిమిత్తం డిగ్రీలు ఇవ్వటం, కోర్సులు నడపటం నిషిద్ధమని స్పష్టం చేశారు. ఎవరైనా వీటి పేరిట వైద్యం చేస్తే శిక్షలు వేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం 1903లో ఈ ఉత్తరువులను రాష్ట్రాలకు పంపింది. మన రాష్ట్రంలో నవంబరు 25న ఉత్తరువులు అందాయి. ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా, మౌనం వహించింది. దీనిపై శాస్త్రీయ పరిశోధనా కేంద్రం, హేతువాద సంఘాలు, జనవిజ్ఞాన వేదిక, మానవ వికాస వేదిక తదితరులు రాష్ట్ర గవర్నర్ కు, ఆరోగ్యశాఖామంత్రికి, వైద్యశాఖ అధికారులకు, డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమిడీస్ డైరెక్టర్ కు ఈ నివేధికను అమలు పరచవలసిందిగా విజ్ఞప్తులు చేశారు. కానీ ఆచరణలో ప్రభుత్వం మౌనమే పాటించింది.
రేకీ విధానం పుట్టిన జపాన్ లో దానికి అక్కడ గుర్తింపు లేదు. చేతితో శరీరాన్ని తాకుతూ శక్తిని ప్రసరింజేసి, చికిత్స చేస్తామంటున్నవారు మొదట్లో రాగా, ఇప్పుడు అలా తాకకుండానే శక్తిని ప్రసరించే విధానం వచ్చింది. రోగి బలహీనతల్ని ఆసరగా చేసుకుని డబ్బులు గుంజడం ఒక్కటే వీరి పరమావధి.
ఇక ఆక్యుపంక్చర్ పుట్టుక ప్రాచీన చైనాలో కమ్యూనిస్టు విధానాలకు ఆక్యుపంక్చర్ కు ఎలాంటి సంబంధం లేదని తేలాక ఆ దేశంలో ఈ విధానానికి గుర్తింపు కొద్ది కాలంపాటు కమ్యూనిస్టు పాలనలో దీనిని వాడినా రాను రాను ఇది సైంటిఫిక్ గా నిలబడదని కొట్టి పారేశారు. ఇందులో శాస్త్రీయ ప్రమాణాలు లేవని తేలింది.
దేశానికి ప్రధానిగా చేసిన మొరార్జి దేశాయ్ పుణ్యమా అని ప్రచారంలోకి వచ్చిన మూత్ర వైద్యం కూడా అశాస్త్రీయమని తేలింది. అలాగే ఆటో మూత్ర వైద్యం కూడా దారుణమైన మూఢనమ్మకమని రుజువైంది.
అయస్కాంత చికిత్స కూడా మోసానికి పరాకాష్ట అని నిపుణుల సంఘం తేల్చింది. శరీరాన్ని ఆయస్కాంతం ఆకర్షించదు. అది నిజమే అయితే స్కానింగ్ లో ఉపయోగించే ఎం.ఆర్.ఐ లో ఉన్న అయస్కాంతం వల్ల అన్ని జబ్బులు నయం కావాలి కదా.
ఎలక్ట్రోపతి, ఎలక్ట్రోహోమియోపతి (ఇది హోమియోపతి కాదు) విధానంలో కొన్ని విద్యుత్ పరికరాలు, ఆధునిక పరీక్షా యంత్రాలు వాడతారు. దీంతో చాలా మంది ఇది నిజమైనదేనని నమ్ముతారు. కాని ఇందులో ఏమాత్రం శాస్త్రీయత లేదని నిపుణుల సంఘం అధ్యయనంలో వెల్లడైంది.
ఎలాంటి శాస్త్రీయత లేని, ఆకర్షణీయ సిద్ధాంతాలతో జనాన్ని బుట్టలో వేసుకుంటున్న ప్రాణిక్ హీలింగ్ కూడా ఏ వ్యాధిని నయం చేయదు. రవిశంకర్ వంటి వారిని పిలిచి రాష్ట్రప్రభుత్వమే ఉద్యోగులకు ప్రాణిక్ హీలింగ్ ఇప్పించటం వారి అజ్ఞానానికి, నిపుణుల సంఘ నివేధికను దిక్కరించటానికి తార్కాణంగా పేర్కొనవచ్చును.
జెమ్స్ స్టోన్ వైద్యం కూడా ఇదే తరహాలోనిదే. ఫ్రాన్స్ లో మొదలైన హిప్నోథెరపి కూడా ఆ దేశంలో దిక్కులేదు. కాని మనం మాత్రం వేలం వెర్రిగా వ్యాపార ప్రకటనలకు ఆకర్షితులమై ఉంగరాలు ధరించటం, విపరీతంగా ఆభరణాల పేరిట జ్యోతిష్యం వంటి వాటి వలలో పడి కొనుగోలు చేస్తున్నారు.
రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలో ఎప్పటికీ కన్ను తెరిచి ఆదేశాలని అమలు పరుస్తుందో గమనించాలి. బహుశా చికిత్సల వారి బలమైన లాబీలు ప్రభుత్వాన్ని వత్తిడి చేస్తుండవచ్చు.

Sunday, August 17, 2008

సాహితీపరులతో సరసాలు














భట్టిప్రోలు హనుమంతరావు

చరిత్రను శాస్త్రీయంగా రాసి విద్యార్థులకు ఎంతో తోడ్పడిన మానవ వాది భట్టిప్రోలు హనుమంతరావు, కూచిపూడికి (తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా) చెందిన బి.ఎస్.ఎల్. హైస్కూలు స్థాయినుండే హేతువాద ప్రభావంలో పెరిగారు. పూర్తిపేరు భట్టిప్రోలు శ్రీలక్ష్మి హనుమంతరావు. జీవితమంతా ఉపాధ్యాయ వృత్తిలో గడిపి ఎంతో మందిని ప్రభావితం చేశారు. అలాగే రచనలు ద్వారా మరెందరినో ముందుకు నడిపారు. హేస్కూల్లో ఉపాద్యాయ వృత్తితో ప్రారంభించి, గుంటూరు హిందూ కళాశాలలో చరిత్ర లెక్చరర్ గా ఉన్నారు.
నాగార్జున యూనివర్శిటీలో భౌద్ధ అధ్యయన కేంద్రంలో పరిశోధకులుగా పనిచేశారు. చివరి దశలో తెలుగు అకాడమీలో రచనలు చేస్తూ, రీసెర్చి సాగించారు. భౌద్ధంలో బాగా కృషి చేసి ఆంధ్రదేశంపై భౌద్ధ ప్రభావాన్ని గ్రంథస్తం చేశారు. త్రిపురనేని రామస్వామి హేతువాదంతో మొదలై, ఎమ్.ఎన్. రాయ్ మానవ వాదంతో పరిపుస్టిని సాధించారు.
1955 నుండి హనుమంతరావుతో నాకు గుంటూరులో పరిచయం అయ్యింది. అది చివరి వరకూ సాగింది. ఆయన రాడికల్ హ్యూమనిస్టు. అధ్యయన శిభిరాలకు వచ్చి చక్కని ప్రసంగాలు చేసేవారు. కల్లూరి బసవేస్వరరావుతో కలసి మధ్య యుగాలలో ఆంధ్రదేశ చరిత్రను రాశారు. అధి కళాశాల విధ్యార్ధులకు పాఠ్యగ్రంథంగా పెట్టారు. ఏ విషయానైనా సమగ్రంగా శాస్త్రీయంగా పరిశీలించి చరిత్ర వ్రాయటం బి.ఎస్.ఎల్.కు ఆనవాయితీ.
రచనలు : ఆంధ్రలో మతం, శాతవాహన యుగం, కేవల బోధి-భౌద్ధ జైన చరిత్ర, మధ్యయుగాలలో సాంఘిక-సాంస్కృతిక చరిత్ర.
బిఎస్ ఎల్ అనువాదం చేసిన ఎం ఎన్ రాయ్ జీవిత గాధలు గొప్ప తెలుగు సేత.
మేము కొన్ని రాడికల్ హ్యూమనిస్ట్ స్టడీ క్యాంపులలొ కలసి మాట్లాడాము.
1994 లో చనిపోయారు.

Saturday, August 16, 2008

సాహితీ పరులతో సరసాలు

పెమ్మరాజు వెంకట్రావు

అమెరికాలో సుప్రసిద్ధ టి.వి. ఛానల్లో పెమ్మరాజు ఉమ పనిచేస్తున్నది. ఆమె రాజకీయ ప్రొడ్యూసర్. ఇంటిపేరును బట్టి మీకు పెమ్మరాజు వెంకట్రావు ఏమౌతాడు అని అడిగాను. ఆమె జవాబు ఇస్తూ తనకు తెలియదని, ఆయన పేరు విన్నానని దూరపు చుట్టం అయినట్లు చెప్పారని తెలిపింది. ఆమె ఆంధ్రలో పుట్టినా, అమెరికాలో స్థిరపడింది. అంతర్జాతీయ సుప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్ ను పెళ్ళి చేసుకుని న్యూయార్క్ లో ఉంటున్నది. ఇది 2000లో నేను అమెరికాలో ఉండగా జరిగిన విషయం.

ఆంధ్రలో కార్మికోద్యమ పితామహులలో ఒకడుగా పెమ్మరాజు వెంకట్రావు చరిత్రలో నిలుస్తారు. వి.వి. గిరి, బి. శివరావు వంటివారితో సన్నిహితంగా కృషిచేసిన ఖ్యాతి ఆయనది. 1907లో పుట్టిన పెమ్మరాజు వెంకట్రావు 1928 నాటికే గనుల ఇంజనీరింగ్ శాఖలలో (చీపురుపల్లి, విజయనగరం ప్రాంతం) పనిచేసి అనుభవం గడించారు. 1931 నుండి నెల్లిమర్ల జూట్ మిల్స్ కార్మిక సంఘం స్థాపించి 25 సంవత్సరాలు అధ్యక్షులుగా వున్నారు. అప్పుడే వరాహగిరి వెంకటగిరి, బి. శివరావులతో ఉత్తరప్రత్యుత్తరాలు నడపడం, కార్మిక రంగంలో విశేష అనుభవం గడించడం ఆయన ప్రత్యేకత. 1938 సెప్టెంబర్ 1 నుండే కార్మిక పత్రిక అనే వార పత్రిక విజయనగరం నుండి పెమ్మరాజు వెంకట్రావు సంపాదకత్వాన వెలువడింది. రెండవ ప్రపంచ యుద్ధారంభ రోజులలో వెంకట్రావు ప్రపంచ రాజకీయాల్ని అవగాహన చేసుకుంటూ ఉద్యమాల్ని సాగించారు.

ఆ దశలో ఆంధ్ర పర్యటనకు వచ్చిన ఎం.ఎన్. రాయ్ భావాలు వెంకట్రావు దృష్టికి రాగా, ఆకర్షితుడయ్యాడు. ఎం.ఎన్. రాయ్ స్థాపించిన ఇండియన్ లేబర్ ఫెడరేషన్ లో చేరాడు. అప్పటి నుండి ఎం.ఎన్. రాయ్ 1954లో చనిపోయేవరకూ పెమ్మరాజు వెంకట్రావు రాడికల్ హ్యూమనిస్టు భావాలతో రచనలు చేశారు. ఆయన తరచు కవితలు కూడా రాసేవారు. భారత పునర్వికాసం, బౌద్ధ విప్లవంపై దృష్టి వుండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మిక సంఘం నుండి తన స్థానాన్ని హైదరాబాద్ కు మార్చిన వెంకటరావు, కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ సందర్భంగా ఆవుల గోపాలకృష్ణమూర్తికి రాస్తూ, కమ్యూనిజాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెసు ద్వారా కృషి చేస్తానని, రాయ్ భావాలు అమలు చేయడానికి పార్టీలో పనిచేస్తాననీ అన్నాడు. ఆ ప్రకారమే కాంగ్రెస్ పత్రిక పెట్టి రాయ్ భావాలు వ్యాసరూపంలో అందించారు.
నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా పెమ్మరాజు వెంకట్రావును అభిమానించారు. గాంధీభవన్ లో వెంకట్రావు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముక్కుసూటిగా వున్న వెంకట్రావును కాంగ్రెస్ నాయకులు పైకి మెచ్చుకున్నా ఆయన్ను పైకి రానివ్వలేదు.

రాష్ట్రపతి నామినేషన్ వలన పెమ్మరాజు వెంకట్రావు ఒక టరమ్ శాసన మండలి సభ్యుడుగా పనిచేశారు. అప్పుడు తనవంతు కృషి కనిపించింది. 1958లో గోల్కొండ దినపత్రిక ఆగిపోగా వారపత్రికగా పెమ్మరాజు వెంకట్రావు కొంతకాలం హైదరాబాద్ లో నిర్వహించారు. కాని అదీ అట్టేకాలం సాగలేదు.

కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పెమ్మరాజు వెంకట్రావు క్రమేణా కాంగ్రెసు రాజకీయాలకు దూరంగా జరిగారు. ప్రెస్ లు స్థాపించి నష్టపడ్డారు. 1982లో ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కొద్దికాలం వెంకట్రావు సన్నిహితంగా వున్నారు. ఇరువురి భావాలూ పొత్తు కుదరక, వెంకట్రావు రాజకీయాలకు స్వస్తి పలికారు. 1987 సెప్టెంబరులో పెమ్మరాజు వెంకట్రావు హైదరాబాద్ లో చనిపోయారు.

పెమ్మరాజు వెంకట్రావుతో 1958లో నాకు పరిచయమైంది. విశాఖపట్నంలో ఎం.ఏ. చదువుతుండగా ఆయన వ్యాసాలు గమనించి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. ఎం.ఎన్. రాయ్ రాసిన పునర్ వికాస విషయాలు తెలుగులో బాగా ప్రచారం చేశారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి వద్ద కలుసుకునేవాళ్ళం. తరువాత హైదరాబాదులోనూ కలిశాం.

Wednesday, August 13, 2008

సాహితి పరులతో సరసాలు

రాయ్ ను ఆంధ్రకు తెచ్చిన ఎం.వి. శాస్త్రి

జర్నలిస్ట్ గా ఆరంభించి, తలవని తలంపుగా ఆంధ్రలో పునర్వికాసోద్యమానికి నాంది పలికిన ములుకుట్ల వెంకటశాస్త్రి (ఎం.వి. శాస్త్రి) పాత్ర గమనార్హం.
కుందూరి ఈశ్వరదత్తు,స్వాతంత్ర్యోద్యమ రోజులలో పీపుల్స్ వాయిస్ పేరిట మద్రాసు నుండి ఇంగ్లీషు పత్రిక నడిపారు. ఇది పిఠాపురం రాజా ఆర్థిక సహాయంతో నడిచిన జస్టిస్ పార్టీ పత్రిక. 1936లో ఫైజ్ పూర్ లో (మహారాష్ట్రాలో ఒక గ్రామం) కాంగ్రెసు పార్టీ మహాసభ డిసెంబరులో జరిగింది. ఆ సభా విశేషాలు రాసే నిమిత్తం ఎం.వి. శాస్త్రిని పీపుల్స్ వాయిస్ పక్షాన పంపారు. కాకినాడలో చదువు ముగించిన ఎం.వి. శాస్త్రి ఉత్సాహంగా వెళ్ళారు. అక్కడ జైలు నుండి విడుదలై వచ్చి, రాజకీయాలలో హేతుబద్ధంగా, అంతర్జాతీయ వ్యవహారాలు అవలీలగా మాట్లాడిన ఎం.ఎన్. రాయ్ మాటలు ఎం.వి. శాస్త్రిని ఆకట్టుకున్నాయి. గాంధీ మత, మిత ధోరణిని వ్యతిరేకిస్తూ మాట్లాడిన రాయ్ ను ఆంధ్రకు ఆహ్వానించి వచ్చారు శాస్త్రి.
1937 జూలై చివరలో మద్రాసులో యువజన సభలో పాల్గొన్న ఎం.ఎన్. రాయ్ ఆగస్టు 1న తొలిసారి ఆంధ్రలో అడుగుపెట్టారు. నెల్లూరులో వెన్నెల కంటి రాఘవయ్య ఆధ్వర్యాన జరిగిన వ్యవసాయ కార్మికుల మహాసభకు ఎం.ఎన్. రాయ్ ప్రధాన వక్తగా వచ్చారు. అక్కడ జబ్బుపడ్డారు. కాకినాడ నుండి ఎం.వి. శాస్త్రి వెంటనే వచ్చి ఎం.ఎన్. రాయ్ ను కాకినాడకు తీసుకెళ్ళారు. అక్కడ శాస్త్రిగారి వద్ద రాయ్ కోలుకుంటున్నప్పుడే, విశాఖపట్టణం నుండి అబ్బూరి రామకృష్ణారావు (యూనివర్శిటీలో లైబ్రేరియన్, థియేటర్ నిపుణులు) వచ్చారు. ఆ విధంగా ఎం.ఎన్. రాయ్ ను వారిరువురూ ఆంధ్రకు పరిచయం చేశారు. వారి జీవితాల్లో అదొక పెద్ద మలుపు అయింది. ఎం.వి. శాస్త్రి అప్పటి నుండీ రాయ్ అనుచరుడుగా పనిచేశారు. రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో ప్రధాన పాత్ర వహించారు. 1942లో ఆంధ్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ మహాసభల్ని కాకినాడలో నిర్వహించారు. బెంగాల్ నుండి కె.కె. సిన్హా ప్రారంభోపన్యాసకులుగా వచ్చారు.
ఆంధ్రలో ఎప్పుడు పర్యటనకు వచ్చినా శాస్త్రి దగ్గరకు వచ్చేవారు రాయ్ దంపతులు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికలో శాస్త్రి అనేక వ్యాసాలు రాశారు. ఇంగ్లీషులో వ్యాసాలు రాయడంలో శాస్త్రి గారు దిట్ట. చాలా హేతుబద్ధంగా, మంచి శైలిలో, హాస్యం తొణికిస్తూ రాసేవారు. రాయ్ 1954లో చనిపోయిన అనంతరం, అడ్వొకేట్ గా ప్రాక్టీసు చేసిన శాస్త్రిగారు రాజగోపాలాచారి వాదనల పట్ల, ఉదారవాద, స్వేచ్ఛాభావాల పట్ల ఆకర్షితులయ్యారు.
1959లో రాజాజీ స్వతంత్ర పార్టీ స్థాపకులుగా ఆంధ్ర పర్యటించినప్పుడు కాకినాడలో శాస్త్రిగారింట్లో జరిగిన విందులో నేను పాల్గొన్నాను. ఆనాడు గొప్ప సభ జరిగింది. రాజాజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించిన ఉషశ్రీ విఫలమయ్యారు. చివరకు శాస్త్రిగారి సలహాపై గౌతులచ్చన్న అనువదించి, మెప్పించారు. శాస్త్రి స్వరాజ్య పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. కె. సంతానం సంపాదకుడుగా మద్రాసు నుండి నడిచిన ఆ పత్రిక మేధావులను ఆకర్షించింది. ముఖ్యంగా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని అడ్డుకున్నది.
ఎం.వి. శాస్త్రి ఆంధ్రలోని రాడికల్ హ్యూమనిస్టులలో ఆవుల గోపాలకృష్ణ మూర్తికి సన్నిహితులుగా వుండేవారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎం.వి. శాస్త్రి నిలిచారు. ములుకుట్ల వెంకటశాస్త్రికి ఓటు వేయమంటూ ఆయన ఒక ఆకర్షణీయ విజ్ఞప్తి ఓటర్లకు పంపారు. శాస్త్రిగారు నెగ్గి, ఎం.ఎల్.సి.గా ఒక టరమ్ పనిచేశారు.
శాసనమండలిలో పరిమితంగా మాట్లాడినా, చాలా లోతైన భావోపన్యాసాలు చేశారు. హుందాగా ప్రవర్తించారు. 1962 నుండి ఆయన ఎం.ఎల్.సి.గా హైదరాబాద్ లో వుంటూ వచ్చారు. అప్పుడే స్వతంత్ర పార్టీ సమావేశాల్లోనూ పాల్గొన్నారు.
రాజగోపాలాచారి ముఖ్యంగా ఎం.వి. శాస్త్రి తీర్మాన పాఠాన్ని మెచ్చుకునేవారు. శాస్త్రిగారు రాస్తే రాజాజీ యథాతథంగా అక్షరం మార్చకుండా ఆమోదించేవారు. ఆయన ఇంగ్లీషు అంత బాగా వుండేది. శాస్త్రి గారికి అందరూ అమ్మాయిల సంతానమే. పెళ్ళిళ్ళ రీత్యా వారిలో కొందరు అమెరికా వెళ్ళారు. శాస్త్రి గారు అనేక పర్యాయాలు అమెరికా పర్యటించారు. హైదరాబాదులో వుండగా దంటు భాస్కరరావుతో కలిసి శాస్త్రిగారు వినోద, సాహిత్య కార్యకలాపాలు ఆనందించేవారు. శాస్త్రిగారి వ్యాసాలు, శాసన మండలి ఉపన్యాసాలు గ్రంథస్తం కావలసివుంది. 1990లో శాస్త్రిగారు మరణించారు. శాస్త్రిగారితో 1956 నుండి నాకు పరిచయమైంది. సన్నిహితంగా మెలిగాము. అది చివరి దశవరకూ సాగింది. జీవితం అంతంలో శాస్త్రిగారు హేతుబద్ధమైన విధానాన్ని విడనాడారు. నమ్మకాల్లోకి వెళ్ళిపోయారు.

Tuesday, August 12, 2008

ఆధ్యాత్మిక వ్యాపారం













దేవుడి పేరిట జరుగుతున్న ఆధ్యాత్మిక వ్యాపారం నిరంతరం కొనసాగుతున్నది. జనాకర్షణలో యిదొక వింతగా వుంటున్నది. గ్రామాలలో తరచు సాధువులు, యోగులు, బాబాలు, మాతలు ఎక్కడ నుంచో వచ్చి చిన్న ప్రయోగాలు చేస్తారు. అది వింతగా చూచి, అద్భుతంగా భావించి కానుకలు సమర్పిస్తారు. గిట్టుబాటు కాగానే స్వామీజీ మరో గ్రామానికి తరలివెడతాడు. ఇదంతా దైవం పేరిట జరిగే పెట్టుబడిలేని వ్యాపారమే. అలాంటి సంపాదనకు పాల్పడేవాణ్ని-డబ్బు, ఆస్తి ఎలా వచ్చిందని అడిగేవారు లేరు. మతం యొక్క గొప్పతనం అలాంటిది.
ఇంద్రియాతీత శక్తులున్నాయనే యోగి బొటనవేలి గోటిలో సోడియం దాచి, ఒక వేడినీటి పాత్రపై చేయి తిప్పినట్లు చూపి, సోడియం అందులోకి జారవిడుస్తాడు. మంత్రాలు చదువుతుంటాడు. నీటి నుండి మంటలు రావడంతో అది ఒక దైవశక్తిగా జనం భ్రమిస్తారు.
మరొక యోగిపుంగవుడు తన దివ్యమహిమ చూపడానికి నోటి నిండా నీరు నింపి సిపి ఈధర్, పొటాషియం లోహముక్కగల నీటిపాత్రలో పూస్తాడు. పొటాషియం లోహపు ముక్క తగులుకొని ఈధర్ కు అంటుకోగా నీటిపై మంటలు కనిపిస్తాయి. స్వామీజీ నోటి నీటికి అంత శక్తి వున్నదన్నమాట.
ఇంకొక పవిత్ర స్వామీజీ వంటినిండా దైవం పేరు కనిపిస్తుంటుంది. ఆయన యజ్ఞం చేస్తుండగా, యిలా దైవం పేరు కనిపించడం వలన భక్తులు సాష్టాంగపడతారు. ఏదైనా పాలు కారే కొమ్మను విరిచి, దానితో దేహంపై యిష్టదైవం పేరు రాయాలి. దీని బదులు సబ్బువాడొచ్చు, అలా రాసిన తరువాత ఆరనివ్వాలి. యజ్ఞగుండం వద్ద వేడికి స్వామీజీకి చెమట వట్టినప్పుడు స్వామీజీపై భక్తులు విభూది చల్లుతారు. అప్పుడు లోగడ రాసిన దైవనామం కనిపిస్తుంది.
ఇంకా కొందరు యోగులు కుంచెను పొటాషియం ఫెర్రొసైనైడ్ ద్రావణంలో ముంచి చేతిమీద దైవనామం రాసి ఆరబెడతారు. ఐరన్ క్లోరైడ్ ద్రావకంలో దూదిగాని, వస్త్రం గాని ముంచి లోగడ దైవనామం రాసినచోట తుడిస్తే నీలం రంగులో ప్రత్యక్షమై, భక్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి చిత్ర విచిత్రాలతో అమాయకులైన, అజ్ఞానులైన భక్తుల్ని మోసగించి, భ్రమింపజేసి, తాత్కాలికంగా లబ్ధిపొందవచ్చు.

Saturday, August 9, 2008

జ్వాలా ముఖి మహత్తు

ఉత్తరాదిలో గోరక్ నాథ్ దిబ్బ జ్వాలాముఖి గుడిలో వుంది. భక్తులు యీ గుడిని సందర్శించినప్పుడు బుడగలతో వుడికిపోతున్న నూనె కనిపిస్తుంది. భక్తులు ఆ దృశ్యం తిలకించి, కానుకలు సమర్పిస్తారు. అద్భుత దృశ్యంగా చూచి మహత్తుగా భావిస్తారు. భక్తుల తలలపై మండే నూనెను పురోహితుడు చల్లినప్పుడు, అది మంచువలె చల్లగా మారుతుంది. కొందరు శాస్త్రజ్ఞులు సైతం ఈ దృశ్యం చూచి, తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.
జ్వాలాముఖి గుడి నూనె బావిలో బుడగలు వస్తున్నమాట వాస్తవం. పురోహితుడు ఒక కాగితాన్ని వెలిగించి, నూనెపై వుంచితే గాస్ తగులబడుతుంది. అలాంటి నూనె పురోహితుడు భక్తులపై చల్లితే మంచు నీరుగా ఎలా మారుతుంది? హేతువాది ప్రేమానంద్ ఈ గుడి సందర్శించి, జరుగుతున్నదంతా గమనించాడు. సహజవాయువు బయటకు వచ్చేచోట జ్వాలాముఖి గుడిని నిర్మించారు. ఒక గొట్టం ద్వారా వచ్చే గాస్ నిరంతరం వెలుగునిస్తుంటుంది. గాస్ బావి ప్రక్కగా ప్రవహించే నీటి బుడగల్ని చూచి, గాస్ ప్రవాహం వలన అవి ఏర్పడుతున్నాయని భక్తులు భావిస్తున్నారు, నీటి బుడగలు సహజవాయువుతో కలిసినప్పుడు తుకతుక వుడుకుతున్న నూనె వలె కన్పిస్తున్నది. నీటిలో గాస్ కలుస్తున్నందున, అది కలుషితమై క్రూడ్ ఆయిల్ వలె మడ్డిగా వుంటున్నది. అందులో చేయి పెడితే చల్లగా వుంటుంది. అదే పురోహితుడు చేసే మహత్తు.

Wednesday, August 6, 2008

బాణామతి, చేతబడి






బట్టలు తగులబడుతున్నాయ్!

మన గ్రామాలలో బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనేవున్నారు. అలాంటి వారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు.
ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది. ఇంకేముంది? ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్ళు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.

ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.
సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని, సోది చెప్పేవారిని పిలుస్తుంటారు.

షిర్టీ సాయిబాబా దర్శనం

షిర్టీ సాయిబాబా భక్తి యిటీవల ఎక్కువగా ప్రవహిస్తున్నది. “నేను షిర్టీసాయి అవతారమని” సత్యసాయి లోగడ చెప్పాడు. చెన్నారెడ్డి మొదలు ఎన్.టి. రామరావు వరకూ షిర్టీ సాయి భక్తులే. రాజకీయవాదులు కొత్తగా భక్తి పెంచుకుంటే, సందేహించాలి.
షిర్డీసాయి గురించి సినిమాలు వచ్చాయి. చిత్ర విచిత్ర కథలు ప్రచారంలో వున్నాయి. భక్తులు కొందరు ఆయన ఫోటో, చిత్రపటం తమ ఇళ్ళలో కనిపిస్తున్నట్లు చూపుతున్నారు. ఇదెలా సాధ్యం?
గ్లాస్ ప్లేటు శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. హైడ్రోక్లో రిక్ ఆమ్లం (యాసిడ్)లో ముంచిన స్టీల్ పెన్ తో షిర్డి సాయి బొమ్మ వేయండి. 10 నిమిషాల తరువాత మంచినీటితో కడగండి. గ్లాస్ ఎండబెట్టి లేదా ఆరబెట్టి వస్త్రంతో తుడిస్తే ఏమీ కన్పించదు. గ్లాస్ పై

గాలి వదలండి. షిర్డిసాయి బొమ్మ వస్తుంది. గాలిలో తేమ ఆరగానే బొమ్మ అదృశ్యమవుతుంది. దీనిపై భక్తుల్ని ఎంతైనా మోసగించవచ్చు.
మీరు సత్యసాయి భక్తులైతే ఇంకో విచిత్రం చేసి మహత్తుగా చలామణి చేయవచ్చు. ఫొటోపేపర్ పై సాయి బొమ్మ వేసి, మంచినీటితో కడగండి. మెర్క్యురిక్ క్లోరైడ్ ద్రావణంలో ఫోటో పేపరు వుంచి, బయటకు తీసి ఆరబెట్టండి.
భక్తుల్ని కూడగట్టండి. సాయి నిజమైన భక్తులకు కనిపిస్తాడని కథలు అల్లండి. ప్రార్థనలు చేయించండి. హైపో సొల్యూషన్ లో ఫోటో పేపరు వుంచితే, సాయి ఫోటో కనిపిస్తుంది. దీనిపై ఎంత గిట్టుబాటు అయితే అంత చేసుకోవచ్చు.

Monday, August 4, 2008

టెంకాయ భక్తి






భక్తికీ కొబ్బరికాయలకూ చిరకాలంగా సన్నిహిత సంబంధం వుంది. కొబ్బరి బొండాలతో, టెంకాయలతో చిత్రవిచిత్ర చర్యలు చూపి భక్తులను ఆకట్టుకోవడం, భయపెట్టడం కూడా చూస్తున్నాం. కేరళలో యిది మరీ ఎక్కువ.
కొబ్బరికాయలు తనకు వేసి కొట్టుకొని అది భక్తిగా కొందరు ప్రదర్శిస్తారు. కొబ్బరికాయ పగులగొట్టినప్పుడు రెండు సమాన భాగాలైతే మంచిదనీ, ఒకే దెబ్బతో పగిలితే శుభమనీ, అలాంటి నమ్మకాలెన్నో వున్నాయి. కొబ్బరికాయ పగులగొట్టినప్పుడు లోన పుష్పాలు, రంగునీళ్ళు, ఎరుపు కనిపిస్తే దానిపై వ్యాపారం చేసి, చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేసే గ్రామ వైద్యులున్నారు, భూతవైద్యులున్నారు. ఇలాంటి కొబ్బరికాయ మహత్తులను హేతువాదులు, ప్రేమానంద్ ఆధ్వర్యాన ఎన్నో పర్యాయాలు బట్టబయలు చేశారు. అందులో కొన్ని చూద్దాం. లేత కొబ్బరికాయలు మూడు కన్నులచోట తలకేసి కొడితే వూరికే పగులుతాయి. అలాంటివి కేరళలో, శ్రీలంకలో 101 తలకు కొట్టుకొని అదే మహత్తుగా చూపిన బాబాలున్నారు. అలాంటి కొబ్బరికాయలలో ముదురుకాయల్ని హేతువాదులు చాటుమాటుగా పెట్టినప్పుడు బాబాలకు నొసట రక్తం కారింది. కాని, కొబ్బరికాయ పగలలేదు!
గట్టి టెంకాయ పగులగొట్టాలంటే తలకు దెబ్బ తగులుతుంది. కొబ్బరిపీచు తీసేసి కత్తితో మెల్లగా కొట్టి, చిట్లే వరకూ చూడాలి. తరువాత మూడు రోజులు ఎండబెట్టి, చిట్లినచోట కుంకుమ, గంధం రాసి, మంత్రాలు చదువుతూ, భక్తుల ఎదుట, తలకు, కొట్టుకుంటే వూరికే పగులుతుంది. చిట్లిన విషయం వారికి తెలియదుగదా.
కొబ్బరికాయ పీచు తీసేసి నిమ్మరసం వున్న పాత్రలో పెట్టి తరువాత మూత తీయాలి. అప్పుడు కొబ్బరికాయపై మంత్రాలు చదువుతూ నీళ్ళు చల్లితే, పగులుతుంది.
కొబ్బరికాయ పీచుతీసి, కన్నులవద్ద పట్టుకోడానికి వీలుగా పీచు అట్టిపెట్టాలి. ఇంజక్షన్ తో నీళ్ళు కలిపిన పొటాషియం పర్మాంగనేటు ద్రావణాన్ని కన్నుద్వారా పంపాలి. తరువాత మైనం పెట్టాలి. పట్టుకొనే పీచులో సోడియం మెటల్ ముక్క పెట్టాలి. భక్తుణ్ణి పట్టుకోమని, మంత్రాలు చదువుతూ, కొబ్బరికాయపై నీళ్ళు చల్లాలి. హఠాత్తుగా నిప్పు రగులుతుంది. కొబ్బరికాయ పగిలి, ఎర్రని రక్తం వంటి ద్రవం కారుతుంది. నీటితో కలసిన సోడియం రసాయనిక మార్పు అది. మహత్తుగా దీని చుట్టూ ఎన్నో కథలు అల్లవచ్చు.

Sunday, August 3, 2008

మంత్రతంత్రాలు, మహత్తులు

సంసార స్త్రీలు తమ ఇళ్ళలో యిబ్బందుల్ని బాబాలకు, మాతలకు, సోది చెప్పేవారికి విన్నవించుకుంటారు. స్త్రీల చేతనే అన్నీ ఏదో విధంగా రాబడతారు. పరిష్కారం చెప్పినట్టు నటిస్తారు. ఈలోగా దక్షిణలు, కానుకలు, ఎన్నో స్వాములకు చేరిపోతాయి, కొన్ని సందర్భాలలో స్త్రీలను భయకంపితుల్ని చేసి, వారి నుండి లబ్ధి పొందే స్వాములూ వున్నారు. స్త్రీలలో నమ్మకాలు క్రమంగా వారి సంతానానికి సంక్రమిస్తాయి. గుడికి పోవడం, మొక్కుబడులు, తాయెత్తులు, ఒకటేమిటి? అన్ని లక్షణాలు చిన్నప్పటినుండే వస్తాయి. అవి పెద్ద అయినా పోవు.
హేతువాది ప్రేమానంద్ కు బొంబాయిలో యిలాంటి ఘట్టం ఒకటి తటస్తపడింది. ఒక బాబాచే బాధితురాలైన స్త్రీని వియోచన చేయమని ఆమె కుమారుడే వచ్చి కోరాడు. బాబా చేసిన కొన్ని మంత్రతంత్రాలు, మహత్తులు ప్రేమానంద్ చేసి చూపగా, ఆమెకు మబ్బు విడిపోయి, యధాస్థితికి వచ్చింది.
మట్టితెచ్చి, పొట్టంలో చుట్టి నోటి దగ్గరగా తీసుకెళ్ళి ప్రేమానంద్, ఏవో మంత్రాలు చదివాడు. అలా మంత్రాలు చదువుతూనే మట్టి పొట్లాన్ని చేతివేళ్ళ మధ్యదాచి, అంతకు ముందా వేళ్ళ మధ్య దాచిన పసుపు పొట్లం అరచేతిలోకి తెచ్చాడు. చుట్టూ గుమిగూడినవారు మట్టికాస్తా పసుపుగా మారడం పట్ల ఆశ్చర్యపోతుండగా ప్రేమానంద్ తన జేబులో చేయి పెట్టి అంతకు ముందే పెట్టిన నిమ్మబద్దను చూపుడువేలితో రాశాడు. తరువాత చూపుడువేలును పసుపుతో రాస్తాడు. అది కాస్తా ఎర్ర కుంకుమ రంగులోకి మారుతుంది. మట్టి ముందుగా పసుపుగా మారి తరువాత కుంకుమగా ఎలా మారిందీ ప్రేమానంద్ వివరించేసరికి, భక్తులకు మాయ కాస్తా పొర తొలగినట్లు తొలగింది.

Saturday, August 2, 2008

వింతలు కాని విశేషాలు


ఇది బ్రస్సెల్స్ గుర్తు.



యూరోపియన్ రాజధాని, బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వెళ్లినప్పుడు గమనించిన కొన్ని సంగతులు.

బెల్జియమ్ లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గుర్రం మాంసం రుచికరంగా ఉంటుందని రకరకాలుగా చేసుకుని తింటారు. మొసలి, నిప్పు కోడి (ఆస్ట్రిచ్) కూడా డెలికసీస్. శాఖాహారం మాత్రమే ఉండే హోటళ్లు అరుదు. ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కడోగాని కనిపించవు. కాబేజీ సూప్ ప్రత్యేకం. చేపలు చాలా రకాలుగా చేసి తింటారు. బీరు ఎన్ని రకాలో చెప్పలేం. అలాగే వైన్. తాగే బాటిల్ నీరు ఖరీదు.
అవినీతిలో ఇటలీ అంత కాదు గానీ, కష్టపడితే ఆ స్థాయికి చేరుకోగలమనేది బెల్జియమ్ జోక్. నిరుద్యోగులకి ప్రభుత్వం డబ్బిస్తుంది. అది తీసుకొని వేరే చోట పని చేసి, డబ్బు తీసుకోవడం ఉంది. చెక్కు రూపేణా కాక, క్యాష్ గా స్వీకరిస్తారు.
పప్పెట్ షోలు కనిపిస్తాయి అక్కడక్కడా. కళాపోషణ ఎక్కువ. మధ్య కాలపు పద్ధతులు, ప్రకృతికి దగ్గరగా ఉండడం యిష్టపడతారు.
దిగంబర క్లబ్బులు యధేచ్ఛగా ఉన్నాయి. బీచ్ లలో ఇసుక విగ్రహాలు చేయడం ముచ్చటగా ఉంటుంది.
రాయల్ మ్యూజియం చూడదగ్గది. నగరంలో సీనియర్ సిటిజన్స్ కు 10 ఏళ్ళలోపు పిల్లలకు ప్రయాణం ఛార్జీలు లేవు. డైమండ్ కటింగ్ వ్యాపారం బాగా ఉంది. సైన్స్ పరిశోధనలో అగ్రగామి.
సగం డచ్ సగం ఫ్రెంచ్. నిరంతరం పోరాడుకుంటున్నారు.

ఇది బ్రస్సెల్స్ గుర్తు.