Sunday, March 30, 2008

సాహితీపరులతొ సరసాలు-15


Chalasani Prasada Rao

చలసాని ప్రసాదరావు
(1939-2002)
1965 నుండీ చనిపోయే వరకూ మిత్రులుగా గడిపిన మేము, తొలుత ఎలా పరిచయస్తులమయ్యామో చెప్పలేను. అప్పట్లో ప్రభుత్వ సమాచార శాఖలో ఆర్టిస్టుగా పని చేస్తూ, సైదాబాద్ కాలనీ (హైదరాబాద్) నుండి బస్సులో వస్తుండేవారు. ప్రసాదరావు మాట్లాడటమే గాని వినడం లేదు. 8 ఏళ్ళ ప్రాయం నుండీ ఆయనకు చెముడు వచ్చింది. నా వంటి వారికి ఆయన మాటలు విని, అర్థం చేసుకోవడం అలవాటుగా మారింది.
1972లో ఈనాడు పత్రిక విశాఖపట్టణం నుండి వెలువడినప్పుడు, ప్రసాదరావు ఆదివారం సంచిక చూచేవారు. అందులోనే ఆయన కోరికపై వ్యాసాలు రాశాను. ఎ.బి.కె. ప్రసాద్ అప్పుడు ఎడిటర్. ఈనాడు హైదరాబాదు కు తరలిన తరువాత ప్రసాదరావు ప్రభుత్వ ఉద్యోగం నుండి ఈనాడుకు మారారు. నేను అడపదడపా వ్యాసాలు రాశాను.
కమ్యూనిస్టుగా ఆరంభమైన ప్రసాదరావు, విజయవాడ వరంగల్లు, హైదరాబాద్ లో అనేక మంది కమ్యూనిస్టుల గోత్రాలు, లోతు పాతులు తెలిసినవాడు. ఆ అనుభవంతో ‘ఇలా మిగిలేం’ అని పుస్తకం రాశాడు. అందులో కమ్యూనిస్టులు కొందరు ఎలా దిగజారారో రాశాడు. చలసాని ప్రసాదరావు అలారాయడం కమ్యూనిస్టులకు మింగుడు పడలేదు. రావి నారాయణరెడ్డి ఎన్.ఆర్. దాసరి మెదలు గజ్జల మల్లారెడ్డి మొదలైన వారిని దుమ్ముదులిపేశాడు. వ్యక్తుల్ని పసిగట్టి బాగా అంచనా వేసేవాడు.
చలసాని ప్రసాదరావు ఈనాడులో చేరి, పెట్టుబడిదారీ పత్రిక అధిపతి రామోజీరావు గులాం అయ్యాడన్నారు. కాని అలా విమర్శించిన మార్క్సిస్టులు కొందరు ప్రసాదరావు దగ్గరకు వచ్చి, తమ పిల్లలకు ఉద్యోగాలిప్పించమని అడిగారు. ప్రసాదరావు నవ్వుకున్నాడు. ఆయన హాస్యప్రియుడు. కళాభిమాని, రచయిత, ఆర్టిస్టు. మిత్రులతో కలసి క్లబ్ లో హాయిగా రెండు పెగ్గులు వేసుకొని, సిగరెట్లు తాగి, ఆనందించిన ప్రసాదరావు జీవితంలో రంగులు చూచాడు.
ఈనాడు పత్రికలో ఆదివారంతో బాటు, విపుల, చతుర పత్రికలు జయప్రదంగా నిర్వహించారు. అవి పడిపోతున్నప్పుడు, ఆపేయమని సలహా యిచ్చాడు. కాని రామోజీరావు పంటి బిగువుతో నడిపాడు.
ప్రసాదరావుకు నాకూ తాత్విక రాజకీయ భావాలలో పొసిగేది కాదు. నన్ను రాయిస్టు అని పరిచయం చేసేవాడు. ఏ రాయి అయితేనేం, తలపగల గొట్టుకోడానికి అని వెక్కిరించేవాడు.
నాపై వైస్ ఛాన్సలర్ జి. రాంరెడ్డి, ఆయన బృందం ధ్వజమెత్తినప్పుడు, ప్రసాదరావు మద్దత్తు కోరారు. అందుకు స్పందిస్తూ ఇన్నయ్య మొండిఘటం, ఆయన్ను మిరేమీ చేయలేరు. నేను ఆయన పక్షమే అని బద్దలు కొట్టి చెప్పిన మిత్రుడు. గుండె పోటు వచ్చితట్టుకున్నా, సిగరెట్లు మానలేకపోయాడు. చివరి వరకూ ఈనాడు కబుర్లు రాశాడు.
ప్రసాదరావుకూ నాకూ కామన్ మిత్రులన్నారు. సంజీవదేవ్, రవీంద్రనాథ్ ఆలపాటి, సి. భాస్కరరావు, వెనిగళ్ళ వెంకట రత్నం, దండమూడి మహీధర్. నార్ల అంటేనూ, ఎ.బి.కె. ప్రసాద్ పట్లా ప్రసాదరావుకు సదభిప్రాయం లేదు. నార్ల గురజాడపై విమర్శలు చేసినప్పుడు, అవసరాల సూర్యారావు పరిశోధనను దుయ్యబట్టినప్పుడు, ప్రసాదరావు మెచ్చలేదు. అయితే ఆ రంగంలో ప్రసాదరావుదే దోషం. రంగనాయకమ్మపై కూడా తీవ్ర విమర్శలు చేస్తుండేవారు.
చలసాని ప్రసాదరావు అమెరికా పర్యటనలో న్యూయార్క్ వెళ్ళి మారుమూల వున్న నికలస్ రోరిక్ కళాకారుని మ్యూజియం సందర్శించాడు. ఆయన ఆసక్తి, ప్రత్యేకంగా పనిగట్టుకుని రావటం చూచి అభినందించిన మ్యూజియం డైరెక్టర్, ప్రసాదరావుకు వారి ఆల్బమ్ బహూకరించి సత్కరించారు. ఆ తరువాత మరొకసారి నేను అదే మ్యూజియంకు వెళ్ళినప్పుడు ప్రసాదరావు రాకను గురించి చెప్పారు. సంజీవదేవ్ - రోరిక్ లు మిత్రులు. వారి ఉత్తర ప్రత్యుత్తరాలు నేను సంజీవదేవ్ నుండి స్వీకరించి మ్యూజియంకు బహూకరించాను.
ప్రసాదరావు నాకు కుటుంబ మిత్రుడు. నా పిల్లలతో కూడా సన్నిహితంగా వుంటూ, అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మాయి నవీన దగ్గర గడిపాడు. చక్కని బొమ్మలు వేసి పిల్లలకు యిచ్చేవాడు.
రచనలు :
రవికథ, కథలు కాక్లర కాయలు, మాస్టర్ పీచు, మార్పు, నిజాలు, రాజుల బూజు, ఆరడుగుల నేల, రక్తా క్షరాలు, కాకతీయ శిల్పం, ఆధునిక చిత్రకళ, రష్యన్ చిత్రకళ, చిట్టి ప్రసాద్, ఇలా మిగిలేం, రసన, కళ (ఎడిటర్), కబుర్లు (ఈనాడు).

Thursday, March 27, 2008

పుస్తక సమీక్ష-3
పిశాచ పీడిత ప్రపంచం

(The Demon – Haunted World, Science As a Candle in the Dark

- Carl Sagan)


కార్ల్ శాగన్ ఒక ఆకర్షణీయ, అపూర్వ శాస్త్రజ్ఞుడు. ఆయన చనిపోబోయే ముందు (1996) ఒక పుస్తకం రాసిపోయాడు. దాని శీర్షిక : పిశాచ పీడిత ప్రపంచం (The Demon haunted world) కార్ల్ శాగన్ 62వ యేట 20 డిసెంబరు 1996న మరణించాడు.

శాగన్ ఏది రాసినా, చెప్పినా జనానికి అర్థమయ్యేట్లు, అందుబాటులో ఆచరించేటట్లు చెప్తాడు. కాస్మాస్ పేరిట ఆయన రాసిన పుస్తకమూ అంతే, ప్రపంచ వ్యాప్తంగా కాస్మాస్ కార్యక్రమాలు టి.వి.లలో తిలకించిన వారికి యీ సంగతి తెలుసు. సైన్స్ ను ఆకాశం నుండి భూమి మీదకు తెచ్చిన సైంటిస్టు శాగన్. సైన్స్ అంటే అదేదో మనకు తెలియని, గందరగోళశాస్త్రం అనే భ్రమ తొలగించాడు. సైన్స్ నిపుణులు లోతుపాతులు గ్రహించి అనేక విషయాలు కనిపెడతారు. వాటిని సాంకేతిక నిపుణులు ఆచరణలో పెడతారు. అదే ఉపయోగం, అందులోనే హానికూడా వుంది. హాని ఎక్కువ అతిశయోక్తులతో చూపి, అది సైన్స్ కు అంటగట్టి బూచిగా చిత్రించిన సందర్భాలున్నాయి.

కార్ల్ శాగన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు. కార్ల్ మార్క్స్ తత్వాన్ని భూమి మీదకు తెచ్చి జనంలో పడేయమన్నాడు. సైన్స్ ను ఒక తత్వంగా చూచిన శాగన్ అదేపని సమర్ధవంతంగా చేసి, ఎంతో సేవ చేసిన వాడయ్యాడు.

చుట్టూ వున్న చీకటి చూసి, నిస్సహాయంగా కూర్చోవద్దు. ఒక కొవ్వొత్తి అయినా వెలిగించు, ఇదీ దయ్యాల ప్రపంచంలో శాగన్ సూత్రం. ఆయన సైన్స్ ప్రచారానికి పూనుకోలేదు యీ పుస్తకంలో. ఆ పని చేసే వారు చాలా మంది వున్నారు.

సైంటిఫిక్ మెథడ్ (శాస్త్రీయ పద్ధతి) ఒక కొవ్వొత్తిగా స్వీకరించమన్నాడు. ఎన్ని ఒడిదుడుకులున్నా, రాగద్వేషాలున్నా, సైన్స్ ను ముందుకు నడిపించి, మనుషులకు ప్రగతి చూపి, ఇంతవరకూ రావడానికి మూలకారణంగా శాస్త్రీయ పద్దతే, అంటే, సైన్స్ కూ, సైంటిఫిక్ మెథడ్ కూ తేడా చూపుతున్నాడన్నమాట. తెలుసుకోవడం, ప్రశ్నించడం, తప్పు అయితే దిద్దుకోవడం, విషయసేకరణ, కొత్త ఆలోచనల్ని పరీక్షకు పెట్టడం, అందుకు సాక్ష్యాధారాలు చూపడం, పరీక్షకు నిలవకపోతే కొట్టి పారేయడం, నిలిస్తే సిద్ధాంతీకరించడం, దేనినీ పవిత్రం పేరిట ప్రశ్నించకుండా వదలకపోవడం, మనం చిరకాలంగా నమ్మేది శాస్త్రీయంగా తప్పు అని రుజువైతే అంగీకరించడం -ఇదే శాస్త్రీయ పద్ధతి, కొన్నిసార్లు శాస్త్రజ్ఞులే అనుసరించలేకపోతున్నారు. కాని అదే అవసరం.

కార్ల్ శాగన్ తన 457 పుటల గ్రంథంలో స్వానుభవాలు జోడించి, ఏదో లోకాల్లో ఎవరో ఆకాశ వ్యక్తులున్నారనే భ్రాంతుల్ని తిరస్కరించాడు. ఎగిరే పళ్ళాల వెనుక వున్న భ్రమల్ని బయటపెట్టాడు. ప్రతి శాస్త్రానికి ప్రతిబింబంగా వున్న అశాస్త్రీయ రూపాల్ని చూపాడు. ఉదాహరణకు ఖగోళశాస్త్రం ఒకవైపు, జ్యోతిష్యం మరొక పక్క చూపాడు.

25 అధ్యాయాలుగల యీ పుస్తకం ఎక్కడా బోర్ కొట్టదు. అర్థం చేసుకోడానికి తల బొప్పికట్టదు. నిఘంటువులు భూతద్దాలతో చూడనక్కరలేదు. అంతగా విడమరచి శాగన్ చెప్పాడు. ప్రకృతి అద్భుతాలను ఆనందించాలి. అనుభవించాలి, అంతటితో ఆగక, తెలుసుకోవాలి. ఇది నిరంతరం సాగవలసిన జిజ్ఞాస. పూజిస్తే తెలుసుకోలేం. ఆరాధిస్తూ కూర్చుంటే అంతుబట్టదు. అంతు తేల్చుకోవాలనే శాస్త్రీయ పట్టుదలవుంటే కొంత ముందుకు పోతాం. అలా పోవడంలో ఆనందం వుంది. ఆ పని చేయమని శాగన్ ప్రోత్సహిస్తున్నాడు.

ప్రభుత్వాలు తప్పులు చేయకుండా చూచే బాధ్యత ప్రజలదని సూత్రీకరించాడు. ఇందుకు తల క్రిందులుగా వ్యవహారం సాగిపోతున్నది. వ్యక్తులు తప్పులు చేస్తే దిద్దుకోవడం సులభం. ప్రభుత్వాలు చేస్తే, సమర్థించుకోడానికి ప్రయత్నిస్తాయి. అదే ప్రమాదం.
ప్రతి అధ్యాయానికీ రిఫరెన్స్ గ్రంథాలపట్టిక శాగన్ చూపాడు. చాలా అందంగా గ్రంథం ముద్రించారు. ఖరీదును బట్టి అందరూ కొనడం యిబ్బందికరం గనుక, గ్రంథాలయాలకు, సంస్థలకు, కాలేజీలకు తెప్పిస్తే, చాలామందికి ఉపయోగపడుతుంది.


కార్ల్ శాగన్ తో రచయిత ఇన్నయ్య, వాషింగ్టన్లో 1996

శాగన్ గురించి కొంత వ్యక్తిగత అనుభవం చెప్పడం మంచిదేమో. నేను ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను (1992-95). తీరిక లేని సైంటిస్టుగా, అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో డంకెన్ ప్రొఫెసర్ గా వుంటూనే, నాకు జవాబులు రాశాడు. ఒక ఉత్తరంలో భారతదేశంలో మానవవాద మిత్రులకు మీద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నాను అన్నాడు. అదే చివరి ఉత్తరం. భద్రంగా జ్ఞాపికగా అట్టిపెట్టాను. వాషింగ్టన్ లో రెండు పర్యాయాలు శాగన్ ను కలిశాను. ఫోటోతీయించుకున్నాను. ఆయన వివాదాస్పద విషయాలు కూడా చాలా ఆహ్లాదంగా చెబుతాడు.

Monday, March 24, 2008

సాహితీపరులతొ సరసాలు-14


Y. Rosayya Image courtesy: http://yrosayya.com/

ఎలవర్తి రోసయ్య
(1918-1991)
పిలక పెంచి, వీరగ్రాంధిక వాదిగా, ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కనలను గారు అని సంబోధించిన ఎలవర్తి రోసయ్య ఒక విశిష్ట వ్యక్తి. భావాలలో ఉగ్రవాది. ఇంగ్లీషు టేచరైనా, తెలుగులో నిష్టాతుడు. గణితంలో, సంగీతంలో మంచి ప్రవేశం వుంది. తెనాలి తాలూకా తురుమెళ్ళ హైస్కూలులో చదివి, మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రోసయ్య, భీమవరం, గుంటూరులో కాలేజీ టీచర్ గా వేలాది మందిని ప్రభావితం చేశారు.
మంచి కవిత్వం అంటే చెవి కోసుకునే రోసయ్యకు ఆప్త స్నేహితుడుగా వున్న ఆవుల గోపాలకృష్ణ మూర్తి, చిట్కా ప్రయోగాలతో ఆయన్ను మార్చేశాడు. గుంటూరు కమ్మహాస్టల్లో వున్న రోసయ్యకు త్రిపురనేని రామస్వామి “సూతపురాణం” పద్యాలు వినిపించాడు. రోసయ్య ఆశ్చర్యపోయి, ఎవరు రాశారు, చాలా అద్భుతంగా వున్నాయని, ఆరాతీశాడు.
అలా ఆసక్తి పెరిగిన తరువాత అసలు విషయం చెబితే, కూలంకషంగా చదివి, రోసయ్య మారడానికి నాంది పలికారు. ఒక రాత్రి నిద్ర పోతున్న రోసయ్య పిలక కత్తిరించి, భావాలలోనే గాక భాషలోనూ, వేషంలోనూ రోసయ్యను మార్చేశారు. ఎ.జి.కె. (ఆవుల గోపాలకృష్ణమూర్తి).
ఎం.ఎన్. రాయ్ మానవ వాదం పట్ల బాగా ఆకర్షితుడైన రోసయ్య, అనేకమందిని రాయ్ పట్ల మొగ్గుచూపడానికి దోహదకారి అయ్యారు. రాయ్ అనుచరులు జి.డి. పరేఖ్, ఎ.బి.షాల ప్రసంగాలు, భావాలు శ్లాఘించారు. నేను గుంటూరు ఎ.పి. కాలేజీ (1954-58) విద్యార్థిగా, రోసయ్య గారి వలన మానవ వాదినయ్యాను. గురువు గారు కాస్తా జీవితమంతా స్నేహితులయ్యారు. కాలేజీ కంటే ఆయన ఇంట్లో నేర్చిన విద్య చాలా ఉపయోగ పడింది.
రోసయ్య గారికి జ్ఞాపకశక్తి హెచ్చు. ఇంగ్లీషు తెలుగు పుస్తకాలలో విషయాలు చెబుతూ, పేజీలు తిరగేసి, కొటేషన్లు చూపే వారు. త్రిపురాన వేంకటరాయ “మొయిలు రాయభారం” నుండి పద్యాలు వినిపించేవారు. ఎం.ఎన్. రాయ్ సైన్స్ అండ్ ఫిలాసఫీలో, జటిలవిషయాలు విడమరచి చెప్పేవారు. వీటన్నిటికి తోడు రోసయ్య వీరగ్రాంధికవాది. అది ఎదురీత. కాలం చెల్లిన వాదం. అయినా అందుకు సమర్ధనీయంగా కొటేషన్లతో కూడిన చిన్న పుస్తకం రాశారు. అది ఎందుకో గాని అచ్చువేయలేదు. అడపదడప వ్యాసాలు అక్కడక్కడా రాసినా, అవీ తక్కువే.
సాహిత్యంలో ఔచిత్యం వుండాలని ఆవుల గోపాలకృష్ణ మూర్తి అంటే, ఎంతో మెచ్చుకున్నారు. చిన్నయసూరి అంటే రోసయ్యకు ఎక్కడ లేని మోజు. దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారి పట్ల గురు భావం. భట్టు మూర్తి వసు చరిత్ర, వీణపై వాయించవచ్చుననేవారు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలన్ పలికిస్తుందని, చౌడయ్య ఫిడేల్ పేడు మీద పేడు రాసినట్లుంటందనేవారు. ప్రాచ్యపాశ్చాత్య సంగీత, సాహిత్య కారులపై రోసయ్యకు రాగ ద్వేషాలు జాస్తి. శామ్యూల్ జాన్సన్, థామస్ గ్రే, మిల్టన్ అంటే యిష్టం.
పాఠాలు చెప్పేటప్పుడు క్రాస్ రిఫరెన్స్ లు విరివిగా చెప్పేవారు. పోర్షన్లు పూర్తి అయ్యేవికావు నాటకాల్లో పాత్రోచితంగా నటించి చూపేవారు. కాలేజీ టీచర్ గా, ప్రిన్సిపాల్ గా, చిన్న పిల్లల స్కూలు నిర్వాహకుడుగా రోసయ్య జీవిత మంతా గడిపారు. కుమారుడు అమెరికాలో వుండటం వలన ఒకసారి వెళ్ళి పర్యటించి వచ్చారు.
స్వాతంత్రోద్యమ రోజులలోనే విధవా వివాహం చేసుకొని, జీవితాన్ని ఆ దర్శంగా ప్రారంభించారు. రోసయ్య గారితో 1954లో మొదలైన పరిచయం ఆయన అస్తమించే వరకూ సాగిందినాకు. అది చాలా వ్యక్తిత్వ వికాస స్నేహం. ఆయన Website పెట్టడంలో ఎలవర్తి రామరాజ భూషణుడుకు నేను యధాశక్తి తోడ్పడి, తృప్తి చెందాను.
పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచనలు అంటే రోసయ్యకు ప్రాణం. సాక్షి ఆరుభాగాలు, విమర్శాదర్శం, నాటకాలు చదివి, మైమరచి, నాకు యితరులకు చదివి వినిపించేవారు. పానుగంటి హాస్యం అడుగడుగునా ఆయనతో పాటు ఆనందించాం.
వాడుక భాషా వాదులను, గిడుగు మొదలు ఎందరినో రోసయ్య దుయ్యబట్టేవారు. ఆ విషయంలో ఆయనతో ఏకీభవించ లేకపోయేవాడిని. కమ్మకులాభిమానం మాత్రం రోసయ్యగారు పోగొట్టు కోలేకపోవడం, యీ నేపధ్యంలో ఆశ్చర్యమే. ఎం.ఎన్. రాయ్ మానవ వాదంతో, కులతత్వం ఎలా పొందికగా చూడగలిగారో అర్థం కాదు.

Thursday, March 20, 2008

Book review-2 Vivekananda


(వివేకానందపై సుప్రసిద్ధ బెంగాలీ పరిశోధక రచయిత నిరంజన్ ధర్ వేదాంతం - బెంగాల్ రినైజా న్స్ రాసారు. దాని సారాంశం చెప్పమని కొందరు కోరినట్లు, యిక్కడ రివ్యూ చేస్తున్నాను. వెబ్ సైట్ లో నుండి యీ పుస్తకం తెప్పించుకోవచ్చు.)

మనకు యీ వివేకానంద తెలుసా?

వివేకానందకు అమ్మ నాన్న పెట్టిన పేరు నరేంద్రనాథ్. 1863 జనవరి 12న కలకత్తాలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. అక్కడే బి.ఎ. వరకూ చదివాడు. ఇంటర్ మీడియట్ చదువుతుండగా, ఇంగ్లీషు లెక్చరర్ మాటల సందర్భంలో రామకృష్ణ విషయం ప్రస్తావించాడు. తొలిసారి ఆ విధంగా చూచాయగా పేరు విన్న వివేకానందుడు, ఎప్పుడైనా రామకృష్ణను చూడాలనుకున్నాడు. విద్యార్థిగా ఆయనకు సందేహాలుండేవి. దేవుణ్ణి చూచినవారెవరైనా వున్నారా అనేది ప్రధాన సంశయం. అంతేగాని నాస్తికుడుగా ఏనాడూ వివేకానందుడు లేడు. ఎవరైనా గట్టిగా చెబితే నమ్మడానికి సిద్ధంగా వున్న వివేకానందునికి తాను చూచానని రామకృష్ణ తడుముకోకుండా చెప్పేసరికి వివేకానంద నమ్మేశాడు.

దక్షిణేశ్వర్ లో తొలిపర్యాయం రామకృష్ణను చూచినప్పుడు, వివేకానంద పట్ల రామకృష్ణకే ఎక్కువ ఆకర్షణ ఏర్పడింది. ఒకనెల తరువాత రెండో పర్యాయం వివేకానంద వచ్చినప్పుడు ఆయన మీద రామకృష్ణ కాలుపెట్టాడు. నాకు తల్లిదండ్రులున్నారు. వారిని చూడవలసిన బాధ్యత నాది. మీరు ఏం పని చేశారనివివేకానందుడు వాపోయాడు. తల్లిదండ్రులు వివేకానందకు పెళ్ళి సంబంధాలు చూస్తుండగా వివేకానందుడు విముఖుడు గాకపోయినా, అతని తండ్రి మరణించడంతో ఆ సమస్య వాయిదా పడింది. పెళ్ళి అంతకు ముందు కుదరబోయి కూడా చిన్న విషయాల వద్ద తేడాలు రాగా తాత్కాలికంగా ఆగింది. ఇంటికి పెద్ద కుమారుడైన నరేంద్రనాథ్ (వివేకానంద) సంపాదించి, పోషించవలసి వచ్చింది. ఉద్యోగాన్వేషణ చేశాడు. వివేకానందకు కొందరు రౌడీ మిత్రులుండేవారు. రౌడీ పనులకు వారు పురమాయించారు. కాని వివేకానంద తమాయించుకొని రామకృష్ణ వద్దకు వెళ్ళి తన దుస్థితి చెప్పగా, ఆయన కాళికామాతను వేడుకొమన్నాడు. ప్రయోజనం లేకపోయింది. ఇక ముందు తినడానికి, కట్టుకోడానికి లోపం వుండబోదని రామకృష్ణ హామీయిచ్చి వివేకానందను ఓదార్చాడు. (చూడు : లీలాప్రసంగం).

ఉద్యోగాన్వేషణలో ఒకనాడు అలసి సొలసి రోడ్డుపక్క అడ్డం పడ్డ వివేకానంద, ఇక ప్రయోజనం లేదని సంసార పక్షాన్ని వదలేశాడు. దక్షిణేశ్వరాలయానికి తరచు వెడుతుండేవాడు. రామకృష్ణ ప్రభావంలో నరేంద్ర సన్యాసిగా మారి, విరాజహోమం జరిపి, సంసారలోకంతో సంబంధం తెంచుకొన్నాడు. సంసార బాధ్యతల్ని ఆ విధంగా తప్పించుకొని ఆశ్రమానికి చేరిన వివేకానంద తన వారిని విస్మరించలేకపోయాడు. తల్లి అప్పుడప్పుడూ మఠానికి వచ్చి కుటుంబ విషయాలు చెప్పి, సంప్రదించి వెడుతుండేది. పూర్వీకుల ఆస్తిపాస్తుల విషయమై తన కుటుంబానికీ తన మేనత్తకూ వచ్చిన తగాదా కోర్టు వరకూ వెళ్ళగా, వివేకానంద ఆ విషయమై శ్రద్ధ కనబరచాడు.


అంతా జమిందార్ల మయమే :


వివేకానంద చాలా వరకు జమిందార్ల సహవాసంతోనే గడిపాడు. బాగా సుఖాలు కోరుకునేవాడు. అమెరికా వెళ్ళబోయేముందు తన తల్లికి సోదరులకు నెలకు 100 రూపాయల చొప్పున డబ్బు పంపించేటట్లు ఖేత్రి మహారాజా ద్వారా ఏర్పాట్లు చేశాడు. ఆ తరువాత స్వామిజీ కోరికపై మహారాజా ఆయనకు కూడా వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం నెలకు వంద రూపాయల చొప్పున మంజూరు చేశాడు. (చూడు ఫర్ గాటెన్ ఛాప్టర్స్, వేణి శంకర్, పుట 146-191) తాను రిటైర్ అయిన తరువాత నివసించడానికి అనువుగా తన తల్లి పేరిట గంగానది ఒడ్డున ఒక యిల్లును నిర్మించవలసిందని, అందుకు గాను 10 వేల రూపాయలు యివ్వమని మహారాజును వివేకానందుడు కోరాడు. తన పేరిట స్థలం కొనమని 1895లో రామకృష్ణానందకు వివేకానంద వ్రాశాడు. వివేకానందుడి పేరిట కొన్న మఠం భూమిపై బెల్లి మునిసిపాలిటీకి ఆయనకూ దావాలు నడిచాయి కూడా. (ప్రబుద్ధ భారత, 1901 ఆగస్టు) స్వామిజీ కోర్కె ననుసరించి తొలుత 500 రూపాయల్ని అజిత్ సింగ్ పంపాడు. బేలూరుమఠం నుండి 3 వేల రూపాయల్ని వివేకానంద అప్పుగా తీసుకొన్నాడు. కాని డబ్బు చాలనందున ఇంటి ప్రయత్నం విరమించాడు. (చూడు : మిసెస్ బుల్ కు వ్రాసిన లేఖ 1900 మే 18).

వివేకానంద ఎక్కడకు వెళ్ళినా సర్వసౌకర్యాలు కోరుకునేవాడు. అమెరికా వెళ్ళినప్పుడు బాల్టిమోర్ లోని ఫస్ట్ క్లాస్ హోటల్ లో వుండాలనుకున్నాడు. ఉన్నాడు కూడా. ఇంగ్లండ్ లో తన శిష్యుడు ఎడ్వర్డ్ స్టర్జీ అతిథిగా వున్నందున, వివేకానందుడిలో సన్యాసత్వం లేదని తెలుసుకున్న శిష్యుడు నిస్పృహ చెందాడు. ఆయనతో సంబంధాలు తెంచేసుకున్నాడు.


సన్యాసిగా యింటికి డబ్బు :


ఖేత్రి మహారాజా యిచ్చిన డబ్బు తన పుస్తకం రాజయోగం (ఆంగ్ల ప్రతి)పై వచ్చిన డబ్బును కూడబెట్టి న్యూయార్క్ లో సెయింట్ ఫ్రాన్సిస్ లెగెట్ వద్ద వివేకానందుడు దాచాడు. ఇదంతా (వెయ్యి డాలర్లు) తన కుటుంబానికే ఉద్దేశించాడు. 1900 డిశంబరు 27న ఓక్ బుల్ కు వ్రాస్తూ తను చనిపోతే డబ్బంతా తన తల్లికి అప్పగించమన్నాడు. వివేకానందుడి అభిమాని శ్రీమతి సెవియర్ అమెరికాలో 6 వేల రూపాయలు యివ్వడమే గాక, తరచు డబ్బు పంపింది. ఆ విధంగా పంపడం మానేయవద్దని వివేకానందుడు కోరాడు. మరో వెయ్యి రూపాయలు అదనంగా యివ్వమని కూడా కోరాడు. అమెరికా, ఇంగ్లండ్ లలో స్వామీజీ విలాసంగా గడిపిన తీరు పట్ల అసంతృప్తితో లియోన్ లాండ్స్ బర్గ్ తన శిష్యరికానికి స్వస్తి పలికాడు. (వివరాలకు చూడు : మేరీ బర్క్ : సెకండ్ విజిట్ పుటలు 71, 79, 81-82, 85-87, 379) సన్యాసిగా నివసించలేని వివేకానందుడు, తన కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాల వలన తోటి సన్యాసులకు, మఠంలోని వారికి చాలా యిబ్బంది కలిగింది. వారెంతగా చెప్పినా వివేకానందుడు మారలేదు.

రామకృష్ణ చనిపోయిన తరువాత బేలూరుమఠం ఆర్థిక చిక్కుల్లో పడింది. కొందరు భిక్షాటన చేశారు గాని ప్రయోజనం అట్టే లేకపోయింది. ఆ బాధ్యత తన నెత్తిన వేసుకొన్న వివేకానంద అఖిలభారత భిక్షాటనకు 1891లో బయలుదేరాడు. రెండేళ్ళపాటు దేశమంతా తిరిగాడు. ముఖ్యంగా స్వదేశీసంస్థానాలలో హిందువుల పాలన క్రింద వున్న వాటికి వెళ్ళాడు. ఎక్కువగా రాజాలు, దివాన్ల వద్ద బస చేశాడు. రాజాల వద్ద పరిచయపత్రాలు ఆధారంగా పర్యటన సాగించాడు. బాగా డబ్బు వసూలు చేసి మఠాన్ని పోషించాడు : వివేకానందుడు వసూళ్ళకై వెళ్ళిన జమిందారీ, స్వదేశీ సంస్థానాలు యివి : ఆల్వార్, జైపూర్, అజ్మీర్, ఖెత్రి, అహమ్మదాబాద్, కధియవార్, జునాగఢ్, పోరుబందరు, ద్వారకా, పైలితానా, బరోడా, ఖండ్వా, బొంబాయి, పూనా, బెల్గాం, బెంగుళూరు, కొచ్చిన్, మలబార్, తిరువాన్కూర్, త్రివేండ్రం, మధురై, రామనాడ్, రామేశ్వరం, కన్యాకుమారి.


అమెరికా యాత్ర :


అమెరికాలో జరుగనున్న ప్రపంచ మత సమావేశానికి వెళ్ళమని ముగ్గురు జమిందార్లు వివేకానందుడిని ప్రోత్సహించి, డబ్బిచ్చి పంపారు. ఖెత్రి, రామనాడ్, మైసూరు మహారాజులు యీ కృషి చేశారు. వివేకానందుడి అమెరికా ప్రయాణానికి మద్రాసులో ఆయన శిష్యులు ప్రయత్నిస్తే అతికష్టం మీద 500 రూపాయలు వసూలయ్యాయి. జమిందార్లపై ఆధారపడిన వివేకానందుడు ఆ డబ్బును పేదలకు పంచేయమన్నాడు. జమిందార్లు బాగా కోపు వేసికొని ఆమెరికాకు సాగనంపారు. పెనెన్ సులా స్టీమర్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ కొనిపెట్టి, కొంత డబ్బిచ్చి, ఇతర వస్తువులు కొనిచ్చారు. ఆ సందర్భంగానే కాషాయ సిల్కు వస్ర్తాలు, సిల్కు, తలపాగా జమిందార్లు కుట్టించారు. దివాన్ జగమోహన్ లాలా తన జమిందారు ఉత్తరువుల మేరకు స్వామీజీ అవసరాలన్నీ చూచి ప్రయాణానికి ఓడ ఎక్కే వరకూ బొంబాయిలో వున్నాడు. వివేకానందుడనే పేరు కూడా ఖెత్రి మహారాజా ఒక దర్బారులో ప్రకటించాడు. అప్పటి నుంచీ నరేంద్రనాథ్ కాస్తా వివేకానందుడైపోయాడు. కాని ఆయన కావాలనుకున్న పేరు సచ్చిదానంద మాత్రమే. హరిదాస్ మిత్రకు 1892 అక్టోబరులో వ్రాసిన లేఖలో సచ్చిదానంద అని సంతకం చేశాడు. కాని వివేకానంద అనే పేరు స్థిరపడి బహుళ ప్రచారానికి వచ్చింది. తలపాగా ధరించడానికి వివేకానందుడు తొలుత తటపటాయించాడు. అదే అతడికి ప్రతీకగా, సుప్రసిద్ధ చిహ్నంగా మారింది.

మహారాజా యిచ్చి పంపిన డబ్బును అమెరికాలో స్వామీజీ పారేసుకున్నాడు. ఆ విషయం తెలిసి వెంటనే 500 రూపాయలు స్వామీజీకి యివ్వమని మహారాజా వారు థామస్ కుక్ అండ్ సన్స్ కు కేబిల్ యిచ్చాడు. (ఫర్ గాటెన్ ఛాప్టర్స్ - శర్మ పుట 34-94) ఇండియా నుండి జమిందార్లు స్వామిజీకి పార్సిల్స్ పంపుతూ, ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూ వచ్చారు. ఈ విధంగా అమెరికాలో స్వామీజీ అవసరాలకు ఎలాంటి లోపం రాకుండా జమిందార్లు జాగ్రత్త వహించారు. అమెరికాలో వివేకానందుడిపై జరిగిన దుష్టప్రచారాన్ని కూడా ఖేత్రి, జూనాగడ్ మహారాజాయే ఎదుర్కొని పరువు కాపాడారు.

చికాగోలో హిందూమత ప్రతినిధిగా పాల్గొని ఇండియాకు తిరిగి వచ్చిన వివేకానందకు జమిందార్లు ఎగబడి, పోటీబడి స్వాగతం పలికి సన్మానించారు. తొలుత రామనాడ్ రాజా, వివేకానందకు స్వాగతం పలికి, ఆయన విగ్రహం కూడా ప్రతిష్ఠించాడు. పేదలకు అన్నదానం చేసాడు. రాజా స్వయంగా వివేకానంద ఎక్కిన బండిని లాగాడు. అందుకు బదులుగా రాజావారికి రాజర్షి అని బిరుదును ప్రసాదించాడు వివేకానందుడు. రామనాధపురం జిల్లాలో రాజకీయంగా రాజావారు చేయని అవినీతి అంటూ లేదు. ప్రజల్ని పీల్చి పిప్పి చేశాడు. కాని, భక్తికి లొపం లేదు. తరువాత వివేకానందకు మద్రాసులో రాజాలు క్యూలో వుండి స్వాగతం పలికారు. (చూడు గంభీరానంద : యుగనాయక్ వివేకానంద మొదటిభాగం 267-270 354-400) ఈ సభకు హెచ్.హెచ్. గైక్వార్ అధ్యక్షత వహించాడు. తరువాత కలకత్తాలో వివేకానందను సన్మానించారు. ఉత్తర పరరాజా ప్రియ మోహన్ ముఖోపాధ్యాయ, సోవాబజార్ మహారాజా, మహారాజా వినయ్ కృష్ణదేవ్ బహుదూర్, దర్భంగా మహారాజా, మహారాజా నరేంద్రకృష్ణ బహుదూర్, మహారాజా గోవిందలాల్ రాయ్ బహుదూర్, రాజా రాజేంద్ర నారాయణ్ బహుదూర్ గారలు సన్మాన సంఘంగా ఏర్పడి ముందుకు వచ్చారు. రాజా రాధాకాంతదివ్ భవన ప్రాంగణలో స్వాగత సభ జరిగింది. గ్వాలియర్ మహారాజా వచ్చి పాల్గొన్నారు. తరువాత స్వామీజి డార్జిలింగ్ వెళ్ళగా బర్ద్వాన్ మహారాజా తన భవనాన్ని వాడుకోమని వివేకానందకు యిచ్చాడు. ఇల్లు కట్టుకోడానికి కాశ్మీరు మహారాజా స్థలం యిచ్చాడు. అద్వైత ఆశ్రమ నిర్మాణానికి గాను భింగరాజా డబ్బిచ్చాడు. వివేకానందకు ఎటుచూచినా స్వదేశీ సంస్థానాధిపతులు, జమిందారులు, యువరాజులు, సంపన్నులు అండగా నిలచారు. ఆదరించారు. రాజాలపట్ల తన ప్రేమను వెల్లడిస్తూ వివేకానంద 1897 మేలో జునాగడ్ దివాన్ కు ఉత్తరం వ్రాశాడు. సముద్ర ప్రయాణం చేసినందుకు తనను వెలివేస్తే, తనతో సాంగత్యం గల దేశీయ సంస్థానాధిపతుల్ని కూడా వెలివేయాల్సి వస్తుందని 1897 జులై, 9న సిస్టర్ మేరీకి వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు. వివేకానంద సన్యాసి అయిన తరువాత ఆయనకు ఘనంగా మహారాజా వినయ్ కృష్ణదేవ్ బహద్దూర్ ఒక విందు ఏర్పరచాడు. (ది బెంగాలీ పత్రిక సంపాదకీయం 1895 మే 18)

దేశీయ ప్రభువుల్ని శ్లాఘించడంలో వివేకానంద వెనుకాడలేదు. బ్రిటిష్ వారి పాలనలో కరువు తాండవిస్తుండగా స్వదేశ సంస్థానాలు హాయిగా వున్నాయన్నాడు. (1899 అక్టోబరు 30 మేరీకి లేఖ) అంతటితో ఆగలేదు. బ్రిటిష్ వారిని తరిమేసి స్వదేశ సంస్థానాధిపతులకు పట్టం కట్టాలని ఉవ్విళ్ళూరాడు. అందుకు గాను ఒక కూటమి ఏర్పాటు చేయాలనుకున్నాడు. అవసరమైతే ఆయుధాలు ప్రయోగించడానికి గాను తుపాకులు తయారు చేసే సర్ హిరాం మాక్సింతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. (పరివ్రాజక్ పుట 123).


వివేకానందపై తిరుగుబాటు :


1899లో గిరీంద్ర, హరధన్ అనే యిరువురి నాయకత్వాన కొందరు భక్తులు బేలూరు మఠం నుండి చీలిపోయి, వివేకానంద చర్యలకు నిరసనగా పేదల రామకృష్ణ సభను ఏర్పరచారు. స్వామిజీ సహజంగానే దీనిని అంగీకరించలేదు. ఎదురు తిరిగిన బేలూరు మఠం భక్తులు అక్కడ జరిగే ఉత్సవాలను, చివరకు రామకృష్ణ జన్మదినోత్సవాన్ని సైతం బహిష్కరించారు. సన్యాసిగా వుంటానన్న వివేకానంద జమిందార్ల సాంగత్యంలో చేసే పనులు నచ్చక యీ తిరుగుబాటు వచ్చింది.

అమెరికాకు రెండు పర్యాయాలు వెళ్ళిన వివేకానంద ప్రధానంగా ధన సేకరణకే ప్రయత్నించాడు. కాని కొంతవరకే సఫలీకృతుడైనాడు. అమెరికాలో సంపన్నులు కొందరు శిష్యులైన పిమ్మట వివేకానందకు డబ్బు కొరతలేదు. ఇండియాకు తిరిగి వచ్చిన వివేకానంద దేశంలోని ఉగ్రవాదులకు (టెర్రరిస్టులు) ఉత్తేజాన్ని కలిగించాడు. అమెరికాలో వుండగా వివేకానందకు క్రైస్తవ సంఘాలతో, యూనిటేరియన్ చర్చితో బాగా సన్నిహిత పరిచయం ఏర్పడింది. వారి సేవాదృక్ఫధం ఆయన్ను ఉత్తేజపరచింది. క్రైస్తవ సోషలిస్టుల నినాదాలు, సేవలు ఆయన్ను ఆకట్టుకున్నవి. వీటన్నిటిని రంగరించి, ఇండియాలో రామకృష్ణ మిషన్ ఏర్పరచాడు. సాంఘిక సేవ అనేది మతపరంగా చేయడం సన్యాసులకు యిష్టం లేకున్నా వివేకానంద మాత్రం యీ విషయంలో పట్టుదలగా ముందుకు పోగలిగాడు.

అయితే హైందవ ఔన్నత్యం అనే అతి జాతీయవాదాన్ని బోధించిన వివేకానంద, ఫాసిజానికి పునాదులు వేశాడు. పాశ్చాత్య దేశాలకన్నా ఇండియా గొప్పది అనే శుష్కనినాదం తాత్కాలికంగా కొందరిని ఉత్తేజపరచినా ఆచరణలో ప్రయోజనం లేదని తేలింది. హేతువాదాన్ని చంపడానికి ప్రయత్నించిన వివేకానంద దేశంలోని మూఢ విశ్వాసాలకు పునాదులు గట్టిపరచాడు. ఆధునీకరణ గావించడాన్ని పాశ్చాత్యంగా భోధించాడు.


రెండు వ్యక్తిత్వాలు :


వివేకానందలో రెండు వ్యక్తిత్వాలున్నవి ఒకటి దేశభక్తి, బాధితుల పట్ల ఆదరణ. దీనితోనే ఆయన చాలా మందిని ఉత్తేజపరచగలిగాడు. రెండవది వేదాంతసారమైన మాయావాదం. సంపన్నులంతా యీ మాయావాద వివేకానంద పట్ల ఆకర్షతులయ్యారే గాని, ఆయన సేవాతత్పరతను చూచికాదు. తప్పనిసరి పరిస్థితులలో బ్రహ్మచారిగా వుండిపోవలసిన వివేకానందను సన్యాసిని చేసి రామకృష్ణ మరీ యిబ్బంది పెట్టేశాడు. ప్రకృతి ఆయనపై కసి తీర్చుకోగా 39 సంవత్సరాలకే 1902లో వివేకానంద చనిపోయాడు.

రామకృష్ణ తెలిసీ తెలియక జమిందార్లకు ఉపయోగపడితే, వివేకానంద కావాలని జమిందార్లను వెనకేసికొని, వారికి అండగా నిలిచాడు. పేదల పొట్ట గొడుతున్న జమిందార్లను ప్రజల ఆగ్రహానికి గురికాకుండా వేదాంత చక్రాన్ని అడ్డేశాడు. దొపిడీ విధానానికి అణచివేతకు అండగా నిలిచాడు. పేదలపట్ల ఎంత జాలి చూపినా, జమిందార్లకే ఫలితం దక్కింది.


చిట్కాయోగం :


వివేకానంద యోగ ప్రచారాన్ని అగేహానంద భారతి విమర్శించాడు. ఆత్మ పరమాత్మల సంలీనాన్ని సూచించే లయ యోగానికి వివేకానంద రాజయోగం అనే ఆకర్షణీయ పదం వాడాడన్నారు. గురువు లేకుండా యోగం అభ్యసిస్తే ప్రమాదకరమని హెచ్చరించిన వివేకానంద, అలాంటి ప్రమాదాన్నే చిట్కా కరపత్రాలలో ప్రచారం చేశాడన్నారు. వైద్యం చేసేవారు నాలుగు రకాల డాక్టర్లన్నట్లు, యోగాన్ని 4 రకాలుగా వర్గీకరించి వివేకానంద ప్రచారం చేయడాన్ని భారతి పెద్ద దోషంగా పేర్కొన్నారు. రాజ, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల పేరిట వివేకానంద చేసిన ప్రచారం ఆధారంగా చాలా మంది పాశ్చాత్య లోకంలో, అదే పరమసత్యం అనే భ్రమలో వున్నట్లు భారతి చూపారు. పతంజలి యోగాన్ని వక్రీకరించిన వివేకానందను, కొందరు స్వాములు బాగా వాడుకుంటున్నారన్నారు.

Sunday, March 16, 2008

సాహితీపరులతొ సరసాలు-13


Bezwada Ramachandrareddi

బెజవాడ రామచంద్రారెడ్డి
(1894-1973)

మాట మధురం. రాత రమణీయం. రూపు గంభీరం. ప్రవర్తన హుందాగలది. బెజవాడ రామచంద్రారెడ్డి వ్యక్తిత్వ వర్ణనలో అతిశయోక్తి లేదు.
ఆయన పరిచయం అయ్యే నాటికి షష్ఠిపూర్తి చేసుకున్నారు. నావంటి గ్రాడ్యుయేట్ తో సన్నిహితంగా మిత్రుడుగా మెలగగలగడం, ఆకర్షించడం బెజవాడ రామచంద్రారెడ్డి విశాల దృక్పధమే కారణం.

1958 నుండీ 1973 వరకూ సన్నిహితులుగా వున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాం. ఆయన కార్డు రాస్తే సంతోషించేవాడిని. కారణం ఒక వైపు గోటితో చిత్రం గీసి పంపేవారు. అలాంటి నఖ చిత్రాలు దాచుకొని, చివరకు స్టేట్ పురావస్తు శాఖకు యిచ్చాను. సంజీవదేవ్ అక్షరాలవలె బెజవాడ వారి రాతచాలా చూడముచ్చటగా వుండేది.

బెజవాడ గోపాలరెడ్డికీ రామచంద్రారెడ్డికీ బంధుత్వం వుంది. కాని రాజకీయంగా శత్రుత్వమే. దక్షిణాదిన ఉద్యమ తీవ్రతకు పేరొందిన పెరియార్ రామస్వామి నాయకర్ ప్రభావితుడైన రామచంద్రారెడ్డి జస్టిస్ పార్టీలో చేరారు. ఆయన చదువుకూడా మద్రాసు పచ్చయప్ప కళాశాలలో. అది జస్టిస్ పార్టీకి కాణాచి. బి.ఎ. చదివి లా చేసి, 1923లో బార్ లో చేరికూడా, ఆయన ప్రాక్టీసు చేయలేదు. రాజకీయాలు, సాహిత్యంలో నిమగ్నులై, జీవితమంతా కాంగ్రెస్ వ్యతిరేకిగా, రైతు పక్షపాతిగా వుండేవారు.

బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర వారపత్రిక నెల్లూరు నుండి (1930-40) సంపాదకులుగా నడిపారు. ఆయన సాహిత్య పరిషత్తు అధ్యక్షోపన్యాసాలు, నాటక పరిషత్తు ప్రసంగాలు, రెడ్డి జనమహాసభలో సూచనలు, స్వతంత్రం ద్వారానే మనకు తెలుస్తున్నాయి.
1930 నాటికే మద్రాసు శాసన సభ స్పీకర్ గావడం, 1923 నుండే కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నిక అవుతుండడం రెడ్డి గారి జీవిత మలుపులే. చక్కగా టూకీగా ఆకర్షణీయంగా మాట్లాడడంతో ఆయన అందరినీ ఆకట్టుకోగలిగారు. అయితే 1937లో ఎన్నికలు జరిగినప్పుడు గోపాలరెడ్డి-రామచంద్రారెడ్డి కావలి నుండి పోటీ చేసారు. ఆనాడు ఒకే వేదిక నుండి ఉభయులూ ప్రచారం చేయడం విశేషం. జస్టిస్ పార్టీ పూర్తి ఓటమి చూడగా 7 వేల ఓట్లతో రామచంద్రారెడ్డి తన పరాజయం అనుభవించారు. గోపాలరెడ్డి 20 వేల ఓట్లతో గెలిచారు. పరిమిత ఓటర్లు వుండే వారని మనం గమనించాలి.

రాజకీయాలు ఎలా వున్నా రామచంద్రారెడ్డి గ్రాంధిక వాది సాహిత్య పరిషత్తు అధ్యక్షులుగా ఆయన చురుకైన పాత్ర వహించారు. కవులను, రచయితలను ప్రోత్సహించి, కొందరిని ఆర్థికంగా ఆధుకున్నారు. అవధానాలలో పాల్గొని పృచ్ఛకుడుగా వ్యవహరించారు. అనేక మంది రచయితలు ఆయన చేత పీఠికలు రాయించుకున్నారు.

నాటకాల పట్ల విపరీతమోజు చూపిన రెడ్డి గారు, కళల పోషణ జరగాలని కోరారు. పరిశోధన తత్వం గల వ్యక్తిగా నాటక చరిత్ర గమనించి, విశ్వవిద్యాలయాలలో నాటక కళపై దృష్టి పెట్టాలన్నారు.

మహాభారత ఉపన్యాసాలు 18 రోజులు జరిగితే, రెడ్డి గారు పాల్గొని, రోజూ వ్యాఖ్యానించేవారు. దక్షిణ భారత వ్యవసాయ సంఘం 1943లో స్థాపించి, రైతు రక్షణకు భిన్న తీరులలో కృషి చేశారు.

నెల్లూరులో జమీన్ రైతు వారపత్రిక నిరంతరం బెజవాడ రామచంద్రారెడ్డిపై వ్యంగ్య కార్టూన్లు ప్రచురించింది. 1952 తొలి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నెల్లూరు నుండి లోక్ సభకు రామచంద్రారెడ్డి ఎన్నిక అయ్యారు. నాడు సోషలిస్టు అభ్యర్థిగా ఆయనపై ఇస్కా రామయ్య కూడా పోటీ చేశారు.

నేషనల్ డెమొక్రటిక్ పార్టీ డెఫ్యూటి నాయకుడుగా రెడ్డి గారు లోక్ సభలో వుండగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ నాయకుడు. 1930 ప్రాంతాలలో స్వతంత్ర పత్రిక సంపాదకుడు 1960 నాటికి రాష్ర్ట స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు గావడం విశేషం. అప్పుడే రామచంద్రారెడ్డి గారితో నాకు పరిచయం. ఆయన రాజకీయాలతో నాకు నిమిత్తం లేదు. అయితే నాడు ఆచార్యరంగాకు నేను పి.ఎ.గా (ఆంతరంగిక కార్యదర్శి) వున్నందున ప్రముఖులతో సన్నిహితుడను కాగలిగాను.

రామచంద్రారెడ్డి గారితో 1959లో తొలిసారి బాపట్ల నుండి బొబ్బిలి వరకూ కారులో పర్యటించాను. మేముయిరువురమే వుండడంతో బోలెడు సాహిత్య, నాటక, కళారంగాల సంగతులు చెప్పారు. ఆయనలో సున్నిత హాస్యం వుండేది. ప్రసంగాలు హుందాగా సాగేవి. ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసాలు, నెహ్రూపై విమర్శలు యిష్టపడేవారు. రెడ్డి గారి సరసన రాజాజీని కలవడానికి, మాట్లాడడానికి అవకాశం లభించింది. అప్పటి నుండీ రెగ్యులర్ గా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం.

సాహిత్యంలో కొంత అభ్యుదయం, కొంత సనాతనత్వం మిళితం చేసిన రెడ్డి గారు, తనకు యిష్టమైన వారిని సత్కరించారు. త్రిపురనేని రామస్వామికి గుడివాడలో గండపెండేరం తొడిగిన ఖ్యాతి రెడ్డి గారిదే.

దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువాలతో ఆయనకు చాలా దగ్గర సంబంధాలుండేవి. కొప్పరపు కవుల మొదలు అనేక మందిని ఆయన ఆదరించారు. ప్రతాప రుద్రీయం వంటి నాటకాలు ఓపికగా తిలకించి, విశ్లేషించారు. 1935లో 110 కందపద్యాలతో మాతృశతకం రాశారు. తరువాత రచనలన్నీ వివిధ సంచికలలో, పత్రికలలో, కవికృతులలో కనిపిస్తాయి. ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వ విద్యాలయాలలో పాలక మండలి సభ్యుడుగా రెడ్డి గారు విద్యాభిలాషి. తిరుపతిలో సంస్కృత పరిషత్తు అధ్యక్షులు గానూ వున్నారు.


కవులపై చెణుకులు, అవదానాలలో సరసాలు, కొద్దిగా సెక్స్ జోక్ లు రెడ్డి గారి సొత్తు. రామచంద్రారెడ్డి గారి కుమారులలో పాపిరెడ్డితో నాకు దగ్గర సాన్నిహిత్యం వుండేది. ఓబులరెడ్డి, కృష్ణారెడ్డి, దశరధ రామిరెడ్డి, సీతారామిరెడ్డి గార్లతో హలో సహా సంబంధమే బెజవాడ రామచంద్రారెడ్డి గారి గ్రాంధిక వాదం నేడు అదృశ్యంకాగా, ఆయన పనిచేసిన జస్టిస్ పార్టీ స్వతంత్ర పార్టీలు కాలం చేశాయి. నెల్లూరు వర్ధమాన సమాజానికి రెడ్డి గారి పుస్తకాలు, పత్రికలు యిచ్చారు.

ఇక్కడ ప్రస్తావించిన అనేక విషయాలు నేను అడిగి తెలుసుకున్నవీ, వారు భిన్న సందర్భాలలో చెప్పినవీ వున్నాయి. రెడ్డి కుల సభలలో ఎందుకు పాల్గొన్నారో తెలియదు. జస్టిస్ పార్టీలో కొందరివలె ఆయన కులవ్యతిరేక ప్రచారం తీవ్రంగా చేయలేదు. కాని వాడుక భాషను గట్టిగానే నిరసించారు. రెడ్డి గారి చమత్కార బాణాలు : కాంగ్రెస్ కాల్బలము (వలంటీర్లు) పోలీసం లాఠీ దెబ్బలకు కాల్బలమునే చూపినారు అని స్వతంత్ర పత్రికలో రాశారు.

కొప్పరపు కవులతో అవధానంలో సృచ్చకుడుగా రవికలో రెండున్నవి అనే సమస్యను పూరణకుయిచ్చి నవ్వించారు. స్వతంత్ర, తెలుగు వార పత్రికను రామచంద్రారెడ్డి గారు సంపాదకుడుగా వదలేసినప్పుడు, మాలి సుబ్బ రామయ్య కొన్నాళ్ళు, వెన్నెల కంటి ఆంజనేయులు కొంతకాలం సంపాదక బాధ్యత వహించారు.

జాషువాకావ్యం ముంతాజు మహలుపై రామచంద్రారెడ్డి గారి వ్యాఖ్య.

కన్నెరాళ్ళ గూర్చి కట్టించె
షాజాను

తాజమహలు దివ్య తేజ మొదప

వన్నెగన్న చెన్ను వర్షించె జాషువ

తాజమహలు కవిత తేజమలర.

నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాళెంలో, బెజవాడ రామచంద్రారెడ్డి జరిపిన సాహిత్య గోష్టి కార్యక్రమాలు, కళాపోషణ గొప్ప జ్ఞాపకాలు.

రచనలు : మాతృశతకం, అనేక పీఠికలు, సాహిత్య ఉపన్యాసాలు, ఎడిటర్ : స్వతంత్ర
తెలుగు వార పత్రిక.

Monday, March 10, 2008

సాహితీపరులతో సరసాలు -12

Rachakonda Viswanadha Sastry

రావిశాస్త్రి

(1922-1993)

రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనలంటే ఎంతో మందికి యిష్టం లేదు. రావిశాస్త్రి ఏది రాసినా పడీ పడీ చదివి, అభినందించేవారెందరో! ఈ వైవిధ్యానికి కారణాలు లేకపోలేదు. విశాఖపట్నం ప్రాంతంలో భాష, యాస వంటబడితే నచ్చితే, రాచకొండకు తిరుగులేని అభిమానులౌతారు. లేకుంటే దూరంగా పెట్టేస్తారు.

సంస్కృతంలో కాళిదాసు రచనలకు ఉపమానాలు బాగా వన్నెతెచ్చాయంటారు. అదేమో గాని తెలుగులో ప్రజల భాషతో రాచకొండ ఉపమానాలు చాలా గొప్పగా వుంటాయి. బీనాదేవి తప్ప మరెవరూ ఆ దరిదాపులకు రాలేకపోయారు. రచనలతో బాటు కోర్టులను, ప్లీడర్లను, డాక్టర్లను, గుడిసెల జనాన్ని ఎంత పరిశీలించాడో రావి శాస్ర్తి. అది ఆయన జీవితమంతా కనిపిస్తుంది. సామాన్యుల జీవితాల్ని కథల్లో, నాటకాల్లో, నవలల్లో రాచకొండ రాసిన తీరు ఒక పట్టాన పట్టు బడేది కాదు.

1995 ప్రాంతంలో అమెరికాలోని ఫిలడల్ఫియాలో రాచకొండ నరసింహశాస్త్రిని కలిశాను. ఆయన రావి శాస్ర్తి సోదరుడుని తెలిసి, కాస్త ఇంటర్వ్యు చేశాను. తన సోదరుడి రచనలు కొన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయదలచినట్లు చెప్పారు. సంతోషించాను. కాని చాలా జటిలమైన ప్రయత్నం అన్నాను. రాచకొండ నుడికారంలోనే ఆ కష్టం వుంది. నరసింహశాస్త్రి డాక్టర్ గా రిటైర్ అయి, విశాఖకు వెళ్ళిపోయారు తరువాత.

గోరాశాస్త్రి నన్ను రాచకొండకు పరిచయం చేశారు. 1970 ప్రాంతాల్లో ఆరంభమైన ఆ పరిచయం చివరి దాకా సాగింది. మేము హైదరాబాద్ నియోమైసూరు కేఫ్ (అబడ్స్ సెంటర్) లో కలసినప్పుడు, సి. ధర్మారావు వచ్చి చేరేవారు.

రాచకొండ శిష్యుడు, మిత్రుడు, అనుచరుడు సంకు పాపారావును మిత్రుడు తుమ్మల గోపాలరావు పరిచయం చేశారు. పాపారావు అనేక విషయాలు చెప్పారు రాచకొండ గురించి, వారిద్దరికీ చివర్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, రాముడికి దేవాలయాలుంటే, హనుమంతుడికీ గుడులుంటాయని సంకు పాపారావు అనేవారు.

కన్యాశుల్కంలో, నిజం నాటకంలో రాచకొండ పాత్రధారి అయినప్పుడు చూచి సంతోషించాను. రాచకొండతో పరిచయమయ్యేనాటికే ఆయన రచనలు కొన్ని చదివాను. ఆ తరువాత చాలా చదివాను. నాకు బాగా నచ్చిన రచనలవి.

కనక మహాలక్ష్మికి మొక్కడం మొదలు విరసం (విప్లవ రచయితల సంఘం) వరకూ పయనించిన రావి శాస్త్రి చివరి దశలో అజ్ఞేయవాది (Agnostic) గా మిగిలానన్నాడు. రచనలకు పరిమితంగాని ఆచరణ వాదిగావడంతో 1975లో ఇందిరాగాంధి విధించిన ఎమర్జన్సీలో జైలు పాలయ్యాడు.

హాస్య ప్రియుడు రావిశాస్త్రి, చతుర సంభాషణకారుడు. బాగా ఔపోసనం నాలుగు పెగ్గులు పట్టించినప్పుడు సమయస్ఫూర్తి జోక్స్ చెప్పి, నవ్వించేవాడు. అందులో పచ్చివీ, ఎండువీ మిళితమై వుండేవి. ఒకసారి మాటల్లో ఒకాయన చెబుతూ రావిశాస్త్రి స్నేహితుని భార్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు. అయితే భోజనం ఎలా మరి అని రావిశాస్త్రి పరామర్శించాడు. వంటావిడ వుందని చెప్పగా మంచిదే... తింటాడన్నమాట అన్న రావిశాస్త్రి సమయోచిత శృంగార పలుకులు, విస్కీమత్తులో నవ్వులు పుట్టించాయి. కోర్టులో మాజిస్త్రేట్ బోనులోని ముద్దాయిని చూస్తూ అనుకున్నాడట. ఇంత చదువుకున్న నేనే దొంగలంజ కొడుకునైతే, వాడెలాంటి వాడు కావాలి అని, పూర్తి శిక్ష కుమ్మేశాడట.

రాచకొండకు ఇరువురు భార్యలు, విశాఖపట్నంలో రిక్షా వాళ్ళందరికీ ఆపద్భాంధవుడైన రాచకొండ తాగినప్పుడు ఎక్కడకు తీసుకెళ్ళాలో వారందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన ఒక రిక్షావాడు ఒకనాడు రాచకొండను అలాంటి దశలో పెద్ద భార్య దగ్గరకు తీసుకెళ్ళి తలుపు తడితే. ఏరా, ఆసికాలా, ఏసికాలా అంటూ తలుపేసుకున్నదట. అప్పుడు రెండో భార్య దగ్గరకు చేరేశాడట. స్వవిషయం చెప్పికూడా రాచకొండ నవ్వించాడు.

రాచకొండ సీరియల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడలేదు గాని, అచ్చయిన తరువాత చదివి ఆనందించిన పాఠకులలో నేనూ వున్నాను. ఆరు సారాకథలు, ఆరు సారోకథలు, నిజం నాటకం, రాజు మహిషి, సొమ్ములు పోనాయండి, అల్పజీవి అభిమాన రచనలు.

పేదల్ని ఆదుకునే ప్లీడర్ గా రావిశాస్త్రి ఒకసారి ఆసక్తికరమైన కేసును ఎదుర్కోవలసి వచ్చింది. రాజమండ్రిలో బోగం యువతికి అండగా నిలచినందుకు, నిరసనగా వినుకొండ నాగరాజు (కమెండో పత్రిక ఎడిటర్ ఉత్తరోత్తరా) కేసు పెట్టాడు. అది చాలా ఏళ్ళు సాగింది. చివరలో రావిశాస్త్రి స్వయంగా కోర్టులో నాగరాజును కలసి పరిచయం చేసుకున్నాడు. అలా ప్రత్యర్థి వచ్చి పరిచయం చేసుకోవడం నాగరాజును ఆశ్చర్యపరచింది. ఇద్దరూ హైదరాబాద్ లో మందు పార్టీ చేసుకుందామనుకున్నారు.

విరసం వారు రాచకొండను తమవాడిగా ముద్రవేసినా, కమ్యూనిస్టేతర వ్యక్తులతో రావిశాస్త్రి సన్నిహితంగానే మెలగాడు. గోరాశాస్త్రితో స్నేహమే అందుకు తార్కాణం. కథ చెప్పడమే కాదు వినడం కూడా తెలియాలంటాడు రావిశాస్త్రి.

విజయవాడలో ఒక సారి రావిశాస్త్రి రెస్కూ హోంకు వెళ్ళారు. వ్యభిచార వృత్తిలో వున్నవారిని తప్పించి, సాధారణ జీవితం గడపడానికి ఉద్దేశించిన ఆ
Rescue Homeలో రావిశాస్త్రికి లోగడ తెలిసిన వారెందరో వున్నారు. వారిని పేరు పేరునా పిలిచి పరామర్శించి, కష్టసుఖాలు తెలుసుకున్నారు. పక్కనే వున్న తుమ్మల గోపాలరావు యిదంతా చూచి, ఆశ్చర్యపోయారు. రావిశాస్త్రి వారి పట్ల కనబరచిన మానవ సంక్షేమ దృష్టి గమనార్హం.

సుంకు పాపారావు ఎన్నో అంశాలు ఆసువుగా రావిశాస్త్రికి చెబుతుండేవారు. పోలీస్ ఉద్యోగం చేసిన పాపారావు తన అనుభవాలను, పోలీస్ ధోరణిలో చెబితే, తన యితివృత్తాలుగా రావిశాస్త్రి వాడారు. అలాంటివి గుర్తించి పాపారావుకు ధన్యవాదాలు చెప్పారుకూడా. హనుమంతుడి తోక ఎంతుందో R & B (రోడ్డు భవనాల శాఖ) కొలిచిందా ఏమిటి అంటూ సుంకు పాపారావు యధాలాఫంగా హాస్యంగా వాడే విషయాలు రావి శాస్త్రి కలంలో నిలిచాయి.

రచనలు : దేముడే చేశాడు (కథ), అల్పజీవి (నవల), కధాసాగరం (నాటిక), వచ్చేకాలం (నాటిక), ఆరు సారాకథలు, నిజం (నాటకం), ఆరు చిత్రాలు (కథలు), ఆరు సారో కథలు, మరో ఆరు చిత్రాలు, రాజు మహిషి (నవల), విషాదం, కలకంఠి, బాకీ కథలు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, ఋక్కులు, రత్తాలు-రాంబాబు, సొమ్ములు పోనాయండి, మూడు కధల బంగారం నవల, ఇల్లు-నవల.

Thursday, March 6, 2008

సాహితీపరులతో సరసాలు -11Narla Venkateswararao
వి.ఆర్. నార్లతో మాటామంతీ, పిచ్చాపాటీ -2

అకాడమీలపేరిట జరిగిన కులప్రచారం, దుర్వినియోగాన్ని నార్ల విమర్శించి, వాటి రద్దుకు కారకులయ్యారు. ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా, నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహా దారుగా నియమించారు. అప్పుడు వచ్చిన ఫైళ్ళను నాకిచ్చి చూచి పెట్టమన్నారు. చేత నైనంత వరకు తోడ్పడ్డాను. 1982 నాటి మాట అది.

ఆంధ్రజ్యోతి యజమాని కె.ఎల్.ఎన్. ప్రసాద్ కు నార్లకు అభిప్రాయ భేదాలురాగా నార్ల అతి తీవ్రస్థాయిలో ఆయనపై దాడి చేశారు. ఇంటికి వచ్చిన వారికి ఆ విషయాలే ఏకరువు పెట్టేవారు. వద్దని ఆయన భార్య సులోచన చెప్పినా వినిపించుకోలేదు. కొందరు ఇంటికి రావడం మానేశారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్ లోగుట్టు అంతా నార్ల రట్టు చేసి, ఆయన్ను ఉతికేశారు. ఆవివాదంలో నేను నార్ల పక్షానే నిలిచాను. ఆంధ్రజ్యోతికి ఎడిటర్ గా రాజీనామా చేసిన ఘట్టం అది.

ఆంధ్రజ్యోతి స్థాపనకు ప్రధాన కారకుడు నార్ల. ఆయన్ను చూచి చాలా మంది షేర్లు కొన్నారు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త వరవడులు ప్రవేశపెట్టారు. 1970 ప్రాంతాలలో హైదరాబాద్ లో స్థిరపడి, సంపాదకీయాలు టెలిప్రింటర్ ద్వారా పంపేవారు. ఆయన రాత ఒక పట్టాన అర్థం అయ్యేదికాదు. ఉడయవర్లు అనే జర్నలిస్టు తిప్పలు బడి రాసి పంపేవాడు. నండూరి రామమోహనరావు కొన్నాళ్ళు నార్ల వలె సంపాదకీయాలు రాసే ప్రయత్నం చేశారు.

ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా నార్ల రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆయన్ను ఢిల్లీలో నేను కలిసినప్పుడు, మ్యూజియంలకు వెళ్ళేవాళ్ళం. నార్లకు వేలాది ఇంగ్లీషు, తెలుగు గ్రంథాలుండేవి. వాటి పోషణ అంతా ఆయన భార్య సులోచన చేబట్టింది. తమ పూర్వీకులు బ్రటిష్ సైన్యానికి ఎడ్ల బండ్లపై ఆహారం సరఫరా చేసే కంట్రాక్టు తీసుకున్నారని నార్ల చెప్పారు. ఆ విషయాలు వున్న గ్రంథాలు చూపెట్టేవారు. ఆయన చనిపోయిన తరువాత ఆ గ్రంథాల్ని ద్రవిడ పరిశోధనా సంస్థ పేరిట తార్నాకలో పెట్టాం. కాని అట్టే కాలం అది సాగలేదు. తరువాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి తరలించగలిగాం. అక్కడ సురక్షితంగా వున్నాయి. బౌద్ధానికి చెందిన కళాఖండాలు, మినీ విగ్రహాలు నార్ల సేకరించి ఇంట్లో పెట్టుకున్నారు. బిర్లా సంస్థ ఆడి గినా వారికి యివ్వలేదు.

తరచు ఆదివారాలు హైదరాబాద్ లో అబిడ్స్ ప్రాంతాన పేవ్ మెంట్స్ పై పాత పుస్తకాలు వెతికే నార్లకు నేను కూడా ఎప్పుడైనా జతగూడేవాడిని. ఆయనకు యీ అలవాటు మద్రాసులో మోర్ మార్కేట్ నుండి, విజయవాడ వీధుల ద్వారా హైదరాబాద్ వరకూ వచ్చింది. జీవిత మంతా అలాంటి అన్వేషణ చేశారు.

కార్ల్ మార్క్స్ కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం అనే వ్యాసాలు పరిశోధనాత్మకంగా రాశాను. వాటిని ఆంధ్రజ్యోతిలో ఆదివారాలు 1975 ప్రాంతాల్లో ప్రచురించారు. తొలుత వీటిని నండూరి రామమోహనరావు అభ్యంతర పెట్టారు కాని నార్ల

ఆదేశాల మేరకు ప్రచురించగా, సంచలనం ఏర్పడింది. సమాధానం రాయమని మాకినేని బసవపున్నయ్యను అడిగారు. ఆయన రాయలేదు. మిగిలిన కమ్యూనిస్టు లెవరూ రాయలేకపోయారు.

జి.వి. కృష్ణారావు బి.ఎ. డిగ్రీతోనే 1950 ప్రాంతాల్లో పింగళి సూరన కళాపూర్ణోదయంపై పి.హెచ్.డి. సిద్ధాంతం ఇంగ్లీషులో రాసి మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఆయన ఇంగ్లీషు బాగా లేదని ఎగ్జామినర్లు ఒక పట్టాన థీసిస్ను అంగీకరించలేదు. బోర్డులో పింగళి లక్ష్మీ కాంతం వంటి పండితులున్నట్లు నార్ల తెలుసుకున్నారు. వారిచ్చిన అభిప్రాయంలోనే ఇంగ్లీషు తప్పులు చూపి, వీరికి తప్పుల పట్టే అర్హత లేదని, కుల పక్ష పాతంతో కుంటి సాకులు పెడుతున్నారని, నార్ల వైస్ ఛాన్సలర్ కు తీవ్రస్థాయిలో రాశారు. అది తెలిసి తక్షణమే పి.హెచ్.డి. యిచ్చేశారు. ఆ తరువాత నేను దానిని తెలిగించి గోలకొండ పత్రికలో సీరియల్ గా (1962లో) ప్రచురించాను.

సాహిత్యాన్ని, జర్నలిజాన్ని ఔపోశనం పట్టిన నార్ల, కళాభిమాని. సంజీవదేవ్ వంటి వారిని పరిచయం చేశారు. రచనలతో ఉద్యమాలు నడిపిన దిట్ట. స్వయంగా స్వాతంత్రోద్యమంలోనూ, ఆంధ్ర రాష్ట్రం కోసం, విశాలాంధ్ర నిమిత్తం పోరాడారు. ఏది చేసినా తీవ్రస్థాయిలోనే వుండేది.

నార్లకు నేను చాలా సన్నిహితుడనయ్యాను. ఆయన వాయిస్ రికార్డు చేస్తూ, జీవితాను భవాలను ఇంటర్వ్యూగా రూపొందించాం. ఇందులో కె.బి. సత్యనారాయణ (బుక్ లింక్స్ సంస్థ యజమాని) పి. సత్యనారాయణ కూడా వున్నారు. 1930 నుండీ 1984 వరకూ నార్ల రచనలు చేశారు. విదేశాలు పర్యటించి, కళాఖండాలు, సాహిత్యం పరిశీలించారు. రాజ్య సభ సభ్యుడుగా అంత రాణించలేదు. తన అనుభవాలను, ఆలోచనలను అనేక పర్యాయాలు నాకు చెప్పారు. అది గొప్పనిధి.

నార్ల ఎప్పుడూ ఏదొక రుగ్మతతో బాధపడుతుండేవారు. మధురాపుట్ అని కాలికి జబ్బు. గుండెపోటు రెండు సార్లు వచ్చింది. విపరీతంగా తాగే సిగరెట్లు అప్పటితో మానేశాడు. కొన్నాళ్ళు చెవుల్లో రొదతో సతమతమయ్యారు. ఆ దశలో పావులూరి కృష్ణ చౌదరి ప్రవేశించి హోమియో చికిత్స చేశారు. అది అశాస్త్రీయమని, దాని వలన నయం కాదని నేను చెప్పేవాడిని. చివరకు నా మాటే నిజమైంది. తియ్యటి మాత్రలతో తీవ్రరోగాలు నయంకావని, హోమియోలో నిరూపణ అయిన మందు లేదని తేలింది. చివరకు నార్ల నా వాదన అంగీకరించారు. హోమియో వైద్యానికి స్వస్తి పలికారు.

నార్ల తన సుదీర్ఘ అనుభవాలలో అనేకం నాకు వెల్లడించేవారు. ఆయనకు త్రిపురనేని రామస్వామి రచనా శైలి నచ్చలేదు. త్రిపురనేని గోపీచంద్ కు ఆయనకూ పడలేదు. గోపీచంద్ ఆపదలో వున్నప్పుడు సహాయపడినా, విశ్వాసం లేదని నార్ల అనేవాడు. కాని గోపీచంద్ చనిపోయినప్పుడు ఎంత గుండె గలవాడికీ గుండె పోటు అంటూ ఎత్తుగడతో గొప్ప సంపాదకీయం రాశారు.

నార్ల దగ్గర వుద్యోగం చేసిన తిరుమల రామచంద్ర వెర్రి వేషాలేస్తే, ఉద్యోగానికి వుద్వా సన చెప్పారు. అప్పుడు వేటూరి ప్రభాకర శాస్త్రి వచ్చి, చేతులు పట్టుకొని, వాడు బుద్ధి హీనుడు, కాని ఉద్యోగం లేకపోతే బ్రతకలేడు. దయచేసి ఉద్యోగం యివ్వండి. నేను హామి యిస్తున్నాను అని రామచంద్ర పక్షాన అన్నారు. నార్ల ఆయన మీద గౌరవం కొద్దీ ఉద్యోగం యిస్తే మళ్ళీ కొన్నాళ్ళకు తోకాడించాడు. తిరిగి ఉద్యోగం కోల్పోయాడు. ప్రభాకరశాస్త్రి (మీగడతరకలు ఫేం) ఏమీ అనలేక నొచ్చుకున్నారు.

నార్ల ఏ రాజకీయ వాదినీ వదలలేదు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఆయన కలానికి గురైన వారే. కమ్యూనిస్టులను వెంటాడి బాదేసిన ఖ్యాతి నార్లదే. ఎన్.జి. రంగాపై ధ్వజం ఎత్తినప్పుడు, గోగినేని రంగనాయకులు అని పతాక శీర్షికలతో రోజూ ఆయన వార్తలు ప్రచురించేవారు. రంగా గింజుకున్నారు. అమ్మ నాన్న పెట్టిన పేరు వాడితే అంత గింజులాట దేనికి అని నార్ల అనేవాడు. ఏడిపించడంలో నార్ల జర్నలిజాన్ని అలావాడారు.

మీరు మేము అనే విచక్షణ చూపిన సంజీవరెడ్డిపై రోజూ కార్టూన్లు వేయించి (వాసు కార్టూనిస్టు) తల తిరిగేటట్లు చేయగలిగిన సత్తా నార్ల జర్నలిజానిదే. ప్రెస్ బిల్లు పెట్టి పత్రికా స్వాతంత్యాన్ని హరించాలని బ్రహ్మనంద రెడ్డి తలపెడితే, నార్ల ప్రతిఘటించిన తీరు, 1968లో జర్నలిజానికి వన్నె తెచ్చింది.

మూడు దశాబ్దాలు పేరిట నార్ల సంపాదకీయాలు వెలువడినప్పుడు వాటిని నమూనాగా తీసుకొని ఎ.బి.కె. ప్రసాద్ వంటి వారు తమ సంపాదకీయాలు వేసుకున్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావుకు నార్లను పరిచయం చేశాను. ఆయనెంతో సంతోషించారు.

నార్లకు ఆయన కుటుంబానికీ నేను సన్నిహితం కావడంతో, నార్ల పుస్తకానికి నాకుమార్తె నవీన, నాకుమారుడు రాజు ఇండెక్స్ తయారు చేసిపెట్టారు. Man and his world లో నార్ల ఆ విషయంరాశారు.

నార్లలో భిన్న కోణాలు, రాగద్వేషాలు చూపడానికి యిన్ని వివరాలు రాశాను.

రచనలు : కొత్తగడ్డ - నాటికలు, జగన్నాటకం, నేటి రష్యా, జాబాలి, సేత జోస్యం, నరకంలో హరిశ్చంద్ర పాంచాలి (నాటకాలు), నవయుగాలు బాట (పద్యాలు), మాటమంతీ, పిచ్చాపాటీ (వ్యాసాలు).

English: The Truth about the Gita, An essay on Upanishads, Man and his World, Gods Goblins and Men, Vemana, Gurajada, Veeresalingam.

Monday, March 3, 2008

సాహితీపరులతో సరసాలు -10


Narla Venkateswararao

వి.ఆర్. నార్లతో మాటామంతీ, పిచ్చాపాటీ

(నార్ల వెంకటేశ్వరరావు - 1908-1985)

ఒకనాడు పొద్దున్నే నార్ల వెంకటేశ్వరరావు యింటికి వెళ్ళాను. కొత్తగా రాసిన నరకంలో హరిశ్చంద్ర నాటకం నా చేతిలో పెట్టారు. తెరిచి చూడగా, నాకు అంకితం యిచ్చినట్లున్నది. ఆశ్చర్యపోయి ధన్యవాదాలు చెప్పాను. చివరిదశలో మేమిరువురం అంత సన్నిహితులమయ్యాం.

1970 ప్రాంతాల నుండే నాకూ నార్లకూ పరిచయమైంది. ఆయన్ను మొదటిసారి 1955లో గుంటూరులో చూశాను. హైస్కూలు రోజులనుండీ ఆంధ్రప్రభ, ఆ తరువాత ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు చదివాను.

1954లో ఎం.ఎస్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే తారరాలింది, వటవృక్షం కూలింది అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవులగోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా దెప్పిపొడిచారు. అది బాగా ఆయనకు గుచ్చుకున్నది. వెంటనే గుత్తి కొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. అవి కళ్ళు తెరిపించగా, నార్ల అప్పటి నుండీ రాయ్ అభిమానిగా, క్రమేణా మానవవాదిగా పరిణమించారు. ఆ దశలో మాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఏర్పడింది.

1970 నుండీ అనేక చిన్న, పెద్ద సమావేశాలకు నేను నార్ల ను ఆహ్వానించగా వచ్చి ప్రసంగించారు. అఖిల భారత హ్యూమనిస్టు నాయకులు వి.ఎం. తార్కుండే, ఎ.బి.షా, ప్రేమనాధ్ బజాజ్, వి.బి. కర్నిక్ వంటి వారిని ఆయనకు పరిచయం చేశాను. కలకత్తాలో మినర్వా అసోసియేట్స్ ప్రచురణ కర్త, హ్యూమనిస్టు సుషీల్ ముఖర్జీని పరిచయం చేయడమే గాక ఆయన ద్వారా నార్ల పుస్తకాలు ప్రచురింపజేశాను. (Gods, Goblins and Men) రచన అలా వచ్చిందే. తన పుస్తకాలు వి.ఎం., తార్కుండే, ప్రేమనాధ్ బజాజ్లకు నార్ల అంకితం యిచ్చారు కూడా. ప్రేమనాథ్ బజాజ్ రాసిన గీత విమర్శ నార్లను ప్రేరేపించగా, దిట్రూత్ ఎబౌట్ గీత రాశారు. బ్రతికుండగా అది ప్రచురణ కాలేదు. ఆయన తదనంతరం నేను ప్రచురించాను. అంతే కాకుండా, తెలుగులో గీతా రహస్యంగా వెలువరించి, e-book (http://naprapamcham.blogspot.com/2007/11/e.html) గా కూడా పాఠకులకు అందచేశాను.

జర్నలిస్ట్ గా ప్రారంభమైన నార్ల, రచయితగా, విమర్శకుడుగా రాణించాడు. నార్లకు రాగద్వేషాలు మెండు. విశ్వనాధ సత్యనారాయణపై విరుచుక పడిన వారిలో నార్ల ప్రముఖుడు. సంపాదకీయాల ద్వారా పుస్తక పరిచయం చేసిన ఒరవడి కూడా నార్లదే.

నార్ల ద్వారా నాకు కొందరు ప్రముఖులు పరిచయమయ్యారు. అందులో ఎం. చలపతిరావు ఒకరు. ఆయన నార్ల ఇంట్లో వుండేవారు. నాకు పరిచయమైన నాటికి విపరీతంగా నత్తి వుండేది. ఆయన సంపాదకీయాలు, నేషనల్ హెరాల్డ్ లో పెద్ద ప్రవాహం వలె పారేవి. తన అభిప్రాయాలు, అనుభవాలు చెప్పేవారు. మరొకరు గూటాల కృష్ణమూర్తి. ఆయన విశాఖవాడైనా, లండన్ లో స్ధిరపడ్డారు. 1890 ప్రాంతాలలో సుప్రసిద్ధ రచయితలంతా పుట్టారని ఆయన నమ్మకం. వారి రచనలు గిల్డ్ ప్రచురణలు చేసి, పరిమిత ప్రతులు వేసేవారు. చాలా అందంగా వుండేవి. విద్యాన్ విశ్వం కూడా నార్ల ద్వారానే నాకు పరిచయమయ్యారు.

నార్లను సభలకు పిలిచినప్పుడు ఆయన ప్రసంగాలు ఆకర్షణీయంగా వుండేవి కావు. విషయం వున్నా, ఆయన సభారంజకుడుకాదు. రచనలలో వున్న పట్టు, ప్రసంగాలలో లేదనిపించేది. నార్లకు వ్యక్తుల పట్ల అభిమానాలు ద్వేషాలు తీవ్రస్థాయిలో వుండేవి. ఎవరినైనా విమర్శించదలిస్తే బాగా పూర్వాపరాలు తెలుసుకొని ధ్వజమెత్తేవారు.

గురజాడ లేఖలు, రచనల విషయమై నార్ల తీవ్రస్థాయిలో స్పందించారు. గురజాడపై మోనోగ్రాఫ్ రాశారు. అవసరాల సూర్యారావు, గురజాడ ఇంగ్లీషు, అర్థం చేసుకోలేక తప్పుగా రాశాడని నార్ల ఉద్దేశ్యం. ఆ విషయంలో ఆయనకు కమ్యూనిస్టులకూ తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చాయి. కమ్యూనిస్టులు సూర్యారావును వెనకేసుకొచ్చారు. ఆ సాహితీ యుద్ధంలో, నార్లను తొలుత సమర్ధించిన పురాణం సుబ్రహ్మణ్యశర్మ, ఒకదశలో కమ్యూనిస్టులను వెనకేసుకొచ్చారు. దాంతో నార్లకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అప్పట్లో నార్ల వద్ద ఉద్యోగం చేస్తున్న పురాణం, తన తప్పు తెలుసుకున్నారు. ఒకనాడు నేను నార్ల యింటికి వెళ్ళేసరికి, పురాణం సాక్షాత్తూ నార్ల కాళ్ళ మీద బడి, తప్పయింది క్షమించమని వేడుకుంటున్నాడు. క్షమించాను పో అని నార్ల అన్నారు. సాహిత్య రంగంలో అవకాశ వాదాలు అలా వుంటాయి. అవసరాల సూర్యారావుకు, ఇంగ్లీషు సరిగా రాని మాట వాస్తవమే అయినా, ఆయన చిత్త శుద్ధిని శంకించ వీల్లేదని చలసాని ప్రసాదరావు వంటివారనే వారు. చిత్త శుద్ధితో తప్పు చేస్తే ఒప్పుకోవలసిందేనా?. అవును అంటారు కమ్యూనిస్టులు!. అది నార్ల ఒప్పుకోలేదు.

వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వాఙ్మయ మహాధ్యక్ష అని బిరుదు తగిలించుకొని, విమర్శనా రచనలు చేస్తుండేవారు. ఆయన ఓరియంటల్ తాళపత్ర గ్రంథాల పీఠానికి, డైరెక్టర్ గా వున్నారు. ఎక్కడ పేచీ వచ్చిందో తెలియదు గాని, నార్ల అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అతడి సెక్స్ దుర్వినియోగం మొదలు అవినీతి వరకూ బయటపెట్టి వుతికేశారు. మంత్ర శక్తితో ప్రత్యర్థిని నాశనం చేయగలనని బెదిరించే గోపాలకృష్ణయ్య నార్లను తట్టుకోలేక పోయారు.

విశ్వనాథ సత్యనారాయణపై నార్ల కేవలం విమర్శించడమే గాక, సంపాదకీయాల ద్వారా అతడి కుల విషబీజాల్ని, ఛాందసహైందవ అహంకారాన్ని బట్టబయలు చేశారు. ఆ సంపాదకీయాన్ని మళ్ళీ వేయమన్నప్పుడు నండూరి రామమోహనరావు నిరాకరించాడు. అది చిలికి చిలికి పెద్ద కలహంగా మారింది. 1978-79 నాటి మాట అది. చివరకు నార్ల ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా రాజీనామా చేశారు.

నార్ల వెంకటేశ్వరరావు ఎమర్ఙన్సీలో ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా ప్రొటెస్ట్ చేశారు. సంపాదకీయం స్థానంలో ఏమీ రాయకుండా వదలేయమన్నారు. నండూరి రామమోహన రావు పిరికివాడు బయపడి, యజమాని కె.ఎల్.ఎన్. ప్రసాద్ ఆజ్ఞానుసారం సంపాదకీయాలు రాశాడు. నార్ల తీవ్ర అభ్యంతరపెట్టి రాజీనామా చేశాడు. ఎమర్జన్సీలో కొంత కాలం అమెరికా వెళ్ళి పర్యటించి వచ్చారు. నండూరి రామమోహనరావును గుమస్తా సంపాదకుడు అనేవాడు. నార్లను అనుసరించి, అలాగే సంపాదకీయాలు రాయాలని నండూరి ప్రయత్నించాడు. జర్నలిస్టుగా సొంత వ్యక్తిత్వం నిలబెట్టుకోలేని నండూరి రామమోహనరావు గుమస్తా ఎడిటర్ గానే మిగిలిపోయాడు.

నార్ల రాజ్యసభ సభ్యుడుగా 12 ఏళ్ళు వున్నారు. అప్పటి అనుభవాలు చెప్పేవారు. ఇందిరాగాంధి పట్ల తీవ్ర ద్వేషం పెంచుకున్నారు. ఆమె కుటుంబవారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. పౌరహక్కులు, మానవ విలువలు కావాలనేవారు. ఆ విషయంలో జయప్రకాశ్ నారాయణను మెచ్చుకునేవారు.

నార్ల కళాభిమాని, బౌద్ధ కళల పట్ల ప్రత్యేక అభిరుచి, విదేశాలలో సేకరించిన బౌద్ధ మినీ విగ్రహాలు, కళాఖండాలు అట్టి పెట్టేవారు. శివుడు, కృష్ణుడి పరంగా వచ్చిన కళా ఖండాల్ని కూడా సేకరించారు. మ్యూజియంలో, శిల్ప సౌందర్యాలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వాటి విశేషాలు చెప్పేవారు.

నవయుగాల బాట నార్ల మాట అనే మకుటంతో, పద్యాలు రాశారు. మొత్తం వెయ్యి పూరించాలని వుందనేవారు. వాటిని హైదరాబాద్లో సైంటిఫిక్ సర్వీసెస్ సంస్థ పక్షాన గోపాలరావు ప్రచురించారు. పద్యాలు రాస్తున్నప్పుడే చదివి వినిపించి, అభిప్రాయం అడిగేవారు. చనువు కొద్దీ నేను కొన్ని సూచనలు చేయగా ఆమోదించేవారు. కొన్ని పద్యాలు కొందరు వ్యక్తుల్ని ఉద్దేశించి రాస్తున్నట్లు చెప్పేవారు. పేర్లు లేవు గనుక, భావితరాల వారికి అవి సాధారణ సూత్రాలుగానే వుంటాయి.

ఇంగ్లీషులో తరచు వచ్చిన ఆలోచనల్ని కూడా చిన్న వాక్యాలుగా రాయగా Man and His world పేరిట అచ్చు వేయించాం. గోపాలరావు ప్రచురించారు. నార్ల పుస్తకాలు రాస్తున్నప్పుడు ఆయన ఇంగ్లీషు పట్ల ఆయనకే అంత గట్టి విశ్వాసం లేదు. డి. ఆంజనేయులు వాటిని చూచి సవరించేవారు. ఏమైనా ఇంగ్లీషు రచనలు అంత బాగాలేవు.

గీత పై విమర్శ రాయడంలో చాలా రిఫరెన్స్ లు నార్ల వాడారు. అనేక రచనలు పరిశీలించారు. అలాగే ఉపనిషత్తులపై నిశిత పరిశీలనా వ్యాసం పూర్తి చేశారు. నాటకాలు రాసినప్పుడు ముందుగా చదివించి, అభిప్రాయ సేకరణ చేసేవారు. ఆయన రాసిన సీత జోస్యం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. అకాడమీ పత్రికలోనే ఆ నాటకాన్ని దుయ్యబడుతూ సమీక్ష రాయడాన్ని నార్ల తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. అదొక రసాభాసగా మారింది.

నార్ల ఇంగ్లీషు రచనలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. కందుకూరి, గురజాడ, వేమన యీ విషయంలో పేర్కొన్నదగినవి. నార్ల తెలుగు నాటికలు కొత్తగడ్డ పేరిట రాగా అవి కొన్ని స్టేజిపై ప్రదర్శించారు గూడా. తెలుగు జాతీయాలు, నుడికారం బాగా ప్రయోగించారు. (To be contd….)