Saturday, January 31, 2009

డి.వి. నరసరాజుతో

left Gorantla Veeraiah,Innaiah,D.V.Narasaraju, Producer Rajendraprasadనరసరాజు కొద్ది రోజుల్లో చనిపోతాడనగా హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఆయన ఇంటికి వెళ్ళి చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. నరసరాజు గారు రాతలోనే కాక మాటలోనూ హాస్య ప్రియుడు. అటు సినిమాల్లోనూ, ఇటు నాటకాల్లోనూ ఎన్నో విశేషాలు, నేపధ్య రంగంలో జరిగిన వింతలు చెప్పి నవ్వించారు. నాతో పాటు సినిమా ప్రోడ్యూసర్ కోగంటి వీరయ్య చౌదరి ఉన్నారు. ఆయన ఒకప్పుడు ‘గడసరి అత్త-సోగసరి కోడలు’ సినిమా తీశారు. గుంటూరు జిల్లా పరుచూరులో చదువుకున్నారు. అప్పుడు కుల నిర్మూలన సంఘ నాయకుడు డి.జి. రామారావు ఆయనకు కొన్నాళ్ళు టీచర్ గా ఉన్నారు. తరువాత గుంటూరులో భట్టిప్రోలు హనుమంతరావు, ఎలవర్తి రోశయ్య వద్ద అనేక హేతువాద మానవవాద భావాలు సంతరించుకున్నారు. వీరయ్య చౌదరి, అనిశెట్టి రాసిన కులం లేని పిల్ల నాటకంలో పాత్ర వహించారు. ఆ డైలాగ్ లు ఇప్పటికి కంఠత చెపుతారు. ఎమ్.ఎన్. రాయ్, అంబేద్కర్ బావాల ప్రభావితుడు. మాతో పాటు వచ్చిన మరొక సినీ నిర్మాత రాజేంద్ర ప్రసాద్. ఆయన రామానాయుడుతో కలసి సినిమాలు తీశారు. ఆ రంగంలో విశేష అనుభవం కలవారు. నరసరాజు గారు ఆ నాడు పాత అనుభవాలను నెమరు వేస్తూ ఎన్నో ఆసక్తి కరమైన సంగతులు చెప్పారు.
నరసరాజు గారిని నేను, ఆలపాటి రవీంద్రనాథ్ ఎన్నోసార్లు ఉషాకిరణ్ (రామోజీరావు సినీ ఆఫీసు) లో కలిసేవాళ్ళం. మేం ముగ్గురం ఎమ్.ఎన్. రాయ్ ప్రభావితులం కావటం వల్ల అనేక పాత సంగతులు ముచ్చటించుకునే వాళ్ళం. రామోజీరావు ఎంత బలవంతం చేసినా చివరి రోజుల్లో నరసరాజు అక్షింతలు శీర్షిక ఈనాడులో మానేశారు. వృద్ధాప్యం వలన పాఠకులను బోరు కొట్టరాదని ఆయన నిర్ణయించుకుని అలాచేశారు. నరసరాజు గారిని సుప్రసిద్ధ హేతువాది వెంకటాద్రికి పరిచయం చేశాను.

Tuesday, January 27, 2009

తస్లీమా సాహసోపేత జీవితం
left Prof Amlan Datta -vice chancellor of Viswa Bharati University, Taslima Nasrin, N.Innaiah in Delhi ,Gandhi peace foundation ,meeting of Indian Renaissance Association 2005

తస్లీమా
1992లో అమెరికాలో మేరీలాండ్ యూనివర్సటీలో తస్లీమాను మొదటిసారిగా నేను కలిశాను. నాతోపాటు నా భార్య కోమల కుమార్తె డా. నవీన ఉన్నారు. యూనివర్సిటీలో ఇరాన్ విద్యార్థుల అభ్యుదయ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో తస్లీమా మాట్లాడి, తన కవితలు చదివి వినిపించింది. ప్రశ్నలకు సమాధానమిచ్చిది. ఆమె ఇంగ్లీషులో నెమ్మదిగా మాట్లాడుతుంది. రాతలో ఉన్న బలం మాటలలో కనిపించదు. సమావేశానంతరం ఆమెతో కలిసి మాట్లాడి ఫొటోలు తీయించుకుని యింటికి ఆహ్వానించాను. అప్పటికే ఆమెపై ఛాందస ముస్లిములు ఫత్వా జారీ చేయటం, ఆమె తన స్వదేశమైన బంగ్లాదేశ్ వదలి స్వీడన్ ఆశ్రయం పొందటం ఒక చరిత్ర..
రెండవసారి తస్లీమా నస్రీన్ ను న్యూయార్క్ లో వారెన్ ఎలెన్ స్మిత్ (హూ ఈజ్ హూ ఇన్ హెల్ ఫేమ్) తో ఒక విందులో కలసి చాలాసేపు కాలక్షేపం చేశాం. అప్పట్లో తస్లీమా విపరీతంగా సిగరెట్లు తాగేది. నేను చనువుగా అది మానేయమని సలహా ఇచ్చాను. నా సలహా వలన కాకపోయినా ఉత్తరోత్తరా మానేసింది. అప్పుడు కూడా ఫొటోలు తీయించుకున్నాము. వారెల్ ఆమెకు సంరక్షకుడుగా అప్పటినుండీ ఆమె వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఎన్నో విధాల తోడ్పడ్డాడు.
తస్లీమా కవితలు ది గేమ్ ఇన్ రివర్స్ అనే శీర్షికన వెలువడ్డాయి. వాటిలో కొన్ని తెలుగులోకి నా భార్య కోమల అనువదించింది. ఇసనాక మురళీధర్ కొన్ని గేయాలు తెలుగులోకి తెచ్చారు. తరువాత ఆమె గేయాలు రచనలు అనువదించటానికి అనుమతిచ్చింది. తస్లీమా బెంగాలీలో రచనలు చేస్తుంది. వివిధ భాషలలోకి అవి వచ్చాయి.
తస్లీమా విదేశాలలో పర్యటించటం, ఐక్యరాజ్య సమితి బహుమతులందుకోవడం, సెక్యులర్ హ్యూమనిస్టులు ఆమెకు మద్దతుగా నిలవడం, క్రమేణా ఆమె కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించటం తెలిసినదే. మరోవైపు ఆమె రచనలను ఖండిస్తూ, ఇస్లాం పైన దాడి చేసినదని కనుక ఆమెను చంపేయాలని ముస్లిం సనాతనులు పిలుపు ఇచ్చారు. అందువలన భారత దేశంలో కూడా ఆమె రహస్యంగానే బతకవలసి వచ్చింది.
ఢిల్లీలో పునర్వికాస సంస్థ వారు ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించింది. గాంధీ పీస్ ఫౌండేషన్ లో ఆమెకు వసతి కల్పిస్తే బొత్తిగా సౌకర్యాలు లేవని బాధపడింది. ఇరువురం ఢిల్లీలో కానాట్ సర్క్ ల్లో హోటలుకు వెళ్లి భోజనాలు చేశాం. తరువాత నేను, ఇసనాక మురళీధర్ కలకత్తాలో ఆమె నివాసానికి వెళ్ళాము. స్వయంగా వంట చేసి వడ్డించింది. తన పెయింటింగులు చూపింది. ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం.
తస్లీమా లజ్జ అనే పుస్తకాన్ని రాస్తూ బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిములు జరిపిన అత్యాచారాలను ఏకరువు పెట్టి తీవ్ర నిరసన తెలిపింది. అంతటితో ముస్లిములు విచక్షణ విస్మరించి ఆమెపై విరుచుకు పడ్డారు. తస్లీమాకు డాక్టరుగా ప్రాక్టీసు ఉండేది. అది వదిలేసి భర్తను కూడా వదిలేసి పారిపోవలసి వచ్చింది. మళ్లీ తల్లి చనిపోయినప్పుడు రహస్యంగా వెళ్లి చూచి ఏదో ఒక విధంగా బయటపడింది. ఆమె విస్తృతంగా తన జీవిత చరిత్రను రాసి ముస్లిం సమాజాన్ని స్త్రీల పట్ల వారి అమానుషత్వాన్ని, చిన్నతనం నుండీ ఇస్లామును నూరిపోసే నిరంకుశత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఆమె గ్రంథాలన్నీ బంగ్లాదేశ్ లో నిషేధించారు. చివరకు చాలా అభ్యుదయ వాదులమని చెప్పుకునే కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్ లో పరిపాలిస్తూ కూడా ఆమె రచనలు నిషేధించటం సిగ్గు చేటు. కలకత్తా హైకోర్టు ఆ నిషేధాన్ని తొలగించింది.
షోద్ అనే తస్లీమా రచనను చెల్లుకు చెల్లు అనే పేరిట తెలుగులో కోమల అనువదించింది. దాని ఆవిష్కరణకు తస్లీమా 2007 ఆగస్టు 9న హైదరాబాదు వచ్చింది.
కోమల అనువదించిన యంగ్ చాంగ్ పుస్తకం అడవి గాచిన వెన్నెల ను ఆగస్త్ 9, 2007 న తస్లీమా ,చెల్లుకు చెల్లు థోపాటు విడుదల చేశారు.
ప్రెస్ క్లబ్బులో కార్యక్రమమంతా ముగిసిన తరువాత ముగ్గురు మజ్లీస్ శాసన సభ్యులు తమ అనుచరులను వెంట బెట్టుకుని తస్లీమాపై అమానుషంగా దాడి చేశారు. పోలీస్ సహాయంతో ఆమె కలకత్తా వెళ్లినా ముస్లిం సంఘాలు వెంటబడ్డాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఆమెకు అండగా నిలవలేదు. దేశంలో ఉండనిస్తామంటూ జైలులో పెట్టినట్లు ఆంక్షలు విధించారు. దేశం వదిలి వెళ్ళిపోయి కొన్నాళ్ళకు తిరిగి వచ్చినా పరిస్థితి మారలేదు. సెక్యులర్ ప్రభుత్వమని చెప్పుకునే వారు ఇలాంటి ధోరణి అవలంబించటంతో తస్లీమా వెళ్లిపోవలసి వచ్చింది. కలకత్తాలో ఉంటే బెంగాలీ మాట్లాడుకోవచ్చని, తను పుట్టి పెరిగిన సంస్కృతికి చేరువగా ఉంటానని ఆమె ఆశించింది. చివరకు సాల్మన్ రష్డీ, అయన్ హర్షీ అలీ విదేశాలలో ఉండవలసి వచ్చింది.
see the website: http://taslimanasrin.com

Sunday, January 25, 2009

బ్రస్సెల్స్ పర్యటన విశేషాలు


(left Frederic ,humanist youth leader, next Innaiah, Sonia Egrix president International Humanist association,


బ్రస్సెల్స్ లో నేను పర్యటించినప్పుడు అక్కడ ఓపెన్ యూనివర్సిటీ వారు పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపన్యాసం ఇవ్వమని ఆహ్వానించారు. హ్యూమనిస్టు యువ నాయకుడు ఫ్రెడరిక ఏర్పాట్లు చేశారు. ప్రశ్నలు సమాధానాలు రూపంలో సాగిన ప్రసంగం ఆసక్తి దాయకమైన చర్చకు దారితీసింది. హోమియోపతి ఒక మూఢ నమ్మకంగా చూపిన విషయంపై యువత బాగా పాల్గొన్నారు. హోమియోలో ఎలాంటి మందును చూపలేక పోయారనేది అప్పటికే స్థానిక హ్యూమనిస్టులు ప్రదర్శించారు. ప్రసంగం అనంతరం అభినందన పూర్వకంగా నాకు ఒక వైన్ బాటిల్ ఇచ్చారు.
తరువాత సమీపంలో ఉన్న గెంట్ నగరానికి నేను నా మనవడు రోహిత్ వెళ్ళాము. అక్కడ అంతర్జాతీయ హ్యూమనిస్టు సంఘంలో పనిచేస్తున్న స్కూళ్ళ ఇన్స్ పెక్టర్ శ్రీమతి సోనియా ఎగ్ రిక్స్ కలిశారు. తన యింటికి తీసుకెళ్ళి ఉద్యమ విశేషాలు చెప్పి స్థానికంగా ఉన్న ఒక పురాతన రాజు కోటను తిప్పి చూపారు. హ్యూమనిస్టు వివాహాలకు ఇతర సెక్యులర్ ఉత్సవాలకు ప్రభుత్వం పరిమితంగా ధనసహాయం చేస్తుందని చెప్పారు. మత పరమైన ఉత్సవాలకు మాత్రం చాలా ఎక్కువగా సహాయపడుతుందన్నారు. ఆమె ఇండియా పర్యటనకు వచ్చినపుడు మా యింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు.
బ్రస్సెల్స్ లో చూడదగిన విశేషాలు చాలా ఉన్నాయి. యూరో పార్లమెంటు ఉన్నది. రాజుకు చెందిన మ్యూజియం ఎన్నో చారిత్రాత్మకమైన వస్తువులను ప్రదర్శిస్తున్నది. బ్రస్సెల్స్ లో 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళకి పదేళ్ళలోపు పిల్లలకు ట్రాముల్లో, బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంది. మేము ఆ విధంగా తిరిగి, టిన్ టిన్ కార్టూన్ ఎగ్జిబిషన్ కూడాచూశాము. మినీ యూరోప్ ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంటుంది. విగ్రహాలు, శిల్పాలు, కట్టడాలు సందర్శకులకు చరిత్రను చెపుతాయి. అక్కడ సగం మంది ఫ్రెంచి సగం మంది డచ్ మాట్లాడతారు. ఉభయులకూ భాషా ద్వేషం ఎక్కువగానే ఉన్నది. దేశం చిన్నదయినా శాస్త్రీయ పరిశీలనకు పెట్టింది పేరు.

Thursday, January 22, 2009

విజయరాజకుమార్ - ఉపన్యాసాల ఉర్రూతలు

స్వాతంత్ర్యం వస్తున రోజులలో గుంటూరు జిల్లా చేబ్రోలు ఎంతో ఉత్సాహ వంతంగా పోరాట కార్యక్రమాలు చేపట్టింది. అది 1947 నుండి జరిగిన సంగతి. అక్కడ విజయరాజకుమార్ యువ సిబిరాలు నడిపి, సుభాష్ చంద్రబోస్ ప్రేరణతో రాజకీయ చైతన్యాన్ని రగిల్చారు. ఆయనకు తోడుగా వి.ఎల్. సుందరరావు ఉండేవారు. చేబ్రోలులో వారు నడిపిన అధ్యయన శిబిరాలకు యువతీ యువకులు ఉత్సాహవంతంగా వచ్చేవారు. బెంగాల్ నుండి సుభాష్ బంధువు శరత్ చంద్రబోస్ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. వీరంతా బోసు పెట్టిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందినవారు. అయితే ఆంధ్రలో ఆ పార్టీ అంతగా ముందుకు సాగలేదు. విజయరాజకుమార్ ఆనాడు సుభాష్ చంద్రబోస్ పై ‘విప్లవాధ్యక్షుడు’ అనే శీర్షికతో పుస్తకం ప్రచురించారు.
ఫార్వర్డ్ బ్లాక్ లో.....
తొలి ఎన్నికలలో ఎన్.జీ. రంగా గొప్ప నాయకుడిగా జనాకర్షణతో కాంగ్రెసె నుండి విభేదించి, కృషీకార్ లోక్ పార్టీ స్థాపించారు. రంగా అనుచరులుగా ఉన్న నర్రిశెట్టి రాజయ్య (పాత రెడ్డి పాలెం గ్రామ నాయకులు) తన పెద్ద కుమారుడు విజయరాజకుమార్ ను రంగా గారికి పరిచయం చేసి, చల్లపల్లిలో జరిగిన రాజకీయ శిక్షణ శిబిరానికి పంపారు. అక్కడ విజయరాజకుమార్ పార్టీలో చేరి అందరి దృష్టీ ఆకర్షించి ప్రముఖ స్థానాన్ని పొందారు. ఆనాడు పి. రాజగోపాల్ నాయుడు, సుంకర సత్యనారాయణ, వీరాచారి, కె. రోశయ్య మొదలైన వారు రంగా శిష్యులుగా ఉండేవారు. తొలి ఎన్నికలలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా విజయరాజకుమార్ ఉపన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ పొందాయి. ఆ తరువాత రంగా గారి రచనలు కొన్ని తెలుగులోకి అనువదించారు. అందులో విప్లవ రైతాంగాం పేర్కొనదగినది. రైతుల పక్షాన రంగా గారు పోరాడటం వీరికి బాగా నచ్చింది.
రంగా గారి శిష్యుడుగా.....
ఎన్నికల అనంతరం కృషికార్ లోక్ పార్టీ ప్రజా ఉద్యమాలు చేపట్టింది. అందులో గౌతులచ్చన్న, కందుల ఓబుల రెడ్డి మొదలైన వారు సారధ్యం వహించారు. 1954లో రాష్ట్రానికి గవర్నర్ గా చందులాలా త్రివేది ఉన్నప్పుడు గౌతులచ్చన్న నాయకత్వాన కల్లు గీత పనివారి ఆందోళన సాగింది. వారికి వృత్తి రక్షణ ఉండాలని, గీతను నిషేధించరాదని కార్యకర్తలు జైళ్ళకు వెళ్ళారు. అందులో భాగంగా విజయరాజకుమార్ కూడా రాజమండ్రి జైలు పాలయ్యారు. అప్పటికే ఆయన చేబ్రోలు నుండి గుంటూరుకు వచ్చి రాజకీయల్లో పాల్గొంటున్నారు. 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదలై, ఒక వైపు కుటుంబాన్ని చూచుకుంటూ మరో వైపు రాజకీయాల్లో రంగా శిష్యులుగా పాల్గొన్నారు.
సెక్యులర్ వివాహం...
1955లో విజయరాజకుమార్ గుంటూరులో సెక్యులర్ గా కన్యాకుమారిని వివాహమాడారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి పెళ్ళి ప్రమాణాలు చేయించి త్రిపురనేని రమస్వామి వివాహ విధి పద్దత్తిలో, గుంటూరు సరస్వతి మహల్ లో పెళ్ళి జరిపించారు. దీనికి ఆచార్య రంగా, కొత్తా రఘురామయ్య (కేంద్రమంత్రి) మొదలైన ప్రముఖులెందరో వచ్చారు. తెనాలిలో ఆంధ్రపత్రిక విలేఖరిగా ఉంటున్న వెంకటప్పయ్య శాస్త్రి గారి కుమార్తె కన్యాకుమారి. వారి పెళ్ళి నిర్వహిస్తూ ఆవుల గోపాలకృష్ణమూర్తి గొప్ప ఉపన్యాస సందేశాన్నిచ్చారు. ఆయన ప్రముఖ రాడికల్ హ్యూమనిస్ట్. తెనాలిలో న్యాయవాదిగా ఉంటున్నారు. విజయరాజకుమార్ కుటుంబానికి ఆయన సన్నిహితులు.
1955లో ఆంధ్రలో ఎన్నికలు జరిగాయి. అవి చరిత్రాత్మకమైనవి. అప్పుడు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఐక్య కాంగ్రెస్ పక్షాన, రంగా గారి శిష్యులుగా విజయరాజకుమార్ చేసిన ఉపన్యాసాలు చిరస్మరణీయమైనవి. కమ్యూనిస్టులను కామన్ ప్లాట్ల్ ఫారాలపై సవాల్ చేస్తూ పర్యటన జరుపుతూ జనాన్ని సమ్మోహితులను చేసిన ధోరణి చరిత్ర గమనించింది. ఆయనకు తోడు సుంకర సత్యనారాయణ, వీరా చారి మొదలైన వారు ఉండేవారు.
ఎన్నికల అనంతరం 1958 నాటికి స్వతంత్ర పార్టీ ఏర్పడింది. అందులో రంగా గారు అధ్యక్షుడు కాగా రాష్ట్ర స్థాయిలో విజయరాజకుమార్ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. పుస్తకాలు, వ్యాసాలు, కరపత్రాలు నిరంతరం ప్రచురిస్తూ పోయారు. రైతుల పక్షాన రంగాగారు పోరాడుతుంటే, వీరంతా అండగా నిలిచారు.
సంజీవ రెడ్డి పై పోరాటం -
1958-59 ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డికి తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరెట్ ప్రసాధించారు. అప్పటికే విజయరాజకుమార్ ఆ యూనివర్శటిలో స్థానిక సంస్థల ప్రతినిధిగా సెనేట్ మొంబరయ్యారు. కాని సెనేట్ కి చెప్పకుండానే అలా డిగ్రీనివ్వటం విరుద్దమైనదని కోర్టులో విజయరాజ్ కుమార్ కేసు వేశారు. ఆనాడు ఎదురులైని సంజీవరెడ్డి సైతం కేసు ముగిసే వరకు తనను డాక్టర్ అని సంబోధించరాదని ఛీప్ సెక్రటరీ భగవాన్ దాస్ ద్వారా ఉత్తరువులు ఇవ్వటం గమనార్హం. ఆ కేసును ఆవుల గోపాలకృష్ణ మూర్తి వాదించారు. వారికి అసిస్టెంట్ గా నెల్లూరులో గుప్తా ఉండేవారు. కేసు ఎటూ తేల్చకుండా చివరకు తిరుపతిలో వేసుకోమని నానబెట్టారు. ఆ విధంగా కేసుని నీళ్ళు కార్చారు.రంగాగారి రాజకీయాల్లో ఉంటూ వచ్చిన విజయరాజకుమార్ తన సాహిత్య రచనలను కొనసాగిస్తూ కొన్ని అనువాదాలు, కొన్ని సొంత రచనలు చేశారు. అయితే రంగాగారు ఉత్తరోత్తర కాంగ్రెస్ లో చేరినప్పుడు విజయరాజకుమార్ మాత్రం ప్రతిపక్షాల్లోనే ఉండిపోయారు. రైతు నాయకుడిగా ఉన్న చరణ్ సింగ్ గంధాన్ని తెలుగులోకి అనువదించారు. దీన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది. విజయరాజ కుమార్ కొన్నాళ్ళు మేదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఉంటూ, వ్యవసాయం చేస్తూ, ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపాడు. ఆయనకు ఇరువురు కుమారులు, పెద్ద కుమారుడు దేవరాజ కుమార్ సంగారెడ్డిలో శాంతిని పెళ్ళి చేసుకున్నారు. ఆమె గుడ్లవల్లెరు (కృష్ణా జిల్లా)కు చందినది.
విజయరాజకుమార్ కొన్ని సందర్భాలలో పట్టుదలగా ఎన్నికలను ఢీ కొన్నారు. ఒక దశలో సుప్రసిద్ధ గణిత నిపుణురాలు శకుంతలా దేవిని సమర్థించారు. ఎందరో సంగీత మిత్రులు విజయరాజ కుమార్ కు అండగా నిలిచారు. కె.బి. సత్యనారాయణ, నర్రావుల సుబ్బారావు, ఎస్.వి. పంతులు వంటి వారు పేర్కొవ దగినవారు. 1985 విజయరాజ్ కుమార్ కిడ్నీ వైఫల్యం పలన చనిపోయారు.
విజయరాజకుమార్ చిన్న తనం నుండి మతాతీతంగా పెరిగారు.Wednesday, January 21, 2009

జానపద గేయాల రాణులు సీత, అనసూయ

Anasuya
Seeta(left)

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని దశాబ్దాల పాటు మారుమూల గ్రామాలలో ఉన్న మరుగున పడుతున్న జానపద సాహిత్యాన్ని వెలికి తీసిన ఖ్యాతి వింజమూరి సీత, అనసూయలదే. ఈ అక్క చెల్లెళ్ళలో సీత అవివాహిత, అనసూయ సంతానం అమెరికాలో ఉన్నారు. వీరిరువురూ అనేక పర్యాయాలు అమెరికా పర్యటించారు. తెలుగు సభలలో పాల్గొన్నారు. ఆంధ్రరాష్ట్రంలో స్టేజి పై ఎన్ని చోట్ల జానపద సాహిత్య గోష్ఠులు జరిపారో లెక్కలేదు. రేడియో కార్యక్రమాలలో మదరాసు నుండి హైదరాబాదు వరకూ ప్రచారాలు సాగించారు. పుస్తకాలు వేశారు. క్యాసెట్లు వచ్చాయి.
దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనగోడళ్ళు సీత, అనసూయ. హైదరాబాదులో ఆదర్శనగర్ లో ఉన్నప్పుడు నాకు పరిచయం. నా కుమార్తె వారి దగ్గర జానపద గేయాలు నేర్చుకున్నది. ఒకసారి నిజామ్ కాలేజిలో యువత జానపద గేయాల కార్యక్రమానికి జడ్జిగా సీతను పిలిచారు. అందులో ఏర్పాటు చేసింది నా కుమార్తె నవీన. పాటల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ రోజు పాడిన వారిలో ఉత్తమ బహుమతి నవీనకు ఇవ్వాలని సీత నిర్ణయిస్తే ఆర్గనైజరుగా ఉంటూ తాను ప్రైజు తీసుకోవడం మంచిది కాదని చెప్పగా, సీత మెచ్చుకున్నది.
తరవాత సీత, అనసూయలను అమెరికాలో కలుసుకున్నాను. మా అమ్మాయి నవీన యింటికి కూడా వచ్చారు. అప్పుడు సీత యిళ్ళకు వెళ్ళి తన పాటల కాసెట్ అమ్ముతుంటే, ఆ వయసులో అలా చేయవద్దని ఎవరైనా వ్యాపార రిత్యా అమ్మేవారికి ఆ పని అప్పగించమని సలహా ఇచ్చాను. ఆమె సహృదయంతో స్వీకరించింది. ఆమెను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసి ఆంధ్రజ్యోతిలో ప్రచురించాను.

Sunday, January 18, 2009

గిన్నిస్ రికార్డ్ లో చిన్నారిపాపలు

వీరమాచనేని సరోజిని - గిన్నిస్ రికార్డ్ లో చిన్నారిపాపలు
చిన్నారి పాపలు అనే తెలుగు సినిమా గిన్నిస్ రికార్డ్స్ లోకి చేరడం గొప్ప విశేషం. వీరమాచనేని సరోజిని ఈ సినిమాని నిర్మించారు. ఇందులో గొప్పతనమేమంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్లు, నేపథ్యగాయకులు, సాంకేతిక సిబ్బంది స్త్రీలు కావడమే. డైరెక్టర్ సుప్రసిద్ధ సినీనటి సావిత్రి. మాటలు, పాటలు అన్నీ కూర్చారు. విక్టరీ మధుసూదనరావు అని పేరు తెచ్చుకున్న సినీ డైరెక్టర్ భార్య ఈమె. మంచి గాయకురాలు.
సరోజిని కీర్తి శేషులయ్యారు. ఆమె కృష్ణా జిల్లాకు చెందిన అభ్యుదయవాది. కమ్యూనిస్టులు 1940 నుండి ప్రజా ఉద్యమాలు చేపట్టి, నాటకాలు, బుర్రకథలు జనంలోకి తీసుకెళ్ళి చైతన్యాన్ని రగిల్చిన రోజులవి. బెజవాడలో (ఆ తరువాత విజయవాడ అయింది) అచ్చమాంబ క్లీనిక్ కమ్యూనిస్టు యువతలను పోషించిన కేంద్రంగా పేరు తెచ్చుకున్నది. సరోజిని కూడా అక్కడ తర్ఫీదు అయింది. ఆమె అల్లూరి సత్యనారాయణరాజు బుర్రకథ చెప్పి జనాన్ని ఏడిపించి, బ్రిటిష్ వ్యతిరేక ధోరణిని, జాతీయ భావాన్ని పెంపొందించడంలో పేరు తెచ్చుకున్నారు. వీరమాచనేని మధుసూదనరావు పెళ్లి చేసుకున్న తరువాత మదరాసులో సినిమా వారి మధ్య కొన్నేళ్ళు గడిపారు. చివరి రోజులలో హైదరాబాదులో ఉండేవారు. 70వ పడిలో కూడా ఆమె కంఠం మాత్రం మాధుర్యాన్ని కోల్పోలేదు.
ఒకసారి మా యింటికి వచ్చి తన అనుభవాలు చెపుతూ పాటలు వినిపిస్తుంటే రెండున్నర సంవత్సరాల నా మనవడు రోహిత్ బల్ల ఎక్కి ఆనందంతో చప్పట్లు కొట్టాడు. వాడి జన్మదినానికి స్వయంగా పాటరాసి పాడి కేసెట్ ఇచ్చింది.
అప్పటికే ఆమె కమ్యూనిజాన్ని ఇంచుమించు వదిలేసింది. నేను రాసిన పుస్తకాలు కొన్ని చదివి, అందులో నరహంతకుడు అనే చిన్న పుస్తకంలో లెనిన్ ను గురించి ఉన్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అదంతా నిజమేనా అని అంటూ, నిజం కాకపోతే కమ్యూనిస్టులు బతకనిచ్చేవారా అని ఆశ్చర్యపడింది. సినీనటి సావిత్రి గురించి ఆమె జ్ఞాపికలు నెమరు వేసుకుంటుంటే, సావిత్రిని ఎదుట చూస్తున్నట్లే అనిపించేది. అనేకమంది సినీ తారలతో ఆమెకు గల పరిచయాన్ని చెబుతుండేది. ఆమెను ఇంటర్వ్వూ చేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం కూడా రాశాను.

Saturday, January 17, 2009

నార్ల వెంకతేశ్వరరావు శతజయంతి

నార్ల శతజయంతి సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి గుంటూర్లో 29 జనవరి న సమావేశాలు నిర్వహిస్తున్నది.అందులో నార్ల సంపాదకుదుగా అనే విషయమై ఎన్.ఇన్నయ్య ఉపన్యసిస్తారు
Left Narla Venkateswararao , middle D.Sanjivaiah, last Punnaiah MP

Wednesday, January 14, 2009

అసాధారణ పత్రిక ‘ఉల్లి’

పత్రిక పేరు ఉల్లి అని పెట్టడానికి సాహసం కావాలి చికాగో విశ్వ విద్యాలయంలో జర్నలిజం శాఖలో కొందరు యువకులు అలాంటి సాహసం చేశారు. పత్రిక పెట్టినప్పుడు ఇది ఎన్నాళ్ళు నడుస్తుందిలే అని వెక్కిరించారు. రాను రాను అది వినూత్న పద్ధతిలో నడుస్తుండటంతో అందర్నీ ఆకట్టుకున్నది. ఉత్తరొత్తరా జర్నలిజం శాఖ నుండి బయటపడి స్వతంత్ర పత్రికగా కొన్నాళ్ళు నడిపారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఆరంభమైన ఈ పత్రిక ఆమెరికా దేశ వ్యాప్తంగా కన్నులు తెరిపించింది. చివరకు అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా తన పై చేసిన విమర్శలు సైతం మెచ్చుకున్నాడు.

అందరివలె కాక వినూత్నంగా వ్యంగ్యంగా హాస్యంగా హెడ్డింగులు పెట్టి విషయాన్ని ఉల్లి పొరలవలె విప్పుకుంటూ పోవటం ఈ పత్రిక ప్రత్యేకత. ఇప్పుడు అదే పత్రికను న్యూయార్క్ నగరానికి మార్చారు. 1988లో మొదలైన ఈ పత్రిక 17 వేల కాపీలతో ఆరంభించి కుంటుతూ నడిచింది. రాను రాను ఆ నోట ఆ నోటా దీని ఖ్యాతి వ్యాపించగా ఇప్పుడు అమెరికా దేశ వ్యాప్తంగా ఈ పత్రిక ఏమి రాసిందోనని పట్టించుకుంటున్నారు. పత్రికలో రాసే వాటిని, బయట నుంచి వచ్చే విషయాన్ని అందరూ కలసి కూర్చొని చర్చించి చిత్రిక పట్టి ప్రచురిస్తారు. చాలా కొత్త తరహా శీర్షికలు పెట్టటం, నిగూఢ సత్యాలను వ్యంగ్యంగా వెళ్ళడించటం ఈ పత్రిక ప్రత్యేకత. అడుగడుగునా హాస్యం గుమ్మరిస్తూ ఉంటారు.
ఈ పత్రికలో టాడ్ హ్యాన్ సన్ స్టోరీ ఎడిటర్ గా విశిష్ఠ స్థానాన్ని పొందాడు. మరొక ఉప సంపాదకుడు మైక్ డి సెంజో అందరూ వెళ్ళిపోయిన తరువాత విషయాలన్నిటినీ పరిశీలించి తుది రూపాన్నిస్తూ ఉంటారు. రోజూ జరిగే చిన్న పత్రికా సమావేశం పేర్కొన దగినది. అందులోనే రకరకాల చర్చలతో ఏ విషయాన్నీ ఎలా ప్రచురించాలనేది నిగ్గు తెల్చుతారు. అక్కడ సీనియారిటీ, జూనియర్ రచయితలు అనే విచక్షణ లేదు. అందరూ విమర్శలకు, హాశ్యానికి గురి కావాల్సిందే.
ఇప్పుడు వెబ్ సైట్ లో కూడా ఈ పత్రికను పెట్టారు. ఆరున్నర లక్షలకు సర్కులేషన్ పెరిగింది. 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వార పత్రికగా ఇది సఫలం కావటానికి వ్యంగ్య హాస్య దోరణి ప్రధాన కారణమని సర్వేలో తేలింది. ఈ పత్రిక విమర్శకు, హాస్యానికి గురి కాని ప్రముఖులెవ్వరూ లేరు. పోపు దగ్గర నుండి ప్రధాన సినిమా నటీనటులు, క్రీడాకారులు ఏదో సందర్భంలో వీరి చతురోక్తులకు గురి కాక తప్పలేదు. ఇక్కడ సిబ్బందికి కాని, సంపాదక వర్గంలోని వ్యక్తులకు గాని చెల్లించే మొత్తాలు చూస్తే వ్యాపార సరళిలో ఉండవు. అయినా దీక్షగా ప్రతికకు పనిచేయటం విశేషం.

Sunday, January 11, 2009

ఫ్రొఫెసర్ చింతామణి లక్ష్మన్న


Left Prof C Lakshmanna

ఫ్రొఫెసర్ లక్ష్మన్నఫ్రొఫెసర్ చింతామణి లక్ష్మన్న నాకు చిరకాల మిత్రులు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో సోషియాలజీ శాఖలో ఆయన ఉండగా నేను ఫిలాసఫీ శాఖలో ఉన్నాను. తరువాత మేమిరువురము కలసి వెనుకబడిన విద్యార్థుల స్థితిగతుల గురించి పరిశోధనా గ్రంథం వెలువరించాము. అనేక హేతువాద మానవవాద సభలలో కలసి పాల్గొన్నాము. లక్ష్మన్న అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందినవారు. సత్యసాయిబాబా తనకు ప్రాథమిక పాఠశాలలో సీనియర్ అని, అప్పట్లోనే బుద్ధిగా మ్యాజిక్ నేర్చుకుంటుండేవాడని చెప్పారు. ఆయన లక్నో వెళ్ళి ఎమ్.ఎ. చదువుతు మమతను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం. లక్ష్మన్న కొన్నాళ్ళు వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన సోషియాలజీ విభాగంలో పనిచేశారు. తరువాత ఎన్.టీ. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు దేశం పార్టీకి సన్నిహితులయ్యారు. ఆలూరి భుజంగరావు స్నేహం వల్లన దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలసి పార్ఠీలో పనిచేసి రాజ్య సభ సభ్యుడయ్యాడు. చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గరవాడయ్యాడు.

ట్రినిడాడ్, టోబాగో లకు భారత రాయభారిగా 5 ఎళ్ళ పాటు పనిచేశాడు. అప్పుడే ఆయన అమెరికా రాగా, అక్కడ మళ్ళీ కలసుకున్నాము. ఆయన పనిచేసిన తిరుపతి విశ్వవిద్యాలయంకి చెందిన తిరుపతి రెడ్డి న్యూయార్క్ లో కలిశారు. మేమంతా పాతకాలపు అనుభవాలు చెప్పుకున్నాం. లక్ష్మన్న మంచి మిత్రుడు. హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. కొన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిథిగా ఢిల్లీలో పనిచేశాడు. ఆయన ఏ స్థాయిలో ఉన్నా మేమిరువురము మిత్రులముగా కొనసాగాము. ప్రస్తుతం రిటైర్ అయి హైదరాబాద్ లో ఉంటున్నారు.

Friday, January 9, 2009

హేతువాద మిత్రులు నర్రా కోటయ్య ,కోటపాటి మురహరి రావు


middle Mr Kotapati Muraharirao, right Mr Narra Kotaiahహేతువాద ఉద్యమంలో నేను పనిచేస్తుండగా అనేక మంది సన్నిహితులయ్యారు. అందులో నర్రా కోటయ్య పేర్కొనదగినవారు. ఆయన 1960 ప్రాంతాల నుండి నాకు దగ్గర మిత్రులయ్యారు. కోటయ్య ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తి. 1934లో పుట్టారు. ఆయనది ఓలేటి వారి పాలెం (కందుకూరు తాలూకా, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్). ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ జయప్రదను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆమెది తెలంగాణ ప్రాంతం కాగా వారిరువురిది వేరు వేరు కులాలు కూడా. ఆ విధంగా జీవితంలో కులాంతర వివాహం చేసుకున్న హేతువాది ఆయన.

త్రిపురనేని గోపీచంద్ కు, తాపీధర్మారావు (తాతాజీ)కు బాగా సన్నిహితంగా ఉన్న కోటయ్య వ్యాపారాలు చేసుకుంటూ, తమ సాహిత్య అభిమానాన్ని కోనసాగిస్తూ హేతువాద ఉద్యమానికి యధా శక్తి తోడ్పడ్డారు. అనేక రచయితలను ప్రొత్సహించి ఆర్థిక సహాయం చేసేవారు. త్రిపురనేని సుబ్బారావు, రావూరి భరద్వాజ వంటి ఎందరో రచయితలు ఆయనకు దగ్గర మిత్రులు. కొందరు తమ రచనలను కోటయ్యకు అంకితమిచ్చారు. ఆవుల సాంబశివరావు, ఎన్.కె. ఆచార్య, రావిపూడి వెంకటాద్రి మొదలైన వారికి దగ్గరవారయ్యారు. మేము హైదరాబాద్ నుండి నడిపిన ఇండియన్ రేషనలిస్ట్ పత్రికకు బాగా తోడ్పడ్డారు. హేతువాది పత్రిక పోషణకు కోటయ్య గారు ఇతోధికంగా చేయూతనిచ్చారు. రేడియో ప్రసంగాలు ఎన్నో చేశారు. ప్రత్యేక సంచికలలో వ్యాసాలు రాశారు. ఆయన కుమారులు ఇరువురూ సుప్రసిద్ధ డాక్టర్లు గా అమెరికాలో స్థిరపడటంతో ఆయనకూడా అమెరికా పర్యటించి వచ్చారు. ప్రస్తుతం రిటైర్డ్ జీవితం కోనసాగిస్తున్నారు. హేతువాద ఉద్యమానికి మాత్రం మద్ధత్తు ఇస్తూనే ఉన్నారు. తెలుగు సాహిత్యం ముఖ్యంగా హేతువాద గ్రంధాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
నర్రా కోటయ్య సినిమా రంగం లో ప్రయోగాలు చేసి దేవాలయం, అరుణ కిరణం ,వందేమాతరం అనే మూడు ప్రొడ్యూస్ చేసి, 100 రోజులు ఆడిన తరువాత ఆ రంగం నుండి విరమించుకోవడం విశేషమే. సినీ హీరో రాజశేఖరును రంగ ప్రవేశం చేసినది కూడా కోటయ్య గారే.

కోటపాటి మురహరి రావు రైతు. గ్రామస్థాయి నుండి హైదరాబాద్ కు వచ్చి విత్తనాలు శాస్త్రియంగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో చక్కని వ్యక్త. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు తోడ్పడే అనేక కార్యక్రమాలు చేపట్టి వెనుక బడిన ప్రాంతాల్లో అమలు పరచి మెప్పు పొందారు. అనేక మంది ఆయన కృషిని శ్లాఘించారు. ఆయనకు రచనలను అంకితం చేశారు. త్రిపురనేని రామస్వామి భావాలతో ప్రభావితుడైన మురహరి రావు సెక్యులర్ వివాహం చేసుకుని, ఇతరులను కూడా అలాంటి వివాహాలను పాటించమని ప్రోత్సహించారు. వ్యవసాయ నిపుణులతో నిరంతరం సంబంధాలు పెట్టుకోని ఆ రంగంలో వస్తున్న అధునాతన అభివృద్ధిని పరిశీలిస్తూ, సాధ్యమైనంత వరకు అమలు పరుస్తూ ఉన్నారు. విదేశీ పర్యటనలు చేశారు. అనేక హేతువాత, మానవవాద సభల్లో పాల్గొని ప్రసంగించారు. రావిపూడి వెంకటాద్రి వంటి ప్రముఖ హేతువాదులతో సన్నిహితులై ఉద్యమ వ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఆర్థికంగా హేతువాద పత్రికను, సాహిత్యాన్ని ఆధుకుంటున్నారు. ఆయన కుమార్తె చంద్రలత మంచి రచనలు చేయటానికి తండ్రి ప్రభావం ఎంతో ఉన్నది. తెలుగు సాహిత్యాన్ని, ఇంగ్లీషులో హేతువాద రచనలను మురహరి రావు అత్యయనం చేశారు. కొద్ది కాలం సినిమా రంగంలో ప్రవేశించి ఓక సినిమా కూడా తీసి తరువాత అందులోనుంచి తప్పుకున్నారు. దాతగా, ఆయనకు పేరుఉన్నది. వ్యవసాయ అభిమానిగా అటు ప్రభుత్వం నుండి, ఇటు సైంటిస్టులనుండి ఆయనకు అభినందనలు నిరంతరం లభిస్తున్నాయి. హేతువాద ఉద్యమానికి ఎప్పుడూ చేయూత అందిస్తూనే ఉన్నారు. ఆవుల సాంబశివరావుకు బాగా దగ్గరగా ఉండేవారు.
ప్రేమానంద్ మాజిక్ శిక్షణ తరగతులు గ్రామంలొ పెట్టించి యువకులను హేతువాదులుగావడానికి క్రిషి చేసారు.కొత్త భావాలుగల రచయితలను ప్రోత్చహిస్తారు .
మురహరిరావు, కోటయ్యలతో నేను తరచు కలసి ఉద్యమాల్లో పనిచేశాను.

Wednesday, January 7, 2009

భారత కమ్యూనిస్టు పార్టీ-ఎవిలిన్ ప్రముఖ పాత్ర


Meridith giving interview to Innaiah on Evelyn
innaiah, mrs Meridith, Mr Meridith, Mr Gogineni Krishna rao ( now near Los Angeles)
Innaiah, Mrs Meridith Mr Meridith, late Madan who recorded interview
అమెరికాలో ఎవిలిన్ పై పరిశోధన

ఎమ్.ఎన్. రాయ్ మొదటి భార్య ఎవిలిన్ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ గ్యాడ్యుయేట్. 1917లో అమెరికాలో వారు పెళ్ళి చేసుకున్నారు. మెక్సికో వెళ్ళి రష్యా వెలుపల తొలి కమ్యూనిస్ట్ పార్టిని స్థాపించి, లేనిన్ దృష్టిని ఆకర్షించారు. అతని ఆహ్వానంపై రష్యా వెళ్ళి ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీని తాష్ కెంట్ లో స్థాపించారు. అనేక పత్రికలు, రచనలు, భారతదేశానికి పంపించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని పెంపొందిచారు. 1925లో వీరుభయులూ విడిపోయారు. ఎమ్.ఎన్. రాయ్ చైనా వెళ్ళి ఉద్యమ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఎవిలిన్ అమెరికా వెళ్ళి పోయింది. ఎందుకు విడిపోయారో తెలియదు. ఎమ్.ఎన్. రాయ్ తన జీవిత చరిత్రలో ఈ భాగాన్ని ప్రస్థావించలేదు. అది పెద్దలోపంగా మిగిలిపోయింది. ఎవిలిన్ ఆ విషయం రాయలేదు.

నేను అమెరికాలో ఎవిలిన్ పై పరిశోధనలు ప్రారంభించి, హాలెండులో లభించిన పత్రాలు తెప్పించి చూచాను. ఆమె రాసిన ఉత్తరాలు అందులో ఉన్నాయి. రాయ్ కారణాలు చెప్పకుండా తన విడాకులు ఇచ్చాడని ఆమె రాసింది. కారణాలు అడిగినా దాటేశాడని చెప్పింది.

ఆమె కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తప్పుకుని 1935లో వేరె పెళ్ళి చేసుకుని జీవితం గడిపింది. రెండవ భర్త కూడా 1945 లో చనిపోగా ఆజ్ఞాత జీవితం గడిపింది. అయితే ఐన్ స్టయిన్ వంటి సుప్రసిద్ధ సైంటిస్టులు ఆమెతో ఉత్తరాలు రాశారు. ఆమెను కొందరు చరిత్ర కారులు ఇంటర్వూలు చేశారు. కాని రాయ్ ను తప్పు పట్టే విధంగా ఆమె ఎక్కడా చెప్పలేదు.

నేను ఎవిలిన్ కుటుంబంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. ఆమె అక్క శెక్రమెంటోలో ఉండేది. నాకు కొన్ని ఫోటోలు, ఉత్తరాలు పంపారు. ఆమె కుమారుడు దివాన్ మెరిడిత్, లాస్ యాంజిలస్ వెలుపల పామ్ గార్డెన్స్ లో ఉండేవారు. ఆయన దగ్గరకు వెళ్ళి సుదీర్గ ఇంటర్వూలు చేశాం. నాకు తొడుగా గోగినేని వెంకట కృష్ణారావు, ఆయన అల్లుడు మదన్ వచ్చి రికార్డు చేశారు. అప్పటికే మెరిడిత్ కు 80 ఏళ్ళు, అయినా ఓపిగ్గా ఎవిలిన్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు.

ఎవిలిన్ పై రచనను వారికి పంపాను. భారత దేశంలో అనుచరులు, ఏవో కుంటి సాకులతో రాయ్ ప్రవర్తనను సమర్తించారు. నేను ఆ విషయంలో రాయ్ ను తప్పు బట్టాను.

ఫోటోలో డివెన్ మెరిడిత్, మదన్, జీ.వి.కే. రావ్, ఎన్. ఇన్నయ్య, మెరిడిత్ భార్య

Saturday, January 3, 2009

తెలుగులో ఎమ్.ఎన్. రాయ్ రచనలు
ఫోటోలో సి. లక్ష్మన్న, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఇంద్రారెడ్డి, రావిపూడి వెంకటాద్రి, ఎన్. ఇన్నయ్య ఉన్నారు


ఎమ్.ఎన్. రాయ్ శతజయంతి సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురించిన రచనలు విడుదల చేశారు. రాయ్ గ్రంథాలలో 1. రష్యా విప్లవం, 2. చైనాలో విప్లవం, ప్రతి విప్లవం, 3. వివేచన, విప్లవం ఉద్వేగ వాదం (రెండు భాగాలు), 4. పార్టీలు, రాజకీయాలు, అధికారం, 5. ఎమ్.ఎన్. రాయ్ రాజకీయ జీవిత చరిత్ర వి.బి. కార్నిక్ రచన 1988లో విజయవాడలో ఆవిష్కరించారు. ఆ రచనలన్నీ తెలుగులోకి నేను తెచ్చాను. వీటిని చాలా తక్కువ ధర పెట్టి అకాడమీ అందించింది. అప్పట్లో వెంకారెడ్డి డైరెక్టర్ గా ఉండేవారు. ఆయనకు శాస్త్రీయ దృక్పదం ఉన్నది.

విజయవాడ కళామందిర్ లో జరిగిన పెద్ద సమావేశానికి ఆ నాటి రాష్ట్ర విద్యామంత్రి కీ.శే. ఇంద్రా రెడ్డి మరోక మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు ఫ్రొఫెసర్ చింతామణి లక్ష్మన్న వచ్చి పాల్గొని ప్రసంగించారు. నాడు ప్రధాన ప్రసంగాన్ని హేతువాద నాయకుడు రావిపూడి వెంకటాద్రి చేశారు. కమ్యూనిస్టు గా మొదలైన ఎమ్.ఎన్. రాయ్ మానవవాదిగా మారిన తీరును ఆయన అనర్గళంగా సమీక్షించారు.

ఫోటోలో సి. లక్ష్మన్న, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఇంద్రారెడ్డి, రావిపూడి వెంకటాద్రి, ఎన్. ఇన్నయ్య ఉన్నారు. ఈ రచనలన్నీ ఒక సెట్ గా అందుబాటు దరకు అందించటం అకాడమీ చేసిన కృషిలో ఒకటి. పునర్ ముద్రణకు వచ్చిన ఈ గ్రంథాలను అకాడమీ వెలువరించవలసి ఉన్నది.