Tuesday, July 31, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -3

వైమనస్యతమనిషి ప్రకృతికి సన్నిహితంగా ఉంటూ ఉత్సాహంగా పాల్గొంటేనే మనిషికి అర్ధం ఉంటుంది. వ్యక్తిపరమయిన ఆస్తిగల సమాజంలో ఇది జరగడంలేదు. శ్రమ ఉత్పత్తి చేసే వస్తువు ఉత్పత్తి చేసిన వారికి ఎదురు తిరిగి అతనికి దూరంగా నిలబడుతోంది.
మనిషి స్వభావానికి అనుగుణంగా ఉత్పత్తి జరగనప్పుడు శ్రమ చేసిన వ్యక్తికి విముఖత కలుగుతుంది. (ఆర్ధిక తాత్త్విక ప్రతులు 1844 పుట 63 ప్రోగ్రస్ పబ్లిషర్స్, మాస్కో) తాను చేసే పని బలవంతపు పరిస్ధితులలో చేస్తాడు. పని చేయనప్పుడే తాను తానుగా ఉంటాడు. పనిచేస్తున్నంతసేపూ మనసెక్కడో పెడతాడు. (పైన ఉదహరించినదే - పుట 66) ఇలా వైమనస్యంతో ఉత్పత్తి జరుగుతుంటే ఆ ఉత్పత్తే నెత్తినెక్కి స్వారీ చేస్తుంది. ఉత్పత్తి కోసమే శ్రామికుడు ఉన్నాడా అన్నట్టు తయారవుతుంది రంగమంతా. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవహారం.
వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ఉత్పత్తి విధానాల నుంచి మానవుని విమోచనాన్ని కోరాడు మార్క్సు. వైమనస్యం లేని ఉత్పత్తి విధానంలో మానవుడు విశ్వజనీనంగా తనను తాను గుర్తిస్తాడు. చైతన్యంగల వ్యక్తిత్వంగల మనిషిగా రూపొందుతాడు. సమాజంలో అన్ని కాలాలలో అన్ని రకాల మనుషులు కూడా ఈ వైమనస్యం పొందుతున్నారు. కాని చారిత్రక గమనంలో కార్మికులు మిగిలిన వారికంటే ఎక్కువ వైమనస్యం చెందుతున్నారు. వారి విమోచన జరిగితే మానవాళికి విమోచన జరిగినట్టే. మనిషికి దేనికీ సాధనంగా, కొరముట్టుగా, యజ్ఞపశువుగా మారరాదు. మార్క్సు దృష్టిలో మనిషి అన్నిటికంటే ముఖ్యం. సోషలిస్టు విధానంలో ఉత్పత్తి అంతా మానవ ప్రతిభావ్యుత్పన్నతలననుసరించి ఉంటుంది. పెట్టుబడిదారీ విధానంలో కృత్రిమ అవసరాల పేరిట ఉత్పత్తికి లొంగి పోతాడు.
కొంతకాలం క్రిందట సోవియట్ కమ్యూనిస్టులు కొత్తవాదన లేవదీశారు. యౌవనదశలో మార్క్సు చేసిన వాదనకు ఉత్తరోత్తరా మార్క్సు పరిణతికి చాలా తేడా ఉందని, తొలిదశలో వ్యక్తపరచిన భావాలకు తరువాత తిలోదకాలిచ్చాడని చెబుతూ వచ్చారు.
1844 పారిస్ ప్రతులలో మార్క్సు వెల్లడించిన భావాలే తరవాత గ్రంథాలలో వెల్లడయినాయి. ముఖ్యంగా క్యాపిటల్ లో వైమనస్యం గురించి మానవుని విమోచన గురించి చర్చ ఉన్నది. కనుక సోవియట్ వారి వాదన నిలబడదు. ఇంత సాధారణ విషయం వారికి తెలియక కాదు. అయితే ఒక చిక్కు వచ్చింది. మార్క్సు చెప్పిన భావాలకు సోవియట్ యూనియన్ లో ఆచరణ చాలా దూరంగా జరిగింది. సోవియట్ యూనియన్ చేసినదంతా మార్క్సిజమేనని వారు ముద్ర వేయదలచారు. ఆ వైవిధ్యమే ఈ రచనను దాచిపెట్టేటట్లు చేసింది.
నేడు మాత్రం కమ్యూనిస్టులు పారిస్ ప్రతుల పట్ల తమ పాత ధోరణి అంతా మార్చుకున్నారు. పరిణతితో మార్క్సు చేసిన రచనగా, గతి తార్కిక భౌతిక వాదిగా (?) కమ్యూనిస్టు భావాలు వ్యక్తం చేసినట్లు శ్లాఘిస్తున్నారు. (పై గ్రంథం 183 పుటలో).
మార్క్సు తరువాత గ్రంథాలలో వైమనస్యం, మానవ విమోచనల గురించి ప్రస్తావన ఉంటేను ఇప్పుడు 1844 పారిస్ ప్రతులను పొగుడుతుంటేను ఇక పేచీ ఏమున్నదని ప్రశ్న రావచ్చు.

మార్క్సు రచనలలో క్యాపిటల్ ముఖ్యమైనదిగా చిత్రించినా అందులో నొక్కు అంతా ఆర్ధిక విషయాలపైనే కనిపిస్తుంది. అక్కడక్కడ ప్రస్తావన ఉన్నా అది సీరియస్ గా పట్టించుకోవడం కష్టం.
ఇప్పుడు ఐరోపాలో కమ్యూనిస్టులు వారి సానుభూతి పరులు, మానవతావాదులు చాలా నిశితంగా మార్క్సు రచనలు పరిశీలిస్తున్నారు. ఆందులోను 1844 పారిస్ ప్రతులు యువతరాన్ని ఎంతో ఆకర్షించడం విశేషం.
మొరటు కమ్యూనిజం

ఈ గ్రంథాన్ని సోవియట్ యూనియన్ దాచిపెట్టడానికి మరొక ప్రధాన కారణం కనబడుతున్నది. కమ్యూనిజం (సోషలిజంగాని) మానవత ప్రధానంగా ఉండాలని మార్క్సు ఉద్దేశ్యం. సమకాలీన కమ్యూనిస్టు భావాలను, కమ్యూనిజం చరిత్రను పరిశీలించిన మార్క్సు, తన కమ్యూనిజం ఎలా ఉండాలో చెప్పాడు. మానవుడిని వైమనస్యంతో దూరం చేసే వ్యక్తిగత ఆస్తిని కమ్యూనిజం దాటిపోతుంది. మనిషి స్వభావానికి దాపులో కమ్యూనిజం ఉంటుంది. మనిషి మళ్ళీ తానుగా ఉంటాడు. ఈ కమ్యూనిజం పూర్తిగా అభివృద్ధి చెందిన సహజవాదం. అంటే మానవవాదంతో సమానంగా ఉంటుంది. చరిత్ర చిక్కుల్ని కమ్యూనిజం విడదీసి మనిషికీ మనిషికీ మధ్య వైరాన్ని తొలగిస్తుంది. (ఈ పుస్తకంలో 9వ పుట చూడండి.)
ఇందుకు భిన్నంగా ఉన్న మొరటు కమ్యూనిజాన్ని మార్క్సు ఖండించాడు. వ్యక్తిపరమైన ఆస్తిగా అందరికీ లేనిదాన్ని ఈ కమ్యూనిజం నాశనం చేస్తుంది. ప్రతిభను బలవంతంగా రాబట్టడానికి కృషి చేస్తుంది. భౌతికంగా యాజమాన్యం కలిగి ఉండడమే జీవిత ధ్యేయం అనుకుంటుంది.
ఈ మొరటు కమ్యూనిజంలో స్త్రీపట్ల దృక్పథం కూడా మొరటుగానే ఉన్నది. వివాహాన్ని వ్యతిరేకించి స్త్రీ సమాజపరం కావాలంటుంది. ఇది ఆలోచనా రాహిత్యానికి పరాకాష్ఠ. వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించే ఈ కమ్యూనిజం తగదు. (ఈ గ్రంథంలో పుట 88 చూడండి.)
మనిషి మళ్ళీ మనిషి కావాలని కమ్యూనిజం అంటుంది కదా. అది అవగాహన చేసుకోకుండా రాజకీయ స్వభావంతోనే ప్రజాస్వామిక లేక నిరంకుశ విధానాలు అనుసరిస్తున్న కమ్యూనిజం ఒకటున్నది. రెండవది రాజ్యం హరించిపోవడం. వైమనస్యతకు గురై, ఇంకా వ్యక్తి పరమైన ఆస్తి ప్రభావం నుండి బయటపడలేక, ఈ స్థితి వరకు కమ్యూనిజం బయటపడలేకపోతున్నది. వ్యక్తిగత ఆస్తిసారం ఏమిటో మానవ స్వభావపు అవసరాలేమిటో గ్రహించలేని ఈ కమ్యూనిజం అసలు మూలసారాన్ని అవగాహన చేసుకోలేకపోయింది. (పుట 90లో).
కమ్యూనిజం మానవ ధ్యేయం కాదు. మానవాభివృద్ధిలో అది ఒక దశ మాత్రమే. మానవాభివృద్ధిని వ్యతిరేకించే విధానాన్ని కమ్యూనిజం వ్యతిరేకిస్తుంది. (పుట. 100-101) సంపూర్ణ మానవాభివృద్ధే ప్రధానం. కమ్యూనిజాన్ని గురించిన ఈ చర్చ సోవియట్ యూనియన్ కూ అన్వయిస్తుంది. అందునా తొలిదశలో బాగా వర్తిస్తుంది. బహుశ అది తగిలి ఆ గ్రంథాన్ని ఆపారనిపిస్తుంది. అంతకు మించిన సరైన కారణం మార్క్సు ఎంగిల్సు సంస్థ ఇస్తే తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.

లెనిన్ చదవని మార్క్సు గ్రంథం

జర్మన్ ఐడియాలజీ

మార్క్సు బ్రస్సెల్స్ లో ప్రవాస జీవితం గడుపుతూ తన భావాల స్పష్టతకై జర్మన్ ఐడియాలజీ వ్రాశాడు ఎంగెల్స్ చేయి కూడా ఇందులో ఉంది.
1932 జర్మన్ లో వెలువడిన తరువాత 1933లో మార్క్సు లెనినిస్టు సంస్థ మాస్కోలో రష్యన్ భాషలోనూ ఈ గ్రంథాన్ని ప్రచురించింది. అంటే మార్క్సు - వ్రాసిన 85 సంవత్సరాలకు తొలి ప్రచురణ జరిగిందన్నమాట. ఎంగెల్స్ అనంతరం జర్మన్ సోషల్ డెమొక్రాటిక్ పార్టీ చేతిలో ఈ గ్రంథం పడినందున వారికేమీ తొందర లేనందున ఇది ఆలస్యమైనందని సంజాయిషీ చెబుతున్నారు. (ది జర్మన్ ఐడియాలజీ - మార్క్సు - ఎంగెల్స్ - ప్రోగ్రస్ పబ్లిషర్స్ మాస్కో 1964 పుట 18).
కాని 1927లోనే మార్క్సుతొలి రచనలన్నిటితో కూడిన సంపుటిని మార్క్సు, ఎంగెల్స్ సంస్థ డి రసోజన్ (D. Rja zanov) సంపాదకత్వాన వెలువరించింది. 1932లో రాజకీయ కారణాలచే ఈ గ్రంథాన్ని ఉపసంహరించారు. (David Melellan Marx Before Marxism 1972 Penguin పుట. 269)
1846లో జర్మన్ ఐడియాలజీ ప్రచురించడానికి మార్క్సు, ఎంగెల్స్ చాలా ప్రయత్నించారు. ప్రచురణకర్తలతో సంప్రదింపులు సాగించారు. మార్క్సు తరఫున వేడిమేయర్ హెన్ లు కూడా ఈ ప్రయత్నాలు చేశారు. మొత్తం ఒక్కసారి ప్రచురించడానికి వీలు కాదనుకుంటే చిన్న చిన్న కరపత్రాలుగానైనా ప్రచురించడానికి మార్క్సు సుముఖత చూపాడు. 1847 చివరకు మార్క్సు ప్రయత్నించి ఏ ప్రచురణకర్త కూడా పూనుకోనందుకు విసిగి వేసారి ఆ ప్రతులను అవతల పారేశాడు. మొత్తం జర్మన్ ఐడియాలజీలో కార్ల్ గ్రూన్ పై వ్రాసిన విమర్శ మాత్రమే ప్రచురితమైంది. తన భావాలు నచ్చక ప్రచురించలేదని మార్క్సు అభిప్రాయపడ్డాడు. ఆ వ్రాత ప్రతులను ఎలుకలు కొరికే దుస్థితి పట్టింది.
జర్మన్ ఐడియాలజీ అనే గ్రంథానికి ఎందుకింత ప్రాధాన్యత అంటే అందులో సారాంశాన్ని సంక్షిప్తంగా చూద్దాం. మార్క్సు సమకాలీన యువ హెగెలియన్లతో తేల్చుకోదలచి వ్రాసిన గ్రంథమిది. ఫాయిర్ బాహ్, బాయిర్, స్టర్నర్, మాక్స్ గ్రూన్ ఇత్యాదుల సిద్ధాంతాలను కూలంకషంగా మార్క్సు విమర్శించాడు. అదికాక కమ్యూనిజాన్ని తాననుకునే తాత్త్విక విషయాల గురించి ప్రస్తావన చేశాడు. వాటిలో అతి ముఖ్యమైనవి చూద్దాం. అప్పుడు ఈ గ్రంథాన్ని కూడా కొన్నాళ్ళయినా ఎందుకు తొక్కిపట్టారో అర్ధమవుతుంది.
కమ్యూనిజం అంటే ఏమిటి మార్క్సు దృష్టిలో ? అదేదో స్థాపించవలసిన వ్యవస్థకాదు. ప్రస్తుతం వ్యవస్థను రద్దు చేయడం, శ్రమ విభజన అంతా తొలగి పోవడమే కమ్యూనిజం. (జర్మన్ ఐడియాలజీ పుటలు 44, 47 ప్రోగ్రస్ పబ్లిషర్స్, మాస్కో 1964) ఇలాంటి కమ్యూనిజంలో ఎవరికి ఇతమిత్థమైన కార్యకలాపం అంటూ ఉండదు. తనకిష్టమైన చర్యలో వ్యక్తి పాల్గొంటాడు. ఉత్పత్తిని సమాజం క్రమబద్ధం చేస్తుంది. ఇవ్వాళ ఒక పని చేస్తే రేపు ఇంకోపని చేస్తాడు. ఉదయం వేటాడితే, మధ్యాహ్నం చేపలు పడితే, సాయంత్రం పశువుల కాపలా కాస్తే, రాత్రి భోజనం వద్ద విమర్శ చేస్తాడు. కాని అంత మాత్రాన ఎవరికి వేటగాడని, చేపల వాడని, పశువుల కాపరని, విమర్శకుడని ముద్ర వేయరు. (పుట 44-45) అంటే మార్క్సు చెప్పే కమ్యూనిజంలో కూడిన, అర్ధరహితమైన, బలవంతంగా చేయవలసిన శ్రమ అంటూ ఉండదు. వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని విప్పార చేసుకోవడానికి వీలైన శ్రమ మాత్రమే ఉంటుంది. జీవితాంతం ఒకే వృత్తిలో కుమిలిపోవడం కాక, వ్యక్తి సంపూర్ణంగా తన వివిధ ప్రతిభా వ్యుత్పన్నతల్ని వెల్లడించు కోవడానికి వీలుంటుంది కమ్యూనిస్టు సమాజంలో. అనేక కార్యకలాపాల్లో ఒకటిగానే చిత్రాలు వేయవలసి ఉంటుంది. చిత్రకారుడంటూ ఒకరు ఉండరు. ఇదే మిగిలిన వాటికి కూడా అన్వయిస్తుంది.
నేటి సమాజంలో వ్యక్తులను ముఖ్యంగా శ్రామికులను బలవంతంగా శ్రమించేటట్టు రాజ్యవ్యవస్థ చట్టం వత్తిడి చేస్తున్నది. కనుక వ్యక్తులు వ్యక్తులుగా ఉండాలంటే రాజ్యం హరించాలి.
మార్క్సు కమ్యూనిస్టు వ్యవస్థను ఆచరణలో కమ్యూనిజాన్ని చూపుతున్నామనేవారిని పోల్చి చూచినప్పుడు జర్మన్ ఐడియాలజీని అణచి పెట్టడంలో ఆశ్చర్యం లేదు.
వై మనస్యత
పారిస్ ప్రతులలో మార్క్సు వైమనస్యత పై చేసిన చర్చ జర్మన్ ఐడియాలజీలో కొనసాగడం స్పష్టంగా చూడవచ్చు. వైమనస్యత కేవలం వస్తువుల ఉత్పత్తి వల్లనే కలుగదు. సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా మనిషికి యజమానులై స్వారీ చేయడంవల్ల వైమనస్యత దాపురిస్తుంది. చరిత్ర అంతటా ఈ పరిణామం చూడవచ్చు. వైమనస్యత చెందిన వ్యక్తి పరిస్థితులకు బానిస అవుతాడు. వస్తువులకు దాసోహం అంటాడు. తన శక్తులన్నీ ఉడిగి పోతుంటే నిస్సహాయుడవుతాడు.
చైతన్యం
చైతన్యం మనిషి ఉనికిని నిర్ణయించదు. సామాజికంగా మనిషి ఉనికే అతని చైతన్యాన్ని నిర్ధారణ చేస్తుంది. తాత్వికంగా చాలా ముఖ్యమైన ఈ విషయాన్ని మార్క్సు జర్మన్ ఐడియాలజీలో చర్చించాడు. జర్మనీలో తత్వం దివి నుంచి భువికి దిగగా, తన తత్త్వం భూమిపై గట్టిగా కాళ్ళూని పైకి పోతుందన్నాడు. (పుట.37)
మార్క్సుపై మరొక విమర్శ చాలా కాలంగా వినవస్తున్నది. భావాలకు మార్క్సు ప్రాధాన్యత ఇవ్వలేదనేది ఇందలి ప్రధానాంశం. సామాజిక వాస్తవిక పరిస్థితులకు చెందని భావాలంటే మార్క్సు శీతకన్ను వేసిన మాట నిజమే. కాని పరిస్థితులను మానవుడు మలచగలడని మార్క్సు చెప్పాడు. చారిత్రక విధానం దానంతట అది సాగిపోతుంటే మానవుడు నిస్సహాయుడుగా చూస్తూ ఊరుకోడు. విప్లవం ద్వారా పరిస్థతులను మార్చేస్తాడు కనుక పరిస్థితులకు, చరిత్ర గమనానికి మానవుడు కీలుబొమ్మ కాదు.
సంపూర్ణ మానవుడుగా వికసించడానికి, వైమనస్యతతో ఏకపక్షంగా మనిషి - అభివృద్ధి చెందడానికి స్పష్టమైన గిరిగీసి చూపాడు మార్క్సు (ఎరిక్ ఫ్రామ్ వ్యాసం Marx’s Contribution to the knowledge of man - see page 68, The crisis of ?? Fawcett Premier Book 1970)
జర్మన్ ఐడియాలజీ వ్రాసే నాటికి మార్క్సుచాలా మారాడని పారిస్ ప్రతులలోని పదజాలం విడనాడాడనిచెప్పడం కద్దు. మానవ జీవుల వంటి పదాలు పారిస్ ప్రతులలో ప్రయోగించిన మార్క్సుజర్మన్ ఐడియాలజీలో వాటిని వదిలేశాడు. కానీ, ఇంతవరకు జరిగిన స్థాలీ పులాకన్యాయ, చర్చ ప్రకారం మార్క్సు ఆలోచనా విధానంలో మౌలికంగా మార్పు రాలేదు. పారిస్ ప్రతులనాటి ఆలోచనా విధానంలో మౌలికంగా మార్పు రాలేదు. పారిస్ ప్రతులనాటి ఆలోచన ఇంకా విస్తృతంగాను స్పష్టంగాను కొనసాగించాడు. ఆ మాటకు వస్తే పారిస్ ప్రతులు, జర్మన్ ఐడియాలజీ లలో వెల్లడించిన భావాలు కేపిటల్ లో కూడా వ్యక్త పరిచాడు. అందువల్ల యౌవనంలో మార్క్సుకంటే పరిణతి చెందిన మార్క్సు వేరు అనే వాదనలో పసలేదు.
మార్క్సు భావాలు తమకు సూటిగా వచ్చి కొట్టుకున్నందునే జర్మన్ ఐడియాలజీని ప్రచురించి కూడా నాలుక కొరుక్కొని వెంటనే ఉపసంహరించారు. తరువాత ఫాసిజంతో పోరాటం, రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో ఈ గొడవ ఎవరూ పట్టించుకోలేదు. స్టాలిన్ అనంతరంగాని జర్మన్ ఐడియాలజీకి వన్నె రాలేదు. (More…)

Monday, July 30, 2007

నర హంతకులు -11

ఇప్పుడు బయటపడుతున్న మావో నరమేధం20వ శతాబ్దంలో 80 కోట్ల ప్రజలతో పరిశోధన చేసిన, అడ్డొచ్చినవారిని హతమార్చిన మావో విషయం క్షుణంగా ప్రతివారూ తెలుసుకోవాలి. మనుషులంటే ఇజాలు విలువైనవనే సిద్ధాంతం వలన జనాన్నే మందగా మళ్ళేసి, బందెలదొడ్డికి తోలి, ఎదురుతిరిగిన వారిని, దారిమళ్ళించి వారిని కాల్చి చంపడం ఆనవాయితీ అయింది. మావో చైనాను యీ రీతిలో నడిపించాడు. అనంతరం చైనా కొంతవరకు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నది.
సోవియట్ రష్యా ప్రోత్సాహంతో చైనాలో 1920లో కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. అప్పటికి మావోకు 27 సంవత్సరాలు. ఆనాటికి చైనా సైన్యంలో పనిచేసిన అనుభవం ఆయనకున్నది. మావో రైతు కుటుంబీకుడు. పెకింగ్ లోని యాంగ్ బాంగ్చి, ఆన్ పెకింగ్ ఉపాధ్యక్షుడి కుమార్తెను వివాహమాడాడు. మొదటి నుండి రైతు పక్షపాతిగా వున్న మావో బీజింగ్ లో మార్క్సిజం చదివాడు. అయినా ఆయన ఆలోచనలు రష్యాకు భిన్నంగానే సాగాయి.
రష్యా నుండి మైకేల్ బరోడిన్, ఎం.ఎన్. రాయ్ మొదలైన సలహాదారులు వచ్చి చెప్పిన బోధలు వినకుండా మావో సొంత మార్గాలు అవలంభించాడు. కొమింటాంగ్ లో విభేదించి చైనా కమ్యూనిస్టు దళాలను ఏర్పరచాడు. జాతీయవాద ప్రేరణతో రైతులను ఉత్తేజపరిచాడు. తొలుత వెయ్యి మంది నానాజాతి సంకర ప్రజలతో ఒక దళాన్ని మావో ఏర్పరచాడు. అది క్రమంగా 1927లో మొదలుబెడితే, 20 వేలవరకూ పెరిగింది. 1930లోనే తన సైన్యంలో సుమారు 2 వేల మంది కమ్యూనిస్టు వ్యతిరేకత చూపినందుకు వారిని కాల్చి చంపించాడు మావో. అంతకుముందు చాంకై షేకు కొన్ని వేల మంది కమ్యూనిస్టులను హతమార్చాడు, అప్పటికి మావో తన సైన్యం నుండి ఒక రహస్య దళాన్ని రూపొందించాడు. 1923-30లో చైనాలోని 5 రాష్ర్టాలలో మావో ఆధ్వర్యాన కమ్యూనిస్టు పార్టీ బాగా బలాన్ని సమకూర్చుకున్నది. మావో ఉత్తరువులననుసరించి మధ్యతరగతి వారిని చంపడం ప్రారంభమైంది. పురోహితులను, మత ప్రచారకులను హతమారుస్తుండేవారు.
చైనాలో సైన్యం లేకుండా ఏ పనీ జరగదనేది చరిత్ర చెప్పిన పాఠం. 1926లో మార్షల్ ఫేంగ్ యూసియాంగ్ కొమింటాంగ్ కమాండర్ గా 3 లక్షల కొమించుస్ దళాన్ని (ప్రజా సైన్యాన్ని) 7 వేల మైళ్ళ యాత్ర చేయించాడు. పెకింగ్పే దాడి కై తలపెట్టిన యీ యాత్ర వలన దక్షిణాది నుండి వెళ్ళిన సైన్యం ఉత్తరాదిపై ఆదిపత్యం వహించగలిగింది. ఇదే మావోకు ఆదర్శ ప్రాయమైంది.
1934 అక్టోబరులో మావో ఆధ్వర్యాన కమ్యూనిస్టు దళాలు యాత్ర ప్రారంభించి 1936 డిసెంబరులో ఎనాన్ లో ముగించారు. దీనివలన చైనాలో కమ్యూనిస్టులపై మావోకు పూర్తి ఆదిపత్యం లభించింది. ఆయన రాజకీయ మద్దత్తుదారుగా చౌ ఎస్ లై నిలచాడు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం మావోను సైన్యం వదలి, ప్రభుత్వంలో చేరమని స్టాలిన్ సలహాయిచ్చాడు. అప్పటికే చైనా కమ్యూనిస్టు పార్టీ మావో ఆలోచనా విధానమే ఏకైక మార్గం అనే నినాదంతో వున్నది. 1945 నుండి 1949లో కమ్యూనిస్టులు పెత్తనంలోకి వచ్చేవరకూ చైనాలో అంతర్యుద్ధం సాగింది.
1948 డిసెంబరు నాటికి అనేక రాష్ట్రాలను పట్టుకోగలిగిన మావో, 1949 జనవరిలో బీజింగ్ ను స్వాధీనం చేసుకున్నాడు. ఈ పోరాటంలో చాంగ్ కైషేక్ దళాలు 4 లక్షల వరకూ హతమయ్యా యి. మరో 2 లక్షల మంది మావో సైన్యంలో చేరారు. 1959 ఏప్రిల్లో నాన్ కింగ్ ను పట్టుకోగలిగిన మావో చైనా సర్వాధిపతి అయ్యాడు.
మావో తొలుత యిచ్చిన పిలుపు భూ సంస్కరణ అమలు పరచమని, ఈ సంస్కరణోద్యమంలో 20 లక్షల మంది పెద్ద, చిన్న రైతులు హతమైనారు. వీరిలో 10 లక్షల మంది రైతులు 30 ఎకరాలలోపు వారే. రష్యా సహాయంతో చైనాను అగ్రరాజ్యంగా సైన్యంలో బాగా బలం గల రాజ్యంగా, రూపెందించాలని మావో సంకల్పించాడు.
1949లో రాజ్యానికి వచ్చిన కమ్యూనిస్టులు చైనాలో మావోపంధాను తీవ్రస్థాయిలో అమలు పరచడానికి పూనుకున్నారు. లింపియావో యిందులో చురుకుగా పాల్గొన్నాడు. భూసంస్కరణోద్యమం పేరిట 1950 నుండి 53 వరకూ నగరాలలో పెద్ద ప్రదర్శనలు ఏర్పరచి, సంఘ వ్యతిరేకులను ఏరివేయడానికి పూనుకున్నారు. విప్లవ వ్యతిరేకుల జాబితాలను రోజూ ప్రకటిస్తూ పోయారు.
నెలకు సగటున 22 వేల మంది సంఘ విద్రోహులను ఉరి తీస్తూ పోయారు. చైనాలో 1950 నుండి 1953 వరకూ సాగిన యీ ఏరివేత, ఉరితీత కార్యక్రమములో మావో ఆధ్వర్యాన 3 లక్షల నుండి విప్లవ వ్యతిరేకులు చంపివేయబడ్డారు. మావో సంస్కరణలో యిది తొలిఘట్టం. మూడు వ్యతిరేక ఉద్యమాలతో ఆరంభమైన మావో తరువాత 5 వ్యతిరేక ఉద్యమాలు నినదించారు. మావో ఆలోచనలు అందరూ విధిగా చదవాలన్నారు. అందుకు విముఖత చూపినవారిని జైళ్ళలో చిత్రహింసలతో సంస్కరించారు. దేశంలోని అన్ని వర్గాలకూ యీ తాతాచార్యుల సంస్కరణ వడ్డింపు తప్పలేదు. మావో తొలి సంస్కరణ ఫలితంగా చైనాలో ధ్యాన్యోత్పత్తి పడిపోయి, పెద్ద కరువును ఎదుర్కోవలసి వచ్చింది.
1955లో మావో మరో నినాదం యిచ్చాడు. సోషలిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థకు జరిగే తుది పోరాటం అని బయలుదేరారు, కాని ఇదేమంత ఆకర్షణీయంగా లేదు, ఫలితాలనివ్వలేదు. వందపూలు వికసించాలి అనే కొత్త ఆకర్షణీయ నినాదంతో 1956లో మావో మరో ఆలోచన చేశారు. ఇది ఆధారంగా భిన్న అభిప్రాయాలు వెల్లడించిన వారిని పట్టుకొని శిబిరాలకు పంపారు నిర్భంధంగా పనులు చేయించారు. మావో తన నినాదాన్ని ఒక ఏడాదికే ఉపసంహరించుకున్నాడు.
ముందుకు దూకండి అని 1957లో మావో నినదించాడు. అప్పటికే రష్యాలో స్టాలిన్ చనిపోవడంతో ప్రపంచ కమ్యూనిస్టు అగ్రనాయకుడుగా మావో ఒక్కడే మిగిలిపోయాడు. కృశ్చేవ్ కూ మావోకూ పడలేదు. మావో చేస్తున్న పనుల్ని కృశ్చేప్ విమర్శించాడు. చైనాలో దేశవ్యాప్తంగా కమ్యూన్లు స్థాపించాలని ముందుకు దూకే ఉద్యమలక్ష్యం. మావో నాయకత్వాన్ని పిచ్చిదిగా కృశ్చేప్ పేర్కొన్నాడు. వ్యవసాయరంగం పారిశ్రామిక రంగం చిన్నాభిన్నం కాగా చైనాలో మావో సృష్టించిన కరువు మూడేళ్ళపాటు సతమతం చేసింది. ఎందరు ఆకలి చావులకు గురయ్యారో చైనా బయట పెట్టక, కమ్యూనిజం పేరిట దాచేసింది. దాంతో ముందుకుదూకే ఉజ్యమాన్ని 1959 జులై 23న హఠాత్తుగా ఆపేస్తున్నట్లు మావో ప్రకటించాడు. చైనాలో మావోతోబాటు లింపియావో, లీషాచీ, మావో భార్య చియాంగ్ చింగ్లు ప్రధాన పాత్ర వహించారు. ముందుకు దూకడం ఆపిన మావో సాంస్కృతిక విద్యారంగాలపై దృష్టి సారించాడు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని ఆలోచించిన మావో హఠాత్తుగా చైనారంగం మీదకు వచ్చాడు. 1966 జూలై 16న యాంగ్చీనదిలో మావో ఈత గొట్టినట్లు వార్తలు, పోటోలు ప్రచురించారు. గంటలో 10 మైళ్ళు ఈతగొట్టిన మావో ఎంత శక్తివంతుడో చూపాలనే ఈ ప్రచార ప్రయోజనం.
సాంస్కృతిక విప్లవం అనేది మావో యిచ్చిన మరో నినాదం ఇందులో మావో రెండవ భార్య మాజీ సినీతార చియాంగ్ చింగ్ ముఖ్య నిర్ణయాలు చేసింది. 1966లో ప్రారంభమైన ఈ సంస్కృతిక ఉద్యమం తుపాకి గొట్టం ద్వారా అధికారం వస్తుందనే నినాదం యిచ్చింది. దీనినే మన నక్సలైట్లు గోడలపై వ్రాస్తుంటారు. 1966 మేలో రెడ్ గార్డులు సాంస్కృతిక విప్లవానికై ఉద్యమించారు. మిడిల్ స్కూలు నుండి వచ్చిన విద్యార్ధులు ఎర్రచొక్కాలు ధరించిరాగా, ఉత్తరోత్తరా హైస్కూళ్ళనుండి మిగిలినవారు జతచేరారు. వీరి సంఖ్య ఒకకోటి దాకావున్నది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు భయంతో పారిపోగా, 1966 నుండి విద్యారంగం స్ధంభించింది. గోడలపై లక్షపైగా పోస్టర్లు వెలిశాయి. హింసను బాగా ప్రోత్సహించే ఈ పోస్టర్ల వలన రెచ్చిపోయిన విద్యార్ధులు విధ్వంసకాండకు దిగారు.
రెడ్ గార్డుల విధ్వంస చర్య వలన ఎంతో ఆస్తి నష్టం జరుగగా, గ్రామస్థాయిలో 4 లక్షల మందిని వారు పొట్టనబెట్టుకున్నారు. పై స్ధాయిలో విద్రోహులను జైళ్ళలో పెట్టి, నానాచిత్ర హింసలతో చంపేశారు. వారి భార్యలను వీధులలో బహిరంగంగా అవమాన పరిచారు.
రెడ్ గార్డులు వీలైనన్ని చోట్ల ఆక్రమణచేశారు. రేడియో, టి.వి. స్టేషన్లుతో సహా ఈ అక్రమణకు గురయ్యాయి. కమ్యూన్లలో, విశ్వవిద్యాలయాలలో యించుమించు అంతర్యుద్ధం సాగింది.
ఇలా చెలరేగిన రెడ్ గార్డుల హింసాకాండను చౌ ఎన్ లై ఆపాలని ప్రయత్నించి విఫలుడైనాడు. 1967లో యిదంతా చూచి, మావో నిరాశచెంది, ఉద్యమాన్ని ఆపమని తన భార్యకు చెప్పాడు.
1967 సెప్టెంబరులో చియాంగ్ చింగ్ పిలుపునిస్తూ మాటలలో హింస చూపమన్నది. ఆయేడే మావో అధికారికంగా ఉద్యమానికి మద్దత్తు ఉపసంహరిస్తూ, దీనిని ఆపడానికి ప్రజావిమోచన దశాల్ని పంపవలసివచ్చింది. హింసకు దిగిన రెడ్ గార్డులను చంపేస్తామని ఉత్తరువులివ్వాల్సిన స్థితి వచ్చింది. మావో స్వయంకృతాపరాధాన్ని లింపియావోపై త్రోసేశారు.

Monday, July 23, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -2

ఈ వ్యాసావళి ఎందుకు వ్రాయవలసి వచ్చింది

మనకు కారల్ మార్క్సు మూడు విధాలుగా తెలుసు. కమ్యూనిస్టులు ప్రచారం చేయగా అందరి నోళ్ళలో పడిన మార్క్సు. కమ్యూనిస్టు వ్యతిరేకులు దూషించగా లోకానికి తెలిసిన మార్క్సు. అసలు అతని రచనలు చదవగా తెలిసిన మార్క్సు. కానీ, ఈ మూడవ పద్ధతిలో మార్క్సు బహు కొద్దిమందికే తెలుసు.
కమ్యూనిస్టు వ్యతిరేకులు యథాశక్తి మార్క్సును వక్రీకరించారు, దూషించారు. చిలవలు పలవలు చేసి చూపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఇందులో ఆశ్చర్యం లేదు. వారు కమ్యూనిస్టు వ్యతిరేకులు గనుక.
కాని, మార్క్సుకు, మార్క్సిజానికి వారసులు కావలసిన -- అయినామని చెప్పుకుంటున్న - కమ్యూనిస్టులు మార్క్సిజాన్ని ఎందుకు పెడదారిన పట్టించారు. ఇది ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. కమ్యూనిస్టులలో ఒకసారి ఆకాశానికెత్తడం, మరొకసారి దేశద్రోహి అనడం, ఇలా మాటి మాటీకీ మాట మార్చడం తరచుగా చూస్తున్న సంగతే.
కాని కనీసం వారి మూలవిరాట్టు మార్క్సుకైనా ఈ పద్ధతిని అన్వయించ రనుకున్నాను. చివరకు మార్క్సు కూడా కమ్యూనిస్టుల చేతిలో నలిగి పెడమార్గాన పడక తప్పలేదు.
మరి, మూడవ వర్గం ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న రావచ్చు. మార్క్సు రచనలు చదివి అవగాహన చేసుకుని సరిగా లోకానికి చెప్పవచ్చు కదా. మార్క్సు రచనలన్నీ చాలాకాలం లోకానికి వెల్లడి కాలేదు. ఈనాటీకీ బయటకు రావలసిన ఉన్నాయంటే ఆశ్చర్యమే కలుగుతుంది.

వెలుగు చూడని రచనలు
లెనిన్ బ్రతికుండగా కొన్ని అతి ముఖ్యమైన సిద్ధాంత గ్రంథాలు వెలుగు చూడలేదు. ఆ తరవాత ప్రచురించిన వెంటనే ఉపసంహరించినవి ఉన్నాయి. ప్రచురించినా రష్యా పొలిమేరలు దాటనివి ఉన్నాయి. స్టాలిన్ అనంతరం బయటపడినవి ఉన్నాయి. అవి ఒక్కటొక్కటే మాస్కో నుంచి తొంగిచూస్తున్నాయి.
ఈలోగా మార్క్సును గురించి తుది వాక్యాలు లెనిన్ పలికాడు. కమ్యూనిస్టులు విన్నారు. ఆ తరువాత వచ్చిన మార్క్సు రచనలు అంతకు ముందు కమ్యూనిస్టుల భాష్యానికి భిన్నంగా ఉన్నవి. నాలుక కొరుక్కున్నా మాటమీద నిలబడక తప్పలేదు. లెనిన్ ను కాదనే సాహసం లేకపోయింది. లెనిన్ చెప్పిందే మార్క్సిజం, కమ్యూనిజం అన్నారు. అక్కడే ఉంది అశాస్త్రీయ ధోరణి.
ఆంధ్రప్రదేశ్ ను కానీ, ఆ మాటకొస్తే ఇండియాను కానీ చూడండి. మనకు కమ్యూనిస్టుల ద్వారానే మార్క్సు పరిచితుడు. సోవియట్ యూనియన్ చౌకగా సాహిత్యం అందించడం వల్ల మార్క్సురచనలు బహుళ ప్రచారం పొందడానికి వీలు కలిగింది.
కానీ, ఇవన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. మార్క్సు రచనలలో ముఖ్యమైనవి చాలా భాగం దేశీయ భాషలలోకి రాలేదు. రష్యాలో సైతం మార్క్సు సమగ్ర జీవితాన్ని 1973 లోనే ఆంగ్లంలో ప్రచురించారు. అది కూడా ముందు ఐరోపాలో వేరే వారు రాయడం వలన, రష్యాకు గత్యంతరం లేక ప్రచురించవలసి వచ్చింది. అలాగే మిగిలిన కొన్ని మార్క్సు రచనలు కూడా.
మార్క్సు రచనలు చదివి పచ్చి మార్క్సిస్టులైతే ఫర్వాలేదు. అందులో అర్ధం ఉంది. సబబుగా ఉంది. చాలామంది ఆ మార్గాన మార్క్సిస్టులు కాలేదు. నాయకులు చెప్పగా విని ఉద్రేకంతో మారారు. మార్క్సును కమ్యూనిస్టులు చెప్పిన భాష్యంలో చదివారు. ఒక్కక్క దేశం కమ్యూనిస్టులు మార్క్సును ఒక్కక్క విధంగా చిత్రించారు. కనుక సోవియట్ మార్క్సిజం, చైనా మార్క్సిజం, నేడు ఇటలీ మార్క్సిజం, ఫ్రెంచి మార్క్సిజం ఆని శాఖోపశాఖలై పాయలుగా చీలి ప్రవహిస్తున్నది. వారి వారి అవసరాలు అభిరుచులనుబట్టి ఆయా దేశాలను అనుసరిస్తూ, కమ్యూనిస్టులు మార్క్సిస్టులమంటున్నారు.

తెలుగులోనికి రాని రచనలు
మార్క్సు రచనలతో ఒక్క కమ్యూనిస్టు ప్రణాళిక మినహా ముఖ్యమైన గ్రంథం ఒక్కటీ తెలుగులో లేదు. ఇన్నాళ్ళు కమ్యూనిస్టులు దాచి, ఇప్పుడు తప్పనిసరై ప్రచురించిన గ్రంధాలు ఇప్పటిలో తెలుగులోకి వస్తాయని ఆశించలేము.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాసపరంపర రాయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఆంగ్లంలో మార్క్సును చదవడానికి వీలు లేనివారికి ఇవి మార్గగాములుగా, కనువిప్పుగా ఉండగలవని ఆశ. వైజ్ఞానిక దృక్పథం కలవారెవరైనా మార్క్సును అర్ధం చేసుకోవడానికి అతని మూలరచనలు చదవాలని అంగీకరిస్తారు. కమ్యూనిస్టులు సైతం లెనిన్ టీకా టిప్పణంపై ఆధారవడినా మూలాన్ని కాదనే సాహసం చేయరనుకుంటాను.
మార్క్సు రచనలన్నీ నేడు 100 సంపుటాలుగా ఐరోపాలోనూ, 50 సంపుటాలుగా రష్యాలోనూ ప్ర.చురిస్తున్నారు. ఎంగెల్సు రచనలు కూడా ఇందులో ఉన్నవి. మార్క్సు జీవితంపై కూడా సమగ్రపరిశోధన జరిగింది. దీనిని బట్టి ఇన్నాళ్ళు కమ్యూనిస్టులు మార్క్సుకు గ్రహణం పట్టించారని స్పష్టపడుతున్నది.
దాచేస్తే దాగిన సత్యాలు
ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆధునిక పరిశోధన ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నది మార్క్సు జీవితం. రచనలు ఈ పరిశీలనకు నిలబడడమో, లేదో అన్నది చరిత్రకు సంబంధించిన అంశం. కాని ఒక సిద్ధాంతకర్తను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి మాత్రం అతని పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ దృష్టితో చూస్తే మార్క్సు జీవితంలో అనేక ఘట్టాలను కమ్యూనిస్టులు నేటికీ దాస్తున్నారు. ఇది మరీ ఘోరం.
ఈ వ్యాసాలకు మార్క్సు రచనలను, మార్క్సును నిష్పాక్షికంగా పరిశీలించిన వారి రచనలే ఆధారం. మార్క్సును గానీ, మార్క్సిజాన్ని గానీ విలువ గట్టడం, తెగడడం, పొగడడం ఇక్కడ తలపెట్టలేదు. వాస్తవాలను చెప్పడమే వీటి ప్రధానోద్దేశం.
మార్క్సు రచనలు - 1837 మొదలు 1882 వరకు చేసిన వాటిలో అత్యంత ప్రధానమైనవి. కమ్యూనిస్టులు బయట పెట్టలేదంటున్నాము కదా. వాటిలో మొదటిది, 1844లో పారిస్ లో ఉండగా రాసినది. తొలుత పేర్కొనదగినది. దీనిని ప్యారిస్ ప్రతులని పాశ్చాత్యులు, ఆర్ధిక తాత్విక ప్రతులు 1844 అని రష్యావారు పిలుస్తున్నారు.
రెండవది -- 1846 లో వ్రాసిన జర్మన్ ఐడియాలజీ. మూడవది -- అత్యంత ప్రాముఖ్యంగలది -- 1857లో వ్రాసిన రాజకీయ ఆర్ధిక శాస్త్ర నిశిత పరిశీలన - ప్రాతిపదికలు. నాలుగవది -- మార్క్సు తన క్యాపిటల్ ప్రథమ భాగం చివర చేర్చుదామని అనుకుని మానేసిన అధ్యాయం - 200 పుటలుగల ఉత్పత్తి విధానాల తక్షణ ఫలితాలు.
దాగుడు మూతలు
మొదటి మూడు నేటికీ ఆంగ్లంలో లభిస్తున్నాయి. నాలుగవది జర్మన్ ఫ్రెంచిభాషలలో తప్ప ఆంగ్లంలో ఇంకా రాలేదు. ఇలా రచనలు దాచి పెట్టడం ఒక భాగమైతే, మార్క్సు జీవిత విశేషాలను కప్పి పుచ్చడం మరొక భాగం. ఈ దాగుడు మూతల ఫలితం చాలా ఉంది. కనుకనే ఇది వ్రాయవలసి వచ్చింది.
మూల పురుషుడైన మార్క్సునే ఇలా చేయగల కమ్యూనిస్టుల రాజ్య విధానం విచిత్రమైనది. మార్క్సుకే ఇలా జరిగినప్పుడు మిగిలినవారి గతి ఇక చెప్పనక్కరలేదు. ఆ కమ్యూనిస్టులు తమకు నచ్చిన, తాము మెచ్చిన మార్క్సునే బయట పెట్టగా, అర్ధం అయీ కాక వారిని అనుసరించిన వారిని చూస్తే జాలేస్తుంది.
మన విశ్వవిద్యాలయాలలో, పాఠ్య ప్రణాళికలలో ఇది వరకు మార్క్సు జోలికి ఎవరూ పోయేవారు కాదు. ఇప్పుడిప్పుడే కొద్ది మోతాదులలో మార్క్సును ప్రవేశపెడుతున్నారు. అయినా, వక్రీకరించడం విపరీతంగా జరుగుతున్నది.
వీటన్నిటి దృష్ట్యా కూడా మార్క్సు విషయమై సమగ్ర పరిశీలన అవసరం.


చాలా కాలం వరకు వెలుగు చూడని మార్క్స్ రచన పారిస్ ప్రతులు

1844 ఏప్రిల్ - ఆగస్టు మధ్య పారిస్ లో ప్రవాస జీవితం గడుపు తుండగా మార్క్సు ఆర్ధిక శాస్త్రాలను అవపోశనం పట్టాడు. భార్య జెన్ని పిల్లలతో పుట్టింటికి వెళ్ళగా, బాదరబందీ లేని మార్క్సు రచనకు ఉపక్రమించాడు. అవే నేడు ఆర్ధిక, తాత్విక ప్రతులుగా చలామణి అవుతున్నాయి. అప్పుడే మార్క్సు కొత్తగా కమ్యూనిస్టు అయ్యాడు. 26 ఏళ్ళ మార్క్సు తాను సంతరించిన భావాలకు ఒక రూవం ఇవ్వ సంకల్పించి చేసిన రచనలే ఇవి. పోయినవి పోగా, మిగిలినవి మాత్రం లోకాన్ని చూడక, అంధకారంలో మ్రగ్గుతూ, లెనిన్ చనిపోయిన ఎనిమిదేళ్ళకు మాస్కోలో తొలిసారి తొంగి చూశాయి.
1932లో మొదటి ప్రచురణకు నోచుకున్న మార్క్సు పారిస్ ప్రతులు కారణాంతాలచే రష్యా బయటకు రాలేదు. నాడు రష్యాకు, బయటి ప్రపంచానికీ సన్నిహితత్వం అంతగా లేనందున, మాస్కోలో ప్రచురణ ఎవరి దృష్టికి రాలేదు. ఇక తొలి ఆంగ్లానువాద ముద్రణ 1959లో గాని జరగలేదు. (MARX – Economic and Philosophic Manuscripts of 1844 – Progress Publishers, Moscow 1974లో పుట 184 చూడండి. మొత్తం మీద మార్క్సు వ్రాసిన అనంతరం 88 ఏళ్ళకు మాస్కోలో ప్రజల మధ్య పడిన ఈ అసంపూర్తి రచనలకు చాలా ప్రాధాన్యత లభించింది. అందుకు కారణం అందులోని విషయమే.
రాజకీయ, ఆర్ధిక పరిశీలన నిశితంగా చేయదలచి రచనకు ఉపక్రమించిన మార్క్సు చిన్న కరపత్రాలుగా న్యాయశాస్త్రం నీతి, రాజకీయాల గురించి వ్రాద్దామనుకున్నాడు. ఈ తలంపుతో లెస్కీ అనే ప్రచురణకర్తతో ఒడంబడిక చేసుకున్నాడు. కాని, అనుకున్నట్టు వ్రాయలేకపోగా, మిగిలినవే ఈ పారిస్ ప్రతులు.
మార్క్సు అంతకు ముందు ప్రధానంగా తీవ్రభావాలుగల నాస్తికుడు, తాత్త్వికుడు, మార్క్సును ఆర్ధిక విషయాలపై దృష్టి మళ్ళించిన వాడు ఎంగెల్సు. అతడు రాసిన రాజకీయ, ఆర్ధిక విషయాల నిశిత పరిశీలన మార్క్సును ప్రభావితం చేసింది. అప్పుడు ఆడం స్మిత్, రికార్డో, సే, వైట్లింగ్ ఓవెన్, మిల్ మాల్తన్, ప్రౌధాన్ లను ఇతర ఫ్రెంచి, ఆంగ్ల సోషలిస్టులను మార్క్సు పట్టి చూచి, తరువాత, రచనకు ఉపక్రమించాడు.
ఈ రచన ప్రాధాన్యత యేమిటి ? అని పరిశీలిస్తే కమ్యూనిస్టులు ఇన్నాళ్ళూ ఎందుకు తొక్కిపట్టారో ఊహించుకోవచ్చు.
పారిస్ ప్రతుల పేరిట మార్క్సు చేసిన రచనలు నాలుగు భాగాలుగా ఉన్నవి. మొత్తం 146 పుటలు (ప్రోగ్రస్ పబ్లిషర్స్, మాస్కో 1974) మొదటి భాగంలో వేతనాలు పెట్టుబడి, లాభం, భూమిపై అద్దె అనే అంశాల చర్చ ఉన్నది. రెండవ భాగం సగం నుంచి ప్రారంభమౌతున్నది. అంటే కొంత రచన అసలు కనపడకుండా పోయింది. మూడవ భాగంలో ప్రైవేటు ఆస్తి శ్రమ, ప్రైవేటు ఆస్తి - కమ్యూనిజంపై చర్చ ఉన్నది. నాల్గవ భాగంలో హెగెల్ తత్వ విమర్శ కనబడుతుంది. ఈ నాలుగు భాగాలలో మకుటాయమానమయిన విషయాలు వైమనస్యత, మానవుని విమోచనలనేవి. (More...)

నర హంతకులు -10

Click on photo to enlarge

Durban Sign 1989: జాతి వివక్ష
Courtesy:Wikimedia Commons

రంగుటద్దాలలో జాతి వైషమ్యం
ఆఫ్రికాలో జాతి విచక్షణ సర్వసాధారణమైపోయింది. పేరుకు దక్షిణాఫ్రికాను వేలెత్తి చూపడమేగాని, ఆచరణలో ఆఫ్రికా అంతటా యీ జాడ్యం అమలులో వున్నది.
టునీషియా, ఈజిప్టు, లిబియా, అల్జీరియా మొరాకోలో యూదులను బలవంతంగా వెళ్ళగొట్టి మిగిలిన కొద్దిమందిని అంటరానివారుగా దూరం పెట్టారు. ఇది ఎప్పుడోకాదు 20వ శతాబ్దం రెండో భాగంలో, 1950, 1960లో 10 లక్షల మంది యూదులను తరిమేశారు. టాంజనియా రిపబ్లిక్ నుండి అరబ్బులను 1960లో దేశ బహిష్కరణ చేసి, యింకా మిగిలిన వారికి సమాన హక్కులు లేకుండా చేశారు. తూర్పు మధ్య ఆఫ్రికా దేశాలలో 1970 తరువాత కూడా ఆసియావాసులను వెళ్ళగొట్టారు. 1982 ఆసియా వారిని వెళ్ళిపొమ్మని కీన్యా ఆదేశించింది. 1972లో అమీన్ నాయకత్వాన ఉగాండాలో ఆసియా వారిని తరిమేశారు. ఆఫ్రికా అంతటా ఆసియావాసులపై దాడులకు, వెళ్ళగొట్టడానికి అక్కడి పత్రికలు కూడా తోడ్పడుతున్నాయి.
ఆసియా డాక్టర్లు ఆఫ్రికాలో నల్లవారిని చంపేస్తున్నారనేటంత వరకూ ప్రచారం వున్నది. ఆదివాసుల ముఠాల మధ్య కలహాలు తరచు పరస్పరం హత్యలు చేసుకునేటంత వరకూ పోతున్నది.
దక్షిణాఫ్రికా మాత్రం కొటోచ్చినట్లుగా జాతి విచక్షణ పాటించింది. ప్రపంచ దేశాల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా దక్షిణాఫ్రికా యీ రంగు భేదాన్ని ఆచరించడానికి, వారి ఆర్థిక భద్రత చాలా వరకూ తోడ్పడుతున్నది.
దక్షిణాఫ్రికాలో తెల్లవారు తక్కువ సంఖ్యలో వుంటూ అధిక సంఖ్యాకులైన నీగ్రోలపై పెత్తనం చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వారు 38 లక్షల మంది వుండగా, నీగ్రోలు 1 కోటి 50 లక్షలున్నారు. మిగిలిన వారు 36 లక్షలున్నారు. దక్షిణాఫ్రికా జాతి విచక్షణలో రాక్షసకృత్యాలకు నాయకత్వం వహించినవారు స్మట్స్, వెర్ హార్డ్, బోతా 1911లోనే నల్లవారి సమ్మెలు చట్టవిరుద్దమని పేర్కొంటూ, కొన్ని రకాల ఉద్యోగాలు తెల్లవారికి మాత్రమే పరిమితం చేశారు. అంతేగాక తెల్లవారు, నల్లవారు వుండే ప్రాంతాలను పేర్కొంటూ 1913లో చట్టం చేశారు. ఆ తరువాత తరచు చేస్తూపోయిన చట్టాలన్నీ జాతి విచక్షణను పాటించినవే జీతాలలో ఉద్యోగాలలో, వివాహాలలో యీ విచక్షణ చూపారు.
స్మట్స్ ఆధ్వర్వాన 1921లో మూకుమ్మడి హత్యాకాండ ఆరంభమైంది. ఆఫ్రికాలోని ఇజ్రాయిల్ తెగను తెగనరికించాడు. 1922లో నీగ్రో తిరుగుబాటు దార్లలో 700 మందిని రాండ్లో చంపేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం సందర్భంగా స్మట్స్ తన దహనకొండను ఉధృతం చేశాడు. భారతీయులు తెల్లవారి నివాస ప్రాంతాలకు రాకూడదన్నారు. ప్రత్యేక ప్రాతినిధ్యపు చట్టం తెచ్చారు 1951లో.
తెల్లవారికీ, నల్లవారికి మధ్య వెళ్ళిళ్లు నిషేధిస్తూ 1949లో చట్టం చేశారు. షాపులు, నివాసాలు ఎవరికి వారే వుండేటట్లు వేరుపరచారు. దీనికి గాను అనేక చోట్ల బుల్ డోజర్లు పెట్టి ఇళ్లను, షాపులను నేల మట్టం చేశారు. 1950లో కమ్యూనిజం అణచివేత చట్టం తెచ్చారు.
1950లో వెర్ వోర్డ్ దేశీయ వ్యవహారాల మంత్రిగా రావడంతో హింసాకాండ యింకా హెచ్చు పెరిగి పోయింది. 1958లో యితడు దక్షిణాఫ్రికా ప్రథాని అయ్యాడు. ఈయన విద్యారంగంలో జాతి విచక్షణ ప్రవేశపెట్టి పాఠ్య ప్రణాళికను, స్కూళ్ళను వేరు పరచాడు సంస్కృతి ఆటలు, దేవాలయాలతో సహా అన్ని రంగాలకూ విచక్షణను వెర్ వోర్డ్ విస్తరించాడు. 1959 నాటికి ఈ కార్యక్రమం పూర్తి అయింది. 1960లో 69 నీగ్రోలను కాల్చి చంపారు. ఎప్పటికప్పుడు జాతి విచక్షణను సమర్ధించుకుంటున్న దక్షిణాఫ్రికా కామన్వెల్త్ నుండి వైదొలగింది.
1973లో సైతం 44885 నీగ్రో కుటుంబాలను, బలవంతంగా తెల్లవారి ప్రాంతాల నుండి తొలగించారు. 1513 తెల్లవారి కుటుంబాలను నీగ్రోలకు దూరం చేశారు. ప్రపంచమంతా నిరసిస్తున్నా దక్షిణాఫ్రికా జాతి విచక్షణ పాటిస్తూ, నీగ్రోలను దారుణంగా చంపించింది బోతా దీనికి ఆధ్వర్యం వహించాడు. విదేశీ పత్రికలు, రేడియో, టి.వి.లపై నిషేధం పెట్టారు. దక్షిణాఫ్రికా ఆర్ధిక వ్యవస్థబాగా వున్నందువలన బోతా తన కిరాతక చర్యల్ని నిరాఘాటంగా సాగించాడు. దక్షిణాఫ్రికా పోరాటంలో తోడ్పడుతూ, గెరిల్లా పోరాటాలు చేస్తున్న వారిపై సరిహద్దు ప్రాంతాలలో తరచు దండయాత్ర చేసి చంపారు.

సుకర్నో విలాసవంత దారుణాలుఇండోనీషియా ఆధిపతిగా సుకర్నో విలాస జీవితం గడిపాడు. నగ్నసుందరులతో మాట్లాడుతున్న ఆయన్ను చూచి రష్యా అధినేత కృశ్చేవ్ ఆశ్చర్యపోయాడు. సుకర్నో ఎప్పటికప్పుడు కొత్త నినాదాలిస్తూ, జీవితాంతం తానే ఆధ్యక్షుడుగా వుండాలనే అధికారాన్ని సంక్రమింపచేసుకున్నాడు. అలీన దేశాల సమావేశం బాండుంగ్ లో జరిగినప్పుడు సుకర్నో అధ్యక్షత వహించాడు. దేశంలో పార్టీలు లేకుండా చేసిన సుకర్నో మార్గదర్శక ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ అంటూ కొత్త నినాదాలిచ్చాడు దేశంలోని సమస్యల నుండి దృష్టి మళ్ళించడానికి విదేశీ విధానంపై కొత్త ఆకర్షణీయ ప్రసంగాలు చేస్తుండేవాడు, తటస్త విధానాం కావాలనేవాడు.
ఇండో చైనాలో వున్న చైనీయులను, నానా హింసలు పాలు చేసి సుకర్నో జకార్తా-నాంపే, జీజింగ్, పై నోగియాంగ్ సమైక్యత అంటుండేవాడు. తన దేశంలో వున్న అంతర్జాతీయ బారస్కేట్ ఉద్యమంపై దాడి చేశాడు.
మలేషియాను అణచివేయాలనే దురాక్రమణ నినాదాన్ని యిచ్చిన సుకర్నో 1963లో మలేషియాను ఆక్రమించుకోవడంలో విఫలుడయ్యాడు. కాని అంతకుముందు సంవత్సరం పశ్చిమ ఇరియాను, కబళించి, విజయోత్సవం జరుపుకున్నాడు.
బహుభార్యలతో, ఉంపుడు గత్తెలతో కులుకుతూ కాలం గడిపిన సుకర్నో సెక్స్ జీవితాన్ని చైనీయులు సినిమా తీశారు. రాను రాను ఇండోనీషియా ఆర్ధిక జీవనం దుర్బరంగా తయారైంది దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర వహించిన చైనీయుల్ని సుకర్నో హతమార్చాడు. విదేశీయులెవ్వరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. 1965 నాటికి ఏమి చేయలేక తన నిస్సహాయతను బయటపెట్టుకోడానికి ఇష్టం లేని సుకర్నో ఇండోనీషియా కమ్యూనిస్టు పార్టీని కుట్ర చేయమని సైగ చేశాడు.
1963-64 రష్యా సహాయంతో మలేషియాపై దాడి చేసినప్పుడే సుకర్నో కుయుక్తులు కమ్యూనిస్టులకు తెలిసి వుండాలి. ఈసారి పెకింగ్ అనుకూల కమ్యూనిస్టు పార్టీ సహాయంతో సైనిక ప్రాబల్యాన్ని కొట్టేయాలని సుకర్నో తలపెట్టాడు. కమ్యూనిస్టులు అదే అదను అనుకొని కొన్ని జిల్లాలను కైవశం చేసుకున్నారు.
1965 అక్టోబరు 18న కమ్యూనిస్టులు, సైన్యాధిపతి జనరల్ అబ్దుల్ యానీని, మరో ఇరువుర్ని కాల్చి చంపారు. రక్షణ మంత్రి కుమార్తెను చంపారు. ముగ్గురు జనరల్స్ ను చిత్ర హింసచేసి చంపారు. చిత్రహింస అంటే ఇండోనేషియా పద్దతిలో కమ్యూనిస్టు స్ర్తీలు, వారి పిల్లలూ కలిసి, కళ్ళుపీకి, మర్మావయాలు కోసి, దేహాన్ని మొసళ్ళకు వేశారు. కమ్యూనిస్టులు చేసిన యీ కిరాతక కృత్యాలన్నీ క్రమంగా వెల్లడయ్యాయి.
జనరల్ సుహార్తో నాయకత్వాన సైన్యం కమ్యూనిస్టుల కుట్రను ఎదిరించి భగ్నం చేయగలిగింది. వారు పగ తీర్చుకున్నారు. 1965 అక్టోబరు 3న పగ సాధింపు ప్రారంభమైంది. ఒక క్రమ పద్దతిలో కమ్యూనిస్టులను వూచకోతకు గురిచేశారు. మొత్తం 3 లక్షల మంది కమ్యూనిస్టులను చంపారు.
సుకర్నో నిస్సహాయుడై, తన స్వయంకృతాపరాధాలకు పరిహారం అనుభవిస్తూ, నిర్బంధానికి గురైనాడు. తరువాత సుహార్తో రాజ్యాధిపతి అయ్యాడు. 20వ శతాబ్దంలో ఇంతమంది కమ్యూనిస్టులను చంపుతుంటే, కమ్యూనిస్టు అగ్ర రాజ్యాలు సైతం ఏమీ చేయలేక పోయాయి.

Wednesday, July 18, 2007

మీ ప్రశ్నలు, మా సమాధానాలు -2

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు

కొత్త పాళీ said... June 5, 2007
సార్ మీరు ఎంతో అనుభవజ్ఞులు, పెద్దవారు, ఇలా అంటున్నందుకు మన్నించండి. ఈ తీరుగా రాసిన జ్ఞాపకాల వల్ల ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ టపా చదివితే చాలా వరకూ ప్రముఖ రాజకీయుల పేర్ల జాబితా (name dropping) గానూ, కొంత స్వోత్కర్షగానూ అనిపించింది.
ఆ కాలపు రాజకీయ వాతావరణం గురించో, పరిస్థితుల గురించో, వ్యక్తుల గురించో ఈ కాలం వాళ్ళు తెలుసుకోదగిన విషయాలు రాస్తే బాగుంటుంది. - కొ.పా

Aswini Kumar. said…..

సార్,
మీరు ఎంతో మందిని కలిసారు, వారితొ interact అయ్యారు. మేము తెలుసుకొవలిసింది, దానిలొ ఎమయిన వుంటే, అప్పటి సాంఘిక, రాజకియ ,ఆర్థిక విషయాల గురించి, తెలిపితె ఉపయొగంగా వుంటుంది.
అ.కు

Cbrao says….

మీరడిగిన రాజకీయ వాతావరణం, పరిస్థితులు , వ్యక్తుల గురించి ఇన్నయ్య గారు, చాలా పుస్తకాలు గతంలోనే వెలువరించి ఉన్నారు. ఇన్నయ్య గారి పుస్తకాలకై ఇక్కడ చూడండి.

1) Library of Congress, Washington, D.C.
http://www.loc.gov/help/contact-general.html
Search for innaiah at Library of Congress Online Catalogue
2) Amazon.com
3) avkf.org
4) Visalandhra Book House, Hyderabad.
Latest Telugu books of Innaiah

Download list of Sri Innaiah’s books available at 1 to 3 of above organizations.

మీరు వెళ్ళడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఆనాటి నుండి ఈనాటి వరకు గల రాజకీయ, సాంఘిక పరిస్తితులను వెల్లడించిన ఇన్నయ్య గారి పుస్తకాన్ని, మీ సౌకర్యం కోసం e-పుస్తకముగా అందిస్తున్నాము.ఆంధ్ర ప్రదెష్ ఏర్పడటానికి దోహదం చేసిన పరిస్థితులు ఆసక్తికరంగా ఉంటాయి. అందులో, రాజకీయ వాదులతో పాటు, పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయి. సమకాలీన సాంఘిక - రాజకీయ స్తితిగతులను బేరీజు వేసి, తెలుసుకోవటం భావితరాలవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తమిళ పాలన నుండి బయట పడిన ఆంధ్రులు, నైజాం నిరంకుశ పెత్తనం నుండి విమోచన పొందిన తెలుగువారు కలిసి విశాలాంధ్ర గా ఏర్పడ్డారు. ఇందుకు భాష, సంస్కృతి, సంస్కరణలు అక్కరకు ఒచ్చాయి.మళ్ళే ఇప్పుడు అదే ప్రజలు చీలిపోయే ధొరణిలో ఉన్నారు. వీటన్నిటి వెనక ఉన్న రాజకీయాలు, సమాజ పరిణామాలు కూలంకషగా వందేళ్ళ పాటు ఎలా మారుతూ వచ్చాయో వీక్షించిన చరిత్ర ఇది.ఏ పార్టీకి చెందకుండా చేసిన నిశిత పరిశీలన.వ్యక్తుల పాత్ర, పార్టీల ధొరణి, సంఘాల పోకడ మిళితం చేసి చూసిన, గ్రంధం ఇది.సమాచారదర్శినిగాను, విధ్యార్ధులకు ఉపకరించే విషయం గా కూడా, ఈ e-పుస్తకము ఉపయుక్తకరంగా ఉండగలదని, మా భావన.

Microsoft Word - A Centure of Politics
Microsoft Word - A...
Hosted by eSnips

Sunday, July 15, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం
ఈ వారంలో ఇన్నయ్య గారి సీరియల్ 'వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు': అయిపోయింది. గత నెలలో చెప్పినట్లుగా, కొత్త సీరియల్ కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం ఈ రోజు ప్రారంభిస్తున్నాము. దీని పూర్వాపరాలు June 11, 2007 నాటి టపా లో మీకు తెలియపరిచాము.ఎప్పటివలే చదివి, మీ అభిప్రాయాలు తెలియచేయగలరు.

-cbrao

కారల్ మార్క్సుకు
కమ్యూనిస్టులు
పట్టించిన గ్రహణం
ఎన్. ఇన్నయ్య


భాను ప్రచురణలు
ఆకునూరు


పరిచయం


మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా ఈ గ్రంథపు మొదటి భాగం వ్యాసరూపంగా అచ్చయింది. సహజంగా, మేథావి వర్గంలో కొంత ఆసక్తిని, సంచలనాన్ని కలిగించాయి ఈ వ్యాసాలు. తర్జనభర్జనలు సాగాయి. ఎవరీ గ్రంథకర్త? ఇంతకూ అతను ఏం చెప్పదలిచాడు? ఈ గ్రంథ అంతరార్ధ మేమిటి? ఇవీ ప్రశ్నలు.
ఏ సిద్ధాంతాన్ని అయినా మూడు విధాలుగా పరిశీలించ వచ్చును. 1. వ్యతిరేక దృష్టి, 2. అంధ విశ్వాస వైఖరి, 3. విశ్లేషణాయుతమైన విమర్శనా పద్ధతి. ఇందులో మూడవ విధానాన్ని అవలంబించాడు శ్రీ ఇన్నయ్య. కావలసిన కారం, మందు గుండు సామగ్రి అందించలేదని రచయిత పై మార్క్సిజం పట్ల వ్యతిరేకులకు కోపం వచ్చింది. తమ ఆరాధ్య దైవాన్ని, తమ జీవితంలో భాగమైన తమ అభిమాన సిద్ధాంతాన్ని కొంతగా కొంతైనా విమర్శకు గురిచేసి దెబ్బతీశాడనే భావంతో మార్క్సిజాన్ని పిడివాదంగా స్వీకరించిన వారికి గ్రంథకర్తపై ద్వేషం కలిగింది. సహృదయులు మాత్రం ఓపికగా పరిశీలనకు పూను కున్నారు.
ఈ గ్రంథ లక్ష్యం చాలా పరిమితంగా కనపడుతుంది. మార్క్సిజంను గురించి సాకల్యంగా, కూలంకషంగా వివరించడం ఈ రచన ఉద్దేశం కాదు. మార్క్సు రచనలను కొన్నింటిని, జీవిత విశేషాలు కొన్నింటిని సోవియటు కమ్యూనిస్టు పార్టీ వారు బుద్ధి పూర్వకంగా ఆలస్యంగా ప్రచురించారనేదే విమర్శ. ఈ నేరారోపణ చేయటానికి సమాచారమూ, ధైర్యమూ కావాలి. ఈ రెండూ శ్రీ ఇన్నయ్యకు ఉన్నాయి. అధ్యాపకుడుగా నిజమైన విద్యార్ధిగా విషయ సేకరణలో శ్రీ ఇన్నయ్య సిద్ధ హస్తుడు. ఎమ్. ఎన్. రాయ్ భావ ప్రభావితుడై, అతని ఆలోచనా రీతిని ఆకళింపు చేసుకున్నవాడై, విశ్లేషణా పద్ధతిని సంతరించుకున్నాడు రచయిత. విమర్శకుడుగా ధైర్యం కావలసినంత ఉన్నది. ఇంకేం ప్రేల్చాడు ఫిరంగిని.
సోవియటు కమ్యూనిస్టులను దోషులుగా చిత్రిస్తూ వారు త్రొక్కి పెట్టారన్న రచనలను పేర్కొన్నాడు శ్రీ ఇన్నయ్య. 1. ప్యారిన్ ప్రతులు లేక 1844 ఆర్ధిక తాత్విక ప్రతులుగా పేరు పొందినది. 2. జర్మన్ ఐడియాలజీ (1846) 3. రాజకీయ ఆర్ధిక శాస్త్ర ప్రాతిపదికలు (1857) 4. కాపిటల్ ప్రథమ భాగం చివర చేర్చుటకు ఉద్దేశింపబడిన అధ్యాయం ఉత్పత్తి విధానాల తక్షణ ఫలితాలు.
1844 ప్రతుల తొలి ముద్రణ 1932లో, బహుళ ప్రచారం పొందిన ముద్రణ 1959లో, జర్మన్ ఐడియాలజీ తొలి ముద్రణ 1927లో, ప్రాతిపదికలు 1939లో అచ్చు అయింది మొదటిసారి. ఉత్పత్తి విధానాల తక్షణ ఫలితాలు 1933లో రష్యను భాషలో వెలుగు చూచింది. ఆంగ్లాను వాదం కాలేదు. ఈ ఆలస్యానికి కారణాలు బలీయమనీ శ్రీ ఇన్నయ్య అంటుంటే సోవియటు కమ్యూనిస్టు పార్టీ అభిమానులు ఆలస్యానికి విశేషార్ధం లేదంటున్నారు. గ్రంథం పూర్తిగా చదివితే ఇన్నయ్యగారి ఆరోపణలలో సత్యం లేకపోలేదని తేటతెల్లమవుతుంది.

కాగా రచయిత స్వరూపమేమిటి ? అనే ప్రశ్న పాఠకుడికి తరచు తగులు తుంది. రచయితను స్ధూలంగా మార్క్సిస్టు హ్యూమనిస్టు అని అభివర్ణించవచ్చు. మార్క్సు వై మనస్యతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని, అదే మార్క్సు మూల సిద్ధాంతమనీ, తతిమ్మావన్నీ దానికనుగుణమని ఈ కోవకు చెందిన వారు వాదిస్తారు. వై మనస్యతకు మార్క్సు మొదట్లో ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవమేనని అందువల్ల మార్క్సు మానవ వాదియని కమ్యూనిస్టులూ, ఎమ్.ఎన్.రాయ్ అనుచరులైన భారత దేశపు రాడికల్ హ్యూమనిస్టులు అంగీకరిస్తారు. సమాజ సమస్యా విశ్లేషణానికి ఆర్ధిక నియతి వాదాన్ని వినియోగించటంలోనూ, సమాజాన్ని మార్చటానికి పేర్కొన్న రీతులు విధానాల సందర్భంగానూ మార్క్సు మానవవాద వ్యతిరేక ధోరణులను అవలంబించాడనీ హ్యూమనిస్టుల భావన. అలా కాక మానవ వాదానికి సంపూర్ణతను ప్రసాదించాడనీ సంప్రదాయ కమ్యూనిస్టుల వాదన. ఇలా మూడు వాదనలు ప్రబలంగా ఉన్నాయి.

మనిషి స్వభావానికి అనుగుణంగా ఉత్పత్తి జరగనప్పుడు, శ్రమ చేసిన వ్యక్తికి విముఖత కలుగుతుంది. తాను చేసే పని బలవంతపు పరిస్థితులలో చేస్తాడు. దీనినే వై మనస్యత అంటున్నారు. ఈ భావానికి లోనైన వ్యక్తికి తాను చేస్తున్న పని యొక్క సమగ్ర స్వరూపం అర్ధం కాదు. తాను తయారు చేసే వస్తువు, అలాగే ఇతరులు తయారు చేసే వస్తువుతో కలిసి ఎలా మరో పెద్ద వస్తువుగా ఎలా తయారవుతుందో తెలియదు. ఉదాహరణకు ఒక మోటారు కారు ఫ్యాక్టరీ తీసుకుంటే మోటారు కారులో ఒక భాగమైన ఒక రేకుకు చిల్లులు వేసే యంత్రాన్ని నడిపే కార్మికుడికి ఉత్పత్తి విధానం స్థూలంగా కూడా అర్ధం కాదు. తన పని తీరును నిర్ణయించేది తను కాదు. తన పని పరిస్థితులు నిర్ధారణ చేసేది తను కాదు. గతి లేక శ్రమ చేస్తుంటాడు. సహజంగా, తను చేసే పని మీద శ్రద్ధాసక్తులు ప్రదర్శించలేడు. తమ శ్రమ ఫలితంపై తనకు అధికారం లేదు. దాని వినియోగాన్ని శాసించేది ఇతరులు. ఇలాంటి పరిస్ధితులలో అతని వ్యక్తిత్వం నశిస్తుంది. ఈ వై మనస్యతకు పారిశ్రామిక కార్మికులు ఎక్కువ లోనవుతున్నారని మార్క్సు గ్రహించాడు. తమ జీవనోపాధికి అవసరమైన దానికన్నా ఎక్కువగా శ్రమిస్తే తప్ప కార్మికునికి భుక్తి దొరకడం లేదు. ఈ దయనీయ స్థితి చూసి మార్క్సు తల్లడిల్లి పోయాడు. మార్గాలు అన్వేషించాడు. వర్గ పోరాట చరిత్రే మానవ చరిత్ర అన్నాడు. సమాజంలో ఉండే ప్రధానమైన రెండు వర్గాలలో ఒకవర్గం రెండో వర్గాన్ని, దాని రాజకీయాధికారాన్ని నిర్మూలిస్తే తప్ప సమాజానికి విముక్తి లేదన్నాడు. వై మనస్యత పోదన్నాడు. అందుకై సమాజంలోని సంవదను సామాజికీకరణ చేయాలన్నాడు. సాయుధ విప్లవము శరణ్యమన్నాడు. సంధి కాలంలో శ్రామిక నియంతృత్వం వస్తుంది. చిట్టచివరి దశగా జర్మన్ ఐడియాలజీలో చిత్రించిన నాగరికత అవతరిస్తుంది. ఇలాంటి కమ్యూనిజంలో ఎవరికీ ఇతమిత్థమైన కార్యకలాపం అంటూ ఉండదు. తనకిష్టమైన చర్యలో వ్యక్తి పాల్గొంటాడు. ఉత్పత్తిని సమాజం క్రమబద్ధం చేస్తుంది. ఇవాళ ఒక పని చేస్తే రేపు ఇంకో పని చేస్తాడు. ఉదయం వేటాడితే, మధ్యాహ్నం చేపలు పడితే, సాయంత్రం పశువుల కావలా కాస్తే రాత్రి భోజనం వద్ద విమర్శ చేస్తాడు. కాని అంతమాత్రాన ఎవరికీ వేటకాడని, పశువుల కాపరియని, చేపలవాడని, విమర్శకుడని ముద్రలు వేయరు. అర్ధరహితమైన పని బలవంతంగా చేయవలసిన పని ఉండదు. ఇదీ మార్క్సు సిద్ధాంత సారం.
మార్క్సు సిద్ధాంతంలో భాగాలు మూడు. 1. మానవుని వైమనస్యత, 2. వైమనస్యత పోగొట్టడానికి మార్గాలు, 3. వైమనస్యత లేని సమాజ స్వరూపం. ఇలాంటి సమాజ స్థాపన మార్క్సు ఆదర్శం, లక్ష్యం. ఆ సమాజం అతని కలగా ఎంచవచ్చు. ఊహాలోకంలో విహరించే సోషలిస్టులని కమ్యూనిస్టులచే నిందింపబడేవారి కల లాంటిదే మార్క్సు ఊహా చిత్రణ. ఏదైనా ఊహలు లేకుండా అభ్యున్నతి కోసం ప్రయత్నం సాగదు. వచ్చిన చిక్కల్లా మార్గాల విధానాల నిర్ణయంలోనే ఉంటుంది.
సంప్రదాయ మార్కిస్టులు మార్క్సు విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ విధానం వల్ల ఏర్పడే కమ్యూనిస్టు సమాజంలో సంపద జాతీయీకరణ జరుగుచున్నది. ప్రభుత్వం జాతీయ సంపదకు యజమాని, పెత్తందారు. కనుక శాసన కర్త. వ్యక్తి పనిచేసే తీరు, పని విధానము పని పరిస్థితులు అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కనుక ఈ సమాజంలో కూడా వైమనన్యత పోదు. అయినా ఇలాంటి సమాజాన్నే సంప్రదాయ కమ్యూనిస్టులు కావాలంటున్నారు. దానికోసమే కృషి చేస్తున్నారు. కాబట్టి వైమనస్యతపై నొక్కు పెట్టే శ్రీ ఇన్నయ్య భావ స్రవంతి సంప్రదాయ కమ్యూనిస్టులకు నచ్చదు.
ఆదర్శ సమాజాన్ని సాధించడానికి మార్క్సు చెప్పిన విధానాలు లక్ష్యాన్ని సాధించలేవని ఎం.ఎన్.రాయ్ అభిప్రాయం. అదే నవ్య మానవ వాదుల ఆలోచనగా రూపొందింది. వ్యక్తిని నామమాత్రుని చేయటం, సమష్టియైన వర్గాన్ని ఉన్నతోన్నత స్థానంలో ఉంచటం జరుగుతున్నది. కమ్యూనిస్టు విప్లవ సాధన విధాన ఫలితంగా ఆర్ధర్ కోయిజ్లరు అన్నట్లు నేను అన్నది వ్యాకరణ శాస్త్రంలో భావన మాత్రమే. అంటే వ్యక్తికి స్థానం పోయింది. వ్యక్తి వైమనస్యతను పోగొట్టాలని తాపత్రయపడిన మార్క్సు చివరకు వ్యక్తినే నశింపు చేసే సమాజ నిర్మాణ విధానాన్నిసూచించాడు. ఇది మార్క్సిజం యొక్క ప్రత్యేకతయని హ్యూమనిస్టుల అభిప్రాయం. అందువల్లనే మానవ వాదిగా తాత్త్విక చింతన ప్రారంభించిన మార్క్సు సిద్ధాంతకారుడిగా మానవ వ్యతిరేకి అయినాడు. కనుక శ్రీ ఇన్నయ్య వైమనస్యత మాత్రమే నొక్కి చెప్తే, మార్క్సు తరువాత రచనలను, ఆలోచనా స్రవంతిని నిర్లక్ష్యం చేసినట్లు సంప్రదాయ రాడికల్ హ్యూమనిస్టులు అతనిని విమర్శిస్తున్నారు.
ఇలా రెండు రకాల విమర్శలను సంప్రదాయ కమ్యూనిస్టుల విమర్శలను, సంప్రదాయ రాడికల్ హ్యూమనిస్టుల విమర్శలను శ్రీ ఇన్నయ్య ఎదుర్కోవలసి వస్తున్నది. అతడు ఈ విషయమై మరో గ్రంథం రాస్తాడని ఆశించడంలో తప్పు లేదు.
గ్రంథం రెండవ భాగం మార్క్సుపై ఏంగిల్సు ప్రభావానికి సంబంధించినది. ఏంగిల్సు వల్ల మార్క్సు ఆర్ధిక శాస్త్రాధ్యయనంపై దృష్టి సారించాడనీ, ఏంగిల్సు గతి తార్కిక భౌతిక వాదాన్ని మార్క్సు యథాతథంగా ఆమోదించి సమాజానికి అన్వయించడం వల్ల చారిత్రక భౌతిక వాదం మార్క్సు ప్రవచించాడనేది ఒక ధోరణి. అలాకాక, మార్క్సు గతించినతరువాత మార్క్సు గ్రంథాల పరిష్కర్తగా, మార్క్సు ముఖ్య స్నేహితుడుగా ఏంగిల్సు మార్క్పిజానికి భాష్యకారుడు అయినాడు. అందులోనే ప్రమాదం ఉన్నది. వైమనస్యతకు
మానవుణ్ణి సముద్ధరించాలనే మార్క్సును ఏంగిల్సు కనుమరుగు చేశాడనేది మరో ధోరణి. ఈ రెండు ధోరణులను, భావాలను శ్రీ ఇన్నయ్య కొంతగా కొంత ప్రస్తావించాడు. ఈ రెండు విషయాలూ చాలా వివాదాస్పదాలు. ఐతే వివాదంలోనే శ్రీ ఇన్నయ్య రాణిస్తాడు నీళ్ళలో చేపలాగ.
విషయాలు ఇంకా వివరంగా రాస్తే బాగుండేదంటారు చదువరులు. నిజమే, దినపత్రిక చదువరికి మార్క్సిజాన్ని గురించి సమగ్రజ్ఞానం ఉంటుందనుకొని రాసినట్లుగా ఉన్నాయి వ్యాసాలు. శిసలైన రచయిత పత్రికా రచయితగా మారితే ఇదే ఇబ్బంది తటస్థిస్తుంది. రచనలో భావగాఢత, స్పష్టత, విశదీకరణ, శాశ్వతత్వము ఉంటాయి. రెంటినీ పోలిస్తే పత్రికా రచన తాత్కాలికం. గ్రంథ విస్తరణత్వానికి అవకాశం లేనిది. పైగా తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించేది. అందువల్ల కొన్ని విషయాలు చదువరులకు సుపరిచితమే అన్నట్లు నడుస్తుంది పత్రికా రచన. దాని స్వభావమే అది. శ్రీ ఇన్నయ్య తొలి దశలో పత్రికా రచయిత. తరువాత అధ్యాపకుడు అయి గ్రంథకర్తగా రూపొందాడు. ఇపుడు మరల పత్రికా రచయితగా మారాడు. కనుక శ్రీ ఇన్నయ్య వ్యాసాలలో రచనలో ఉండే భావగాఢత, సునిశితత్వము ఉన్నాయి. పత్రికా రచనలో ఉండే ఆసక్తిని రేకెత్తించడం, వివాదాన్ని ప్రోత్సహించడం, తీవ్రపదజాలం వాడడం ఇవన్నీ ఉన్నాయి. అతనిలో ఏ మోతాదు ఎక్కువ అనేది తాపీగా తేల్చవలసిన విషయం.
ఈ గ్రంథకర్త అధ్యయనవరుడు. ఎక్కువగా చదువుతాడు. బాగా ఆలోచిస్తాడు. భావప్రకటనకు వెనుదీయడు. నిర్భీతి అతని సొమ్ము. సమాజంలో ఇలాంటి వారిసంఖ్య బహుకొద్ది. వారి సంఖ్య పెరిగేకొలదీ సమాజాభివృద్ధికి అవకాశాలు పెచ్చు అవుతవి.
తను ఇంతవరకు సంపాదించిన జ్ఞానాన్ని, సంతరించిన పాండిత్యాన్ని వినియోగించి ఒక సమగ్ర తాత్విక రీతిని రూపొందిస్తూ శ్రీ ఇన్నయ్య రచన సాగిస్తాడని ఆశిద్దాం.

ఎం.వి. రామమూర్తి*.


*కీ.శే.మల్లాది రామమూర్తి,రాడికల్ హూమనిస్ట్ అసియేషన్ అధ్యక్షులుగా,Civil Liberties సంఘ నాయకులుగా,వికాసం మాస పత్రిక సంపాదకులుగా,ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సారధిగా పని చేసారు. తన భార్య మల్లాది సుబ్బమ్మను,మహిళా నాయకురాలిగా తీర్చి దిద్దారు. వీరు M.N.Roy అనుచరులు,లాయర్.

-cbrao

నర హంతకులు -9


స్పెయిన్ లో ఫ్రాంకో దహనకాండ

రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం 3 ఏళ్ళపాటు స్పెయిన్ లో దారుణమైన అంతర్యుద్ధం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మేధావులను, రచయితలను, జర్నలిస్టులను మభ్యపెట్టి, కమ్యూనిస్టులు తమ ప్రచార సాధనాలతో తమ కిరాతక చర్యలను కప్పిపుచ్చగలిగారు. అవి తరువాత గాని వెలుగులోకి రాలేదు.
సోషలిస్టు పార్టిలో వచ్చిన అంతఃకలహాలు స్పెయిన్ లో దేశ అంతర్యుద్ధానికి దారితీసింది. ప్రైమోడి రివేరా నియంతృత్వంతో చేతులు గలిపి సోషలిస్టు నాయకుడు ఫాన్స్ సినోలార్గో కాబెల్లెరో 1923 నుండి 30 వరకు పనిచేసాడు. కమ్యూనిస్టులు, అరాచక వాదులు కలిగిస్తున్న అలజడులను అణచివేస్తూ వచ్చారు. 1932 ఆగష్టులో జరిగిన సైనిక కుట్రను భగ్నం చేయగలిగారు. సోపలిస్టు పార్టి అధికారాన్ని చేపట్టాలని కాబెల్లెరో లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాని ఆయన పార్టిలో అతివాదులు చేరగా, ఆయనకు అదుపుతప్పింది. స్పెయిన్ లెనిన్ గా కాబెల్లెరోను చిత్రించి, అతి వాదనినాదాలిప్పించారు.
1933 నవంబరులో జరిగిన ఎన్నికలలో సోషలిస్టులు ఓడిపోగా యిక లాభం లేదని ప్రత్యక్ష చర్యలకు దిగారు. అరాచకవాదులు రైతుల్ని రెచ్చగొట్టగా సివిల్ గార్డులు నిర్ధాక్షిణ్యంగా అణచివేశారు.
సోషలిస్టు నాయకుడు హింసను రెచ్చగొట్టి, సమ్మెల్ని ప్రోత్సహించాడు. కాబెరెల్లో తలపెట్టిన సమ్మె విఫలంకాగా, రైతుల్ని బలవంతంగా లారీలలో ఎక్కించి వందలాది మైళ్ళ దూరాన వదిలేసింది సైన్యం. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో సైన్యాధిపతిగా ఈ సోషలిస్టు తిరుగుబాట్లను అణచివేశాడు. స్పెయిన్ లో సైన్యంలో వామపక్షం వారు దూరారు. కమ్యూనిస్టులు తరచు వారికి కరపత్రాలద్వారా, తదితరంగానూ ప్రచారంచేసి చర్యకు పురికొల్పుతుండేవారు.
1936 ఫిబ్రవరిలో పాపులర్ ఫ్రంట్ స్పెయిన్ లో ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఫ్రంట్ కు 50 శాతం ఓట్ల కంటే కొంచెం తక్కువ వచ్చాయి. వామపక్షాలతోపాటు, మితవాదులకు సైతం ఓట్లు పెరిగాయి. స్పెయిన్లో రెండోవిడత ఎన్నికలు జరిగితే గాని ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి బలం ఎవరికున్నదో తేలదు. కాని వామపక్షాలు ఆగకుండా తొలిఎన్నిక కాగానే ప్రభుత్వాన్ని ఏర్పరచారు. ఫ్రంట్లో మితవాద ప్రజాస్వామ్యపక్షం రోబ్లెస్నా నాయకత్వాన పోరాడి ఓట్లు పెంచుకున్నా సీట్లు తగ్గాయి.
1936 ఫిబ్రవరిలో అధికారాన్ని చేపట్టిన వామపక్ష ఫ్రంటు తక్షణమే చర్చీలను, కాన్వెంటులను తగులబెట్టే విధ్వంస కార్యక్రమం చేపట్టింది. పార్లమెంటులో ఏదో ఒక వంకతో మితవాదులను కూర్చోనివ్వకుండా ఆపారు. కమ్యూనిస్టుల ప్రభావం ఫ్రంటులో పెరిగింది. తెలివిగా, తక్కువ సీట్లు తెచ్చుకున్న కమ్యూనిస్టులు సోషలిస్టు యూత్ ఉద్యమంతో కలిశారు. విట్టోరియా కోడ్ విల్డా, శాంటి యాగోకారిల్టో అనే యిరువురూ ప్రముఖ కమ్యూనిస్టులుగా, రష్యా ఏజంట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫ్రంటువారు తక్షణ కార్యక్రమాన్ని ప్రకటించారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఫ్రంటు యివ్వలేక, వీధులలో యువకులను రెచ్చగొడుతూ, హింసను పురికొల్పారు.
1936 మేలో కమ్యూనిస్టుల చర్యలు ప్రారంభమైనాయి. సైన్యంలో తమకు అనుకూలురు కానివారిని సెలవుపై ఇళ్ళకు పంపారు. తరువాత పంటలు తగులబెట్టారు. ఫ్యాక్టరీలలో సమ్మెలు చేయించారు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. 160 చర్చీలు ద్వంసం చేశారు. 10 వార్తాపత్రికల్ని ఆపేశారు. 340 సమ్మెలు చేయించారు. రాజకీయ ప్రత్యర్దులను 269 మందిని చంపి మరో 1287 మందిని హింసించారు. మితవాదపార్లమెంటు నాయకుడు కాల్వోసోటెలోను 1936 జులై 11న చంపడంతో దేశంలో అంతర్యుద్ధానికి గంటకొట్టినట్టయింది.
1936 జులై 17న స్పెయిన్ లో అంతర్యుద్దం ప్రారంభమైంది. చర్చినుండి కాల్పులు సాగిస్తున్నారనే నెపంతో చర్చీలపై వామపక్షాలు దాడిచేశాయి. దేశంలో అంతర్యుద్ధ కారణంగా 11 మంది బిషప్పులను, పురోహితులను, మతగురువులను చంపేశారు. 283 నన్స్ ను హతమార్చారు. కొందరిని చెరచి, తరువాత చంపారు. కొందరు మతగురువులను సజీవ దహనం చేశారు. కొందరిని నిలువునా పాతేశారు. సోవియట్ రష్యా మద్దత్తుతో రహస్య పోలీస్ దళాలు బార్శిలోనాలో వామపక్షాలకు శిక్షణ ఇచ్చారు. కమ్యూనిస్టు యువ నాయకుడు గార్సియా అట్టూడెవ్ ఆధ్వర్యాన హత్యాకాండ విచ్చలవిడిగా సాగింది. దోచిన ఆస్తులతో, సంపదతో యితడు దక్షిణ అమెరికా పారిపోవడానికి ప్రయత్నిస్తే పట్టుబడ్డాడు. మొత్తం మీద కమ్యూనిస్టుల ఆధ్వర్యాన వామపక్షాల పేరిట 4 వేల మంది స్ర్తీలు, పిల్లలతో సహా మొత్తం 55 వేల మందిని చంపారు. ఇదంతా కప్పిపుచ్చడానికి ఆటోకాట్ధ్ పారిస్ లో ఒక కార్యాలయం పెట్టి ఫాసిస్టులు, జాతీయవాదులు హత్యాకాండ చేస్తున్నట్లు పుంఖాను పుంఖంగా అబద్ధాలు సృష్టించి, ప్రపంచాన్ని చాలా కాలం నమ్మించారు. ఇది కమ్యూనిస్టు కొమింటర్న్ విశ్వప్రయత్నాలలో ఒక భాగంగా సాగింది.
జాతీయ వాదులు చేసిన దారుణ హత్యాకాండ కమ్యూనిస్టులకు తీసిపోలేదు. మొత్తం 50 వేల మందిని చంపేసిన జాతీయవాదులు, పట్టుబడిన జనరల్స్ అడ్మిరల్స్ డిప్యూటీలను హతమార్చారు.
గవర్నరు, డాక్టర్లు, టీచర్లు కూడా జాతీయవాదుల బారిపడ్డారు. గ్రనాడాలో 8 వేలు, నవారేలో 8 వేలు, సెవిల్లిలో 9 వేలు, వల్గోడోలిత్లో 9 వేలు, సారగోసాలో 2 వేలు, బాలేరిక్ లో 3 వేల మందిని జాతీయవాదులు చంపేశారు.
ఫ్రాంకో 1936 జులై 16న టెట్యూషన్ కు వచ్చి ఇటలీ, జర్మనీ సహాయాన్ని అర్థించాడు. వెంటనే సహాయంరాగా, ఆగస్టు, సెప్టెంబరులో అంతర్యుద్ధం భవిష్యత్తు మారింది. కమ్యూనిస్టు ఫ్రంటుకు రష్యా ఫ్రాన్స్ సహాయం అందింది. ఆ విధంగా అంతర్యుద్ధం మరో రెండేళ్ళు సాగింది. జర్మనీవారు ఆయుధాలేగాక, సైనిక శిక్షణదారులను, సైన్యాన్ని కూడా ఫ్రాంకోకు అందించారు. అలాగే ముసోలినీ ఇటలీ కూడా సైన్యాన్ని, టాంకులను, ఆయుధాలను అందించింది. పోర్చుగీసు సహాయం కూడా ఫ్రాంకోకు వచ్చింది. ఇంకా మొరాకో సైన్యాలు వచ్చి అండగా నిలిచారు.
కమ్యూనిస్టులకు రష్యానుండి 900 టాంకులు, వెయ్యి విమానాలు, 900 సాయుధ శకటాలు, సైనిక సామాగ్రి వచ్చింది. ఫ్రెంచి సహయంలో 300 విమానాలున్నవి. కాని రష్యా అందించిన సహాయాన్ని స్పెయిన్ కమ్యూనిస్టులు సక్రమంగా వినియోగించుకోలేక పోయారు. జాతీయవాదుల దాడులతో వెనక్కు తగ్గిన కమ్యూనిస్టులు విదేశీ ఆయుదాలను శకటాలను ఎక్కడికక్కడే వదలేసి పారిపోగా, జాతీయవాదులు వాటిని స్వాధీనపరచుకొని వాడుకున్నారు.
రష్యా వెయ్యిమంది పైలట్లను, 2 వేల నిపుణులను పంపించింది. అటు కమ్యూనిస్టులకు యిటు జాతీయవాదులకు వచ్చిన విదేశీ సహాయం చూస్తే మొత్తం 40 వేల మంది విదేశీయులు అంతర్యుద్ధంలో పాల్గొన్నట్లు తేలింది. ఇందులో 30 వేల వరకూ సైన్యం కాగా, 10 వేల డాక్టర్లు, నర్సులు వున్నారు. ఫ్రాన్సు నుండి 10 వేలు, జర్మనీనుండి 5 వేలు, పోలండు నుండి 5 వేలు, ఇటలీ నుండి 3350, ఇంగ్లండు, అమెరికా నుండి 2500 చెప్పున వచ్చారు. అయితే ఏ సమయంలో చూచినా స్పెయిన్లో విదేశీ సైన్యాలు 18 వేలకు మించి లేరు. స్టాలిన్ ఎప్పటికప్పుడు స్పెయిన్ ఫ్రంటు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుంటే సోషలిస్టు ప్రధాని కేబల్లెరో సాధ్యమయినంత వరకూ నిరోధించాడు. కమ్యూనిస్టులు సోషలిస్టులు కలసిపోవడానికి నిరాకరించాడు. సోవియట్ రాయబారి మార్సెల్ రోజన్ బర్గ్ ను వెళ్ళగొట్టాడు. అతన్ని తక్షణం రష్యా పిలిపించి స్టాలిన్ చంపేశాడు. కమ్యూనిస్టులు రష్యా ప్రోత్సాహంతో ప్రధాని కాబల్లెరో సాధ్యమయినంత వరకూ నిరోధించాడు. కమ్యూనిస్టులు సోషలిస్టులు కలసిపోవడానికి నిరాకరించాడు. సోవియట్ రాయబారి మార్సెల్ రోజన్ బర్గ్ ను వెళ్ళగొట్టాడు. అతన్ని తక్షణం రష్యా పిలిపించి స్టాలిన్ చంపేశాడు. కమ్యూనిస్టులు రష్యా ప్రోత్సాహంతో ప్రధాని కాబల్లెరోను కూలదోయాలని విఫల ప్రయత్నం చేశారు. ఆ తరువాత కమ్యూనిస్టుల, స్టాలిన్ ప్రోత్సాహంతో జాన్ నెగ్రిన్ నాయకత్వాన్ని బలపరచారు. ప్రముఖ కమ్యూనిస్టు రోడిన్ కోర్టాడాను అరాచకవాదులు చంపడంతో అంతర్యుద్దం విజృంభించింది. కాబల్లెరో తన ప్రజా సైన్యాన్ని తీసెయ్యలేదనే నెపంతో ఆయన్ను తొలగించి, కమ్యూనిస్టు కీలుబొమ్మ నెగ్రిన్ ను అందలం ఎక్కించారు. అంతరంగిక శాఖను కమ్యూనిస్టులు స్వీకరించారు. పోలీసు కీలక ఉద్యోగాలు సైనిక స్థావర ఉద్యోగాలు కమ్యూనిస్టులు తీసుకున్నారు.
కమ్యూనిస్టుల ఆధీనంలో వున్న మాడ్రిడ్ పోలీస్ ద్వారా ఫ్రాంకో పేరిట దొంగ పత్రాలను సృష్టించి మాడ్రిడ్ ను పట్టుకొనే పధకాలు చూపారు. మంత్రి మండలిలో కమ్యూనిస్టులకు, ప్రధాని నెగ్రిన్ కు సైతం తెలియకుండా, స్పెయిన్ కమ్యూనిస్టు రహస్య పోలీస్ దళాధిపతి ఆర్గోప్ జూన్ 14న నాయకులందరినీ నిర్భంధించమన్నాడు. వామపక్ష నాయకులను, సభ్యులను 1937, 38లో నిర్భంధించి చిత్రహింసలకు గురిచేసి, చంపేశారు. బార్సిలో నాలో జరిగిన హత్యలు కమ్యూనిస్టుల ప్రత్యేక కృషే. విదేశీయులను కూడా వదలకుండా చంపేశారు. సుప్రసిద్ధ రాజకీయవాది విలీబ్రాంట్ (తరువాత జర్మనీ ఛాన్సలర్) సుప్రసిద్ధ రచయిత ఆర్వెల్ తప్పించుకోగా, అర్ధర్ కోసర్ జైలు పాలయ్యారు. స్పెయిన్ లో వామపక్షం అధికారంలోకి రావడానికి తోడ్పడిన వారందరినీ స్టాలిన్ చంపించాడు. ఫ్రాన్స్ లోని విదేశీ కమ్యూనిస్టు రహస్య దళాధిపతికి 1938 ఫిబ్రవరిలో సైనైడ్ యిచ్చి ఆయనను ఆఫీసులోనే చంపారు. స్పెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసిన రష్యన్ ఎహెన్ నో వాలెక్ ను 1938 మేలో రోటర్ డాంలో చంపేశారు. అలాగే రుడోల్ఫో క్లెమెంట్, వాల్టగ్ క్రివిట్ స్కీ (పశ్చిమ ఐరోపాలో రష్యా సైనిక గూఢచారి సలహా) దారులను 1941 ఫిబ్రవరి 10న వాషింగ్టన్ లో స్టాలిన్ గూడచారులు వెంటాడి చంపారు. ప్రావ్డాస్పెయిన్ విలేఖరి మై ఖేల్ కోల్ట్ జల్ను చంపారు. స్పెయిన్ లో ఆర్ధిక సలహాదారు ఆర్ధర్ స్టాస్కోవిస్కీని చంపారు. బార్సిలో నాలో కౌన్సిల్ జనరల్ అంటోనోప్ అసింకోను హతమార్చారు. స్టాలిన్ బంటుగా ప్రవర్తించిన అర్లొప్ మాత్రం యీ హత్యకాండ నుండి తప్పించుకుని, స్టాలిన్ అనంతరం కథ అంతా బయటపెట్టాడు.
కమ్యూనిస్టులు స్పెయిన్ లో ముఖ్యంగా ఇర్పెలోని చేసిన యీ దారుణ కిరాతక కృత్యాలు ప్రపంచం ఎందుకు చూడలేక పోయింది? కమ్యూనిస్టులు చేసిన ప్రచారం వలన స్పెయిన్ లో వారి హత్యా కాండ తాత్కాలికంగా మరుగుపడింది. విల్డిమూ జెన్ బర్గ్, ఆటోకాట్జ్ లు యిరువురూ స్టాలిన్ ఏజంట్లుగా గొప్ప కొమింటర్న్ ప్రచారానికి వన్నెచిన్నెలుదిద్ది. మేధావులను, రచయితలను మభ్యపెట్టగలిగారు. న్యూస్టేట్స్ మన్ సుప్రసిద్ద ఎడిటర్ కింగ్ స్లే మార్టిన్, సుప్రసిద్ద కవి డబ్ల్యు.హెచ్. ఆడెన్, ఎర్నెస్ట్ హెమింగ్ వే, యీ కమ్యూనిస్టు భ్రమలో కొన్నాళ్లు వున్నారు. ఫ్రెంచి కమ్యూనిస్టులు బ్రస్సెల్స్ లో అంతర్జాతీయ శాంతి సభలు జరుపుతూ మేధావులను పిలిపించి ఖర్చులు గురించి కొన్నాళ్లు సత్యాన్ని దాచగలిగారు. స్టీఫెన్ స్పెండర్ అగ్రకవులను రాచ మర్యాదలతో చూచాడు.
1937-38లో స్టాలిన్ రష్యాలోనూ, బయటి ప్రపంచంలోనూ హత్యాకాండ ముగించి, హిట్లర్ తో ఒడంబడికలకై సంసిద్దమయ్యాడు. దీని ప్రభావం స్పెయిన్ పై కూడా పడింది. ప్రాంకో యిదే అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని కమ్యూనిస్టులపై దాడిచేశాడు. 1937-38లో ఫ్రాంకో విజృంభించాడు. 1939 జనవరి 29లో బార్సిలోనాను, మార్చి 29న మాడ్రిడ్ ను పట్టుకున్న ఫ్రాంకో, రాజ్యాధిపతిగా స్థిరపడి 38 సంవత్సరాలు నిర్విఘ్నంగా పరిపాలించాడు.
అందర్యుద్ద ఫలితంగా జాతీయవాదులు 90 వేల హత్యకాగా, లక్ష, 10 వేల రిపబ్లికన్ సైన్యం చనిపోయింది. విమాన దాడులవలన 10 వేలు చనిపోగా లక్ష, 30 వేల మంది హత్యలకు గురైనారు. 5 లక్షల మంది ప్రవాసులై పారిపోయారు. ఆస్తినష్టం అంచనా వేయలేనంత జరిగింది.
1939 ఫిబ్రవరి 9న ఫ్రాంకో ఒక చట్టం చేసి నేరస్తులను ఒక్కొక్కరిగా విచారణ జరిపి శిక్షించాలన్నాడు. ప్రతిరోజూ విచారణను జరిపి, కాల్చి చంపేశారు. మాడ్రిడ్లో రోజూ సగటున 250 మందిని కాల్చారు. బార్సిలోనాలో రోజుకు 150 మందిని సెవిలీలో 80 మందిని రోజూ కాల్చి చంపారు. మొత్తం మీద ఫ్రాంకో ఆధ్వర్యాన కాల్పులకు గురై చనిపోయినవారి సంఖ్య వేలల్లో వున్నది. కాని చాలా మందికి 15 ఏళ్ల జైలుశిక్ష వేశారు. 1941లో 2, 33, 375 మంది స్పెయిన్ జైళ్లలో మగ్గారు. కొందరు జైళ్లలోనూ మరికొందరు ప్రవాసాలలోనూ చనిపోయారు. ఫ్రాంకో ఫాసిస్టు, నాజీలతో చేతులు కలిపినందున 1955 వరకు ఐక్యరాజ్య సమితితో స్పెయిన్ కు సభ్యత్వం ఇవ్వలేదు. 1974లో ఫ్రాంకో తన అధికారాలను జాన్ కార్లోకు దత్తం చేశాడు. 1975లో ఫ్రాంకో చనిపోయాడు. ఆ తరువాత స్పెయిన్ ప్రజాస్వామికం అయింది.

Thursday, July 12, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -ఆఖరి భాగం

అనువాదాలు

నా రచనల్లో అనేక అనువాదాలు ఒక భాగం. నేను అనువదించడానికి ఎంపిక చేసుకున్న వారిలో ఎం.ఎన్. రాయ్ అగ్రస్థానంలో వుండగా, మిగిలిన వారు- ఎ.బి.షా, శిబ్ నారాయణారే, పాల్ కర్జ్, వి.బి. కర్నిక్, లక్ష్మణ శాస్ర్తి జోషి, అగేహానంద భారతి, ఎ.ఆర్. దేశాయ్, ఇబ్న వారక్ నంబూద్రి పాద్ (కేరళ చరిత్ర), పింగళి జగన్మోహనరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు, రిచర్డ్ డాకిన్స్, శాంహరిన్ పేర్కొనదగిన వారు. స్వదేశీ రంజన్ దాసు కూడా యీ జాబితాలో చేర్చవచ్చు. ఎం.ఎన్. రాయ్ రచనలలో కొన్ని అనువాదాల్ని ప్రజావాణి, రాడికల్ హ్యూమనిస్ట్, తెలుగువిద్యార్ధిలో ప్రచురించగా ఎ.బి.షా. వ్యాసాలు ప్రజావాణి, తెలుగు విద్యార్థి, సమీక్ష, వికాసం, హేతువాదిలో ప్రచురించారు. అనువాద గ్రంథాలలో అత్యధిక భాగం తెలుగు అకాడమీ, కొన్ని తెలుగు విశ్వవిద్యాలయం వెలువరించింది.
అనువాదాల పట్ల నాకు ఎప్పుడూ అసంతృప్తి వుంటుండేది. ఎ.బి.షా సైంటిఫిక్ మెధడ్ ను అలాంటి అసంతృప్తితోనే మరల మరలా దిద్దుకుంటూ చివరగా తెలుగు అకాడమీ ప్రచురణగా తెచ్చాను.
ఎం.ఎన్. రాయ్ రచన ఇండియా ఇన్ ట్రాన్సిషన్ అనువాదానికి ఎడిటర్ గా సి. నారాయణ రెడ్డి వున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు ప్రొఫెసర్ గా ఆయన సూచనలు చేస్తూ, చదవడానికి సౌలభ్యం గురించి చెప్పారు. అది దృష్టిలో పెట్టుకుని తిరగరాశాను. ఇండియన్ హిస్టారికల్ సొసైటి వారి ఎంపిక. అది పుస్తకంగా వెలుగు చూడలేదు. అలాగే నంబూద్రిపాద్ కేరళ చరిత్రకూడా పుస్తకంగా రాలేదు. జి.వి. కృష్ణారావు హి.హెచ్.డి. సిద్ధాంతం కళా పూర్ణోదయంపై నా తెలుగు అనువాదం నా కేమీ తృప్తి కలిగించలేదు. సగం గ్రాంధికం సగం వ్యావహారికంలో రాశాను. ఆనాడు ఎ.సి. కాలేజీలో నాకు లెక్చరర్ గా వున్న ఎలవర్తి రోశయ్య ప్రభావం వలన అలా చేశాను. తరువాత అది సరిదిద్దడం కుదరలేదు. కొంత భాగం 1962లో గోలకొండ పత్రిక సీరియల్ గా ప్రచురించింది.
నేను అనుకరణలు చేసిన ప్రముఖులు కొందరున్నారు. అందులో ఎరిక్ ఫ్రాం, ఆర్.జి. ఇంగర్ సాల్, థామస్ సాజ్, కార్ల్ శాగన్, స్టీ ఫెన్ హాకింగ్, బెట్రాండ్ రస్సెల్, చెప్పదగిన వారు. వారి రచనల ఆధారంగా చేసిన వ్యాస రచనలో ఆ విషయం స్పష్టం చేశాను. కొందరి పుస్తకాలతో ప్రభావితుడనయ్యాను. అందులో బి.ఆర్. అంబేద్కర్, రిచర్డ్ డాకిన్స్, పేటర్ సింగర్, ప్రేమనాధ్ బజాజ్, క్రిస్టోఫర్ హిచిన్స్, వున్నారు.
మన పత్రికలు, ముఖ్యంగా దిన పత్రికలు కొన్ని విషయాలలో ఏక పక్షం వహించడం వలన చర్చకు సైతం తమ ప్రీతి పాత్ర విషయాలు స్వీకరించే వారు కాదు.
ఈ నాడులో హోమియో గురించి ఏక పక్ష ధోరణి యిందుకు నిదర్శనం. నా విమర్శలు ప్రచురించలేరు. మదర్ థెరీసా, హోమియో వంటివి ఆంధ్రజ్యోతి సైతం సెన్సిటివ్ గా పరిగణించేది. ఇవన్నీ జర్నలిజంలో అనుభవాలు.
జర్నలిస్ట్ గా కలసిన, మాట్లాడిన, ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తులలో-మదర్ థెరీసా (1976), సంజీవరెడ్డి (స్పీకర్) ఇందీరాగాంధీ (పదవి లేనప్పుడు (1979), పి.వి. నరసింహారావు, ముఖ్యమంత్రులు టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, వెంగళరావు, పి.వి. నరసింహారావు, చెన్నారెడ్డి, ఎన్.టి. రామారావు, విజయ భాస్కర రెడ్డి, నాదెళ్ళ భాస్కరరావు, అంజయ్య, భవనం వెంకట్రాం, ఎన్. జనార్ధన రెడ్డి, ఎన్. చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి వున్నారు.
విద్యావేత్తలలో సి.డి. దేశముఖ్, పార్కిన్ సన్, సైంటిస్టు వై. నాయుడమ్మను ఇంటర్య్వూ చేశాను.
విదేశాలలో కార్ల్ శాగన్, థామస్ సాజ్, గ్రున్ బాం (Grun Balm in Pittsburgh) రిచర్డ్ డాకిన్స్, శాంహారిస్, తస్లీమా నస్రీన్, వారెన్ ఎలెన్ స్మిత్, ఫాల్ కర్జ్, గార్డన్ స్టైన్, టిం మాడిగన్, ఇబ్నవారక్, ఎలెన్ జాన్ సన్, మడల్య ఓహేర్, ఫ్రెడ్ ఎడ్వర్డ్, ఏడ్ డోర్, సోనియా ఎగ్ రిక్స్, జింహెరిక్స్, జిండ్లర్ ఫ్రాంక్, కెన్నెత్ ఫ్రేజర్ వున్నారు. అలాంటి వారితో కలసి మాట్లాడడం జర్నలిజానికి ఎంతో ఉపకరించాయి.
ఇండియాలో మణిబెన్ కారా (స్ర్తీ కార్మిక నాయకురాలు) ప్రేమనాథ్ బజాజ్, ఇందుమతి, పరేఖ్, ఎస్. రామనాధన్, (రేషనలిస్ట్ నాయకుడు) జే.బి. హేచ్ వాడియా, లక్ష్మణ శాస్త్రి, జోషి, రామ మనోహర్ లోహియా, జార్జి పెర్నాండజ్, అమ్లన్ దత్త, వి.ఎం. తార్కుండే, వి.బి. కర్నిక్, డి.బి. కర్నిక్, డబ్లు.హెచ్ కానియా, ఆర్.ఎల్. నిగం, ఎ.కె. ముఖర్జీ, (థాట్) సి. ఆర్. ఎం. రావు (చైనా రిపోర్ట్) లతో వ్యక్తి గత పరిచయాలుండటం వారి అనుభవాలు తెలుసుకోవడం విశేషం.

(అయిపోయింది)

-Innaiah Narisetti

Sunday, July 8, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -11

బహుజన
గౌతులచ్చన్న బహుజన పత్రిక స్థాపించి, కొన్నేళ్ళు నడిపించారు. దీనికి పోలవరపు శ్రీహరి రావు మొదలు ఎందరో ఎడిటర్లుగా పనిచేశారు. నేను హైదరాబాద్ నుండి బహుజనలో లచ్చన్న జీవిత చరిత్ర 1970 వరుకూ ధారావాహికంగా రాశాను. అందుకుగాను లచ్చన్న డైరీలన్నీ పరిశీలించాను. లచ్చన్నను ఇంటర్వ్యూ చేశారు. అయితే కొన్ని సందర్భాలలో వ్యాఖ్యానాలు లచ్చన్నకు నచ్చలేదు. ఆ విషయంపైకి నాతో అనలేదు. బహుజనలో కొన్ని యితర వ్యాసాలు కూడా రాశాను. పత్రిక ఒక ప్రమాణం, స్థాయి లేకుండా, కేవలం లచ్చన్న ప్రీతిపాత్రంగా నడిచింది. విశాఖ నుండి కూడా కొన్నాళ్ళు నడచి ఆగిపోయింది.

వివిధ పత్రికలు

అనేక తెలుగు పత్రికలో ఆయా వ్యక్తుల కోరికపై నేను రాశాను. మండవ శ్రీరామమూర్తి స్వప్న సందేశం అనే పత్రిక విజయవాడ నుండి నడిపారు. గుంటూరు నుండి స్వతంత్రవాణి కొన్నాళ్ళు కొల్లా కృష్ణారావు నడిపారు. మన మార్పు కోసం అనే పత్రికను హైదరాబాద్ నుండి లిల్లీ, థామస్ నడిపారు. వీటిలో కొన్ని రచనలు చేశారు. తెలుగు అకాడమీ పత్రిక తెలుగులో వ్యాసాలు రాశారు. బండారు రత్న సభాపతి, గోరాశాస్ర్తి, గౌతులచ్చన్నపై ప్రత్యేక సంచికలు వెలువరించాను.
అమెరికాలో వుండగా 1992-2006 మధ్య తానా పత్రిక, ఆటా పత్రికలోనూ ప్రత్యేక మహా సభల సంచికలలోనూ వ్యాసాలు రాశాను. 1992లో ఆటా ఏర్పడి తొలి సభలు జరిపినప్పుడు, న్యూయార్క్ సమావేశాల సంచికలో సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రాశాను. ఆటా తొలి సభలలో న్యూయార్క్ లో నన్ను సన్మానించి, బిరుదు ప్రదానం చేశారు. నండూరి రామమోహనరావుకు అదే సభలో సన్మానం చేశారు. బాల సుబ్రహ్మణ్యం మమ్మల్ని పరిచయం చేశారు. జంపాల చౌదరి ఎడిటర్ గా వున్న తానా పత్రికలో కొన్ని రచనలు చేశాను.
అమెరికా నుండి వెలువడే అమెరికన్ రేషనలిస్ట్, అమెరికన్ ఎథియిస్ట్, వాష్ లైన్, ఫ్రీ ఇంక్వైరీ మాగజైన్లలో వ్యాసాలు 1992-2007 మధ్య రాశాను.
వారెన్ ఎలెన్ స్మిత్ సంకలనం చేసిన పెద్ద గ్రంధం (who is who is in hell)కు ఇండియా గురించి సహాయపడ్డాను. గార్డన్ స్టైన్ (కీ.శే) సంకలనం ఎన్ సైక్లో పీడియా అన్ బిలీఫ్ కు భారత మానవవాద హేతువాద ఉద్యమాల గురించి రాశాను.
సంస్థల పక్షాన పత్రికలు నడపాలంటే నిధులు సమకూర్చి ఒక బోర్డును ఏర్పరచడం అవసరం.
భారత సెక్యులర్ సొసైటీ స్థాపించిన ప్రొఫెసర్ ఎ.బి.షా (అమృత్ లాల్ బికుషా) ఒక పౌండేషన్ నిధి సమకూర్చారు. సెక్యూలరిస్టు పత్రిక పెట్టి ద్యై మాస పత్రికగా నడిపారు. ఆయన 1981లో చనిపోయినా ఆ సంస్థ పక్షాన వి.కొ. సిన్హ సంపాదకత్వాన పత్రిక నడుస్తున్నది.
ది సెక్యులరిస్టు ద్వైమాస ఆంగ్లపత్రిక వి.కె.సిన్హ సంపాదకత్వాన బొంబాయి నుండి వస్తున్నది. అందులో అప్పుడప్పుడు నేను వ్యాసాలు రాశాను. ది ఛైల్డ్ ఎబ్యూజ్ పై 2005లో రాశాను.
ఇండియన్ స్కెప్టిన్ పేరిట బసవ ప్రేమానంద్, పోడనూర్ (కోయంబత్తూరు) నుండి మాస పత్రిక నిర్వహిస్తున్నారు. పట్టుదలగా ఒంటరిగా లాక్కొస్తున్నారు. (పూఫ్ రీడింగ్ సరిగా లేకున్నా, గెటప్ అసలు పట్టించుకోకున్నా పత్రిక నిర్విఘ్నంగా నడుపుతున్నారు. సత్యసాయి బాబా మొదలు అనేక మాతలు, స్వాములు, వారి గుట్టు బట్టబయలు చేశారు. ఫెడరేషన్ ద్వారా భిన్న సంస్థల సమాచారం అందిస్తున్నారు. ప్రపంచ పర్యాటన చేశారు. మాజిక్ ప్రదర్శనలిచ్చారు. అదంతా పత్రికా ముఖంగా వెల్లడించారు. అందులో నేను అనేక విషయాలు రాశాను 1995-2007 మధ్య.
హైదరాబాద్ నుండి ఎం. సుబ్బారావు రేషనలిస్టు వాయిస్ పత్రిక ఒంటరిగా నడిపారు. అందులో చాలా వ్యాసాలు రాశాను. ఫ్రూప్ రీడింగ్ లోపం బాగా వున్నది. కాని సమాచారం ఎంతో వ్యాసాల ద్వారా అందిస్తున్నారు. ఎడిటింగ్ లేకున్నా విషయ సేకరణ ముఖ్యంగా వుంది. హేతువాద ప్రచారం ముఖ్యాంశంగా పెట్టుకున్నారు.
నాస్తిక, హేతువాద పత్రికలు
వివిధ హేతువాద సంస్థలు నాస్తిక సంఘాలు తమ పత్రికల్ని నడిపిస్తున్నాయి. ఏవీ క్రమపద్ధతిలో వుండవు. పట్టుదల, ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. భారతనాస్తిక సమాజం ఆంధ్ర ప్రదేశ్ హేతువాద సంఘం మానవ వికాస వేదిక వంటివి పత్రికలు చేబట్టాయి. వాటిలో నేను అప్పుడప్పుడూ వారి కోరికపై వ్యాసాలు అందించాను. ఈ దర గోపీచంద్ అశ్లీలంపై తన పత్రిక ద్వారా నరసరావు పేట నుండి ధ్వజమెత్తారు. నేను ఆయన కోరికపై పరిమితంగా చర్చలో పాల్గొన్నాను.
వ్యాసాలు రాసినందుకు డబ్బిచ్చిన పత్రికలు బహుకొద్ది. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, కే. రామచంద్రమూర్తి గారున్నప్పుడు వార్త, ఉదయం పత్రికలు, జమీన్ రైతు, విజయభేరి వున్నాయి. మిగిలిన పత్రికలలో రచనలకు నేను డబ్బు ఆశించలేదు కూడా. చిన్న పత్రికల వారెవరడిగినా వ్యాసాలు రాసేవాడిని. హేతువాది పత్రికకు సహాయంగా, నా పుస్తకాలిచ్చి, అమ్ముకున్న డబ్బు విరాళంగా స్వేకరించమన్నాను. అలానే తీసుకున్నారు. అచ్చువేసిన వ్యాసాల ప్రతిని పంపే సంప్రదాయం కుడా కొందరికే వుంది.
ఇన్ని పత్రికలు, చిన్నవి పెద్దవి, ఇంగ్లీషు తెలుగు భాషలలో అర్ధశతాబ్ధి రచనలు సంకలనం సాధ్యమా? రచయితలు తమ వ్యాసాలను అన్నీ దాచరు. కొందరు, కొన్ని అట్టి పెడతారు. పాత పత్రికలు అట్టి పెట్టే లైబ్రరీలు అరుదు. సంస్థలూ ఆట్టే లేవు.
ఇప్పుడిప్పుడే మైక్రో ఫిలిం, సి.డి.లు వస్తున్నా, చాలా మందికి అవి పరిచితం కాదు. పత్రికలు అట్టి పెట్టాలంటే సంస్థలకే కుదురుతుంది. అది ఖర్చుతో కూడిన పని. కాగితం నల్లబడి, ముక్కలై పోతుంది. పత్రికలు ఇండెక్సు తయారు చేయవు. విదేశాలలో న్యూయార్క్ టైమ్స్ వంటివి ఆ పని చేస్తున్నవి. ఈనాడు ఆ పని మొదలెట్టింది. ప్రతి చిన్న, పెద్ద పత్రికలు ఇండెక్స్ చేయాలి. అది రచయితలకు, రీసెర్చికి ఉపయోగపడతాయి.
పురావస్తు శాఖ సైతం యీ పని చేయడం లేదు. కంఫ్యూటర్లో లభించే సంస్థలు పనిచేయగలవు.
1982 తరువాత కొన్నాళ్ళు కందనాతి చెన్నారెడ్డి సంపాదకత్వాన నడచిన ఈ తరంలోనూ, దేవీ ప్రియ సంపాదకత్వాన సాగిన ప్రజాతంత్రలోనూ, సతీష్ నడిపిన నేటి రాజకీయంలోనూ వివిధ రాజకీయ వ్యాఖ్యానాలు, వ్యాసాలు రాశాను. దేవీ ప్రియ పత్రికలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర సేరియల్ కొంత కాలం వేశారు. ఈ పత్రికలు అంతగా సర్కులేషన్ వున్నవి కావు. వాటి ప్రభావం అంతంత మాత్రమే. ఆ పత్రికలన్నీ కొద్దికాలం నడచి ఆగిపోయినవే. వి. హనుమంత రావు గారు డేటా న్యూస్ ఫీచర్స్ పక్షాన కొన్నాళ్ళు బులిటేన్ నడిపితే, అందులోనూ రాశాను.
సి. నరసింహారావు జయప్రదంగా విజయవాడ నుండి రేపు మాసపత్రిక నడిపారు. ఆయన మరో పత్రిక నూతన ప్రపంచం పెట్టారు. రెండే సంచికలు వచ్చి, ఆగింది. రెండింటిల్లోనూ నేను రాశాను.

నర హంతకులు -8
ఇటలీలో అందమైన నియంత ముసోలినీ

ఇటలీలోని చిన్న పట్టణం మిలన్ కు చెందిన ముసోలినీ అందమైన నియంత. అతడికి 169 మంది భార్యలవంటి ఉంపుడుగత్తెలు వుండేవారు. అధికార దాహం ముసోలినీలో కొట్టొచ్చినట్లుండేది.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1919 మార్చి 23న ముసోలినీ తన మిత్రులతో కలసి పార్టీని పెట్టారు. ఫ్యాక్టరీలు స్వాధీనం చేసుకోవాలని, దేవాలయ భూముల్ని ఆక్రమించాలని, రాజరికం రద్దు చేయాలని నినదిస్తూ ముసోలినీ బయలుదేరాడు. చరిత్ర సృష్టిస్తానన్నాడు. తన ఫాసిజాన్ని వ్యాపింపచేయడానికి కవితను, డ్రామాను, మార్మిక భావాలను బాగా వాడుకున్నాడు. ఈ విషయంలో కమ్యూనిస్టులకు ముసోలినీకి తేడా లేదు. సోషలిస్టు మందలో ఫాసిస్టు పులి పడినట్లయింది, ఇటలీ పరిస్థితి. మాజీ సైనికులను చేరదీసి ఫాసిస్టు దళాల్ని ఏర్పరచిన ముసోలినీ, తరువాత బడి వదలి తిరిగే వారిని చేరవేశాడు. ఆర్.ఎస్.ఎస్. వలె వీరు కూడా కట్టుదిట్టంగా, క్రమశిక్షణతో వుండేవారు. స్థానిక సంస్థల మద్ధత్తు లభించింది. నక్సలిజం యువకులను, అందునా సంపన్న యువతను ఆకర్షించినట్టు, ఫాసిజం ఇటలీలో సంపన్న యువతను పట్టేసింది. ముసోలినీకి అండగా, అనుచరుడుగా ఇటలీలో బాల్బో వుంటూ, కిరాతకచర్యలు చేశాడు. తొలుత హింసపట్ల ఏమంత ఆసక్తి కనపరచని ముసోలినీ క్రమంగా హింసాయుత చర్యలకు ఆమోదముద్ర వేశాడు. 1921లో కొద్ది మోతాదులో ఆరంభమైన ఫాసిస్టు హింసాకాండ 1922లో విజృంభించింది. ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకుంటూ దౌర్జన్యం చేసుకుంటూ ఫాసిస్టు దళాలు కదిలాయి.
ముసోలినీ వాగ్దాటి ఉపన్యాసాలతో ప్రజల్ని ఉర్రూతలూగించేశాడు. పోప్ తో రహస్య సంబంధాలు ఏర్పరచుకున్నాడు.
1922 అక్టోబరు 28న ముసోలినీ ఫాసిస్టు దళాలు 40 వేలమంది రోమ్ ను ఆక్రమించడానికి ఉపక్రమించారు. జోరున వర్షం కురుస్తుండగా వీరంతా రోం వెలుపల నల్ల చొక్కాలతో (ఫాసిస్టు డ్రెస్) అలా సిద్దమయ్యేసరికి మిలన్ లో వున్న ముసోలినీకి ఫోను మ్రోగింది. మంత్రి మండలిలో ఆయనకు స్థానం కల్పిస్తామని ఆహ్వానం వచ్చింది. అక్టోబరు 29న ముసోలినీ బయలుదేరి అధికారాన్ని చేబట్టాడు. పాసిస్టు నల్ల డ్రెస్ కు గుర్తింపు లభించింది. 1924 ఏప్రియట్లో ఎన్నికలు జరిపితే, ఫాసిస్టులకు బాగా బలం లభించింది.
1924లో ప్రతిపక్షం నాయకుడు గియాకోమో మాటియెట్టిని ముసోలినీ చంపించాడు.
ఫాసిస్టు కోరలు పనిచేయనారంభించాయి. ప్రతిపక్షాల పత్రికల్ని నిషేధించాడు. ప్రతిపక్షనాయకులను నిర్భంధించాడు. ఫాసిస్టు నియమాలను ప్రకటిస్తూ 1925 జనవరి 3న ముసోలినీ ఉపన్యసించాడు. రాజ్యానికిమించి ఏదీ వుండరాదన్నాడు. ప్రతిపక్షాలు అనవసరమన్నాడు.
మొదట్లో లెనిన్ను ఆదర్శంగా స్వీకరించిన ముసోలినీ. జర్మనీలో హిట్లర్ వాదనల్ని నిరసించారు. యూదు వ్యతిరేకతను పాటించలేదు. ఏంజలికా బాలబనోఫ్, ఎన్రికోరోక్కాగినో ఆరియాస్ మొదలైన యూదు ప్రముఖులు ముసోలినీకి తోడ్పడ్డారు. నాజీలకు వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్ తో కలసి ఒక ఫ్రంటు ఏర్పరచడానికి సైతం ముసోలినీ సిద్ధమయ్యాడు.
కాని, రానురాను ముసోలినీ మరీ అవినీతికి దిగజారాడు. తన చదువు, సంస్కారం ప్రక్కకునెట్టి టెర్రరిజాన్ని ఆచరించాడు. అబిసీనియాపై దాడిచేసి 1935 మేలో ఆదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇటలీని దురాక్రమణదారుగా చిత్రించి నానాజాతి సమితి 1935 అక్టోబరులో ప్రకటించింది. అంతటితో ప్రజాస్వామ్య దేశాలకు ముసోలినీ దూరం కాగా, హిట్లర్ పొగడ్తలకు పొంగిపొయిన ముసోలినీ అతడి అడుగుజాడల్లో ఆక్రమణలు ప్రారంభించాడు. ట్యునీషియా, అల్భేనియా, కోర్సికా, నైస్ లపై ముసోలినీ కన్నువేశాడు. అంతవరకూ యూదులజోలికి పోనివాడు, హఠాత్తుగా యూదు వ్యతిరేక ప్రకటనలు చేశాడు. రష్యాకు వ్యతిరేకంగా ఒడంబడికలో చేరాడు. నానాజాతి సమితినుండి ముసొలినీ వైదొలగి ఇటలీని దురాక్రమణ దారుగా మార్చేశాడు. 1939 ఏప్రిల్లో అల్బేనియాపై దురాక్రమణచేశాడు.
ముసోలినీ చేసిన ఒకేఒక మంచిపని సిగ్మండ్ ఫ్రాయిడ్ విషయమై జోక్యం చేసుకొని, ఆయన్ను జర్మనీ నుండి బయటకు పంపమని సిఫారసు చేయడమే. 250000 ఆస్ర్టియన్ షిల్లింగులు తీసుకొని, ఇంట్లో ప్రవేశించిన నాజీలు ప్రాయిడ్ ను వదలేశారు ముసోలినీ నాలుగు ఐరోపా భాషలు ధారాళంగా మాట్లాటేవాడు. చర్చలలో ఆయనదే పైచేయిగా వుండేది. 1909లోనే ముసొలినీ హింస ఆవశ్యకతపై చర్చ చేశాడు.
ముసోలినీ బద్ధశత్రువు సుప్రసిద్ధ కేథలిక్ డిగాస్పెరి. అతడిని 1927లో ముసోలినీ జైల్లో పెట్టించగా పోప్ విడిపించి, 14 ఏళ్ళు వాటికన్లో రక్షణ కల్పించాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తో చేరిన ముసొలినీ ఇటలీని సర్వనాశనం చేశాడు. అయితే తన శక్తి హీనతను అతడు 1940 నాటికే గ్రహించాడు. 1943 జులై 10న సిసిలీని మిత్ర రాజ్యాలు ఆక్రమించిన తరువాత, పాసిస్టు కౌన్సిల్ సమావేశం ఏర్పరచి వారి విమర్శలన్నీ ముసొలినీ విన్నాడు. మిత్ర రాజ్యాలకు లొంగిపోయిన ముసొలినీని, జర్మనీ నియంత హిట్లర్ తప్పించి, మళ్ళీ రాజ్యాధిపతిని చేశాడు. 1945 మార్చిలో సోషలిస్టు విప్లవం తెస్తానంటూ ముసోలినీ కాగితపు పులివలె ప్రకటించాడు. చివరకు అతడు ఉరికంబానికి ఎక్కకతప్పలేదు. రక్తం చిందించ కుండా జీవిత ప్రయోజనం లేదని ముసొలినీ మూలసిద్ధాంతం.