Friday, August 28, 2009

గుణపాఠం

దేవుడి గుడిలో, చర్చ్ లో, మశీద్ లో దొంగతనం జరిగినదంటే భక్తులకు కనువిప్పు కావలసినదేమిటి?
దేవుడి నగలు కాపాడడానికి రక్షణ కావాలంటే అర్థం ఏమిటి?
ముస్లింలు లోగడ గుజరాత్ లో సోమనాథ దేవాలయంపై దాడి చేయబోయేముందు పురోహితులదగ్గరకు భక్తులు వచ్చి మొరపెట్టుకుంటే ,మన దేవుడు చాలా శక్తివంతుడు శత్రువులను తరిమి కొడతాడు అని పంపించారట .ముస్లిం దండయాత్రికులు కొల్లగొట్టుకపోయారు .
గుణపాఠం కనువిప్పు కావాలి భక్తులకు .

Thursday, August 27, 2009

నిప్పులపై నడక

జేమ్స్ రాండీ బయటపెట్టిన అనేక మ్యాజిక్ రహస్యాలలో నిప్పులపై నడక ఒకటి. ఆయన సిలోన్ లో మొదలు పెట్టి అనేక సందర్భాలలో మండే నిప్పుకణాలపై నడచి, అది మానవ సాధ్యమేనని చూపారు. ఇదే విషయంలో కొందరు సాధువులు, మాంత్రికులు, నిప్పులపై నడచి, అది ఒక అద్భుతంగా చాటి, గిట్టుబాటు వ్యాపారంగా చేసుకున్నారు. అంతేకాక దీని వెనుక మతపరమైన, దైవ పరమైన శక్తి ఉన్నదని, అమాయకులను భ్రమపెట్టారు. డబ్బు వసూలు చేశారు. అది అంతా బూటకమని, ఎవరైనా ప్రాక్టీసు చేస్తే నిప్పులపై నడక మామూలు విషయంగా చూపవచ్చునని జేమ్స్ ర్యాండీ నిరూపించాడు.
అగ్నిగుండం ఏర్పరచినప్పుడు సర్వసాధారణంగా బొగ్గులు వాడతారు, కట్టెలు కూడా పెడతారు. అలా కాల్చిన వాటిపై కాసేపటికి బూడిదపొర కమ్ముతుంది. అందువల్లన సెగ తొందరగా తగలకుండా ఆపుతుంది. నడిచినప్పుడు అరికాలికి నిప్పుకణాలకి మధ్య ఈ బూడిద పొర చాలా వరకు తొర్పడుతుంది. అంటే మండే కణాలనుండి సెగ రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో నడక పూర్తి కావడం జరిగిపోతుంది. అయితే అగ్నిగుండంలో ఇనుప ముక్కలు లేకుండా చూచుకోవాలి. మేకులు ఉంటే అవి కాలి తొందరగా శరీరాన్ని కాల్చేస్తాయి కనుక తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇదే హెచ్చరికను జెమ్స్ రాండీ చేశాడు.
ఉదాహరణకు కాలే పెనంపై చెయ్యి పెడితే వెంటనే సెగ అంటి అరచెయ్యి కాలుతుంది. అంతే సెగ ఉన్న అవెన్ లో చెయ్యి పెడితే కాలదు. సెగ ఒకటే అయినప్పుడు ఈ తేడా ఎందుకు వస్తుంది. అంటే సెగ అంటడంలో తేడా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
1983లో శ్రీలంకలో జెమ్స్ రాండీ నిప్పులపై నడిచి తన మ్యాజిక్ అద్భుతాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని చాలా సార్లు విడమర్చి చెప్పాడు. కొందరు నిప్పులపై నడిచినప్పుడు తాము మద్యపానం సేవించి ఆ మత్తులో నడుస్తామని చెప్పారు. కానీ మత్తుకి, శరీరం కాలటానికి సంబంధం లేదు. మత్తు లేకుండా నడచి కాళ్ళు కాలవనీ జెమ్స్ రాండీ చూపాడు.
ఈ విషయంలో ఆద్యాత్మిక కారణాలు చెప్పి జనాన్ని మభ్యపెట్టే వారిని జెమ్స్ ర్యాండీ ఖండించాడు. నిప్పులపై నడవటం అనేది అనేక దేశాల్లో ఉన్నది. ఇది ఒక మతాచారంగా కూడా చేస్తున్నారు. జపాన్, హవాయి మొదలైన చోట్ల కూడా ఈ సంఘటనలు జరిగాయి.
కేక్ తయారు చేయటంలో చక్కని ఉదాహరణ చూపవచ్చు. వివిధ వస్థువులలోకి వేడి ఎలా ప్రసురిస్తుందో ఇదొక చక్కని ఉదాహహగరణ. నాలుగు వందల డిగ్రీల వేడిలో కేక్ అవెన్ లో బేక్ అవుతుంది. అక్కడ చెయ్యి పెట్టినా కాలదు. అలాగే అంత వేడిలో బేక్ అయిన కేక్ పై చెయ్యి పెట్టినా కాలదు. అంతే వేడిగల పెనంపై చెయ్యి పెడితే కాలిపోతుంది. దీనిని బట్టి ఒకే వేడిదగ్గర వివిధ వస్తువులు వివిధ రీతులలో వేడిని ప్రసరింపచేస్తాయని అర్థమౌతుంది.
ఈ విధంగా వైజ్ఞానిక దృక్పధంతో ప్రతీ అద్భుతాన్ని, మ్యాజిక్ అంశాన్నీ వివరించవచ్చునని, జేమ్స్ రాండి అంటాడు. అలాగే అనేక ఆశ్చర్యకరమైన విషయాలను విడమరచి శాస్రీయ దోరణిలో చెప్పాడు, రాశాడు. అందుకే అతడు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. బూటకంతో జనాన్ని మోసం చేసి మభ్యపెట్టే వారిని బట్టబయలు చేశాడు. వైద్య, ఆరోగ్య రంగాల్లో, జ్యోతిష్యంలో, అతీంద్రియ శక్తులలో ఇలాగే చేసి చూపాడు.

Sunday, August 23, 2009

దేవుడి గుడిలో దొంగతనం

తిరుపతి కోదండరామ ఆలయంలో పూజారి నగలను తాకట్టు పెట్టి, పట్టుబడ్డాడు.
నగలు మనుషులే సమర్పిస్తారు.ఆలయం మానవులే కడతారు.విగ్రహం మనుషులే చెక్కుతారు .కనుక దొంగతనం జరిగితే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి .
మహత్తులు మహిమలు కూడా మనుషులు కనిపెట్టిన కథలు గాథలు అని తెలుసుకోవాలి. కనుక తిరుపతి దేవుడికి దొంగతనాలు ఆపే శక్తి వుండదు .ఇది అన్ని మతాలకు అన్ని దేశాలకు . క్రైస్తవులకు ,ముస్లింలకు ,వర్తిస్తుంది.
మల్లది రామమూర్తి ఒక సారి చెబుతూ ,పూజారికి దేవుడి మహత్తు గుట్టు బాగా తెలుసు అన్నారు .కాని భక్తులతో మత వ్యాపారం చేయాలంటే పూజారి నటించాలి మరి.
సామాజికంగా మనం వెనక్కు పోతున్నాము .మన శక్తిపై మనకు కుదురు లేక ఎవరో వచ్చి ఆదుకోవాలనుకోవడమే భక్తి వెర్రి తలలు వేయడానికి దారితీస్తున్నది .జనానికి నిజం చెప్పాలి.రాజకీయ పార్తీలు ఇంకా జనాన్ని వెనక్కు నడిపిస్తున్నాయి .

Friday, August 21, 2009

పూర్వ జన్మలు – పునర్జన్మలు ఉంటాయా?

అప్పుడప్పుడు కొందరు చిన్న పిల్లలు బయలుదేరి తాము పూర్వజన్మలో ఎలా ఉండేవారమో, వచ్చే జన్మలో ఎలా ఉండబోతున్నామో చెబుతారు. అది ఒక వింతగా, ఆశ్చర్యంగా వ్యాపిస్తుంది. జనం తండోపతండాలుగా రావటం, మొక్కడం, కానుకలు సమర్పించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తారు. ఇలాంటివి ఆసియా దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో తరచు జరగడటం గమనిస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు అందరూ పునర్జన్మలు నమ్మరు. అలాగే ముస్లిములు కూడా. సైంటాలజీ అనే క్రైస్తవ శాఖ ఈ జన్మల గురించి నమ్మి, జనాన్ని మభ్య పెడుతున్నారు. భౌద్ధుల్లో కొందరు జన్మలు నమ్ముతారు.
మనుషులకు, పూర్వజన్మలు, పునర్జన్మలు నిజంగా ఉంటాయా? మనిషి చనిపోయినప్పుడు శరీరాన్ని తగలబెట్టడం, పూడ్చటం, ఆసుపత్రులకు ఇవ్వడం జరుగుతున్న నేపధ్యంలో, జన్మ ఎత్తేది ఏమిటి? ఇందుకు గాను మతస్తులు లోగడే ఒక పథకం ప్రకారం మనిషిలో ఆత్మ ఉంటుందని అన్నారు. అంటే ఏమిటి? అది పదార్ధం కాదు, దానిని చూడటానికి, పట్టుకోవటానికి, వీలు లేదు. కనుక అది మత, ఆద్యాత్మిక, నమ్మకంలో ఒక భాగంగా, సృష్టి అయిన విషయం. దైవం ఎలాగో, ఆత్మ కూడా అలాగే మానవుల సృష్టి. దీని చుట్టూ, పునర్జనమ్మను, పూర్వజన్మను అల్లారు. హిందువుల నమ్మకాలలో జన్మలు అనేకం. క్రిమికీటకాదుల నుండి జంతువుల మొదలు, మనుషుల వరకూ ఈ జన్మలు ఉన్నాయి. వీటిని తొలగించుకుని మోక్షం సాధించటం లక్ష్యం అన్నారు. అంటే జన్మలు ఎత్తటం అనేది గొప్ప విషయం కాదు. జన్మలు పోగొట్టుకుని దైవసాన్నిధ్యంలో ముక్తి పొందటమే పరమార్థం అన్నారు. దీనికి గాను పురోహిత వర్గాలు అనేక క్రతువులు, జీవన విధానాలు చెప్పారు. ఏమైనా జనంలో జన్మలపై నమ్మకం మాత్రం బాగా నాటుక పోయింది.
ఇటీవల భౌద్ధ శాఖలో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దలైలామా ఈ జన్మలను గురించి మాట్లాడటంతో దీనికి మళ్ళీ ప్రచారం లభించింది. చిన్న పిల్లలు తాము పూర్వజన్మలో దలైలామాతో సంబంధంగల వ్యక్తులమని, రాబోయే జన్మలో ఆయన్ను మళ్ళీ కలుసుకోబోతున్నామని జప్పటం జనాన్ని ఆకట్టుకున్నది. మన దేశంలో లోగడ ఇలాంటివి తరచు జరిగాయి. పూర్వకాలం నుండి మన పురాణాలలో, ఇతిహాసాలలో పునర్జన్మల కథలు ఉండటం వల్లన జనంలో అవి స్థిరపడిపోయాయి.
వైజ్ఞానికంగా ఈ జన్మల విషయంలో ఏమైనా ఆధారాలతో ఉన్నదా అని పరిశీలన చేశారు. కొందరు శాస్త్రజ్ఞులు సీరియస్ గా కొన్ని కేసులు పరిశీలించి శాస్త్రీయ ఆధారాల కోసం అన్వేషించారు. అలా చేసిన వారిలో ఇయాన్ స్టీవెన్ సన్ పేర్కొన దగినవాడు. అయితే ఆయన గాని, ఇతరులు గాని చేసిన పరిశోధనలు ఏవీ కూడా ఇంతవరకు శాస్త్రీయ ఆధారాలు చూపలేక పోయాయి. జె.ఎమ్.ఇ. మక్ టగార్డ్, సి.జె. డుకాసే పాశ్చాత్య ప్రపంచంలో పునర్జన్మల పరిశీలన చాలా దీర్ఘంగా చేశారు. సి.జి. యుంగ్ తన పరిశీలనలో పునర్జన్మలకు అనుకూలత చూపాడు. కానీ శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇవ్వలేక పోయాడు. ఈ కోవలో పాల్, టిలక్, స్ట్రనిస్ లోవ్, టిమోతీ లోరే వంటివారు ఎలాగైనా పునర్జన్మలను రుజువు చేయాలని ప్రయాసపడి విఫలమయ్యారు. టిబెట్ లో ఈ పునర్జన్మల కథలు, రచనలు ఉన్నాయి. అవికూడా చాలా వదంతులకు దారి తీశాయి. టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ అనే పుస్తకం ఇలాంటి పునర్జన్మల కథలను నమ్మించటానికి చాలా ప్రాధాన్యత వహించింది. అయితే అదంతా మూఢనమ్మకాలు తప్ప ఆధారాలు లేవని తేలింది. మద్రాసులో ఉన్న సి.టి.కే. చారి ఈ విషయాలపై క్షుణ్ణంగా పరిశీలన చేసి, భారతదేశం వంటి చోట చిన్న పిల్లలకే ఇలాంటి కథలు వినిపించటం వల్లన, వారిలో నమ్మకాలు నాటుకుపోయి కొన్ని కథనాలు అల్లడం. వాటిని సమాజంలో వ్యాపింపచేయటం జరిగిందన్నారు. అంతే గాని వాటికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవన్నారు.
ఆత్మలు ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టి అవుతాయా? జనాభా పెరుగుతూ పోతుంటే కొత్త ఆత్మలు కొత్తగా పుట్టిన వారిలో ప్రవేశిస్థాయా? అయితే ఎక్కడి నుండి వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు నమ్మకస్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎలాగూ రుజువు చేయలేరు కనుక మూఢనమ్మకాలతో మూర్క సమాధానాలు చెబుతుంటారు. చిన్న పిల్లల్లో పూర్వజన్మల గురించి వస్తున్న స్ముతులు ఆధారంగా స్ట్రీవెన్ సన్ సుధీర్ఘ పరిశోధనలు చేశారు. అయినప్పటికీ శాస్త్రీయ ఆధారాలు మాత్రం లభించలేదు. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు, కొందరు స్వార్థశక్తులు పిల్లల్ని వశపరుచుకొని పూర్వజన్మల కథలు చెప్పిస్తుంటే, స్ట్రీవెన్ సన్ వాటిని పట్టించుకోలేదు. అదోక పెద్ద లోపంగా మిగిలిపోయింది. విలియం జీ. రోల్ సైతం అమెరికాలో స్ట్రీవెన్ సన్ పరిశీలనలను సుదీర్ఘంగా అధ్యయనం చేసి వాటిలో శాస్త్రీయతను చూపలేకపోయాడు

Wednesday, August 12, 2009

మూల దోషం ఎక్కడుంది?

అన్ని మతాలకు మూల గ్రంధాలు రాశారు. మతాన్ని సృష్టించినట్లే, మూల గ్రంధాలు సృష్టించారు. మనుషులు రాశారంటే విలువరాదు. కనుక తెలియని శక్తి, దైవం, రాసినట్లు అవి మానవులకు అందించినట్లు చక్కని కథ అల్లారు. కొంచెం తేడాలతో యిలాంటి కథనాలే అన్ని మతాల్లో చూపారు.
జనం దేవుణ్ణి నమ్మినట్లే, మూల గ్రంథాల్ని పరమ సత్యాలని నమ్మారు. వాటిని పూజిస్తున్నారు. పురుషులు రాశారు గనుక స్త్రీలను కించపరచి, ద్వితీయ స్థానం యిచ్చారు. అవి దైవం రాసినందుకు మానవులు మార్చడానికి వీల్లేదన్నారు. దానికై దైవాంశ సంభూతులని ముద్ర వేసుకున్న పురోహితవర్గాలు, పోప్ లు, ముల్లాలు వ్యాపారం చేస్తున్నారు.
వీటిపై నమ్మకాలు పోతే మానవులు స్వేచ్ఛా పరులౌతారు. స్త్రీలకు సమానత్వం వస్తుంది. మానవ విలువలు అమలు జరుగుతాయి. దీనంతటికీ మతం పట్ల మూల గ్రంధాల పట్ల నమ్మకాలు పోగొట్టుకోవడం చాలా అవసరం.

Thursday, August 6, 2009

హేతువాదం అంటే

హేతువాదం
ప్రతిదీ కార్య కారణ సంబధాలతో చూస్తూ తెలుసు కొనడం హేతువాదంలో ప్రధానం. తెలియనిది ఎంతో వున్నదని క్రమెణా తెలుసుకుంటూ సాగిపోవడం ప్రక్రియ. తెలియని అంశంపై నమ్మకాలు అపోహలు వుంచకుండా నిదానించి సాస్త్రీయ ధోరణి పాటించడము జరుగుతుంది.
పూర్వకాలం ఒక పుస్తకం లో వున్న అంశం ,లేక పెద్దవారు చెప్పారనో అదే ప్రమ సత్యం అని హేతువాదం అనదు. రుజువు ,అధారం ముఖ్యం .ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా అదె ప్రమాణం అవుతుంది.
అలా జరుగుతున్నప్పుదు ,కొన్ని నమ్మకాలకు, మూఢ ఆచారాలకు వ్యతిరెకంగా వుంటే ,వాటిని పాటించేవారికి కోపం రావడం సహజం.
ఆగ్రహం ,ఆవెశం వచినప్పుడు తొందరపడకుండా ,వివేచన జోడిస్తే బాగావుంటుంది.వ్యక్తిగత దూషణలు ఆలోచన పెంచవు .
శాస్త్రీయంగా చేసిన హెతుబద్ద తీరు మానవులకు మేలు చేస్తున్నది .
ఒక రంగంలో శాస్త్రియంగా ఆలోచిస్తూ ,వుద్యోగం చేస్తూ ,మిగిలిన రంగాలలో ఆలోచన చేయనందువలనే , చిన్నప్పటి నమ్మకాలనుండి బయతపడలేక పోతున్నాము .

Monday, August 3, 2009

మానవవాదం ఎందుకు?


Left to right:M/s C.Narasimha rao, T.V.Rao and Innaiah addressing the gathering. Photo:cbrao



Left to right: M/s Anant, Gandhi and Mrs Chandana Chakrabarthi
Photo:cbrao


ఆగస్ట్ 2 వ తేది హైదరాబాదులో జరిగిన Indian Radical Humanist Association సభలో, డాలస్ (టెక్సాస్) నుంచి వచ్చిన, తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారి తెలుగు సాహిత్య వేదిక నెల నెలా తెలుగు వెన్నెల నిర్వాహకులు అనంత్ మల్లవరపు ప్రసంగిస్తూ, అభివృద్ధి చెందిన అమెరికా లో కూడా మత మౌఢ్యం, కుల మౌఢ్యం బహిరంగ చర్చకు వస్తున్నాయని అన్నారు. మానవ , హేతు వాద విషయాలలో తాను ఇన్నయ్యగారి అభిమాని అని, డాలస్ లో ఇన్నయ్య గారు హేతుబద్ధత, శాస్త్రీయ ద్రృక్పధాలపై ప్రసంగించారని సభకు తెలియ చేశారు. చూడండి http://naprapamcham.blogspot.com/2009/04/blog-post_21.html

బాబాలు, అమ్మలు అమెరికా వచ్చి పాదపూజ వగైరాలను ప్రోత్సహిస్తూ నిధుల సేకరణ చేస్తున్నారన్నారు. మొదట తెలుగు భాషా ప్రాతిపదికపై కలిసిన వారు, కులం పేరిట, ప్రాంతాల పేరిట అమెరికా లోని తెలుగు వారు విడిపోవటం బాధ కలిగిస్తుందన్నారు. హైదారాబాదు నగరంలో ప్రధాన వీధులలో కూడా మతపరమైన కట్టడాలు వెలుస్తున్నాయని, ఇవి వాహన రాక పోకలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని విచారం వ్యక్తం చెశారు.

-cbr


Audience & electronic media at the meeting Photo:Ramabrahmam of Jana Vignana Vedika

హేతువాదం ఎందుకు?


Photo courtesy: Ramabrahmam of Jana Vignana Vedika

చిత్రంలో ఎడమనుంచి కుడి వైపుకు: శ్రీయుతులు గాంధీ, శ్రీమతి చందనా చక్రవర్తి, సి.నరసింహా రావు, టి.వి.రావు ఇంకా ప్రారంభోపన్యాసం చేస్తున్న ఇన్నయ్య.

పుస్తక రూపంలో వందేళ్ల రాజకీయ చరిత్ర
భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘం
న్యూస్‌టుడే, హైదరాబాద్‌: త్వరలో 'వందేళ్ల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్ర' అనే పుస్తకాన్ని ప్రజల ముంగిటకు తీసుకురానున్నట్లు భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘం పేర్కొంది. ఈ గ్రంథంలో చరిత్రను, నిష్పక్షపాతంగా శాస్త్రీయంగా విశ్లేషించినట్లు సంఘ సభ్యులు వివరించారు. సామాజిక వేత్తలకు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘ సమావేశం నిర్వహించారు. సంఘం కోఆర్డినేటర్‌ ఎన్నికైన ప్రముఖ రచయిత, మానవతావాది నరిశెట్టి ఇన్నయ్య, జనవిజ్ఞాన వేదిక సభ్యులు టి.వి.రావు, మానవ వికాస వేదిక సభ్యులు సాంబశివరావు, భారత హేతవాద సంస్థ సభ్యులు వీరన్నతో సామాజిక విశ్లేషకులు నరసింహారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సామాజిక వేత్త చందన చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్నయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీల్లోని అవినీతి, పక్షపాత ధోరణి, కుల మత మౌఢ్యాలతోపాటు సమాజంలో వేళ్లూనుకుంటున్న మూఢ, అంధవిశ్వాసాలపై రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సొసైటీ పోరాడుతుందన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మానవతావాద విలువలను సమాజానికి చాటిచెప్పడానికి తమ రచనలు, వ్యాసాలు, కళలు ద్వారా పెద్ద పీట వేసిన ఎం.ఎన్‌.రాయ్‌, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, మల్లాది రామ్మూర్తి, మల్లాది సుబ్బమ్మ, పాలగుమ్మి పద్మరాజు, త్రిపురనేని గోపిచంద్‌, జి.వి.కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రాంబ్రహ్మం తదితర మహానుభావుల స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత ఈ తరంపై ఉందన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చందన చక్రవర్తి మాట్లాడుతూ బాధ్యతగల స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం మూఢ విశ్వాసాలకు పెద్దపీడ వేయడం ఆందోళన కలిగిస్తున్న పరిణామన్నారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమైనప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. భావసారూప్యత ఉన్న సంఘాలన్నీ కలిసి పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని సూచించారు. పాఠ్యగ్రంథాల్లో సైతం మూఢ విశ్వాసాలు కల్పించేలా పాఠాలు పొందుపరచడం దారుణమని సామాజిక విశ్లేషకులు నరసింహరావు తప్పుపట్టారు. మేథావులు సైతం బాబాలకు పాదపూజ చేయడం దుర్మార్గమైన చర్య అని హేతువాద సంఘ సంఘ ప్రతినిధి అనంత్‌ అన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తమ పబ్బం గడుపుకుంటున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని మానవ వికాస వేదిక సభ్యులు సాంబశివరావు సూచించారు. సామాజిక వేత్త గాంధీ మాట్లాడుతూ సమాజంలో తాత్విక చింతన, హేతువాద దృష్టి, భావవికాసం, మానవతావాదం పెంపొందడానికి అన్ని సంఘాలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు.

Text courtesy: ఈనాడు దినపత్రిక 3rd August 2009