Friday, June 29, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -10

ఇండియన్ రేషనలిస్ట్

1967 ప్రాంతాల్లో మాసపత్రిక ఇండియన్ రేషనలిస్ట్ హైదరాబాదు నుండి కొనసాగింది. ఇంగ్లీషు పత్రికగా మద్రాసు నుండి నడిచిన సంచికలు ఆగిపోగా, పట్టుదలతో హైదరాబాద్ కు తరలించారు. జయశంకర్, సూర్యనారాయణ అనే హేతువాదులు అందుకు సహకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న ఆవుల సాంబశివరావు, ఎడిటర్ గా, ఎన్.కె. ఆచార్య, ఎ.ఎల్.నరసింహారావు నేనూ ప్రధాన పత్రిక నిర్వహించాం. ఆర్ధిక బలాన్ని ఆవుల అందించగా, రచనలు సేకరించేపని మేము చూశాం. నేను కొన్ని సంచికలలో సమకాలీన తాత్విక ధోరణులపై రాశాను. అందులో లాజికల్ పాజిటివిజం, ఎగ్జిస్టెన్సియలిజం, బెట్రాండ్ రస్సెల్ మొదలైనవి ఉన్నాయి. మద్రాసు నుండి ఎస్.రామనాథన్ వ్యాసాలు పంపారు. అప్పటికే ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు. ఎన్.కె. ఆచార్య చాలా వరకూ పత్రిక పట్టించుకున్నారు. కొన్నాళ్ళకు ఆవుల సాంబశివరావు హైకోర్టు జడ్జి కావడంతో బాధ్యత అంతా మా పైన పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వై. రాఘవయ్య పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీడర్ గా వ్యాసాలు రాసేవారు. పత్రిక కొన్నాళ్ళు నడిపి ఆపేశారు. మళ్ళీ మద్రాసు మిత్రులు ఆ బాధ్యత స్వీకరించారు.

అన్వేషణ

1960 నుండీ 64 వరకూ సంగారెడ్డి (మెదక్ జిల్లా)లో మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూలులో అన్ ట్రయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వృత్తి చేశాను. అప్పుడు ఎం. నాగేశ్వరరావు అన్వేషణ అనే మాసపత్రిక పెట్టారు. అందులో యించుమించు చాలాభాగం నేను రాసేవాడిని. టీచర్ యూనియన్ పక్షాన యీ పత్రిక నడచింది. ఉపాధ్యాయుల సమస్యలు, బోధన, సిలబస్, ఇత్యాది విషయాలు చర్చించాను. అందుకుగాను వివిధ ఉపాధ్యాయ సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. పాలో ఫ్రెయరీ వంటి వారి రచనలు చూచాను. మెక్సికోలో విద్యను పాపులర్ చేసిన పద్ధతులు చదివాను. కొఠారి కమిషన్ చర్చలు కూడా వచ్చాయి. ఎ.బి.షా వంటి వారు విద్యాసమస్యలు చర్చించిన తీరు చూచాను. అమృక్ సింగ్ రచనలు కూడా ఉపయోగించాయి. షేక్ మౌలా కొత్త పద్ధతులతో గ్రామర్ చెప్పిన తీరు కూడా గ్రహించాం. పత్రిక చిన్నదైనా ఉపాధ్యాయులకు ఆకర్షణీయంగా తెచ్చాను. ఎం. నాగేశ్వర రావు బాగా పర్యటించి సమస్యలు తెలుసుకునేవారు. ఆయన సోదరుడు ఎం. రాజగోపాలరావు ఎ.సి. కాలేజి గుంటూరులో ఫిలాసఫి లెక్చరర్ గా నాకు పరిచయస్తుడు. అన్వేషణ పత్రిక ఎక్కువ కాలం సాగలేదు.


ఆంధ్రజనత

హైదరాబాద్ నుండి వెలువడిన ఆంధ్రజనత దిన పత్రిక కొంత కాలం తెలంగాణాలో పాపులర్ గా వుండేది. చాలామంది ఎడిటర్లు మారిన యీ దినపత్రిక, కాంగ్రెసు పార్టీ పక్షానే నడచింది.1960 నుండే 64 మధ్యలో నేను సంగారెడ్డి నుండి తరచు వ్యాసాలు రాస్తుండేవాడిని. పత్రికలో ఎవరూ నాకు అప్పట్లో పరిచయస్తులు కాదు.1965 నుండే హైదరాబాద్ కు నేను మారాను. ఆ తరువాత కొన్నాళ్ళు ఆంధ్రజనతతో సంబంధాలు వుండేవి. ఎ.ఎల్. నరసింహారావు అందులో పనిచేస్తుండేవారు. కె.ఎస్. సుబ్రహ్మణ్యం సంపాదకులు. పాండురంగారావు వుండేవారు. ఆంధ్రజనత ఆర్థిక సంక్షోభాలతో, ఆఫీసు కూడా మార్చేస్తూ, నడిచేది. పత్రిక అచ్చుతప్పులతో అంద విహీనంగా సాగేది.ఉత్తరోత్తరా జి.సి. కొండయ్య కొన్నాళ్ళు ఎడిటిర్ గా వున్నారు. గాంధి భవన్ కు మారిన ఆంధ్ర జనతలో పోత్తూరి వెంకటేశ్వరరావు సన్నిహితంగా పనిచేశారు. సర్కులేషన్ కూడా అంతంత మాత్రమే.

ఆంధ్రజనత ఆగిపోయింది. గోల్కొండ పత్రిక అంతకు ముందే ఆగిపోయింది. తెలంగాణా పత్రికలుగా పేరు తెచ్చుకున్న యీ రెండు పత్రికలూ అలా చరిత్రను మిగిల్చాయి.


తెలుగు విద్యార్ధి

1967 నుండే పదేళ్ళపాటు తెలుగు విద్యార్థి మాసపత్రికలో అనేక వ్యాసాలు రాశాను.
కొల్లూరి కోటేశ్వరరావు 1953 నుండీ ప్రారంభించిన తెలుగు విద్యార్థి విద్యాసంబంధిత విషయాలతో బందరు (మచిలీపట్నం) నుండి రెగ్యులర్ గా వెలువడింది. పాఠశాల, కళాశాల, గ్రంథాలయాలకు యీ పత్రిక అందేది. ఎందరో ప్రముఖులను పత్రిక ద్వారా పరిచయం చేయడం, వ్యాసాలు రాయించడం కోటేశ్వరరావు కృషి. అందులో మామిడి పూడి వెంకట రంగయ్య, ఆవుల సాంబశివరావు, ఎం.వి.రాజగోపాల్ వంటి వారున్నారు. ఉపాధ్యాయులకు తగిన సమాచారం అందించేవారు.

నేను రాసిన వాటిలో భారతపునర్వికాసం పేరిట సీరియల్ వున్నది. మార్క్స్ పై విమర్శ, మతాలపై చర్చ ప్రధానంగా సాగింది. అనేక విద్యాసంస్థల్ని, పేరు తెచ్చుకున్న పాఠశాలల్ని పరిచయం చేశాను. కొఠారి కమిషన్ యిచ్చిన విద్యా విషయ నివేదికపై వ్యాసాలు అందించాను. విద్యావేత్తల్ని, వైస్ ఛాన్సలర్లను, విద్యామంత్రులను ఇంటర్వ్యూ చేశాను. అందులో సి.డి. దేశముఖ్, డి.ఎస్.రెడ్డి, పి.వి. నరసింహారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, మొదలైన వారున్నారు. అంతర్జాతీయ విద్యారంగంలో వస్తున్న విద్యారంగ విషయాలు కూడా అందించాను. నేను అలా రాసిన వాటిలో కొన్నిటిని గ్రంథాలుగా కొల్లూరి కోటేశ్వరరావు ప్రచురించారు. అందులో భారత పునర్వికాసం పేరిట-రాజా రాంమోహన్ రాయ్ నుండి ఎం.ఎన్.రాయ్ వరకూ బాగా ఆకర్షించింది. మార్క్స్ కు గ్రహణం పట్టించిన కమ్యూనిస్టులు అనే రచనను ఒక హిందీ టీచర్ అభిమానంతో పుస్తకంగా వెలువరించారు. ఎ.బి.షా. రాసిన శాస్ర్తీయ పద్ధతి కూడా అనువదించాను. మత సంబంధమైన విషయ చర్చలో ఎ.ఎస్. అవధాని వంటివారు పాల్గొన్నారు. మార్క్స్ మార్క్సిజం అనే శీర్షికన రాసిన సీరియల్ కూడా గ్రంథంగా వెలువరించారు.

విద్యోదయ

ఉపాధ్యాయ ప్రతినిధిగా ఎన్నికైన పి. భుజంగరావు విద్యోదయ మాసపత్రిక కడపనుండి నడిపారు. తెలుగు విద్యార్థి వలె తనకూ రాయమని ఆయన కోరగా తరచు వ్యాసాలు రాశాను. అంత రెగ్యులర్ గా కాకున్నా, అప్పుడప్పుడూ రాసేవాడిని. ఆర్థిక యిబ్బందులతో పత్రిక ప్రచురించడానికి భుజంగరావు యిబ్బందులు పడేవారు. అయినా పట్టుదలతో కొన్నేళ్ళు నడిపారు. ఎం.ఎల్.సి.గా వుండగా విద్యోదయను నడపగలగినా ఆ తరువాత ఆ పేశారు. విద్యా సంబంధమైన వ్యాసాలే నేను రాసేవాడిని. విద్యోదయకు సిబ్బంది లేనందున అన్నీ భుజంగ రావే చూసుకోవలసి వచ్చేది.

Thursday, June 28, 2007

నర హంతకులు -7

లెనిన్ గ్రాడ్ లో పార్టీ కాంగ్రెస్ లో వున్న 150 మందిలో 148 మందిని చంపేశారు. స్టాలిన్ ఆధ్వరంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుల్ని 10 లక్షల మందిని చంపేశారు. (షాపిరో-కమ్యూనిస్టు పార్టీ పుట 440) స్టాలిన్ మారణకాండలో తోడ్పడి, ఆయన ఆజ్ఞల్ని శిరసావహించి చేసిన ప్రముఖులలో కృచ్చేవ్, యెజోవ్, మాలెంకోవ్, బెరియా, మాలటోవ్, జడనోప్, బ్రెజ్నోవ్, కోసిజిన్లు వున్నారు.
1937 నుండి రెండేళ్ళపాటు యెజోవ్ ప్రతిరోజూ ఫైళ్ళు మోసుకొని స్టాలిన్ను కలుస్తుంటే ఆయన అరెస్టు ఉత్తర్వులిస్తుండేవాడు. 400 జాబితాలపై స్టాలిన్ సంతకం చేశాడు. ఈ జాబితాలలో 44 వేల మంది పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు, సాంస్కృతిక ప్రముఖులు ప్రభృతులున్నారు.
రష్యాలో తలదాచుకోడానికి వచ్చిన విదేశీ కమ్యూనిస్టులు సైతం స్టాలిన్ మారణకాండకు గురైనారు. పోలెండ్ కమ్యూనిస్టు నాయకులు, హంగేరీ కమ్యూనిస్టు నాయకులు, యుగస్లోవియా కమ్యూనిస్టు ప్రముఖులు అలా రష్యాకు బలయ్యారు.
బల్గేరియా కమ్యూనిస్టు నాయకులు పొపోవ్, తనేవ్లు ఉరితీయబడ్డారు. కొరియా నుంచి వచ్చిన వారందరినీ చంపేశారు. ఇండియా నుంచి వచ్చిన వారికి అదేగతిపట్టింది. అందులో సరోజనీనాయుడు సోదరుడు వీరేంద్రనాథ్ కూడా వున్నారు. హిట్లర్ భయానికి పారిపోయి వచ్చిన జర్మనీ పార్టివారిని నిర్ధాక్షణ్యంగా చంపేశారు. చైనా, లాట్వియా, లిధుయేనియా, ఇరాన్, ఇటలీ, ఫిన్లండ్, హాలెండ్, జకొస్లోవేకియా, అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఆస్ర్టియా మొదలైన దేశాల కమ్యూనిస్టులు బహుశ వారి స్వదేశాలలో వుంటే బ్రతికి పోయే వారేమో. రష్యా వచ్చి చనిపోయారు. 842 మంది విదేశీ కమ్యూనిస్టులు రష్యాలో హతమార్చబడినట్లు ఆధారాలుండగా, లెక్కలు అందకుండా మార్మికంగా అదృశ్యమైన వారెందరో వున్నారు.
రష్యాలో స్టాలిన్ ఘాతుకాల నిమిత్తం హొటళ్ళు, దేవాలయాలు, స్నానశాలలు, గుర్రపుశాలలు కూడా జైళ్లుగా మార్చారు. కొత్తగా అనేక జైళ్లు నిర్మించారు. చిత్ర హింసలలో ప్రపంచ రికార్డు సృష్టించారు.
1938లో కోల్యమా శిబిరంలో రహస్య దళాలు 40 వేల మంది స్ర్తీలను, పిల్లల్ని, ఇతరుల్ని హతమార్చారు. మొత్తం మీద లెక్కకు వచ్చిన చిత్ర హింస చావులు రష్యాలో స్టాలిన్ ఆధ్వర్యాన 5 లక్షలు వున్నవి. 1936 నుండి 39 వరకు హతమార్చిన వారి సంఖ్య 45 లక్షలు కాగా మొత్తం స్టాలిన్ పుణ్యం కట్టుకున్న వారి సంఖ్య ఒకకోటి అని తేలింది.
స్టాలిన్ యిలాంటి పనులు చేశాడంటే చాలామంది చాలాకాలం నమ్మలేక పోయారు. ఇదంతా శతృవుల ప్రచారం అన్నారు. స్టాలిన్ అనంతరం కృశ్చేవ్ బయట పెడితే గాని శంఖంలో పోసిన తీర్థం కాలేదు.
ఇద్దరు నరహంతకులు కలసి రెండో ప్రపంచ యుద్దం సందర్భంగా ఒడంబడిక చేసుకొని జనాన్ని కాల్చుకుతిన్నారు. హిట్లర్, స్టాలిన్ ఒడంబడిక ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞులందరిని ఆశ్చర్యపరచగా, అంతవరకూ హిట్లర్ ను బూతులు తిట్టిన కమ్యూనిస్టులు ఒక్కసారి మాట మార్చి జర్మనీని పొగిడారు. హఠాత్తుగా జర్మనీ రష్యాలు పరస్పరం సుహృద్భావం చూపాయి.
నాజీ కమ్యూనిస్టు ఒడంబడిక వలన స్టాలిన్ కు సంవత్సరంన్నర విరామం లభించింది. యూరప్ లో ప్రజాస్వామిక దేశాలతో జర్మనీ యుద్ధం చేస్తుండగా స్టాలిన్ మరోవైపు లోగడ మొదటి ప్రపంచ యుద్ధంలో పోగొట్టుకున్న భూభాగాల్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగాడు. తూర్పు పోలెండ్ను నాశనం చేసిన స్టాలిన్, 15 వేల పోలిష్ అధికారులను హతమార్చాడు. 1939 సెప్టెంబరులో కుదుర్చుకున్న ఒప్పందం 1941 జూన్ 22 వరకు సాగింది. జర్మనీ కమ్యూనిస్టులను, యూదులను రష్యా చేతులారా హిట్లర్ కు అప్పగించగా వారంతా హత మార్చబడ్డారు.
హిట్లర్ కు 10 లక్షల టన్నులు ఆహార ధాన్యాన్ని లక్షటన్నులు విమాన ఇంధనాన్ని, 8 లక్షల టన్నుల ఆయిల్ను, ఇంకా ప్రత్తి, ఇనుము, మాంగనీసు స్టాలిన్ అందించాడు. జర్మనీ కూడా యధాశక్తి రష్యాకు సహాయపడింది. కనుక ఒడంబడిక కేవలం ఎత్తుగడ అనే కమ్యూనిస్టుల ప్రచారం బూటకమే.
స్టాలిన్, హిట్లర్ పరస్పరం పొగుడుకున్నారు. 1940 నవంబరులో స్టాలిన్ తన ఆశల్ని మాలటోవ్ ద్వారా హిట్లర్ కు వెల్లడించాడు. సోవియట్ రష్యా ప్రభావం క్రిందకు వదలి పెట్టాల్సిన దేశాలు, ప్రాంతాలు పేర్కొన్నాడు. హంగరీ, యుగస్లావియా పోలెండ్, స్వీడన్, ఫిన్లడ్, రొమానియా, బల్గేరియా, బ్లాక్ సముద్ర తీర ప్రాంతాలు కావాలన్నాడు. కాని రష్యా కోర్కెను హిట్లర్ నిరాకరించాడు. 1941 జూన్ 22న జర్మనీ దాడి చేయడంతో స్టాలిన్ మేల్కొన్నాడు. రష్యా ప్రజలనుద్దేశించి మాట్లాడిన స్టాలిన్, దేశభక్తిని పురికొల్పి, అంతర్జాతీయ కమ్యూనిస్టు గీతానికి స్వస్తి పలికాడు.

లెనిన్ వలె స్టాలిన్ కూడా సొంతంగా ఒక రహస్య సైనిక దళాన్ని రూపొందించాడు. ఈ విషయం సైనిక దళాధిపతులకు కూడా చెప్పలేదు. స్టావ్క కా అనే ఈ రహస్య దళాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించాడు. అధికారమదాంధలతో విజయోత్సాహంతో కళ్ళు మూసుకుపోయిన హిట్లర్ రష్యాపై దాడి చేసి తీవ్రంగా దెబ్బతిన్నాడు. జర్మనీ దాడి వలన రష్యా ఎంతో నష్ట పోయినప్పటికీ, చివరకు గెలుపు రష్యాదే అయింది. ఈ పోరాటంలో ప్రజాస్వామిక దేశాలు, ముఖ్యంగా ఇంగ్లాండు, అమెరికాలు రష్యాకు ఎంతో తోడ్పడ్డాయి.

రెండో ప్రపంచ యుద్ధం వలన రష్యాకు, పాశ్చాత్య రాజ్యాలకు కుదిరిన ఒప్పందాల వలన రొమేనియ, బల్గేరియా, హంగరీ కాస్తా రష్యాకు దక్కాయి. అమెరికా సైన్యాలన్నీ ఐరోపా నుండి రెండేళ్ళలో వైదొలగడానికి అంగీకరించడంతో, స్టాలిన్ ప్రచ్చన్న యుద్ధం ఆరంభించాడు. యాల్టావప్పందాన్ని ఉల్లంఘించాడు. తూర్పు ఐరోపా, బాల్కన్ దేశాలను స్టాలిన్ కబళించేశాడు.
స్టాలిన్ మళ్ళీ విచారణ పర్వం ప్రారంభించి, ఉరితీతలకు ఉపక్రమించాడు. ముందుగా 16 మంది పోలీస్ అధికారులను టెర్రరిస్టుల పేరిట విచారించినట్లు నటించి ఉరితీయించాడు. బల్గేరియాలో 20 వేల మందిని హతమార్చాడు. 1946 మార్చిలో ఇరాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరించకుండా తాత్సారం చేసిన స్టాలిన్ పాశ్చాత్యదేశాలు కన్నేర్ర చేస్తే గాని అక్కడ నుంచి వైదొలగలేదు.
యుగస్లోవియాలో టిటోను అణచి, తన పెత్తనం సాగించుకోవాలని స్టాలిన్ వేసిన ఎత్తుగడల్ని టిటో సాగనివ్వలేదు. టిటో స్థిరపడడంతో అంతకు ముందు టిటో వెలి వేయడంలో ప్రముఖపాత్ర వహించిన జడనోవ్ ను స్టాలిన్ 1948 ఆగష్టులో చంపించాడు. జెకొస్లోవేకియాలో కుట్రపన్ని దానిని తన స్వాధీనంలోకి స్టాలిన్ తెచ్చుకున్నాడు.
యుద్ధానంతరం స్టాలిన్ నిరంకుశత్వం రష్యాలో మళ్ళీ వికృతరూపం దాల్చింది. ముందు మేధావులు రచయితలపై విరుచుకుపడ్డారు. లలిత కళల్లో నిపుణుల్ని చిత్రహింసలు పెట్టారు. శాస్ర్తజ్ఞులకు కూడా బాధలు తప్పలేదు. ఉద్యోగాలు వూడ బెరికి నిర్భంధ శిబిరాలకు తరలించారు.
హిట్లర్ వలె స్టాలిన్ కూడా యూదులపై బడి, వారి ప్రచురణలు నిషేదించారు. యూదుల నటుడు మికోల్స్ ను చంపేశారు. కొందరు అడ్రసు లేకుండా పోయారు. లెనిన్ గ్రాడ్ లో జడనోవ్ అనుచరుల్ని వెతికి పట్టి చంపేశారు వెయ్యి మందిని కాల్చేశారు. మాలటోవ్ భార్య పోలినా యూదు గావడంతో ఆమేను కజకస్తాన్కు పంపారు చాలామంది కమ్యూనిస్టు ప్రముఖుల భార్యలకు యిదేగతి పట్టింది.
1952లో స్టాలిన్ తన చిత్ర హింసలను ఇంకా ఎక్కువ చేశాడు. క్రెమ్లిన్లో వున్న యూదు డాక్టర్ లను నిర్భంధించారు. చివరకు తన వద్ద పనిచేసే బట్లర్ (వాసిన్)ను కూడా నమ్మలేక, గూడచారి అనే పేరిట అతడిని అరెస్టు చేశారు. చివరి రోజుల్లో అనుమానపు బ్రతుకులో స్టాలిన్ తన వ్యక్తిగత డాక్టర్ను కూడా సమీపానికి రానివ్వలేదు. 1953 మార్చి 5న స్టాలిన్ చనిపోయాడు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం స్టాలిన్ చంపించిన వారి సంఖ్య రష్యాలో 5 లక్షల మంది అని ఉదారలెక్కలు చెబుతున్నవి. అప్పటికి స్టాలిన్ ఆటంబాంబులు తయారు చేయించాడు. (1919) రష్యా స్టాలిన్ కాలంలో ఎంత అభివృద్ధి చెందినా, మనుషులు మాత్రం బోనులో ఎలుకలవలె ఆధ్వాన్నపు బ్రతుకులో మ్రగ్గారు. ఇదొక ఆధునిక బానిసత్వం. ఆ విషయాన్ని చాలాకాలం తెలియకుండా బయట ప్రపంచాన్ని భ్రమలో పెట్టడం స్టాలిన్ గొప్పతనం.

Thursday, June 21, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -9

వార్తదినపత్రిక వార్తకు కె.రామచంద్రమూర్తి ఎడిటర్ గా ఉన్నప్పుడు చాలా వ్యాసాలు రాశాను. అదే సమయంలో అమెరికాకు వెళ్శాను. వార్త ప్రతినిధిగా అమెరికా నుండి విశేషాలు పంపమన్నారు.


దానికి మద్దతుగా నాకు ప్రతినిధి పత్రం ఇవ్వగా దాని ఆధారంగా అమెరికా రాజధానిలో విలేఖరి పాస్ కూడా ఇచ్చారు. దానివలన సెనేట్ కు, ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్)కు, తదితర చోట్లకు వెళ్ళగలిగాను. భారత రాయబార కార్యాలయం వార్త ప్రతినిధిగా ధృవపత్రాన్ని ఇచ్చింది. దీనిమూలంగా అనేక సదవకాశాలు లభించాయి.అమెరికా నుండి తరచు విశేషవార్తా వ్యాసాలు పంపగా ప్రచురించారు. కొన్ని ఫొటోలు కూడా సేకరించి పంపగలిగాను. అదొక మంచి అనుభవం. వార్త ద్వారా రామచంద్రమూర్తి అవకాశం కల్పించారు. అలా ఆయన వార్తకు ఎడిటర్ గా ఉన్నంతకాలం అలా రాస్తూ పోయాను. వివిధ ఆసక్తికర విషయాలు రాయగలిగాను.

మళ్ళీ కొంతకాలానికి గుడిపాటి వెంకటేశ్వర్లు వార్త వారపత్రిక చూస్తుండగా అటు అమెరికానుండి, ఇటు ఇండియాలోనూ వ్యాసాలు రాశాను. మాజిక్ ద్వారా మూఢనమ్మకాలు ఎలా పోగొట్టుకోవచ్చునో సీరియల్ గా రాశాను. విశేషాంశాలనే ఎంపిక చేసి వార్త పత్రికకు రాశాను.

భిన్న పత్రికలు
1982 తరువాత కొన్నాళ్ళు కందనాతి ఛెన్నారెడ్డి సంపాదకత్వాన నడిచిన ఈతరంలోనూ దేవీప్రియ సంపాదకత్వాన సాగిన ప్రజాతంత్రలోనూ, సతీష్ నడిపిన నేటి రాజకీయంలోనూ వివిధ వ్యాఖ్యానాలూ, వ్యాసాలూ రాశాను. దేవీప్రియ పత్రికలో అంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర సీరియల్ గా కొంతకాలం వేశారు. ఈ పత్రికలు అంతగా సర్క్యులేషన్ వున్నవి కావు. వాటి ప్రభావం అంతంత మాత్రమే. ఆ పత్రికలన్నీ కొద్దికాలం నడిచి ఆగిపోయినవే. వి హనుమంతరావుగారు డేటా న్యూస్ ఫీచర్స్ పక్షాన బులెటిన్ నడిపితే, అందులోనూ రాశాను. సి. నరసింహరావు జయప్రదంగా విజయవాడ నుండి రేపు మాసపత్రిక నడిపారు. ఆయన మరోపత్రిక నూతన ప్రపంచం పెట్టారు. రెండే సంచికలు వచ్చి ఆగింది. రెంటిల్లోనూ నేను రాశాను.


హేతువాది
రావిపూడి వెంకటాద్రి సంపాదరత్వాన వెలువడుతున్న హేతువాది మాసపత్రికకు 20 ఏళ్ళపాటు వ్యాసాలు రాశాను. అందులో పాపులర్ సైన్స్, మానవవాదం, ప్రత్యామ్నాయ వైద్యచికిత్సలు, మూఢనమ్మకాల విశ్లేషణ, హేతువాదం, అధునాతన వైజ్ఞానిక విశేషాలు రాశాను. చిన్నపిల్లలపట్ల సమాజంలో జరుగుతున్న అపచారాలపట్ల బాగా నొక్కు పెట్టాను. అంబేద్కర్ ఉద్యమం, గాంధీ స్థానం, ఎం.ఎన్.రాయ్ సిద్ధాంతాలు - ఈ విధంగా చాలా విస్తృతంగా వివిధాంశాలు రాశాను. వెంకటాద్రి సూచనపై కొన్ని వ్యాసాలు రాశాను. శాస్త్రీయ పద్ధతి ప్రచారానికి ఈ వ్యాసాలద్వారా తోడ్పడ్డాను.

మిసిమి
ఆలపాటి రవీంద్రనాథ్ 1985 తరువాత తలపెట్టిన మిసిమి పత్రికకు ఆది నుండీ సహాయపడగలిగాను. తొలుత పక్షపత్రికగా 4 సంచికలు వచ్చాయి. వాటికి వ్యాసాలు కావాలి అని రవీంద్రనాథ్ కోరారు. జ్యోతి ప్రెస్ కు విదేశాల నుండి పేపర్ తెప్పించుకొవడానికి, పత్రిక పేరిట సులభం అని తలపెట్టారు. ఆ విధంగా మొదలైన పత్రిక మాసపత్రికగా మారింది. రవీంద్రనాథ్ కు కాలక్షేపంగా ఉంటుంది, కొనసాగనివ్వాలని ఆయన కుమారులు అభిప్రాయపడ్డారు. క్రమేణా రవీంద్రనాథ్ మిసిమితో లీనమై అదే లోకంగా కృషి చేశారు. సంపాదకుడుగా మిసిమి క్వాలిటీ కోసం విపరీతమైన శ్రమ చేసి, సఫలీకృతులయ్యారు. ప్రతి వ్యాసాన్నినిశిత పరిశీలన చేసి, కొన్ని తిరగ రాయించేవారు. సెన్సార్ చేసేవారు. రిజక్ట్ చేసినవి కూడా లేకపోలేదు.ఇంచుమించు తొలిదశలో ప్రతిసంచికకు నేను రాసేవాడిని. ఎంత జటిలమైన అంశమైనా అర్థమయ్యేటట్లు చెప్పాలనేది పాలసీ. ఆ విధంగా సైంటిస్టులు, తాత్వికులు, చింతనాపరుల్ని ఎంపిక చేసి రాశాను. నా వ్యాసాలపై రవీంద్రనాథ్ ఎన్నడూ సెన్సార్ పెట్టలేదు. కనీసం సూచన ప్రాయంగానైనా విమర్శించలేదు. అంగీకారమైతే అలా చేసేవాడు.

ఎవరిచేత ఏమి రాయించాలనే విషయం తరచు చర్చించాం. పురాణం సుబ్రహ్మణ్య శర్మచే వ్యంగ్య రచనలు చేయించడానికి మధుర వాణి పాత్రను ఎంపిక చేసింది రవీంద్రనాథ్ గారే. సి. నరసింహారావు వ్యక్తిత్వ వికాసం, సంజీవదేవ్ అనుభవాలు మిసిమిలో చోటు చేసుకున్నాయి. వెంకటేశ్వర రెడ్డి చేత మేథావుల మెతకలు రాయించాలని, మేమిద్దరం (నేనూ, రవీంద్ర నాథ్), ఇంటలెక్చువల్స్ (రచయిత - పాల్ జాన్సన్) పుస్తకం చదివిన తరువాత నిర్ణయించాం. అవి తన సొంతం అన్నట్లు వెంకటేశ్వర రెడ్డి ప్రవర్తించి, తరువాత ఎవరూ గమనించని చోట ఎక్కడో ఆ విషయం ప్రస్థావించారు. పురాణం సుబ్రహ్మణ్యశర్మ తీవ్రస్థాయికీ రవీంద్రనాథ్ సంకెళ్ళు వేశారు. ఈ విషయం కూడా ఇద్దరం చర్చించాం.
మిసిమి రవీంద్రనాథ్ ఒరవడిలో బాగా పేరు తెచ్చుకున్నది. ఆయనతోనే ఆ పదును ఆగింది. అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సంపాదకుడుగా మిసిమి కొనసాగుతుండగా, అందులో ఎడిటర్ కోరిక పై కొన్ని వ్యాసాలు రాశాను. బౌద్ధం, కళలు ఎక్కువగా ప్రాధాన్యాలను సంతరించుకొని, పత్రిక వెలువడుతున్నది.

Wednesday, June 20, 2007

నర హంతకులు -6నరుల్ని నలుచుకతిన్న స్టాలిన్

లెనిన్ చనిపోయేనాటికి స్టాలిన్ అధికారాన్ని దత్తం చేసుకున్నాడు. 1924లో పెత్తనాన్ని పట్టుకున్న స్టాలిన్ 30 సంవత్సరాల పాటు రష్యాను పాలించాడు. ఒకే దేశంలో విప్లవం సాధ్యమనే నినాదంతో స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగంపై పూర్తి అదుపు తెచ్చుకున్నాడు. లెనిన్ బ్రతికుండగా అతడి ఆజ్ఞననుసరించి పార్టీలోని వారినీ జారిష్టు అనుచరులనూ హతమార్చడంలో ఆరితేరిన స్టాలిన్ కు శత్రుశేషం లేకుండా చేయడం కష్టంగాదు.

లెనిన్ మత్తులో వుండగానే తన వ్యూహాన్ని ఏర్పరచుకున్న స్టాలిన్, చివరి రోజులలో లెనిన్ కు ఎదురుతిరిగాడు. అధికార పత్రాలు లెనిన్ కు పంపరాదని (ఆరోగ్యంగా లేని కారణంగా) పార్టీచే తీర్మానం చేయించాడు. లెనిన్ భార్యపై చర్యతీసుకుంటామని బెదిరించాడు. లెనిన్ ఈ విషయమై క్షమాపణ కోరినా స్టాలిన్ ఖాతరు చేయలేదు. ఇదంతా గమనించి లెనిన్ తన తుది పత్రంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ సహించదగిన వాడుకాదు గనుక ఆపదవి నుండి అతడిని తప్పించాలి అన్నాడు.

లెనిన్ చనిపోగానే, స్టాలిన్, కామెనోవ్, జినోవివ్లు త్రిమూర్తులుగా అవతారమెత్తి మున్ముందుగా ప్రధాన శత్రువు ట్రాటస్కీని తప్పించనారంబించారు. అతడిపై విమర్శలు దూషణలు చేసి, సైన్యాధిపత్యం నుండి తొలగించారు. 1926 అక్టోబరులో పోలిట్ బ్యూరో నుండి, నవంబరులో పార్టీ నుండి ట్రాటస్కీని తొలగించి సైబీరియాకు ప్రవాసం పంపారు. 1929లో రష్యానుండి పారిపోయిన ట్రాటస్కీని వెంటాడి చివరకు 1940లో మెక్సికోలో అతడిని చంపించడంతో స్టాలిన్ సఫలీకృతుడైనాడు.

ట్రాటస్కీ స్థానంలో సైన్యాధిపతిగా ఫ్రూన్ జేను తెచ్చిన స్టాలిన్ (1925 అక్టోబరు) అది అసహ్యంగా పరిణమించడం చూచి ఆపరేషన్ పేరిట ప్రూన్ జేనుచంపించాడు. 1925లోనే కామనేవ్ ను ప్రధాన స్థానం నుండి తప్పించాడు. అంతేగాక కామనేవ్, జినోవీవ్ లపై మాలటోవ్, బుఖారిన్ చే విమర్శ చేయించి, పార్టీ నుండి వారిని బహిష్కరించాడు. ఆవిధంగా స్టాలిన్ శత్రుసంహారాన్ని ముందు కమ్యూనిస్టు పార్టీలో ప్రారంభించాడు. రైతుల్ని నిర్బంధంగా సమిష్టి వ్యవసాయంలోకి మళ్ళించాలనే స్టాలిన్ ప్రయత్నాన్ని వ్యతిరేకించిన రైకోవ్, ట్రాటస్కీ, బుఖారిన్లను వారి స్థానాలనుండి 1929లో స్టాలిన్ తప్పించాడు.

పార్టిలో ఆంతరంగికంగా శత్రుసంహారం చేసిన స్టాలిన్, అంతకంటె విజృంభించి ప్రజలలో వివిధ వర్గాలపై ఆయుధ ప్రయోగం చేసాడు. 1929 మే-జులై మధ్య తొలుత డోస్ బాస్ గనుల ఇంజనీర్లు విద్రోహ చర్యకు తలపడ్డారంటూ విచారణ జరిపించారు. పొలిటు బ్యూరో సభ్యులు వ్యతిరేకించారు. పార్టీలో స్టాలిన్ ను వ్యతిరేకించడం అదే ఆఖరుసారి. యాకోవ్ బ్లెయింకిన్ను (పార్టి సభ్యుడు) కాల్చిచంపాడు. ఆ తరువాత విచారణ చేయడం, సాధారణమైపోయింది.

లెనిన్ అనంతరం తనను నాయకుడిగా రష్యాలో అన్ని రంగాలలో ప్రతిష్టాపన చేసుకోవడానికి స్టాలిన్ చేయనిపనిలేదు. యుజోవ్ కా అనేది స్టాలినొగా మారింది. యుజోవ్ కాస్తా స్టాలినిస్కిగా అయింది. 1929 నాటికి స్టాలిన్ 50 సంవత్సరాల జూరిట్సిక్ కాస్తా స్టాలిన్ గ్రాడ్ అయింది. ప్రాయానికి చేరుకున్నాడు. స్టాలిన్ వ్యక్తి పూజబాగా సాగింది. ఉక్కు మనిషిగా స్టాలిన్ ను చిత్రించడంతో బాటు, స్టాలినాబాద్, స్టాలిన్-ఆల్, స్టాలినిరి, స్టాలినిస్సి, సాలినో, స్టాలినో గోర్ స్కీ, స్టాలినిస్క్ అనే పేర్లు వచ్చేశాయి. పార్టీలో ముందు వామపక్షాన్ని, తరువాత కుడిపక్షాన్ని నాశనం చేసిన స్టాలిన్, ఉత్తరోత్తరా లెనిన్ విధానాలను కొనసాగిస్తున్నానంటూ, రైతులపై పడ్డాడు.

1928 జనవరి నాటికి రష్యాలోని నగరాలలో ఆహార కొరతఏర్పడింది. స్టాలిన్ పిలుపుపై 30 వేల సాయుధకమ్యూనిస్టులు గ్రామాలపై విరుచుకపడ్డారు. ధాన్యాన్ని దోచుకున్నారు. 1400 టెర్రరిస్టు చర్యలు రిపోర్టుకాగా రైతుల్ని చిత్రహింసకు గురిచేశారు. రైతులు పండించడం తగ్గించేశారు. దీని వలన 1928-29లో కరువు వచ్చింది. విదేశీ మారక ద్రవ్యంకొరకు రష్యాలో అతివిలువైన కళాఖండాలను రహస్యంగా అమెరికాకు అమ్ముకున్నాడు.

1928 తరువాత స్టాలిన్ ఏనాడు గ్రామాలకు వెళ్ళలేదు. రైతులలో ఆయనపట్ల వ్యతిరేకత పూర్తి దశకు చేరుకున్నది. వ్యవసాయరంగంలో సమిష్టి కరణకై ఒక కోటి మంది రైతులు హతమార్చబడ్డారు. కొందరు సైబీరియాకు తరలించబడగా, మరికొందరు నిర్బంధ శిబిరాలలో చిత్రహింసలకు గురైనారు. కొందరు రైతుల్ని ఫ్యాక్టరీలకు తరలించి, పనిచేయించారు. స్టాలిన్ తొలిసారిగా దేశంతో ఆంతరంగింక స్టాస్ పోర్టు విధానాన్ని ప్రవేశపెట్టాడు. అనుమతిలేకుండా గ్రామం నుండి నగరానికిగాని, ఒకచోట నుండి మరో చోటుకు గాని ఎవరూ రాకూడదు. రైతులు పారిపోకుండా స్టాలిన్ ఈచర్య తీసుకున్నాడు.

స్టాలిన్ బ్రతికున్నంత వరకూ ఈ పాస్ పోర్టు విధానం బాగా అమలు జరిపారు. (ఇప్పటికీ అది వున్నది).
రైతులు స్టాలిన్ కు లొంగకపోగా ధాన్యాన్ని తగుల బెట్టారు. వ్యవసాయ పనిముట్లు నాశనం చేశారు. పశువుల్ని చంపేశారు. దీని ఫలితంగా తీవ్రకరువు ఏర్పడింది. స్టాలిన్ చేయించిన దాడులవల్లనైతేనేమి, చంపించినవారు, చనిపోయిన వారి సంఖ్య కోటికిమించింది. స్టాలిన్ కృతిమంగా తెచ్చిన ఈ కరువు, హతమార్చిన విధానం చరిత్రలో మరొక ఉదాహరణలేదేమో.

స్టాలిన్ కిరాతక చర్యల పట్లపైకి బాహాటంగా పార్టివారు నిరసన తెలుపలేక పోయారు. ఎదురు తిరిగిన వారు, గొణిగిన వారు సైతం ఆహుతయ్యారు. కాని స్టాలిన్ రెండో భార్య నాడెజ్ధా తన ఇరువురు పిల్లలతో సహా 1926లో అతడిని విడిచివెళ్ళిపోయింది. స్టాలిన్ బ్రతిమలాడినా ఆమె తిరిగిరాలేదు. స్టాలిన్ దారుణ హత్యాకాండకు 1932 నవంబరున ఆమె అందరి ఎదుట స్టాలిన్ను నిందించి ఇంటికి వెళ్ళి కాల్చుకొని చనిపోయింది. స్టాలిన్ దగ్గర సేవకులు, వంటవారు, అందరినీ పార్టిరహస్య సంస్థ శిక్షణ యిచ్చి నియమించింది. అతడు తినే ఆహారాన్ని జాగ్రత్తగా పరీక్షించేవారు. స్టాలిన్ ను చూడాలంటే ఎంతో తనిఖీజరిగేది. స్టాలిన్ వ్యక్తిగతమైన రహశ్య పోలీస్ శాఖను సృష్టించి పెంచిపోషించారు.

రష్యాలో స్టాలిన్ హయంలో దేనికీ లెక్కలు ఒక పద్దతిలో వుండేవికావు 1929-33 మధ్య విపరీతంగా అరెస్టులు చేసి, నిర్బంధ శిబిరాలకు తరలించారు. ఈ శిబిరాలు ఆర్కిటిక్ ప్రాంతాలలో హెచ్చుగా వుండేవి. కొన్ని విచారణలకు బాగా ప్రచారం యిచ్చేవారు. 1931 మార్చిలో జరిపిన మెత్సివిక్ విచారణకు, 1933 ఏప్రియల్ లో జరిపిన మెట్రో-వైకర్స్ ఇంజనీర్ల విచారణకు తెగ ప్రచారం చేశారు. ప్రజలలో భయాన్ని వ్యాపింపజేయడానికి ఈ పని చేశారు. మిగిలిన విచారణలేవీ బయటకు చెప్పలేదు. అమాయకుల్ని అరెస్టుచేసి యావత్తు సమాజాన్ని భయంతో ముంచెత్తారు.

స్టాలిన్ చిత్ర విచిత్ర పనులలో కొన్ని ఆసక్తికరంగా వుంటాయి. ఒకసారి సాంకేతిక నిపుణులని 18 మాసాలపాటు నిర్భంధంలో పెట్టి ఉరిశిక్ష వేసి, మళ్ళీ క్షమించి, శిబిరానికి పంపేశారు. తరువాత విడుదల చేసి, ఉద్యోగం యిచ్చి పారితోషికం కూడా యిచ్చారు. (మెమోర్స్ ఆఫ్ ఏ రివల్యూషనరి-పిక్చర్ సెర్జ్, పుట 250).

1932లో రష్యా ఎదుర్కొన్న కాటకం బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. బయటప్రపంచంలో రష్యా ప్రచారం వల్ల మేధావులు, శాస్ర్తజ్ఞులు, రచయితలు ఆకర్షితులయ్యారు. స్టాలిన్ రాజ్యాన్ని పొగిడినవారిలో సిడ్ని బియాట్రిస్.వెబ్, జూలియన్ హక్సలీ, బెర్నాడ్ షా, హెచ్.జి. వెల్స్ మొదలైన వారున్నారు. పైపైన చూచి పొగిడినవారు కో కొల్లలు.

లెనిన్ గ్రాడ్లో జినోవిచ్ తరువాత అధిపతి అయిన సెర్జికిరోల్ ను 1934 డిశెంబరు 1న కాల్చి చంపారు. స్టాలిన్ స్వయంగా వచ్చి, కిరోను చంపిన వ్యక్తి లియోనిడ్ నికొలెవ్ను విచారించాడు. ఎందుకు చంపావని అడిగితే, అతడు మోకాళ్ళపై కూర్చొని, రక్షక భటులు చంపమన్నారన్నాడు. వెంటనే వాళ్ళు అతడిని చితకబాదారు కిరోప్ అంగ రక్షకుడు బొరిసోల్ను చావబాదించాడు స్టాలిన్. ఆ తరువాత కిరోప్ కేసు సందర్భంగా వందమందిని చంపారు. లెనిన్ గ్రాడ్లో 40 వేల మందిని నిర్భంధించారు.

జినోవివ్, కామనెవ్ లను స్టాలిన్ అరెస్టు చేయించాడు. 1936లో విచారణజరిపి, ఇరువురినీ కాల్చిచంపారు. స్టాలిన్ కు సన్నిహితంగా వ్యక్తిగత పనులు చేస్తున్న కె.వి. పాకర్ను జర్మనీ గూఢచారి అంటూ చంపించారు. నిర్బంధంలో వున్న, 5 వేల మంది కమ్యూనిస్టులను స్టాలిన్ చంపించేశాడు. రహస్య పోలిస్ దళంలో తీవ్ర మార్పులు చేశారు. పోలిట్ బ్యూరో సభ్యుడు జార్జియా స్నేహితుడు ఆర్దోనికిడ్జిని స్టాలిన్ చంపించాడు. తరువాత బుఖారిన్, రైకోప్లను అరెస్టు చేసిచంపించేశాడు.

1937లో స్టాలిన్ ఆధ్వర్యంలో 3 వేల రహస్య పోలీస్ అధికారులను చంపారు. వివిధ రష్యా రాష్ర్టాలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను 90 శాతం చంపారు. సైనికాధిపతి షిమిడిట్ను 1936 జూలై 5న అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. 1937 జూన్ 11న 11 మంది సైనికాధిపతుల్ని చంపారు. ఆ తరువాత సైనికాధికారులలో ఏరివేత ప్రారంభించి 30 వేల మందిని చంపారు. అరెస్టు చేసిన 24 గంటల లోపే వీరిని హతమార్చారు. (More…..)

Saturday, June 16, 2007

మీ ప్రశ్నలు, మా సమాధానాలు -1వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -8

త్రిపురనేని రామస్వామి చౌదరి

నేను ఉదయం పత్రిక, వార పత్రిక అనుబంధం లోనూ రాశాను. త్రిపురనేని రామస్వామి పై రాసిన వ్యాసం, చర్చావివాదాలకు, దారితీసింది. చేకూరి రామారావు వంటివారు పాల్గొన్నారు. -Innaiah

త్రిపురనేని రామస్వామి మీద రాసిన వ్యాసం వివరాలు తెలుపగలరు. -Anil


త్రిపురనేని రామస్వామి చౌదరి అభ్యుదయవాది.వీరికి ముగ్గురు భార్యలు (ఒకరు చనిపోయిన తరువాత, మరొకరిని, ముగ్గురూ కమ్మ వారినే, వివాహమాడారు ); నలుగురు సంతానము. వారు గోపీ చంద్, పెద్ద కుమార్తె సరోజిని దేవి, గోకుల్ చంద్, చిన్న కుమార్తె చౌదరాణి. రామస్వామి గారు మతాభిమానాన్ని బాగా విమర్శించినారు.కులాంతర వివాహాలు ప్రోత్సాహించారు. తన జీవిత చివరి భాగంలో మాత్రమే, తన పేరులోని చౌదరి ని పరిత్యజించారు.తమ పిల్లలకు, కమ్మ కులంలోనే, వివాహాలు గావించారు.

రామస్వామిగారు న్యాయవాది.వీరు స్వగ్రామమైన అంగలూరు (గుడివాడ) నుంచి, గుంటూరు జిల్లా తెనాలికి వచ్చి స్థిరపడినారు. తెనాలి పురపాల సంఘానికి chairman గా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన, జస్టిస్ పార్టీ లో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు.అప్పటి కమ్మ మహాజన సంఘ సభలకు, రామస్వామి అధ్యక్షత వహించారు. ఆర్య సమాజ పద్ధతులంటే అభిమానంగా ఉండే వారు. మత గ్రంధాలను నిరసించే రామస్వామిగారు,వెదాలే సర్వస్వం, అందులోనే అన్నీ ఉన్నాయని భావించే,ఆర్య సమాజంలో ఉండటం, పరస్పర విరుద్ధమైన విషయంగా కనిపిస్తుంది.బ్రాహ్మణ పౌరోహిత్యానికి వ్యతిరేకంగా కమ్మ పురోహితులను రంగంలోకి తీసుకు వచ్చారు. కొంతకాలం అయ్యాక, కమ్మ పురొహితులే కాక, మిగత కులాల వారు కూడా పౌరోహిత్యం వహించటం అభ్యుదయం అని చెప్పాలి. వివాహ విధులు ల లో,మంత్రాలలో సంస్కృతం బదులుగా తెలుగును ప్రవేశ పెట్టారు.. ఈ మంత్రాల లోని దైవ ప్రస్తావనను,మత వాసనలను పరిష్కరించి, వివాహ విధులలో అభ్యుదయం తెచ్చారు.

రామస్వామి గారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో చివరిది భగవద్‌గీత.ఈ పుస్తక ప్రచురణ సమయంలో, రామస్వామిగారు తన పేరులో చౌదరి ని ప్రచురించలేదని, కొందరు చెప్తున్నారు. మలిముద్రణలలో కూడా చౌదరి తొలగించబడి ఉండ వచ్చు. ఏమైనా, ఇది ఆహ్వానించదగ్గ పరిణామము. మత చాందసాలను, చీల్చి చెండాడిన, రామ స్వామి గారు, వ్యక్తిగత జీవితంలో కుల తత్వాన్ని అధిగమించ లేకబోయారు.

ఈ విషయాలు, ఇన్నయ్య గారి వ్యాసములో చర్చనీయాంశాలయి,శ్రీయుతులు చేకురి రామారావు, కోటపాటి మురహరి రావు, రావెల సొమయ్య, ఇతరత్రా ప్రముఖుల కు మింగుడు బడలేదు.చివరకు కక్కా లేక మింగా లేక అయిష్టంగానైనా, వారంతా ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఈ వ్యాసాలు, చర్చలూ, State Archives, Tarnaka, Hyderabad లో భద్ర పరచబడ్డాయి.

Additional Notes: రామస్వామి గారు (1887—1943) చనిపోయేనాటికి చిన్న వయసు వారే.వయసుతో పాటే, వారి ఆలోచనలూ మారుతూ వచ్చాయి. మరికొంత కాలం జీవించి ఉంటే, చివరి దశలో, వారిలో వచ్చిన మార్పులు మరింత ప్రస్ఫుటంగా కనిపించి ఉండేవి. కులతత్వాన్ని అధిగమించిన గుర్తులూ, మనము సులభముగా పోల్చుకొనగలిగే వారము. వారి అకాల మృత్యువు, మన దురదృష్టము.

--------------------00000000--------------------

మిగతా ప్రశ్నలకు, వీలు వెంబడి, సమాధానాలు ప్రచురించటం జరుగుతుంది.

-cbrao

Thursday, June 14, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -8

ఉదయం

దినపత్రికగా హైదరాబాద్ నుండి 1980 ప్రాంతాల్లో వెలువడిన ఉదయానికి సంపాదకులుగా ఎ..బి.కె. ప్రసాద్, గజ్జల మల్లారెడ్డి, కె. రామచంద్ర మూర్తి, పొత్తూరి వెంకటేశ్వరరావు పురాణం సుబ్రహ్మణ్యశర్మ (మాగజైన్ విభాగం)ఉండేవారు.నేను ఉదయం పత్రిక, వార పత్రిక అనుబంధం లోనూ రాశాను. త్రిపురనేని రామస్వామి పై రాసిన వ్యాసం, చర్చావివాదాలకు దారితీసింది. చేకూరి రామారావు వంటివారు పాల్గొన్నారు.

జస్టిస్ పింగళి జగన్మోహన రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ అనుభవాలు రాస్తూ, జి. రాంరెడ్డి వంటి వారి గుట్టు ఉతికి ఆరేశారు. ది యూనివర్సిటీ ఐ సర్వడ్ అనే పుస్తకం నేను తెనిగించగా ఉదయంలో సీరియల్ గా వేశారు. ప్రచురించాలా వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు,పెద్ద మనిషి రాసిన సత్యాల్ని వెయ్యాల్సిందే అని గజ్జల మల్లారెడ్డి పట్టుబట్టి వేశారు. అదే విషయం ప్రచురణగా తీసుకురావడాన్ని,తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ సి. నారాయణ రెడ్డి అడ్డుపడ్డారు. జి. రాంరెడ్డిని చూసి,వెరసి అలా చేశాడాయన. ఉదయంలో తరచు వివిధ వ్యాసాలు రాశాను. దినపత్రిక ఉదయం ఆగిపోయింది. వివేకానంద పై నా వ్యాసానికి పెద్ద రియాక్షన్ వచ్చింది. హైందవ ఛాందసులు పత్రికపై దాడి చేశారు. ఎ.బి.కె. ప్రసాద్ తరువాత సంపాదకీయం రాయవలసి వచ్చింది. కడపవంటిచోట్ల పత్రికలు తగలపెట్టారు.


ఆంధ్ర ప్రభ

ఆంధ్రప్రభ దినపత్రికకు అనుబంధంగా వెలువడిన వారపత్రికలో పొత్తూరి వెంకటేశ్వర రావు ఎడిటర్ గా కొన్నాళ్ళున్నారు. అప్పుడు అగేహానందభారతి రాసిన స్వీయ అనుభవాలు వరుసగా నేను తెనిగించగా, ప్రచురించారు. ఆ పుస్తకం ఆఖర్ రోబ్ ఇంగ్లీషులో వచ్చినప్పుడు 1968లో భారత ప్రభుత్వం నిషేధించింది. తరువాత అమెరికాలో మరొక ప్రచురణ రాగా, దానిని నేను అనువదించాను. అందులో రామకృష్ణ పరమహంస, వివేకానంద ఆశ్రమాల్లో జరిగే విషయాలు లోతుపాతులతో అతడు స్వీయగాథలుగా రాశాడు.

అలాంటి ఇతివృత్తాన్ని ప్రచురించడం పొత్తూరి వెంకటేశ్వరరావు సహనాననికీ, ఉదార స్వభావానికీ, ఇతరుల అభిప్రాయాలను,ఆపరాదనే ధోరణికి నిదర్శనం. ఇది 1990 ప్రాంతంలో విశేషం. అదే సీరియల్ న్యూ హ్యూమనిస్ట్ లోనూ వచ్చింది. 1987లో అతడిని పిలిపించి, ఉస్మానియా, ఓపెన్ యూనివర్శిటీలలో ఎం.ఎన్.రాయ్ శతజయంతి ఉపన్యాసాలు ఇప్పించాను.

నర హంతకులు -5

ఒకవేపు ఇటలీ నియంత ముసోలినీతోను మరో ప్రక్క రష్యా నియంత స్టాలిన్తో ఒడంబడికలు చేసుకోగలిగిన హిట్లర్ కు పట్టపగ్గాలు లేకుండాపోయాయి. హంగరీ, రొమేనియా, యుగస్లేవియా, బల్గేరియాలపై హిట్లర్ దాడులు జరిపి విపరీత నష్టాలకు గురిచేశాడు. గ్రీకు, ఉత్తర ఆఫ్రికాలు అచిరకాలంలో జర్మనీకి దాసోహం అయినాయి.
1941 జూన్లో జర్మనులు ఆక్రమించుకున్న రష్యా భూభాగంలో 5 లక్షల మంది యూదుల్ని కాల్చి చంపారు. యూదుజాతిని నామరూపాలు లేకుండా చేయాలన్న హిట్లర్ ఉత్తరువులననుసరించి యీ చర్యగైకొన్నారు. వీరితో పాటు రష్యన్లను కూడా చంపారనుకోండి. న్యూరంబర్గ్ లో 1941లో 90 వేల మంది యూదు పురుష, స్ర్తీ, పిల్లలను కాల్చి చంపారు. ఆ తరువాత రష్యా మేల్కొని జర్మన్ సైన్యాలను తిప్పి కొట్టకపోతే ఇంకెలా వుండేదో.
రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు జర్మనీపై ఎదురుదాడి జరిపినప్పుడు సుమారు 6 లక్షల జర్మన్ లు చనిపోయారని అంచనా.
1939 సెప్టెంబరు 1న హిట్లర్ ఉత్తరువులు ఆధారంగా ప్రపధమంగా 90 వేల మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపారు. 1941 జులై 31న హిట్లర్ మరో ఉత్తరువుయిస్తూ యూదులను తుడిచిపెట్టమన్నాడు. ఎలా చంపాలో ఐక్ మస్, హైడ్రిక్ల ఆధ్వర్యాన ఒక చర్చా సదస్సు కూడా జరిగింది. 1941 ఆగస్టులో పట్టుబడిన రష్యా యుద్ధ ఖైదీలను జైక్లాన్-బితో 500 మందిని చంపారు. పురుగుల నివారణ కంపెనీ డెగ్షే (degesch) యీ మందును తయారు చేసి గ్యాస్ నిమిత్తం అందించింది.
1942 మార్చి 17న బెల్జక్ శిబిరంలో మూకుమ్మడి హత్యా కాండ ఆరంభమైంది. 15 వేల మందిని యీ శిబిరంలో చంపారు. దాని శక్తి అంతేవున్నదట. సోబిబోర్ కేంప్ లో రోజుకు 20 వేల మందిని గ్యాస్ తో చంపారు. టెబ్లింకా, మెడనక్ కేంప్ లలో 25 వేల మంది చొప్పున మరణించారు. ఆప్ విట్జ్ అన్నింటికంటే పెద్ద మరణాల శిబిరంగా తయారైనది.
1941లో 87 లక్షల యూదులు జర్మనీలో వున్నారు. ఇందులో 58 లక్షల మందిని 1945 నాటికి హిట్లర్ చంపించగలిగాడు. పోలండ్ నుండి పట్టుబడిన 26 లక్షల మందిని, రష్యా నుండి 7 లక్షల మందిని, రొమేనియా నుండి అంతే మందిని హంగరీలో 4 లక్షల మందిని, చకస్లోవేకియాలో రెండున్నర లక్ష, ఫ్రాన్స్లో లక్షకు కొంచెం తక్కువ, లాట్వియాలో 70 వేలు, గ్రీసులో 65 వేలు, అంతే సంఖ్యలో ఆస్ర్టియాలో, యుగస్లేవియాలో 60 వేలు, బల్గేరియాలో 40వేలు, బెల్జియంలో 28 వేలు, ఇటలీలో 9 వేలమంది యూదులను కసిగా హిట్లర్ మట్టుబెట్టించాడు.
జర్మనీలో యీ యూదులను చంపడానికి అనేక కంపెనీలు పోటీబడి, శిబిరాలలో గ్యాస్ ఛాంబర్లు ఏర్పరచి, హిట్లర్ దాహాన్ని తీర్చాయి. ఆష్ విట్జ్ శిబిరంలో 20 లక్షల మందిని చంపి ప్రథమస్థానం తెచ్చుకున్నది.
యూదులందరినీ చంపాలనే హిట్లర్ కోర్కె తీరలేదు. ఇంకా మిగిలిపోయారు, ఇందులో ఇంకో గొడవ ఏమంటే, హిట్లర్ కు తెలియకుండా కొందరు యూదులను నిర్భంద కార్మికులుగా కొన్ని కర్మాగారాలకు హిమ్లర్ అప్పగించి, వారివద్ద డబ్బుతిన్నాడు. ఆ విధంగా కొందరు బ్రతికిపోయారు.
ప్రతిరోజు రైళ్ళలో యూదుల్ని చేరవేసి, అందులో అనారోగ్యవంతుల్ని ఏరి, ముందుగా గ్యాస్ తో చంపేవారు. యూదుల వస్తువులన్నీ ఏరి, వేలం వేసేవారు. హిమ్లర్ యూదుల అస్తి పంజరాలలో మేలైనవి ఏరి ప్రదర్శనకై అట్టిపెట్టాడు.
ఈ మరణ శిబిరాల నుండి సాధారణంగా ఎవరూ బయటపడలేదు. 1944 ఆగస్టులో ఇద్దరు యూదులు ఎలాగో తప్పించుకున్నారు.
యూదులతో బాటు ఇతరులను కూడా ఈ చిత్ర హింసకు గురిచేయడం వలన, దారుణం జరిగిపోయినది.

Monday, June 11, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణంఆలోచింప చేసే ఈ వ్యాసాలు, నార్ల వెంకటేశ్వర రావు గారు సంపాదకులుగా ఉన్న సమయంలో, ఆంధ్రజ్యోతి దినపత్రిక లో, సంపాదకీయం ఉండే పేజీ లో, 1970 ప్రాంతంలో ప్రచురించారు. ఉపసంపాదకుడు నండూరి రామమోహనరావు, ఈ వ్యాసాలపై స్పందించ వలసినదిగా, కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్) నాయకులైన, మాకినేని బసవపున్నయ్య గారిని కోరగా, కొత్తగా చెప్పటానికి ఏమి లేదు అని వ్యాఖ్యానించారు. రేపల్లె నుంచి శ్రీ రవిబాబు, సమాధానం పంపారు; కాని,దానిని పాఠకులు పట్టించుకోలేదు.

తరువాత, బందరు నుంచి, కొల్లూరి కోటేశ్వర రావు సంపాదకత్వంలో వెలువడే, తెలుగు విధ్యార్థి మాస పత్రికలో, ధారావాహికంగా ప్రచురించ బడ్డాయి. ఉయ్యూరు హిందీ అధ్యాపకులు, కె.రామారావు గారు, ఇవి చదివి, తానే సొంతంగా ప్రచురించి, పెక్కు మందికి, పుస్తక ప్రతులను , ఉచితంగా పంచారు. ఆ తరువాత, కొంత కాలానికి, చీరాల నుంచి అంచా బాపారావు సంపాదకత్వంలో వెలువడే న్యూ హూమనిస్ట్ మాస పత్రికలో, మరలా ప్రచురించ బడ్డాయి. ఈ వ్యాసాలు, కమ్యూనిస్టుల ఆలోచనా విధాన్ని భిన్నకోణంలో చూపాయి. కమ్యూనిస్ట్ లను సైతం, ఆశ్చర్య పడేలా, చేశాయీ వ్యాసాలు. అరుదైన ఈ వ్యాసాలు, మీ కోసం , త్వరలో.

-cbrao

Tuesday, June 5, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -7

ఆంధ్రజ్యోతి

1975లో నార్ల వెంకటేశ్వరరావుగారు ఇంటికి పిలిచి ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరోలో స్పెషల్ కరస్పాండెంట్ గా చేరమన్నారు. అందుకు అంగీకరించి చేరాను. సెక్రటేరియట్ ఎదురుగా ఒక మేడ గదిలో ఆఫీసు వుండేది. హెడ్ ఆఫీస్ విజయవాడలో. సంపాదకుడిపేరు నార్ల వెంకటేశ్వర రావు. అయినా వ్యవహారాలన్నీ విజయవాడలో నండూరి రామమోహన రావు చూసుకునేవారు. కొన్ని ప్రత్యేక శీర్షికలు రాయమని నార్ల కోరగా ప్రపంచంలో మహా పలాయనాలు, విశిష్ట రచయితలు, వివిధ భారతీయ భాషలలో సమకాలీన సాహిత్యతీరులూ రాశాను.
కార్ల్ మార్క్స్ కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం సీరియల్ వ్యాసాలు సంచలనం కలిగించాయి. కమ్యూనిస్టు అగ్రనాయకుదు మాకినేని బసపున్నయ్య కు ఆ వ్యాసాలపై రియాక్షన్ రాయమని నండూరి రామమోహన రావు కోరారు. కానీ ఆయన రాయలేదు. ప్రామాణిక సమాధానాలేవీ చర్చలోకి రాలేదు.
హైదరాబాద్ బ్యూరో లో వున్న రామకృష్ణను ఢిల్లీకి మార్చి నన్ను చీఫ్ చేసారు. ఐ. వెంకట్రావు స్పెషల్ రిపోర్టర్ గా వచ్చారు. దామోదర స్వామి, వుడయవర్లు, రామానాయుడు పనిచేశారు. రాజకీయ నాయకులతో మెలిగే అవకాశం లభించింది. ముఖ్యమంత్రి గా జలగం వెంగళ రావు మంచి స్పందన చూపించారు. ముఖ్యమంత్రి గా చెన్నారెడ్డి నానుంచి ఇబ్బందికర ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆనాడు చెన్నా రెడ్డి పాలన కింద డ్రైనేజి బోర్డు ఛైర్మన్ కావడాన్ని నేను విమర్శించాను. అది సి.పి.యం. వారికి రుచించక పోయినా ఏమీ అనలేకపోయారు. చెన్నారెడ్డిని దుయ్యబట్టిన వందేమాతరం రామచంద్ర రావు ఆయనకిందే అధికార భాషాసంఘం అధ్యక్షుడయ్యారు. ఆయన్ను కూడా ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేశాను. భవనం వెంకట్రాం విద్యామంత్రి గా మిత్రులయ్యారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్. చంద్రబాబు నాయుడు, అనేకమంది రాజకీయవాదులకు, ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నాయకులకు సన్నిహితం గా మెలిగే అవకాశం లభించింది. ముఖ్యమంత్రి గా జలగం వెంగళ రావు మంచి స్పందన చూపించారు. ముఖ్యమంత్రి గా చెన్నారెడ్డి దగ్గరయ్యారు. శాసనసభ రిపోర్టులు బాగా అలవాటయ్యాయి. హైకోర్టులో సాగిన రమీజాబీ కేసు రిపోర్టు చేయడం, భార్గవ కమీషన్ జరిపిన ఎన్ కౌంటర్ విషయాల రిపోర్టింగ్ ఆకర్షణీయమైనవి. ఖమ్మం జిల్లలో పర్యటించి, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు రిపోర్టు చేయడం. నాటి ఐ.ఎ.ఎస్. ఆఫిసర్ బాబుకు నచ్చక ఫిర్యాదు చేశాడు. కానీ వెంగళ రావు పట్టించుకోలేదు. గౌతు లచ్చన్న పై రాసిన విమర్శనాత్మక విశ్లేషణ పై ఆయన శిష్యులు ఫిర్యాదు చేయ గా నండూరి రామమోహనరావు పట్టించుకున్నారు. అయినా విశ్లేషణలో నాది తప్పులేదని తేల్చుకున్నారు.
హోం మంత్రి కొన్నిసార్లు నా రిపోర్ట్ వెనుక రహస్యాలు కావాలని పట్టుపట్టి విఫలమయ్యారు. ఎన్. జనార్ధన రెడ్డి, జి రాజారాం బాగా మిత్రులయ్యారు. పోలీసుశాఖ విషయాలు రాసినప్పుడు చాలా పరిశీలన జరిగేది. పర్వతనేని కోటేశ్వర రావు పోలీసు అధికారిగా కొన్ని సందర్భాలలో తోడ్పడ్డారు.
హైదరాబాద్ యూనివర్శిటీ తొలి వైస్ ఛాన్స్ లర్ గుర్బక్ష్ పై అవినీతి ఆరోపణలతో నేను రిపోర్ట్ ప్రకటీస్తే ఆంజనేయరెడ్డి పోలీస్ అధికారి గా, వెనుక ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
1980 నాటికి నన్ను విజయవాడ బదిలీ చేయగా రాజీనామా చేశాను. ఆంధ్రజ్యోతితో సంబంధాలు తెగిపోయాయి. నండూరి రామమోహనరావు ఎడిటర్ గా ఆనాడు తత్వశాస్త్రంపై రాయడానికి సాహిత్యం కోరగా, అనేక పుస్తకాలిచ్చాను.
కాకాని వెంకటరత్నం, గొట్టిపాటి బ్రహ్మయ్యలు పాలడుగు వెంకట్రావు, ఎం.వి.ఎస్.సుబ్బరాజు, తేళ్ళ లక్ష్మీకాంతమ్మ అప్పట్లో బాగా సన్నిహితులయ్యారు. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికార్లలో కొందరు మిత్రులయ్యారు. బి.ఎన్. రామన్, కాశీపాండ్యన్, అర్జునరావు, కె.ఆర్.మూర్తి, ఎం.ఆర్.పాయ్, విజయరామారావు, శ్రీనివాసన్, ఎ.ఎస్.వి.రెడ్డి, రెబెల్లో, పేర్కొనదగినవారు.
నార్ల వెంకటేశ్వరరావుకూ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికీ పేచీ వచ్చిన తరువాత నేను నార్లకే సన్నిహితుడనయ్యాను. నా రిపోర్టింగ్ కు అదేమీ ప్రభావం చూపించలేదు.
ఎడిటర్ గా నార్ల తరచు సలహాలు ఇవ్వడం శీర్షికలు సూచించడం ఉండేది. నార్ల పేరు వలన, ఆయన సంపాదకీయాల ప్రభావం వలన సర్క్యులేషన్ గొప్పగా లేకున్నా, పత్రిక పేరు ప్రతిష్ఠలుండేవి. నండూరి రామమోహనరావు పిరికివాడు కావడం వలన గట్టి రిపోర్టు చూసి ఉలిక్కిపడేవాడు. యాజమాన్యం కీలుబొమ్మ. బ్యూరోలో ఈ విషయాలు బాగా కనిపించాయి. సంపాదకీయ శైలిలో రామమోహనరావు నార్లను అనుకరించే విఫల ప్ర.యత్నం చేశారు. కె. రామచంద్రమూర్తి ఎడిటర్ అయిన తరువాత మళ్ళీ ఆంధ్రజ్యోతికి రాశాను.

సశేషం

Monday, June 4, 2007

నర హంతకులు -4


నాజీ నరకాసురుడు హిట్లర్

జర్మనీలో హిట్లర్ ఈ శతాబ్దంలో చేసిన మారణహొమం చరిత్రలో మరువరానిది. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసిన హిట్లర్ జర్మనీ ఓటమి వలన అవమానంచెందాడు. పగతీర్చు కోవాలనే పట్టుదల వహించాడు. యుద్ధానికి ముందే వియన్నామేయర్ కార్త్ లూగెర్ నుండి సోషలిస్టు భావాలను, జార్జివాన్ షొవెరర్ నుండి యూదుల పట్ల ద్వేషాన్ని నేర్చుకున్న హిట్లర్. సైన్యానికి రాజకీయ విద్య గరపాలనే విథానాన్ని లుడెస్ డార్ప్ నుండి తెలుసుకున్నాడు.
1919లో మ్యూనిచ్లో సైన్యానికి రాజకీయ బోధకుడైన హిట్లర్ ఆ ఏడు సెప్టెంబరులో రాజకీయ పార్టీ స్థాపించాడు. 1920 ఏప్రియల్లో సైన్యానికి గుడ్ బై చెప్పి, పూర్తి రాజకీయవాది అయ్యాడు. హిట్లర్ పెట్టిన నాజీపార్టీలో 1923 నాటికి 4800 మంది సభ్యులు చేరగా అందులో 345 మంది కార్మికులే.
1923 నవంబరు 8న 3 వేల మందితో హిట్లర్ బవేరియాలో స్థానిక ప్రభుత్వాధికారులపై దాడి జరిపి, నిర్భంధించి ప్రభుత్వాన్ని ఏర్పరచినట్లు ప్రకటించాడు. కాని పోలీసులు కాల్పులు జరిపి హిట్లర్ ను నిర్భంధించి జైలు శిక్ష విధించారు. జైల్లొ వుండగా తన భావాలను అమలు చేయదలచిన రీతులను క్రోడీకరించి మైన్ క్వాంప్ అనే గ్రంథాన్ని వ్రాశాడు. 1924 డిశెంబరు 20న విడుదలైన హిట్లర్, నాజీభావాలతో విజృంభించాడు. యూదులకు వ్యతిరేక నినాదంతో 1926 నాటికి తన పార్టీపై పూర్తి ఆదిపత్యాన్ని సాధించిన హిట్లర్ ధారాళంగా మాట్లాడి మంచి వక్తగా తన ప్రేక్షకులను సమోహితుల్ని చేస్తుండేవాడు.
1928 ఎన్నికలలో హిట్లర్ పార్టీకి 28 శాతం ఓటు మాత్రమే వచ్చింది. కమ్యూనిస్టులకు ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి నుండి ఏటా నాజీ పార్టి పెరిగిపోయింది. 1932 నాటికి హిట్లర్ పార్టిలో 8 లక్షల మంది చేరారు. అప్పటికే నిరుద్యోగ సమస్యచూపి హిట్లర్ విద్యార్ధులను ఆకర్షించాడు. జాతీయవాద పార్టి హిట్లర్ ను వాడుకుందామని కావలసిన ధనాన్ని సమకూర్చిపెట్టగా అది నాజీలకు తోడ్పడింది. హిట్లర్ వస్తే కాసేపట్లో పడగొట్టి తాము పెత్తనం చేయవచ్చని కమ్యూనిస్టులు, మితవాదులు తప్పుడు అంచనా వేశారు.
1932 ఎన్నికలలో హిట్లర్ నాజీలకు 37.2 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి నుండి నాజీలు కమ్యూనిస్టులు వీధుల్లో కుక్కలవలె పోట్లాడుకుని జర్మనీ అంతా భీభత్సం గావించారు. అయేడు నవంబరులో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులకు 100 సీట్లు రాగా మితవాదులు బలపడి 196 సీట్లున్న హిట్లర్ కు మరింత బలాన్ని సమకూర్చిపెట్టారు. సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడింది. 1933 జనవరి 30న హిట్లర్ ఛాన్సలర్ అయ్యాడు.
ప్రపంచ చరిత్రలో అదొక పెద్ద దురదృష్టకర మలుపు. అధికారంలోకి వచ్చిన హిట్లర్ 25 వేల మందితో టార్చ్ లైట్ పెరేడ్ చేయించాడు.
1933 ఫిబ్రవరి 28న పూర్తి హక్కులు తనకు దత్తం చేసుకుంటూ హిట్లర్ ఆర్డినెన్స్ జారీ చేశాడు. అంతేగాక లాంఛన ప్రాయంగా ఆఖరుసారి తన ఆర్డినెన్స్ చర్చకు పెట్టి హిట్లర్ పార్లమెంటు ఆమోదాన్ని కూడా పొందాడు. అప్పటికే 81 మంది కమ్యూనిస్టు సభ్యులు పారిపోవడమో, అరెస్టు కావడమో జరిగింది. 441 ఓట్లు హిట్లర్ కు రాగా 94 మంది వ్యతిరేకించారు.
అప్పటి నుండి కమ్యూనిస్టులను దారుణంగా హతమార్చడం ఆరంభమైంది. కొందరు కమ్యూనిస్టులు బ్రతుకు జీవుడా అని రష్యాలో తలదాచుకోవడానికి వెడితే ఉరిత్రాడే ఎదురైంది.
1933 జూన్లో నాజీపార్టీ తప్ప మిగిలిన పార్టీలను నిషేదించారు. కొద్ది వారాలలోనే హిట్లర్ అనుమతితో గోరింగ్ జర్మనీ కమ్యూనిస్టు పార్టీని తుడిచిపెట్టాడు.
నాలుగు విధాలైన రహస్య పోలీస్ కేంద్రాలను హిట్లర్ ఏర్పరచి, ఒకరికి తెలియకుండా మరొకరిని తన దహన కాండకు వాడుకున్నాడు. గోరింగ్, హిమ్లర్ ఇందుకు తోడ్పడ్డారు దేశమంతటా నిర్భంధ శిబిరాలు వెలిశాయి. హిట్లర్ వాక్యమే చట్టం, న్యాయంగా జర్మనీలో 10 ఏళ్ళపాటు ఆటవిక పాలన సాగింది. జడ్జీలను సైతం డిస్మిస్ చేసే అధికారాలను హిట్లర్ సంక్రమింపజేసుకున్నాడు. ప్రజాకోర్టులు పెట్టి అక్కడక్కడే తీర్పు యిచ్చే పద్దతులు ప్రవేశపెట్టాడు. మంత్రిమండలి సమావేశాల్లో నిర్ణయాలన్ని హిట్లర్ తీసుకునేవాడు.
హిట్లర్ అధికారంలోకి రాగానే యూదులను ఊచకోత ఆరంభించాడు. కొందరిని దేశం వదలి పారిపోనిచ్చాడు. వారి ఆస్తుల్ని కొల్లగొట్టడం, స్వాధీనం చేసుకోవడం సర్వ సాదారణమైపోయింది. పేర్లలో గందరగోళం లెకుండా యూదులందరినీ ఇజ్రాయిలీ అని తెలిసేటట్లు నామకరణం చేయమన్నాడు. 1938 నవంబరు 8న యూదులను చీల్చి ఛండాడారు.
జర్మనీ ఆధ్యక్షుడు హిండెన్ బర్గ్ చనిపోవడంతో హిట్లర్ ఆ అధికారాలుకూడా సంక్రమింప జేసుకున్నాడు. జర్మనీలో ఎవరినీ చంపేయాలో ఒక జాబితాను సిద్ధం చేసి హింలెర్, హైడ్రిక్లు యిరువురు హిట్లర్ కు సమర్పించారు. పెన్సిల్ తో హిట్లర్ గుర్తు పెట్టి వారందరినీ కాల్చి చంపమన్నాడు. ఎప్పటికప్పుడు కాల్చేసిన వారి జాబితాను. ఇంకా కాల్చవలసిన వారి జాబితాను హిట్లర్, గోరింగ్, హిమ్లర్ చూస్తుండేవారు. రాజకీయ శత్రువులందరినీ ముందు హతమార్చారు. పాతకక్షలు తీర్చుకోవడానికి మరి కొందరిని మట్టుబెట్టారు.
చంపేసిన ప్రముఖులలో బవేరియా ప్రధాని గస్టావ్ వాన్ కర్, నాజీ పార్టీలో హిట్లర్ ప్రత్యర్ధి గ్రెగార్ స్ర్టాసర్, జనరల్ వాన్ స్లెషర్ అతని భార్య, జనరల్ వాన్ బ్రెడోవ్ కాథలిక్ నాయకుడు ఎర్నెస్ క్లాజనర్, మరో 150 మంది రాజకీయ వాదులను ముందుగా చంపేశారు. జర్మనీలో హిట్లర్ అధి కారాలపై జనవాక్య సేకరణ, చేస్తే 84.6 శాతం అనుకూలంగా చేశారు.
జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలోకీ పోవడం అక్కడి ప్రజలకు యిష్టంలేదు పోలండ్ను జయించివచ్చిన తరువాత ప్రజలు సంతోషంగా స్వాగతాలు పలుకలేదు. హిట్లర్ స్వయంగా సర్వసైన్యాధిపత్యం వహించాడు. మెరుపు దాడులతో యూరప్ను హడలగొట్టిన హిట్లర్ ఫ్రాన్స్ పైదాడి జరిపాడు. ఆ దాడిలో 27 వేల మంది జర్మన్లు చనిపోగా 135000 మంది ప్రత్యర్ధి సైన్యాలు పోయాయి.
(మిగతా వచ్చే వారం)