Wednesday, May 30, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -6

ఈనాడు

రామోజీరావు ఈనాడు దినపత్రిక ప్రారంభించడానికి ముందు భిన్న కోణాలలో వ్యక్తుల్ని సంప్రదించారు. హైదరాబాదులోని ఆబిడ్స్ లో ఆయన మార్గదర్శి కార్యాలయానికి గోరా శాస్త్రిని, ఆయనతోబాటు నన్ను పిలిచారు. ఎన్నో సాయంత్రాలు అలా కూర్చొని జరిపిన సంప్రదింపులలో రామోజీరావు శ్రద్ధగా నోట్స్ తీసుకోవడం నాకు బాగా గుర్తు. అప్పుడే ఆయనకు సన్నిహితంగా వచ్చాను.
ఈనాడు దినపత్రిక ప్రారంభించినప్పుడు తొలుత వైజాగ్ నుండి వెలువడింది. అందులో ఆదివారం పత్రిక వ్యాసాలకు చలసాని ప్రసాదరావు ఇన్ ఛార్జి.
ఆయన కోరిక పై ఈనాడు ఆదివారానికి వ్యాసాలు రాశాను. 1982 వరకు అలా సాగింది. ఈనాడులో పడిన వ్యాసాలకు డబ్బిచ్చేవారు.
విజయవాడ, హైదరాబాద్ ఈనాడు వచ్చిన తరవాత కూడా నేను రాశాను. టంగుటూరి ప్రకాశంపై 1982లో నేను రాసిన వ్యాసానికి చాలా రియాక్షన్ వచ్చినట్లు గజ్జల మల్లారెడ్డి చెప్పారు. ఈనాడులో హోమియోపతీని ప్రోత్సహించడం నాకు నచ్చని విషయం. హోమియో శాస్త్రీయం కాదని రాస్తే, ప్రచురించలేదు.
రామోజీరావును తరచు ఈనాడు ఆఫీసులో కలిసేవాడిని. అలాగే చలసాని ప్రసాదరావుతో ఆయన చనిపోయేవరకూ కలిశాను. ఎడిటర్స్ గా నాకు తెలిసిన మిత్రులెందరో పని చేశారు. అయితే 1975లో నేను ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ అయినప్పటి నుండి ఈనాడుతో సంబంధం తగ్గింది. పొత్తూరి వెంకటేశ్వరరావు కొన్నాళ్ళు ఈనాడులో జర్నలిజం క్లాసులు నిర్వహించి, నన్ను కూడా ఆహ్వానించారు. కొన్ని ప్రసంగాలు చేశాను.
చలసాని ప్రసాదరావు నేనూ భిన్నాభిప్రాయాలతో ఉన్నా, స్నేహితులుగా చివరి వరకూ కొనసాగాం. టాపిక్ లు సూచించి రాయమనేవారు.
ఈనాడు తెలుగునాడు అని ఒక పక్షపత్రికను విదేశీ తెలుగువారి కోసం స్థాపించారు. అందులో రాజకీయ వ్యాఖ్యానం రాయమని రామారావు చెరుకూరి అడిగారు. రామోజీరావును సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న కారణంగా సాక్షి పేరిట రాశాను. సుమారు 15 సంచికలతో అది ఆగిపోయింది. విదేశీ తెలుగువారి ఆదరణ లేక ఆపేశామన్నారు. ఎం. నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ గా ఈనాడు జర్నలిజం స్కూలు క్రమపద్ధతిలో నడుస్తున్నది. అందులో కొన్ని ప్రసంగాలు చేశాను.


న్యూ హ్యూమనిస్ట్

అంబా బాపారావు చీరాల నుండి మాసపత్రికగా కొన్నేళ్శపాటు న్యూ హ్యూమనిస్ట్ నడిపారు. 1980 ప్రాంతాలలో ఈ సాహసం చేసి చేతులు కాల్చుకున్నారు. మానవ వాద సంఘానికి పత్రిక లేదనే ఉద్దేశ్యంతో నడిపారు. ఆద్యంతాలూ అన్నీ కష్టాలే. నేను అనేక వ్యాసాలు అనువాదాలు రాశాను. అగేహానంద భారతి రాసిన 'ఆకరీరొజ్' కాషాయవస్త్రం పేరిట వివాదాస్పద, ఆసక్తికర జీవిత చరిత్ర అందించాను. నరహంతకుల పేరిట ప్రపంచ క్రూర నియంతల విషయం సీరియల్ గా రాసాను. తరువాత అది గ్రంథ రూపం దాల్చింది బాపారావు ఎంత కోరుకున్నా నడపలేక ఆపేసిన మాసపత్రిక న్యూ హ్యూమనిస్ట్.

వచ్చే వారం ఆంధ్రజ్యోతి.

Sunday, May 27, 2007

నర హంతకులు - 3

స్టేట్ టెర్రరిజానికి శ్రీకారం చుట్టిన లెనిన్ - 2

1918లో మొదటి ఆరునెలల్లో లెనిన్ ఉత్తరువులననుసరించి, కేవలం 22 మందినే చేకా చంపినట్లు అధికార నివేదికలో పేర్కొన్నారు. ఆ తరువాత ఆర్నెల్లలో ఆరు వేల మందిని ఉరితీశారు. 1919లో కేవలం 10 వేల మందిని చంపేశారు. 1920 వచ్చే సరికి చేకా సంస్థకు చేతినిండా పని తగిలింది. ఆ యేడు 50 వేల మందిని ఉరితీసేశారు. ఇదంతా లెనిన్ ప్రోత్సాహం, ఉత్తరువుల మేరకే జరిగిన మారణకాండ. ఇలా చంపడంలో వ్యక్తిగతంగా విచారించే ప్రశ్నలేదు. వర్గాన్ని తుడిచి పెట్టడం ప్రధానం. ఈ సామూహిక హత్యలకు లెనిన్ పేర్కొన్న-వర్గాన్ని తుడిచిపెట్టాలనే సూత్రమే మూలం.

1917 నవంబరు 17వ రాజ్యాంగసభ ఎన్నికైంది. దీనిని సమావేశపరచడానికి లెనిన్ యిష్టపడలేదు. అయినా తప్పనిసరై 1918 జనవరి 5న రాజ్యాంగ సభ సమావేశం ఏర్పరచారు. చర్చలలో బోల్షి విక్కులకు వ్యతిరేకత వున్నది. ఓటు పెడితే బోల్షివిక్కులకు వ్యతిరేకంగా 237 వచ్చాయి. ఇదంతా ముందే గ్రహించిన లెనిన్ తన మనుషులను సమావేశ భవనానికి కాపలా పెట్టించాడు. లెనిన్ ఆధ్వర్యాన గల బాల్టిక్ ఫ్లీటు నావికులు కాపలా వున్నారు. రాత్రంతా చర్చలు జరిగిన అనంతరం తెల్లవారుజామున ప్రతినిధులను వెళ్ళిపొమ్మని, కాపలా సైనికులు అలసిపోయారని లెనిన్ ఆదేశాలిచ్చారు. మళ్ళీ 12 గంటల తరువాత సమావేశం కావాలని అనుకున్నా అలాంటి సమావేశం ఎన్నడూ జరగలేదు. ఆ విధంగా ప్రాతినిధ్యపు ప్రజాస్వామ్యాన్ని లెనిన్ మట్టుబెట్టి రష్యాలో నామరూపాలు లేకుండా చేశారు. రాజ్యాంగసభ సమావేశం కావలసినచోట మూడు రోజుల అనంతరం సోవియటు చేరి లెనిన్ పెత్తనానికి ఆమోదమద్ర వేసినట్లు లాంఛనంగా ప్రకటించారు.
తన అధికారానికి బయటా, లోపల తిరుగులేకుండా చెసుకోడానికి లెనిన్ చేయవలసిన దారుణ కృత్యాలన్నీ చేశాడు. జర్మనీవారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి, లెనిన్ వారితో సంధి చేసుకున్నాడు. అంతటితో రష్యాకు జర్మనీ సైవ్యాల బెడద ఆగింది. లెనిన్ రాక్షసకృత్యాలకు అంతరంగికంగా మరింత అవకాశం చిక్కింది. ఇందుకు అండగా నిలిచినవాడు స్టాలిన్.
రష్యాలో రైతులకు హామీలు గుప్పించిన లెనిన్ వారికి చెల్లని చెక్కులు యిష్టానుసారంగా యిచ్చి నమ్మించి మోసం చేశాడు. విదేశాలవారికోసం స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని వల్లించిన లెనిన్ రష్యాలో దీనిని పాటించలేదు. ఉక్రైన్, కాక్పన్, ఏషియన్ రష్యాలో లెనిన్ స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని అనుమతించలేదు. లెనిన్ కు చిట్టచివరి వ్యతిరేకత నావికదళం నుండి వచ్చింది. వారు స్వేచ్ఛను సమానత్వాన్ని కోరారు. సోవియట్లు సరైన ప్రజాప్రతినిధులు కారన్నారు. కాని లెనిన్ యివేమీ పట్టించుకోలేదు. కీలక నాయకుల పేరిట 13 గురి పేర్లను ప్రకటించి చంపారు. తరువాత వందలాది మందిని రహస్యంగా హతమార్చారు.
1921 మేలో లెనిన్ పార్టీ బయట రాజకీయ కార్యకలాపాలకు స్వస్తి చెబుతూ ప్రకటన చేశారు. అంతటితో చెకా రంగంలో ప్రవేశించి కొందరని మట్టుపెట్టగా మరికొందరిని ప్రవాసానికి పంపారు పార్టీ సభ్యత్వానికి ప్రాధాన్యత పెరిగింది. కమ్యూనిస్టు పార్టీ 1921లో లెనిన్ ఆధ్వర్యాన 585000 మందికి పెరిగింది. పార్టి సర్వాధికారి అయింది కేంద్రీకృత పార్టీ నాయకత్వాన్ని లెనిన్ కట్టుదిట్టం చేశాడు. పార్టీలో కూడా ప్రజాస్వామ్యాన్ని చంపేశాడు. స్టాలిన్ ద్వారా తన ఉత్తరువులు అమలు జరిగేటట్టు లెనిన్ వత్తాసుదారులే వుండడం వలన ఇక అరాచకాలెన్ని చేసినా అడిగేదిక్కు లేకుండా పోయింది.
1922 మే 25న లెనిన్ కు తొలిసారి తీవ్రంగా జబ్బుచేసింది. అంతకుముందే లెనిన్ కు బాగా తలనొప్పి వస్తుండేది. సెలవు తీసుకోడానికి నిరాకరించిన లెనిన్ 1921 జులైలో ఒక నెల విశ్రాంతి తీసుకున్నాడు. పనితగ్గించమని ఆగస్టులో పోలిట్ బ్యూరో ఉత్తరువులిచ్చింది. 1922లో అలాంటి ఉత్తరువులు తిరిగి యిచ్చారు. 1922 మే నుండి అక్టోబరు 2 వరకూ లెనిన్ విశ్రాంతి తీసుకోగా, తిరిగి వచ్చిన అనంతరం కూడా అధికార పత్రాలు అందుబాటులో లేకుండా చేశారు.
లెనిన్ ఆరోగ్య పరిరక్షణాధికారిగా 1922 డిసెంబరు 18న స్టాలిన్ నియమితుడైనాడు. లెనిన్ రహస్యంగా పనిచేస్తూ తన భార్య కృపస్క మాకు ఉత్తరాలు చెప్పి వ్రాయించడం స్టాలిన్ కు నచ్చలేదు.
1922 డిసెంబరు 24న ఆరుగురు సోవియట్ ప్రముఖుల్ని గురించి లెనిన్ చెప్పి వ్రాయించాడు. 1923 జనవరి 4న లెనిన్ మరో అనుబంధ నోట్ చెప్పి వ్రాయించాడు. స్టాలిన్ పట్ల దృఢమైన అభిప్రాయాలు అందులో వ్యక్తపరచాడు. 1923 మార్చి 5న స్టాలిన్ కు ఒక ఉత్తరం వ్రాస్తూ లెనిన్ తన భార్యను నిందిస్తూ ఫోనులో స్టాలిన్ చేసిన బెదిరింపును నిరసించాడు. ఈ విషయమై క్షమాపణ కోరమన్నాడు కాని, ప్రత్యుత్తరం రాకముందే లెనిన్ కు నోరు పడిపోయింది. 1924 జనవరిలో లెనిన్ మరణించాడు. కేంద్రకమీషను చేత కృపయస్కాపై విచారణ జరిపిస్తానని స్టాలిన్ ఫోను చేసి లెనిన్ భార్యను బెదిరించిన తరువాత యిదంతా జరిగింది.
పనిచేయనివాడు తినడానికి వీల్లేదనే లెనిన్ సూత్రం రష్యాలో అన్వయించారు. సమ్మెలు నిషేధించారు. క్రమశిక్షణ లేని కార్మికులు, రౌడీలు, వూరికే తిరిగేవారు మొదలైన బాపతులను పట్టుకొని చెకా సంస్థ ఆధ్వర్యాన నిర్భందపనిలో పెట్టారు. విప్లవ ట్రిబ్యునల్స్ (నార్కండ్రడ్) ఈ నిర్ణాలు తీసుకోగా అలాంటి వారితో రోడ్లు వేయడం, భవన నిర్మాణం, బండ్లు లాగడం యిత్యాది పనులెన్నో చేయించేవారు. విప్లవ ప్రతిఘాతుకులచేత అర్కిటిక్ ప్రాంతంలో నిర్భందశ్రమ చేయించేవారు. లెనిన్ ప్రారంభించిన నిర్భంద శ్రామిక శిబిరాలు, అంతర్యుద్దానంతరం కూడా కొనసాగాయి. కార్మిక రాజ్యంలో కార్మికుల స్థితి లెనిన్ ఆధ్వర్యాన అలా వుండేది.
1917లో భూముల్ని ఆక్రమించుకోవలసిందిగా లెనిన్ రైతుల్ని రెచ్చగొట్టాడు. 1918లో ఆ భూముల్ని రైతులనుండి లాగేసే ప్రయత్నం అదే లెనిన్ చేశాడు. 86 శాతం భూమి రైతుల చేతుల్లో వుండగా ప్రభుత్వ సమిష్టి వ్యవసాయానికి 11 శాతమే దక్కింది. ఇది చూచి 1918లో పంటను స్వాధీనం చేసుకోమంటూ లెనిన్ ఫాక్టరీ కార్మికులను పొలాల మీదకు పంపించాడు.
కులక్ లకు వ్యతిరేకంగా చిన్న రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా లెనిన్ చేశాడు. నగరాలలో ఆహార కొరత తీర్చడానికి రైతులకు ధనాశచూపిన లెనిన్ విఫలమైనాడు. అంతటితో రైతులకు స్వేచ్ఛను యిచ్చామన్నారు. కాని అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. 1921లో వచ్చిన కరువు కారణంగా లెనిన్ విధాన ఫలితంగా 30 లక్షల మంది చనిపోయారు. ఆ దారుణం నుండి బయటపడడానికి అమెరికా నుండి దిగుమతులు చేసుకోవలసి వచ్చింది.

లెనిన్ తన ఓటమిని ఒప్పుకున్నాడు. వెనుకంజ వేయడం కేవలం కొత్తదాడికేనన్నాడు. కాని అది జరగకముందే అస్తమించాడు.అధికారం కోసం మనుషుల్ని అరమరికలు లేకుండా హతమార్చి దానికి సిద్ధాంతపు తొడుగు చూపిన లెనిన్ ఈ శతాబ్దంలోని స్టేట్ టెర్రరిజానికి పితామహుడు. ఆయన్ను స్మరించకుండా టెర్రరిస్టు ఎవరూ తమ కృషిని సాగించలేరేమో.

References:
Work on Lenin about his dictatorship
http://www.struggle.ws/russia/cp/maximof_terror1940.html
Another reference for Lenin’s ruthless behavior to obtain power and anti democratic rule without majority
http://www.marxists.org/archive/kautsky/1930s/demvscom/ch04.htm
The following link refers to Lenin’s Cheka, the organization, which was secretly created and sustained to annihilate several people in Russia.
http://www.foreignaffairs.org/19811201fabook13273/george-leggett/the-cheka-lenin-s-political-police.html
Biography of Lenin by Shubb David – It is to be read for astonishing facts.
http://www.marxists.org/history/etol/newspape/ni/vol16/no02/shub.htmauthentic

Thursday, May 24, 2007

పిల్లల హక్కుల్ని కాలరాస్తున్న మతాలు

వివిధ మతాలు తమ తమ విశ్వాసాలను పిల్లలపై ఎలా రుద్దుతున్నాయో, వారి అభీష్టానికి వ్యతిరేకంగా ఏమి పనులు చేస్తున్నారో నరిసెట్టి ఇన్నయ్య గారు సోదాహరణంగా వివరిస్తున్నారు, తమ రేడియో ప్రసంగంలో. ఇది 10 ఆగస్ట్ 2003 న న్యూజెర్సీ (USA) లోని Equal Time for Free thought Radio Show లో ప్రసారితమయ్యింది. ప్రసంగం వినటానికి ఈ కింది లింక్ ను అనుసరించండి.

http://www.corliss-lamont.org/hsmny/equaltime/


-cbrao.

Wednesday, May 16, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -5

వికాసం

మల్లాది రామమూర్తి సంపాదకత్వాన వికాసం మాసపత్రిక విజయవాడలో ప్రారంభమై హైదరాబాద్ కు చేరుకున్నది. 1970 ప్రాంతాలలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో ముమ్మరంగా పాల్గొన్న అనంతరం రామమూర్తి పత్రిక వచ్చింది. ఆయన 1940 నుండే ఎం.ఎన్. రాయ్ అనుచరుడు. వృత్తిరీత్యా అడ్వొకేట్. బాపట్ల, చీరాల, విజయవాడ మీదుగా చివరి దశలో హైదరాబాదులో స్థిరపడ్డారు. పట్టుదలతో పత్రిక నడిపినా ఒక్క చేతిమీద అదేమంత సులభం కాదని గ్రహించారు.

వికాసం పత్రికకు నేను చాలా రెగ్యులర్ గా వ్యాసాలు రాశాను. కార్మికులే బూర్జువాలైతే అనేది చాలా ప్రత్యేకమైనది. పుస్తక సమీక్షలు, చర్చలు సాగాయి. ఎం.ఎన్.రాయ్ మానవ వాద సిద్ధాంతాలు తిరగ రాయాలనే అంశం పై నాకూ, రావిపూడి వెంకటాద్రికీ వాదోప వాదాలు వికాసంలో సాగాయి.

మానవ వాద హేతువాద సంఘాల వార్తలు కూడా వికాసంలో అందించారు. రాడికల్ హ్యూమనిస్ట్ సంఘానికి పత్రిక లేనిదశలో వికాసం ఉపకరించింది. రాను రాను వికాసం మార్కెటింగ్ లేక, సమయాన్వేషణ లోపించి, ఆగిపోయింది. ఆర్ధికంగా రామమూర్తిగారే అన్నీ చూసుకున్నారు. చివరకు ఆపేయక తప్పలేదు. పదేళ్ళ చరిత్ర ఉన్న వికాసం మాజీ పత్రికలలో చేరింది.


ప్రసారిత

తెలుగులో పోస్టుగ్యాడ్యుయేట్ స్థాయి వరకూ ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు తోడ్పడే నిమిత్తం ప్రసారిత పేరిట త్రైమాసిక పత్రిక పెట్టాం. పోలు సత్యనారాయణ నేను కలిసి చేసిన ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ కె. శేషాద్రి సలహాలు ఉన్నాయి. ప్రింటింగ్ లో ఆలపాటి రవీంద్రనాథ్ తోడ్పడ్డారు. రచనలు సేకరించడం పెద్ద పని అయింది. విదేశాల్లో ఉన్నత విద్యారంగ స్థాయి ఏ దశలో ఉందో ఆ స్థాయిలోనే తెలుగులో విషయం అందించాలని ఉద్దేశించాం. అనుసరణే తప్ప అనువాదాలు సాధ్యమైనంత వరకూ రాకుండా చూశాం. అయితే జి.రాంరెడ్డి వంటివారు ఇంగ్లీషులో ఇచ్చిన వాటిని సరళీకృత తెలుగు చేశాం. అయా విషయాలపై ప్రత్యేక సూచికలు చేశాం. 1972—75 మధ్యలో చేసిన ఈ ప్రయత్నం బాగానే ఉన్నా, ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి. అలాగే విషయ సేకరణ కష్టాలుండేవి. ప్రకటనలు ఆట్టే లభించలేదు. పంచాయతీరాజ్, పార్టీల వ్యవస్థ, రాజకీయ పార్టీల చరిత్ర మొదలైన సంచికలు తరువాత పుస్తకాలుగా వచ్చాయి. బుక్ లింక్స్ కె.బి.సత్యనారాయణ తోడ్పడ్డారు. మామిడిపూడి వెంకట రంగయ్య రచనలు అందించారు. శేషాద్రి కె. బాగా ఉపకరించారు. సి. లక్ష్మన్న రాశారు. ప్రొఫెసర్ బి. రమేష్ బొంబాయి నుండి రాశారు.

1975లో నేను ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఒప్పుకున్నందున ప్రసారిత నుండి తప్పుకున్నాను. పోలు సత్యనారాయణ కొన్నేళ్ళు నడిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసర్చ్ వారి ఆర్ధిక సహాయం లభించినా పత్రిక ఆపేశారు. ప్రసారితలో మేము ప్రచురించిన నక్స్ లైట్ ఉద్యమ వ్యాసాన్ని భాస్కరరావు రాశారు. అది ప్రత్యేక ఆకర్షణ అయింది. లక్ష్మణ శాస్త్రి జోషి పుస్తకం హిందూఇజం - ఎ క్రిటిక్ తెలుగు సంక్షిప్త అనుసరణ, ఎరిక్ ప్రాం, ఎం.ఎన్.రాయ్ ల పై రచనలు, సంజీవదేవ్ రచనలు చాలా విశిష్టమైనవిగా నిలిచాయి. పత్రిక బౌండ్ వాల్యూంలు స్టేట్ ఆర్కెస్ లో ఉంచాను.

-వచ్చే వారం ఈనాడు తో నా అనుభవాలు

Sunday, May 13, 2007

స్టేట్ టెర్రరిజానికి శ్రీకారం చుట్టిన లెనిన్



20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. మార్క్సిజం పేరిట మనుషుల్ని మలచాలనే ప్రయత్నంలో ఆయన చేసిన కృషి నేడు చారిత్రక ఆధారాలతో అందుబాటులో వున్నది. శ్రీశ్రీ మహాహంతకుల జాబితాలో ఎందుకోగాని లెనిన్ పేరులేదు. స్టాలిన్ పేరు కావాలని చేర్చలేదు సిద్ధాంతాల పేరిట మనుషుల్ని హతమార్చడం ఏ దేశంలో జరిగినా, ఎవరు చేసినా ఒకటే. ఒక సిద్ధాంతం పేరిట చంపితే ఆదిమానవ కళ్యాణానికి దారితీస్తుందనీ, మరో ఇజం పేరిట హతమారిస్తే దారుణమనీ భాష్యం చెప్పడం దురుద్దేశ్యంతోనే. నిష్పాక్షికంగా చూస్తే నరహంతకుల జాబితాలో ఈ శతాబ్దంలో ప్రథమస్థానం, అగ్రతాంబూలం లెనిన్ కు ఇవ్వాల్సిందే. లెనిన్ అసలు పేరు బ్లాడిమిర్ ఇల్లిక్ ఉలియనోవ్ కాగా అమ్మ నాన్న పెట్టినపేరు మార్చుకొని కొత్త పేరుతో చలామణిగావడం ఒకసంప్రదాయం. అలాగే రహస్య పార్టీలో పనిచేసే వారు కూడా పేరు మార్చుకుంటుంటారు. 1870లో ఓల్గా నదీతీరాన గల సింబ్రిస్క్ లో లెనిన్ పుట్టాడు. తండ్రి ప్రాథమిక పాఠశాలలో తనిఖీ అధికారి. లెనిన్ అన్నను జార్ ప్రభుత్వం ఉరితీసింది. ఒక నాటుబాంబుతో జారు చక్రవర్తిని చంపాలనే ప్రయత్నం చేయడంతో యీ శిక్షపడింది. అదిచూచి లెనిన్ మనస్సు రాయిచేసుకున్నాడు. 16 ఏళ్ళ వయస్సులో ఆరంభమైన యీ దృష్టి లెనిన్ లో రానురాను గట్టిపడింది. విప్లవ చర్యలకు ఉపక్రమించాడు. మాస్కో గ్రంథాలయంలో చాలా విషయ సేకరణ చేశాడు. ఒక సూట్ కేసు అడుగున మరో రహస్య అర ఏర్పరచి, నిషిద్ద గ్రంథాలు చేరవేస్తుండగా పట్టుబడి, సైబీరియా ప్రవాస జీవితార్ధం పంపబడిన లెనిన్ అక్కడే విప్లవ కారిణి క్రుపస్కయాను పెళ్ళాడాడు.
తన 31వ ఏట లెనిన్ మారుపేరు ధరించాడు (1901లో). తల్లిదండ్రులిరువురూ క్రైస్తవులు, కాని, లెనిన్ విప్లవచర్య నిమిత్తం తనకు యిష్టమైనవన్నీ వదలి, యించుమించు సన్యాసి జీవితాన్ని బలవంతాన అలవాటు చేసుకున్నాడు. లాటిన్ చదవడం, సంగీతం వినడం, చదరంగం ఆడడం, స్కేటింగ్ లెనిన్ అభిరుచులు, మతాన్ని తీవ్రంగా ద్వేషించాడు స్నేహాలు పెంచుకోలేదు. ఏకాగ్రతతో నిర్విరామంగా రాజకీయ విప్లవచర్యకై 24 గంటలూ పాటుబడిన వ్యక్తి లెనిన్. కొద్దిరోజులపాటు లాయర్ గా పనిచేసి వదిలేశాడు. పొలంపనులకు పొమ్మని తల్లి పురమాయిస్తే నిరాకరించాడు. తన రాజకీయ చర్య దృష్ట్యా లెనిన్ విపరీతంగా రచనలు చేశాడు.
ప్లెఖనోవ్ స్థాపించిన ఇస్ క్రా వ్యవస్థ ద్వారా లెనిన్ ప్రాధాన్యత చెందాడు. లెనిన్ ను సన్నిహితంగా పార్టీలో చూచినవారు ఆయన నియంతృత్వ పోకడలపై దాడిచేశారు. ప్లెఖనోవ్, వేరా జెసూలిక్, ట్రాటస్కీ, మదాం క్రిజిజెనోవిస్కియా, చార్లస్ రాపాఫోర్ట్, వై ఛస్లావ్ మెంజిస్కీ మొదలైన వారంతా లెనిన్ను తెగిడారు. కాని ఇలాంటి తిట్లను, శాపనార్ధాలను, విమర్శలను లెనిన్ ఏనాడూ ఖాతరు చేయలేదు. ఎనుబోతుపై వర్షం పడ్డట్లే విమర్శల దారి విమర్శలదే, లెనిన్ గొడవ లెనిన్ దే. అదే ఆయన ఏకాగ్రత విశిష్టత.
1905లో రష్యా విప్లవం విఫలమైనప్పుడు లెనిన్ విస్తుబోయాడు. అయినా నిరాశ చెందలేదు. 1914లో మొదటి ప్రపంచయుద్దం లెనిన్ కు దిగ్ర్భాంతిని కలిగించింది. జార్ చక్రవర్తి పతనం చూచి లెనిన్ ఆశ్చర్యపోయాడు. అంతర్జాతీయంగా సోషలిస్టు ఉద్యమం విఫలం గావడం లెనిన్ కు అత్యంత నిరాశ కలిగించింది. చివరకు 1917లో బ్రతికుండగా విప్లవ విజయాన్ని చూస్తానా అని లెనిన్ నిరాశతో వాపోయాడు.
రష్యాలో విప్లవం సాగుతుండగా లెనిన్ చాలా కాలం విదేశాలలోనో, ప్రవాసుడుగానో వుండవలసి వచ్చింది. మొదటి ప్రపంచయుద్దం అంతంగానున్న సమయానికి లెనిన్ జ్యూరిచ్ లో వున్నాడు. రష్యా వెళ్ళడానికి జర్మన్లు ఆయనకు తోడ్పడతామంటే, లెనిన్ తబ్బిబ్బు అయ్యాడు.
1917 ఏప్రిల్ 8న జ్యూరిచ్ నుండి బయలుదేరిన లెనిన్ కు స్టాక్ హొంలో కార్ల్ రాడెక్ కలిశాడు. ఏప్రిల్ 16న బెలూస్ట్రోవ్ చేరేసరికి లెనిన్ సోదరి, స్టాలిన్, కామనేవ్ అయన్ను కలుసుకున్నారు. ఆ తరువాత పెట్రోగ్రాడ్ వెళ్ళి విప్లవ చర్యకు ఉపక్రమించాడు.
జార్ ప్రభుత్వం స్థానే తాత్కాలికంగా ఏర్పడిన కెరన్ స్కి ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేక సతమత మౌతున్నప్పుడు లెనిన్ తన బోల్షివిక్ అనుచరులతో చారిత్రక పాత్ర నిర్వహించి అధికారానికి రాగలిగాడు.
1917జూన్ లో అఖిల రష్యా సోవియట్ కాంగ్రేస్ సమావేశాలు జరిగాయి. అందులో బోల్షివిక్ సంఖ్య 105 మాత్రమే. మొత్తం ప్రతినిధులు 822, యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన ప్రదర్శన కారణంగా లెనిన్ ఫిన్లండ్ పారిపోవలసి వచ్చింది. 1917 సెప్టెంబరు నాటికి మాస్కో, పెట్రోగ్రాడ్ సోవియట్లలో అధిక సంఖ్యాకులు బోల్షివిక్ లు. ఈ సోవియట్లకు అధికారం హస్తగతం కావాలనేదే లెనిన్ నినాదం. అక్టోబరులో రహస్యంగా లెనిన్ పెట్రోగ్రాడ్ చేరి, మొట్ట మొదటిసారిగా పోలిట్ బ్యూరో స్థాపించాడు. అక్టోబరు 25న సోవియట్ల సమావేశం జరిగింది. మరునాడు పెట్రోగ్రాడ్ లో కీలక స్థావరాలన్నీ బోల్షివిక్కులు ఆక్రమించారు. తరువాత రాజ్యాంగసభ నిమిత్తం ఎన్నికలు జరిగాయి. మొత్తం 707 స్థానాలలో బోల్షివిక్కులకు 175 వచ్చాయి. ఆ విధంగా బోల్షివిక్కులు ఏనాడూ అధిక సంఖ్యలో లేరు.
అధికారాన్ని హస్తగతం చేసుకున్న రెండు రోజులకే, లెనిన్ పత్రికా స్వేచ్ఛను అరికట్టాడు. లెనిన్ అధికారాన్ని పట్టుకున్న తరువాత ఒక రహస్య సైనిక సంస్ధను స్థాపించాడు. ఆల్ రష్యన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ కమిషన్ ను పొడిగా చేకా అంటారు. ఈ రహస్య సంస్థ లెనిన్ వున్నంతకాలం బయటవారికి తెలియలేదు. 1917 డిసెంబరులో మొదలు బెట్టి యీ చేకా సంస్థ చిలవలు పలవలుగా, నాగు జెముడువలె పెరిగి ప్రాకిపోయింది. స్థానిక సోవియట్లు సమాచారం అందిస్తుండగా, మూడేళ్ళలో చేకా రహస్యసంస్థ 2,50,000 మందిని చేర్చుకున్నది నెలకు సగటున వెయ్యిమందిని రష్యాలో లెనిన్ నాయకత్వాన, విప్లవ వ్యతిరేకుల పేరిట ఉరితీసినఖ్యాతి యీ రహస్య సంస్థకు దక్కింది.
చేకా అనే రహస్య సంస్థ విచారణకూడా రహస్యంగానే జరిపేది. చేకా సంస్థతో బాటు రష్యా అంతటా రహస్య నిర్బంధ శిబిరాలు, జైళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోగ్రాడ్ నుండి మాస్కోకు రాజధానిని మార్చిన లెనిన్ తక్షణమే క్రెమ్లిస్ లో ఒక రహస్య కేంద్రాన్ని, దీనికి తెలియకుండా జర్జినిస్కే నాయకత్వాన మరో రహస్య స్థావరాన్ని ఏర్పరచాడు. ఇదే చేకా అంటే. ఈ సంస్థ లెనిన్ కు మాత్రమే జవాబుదారి. దీని ఉనికి ఎవరికీ తెలియదు. తొలుత ఒక జీవితభీమా భవనంలో చేకా స్థావరాన్ని ఏర్పరచారు. ఊరికే తిరిగేవారిని వున్న పళంగా చంపేయమని లెనిన్ చేకాకు ఉత్తరువులిచ్చాడు. అనేక విధాలైన శత్రువులను సంహరించమని 1918 ఫిబ్రవరి 23న లెనిన్ మరో ఉత్తరువు చేకాకు యిచ్చాడు.
లెనిన్ -ఇంకా ఉంది.

Saturday, May 12, 2007

Alternative Medicines Proscribed

Alternative medical systems are playing havoc with the lives of the public. Superstitions and blind beliefs among the people give strong base and support the alternative medical systems.
The Center for Inquiry and Humanist organizations are fighting against unscientific medical systems since a decade. Now the central government and Supreme court support the rational stand on this matter.
But strong lobbying for the alterntive medicines are working everywhere and hence they are thriving despite the orders against practice of alternative medicines.

Brief background:
While the humanist organisations are fighting for banning the alternative unscientific medical systems, Electropathy and Electro Homeopathy approached Delhi High Court in 1998 for recognition and funding from governments. Based on the Court direction Indian Council of Medical Research constitutued a standing committee of experts from various fields under chairmanship of Director General to go into the matter. The committee consisted with: Dr N.K.Ganguley, director general of CMR; Dr S.P. Agarwal, Director General DGHS, Sri Ashwini Kumar, DCGI; Prof B.N.Dhawan, Prof S.S. Handa, Dr V.N.Pamdey, Dr R.H. Singh, Hakeem S. Khaleefathulla, Head of department of Unani medicine in Jamia Hamdard, Dr .R.Kannan, Dr Leena Mehendale, Dr Promila Chari, Dr J.N. Pande, Dr B.K. Sharma and Dr Vasantha Muthuswamy.
This committee studied alternative medicines and framed guidelines for recognition .They studies all aspects whether the system of medicine is well esablished, whether is it prevalent and has a widespread network of practitioners, whether sufficient literature on the system is available; whether the system can be recognised by the government; and they studied with scientific criteria.
The systems studied are: Electropathy, Electrohomeopathy, Magnetotherapy, Reiki, Reflexology, Urine therapy, Auto urine therapy, Aromatherapy, Colour therapy, Pranic healing, Gems and stones therapy, Music therapy and Hypnotherapy.
After analyzing the committee recommended that these systems are not fulfilling the scientific criteria and hence should not be recognised. None of the practitioners should use Doctor as sufficx. Government should not give any grant to these systems and they should be not taught to confer degrees.
The report submitted in 2002 and government of India accepted it. The Union health ministry sent orders to all state government to implement the orders at once ( 25 November 2003).
On November 24 Supreme Court bench consisting of Justice Sabharwal and Justice Dharmadhikari directed the central government to legislate on alternative medicines based on the experts’ committee report.
Center for Inquiry is consistently pleading the governments to carryout the order but they fell on deaf ears.
The Center for Inquiry is also demanding to constitute an experts committee on Homeopathy to study its scientific criteria. Dr Stephen Barret, (see under Homeopathy in website quack watch ) expert on this subject called Homeopathy as ultimate fraud and emphatically stated that it is not proved as scientific anywhere in the world. Mr James Randi, declared to give $1000000 to any one if they prove Homeo as scientific.
(See www.randi.org for application and details).
Goverenments should act firmly on these matters to save public from health hazardous treatments.

-N.Innaiah
Chairman
Center for Inquriy India

నర హంతకులు

ముందు మాట

శ్రీ ఎన్. ఇన్నయ్య 1991లో రాసిన నరహంతకులు అనే సీరియల్ ప్రారంభిస్తున్నాము. విషయ ప్రాధాన్యత దృష్ట్యా యీ తరం వారికి చాలా తోడ్పడుతుందని భావిస్తున్నాం.
న్యూహ్యూమనిస్ట్ తెలుగు మాస పత్రికలో సీరియల్ గా వచ్చిన యీ శీర్షికను, హేమ ప్రచురణల వారు, పుస్తకంగా వెలువరించారు. ఇప్పుడది పునర్ముద్రణ చేయవలసి వుంది.
నియంతలు, నరహంతకులు ప్రతి శతాబ్దంలోనూ వుంటూ వచ్చారు. రాను రాను ప్రజాస్వామ్య విలువల దృష్ట్యా కొన్ని చోట్ల స్వేచ్చా రాజ్యాలు తలెత్తాయి. ప్రజల సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నారు. అయినా చాలా దేశాలలో ఇంకా నియంతృత్వాలు వున్నాయి. ఎదురు చెప్పనివ్వని ధోరణి వీటిల్లో స్పష్టం. ఆధునిక మానవ విలువలు, సమానత్వం చాలా చోట్ల అమలు జరగవలసి వుంది.
సర్వసాధారణంగా గతం నుండీ నేటి వరకూ నరహంతకులు మతాన్ని అడ్డం పెట్టుకొని, దైవం పేరిట దారుణాలు చేశారు. ఇప్పటికే చేస్తున్నారు. ఆధునిక కాలంలో ఇజాల పేరిట, ముఖ్యంగా కమ్యూనిజం, ఫాసిజం, నాజీ యిజం మనుషుల్ని నమిలేస్తున్నాయి.
సైనిక పాలనలో కూడా నియంతృత్వ ధోరణిలో, మతాల్ని ఆసరాగా స్వీకరిస్తున్నాయి. ఇందుకు ఇస్లాం, బౌద్ధం తోడ్పడుతున్నాయి.
ఇక కమ్యూనిస్టు దేశాలలో సమానత్వం, సమసమాజం పేరిట జరిగిన, జరుగుతున్న రాక్షసత్వం కనువిప్పుకావాలి. ఈ శీర్షికలో లెనిన్, స్టాలిన్, మావో, పోల్ పాట్ అందుకు మచ్చుతునకలు. ఉత్తర కొరియా, క్యూబా యింకా అదే ధోరణిలో నడుస్తున్నాయి.
క్రైస్తవ మతాన్ని అండగా చేసుకొని జార్జి బుష్ వంటి వారు అమెరికా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా వక్రీకరించి, పరోక్ష నరహంతలుగా మారారు.
ఈ నేపధ్యంలో శ్రీ నరిశెట్టి ఇన్నయ్య 1991లోనే రాసిన సీరియల్ నేటికీ అక్షర సత్యంగా పనికొస్తున్నాయి. దీనిపై స్పందనకు ఎదురుచూస్తాం.

- సి. భాస్కరరావు

Sunday, May 6, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -4

గోలకొండ పత్రిక

సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన తెలంగాణ వాణిగా గోలకొండ పత్రిక వుండేది. నేనెరిగిన తరువాం దేవులపల్లి రామానుజరావు సంపాదకీయాలు రాస్తుండేవారు. పేరు నూకల నరోత్తమరెడ్డి అని వుండేది. హైదరాబాద్ లో బషీర్ బాగ్ లో కార్యాలయం వుండేది. పత్రిక అచ్చుగాని, తీరుగాని ఆకర్షణీయంగా వుండేది కాదు. అచ్చుతప్పులుండేవి.అయితే 1925లోనే నైజాం పాలనలో తెలుగు పత్రిక స్థాపించి సురవరం వారు చరిత్ర సృష్టించారు. మారు మూల గ్రామాలకు సైతం ఒక్కొక్క కాపీ అయినా వెళ్ళేది.

సంగారెడ్డి నుండి 1960-64 మధ్య తరచు గోలకొండ పత్రికకు వ్యాసాలు పంపేవాడిని. జి.వి. కృష్ణారావు తన పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథాన్ని ఇంగ్లీషులో వెలువరించారు. అది కళాపూర్ణోదయంపై రాసిన గ్రంథం. ముఖ్యంగా రామణీయకత అధ్యాయం గొప్ప పరిశీలన ఆ గ్రంధాన్ని తెలుగులో అనువదించాను. అప్పుట్లో కొంత గ్రాంధికం-కొంత వ్యావహారికం కలిసి అనువదించాను. గోలకొండ పత్రిక సీరియల్ గా ప్రచురించింది. పుస్తకంగా వెలకి తీసుకురావడానికి, ముందుగా భాషను మార్చి, అంతా వాడుకంలోకి తీసుకరావాలనుకున్నాను. అది వీలుపడలేదు. గోలకొండ పత్రిక కటింగ్స్ ఒక కాపీ స్టేట్ ఆర్కివ్స్ కు యిచ్చాను.


ఆంధ్రభూమి

1960-70 మధ్య సికింద్రాబాద్ నుండి వెలువడే ఆంధ్రభూమి దినపత్రికకు వ్యాసాలు రాశాను. ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు ప్రచురించారు. సంగారెడ్డి (మెదక్ జిల్లాలో ఉన్నంతకాలం (1960-64) ఎన్. శూలపాణి పేరిట రాశాను. ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలన్నీ రాజకీయాలే ఎక్కువగా రాశాను. ఎప్పుడైనా లెటర్స్ రాశాను. 1965 నుండీ హైదరాబాదు వచ్చి, కొన్నాళ్ళు శూలపాణి పేరుతోనే కొనసాగించాను.1966లో గోరా శాస్త్రితో పరిచయం అయ్యింది. తొలిసారి ఆయన ఆఫీసులో కలిసినప్పుడు, ఆశ్చర్యపోయారు. అంత చిన్నవాడివనుకోలేదు అన్నారు. శూలపాణే ఇన్నయ్య అని మరీ ఆశ్చర్యపడ్డారు. క్రమేణా మేం కుటుంబ మిత్రులమయ్యాం. కొద్ది రోజులు వ్యాసాలు రాసి ఆపేశాను.

తరచుగా గోరాశాస్త్రిగారింట్లో కలసి చర్చించుకునేవాళ్ళం. ఆయన కొన్నాళ్ళు డక్కన్ క్రానికల్ కు సంపాదకీయాలు రాసేవారు. సీనియర్ జర్నలిస్టులు సీతారాం (యుఎన్ఐ) శ్రీకృష్ణగార్లతో ఫోను చర్చలు చేసేవారు. అప్పుడే నాకు డా.తిరుమలరావు, శశాంక, గోపాల శాస్త్రి, రావి శాస్త్రి, ఇచ్ఛాపురపు జగన్నాధం, భాట్టం శ్రీరామ మూర్తితో పరిచయాలయ్యాయి. గోరా శాస్త్రి 50వ జన్మదిన సంచిక వెలువరించి ఆయనను గురించి వివరాలు రాశాను. ఆంధ్రభూమిలో నాడు వరదాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావు పని చేస్తుండేవారు. పొత్తూరితో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది.


ఆంధ్రభూమిని యాజమాన్యం ఎన్నడూ అంతగా పట్టించుకున్నట్లు లేదు. సర్క్యులేషన్ అంతంత మాత్రమే. క్వాలిటీ ప్రింటింగ్ ఉండేది కాదు. అచ్చు తప్పులుండేవి. దక్కన్ క్రానికల్ ప్రధాన పత్రికగా యాజమాన్యం చూచేది. గోరా శాస్త్రితోబాటు ఆనాడు సి. ధర్మారావు, మండవ శ్రీరామమూర్తి తరచు కలుస్తుండే వాళ్ళం. సెట్టి ఈశ్వరరావు కూడా ఆయనింట్లోనే పరిచయం అయ్యారు. దిగంబర కవులకు, గోరాశాస్త్రికీ నిరంతర సిధ్ధాంత ఘర్షణ జరుగుతుండేది.