Monday, December 31, 2007

Ethical values -Scientific Method-END


. నైతికవిలువల విశ్వజనీనత


ప్రతి సమాజం కూడా కొన్ని ప్రమాణాలను అనుసరించి విలువలను పాటిస్తుంది. సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన సమాజాలలో వీటినే నైతిక విలువలు అంటారు. దాతృత్వం, తోటివారి పట్ల దయ, నిజాయితీ, వినయం, ఇత్యాది నైతిక విలువలు పేర్కొన్నదగినవి. అనేకమతాలు కూడా మానవుడి పట్ల గౌరవాన్ని ప్రబోధించాయి. మత విశ్వాసం గలవారు తమ తమ వ్యక్తుల పట్ల ఇటువంటి గౌరవాన్ని చూపాలని పేర్కొన్నాయి. మానవ గౌరవాన్ని ఈ విలువలు అంతగా పట్టించుకోలేదు. కాలం గడిచేకొద్దీ ఈ మతాల పిడివాదం, కర్మకాండ లలోని పటుత్వం సడలిపోయింది. మానవజాతి ఐక్యత అనే ప్రబోధం ఒక్కటే నైతిక విషయంగా మిగిలింది. నైతిక పరమైన అన్వేషణ పద్ధతులు లేనప్పుడు ఈ విధానాన్ని వివరించటం ఎలా?. ప్రపంచవ్యాప్తంగా అన్వేషణాపద్ధతులు ఆమోద యోగ్యంగా ఉండేటట్లు ఆవిర్భవించటానికి పూర్వం, విశ్వవ్యాప్తమైన విలువలకు మూలాధారంగా దేన్ని చూపాలి?.
ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించేటప్పుడు నైతిక విలువలు పనిచేసే తీరు, అవి ఏమేరకు సరి అయినవి, అనే వాటికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రస్తుతం విలువ, విశ్వజనీనత, సరైనది, అనే మాటలు నైతిక విలువలకు అన్వయించి చూద్దాం.
నైతిక పదాలకు అర్థం
సమాజంలో వ్యక్తి ఒక వస్తువును పొందడం లేదా, ఒక కార్యకలాపం జరగడం వాంఛనీయమనుకుంటే, విలువ అనే పదానికి అర్థం లభిస్తుంది. మానవుడు ఆశ్రమవాసిగా ఏకాకిగా కాక, సమాజంలో ఒక విశిష్టవ్యక్తిగా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొనే ధోరణి ప్రధానం. వ్యక్తిత్వంలోని ప్రతిభకూ, వాంఛలకూ సంబంధం ఉంది. విలువ అనేది కేవలం వ్యక్తిపరం కాదు. వ్యక్తిని తీర్చి దిద్దే సమాజానికీ, వ్యక్తి వల్ల ప్రభావితమయ్యే సమాజానికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి విలువ అనేది కేవలం మేధస్సుకు, రామణీయకతకు సంబంధించింది కాక, వ్యక్తుల మధ్య సంబంధంగా తలెత్తుతుంది. అంటే ఇతర వ్యక్తులతో నిమిత్తం లేకుండా ఏకాకిగా మేధస్సు, లేదా రామణీయకత విలువలను సాధించవచ్చని అర్థం కాదు. తోటి వ్యక్తితో సంబంధం ఉన్నప్పుడే నైతిక విలువలను సాధించటం సంభవం. దీని వల్ల ఇతర విలువలకూ, నైతిక విలువలకూ తేడాలు గమనించవచ్చు. జ్ఞానం అనేది మేధా సంబంధమైన విలువ. సత్యం, స్వేచ్ఛ అనేవి నైతిక విలువలు, సంగీతం రామణీయకతకు చెందిన విలువ. కాని ఒక రాగాన్ని కూర్చడానికి స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన సంగీతాన్ని వినే అవకాశం ఉండటం నైతిక విలువలు. అడవి మృగం ఎదురైనప్పుడు చూపే సాహసం మనుగడకు సంబంధించిన విలువ. అదే యుద్ధరంగంలో అయితే నైతిక విలువ అవుతుంది.
నైతిక విలువల విశ్వజనీనత-బాహ్యసత్యం
నైతిక విలువలకు ఉన్న సామాజిక దృక్పథాన్ని బట్టి, కొంత మేరకు వాటికి బాహ్య సత్య దృష్టి ఏర్పడుతుంది. సృజనాత్మక వ్యక్తిపరమైంది. అప్పుడు బాహ్య సత్యం అనేది అరుదుగా సాధ్యపడుతుంది. నైతికవిలువలు విశ్వవ్యాప్తంగా ఉండా లంటే, బాహ్యసత్యం అనేది అవసరం. ఒక నిర్ణయం గనక వ్యక్తిగతమైందైతే, దానికి లభించే విలువ కూడా నిర్ణయంలోని స్వభావాన్ని బట్టి గాక, యాదృచ్ఛికమైందే అవుతుంది. వ్యక్తిపరమైన అసూయలకు మించిన నిర్ణయమే బాహ్యసత్యంతో కూడింది.
నైతికవిలువలు విశ్వజనీనమైనవి అనగానే, అన్ని కాలాల్లోనూ అన్ని సమాజాలలోనూ ప్రతివారూ వీటిని ఆమోదించారనుకోరాదు. కొన్ని విలువలు విశ్వజనీనమైనవి అంటే, రెండు ప్రతిపాదనలను గట్టిగా చెబుతున్నామన్నమాట. నైతికంగా చైతన్యవంతులైనవారిలో అత్యధిక సంఖ్యాకులు ఆ విలువలను గమనిస్తారు. ఒక వ్యక్తి ఈ విలువల గురించి తీవ్రంగా ఆలోచిస్తే, అవి సరైనవని భావిస్తాడు. తన వ్యక్తిగత ఆసక్తులు, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోడు. ఇప్పుడు ఎవరైనా అలా చేయలేక పోతున్నారంటే అన్ని కోణాల నుంచి సమస్యను పరిశీలించలేదని భావించాలి. ఉపనిషత్తు పేర్కొనే అంధకారం నుంచి వెలుగులోకి తీసుకుపో, అనే సూత్రమూ, సోక్రటీస్ సూత్రీకరించిన జ్ఞానమే ధర్మం అనడమూ, ఒకే అర్థాన్ని సూచిస్తాయి.
నైతిక విలువల విశ్వజనీనత గురించి ఇంతవరకూ చేసిన చర్చ అంతా, చుట్టూ తిరుగుతూ ప్రారంభించిన చోటుకే వచ్చినట్లు అనిపించవచ్చు. విశ్వజనీనత అనేది వాస్తవంకానప్పుడు, అన్వేషణా పద్ధతినుంచి వచ్చినప్పుడు, సమస్యను ఇంకొక రంగానికి మళ్ళించినట్లయింది. అటువంటి పద్ధతి ఉంటుందా?. ఉంటే తెలుసుకోవటం ఎలా?. తెలుసుకుంటే అది విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్య మైన పద్దతి అనిహామీ ఏమిటి? మొదలైన ప్రశ్నలు జనిస్తాయి.
ఒక్కక్షణం ఆలోచిస్తే ఈ ప్రశ్నలు నీతిశాస్త్రానికి ప్రత్యేకించినవి కావని స్పష్టపడుతుంది. దేన్ని అన్వేషించినా, ప్రకృతి విజ్ఞానంతో సహా అన్ని రంగాలలోనూ ఏదో ఒక దశలో ఈ ప్రశ్నలు జనిస్తాయి. విజ్ఞానవేత్తలు ఆచరించే వైజ్ఞానిక పద్దతి ప్రపంచవ్యాప్తంగా సరైందని ఎవరుగట్టిగా చెపుతారు. విజ్ఞానాన్ని అధ్యయనం చేసే విద్యార్థులతో సహా బహు కొద్దిమందికే బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి పై ప్రతిపాదనను ఆమోదించటం, నిరాకరించటం అనేది కష్టం. అయినా ప్రపంచ వ్యాప్తంగా సరైందని ఎందుకంటున్నామంటే, వివేచనాత్మాకంగా సంతృప్తినివ్వడం, ప్రాపంచిక అనుభవంరీత్యా ఫలితాలనివ్వడం గమనిస్తున్నాం గనకనే మూడు వందల సంవత్సరాల నుంచీ క్రమంగా పరిణమిస్తూ, మూలంలో నిమిత్తంలేకుండా, నిర్మాణ క్రమాన్ని విజ్ఞానంచూపుతోంది. వైజ్ఞానిక అన్వేషణా లక్ష్యాన్ని అంగీకరించిన వారు, వైజ్ఞానిక పద్ధతిని కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఆ పద్ధతి ఒక్కటీ లక్ష్యానికి చేర్చగలదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది సరైంది అంటున్నాం. వైజ్ఞానిక పద్ధతిలో విశ్వజనీనత అనటంలో ఎటువంటి సూచనకూడా చేయడం లేదు. ప్రతివారూ ఒకేరీతిలో అనుసరించాలని అనడం లేదు. విజ్ఞానవేత్తలు సైతం అన్ని సందర్భాల్లోనూ ఒకే మార్గాన పోరు, క్వాంటమ్ సిద్ధాంతం పట్ల ఐన్ స్ట్టీన్ ధోరణి ఇందుకు ఉదాహరణంగా చూపవచ్చు. పదార్థ అస్థిరత్వం ఉందని కనుక్కొన్నప్పటికీ, ఐన్ స్టీన్ ఒక పట్టాన ఇందుకు అంగీకరిం చలేక పోయాడు. క్వాంటమ్ సిద్ధాంతంలో ఉన్న దోషాన్ని ఏనాటికైనా తొలగించ వచ్చునని ఆశించాడు. దేవుడు చదరంగం ఆడతాడని అతడు నమ్మజాలక పోయాడు.
నైతిక అన్వేషణా లక్ష్యం
పైన పరిశీలించిన వాటిని నీతి శాస్త్రానికి అన్వయించి చూద్దాం.
నైతిక అన్వేషణ లక్ష్యం ఏమిటి?. ఈ అన్వేషణలో అనుసరించే పద్ధతి ఏమిటి?. నైతిక విలువలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని దేన్నిబట్టి చెప్పగలం?.
ఇంతవరకూ జరిగిన చర్చనుబట్టి, నైతిక అన్వేషణాలక్ష్యం అంతాకూడా కొన్ని ప్రమాణాలను కనుక్కోవటమేనని చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య సంబంధా లను ఇవి సూచిస్తాయి. వ్యక్తి జీవిత వికాసానికి సాధ్యమైనంత మేరకు ఇవి ఉపకరిస్తాయి. కాబట్టి ఇతరుల ఆసక్తి చూపని వాటితో నీతిశాస్త్రానికి నిమిత్తంలేదు. ఒక వ్యక్తి మాంసాహారా?. శాఖాహారా?. మద్యపానం సేవిస్తాడా? లేదా అనే విషయాలు వ్యక్తి ఆరోగ్యం పైనా, అతడి ఆర్థిక వ్యవహారాలపైనా ఆధారపడి ఉంటుంది. కాని వాటిని బట్టి నైతిక నిర్ణయం చేయడం కుదిరే పనికాదు. వ్యక్తి ఏమి చేసినా సమాజం పట్టించుకోవచ్చు. సమాజం ఎంత పెత్తందారీతనంతో ఉంటే అంతగా వ్యక్తిని పట్టించుకుంటుంది. ఏం చదువుతున్నాడు, ఎవరితో స్నేహం చెస్తున్నాడు, పిలక పెంచుతున్నాడా లేదా, జంద్యం వేసుకున్నాడా లేదా, ఎటువంటి దుస్తులు ధరించాడు, ఏమి ఆహారం తీసుకున్నాడు. ఎవరిని వివాహమాడాడు అనేవన్నీ మన సమాజానికి సమస్యలుగా తయారయ్యాయి. వ్యక్తికి అట్టే స్వేచ్ఛలేదు. వ్యక్తి స్వేచ్ఛను అదుపు పేట్టే విషయంలో జాగ్రత్త వహించాలని ఈ విషయాలన్నీ సూచిస్తున్నాయి. ఇక్కడ స్వేచ్ఛను ఎలా వినియోగించుకోవాలనేదిగాక, ఎలా అణచాలనేది ప్రధానమైందిగా ఉంది.
నైతిక అన్వేషణ లక్ష్యాన్ని బట్టి, సంతృప్తికరమైన సాంఘికవ్యవస్థకు కొన్ని ప్రధాన లక్ష్యాలున్నాయి. మానవులలో కనిపిస్తున్న ప్రతిభ ఎన్నో విధాలుగా ఉంది. కాని వ్యక్తివికాసానికి సర్వసాధారణ పరిస్థితులుకొన్ని అవసరం, ఆహారం, వస్త్రాలు, గృహం, మంచి ఆరోగ్యం, అవసరాల కొరతలేని స్వేచ్ఛ, ఇతరులు ఒత్తిడి పెట్టకపోవడం, ప్రభుత్వం జలవంతం చేయకబోవడం, అనేవి కనీస అవసరాలుగా ఉండాలి. ఇతర జంతువులకూ, మానవుడికీ ప్రధాన తేడా ఉంది. మానవుడికి ఆలోచించే శక్తి ఉంది. ఆలోచనలనూ, ఆవేదనలనూ భావం ద్వారా, కళల ద్వారా వెల్లడించగలడు. కాబట్టి మానవుడుగా జీవనాన్ని సాగించటానికి స్వేచ్ఛాయుత ఆలోచన యథేచ్ఛగా వ్యక్తం చేయడం, సంఘాలుగా ఏర్పడటం, ప్రతిభలకు వన్నె తెచ్చే చదువు అవసరమవుతాయి. ప్రతి మానవుడికీ మనుగడ అనేది ముఖ్య మైనప్పటికీ, కేవలం జంతువులలాగ ఉండలేడని అనుభవం చెబుతున్నది. సంతృప్తికరమైన బతుకుతెరువు మానవుడికి అవసరం. ఎంత దయామయ మైన నియంతృత్వం కూడా ఆ వ్యవస్థను నిలుపుకోడానికి క్రూరనియంతృత్వంగా దిగజారిపోతుంది. శారీరక, సాంస్కృతిక విషయాలు మానవుడిలో విడదీయ రానివిగా కలిసిపోయాయి. ఆహారం లేకపోతే మనిషి బతుకును సాగించలేడు. ఇంకా ముఖ్యమైన విషయమేమంటే తనను తాను గుర్తించనిదే మానవుడు ఆహారాన్ని సంపాదించుకోలేడు. అందుకే స్వేచ్ఛకై పోరాడతాడు. కమ్యూనిస్టు విప్లవం దెబ్బతినిపోయింది. రష్యా, పోలండ్, హంగరీలలో ప్రజల తిరుగుబాట్లకూ, తూర్పు జర్మనీనుంచి పారిపోవాలనీ, చైనా నుంచి తప్పించుకు పోవాలనీ భావించడానికి మానవుడిలో ఉన్న స్వేచ్ఛ అనే లక్షణమే కారణం.
సాంఘికభద్రత, మానసిక స్వేచ్ఛ అనేవి వ్యక్తి వికాసానికి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ పరిస్థితులు బాగా సాధించుకోడానికి తోడ్పడే సాంఘిక వ్యవస్థల్ని, మానవలక్షణాలను కనుక్కోవడమనేది నైతిక అన్వేషణలో ఉంటుంది. ఈ అన్వేషణ రెండు విధాలుగా సాగుతుంది. మానవులు బతికుండగానే నైతిక విలువలను సాధించుకోవాలి. కనక చారిత్రక, సాంస్కృతిక పరిస్థితుల దృష్ట్యా నైతిక అన్వేషణ జరగటం అనేది తప్పనిసరి అన్నమాట. ఈ విధంగా చూస్తే నైతిక అన్వేషణలోకానికి చెందింది కూడా. మానవుడు తన సహకారాకృషితో పరిసరా లను సరిదిద్దగలడు. ప్రభావితం చేయగలడు. ఈ విధంగా చూస్తే వర్తమాన పరిధికే నీతి పరిమితం కానక్కరలేదు. భవిష్యత్తులోకి తొంగి చూసి, ఆశలనూ, ఆశయాలనూ రూపొందించుకొని మానవుడు నేటి కలలను రేపు నిజం చేసుకో గలడు. ఇందుకు తగిన తెలివితేటలూ, పట్టుదల మానవుడికి ఉన్నాయి. నీతి శాస్త్రం ముందు చూపుగల ప్రమాణశాస్త్రం. వ్యక్తి ఏమి చేయాలి. చేయకూడదు అనేవాటిని సాధారణమయిన నియమాలతో నైతిక శాస్త్రం పేర్కొంటుంది. మానవ ప్రవర్తనకు ఉపకరించే సంస్థలను ఏర్పరచుకోడానికి నైతిక శాస్త్రం తోడ్పడుతుంది.
నైతిక అన్వేషణా క్రమం
వైజ్ఞానిక అన్వేషణ వంటిదే నైతిక అన్వేషణ కూడా, రెండింటిలోనూ ఒకానొక లక్ష్యంతో ప్రారంభిస్తాం. తొలుత దీనిని స్థూలంగానే గమనిస్తాం. అన్వేషణ సాగుతున్న కొద్దీ వివరాలలోకి పోతాం. రెండు రంగాలలోనూ, ప్రపంచపరంగా అన్వేషణ సాగుతుంది. వాస్తవాలతో కూడిన అనుభవం అనేది ఆధారంగా ఉంటుంది. కార్యకారణ సంబంధంతో అవగాహనకు ప్రయత్నిస్తాం. వైజ్ఞానిక అన్వేషణలో కార్యకారణ సంబంధం స్పష్టమే. నైతికరంగంలో మానవవ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. ఈ రెండు అన్వేషణలూ ప్రాపంచిక అనుభవంతోనూ, విశ్లేషణతోనూ ఉన్నాయి. ప్రతిపాదన చేసి రాబట్టే పద్ధతినే రెండూ అనుసరిస్తాయి.
నైతిక విలువల్లో బాహ్యసత్యం, విశ్వజనీనత అనేవి పైన చెప్పిన పద్దతిని అనుసరించి కనుక్కొన్నవే. కనక వీటికి ఉన్న పరిమితులు కూడా గుర్తించాలి. తాత్కాలికమూ, ఆస్తిరత్వమూ అనేవి నీతిరంగంలోనూ ఉన్నాయి. కాబట్టి నైతిక విలువలు సాపేక్షకాలు, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులననుసరించి ఈ విలువలకు హద్దులేర్పడతాయి. అన్వేషణలో వినియోగించే జ్ఞానం విధానం కూడా ఇందులో జతచేర్చి చూసుకోవాలి. ఆధునిక రవాణా సౌకర్యంవల్ల ప్రపంచ సంస్కృతి ఆవిర్భవించటం సాధ్యమే. అటువంటప్పుడు పరిసరాల పరిమితులు తమ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. విజ్ఞానంలాగే నైతికసిద్ధాంతం కూడా విశ్వజనీనం అవుతోంది. స్థానిక సంప్రదాయం, సాంఘిక వ్యవస్థల్లో తేడా ఉన్నప్పటికీ విశ్వజనీ నత సాధ్యపడుతోంది. వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం అనే విలువలు ప్రజాస్వామిక పాశ్చాత్య ప్రపంచంలోని మానవులనే గాక, నియంతృత్వంలో ఉన్నవారిలో కూడా స్పందన కలిగిస్తున్నాయి. ఏ నైతిక సిద్ధాంతంలోనయినా కొంత మేరకు చారిత్రక, సాంఘిక సాపేక్షతా విధానం తప్పనిసరి అయినప్పటికీ మౌలికమయిన విలువలు విశ్వవ్యాప్తంగా ఉంటున్నాయి.
నైతిక విలువలు తప్పనిసరి
భిన్న సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులలో నివసిస్తున్న మానవులు అనేక మంది, విశ్వజనీనమైన విలువలను ఆమోదించడంతో సరిపోదు. ఈ విలువలలో నైతికమైన బాధ్యతకూడా ఉంది. మానవులందరూ వీటిని ప్రమాణంగా అంగీకరిస్తారు. విశ్వజనీనమైన నైతికవిలువల విషయమై కొంత వివరణ అవసరం.
ఇక్కడ కూడా విజ్ఞానాన్వేషణతో పోల్చి చూడవచ్చు. సత్యంలో కూడా విధిగా పాటించవలసిన గుణం ఉంది. మానవుల ఆసక్తులు, సహజమైన ధోరణులు భిన్నంగా ఉన్నప్పటికీ ఇది తప్పదు. సత్యంలో నచ్చజెప్పే శక్తి ఉన్నదంటే అందరికీ వెల్లడించి చూపే గుణం ఇందుకు ప్రధానంకాదు. ఎందుకు, ఎలా సంభవిస్తుంది అనే విషయమై మానవుడు చూపే ఆతృతలో దీని అంతటికీ మూలం ఉంది. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నట్లే ఉత్తమ జీవితమంటే ఏమిటో కనుక్కొనే వరకూ మానవుడు విశ్రాంతి చెందడు. సోక్రటీస్, క్రీస్తు, చార్యాకుడు, గౌతమ బుద్దుడు వంటివారిని చూస్తుంటే ఇది తెలుస్తుంది. జిజ్ఞాస, అందాన్ని ఆరాధించటంలాగా, నైతిక పిపాసకుడా మానవుడిలో అంతర్గతంగా ఉంది. బహుశా ఇందుకు మూలం జీవరాశిలో చూడవచ్చునేమో. వైజ్ఞానిక, రామణీయ కతలాగే నైతికతృష్ణ కూడా మానవజీవితంలో ప్రధానదృక్పథంగా ఉండవచ్చు. ఇదేగనక వాస్తవమైతే నైతిక విలువల్ని పాటించడం జీవితానికి, సామూహిక ధోరణికి బలాన్ని సమకూర్చడమే అవుతుంది.
నైతిక విలువల విశ్వజనీనతను, మానవుడి నైతిక తృష్టలోని అంతర్భాగంగా గ్రహిస్తే వాటికి బలం చేకూరుతుంది. వైజ్ఞానిక పద్ధతిలో చేసే అన్వేషణ వల్ల చాలా విలువలు రాబట్టేవని తేలింది. వాటి తార్కిక వాస్తవికత కూడా మౌలికమైన వాటితో సమానమైనదే ప్రాథమిక విలువలు సహితం ప్రాపంచిక అనుభవరీత్యానే సరైనవి. సమానత్వం, సాంఘిక న్యాయం, పౌరహక్కులనేవి కొన్ని మౌలిక విలువల వల్ల తార్కికంగా వచ్చాయనవచ్చు. విజ్ఞాన సిద్ధాంతంలో ప్రాధమిక పదాలూ, ప్రతిపాదనలలాగే, నైతిక సిద్ధాంతంలో ఈ విలువలను ప్రారంభదశగా స్వీకరించాలి.
మానవ వ్యక్తిత్వానికీ, పవిత్రతను సమకూర్చటం ఒక్కటేచాలా, లేదా మరికొన్ని విలువలు చేర్చాలా అనేది వివరాలకు సంబంధించిన విషయం. ఇతర సిద్ధాంతాలలాగే నైతిక సిద్ధాంతంలో కూడా అంగీకరించటమనేది తార్కికవాదనకు సంబంధించింది కాదు. అది మనందరి అనుభవ ఫలితమే. మానవ సంపద వల్ల రూపురేఖలు దిద్దుకున్న ధోరణి ఇందులో ఉంది. ప్రారంచిక అనుభవానికీ, మానవ ఆలోచనకూ వారధిగా తర్కం ఉండజాలదు. మానవుడి భావాలను విశ్లేషించి, వాటిలో ఇమిడి ఉన్న అర్థాన్ని మనకు స్పష్టం చేయటమే తర్కంచేయగల పని. మౌలిక విలువల్ని గురించి అంగీకారానికి వస్తే, వాటి నుంచి మిగతా విలువలు రాబట్టి అంచలవారీగా ఏర్పాటు చేసి దేనికి ఎంత విలువ ఇవ్వాలో తర్కం చూపు తుంది. మౌలిక విలువలు సరైనవి అవునా, కాదా అనేదానికి తార్కికమైన రుజువు ఉండదు. తర్కంలో ఇమిడి ఉన్న ఈ పరిమితిలోని మానవుడిని, ఉద్రేకాల ఆవశ్యకతను గమనించకపోవటంతో నిర్ధారణ కావాలని అన్వేషిస్తుంటాం. తత్వవేత్తలు తరతరాలుగా అలౌకకవాదంతో కూడిన నీతిశాస్త్రాలను, అధిభౌతిక సిద్ధాంతాలను నిర్మించారు. అటువంటి ప్రయత్నాలన్నీ విఫలంగాక, తప్పదని, వైజ్ఞానిక పద్ధతి స్పష్టం చేసింది. మానవుడి జ్ఞానానికి గల పరిమితిని, అవకాశాన్ని ఈ పద్ధతి సూచించింది. అనేక నైతిక సిద్ధాంతాలు ఉండవచ్చుననీ, అసలు ఎటువంటి నైతిక ధోరణీ లేకుండా కొందరు మానవులు ఉండగలరనీ తార్కికంగా చూపవచ్చు. కాని అనుభవరీత్యా మానవులలో కొన్ని సర్వసాధారణ మైన జిజ్ఞాసలు ఉన్నాయని స్పష్టపడింది. ఈ జిజ్ఞాసలు విశ్వజనీనమైన భావాలలో, విలువలలో వ్యక్తమవుతున్నాయి. ఇది, తప్పనిసరిగా పాటించే అవసరమున్నట్లు కొన్ని సమాజాలలో వ్యక్తులతో స్వభావం తెలుపుతోంది. చారిత్రకంగా వీటికి గల సాపేక్షతాగుణం, కాలానుగుణంగా పరిణమించిన తీరునుబట్టి ఈ విలువలకు గత విశ్వజనీనత పోదు. వీటిల్లోని పరిణామ స్వభావం మానవ వివేచనా శక్తికి నిదర్శనం. చైతన్య స్థాయిలో పరిణామం అనేది సాంస్కృతిక అభివృద్ధిగా, పరిసరాలలో ఇమిడిపోయేదిగా ఉంటుంది. అంతేగాని ఉదాసీనంగా లొంగిపోవటం జరగదు. మానవుడు తన అనుభవాన్ని ఆధారంగా నేర్పడం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఇటువంటి పరిణామానికి అవకాశముంది. మానవుడు వివేచనాత్ముడు కాబట్టి నైతికంగా ఉండగలడు. అంతేగాని అతనిలో మూక స్వభావం ఉన్నందువల్ల ఇలా ప్రవర్తించటం లేదు. తెలిసి ఎంపిక చేసుకునే పద్ధతి వల్ల మానవుడిలో నీతికి విశిష్టత !

Sunday, December 30, 2007

Scope of Morals in Science


. వైజ్ఞానిక పద్ధతి - నీతి శాస్త్రం


నీతిశాస్త్ర సమస్య


ఉద్రేకానికి సంబంధించి వైజ్ఞానిక పద్ధతి ఏమి చెబుతున్నదో, అదే నీతి శాస్త్రానికి కూడా వర్తిస్తుంది. నైతిక విలువలు మానవుడిలోని అంతర్గత అపేక్షలకు రూపాలు మాత్రమే. ఈ విషయం స్పష్టం కావాలంటే నీతిశాస్త్ర సమస్య ఏమిటో అవగాహన చేసుకోవాలి.
శతాబ్దాల తరబడి నైతిక సిద్ధాంతం, విలువలకు అర్థాన్నీ, ఔచిత్యాన్నీ ఇచ్చింది. సత్యం, అందం, మంచితనం, అనే విలువలను ఆమోదించాలన్నా, నిరాకరించాలన్నా ముందుగా రెండు ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాలి. ఈ మాటలకు అర్థం ఏమిటి? ఒకానొక సన్నివేశంలో ఈ పదాలకు ఎలాంటి అవగాహన ఉంటుంది? ఒక యువతి తాను కోరుకున్న యువకుడిని పెళ్ళి చేసుకోడానికి ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటప్పుడు మంచితనం చూపటమంటే ఏమిటి? తన సహచరుడుని ఎన్నుకొనే హక్కును సమర్థించుకోవడమా? లేదా తన తల్లిదండ్రుల పక్షాన నిలబడి మంచి బిడ్డ అనిపించుకోవడమా? విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని అబద్ధాలాడమని నాయకుడు ప్రభోదిస్తే, చిత్తశుద్ధి గల రాజకీయ కార్యకర్త ఏం చేయాలి? ఇలాంటి సన్నివేశాలలో సత్యం మంచితనం అనే విలువల వల్ల లాభం లేదు. ఆ మాటలు ఆచరణలో పెట్టడాన్ని బట్టి, ప్రాపంచిక అనుభవం దృష్ట్యా వ్యక్తి నిర్ణయాన్ని బట్టి వాటికి అర్థం ఉంటుంది.
మాటలకు అర్థాలు మాత్రమే కాక, రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే గాక, విలువల వాస్తవికత కూడా తెలియాలి. అప్పుడే ఎంపిక చేసుకోగలరు. ఒక సన్నివేశంలో ఏది మంచో తెలిసినప్పటికి, ఎందుకు మంచిని చూపాలీ, మంచి వల్ల నష్టం జరగబోతున్నదని తెలిసికూడా ఎందుకు నిజం చెప్పాలి. అనే ప్రశ్నలు ఎదురౌతాయి. ఇక్కడ అవకాశవాదానికి తావు లేదు. నైతిక ప్రమాణాలలో విధిగా అనుసరించవలసిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. పోలీసు లేనప్పుడు కూడా అతడంటే భయపడే తీరుకూ, ఈ విలువలకూ తేడా ఉన్నది. మంచి ప్రవర్తన వల్ల ఒకానొక వ్యక్తికి ఉపయోగం లేకపోయినప్పటికీ మనం అతడి నుంచి మంచి నడవడినే కోరుకుంటాం.


అలౌకిక నీతిశాస్త్రం


పై ప్రశ్నలకు అందరూ ఆమోదించగల సమాధానాలంటూ ఇటీవల వరకూ లభించలేదు. తగినంత ప్రపంచజ్ఞానం లేకపోవడం, సంతృప్తికరమైన విచారణ పద్ధతులు లోపించటమే ఇందుకు కారణం. నైతిక సిద్ధాంతం చరిత్రను బట్టి చూస్తే, ఒక సమస్యను సరిగ్గా రూపొందించకపోతే సున్నితమైన అన్వేషణ సైతం ఎటూ సాగిపోలేక ఆగిపోయే స్థితి వస్తుంది. ఆధునిక కాలం వరకూ అనేక మంది ఆలోచనాపరులు నైతిక విలువలకు సిద్ధాంత ప్రాతిపదికగా శాశ్వతమయిన మార్గాన్ని అన్వేషించారు. అలౌకిక సత్యానికీ, నైతిక విలువలకూ ముడిబెట్టారు. ప్రపంచం అనేది ఆదర్శ ప్రపంచానికి నమూనా అని ప్లేటో చెప్పాడు. ఇటువంటి ప్రపంచ భావాలను అంతర దృష్టితో నమూనా ప్రపంచాన్ని చూడవచ్చు. ఇటువంటి సిద్ధాంతం ప్రకారం మనం నిత్య జీవితంలో చూసే ఎద్దులూ, సైకిళ్ళూ అన్నీ కూడా ఆదర్శ ప్రాయమయిన ఎద్దులూ సైకిళ్ళూ అనే భావాలను నకళ్ళేనన్న మాట. అసలు భావాలకు వివేచనాత్మక ఆలోచనతో స్పష్టంగా చూడవచ్చు. అంతేకాదు. దేన్ని మనం మంచి అంటున్నామో అది కూడా మంచి అనే భావానికి అనుకరణే. దీనిని కూడా హేతువు సహాయంతోనే కనుక్కోవాలి.



అలౌకిక నీతి శాస్త్రంలో పెత్తందారీ స్వభావం


ఇటువంటి ఆదర్శ ప్రపంచం ఉందని అంగీకరిస్తే నైతిక విలువలు విశ్వజనీనంగానూ, కేవలమయినవి గానూ, కాలానికీ, ప్రదేశానికీ సాంఘిక, సాంస్కృతిక పరిసరాలకూ సంబంధం లేకుండానూ ఉంటాయని ఒప్పుకోవాలి. ఈ విలువలను కొన్ని సూత్రాలద్వారా రూపొందించారు. ఆ సూత్రాలు వాస్తవిక ప్రపంచంతో సంబంధం లేనివి. మానవుడి స్వేచ్ఛనూ గౌరవాన్నీ గుర్తించని సూత్రాలే. అవి వ్యక్తి వికాసం, ఆనందంతో నిమిత్తం లేకుండా ఈ విలువలు ఉంటాయన్న మాట. పరోక్షంగానైనా, అనుభవానికి గురిచేయకుండా, ఈ సిద్ధాంతానికి సంబంధించిన మూల సూత్రాలున్నాయి. ఇందులో వాస్తవాలకు చోటు లేదు. ద్రష్ట మాటలే ప్రమాణాలు. ఈ పంథాకు తార్కిక ఫలితం ఏమిటంటే, మానవజీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ సిద్ధాంతపరమయిన నియంతృత్వం ఉంటుందన్నమాట. ప్లేటోకు ఈ విషయం తెలుసు. అయినా సరే అది అవాంఛనీయమని అతడు భావించలేదు.
అలౌకిక సూత్రాల నుంచి విలువలకు రూపెందిస్తే మారుతున్న మానవ పరిస్థితులకు సంబంధం లేకుండా ఈ విలువలు దిగజారిపోయే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఇటువంటి నైతిక సిద్ధాంతం కొత్తకాదు. వివాహంతో నిమిత్తం లేకుండా ఒక స్త్రీ బిడ్డను కంటే, తల్లిగానూ, పౌరురాలుగానూ ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, చాలామంది భారతీయులు, అటువంటి స్త్రీని అవినీతి పరురాలుగానే ఇంకా భావిస్తున్నారు. ఒక బ్రాహ్మణుడు ఎంత పెడితుడైనప్పటికీ, తోటివారికి నిస్వార్థంగా ఎంత సేవచేసినప్పటికీ, అతడు గనక మాంసాన్ని తింటూ, మద్యపానం సేవిస్తే సనాతనుల దృష్టిలో అతడి గుణాలెందుకూ పనికి రాకుండా పోతాయి. తనను తాను బలిచేసుకోవటమే ధర్మంగానూ, సమాజంలో ఆధిపత్యం వహిస్తున్న ప్రమాణాలను పాటించటమే మంచి ప్రవర్తనగానూ భావిస్తున్నారు. సత్యం, సుందరం, మంచితనం అనేవాటికి అధిభౌతిక అర్థాలు సమకూర్చారు. మానవులందరికీ మార్గదర్శకులమంటూ కొందరు బయలుదేరి చెబుతున్నారు. నైతిక విలువలను వివేచనాత్మక విశ్లేషణకు, ప్రాపంచిక అనుభవానికి గురిచేయకుండా, పురోహితుడి బోధనలాగ మార్చి వేశారు. మానవుడి ఆశలు, కోర్కెలతో నిమిత్తం లేకుండా గుడ్డిగా బయటివారి పెత్తనానికి లోబడి, విలువలను అంగీకరించాలంటున్నారు.
నైతిక అన్వేషణ ఇలా వక్రమార్గాన పడటానికి, సమస్యను రూపొందించటం లోనే కీలకం ఉంది. వ్యక్తుల మధ్య సంబంధంగా నీతిని గ్రహించే బదులు, మానవుడి మనుగడ ప్రయోజనానికి ఇదొక పునాది అన్నట్లు భావించారు. మానవుడి జీవితానికి లక్ష్యం అనేది, జీవితంలో గాక వెలుపల ఎక్కడో ఉన్నదని, ముందే ఏర్పరచుకున్న ఒక భావన వల్ల, ప్రారంభదశలోనే వక్రమార్గం పట్టించారు. ప్లేటో దృష్ట్యా శాశ్వతమైన ప్రపంచభావానికి చేరువగా రావడమే సమాజ వ్యవస్థ అనిపించుకుంటుంది. హిందువుల ననుసరించి ఈ లోకంలో వ్యక్తి మనుగడ చాలించి మోక్షాన్ని పొందటమే లక్ష్యం. ఆ రెండు సందర్భాలలోనూ వ్యక్తికి స్వతహాగా ఏమీ విలువలేనట్లు పరిగణించారు. ఫలితంగా నీతి శాస్త్రమనేది అలౌకిక అన్వేషణగా మారింది. సమాజంలో ఉన్న వ్యక్తి సమస్యలకూ, ఆ సక్తులకూ ఏమాత్రం శ్రద్ద వహించలేదు.
నైతిక అన్వేషణకై ఉద్దేశించిన విధానమే దాని పద్ధతిని కూడా నిర్ణయించింది. లక్ష్యం అలౌకికమైంది కాబట్టి విజ్ఞానంతో ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. వాస్తవాలనూ, అనుభవాన్నీ దృష్టిలో పెట్టుకొని నైతికపరమైన అన్వేషణచేస్తే ఆమోదయోగ్యం కాకుండా పోయింది. అనుసరించవలసిన పద్ధతిలో అంగీకారం లేనందున అన్వేషణా ఫలితాలను ఆమోదిస్తారనుకోటం ఒట్టి ఆశే.

Saturday, December 29, 2007

అంతర్వాణికి అవకాశం లేదు-scientific method contd

.
వాస్తవాలకు మొగ్గు - పెత్తందారీతనం చెల్లదు

విజ్ఞానంలో వాస్తవాలకు ఆస్కారం ఉన్నదిగానీ, పెత్తనానికి అవకాశం లేదు. ఒక సిద్ధాంత వాస్తవాన్ని తేల్చడానికి వాస్తవాలే తుది నిర్ణయాలు గనక వాటికి ఈ ప్రాధాన్యం లభించింది. రెండొందల సంవత్సరాల పాటు ప్రపంచంయావత్తు న్యూటన్ పదార్థ విజ్ఞానాన్ని ఆమోదించింది. కొన్ని కీలక పరిశోధనలతో సాపేక్షతా సిద్ధాంతం సరయిందని రుజువయ్యే సరికి, పదార్థ విజ్ఞానంలో న్యూటన్ తుదిపలుకు పలికాడనే విషయాన్ని తోసిపుచ్చడానికి విజ్ఞానవేత్తలెవరూ తటపటాయించలేదు. విజ్ఞానేతర రంగంలోని వారి ధోరణి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇటలీలోని పీసా విశ్వవిద్యాలయం ఆచార్యులను ఆహ్వానించి తన టెలిస్కోప్ ద్వారా జుపిటర్ కు చెందిన ఉపగ్రహాలను చూడమని గలీలియో కోరగా వారంతా నిరాకరించారు. వారు విద్యావిహీనులుకారు. చిత్తశుద్ధిలేని వారుకారు. ఇటలీ సమాజంలో ఎంతో సంస్కృతీపరులూ, బాగా చదువుకున్న వారు కూడా అలాంటివారు గలీలియో ఆహ్వానాన్ని ఎందుకు నిరాకరించినట్లు. వాస్తవాలకు భయపడా, లేక గలీలియో తలతిక్కవాడని భావించారా. ఇవాళ వింతగా కనిపించవచ్చుగానీ ఆనాడు గలీలియో తలతిక్కవాడనే వారు భావించారు. జుపిటర్ కు ఉపగ్రహాలున్నాయనీ, ఆరిస్టాటిల్ ఎక్కడా రాయలేదు కదా. కనక అలాంటి ఉపగ్రహాలు ఉండటానికి వీలులేదు. టెలిస్కోప్ ద్వారా స్వయంగా చూశామని ఎవరైనా అంటే అలాంటివారు భ్రాంతిలో ఉండి ఉండాలి. అటువంటి భ్రాంతిపరులపట్ల చూపవలసింది దయమాత్రమే, మెచ్చుకోలుకాదు.
శబ్ద ప్రమాణం అనేది నాటి ఫ్రొఫెసర్ల ధోరణి నిర్ధారించటానికి తోడ్పడింది. అదే ప్రమాణంతో గెలీలియో, చావుకు వెరచి, తన అభిప్రాయాలు మార్చుకోవలసి వచ్చింది. ఇటువంటి శబ్ద ప్రమాణంతోనే బ్రూనోను ఉరికంబం ఎక్కించారు. మనదేశంలో సీత సహగమనానికీ, అమానుషమైన అంటరాని తనానికీ, ఇంకా అనేక నమ్మకాలూ, ఆచారాలు జీవితంలో పెనవేసుకుపోవడానికీ, శ్రుతి, స్మృతి అనే ప్రమాణాలే కారణం.
భారత కమ్యూనిస్టులూ, వారి సహచరులూ అనుసరించే ధోరణిని బట్టి శబ్ద ప్రమాణాన్ని వారెలా పూజిస్తారో సాదాహరణగా చూపవచ్చు. భారతదేశంపై చైనా దురాక్రమణను చాలా సంవత్సరాల పాటు వాళ్ళు గ్రహించలేక పోయారు. ఐక్యరాజ్య సమితిలో దురాక్రమణ అంటే ఏమిటో నిర్వచించలేదన్నారు. ఒకవేళ నిర్వచించగలిగినా, కమ్యూనిస్టుదేశం దురాక్రమణ వంటి దోషానికి గురి కాదని, కమ్యూనిజం మానవ సోదరత్వాన్ని ప్రబోధిస్తున్నదని అన్నారు. లామాల ప్యూడల్ పరిపాలన నుంచి విమోచనగావించే నెపంతో నిస్సహాయంగా ఉన్న టిబెట్ ను కమ్యూనిస్టు చైనా కబళించి వేసింది. 12వేల చదరపు మైళ్ళ భారతభూభాగాన్ని చైనా వశం చేసుకుంది. ఇదంతా వారి దృష్టిలో ప్రధానం కాదు. చైనా ప్రభుత్వం బాండుంగ్ ప్రకటనలో భాగస్వామి అనీ, పంచశీల సూత్రాలకు కట్టుబడి ఉన్నదనీ వాదించారు. గలీలియో టెలిస్కోప్ నుంచి జుపిటర్ ఉపగ్రహాలు చూడటానికి నిరాకరించిన ప్రొఫెసర్లు అరిస్టాటిల్ ఆ విషయం చెప్పలేదంటూ, శబ్ద ప్రమాణాన్ని అడ్డం పెట్టుకున్నారు. కమ్యూనిస్టు నిరంకుశత్వాన్ని, దురాక్రమణను సాధ్యమని మార్క్స్ చెప్పలేదు. గనక కమ్యూనిస్టులు వాస్తవాన్ని చూడలేక పోయారు.
సిద్ధాంతాల నిర్ణయానికి వాస్తవాలే తుది ప్రమాణమైనప్పుడు వైజ్ఞానిక ధోరణిని అనుసరించి సాంఘిక విధానాన్ని, అందులో నివసించే వారి అనుభవాన్ని బట్టే నిర్ణయించాలి. తన పక్షాన శాసనం చేయటానికీ, విధానాలు నిర్ణయించటానికీ, ప్రాతినిథ్యం వహించటానికీ ఎవరు ఉండాలనేది నిర్ణయించే హక్కు పౌరులదే మిగిలిన సాంఘిక వ్యవస్థలతో పోల్చిచూసినప్పుడు ప్రజాస్వామ్యానికి తనను తాను సరిదిద్దుకునే స్వభావం ఉంది. ఇది వైజ్ఞానిక దృక్పథం నుంచి వచ్చిందే.
అంతర్వాణికి అవకాశం లేదు

వైజ్ఞానిక పద్ధతిలో వాస్తవాలపై ఆధారపడే విధానంవల్ల జ్ఞానం అందరికీ చెందడం, ప్రపంచానుభవంతో కూడింది గావడం విశేషంగా పేర్కొనాలి. అన్వేషణలో అలౌకికత్వానికి చోటులేదు. నమ్మకానికి బదులు జ్ఞానం అనేది ఆధారంతో కూడిన వాస్తవాలపై నిలబడుతుంది. అనుభవంతో పరీక్షించటానికి వీలులేని వాటిని సత్యాలుగా అలౌకిక వాదం పేర్కొంటుంది. ఈ కారణాల వల్లనే, వైజ్ఞానిక పద్ధతికి మార్మిక వాదం కూడా పొసగదనే చెప్పాలి. మార్మికుని అనుభవం వైజ్ఞానిక పరిశోధనకు, ఆసక్తికీ వస్తువు కావచ్చు. మానవుడి మనస్సు కొన్ని పరిస్థితులలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోటానికి ఈ అన్వేషణ ఉపయోగపడు తుంది. మార్మికుడు తన అనుభవానికి భాష్యం చెపుతూ దైవంతో లీనమైనట్లు పేర్కొంటాడు. అందులో వైజ్ఞానికంగా నిలబడేదేమీ లేదు. సరైన జ్ఞానం లభించక ముందు, లోగడకూడా మూర్ఛలకూ అంటువ్యాధులకూ గ్రహణాలకూ తోకచుక్కలకూ వక్రభాష్యాలు చెప్పారు. సూర్యగ్రహణానికి సనాతనులు చెప్పే వ్యాఖ్యానంలో ఎంత నిజం ఉన్నదో, మార్మికుడు తాను అనుభూతి పొందాననే సత్యంలోనూ అంతే నిజం ఉన్నది.

మార్మికవాదం, అలౌకికవాదం జ్ఞానానికి సంబంధించినంతవరకూ నిస్సారమైనవి అలాగే మహాత్ముని అంతర్వాణిని కూడా ఇతరులకు ఎలాంటి మార్గాన్ని చూపలేని సారంలేని విషయంగానే భావించాలి, ఒక విషయాన్ని గురించి వివేచనాత్మకంగా ఆలోచిస్తున్నప్పుడు అందులో తుదిఘట్టంగా ఉపచేతనావస్థలో, మెరుపు మెరసినట్లు అంతర్ దృష్టి పడవచ్చు. అయితే ఉత్తరోత్తరా దానిని వాస్తవ సంఘటనలు సమర్థించేవిగా ఉంటాయి. కాని అంతర్వాణి ప్రతిపాదనలను నిశిత పరిశీలనకు గురిచేసి పరీక్షించి వాస్తవాన్ని చూడవలసి ఉన్నది. ఒక వ్యక్తి అంతర్వాణి ఏమేరకు నమ్మదగింది అని తేల్చి చెప్పటానికి ఒక పద్ధతి ఉన్నది, అంధవిశ్వాసం, వీరారాధన లేకుండా ఇతరులకు వినిపించి అవగాహన అయ్యేటట్లు చేయాలి. అలా చేయకపోతే రెండు ప్రమాదాలున్నాయి. అంతర్వాణి ఆధారంగా తప్పు తోవలుపట్టి హిమాలయాలంత పెద్దదోషం చేయవచ్చు. ఇకాం ఘోరం ఏమంటే అంతర్వాణిని విశ్లేషించక పోవడం, అంతర్వాణి చెప్పినవి దోషాలని సంఘటనలు రుజువు చేస్తున్నా గుణపాఠం నేర్చుకోకపోవటం సంభవమే.
మానవ వ్యవహారాలలో ఉద్రేకాలు

ఉద్రేకాల పాత్ర ఏమిటో వైజ్ఞానిక పద్ధతి స్పష్టపరుస్తుంది. విశ్లేషణకు సాధనగా ఉపకరించేది వివేచనేకాని ఉద్రేకం కాదు. కనక ఒక సన్నివేశంలో సమస్యలను పరిష్కరించటానికి ఉద్రేకాలను వివేచనకు లొంగి ఉండేటట్లు చేయాలి. మానవ జీవితంలో ఉద్రేకానికి చోటు లేదని కాదు. పైగా, చూస్తూ ఊరుకోటం గాక గాఢమైన ఉద్రేకాలను కనబరచటం, అందాన్ని మెచ్చుకోడం మానవ జీవితంలో ముఖ్యమైన విషయం. మానవద్వేషితప్ప మరెవరూ మానవుడిని కేవలం లెక్కలు వేసే యంత్రంగా పరిగణించరు. ఉద్రేకాలన్నీ ఆనందానుభూతులుకావు. రామణీయకత భిన్న కోణాలలో మానవుడు చూడగలడనే విషయాన్ని నిరూపిస్తుంది. గాంధీ తన జీవితంలోని చివరి దశలో ఎదురైన ఒంటరితనాన్ని, ఓటమిని గ్రహించిన వ్యక్తిగా పరిణితి చెందిన వ్యక్తిగా భావించవచ్చు. గాంది హత్య, ఏటా వర్థంతి రోజున ఉపవాసం అనే వాటికే ప్రాధాన్యం ఇచ్చే వారు ఇంకా అపరిపక్వదశలోనే ఉన్నారన్నమాట. అవగాహన అనేది ఉద్రేకాలు పరిపక్వదశకు వచ్చినప్పుడు పనిచేసే తీరన్నమాట. జ్ఞానాభివృద్ధి వల్ల అవగాహన వస్తుంది. ఉద్రేకాన్ని వివేచనకు లోబరచాలంటున్నామంటే మానవుడి అంతరంగిక జీవితాన్ని తగ్గించడం కాదు. పైగా ఉద్రేకాల మూలాధారాన్ని వికసింపజేసి, దీని ఫలితంగా వచ్చే శక్తిమంతమైన ఉద్వేగాలకు సరిగా అవగాహన చేసుకొని, ఆచరణకు దిగటానికి తోడ్పడటమై ఇందలి ఉద్దేశం. ఉద్రేకం బలంగా ఉన్నప్పుడు పైకి వ్యక్తం కావాలనుకొంటుంది. ఇవి తరచు ఏదో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయటపడటం. ఒక్కోసారి గురిలే కుండా బయటపడటం జరుగుతుంది. ఆగ్రహావేశంతో ఉన్న గుంపు బస్సుపై రాళ్ళు వేయటమనేది విధ్వంసక చర్య. దీని వల్ల సాధించే ప్రయోజనం ఏమీ లేదు. మిగిలేది గందరగోళం, దిగజారుడు విధానం మాత్రమే. ఒకవేళ ఆచరణ అనేది ఫలప్రదమైనప్పటికీ, దీనిని తెలివిగా ఒక పథకం ప్రకారం పట్టుదలతో నిర్వహించటం అవసరం. ఈ విధంగా వివేచన ఆధారంగా ఉద్రేకం ఉంటే జీవిత పోరాటంలో ఇంకా ఉత్తమంగానూ, వదిలేస్తే ఎండు గడ్డిపై నిప్పుపడినట్లే ఉంటుంది. తీవ్రమైన సంవేదన సమస్థనీయంకాదు.