. వైజ్ఞానిక పద్ధతి - నీతి శాస్త్రం
నీతిశాస్త్ర సమస్య
ఉద్రేకానికి సంబంధించి వైజ్ఞానిక పద్ధతి ఏమి చెబుతున్నదో, అదే నీతి శాస్త్రానికి కూడా వర్తిస్తుంది. నైతిక విలువలు మానవుడిలోని అంతర్గత అపేక్షలకు రూపాలు మాత్రమే. ఈ విషయం స్పష్టం కావాలంటే నీతిశాస్త్ర సమస్య ఏమిటో అవగాహన చేసుకోవాలి.
శతాబ్దాల తరబడి నైతిక సిద్ధాంతం, విలువలకు అర్థాన్నీ, ఔచిత్యాన్నీ ఇచ్చింది. సత్యం, అందం, మంచితనం, అనే విలువలను ఆమోదించాలన్నా, నిరాకరించాలన్నా ముందుగా రెండు ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాలి. ఈ మాటలకు అర్థం ఏమిటి? ఒకానొక సన్నివేశంలో ఈ పదాలకు ఎలాంటి అవగాహన ఉంటుంది? ఒక యువతి తాను కోరుకున్న యువకుడిని పెళ్ళి చేసుకోడానికి ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటప్పుడు మంచితనం చూపటమంటే ఏమిటి? తన సహచరుడుని ఎన్నుకొనే హక్కును సమర్థించుకోవడమా? లేదా తన తల్లిదండ్రుల పక్షాన నిలబడి మంచి బిడ్డ అనిపించుకోవడమా? విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని అబద్ధాలాడమని నాయకుడు ప్రభోదిస్తే, చిత్తశుద్ధి గల రాజకీయ కార్యకర్త ఏం చేయాలి? ఇలాంటి సన్నివేశాలలో సత్యం మంచితనం అనే విలువల వల్ల లాభం లేదు. ఆ మాటలు ఆచరణలో పెట్టడాన్ని బట్టి, ప్రాపంచిక అనుభవం దృష్ట్యా వ్యక్తి నిర్ణయాన్ని బట్టి వాటికి అర్థం ఉంటుంది.
మాటలకు అర్థాలు మాత్రమే కాక, రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే గాక, విలువల వాస్తవికత కూడా తెలియాలి. అప్పుడే ఎంపిక చేసుకోగలరు. ఒక సన్నివేశంలో ఏది మంచో తెలిసినప్పటికి, ఎందుకు మంచిని చూపాలీ, మంచి వల్ల నష్టం జరగబోతున్నదని తెలిసికూడా ఎందుకు నిజం చెప్పాలి. అనే ప్రశ్నలు ఎదురౌతాయి. ఇక్కడ అవకాశవాదానికి తావు లేదు. నైతిక ప్రమాణాలలో విధిగా అనుసరించవలసిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. పోలీసు లేనప్పుడు కూడా అతడంటే భయపడే తీరుకూ, ఈ విలువలకూ తేడా ఉన్నది. మంచి ప్రవర్తన వల్ల ఒకానొక వ్యక్తికి ఉపయోగం లేకపోయినప్పటికీ మనం అతడి నుంచి మంచి నడవడినే కోరుకుంటాం.
అలౌకిక నీతిశాస్త్రం
పై ప్రశ్నలకు అందరూ ఆమోదించగల సమాధానాలంటూ ఇటీవల వరకూ లభించలేదు. తగినంత ప్రపంచజ్ఞానం లేకపోవడం, సంతృప్తికరమైన విచారణ పద్ధతులు లోపించటమే ఇందుకు కారణం. నైతిక సిద్ధాంతం చరిత్రను బట్టి చూస్తే, ఒక సమస్యను సరిగ్గా రూపొందించకపోతే సున్నితమైన అన్వేషణ సైతం ఎటూ సాగిపోలేక ఆగిపోయే స్థితి వస్తుంది. ఆధునిక కాలం వరకూ అనేక మంది ఆలోచనాపరులు నైతిక విలువలకు సిద్ధాంత ప్రాతిపదికగా శాశ్వతమయిన మార్గాన్ని అన్వేషించారు. అలౌకిక సత్యానికీ, నైతిక విలువలకూ ముడిబెట్టారు. ప్రపంచం అనేది ఆదర్శ ప్రపంచానికి నమూనా అని ప్లేటో చెప్పాడు. ఇటువంటి ప్రపంచ భావాలను అంతర దృష్టితో నమూనా ప్రపంచాన్ని చూడవచ్చు. ఇటువంటి సిద్ధాంతం ప్రకారం మనం నిత్య జీవితంలో చూసే ఎద్దులూ, సైకిళ్ళూ అన్నీ కూడా ఆదర్శ ప్రాయమయిన ఎద్దులూ సైకిళ్ళూ అనే భావాలను నకళ్ళేనన్న మాట. అసలు భావాలకు వివేచనాత్మక ఆలోచనతో స్పష్టంగా చూడవచ్చు. అంతేకాదు. దేన్ని మనం మంచి అంటున్నామో అది కూడా మంచి అనే భావానికి అనుకరణే. దీనిని కూడా హేతువు సహాయంతోనే కనుక్కోవాలి.
అలౌకిక నీతి శాస్త్రంలో పెత్తందారీ స్వభావం
ఇటువంటి ఆదర్శ ప్రపంచం ఉందని అంగీకరిస్తే నైతిక విలువలు విశ్వజనీనంగానూ, కేవలమయినవి గానూ, కాలానికీ, ప్రదేశానికీ సాంఘిక, సాంస్కృతిక పరిసరాలకూ సంబంధం లేకుండానూ ఉంటాయని ఒప్పుకోవాలి. ఈ విలువలను కొన్ని సూత్రాలద్వారా రూపొందించారు. ఆ సూత్రాలు వాస్తవిక ప్రపంచంతో సంబంధం లేనివి. మానవుడి స్వేచ్ఛనూ గౌరవాన్నీ గుర్తించని సూత్రాలే. అవి వ్యక్తి వికాసం, ఆనందంతో నిమిత్తం లేకుండా ఈ విలువలు ఉంటాయన్న మాట. పరోక్షంగానైనా, అనుభవానికి గురిచేయకుండా, ఈ సిద్ధాంతానికి సంబంధించిన మూల సూత్రాలున్నాయి. ఇందులో వాస్తవాలకు చోటు లేదు. ద్రష్ట మాటలే ప్రమాణాలు. ఈ పంథాకు తార్కిక ఫలితం ఏమిటంటే, మానవజీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ సిద్ధాంతపరమయిన నియంతృత్వం ఉంటుందన్నమాట. ప్లేటోకు ఈ విషయం తెలుసు. అయినా సరే అది అవాంఛనీయమని అతడు భావించలేదు.
అలౌకిక సూత్రాల నుంచి విలువలకు రూపెందిస్తే మారుతున్న మానవ పరిస్థితులకు సంబంధం లేకుండా ఈ విలువలు దిగజారిపోయే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఇటువంటి నైతిక సిద్ధాంతం కొత్తకాదు. వివాహంతో నిమిత్తం లేకుండా ఒక స్త్రీ బిడ్డను కంటే, తల్లిగానూ, పౌరురాలుగానూ ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, చాలామంది భారతీయులు, అటువంటి స్త్రీని అవినీతి పరురాలుగానే ఇంకా భావిస్తున్నారు. ఒక బ్రాహ్మణుడు ఎంత పెడితుడైనప్పటికీ, తోటివారికి నిస్వార్థంగా ఎంత సేవచేసినప్పటికీ, అతడు గనక మాంసాన్ని తింటూ, మద్యపానం సేవిస్తే సనాతనుల దృష్టిలో అతడి గుణాలెందుకూ పనికి రాకుండా పోతాయి. తనను తాను బలిచేసుకోవటమే ధర్మంగానూ, సమాజంలో ఆధిపత్యం వహిస్తున్న ప్రమాణాలను పాటించటమే మంచి ప్రవర్తనగానూ భావిస్తున్నారు. సత్యం, సుందరం, మంచితనం అనేవాటికి అధిభౌతిక అర్థాలు సమకూర్చారు. మానవులందరికీ మార్గదర్శకులమంటూ కొందరు బయలుదేరి చెబుతున్నారు. నైతిక విలువలను వివేచనాత్మక విశ్లేషణకు, ప్రాపంచిక అనుభవానికి గురిచేయకుండా, పురోహితుడి బోధనలాగ మార్చి వేశారు. మానవుడి ఆశలు, కోర్కెలతో నిమిత్తం లేకుండా గుడ్డిగా బయటివారి పెత్తనానికి లోబడి, విలువలను అంగీకరించాలంటున్నారు.
నైతిక అన్వేషణ ఇలా వక్రమార్గాన పడటానికి, సమస్యను రూపొందించటం లోనే కీలకం ఉంది. వ్యక్తుల మధ్య సంబంధంగా నీతిని గ్రహించే బదులు, మానవుడి మనుగడ ప్రయోజనానికి ఇదొక పునాది అన్నట్లు భావించారు. మానవుడి జీవితానికి లక్ష్యం అనేది, జీవితంలో గాక వెలుపల ఎక్కడో ఉన్నదని, ముందే ఏర్పరచుకున్న ఒక భావన వల్ల, ప్రారంభదశలోనే వక్రమార్గం పట్టించారు. ప్లేటో దృష్ట్యా శాశ్వతమైన ప్రపంచభావానికి చేరువగా రావడమే సమాజ వ్యవస్థ అనిపించుకుంటుంది. హిందువుల ననుసరించి ఈ లోకంలో వ్యక్తి మనుగడ చాలించి మోక్షాన్ని పొందటమే లక్ష్యం. ఆ రెండు సందర్భాలలోనూ వ్యక్తికి స్వతహాగా ఏమీ విలువలేనట్లు పరిగణించారు. ఫలితంగా నీతి శాస్త్రమనేది అలౌకిక అన్వేషణగా మారింది. సమాజంలో ఉన్న వ్యక్తి సమస్యలకూ, ఆ సక్తులకూ ఏమాత్రం శ్రద్ద వహించలేదు.
నైతిక అన్వేషణకై ఉద్దేశించిన విధానమే దాని పద్ధతిని కూడా నిర్ణయించింది. లక్ష్యం అలౌకికమైంది కాబట్టి విజ్ఞానంతో ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. వాస్తవాలనూ, అనుభవాన్నీ దృష్టిలో పెట్టుకొని నైతికపరమైన అన్వేషణచేస్తే ఆమోదయోగ్యం కాకుండా పోయింది. అనుసరించవలసిన పద్ధతిలో అంగీకారం లేనందున అన్వేషణా ఫలితాలను ఆమోదిస్తారనుకోటం ఒట్టి ఆశే.
No comments:
Post a Comment