Tuesday, April 17, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు - 2

వాహిని


ఆచార్య ఎన్.జి.రంగా స్థాపించిన పత్రిక వాహిని. 1938 నుండీ మద్రాసులో కార్యాలయం వుండేది. ఈ పత్రికకు ఎందరో సంపాదకత్వం వహించారు. న్యాయపతి నారాయణమూర్తి, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, గోగినేని ఉమామహేశ్వరరావు, కె.వి. సుబ్బయ్య, జి. విశ్వనాధం, యిలా ఎందరో వున్నారు. రంగా గారి రాజకీయాల కోసం పెట్టుకున్న పత్రిక గనుక, వారి కార్యకలాపాలు యిందులో ప్రధానంగా వుండేవి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత వాహిని, విజయవాడకు మారింది. 1955లో ఆంధ్రలో ఎన్నికలు జరిగినప్పుడు వాహిని తాత్కాలికంగా దిన పత్రికగా సాగింది. బి.ఎస్.ఆర్.కృష్ణ, నన్నపనేని వెంకట సుబ్బయ్య, జాస్తి జగన్నాధం ప్రభృతులు యిందులో పనిచేశారు.
నేను 1955 నుండీ వాహినికి వ్యాసాలు రాస్తూ తరచు వార్తలు కూడా పంపించేవాడిని. అయితే రంగాగారి రాజకీయాలతో ఎన్నడూ సంబంధం పెట్టుకోలేదు.

ఎ.సి. కాలేజీలో చదువుతూనే 1955-58 మధ్య వాహినికి వ్యాసాలురాశాను. నా క్లాస్ మేట్ ఎస్. రామాకృష్ణ నేనూ కలసి జంటగా సాహిత్య విమర్శలు చేశాం. ఎస్. రామకృష్ణ చాలా చురుకైన పదునైన కలంతో రాసేవాడు. రేపల్లెలో సిద్ధాబత్తుని దుర్గయ్య కుమారుడు. రామకృష్ణ కలం పేరు ఎస్. రాధారాణి. నా కలం పేరు ఎన్. శూలపాణి. ఇరువురం ఆ పేర్లతో రాస్తుండగా ఒక దశలో కాటూరి వెంకటేశ్వరరావు గారు మెచ్చుకుంటూ వ్యాఖ్యానించాడు. ప్రధానంగా విశ్వనాథ సత్యనారాయణ ఏకవీర, వేయిపడగలపై తీవ్ర విమర్శలు చేశాం.

గీత సత్యాగ్రహ ఉద్యమంలోనూ, 1955 ఎన్నికల ప్రచారంలోనూ 1959లో స్వతంత్ర పార్టీ పెట్టిన సందర్భంగా రాజాజీ పర్యటనపైనా వార్తలు పంపేవాడిని. ఆవుల గోపాలకృష్ణ మూర్తి నా చుట్టూ ప్రపంచం అనే శీర్షిక రాసేవారు. రాజాజీ బాపట్లలో మొదలెట్టి బొబ్బిలి వరకూ పర్యటించారు. ఆయనతో బాటు రంగా, బెజవాడ రామచంద్రా రెడ్డి, లచ్చన్న ప్రభృతులు వున్నారు. రాజాజీని తరచు కలియడం ఒక అనుభవం. బెజవాడ రామచంద్రారెడ్డి, నేనూ ఒక కారులో ప్రయాణించాం. ఆయనతో సన్నిహితత్వం ఏర్పడింది. ఎన్నో విశేషాలు చెప్పేవారు. నాకు ఉత్తరం రాస్తూ, గోటితో చిత్రాలు వేసి పంపేవారు.

రంగా గారికి పి.ఎ.గా చేరి 1956-60 పని చేస్తున్న రోజులు. ఆయనతో బాటే అనేక ప్రాంతాలు పర్యటిస్తూ, వార్తలు వాహినికి పంపడంతో విలేఖరి అనుభవం పొందాను. వాహినిలో గెటప్ బాగుండేది కాదు. అచ్చుతప్పులుండేవి. రంగాగారు వ్యక్తులపై చక్కని స్కెచ్ రాసేవారు. ఎడిటర్ పేరు ఉమామహేశ్వరరావు. ఆయినా ఎవరెవరో చూచేవారు. రాగం తానం పల్లవి శీర్షికన ఉమేష్ పేరిట ఆయన చక్కని వ్యాసాలు రాసేవాడు.

రానురాను వాహిని ప్రమాణాలు లేని పత్రికగా నడచింది. నేను 6 ఏళ్ళు అడపదడప వాహినితో సంబంధం పెట్టుకున్నాను. ఆ తరువాత రామామూర్తి, చంద్రపాల్ యిత్యాదులు సంపాదకత్వం వహించారు. క్రమంగా పత్రిక క్షీణించి ఆగిపోయింది. రాధారాణి పేరుతో రాసిన రామకృష్ణ తరువాత ఫార్మసీ పత్రిక పెట్టాడు. నేను శూలాపాణి పేరుతో ప్రజావాణి, వాహిని, ఆంధ్రభూమి దినపత్రికలో 1965 వరకూ రచనలు చేసి, ఆపేరు విరమించాను.

No comments: