Monday, April 9, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు

ప్రజావాణి



ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది 1953లో. ఆంధ్రప్రదేశ్ యింకా రాలేదు. 1954లో నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా, ప్రజావాణి వారపత్రికకు తొలి వ్యాసం రాశాను. గుంటూరు ఎ.సి. కాలేజిలో చదువుతూ చేసిన పని అది.

"అనంతశయనం అయ్యంగారి అనంత కోటి రూపాలు" అనే శీర్షికన రాసిన వ్యాసం ప్రజావాణి, మొదటి పేజీలో రావడం చూచి, సంతోషించాను. అప్పటినుండే ఆ పత్రికకు రాయడం మొదలుపెట్టాను. ప్రజావాణి రాజకీయ వారపత్రిక. వట్టి కొండ రంగయ్య సంపాదకులు. ఆయన కృష్ణాజిల్లా వీరులపాడుకు చెందినవారు. మద్రాసులో సంజీవరెడ్డి ఆధ్వర్యాన కాంగ్రెసు పత్రిక రాగా, దానికి సంపాదకుడుగా వుండేవారు.అభిప్రాయ భేదాలతో, కాంగ్రెస్ పత్రిక మూతపడగా, రంగయ్య గుంటూరు వచ్చి వారపత్రిక మొదలెట్టారు. గార్డన్ ప్రెస్ లో చాలాముచ్చటగా తప్పులు లేకుండా పత్రిక వచ్చేది.

రంగయ్య భార్య వట్టి కొండ విశాలాక్షి కథలు, నవలలు ప్రజావాణిలో రాసేది. ఆమెది చేబ్రోలు. ప్రజావాణిలో ఆనాడు శైలేంద్ర పేరిట బి.ఎస్.ఆర్. కృష్ణ ప్రతివారం రాసేవారు. ఆయన అప్పటికే పొగాకు లోకం అనే పత్రికకు ఎడిటర్ గా వున్నాడు. గుంటూరు జిల్లా బోర్డు నడిపే పత్రిక అది. వాసిరెడ్డి సత్యనారాయణ, నల్లమోతు సత్యనారాయణ కూడా రెగ్యులర్ గా ప్రజావాణిలో రాసేవారు. వాసిరెడ్డి సత్యనారాయణ లాం గ్రామస్తులు. హిందూ కళాశాలలో చదువుతూ, కృషి కార్ లోకీ పార్టీలో రంగా, లచ్చన్న, ఓబుల్ రెడ్డి ప్రభృతుల అనుచరులుగా వుండేవారు.స్ర్కీన్, ఫిలిం ఇండియా, మొదలైన బొంబాయి పత్రికల నుండి సినిమా వార్తల్ని ప్రజావాణి ప్రచురించేది.

వాసిరెడ్డి సత్యనారాయణ తరువాత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఉయ్యూరు నుండి వెలువడే చెరకు పత్రిక సంపాదకత్వం వహించారు. బి.ఎస్.ఆర్. కృష్ణ అమెరికన్ కౌన్సలేట్ లో ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్ గా మద్రాసు వెళ్ళి, అక్కడే రిటైర్ అయ్యారు. ఆ ఉద్యోగంలో వుండగా ఇతరులకు రాయకూడదు కనుక ప్రజావాణికి ఆయన రచనలు ఆగిపోయాయి.1951లో విజయ ప్రభ అనే దినపత్రిక మద్రాసు నుండి వైద్యుల రమణరావు సంపాదకత్వాన వెలువడింది. అందులో బి.ఎస్.ఆర్ కృష్ణ పనిచేశారు.

నేను 1954 నుండి పదేళ్ళ పాటు ప్రజావాణికి రాశాను. అనేక అనువాదాలు కూడా చేశాను. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అనూహ్యంగా నేను ప్రజావాణిలో ఉద్యోగంలో చేరాను. రోజుకు రూపాయి యిచ్చేవారు. ఉదయం శంకర విలాస్ లో రంగయ్యతో బాటే టిఫిన్ చేసేవాడిని. పాత గుంటూరు నుండి, నడచి వచ్చేవాడిని. మా అన్న విజయ రాజకుమార్ కుటుంబాన్ని పోషించేవాడు. హఠాత్తుగా కల్లు గీత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాగా, రాజమండ్రి జైలుకు పంపారు. లచ్చన్న నాయకత్వంలో జరిగిన గీత సత్యాగ్రహం, రాష్ట్రంలో మద్య నిషేధం తొలగించాలని పోరాడి గెలిచింది. శొంఠి రామమూర్తి నివేదిక ప్రకారం మద్య నిషేధం విఫలమైందని తేలింది. కల్లు గీత పనివారికి వృత్తి పోయింది గనుక, కృషికార్ లోక్ పార్టీ సత్యాగ్రహం తలపెట్టింది. ఈ నేపధ్యంలో నేను ఉద్యోగం చేశాను. తొలుత గుంటూరువారి తోటలో అద్దెకుండేవాళ్ళం. మా తండ్రి రాజయ్య పొలాలు పోగొట్టుకుని, జబ్బు పడ్డాడు. నేను ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డాను. అయినా అన్న జైలు నుండి తిరిగి వచ్చే వరకూ ప్రజావాణిలో ఉద్యోగం చేశాను. అప్పుడు రచయితలతో రాజకీయవాదులతో పరిచయమైంది. ప్రజావాణి రాజకీయ వారపత్రికగా ప్రభావం చూపెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకత పత్రికలో వుండేది. ప్రజావాణి విమర్శలకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు స్పందించారు. మద్దుకూరి చంద్రశేఖరరావు వంటి వారు ప్రతి విమర్శల్ని వారి పత్రికలలో రాశారు.

నేను హైస్కూలు చదువుతుండగా, మా నాన్న రాజయ్య ఆంధ్రప్రభ, భారతి తెప్పించాడు. మద్రాసు నుండి నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన వచ్చే పత్రిక కోసం రోజూ ఎదురు చూచి చదివేవాళ్ళం. అప్పట్లో అన్నా ప్రగడకామేశ్వరరావు గారి అంకుశం, బండి బుచ్చయ్య గారి ములుకోల, సూర్యదేవర రాజ్యలక్ష్మిగారి తెలుగుదేశం, వాహిని చదువుతుండే వాడిని. రాజకీయ హడావుడి ఎక్కువగా వుండేది.
తెనాలినుండి జ్యోతి పక్షపత్రిక, రేరాణి, అభిసారిక వచ్చేవి. ధనికొండ హనుమంతరావు సంపాదకత్వాన అభిసారిక యువతను పెద్దలను ఆకట్టుకున్నది.మద్రాసు నుండి తెలుగు స్వతంత్ర వచ్చేది. ఆ విధంగా హైస్కూలులోనే నేను వివిధ పత్రికలు చదువుతుండడం వలన ప్రజావాణిలో రాయడానికి అలవాటుపడ్డాను.

మా అన్న విజయరాజ కుమార్ తొలుత ఫార్వర్డ్ బ్లాక్ లో, తరువాత కృషి కార్ లోక్ పార్టీలో వుండడం వలన, నాకు ఆ పార్టీల వారితో పరిచయాలు కలిగాయి. జైలు నుండి విడుదలై మా అన్న రాగానే, మళ్ళీ కాలేజీ చదువులు కొనసాగించగలిగాను. అయినా రచనలు మానలేదు.ఎం.ఎన్. రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రజావాణిలో ప్రచురించాను. 1964 వరకూ రాశాను. తరువాత ప్రజావాణికి మానేశాను. వట్టి కొండ రంగయ్య కొన్నేళ్ళ తరువాత ప్రజావాణి నిలిపేశారు. ఆయన గేయరచన కూడా చేసేవారు. ఉత్తరోత్తరా రియల్ ఎస్టేట్ రంగంలో వుంటూ చనిపోయారు. పార్టీలు అధికారం రాజకీయాలు అనే ఎం.ఎన్. రాయ్ వ్యాస సంపుటి, మెన్ ఐ మెట్ అనే వ్యక్తిత్వ అంచనాల రచన ప్రజావాణిలో అనువదించాను. నా రచన లేవీ సెన్సార్ కాకుండా రంగయ్య గారు ప్రచురించి నన్ను ప్రోత్సహించారు.

-- నరిశెట్టి ఇన్నయ్య

1 comment:

మురళీ కృష్ణ said...

ఇన్నయ్య గారి "పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు" మొదట సారిగా తెలుగు బ్లాగ్ప్రపంచంలో సీరియల్ రచనగా ప్రారంభించినందుకు ధన్యవాదాలు.

మరీ చప్పగా లేకుండా వుండేందుకు సందర్భ పరంగా అక్కడక్కడా పేపర్ క్లిప్పింగులూ, బొమ్మలూ జత చేరిస్తే చాలా బాగుంటుందనిపిస్తోంది.

నా అభ్యర్థన ఒకసారి పరిశీలించగలరు.