Saturday, April 28, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -3

రాడికల్ హ్యూమనిస్ట్ - సమీక్ష

తెనాలి నుండి రాడికల్ హ్యూమనిస్ట్ వార, పక్ష పత్రికగా వచ్చేది. 1940 ప్రాంతాలలోనే రాడికల్ పత్రిక మొదలైంది. ఎం.ఎన్.రాయ్ భావాలు, మానవ వాదం ప్రధానంగా యీ పత్రికలలో వుండేవి. కోగంటి సుబ్రహ్మణ్యం ఎడిటర్ గా వెలువడుతున్నప్పుడు, 1958 నుండే నేను రాయడం ఆరంభించాను. విశాఖపట్టణంలో ఫిలాసఫి బి.ఎ. ఆనర్స్ చదువుతున్న రోజులవి. ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు, కొందరు హ్యూమనిస్టుల రచనలు అనువదించి ప్రచురించాను. Heresies of 20th Century స్వదేశీ రంజనే రాసిన Why Co-operative Common Wealth తెనిగించాను. ప్రతి సంచికలో వ్యాసాలు రాసేవాడిని.

ఆవుల గోపాలకృష్ణ మూర్తి, ఎం.వి. రామమూర్తి ప్రభృతులెందరో వ్యాసాలు రాస్తుండేవారు. ప్రతిక అచ్చుతప్పులతో ఎడిటింగ్ సరిగా లేకుండా నడిచింది. ఎప్పుడూ ఆర్థిక యిబ్బందులతో సతమతమయ్యేది. కొన్నాళ్ళకు ఆగిపోయింది. తరువాత సమీక్ష అనే పేరిట మరో పత్రిక స్థాపించారు.

తెనాలి సమీపంలో కఠెవరంలో కొల్లి శివరామరెడ్డి అడ్వకేట్ గా వుండేవారు. ఆయన సంపాదకత్వాన సమీక్ష పత్రిక ఆరంభమైంది. ఆయనకు చేదోడుగా ఎం.వి. రమణయ్య పరమయ్య అడ్వకేట్, మేకా చక్రపాణి, పరుచూరి అచ్యుతరామయ్య వుండేవారు. ప్రధాన సలహాదారు ఆవుల. సమీక్షలో నేను నిరంతరం వ్యాస రచన చేశాను. అలాగే అనువాదాలు కూడా చేశాను. సి.హెచ్.రాజారెడ్డికి, ప్రెస్ వుండేది. శ్రద్ధగా పత్రికనడిపారు ఆర్ధిక యిబ్బందులు మామూలే. ఆయనా కొన్నాళ్ళకు సమీక్ష నిలిపేశారు. మాసపత్రికగా సమీక్ష వచ్చేది. కల్లూరి బసవేశ్వరరావు, భట్టిప్రోలు హనుమంతరావు, బచ్చు వెంకటేశ్వర్లు, జి. వెంకటస్వామి, సూర్యకుమారి, మల్లాది సుబ్బమ్మ యిలా ఎందరొ రచనలు చేశారు. ఎం.వి. రామమూర్తి ప్రోత్సాహం బాగా వుండేది. ఆవుల గోపాలకృష్ణ మూర్తి వ్యాసాలు 1967లో ఆయన చనిపోయే వరకూ వచ్చాయి. ఎన్.వి. బ్రహ్మం కలలో దేవుడు అనే రచన చేసి, చర్చ లేవనెత్తారు.

రాడికల్ హ్యూమనిస్ట్ (ఇంగ్లీషులో)

ఎం.ఎన్. రాయ్ స్థాపించిన రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక ఎందరో కొనసాగించారు. నేను 1965లో రాయడం మొదలు పెట్టేసరికి వి.బి.కార్నిక్, జి.డి.పరేఖ్ లు ఎడిటర్లుగా ఉన్నారు. ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాలపై కొన్ని వ్యాసాలు రాశాను. బొంబాయి, కలకత్తా, ఢిల్లీ మారుతూ పత్రిక సాగింది. సునీల్ భట్టాచార్య, అనంతరం సంగీతమాల్, జస్టిస్ జాగీర్దార్లు ఎడిటర్లుగా ఉండేవారు. ప్రస్తుతం రేఖా సరస్వతి మీరట్ నుండి మేనేజింగ్ ఎడిటర్ గా నిర్వహిస్తున్నారు. ఆర్ధిక బాధలు, సర్క్యులేషన్ లేమి, ప్రకటనల కొరత ఉంది.

నేను తరచు వివిధ అంశాల పై వ్యాసాలు రాశాను. ఎం.ఎన్.రాయ్ పై విమర్శ చేసినప్పుడు వి.బి.కార్నిక్ వంటివారు రియాక్ట్ అయ్యారు. రాయ్ తన తొలి భార్య ఎవిలిన్ అంశం స్వీయగాథల్లో ప్రస్థావించక పోవడాన్నితీవ్రంగా విమర్శించాను. తార్కుండే, శిబ్ దారాయణ్ రే ఏవో సమర్ధనలు చేసినా అవేవీ సహేతుకాలు కావు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపకురాలిగా అంతర్జాతీయ రంగంలో పాత్రవహించిన ఎవిలిన్ పట్ల రాయ్ పక్షపాత ధోరణి అవలంబించాడని విమర్శించాను.

No comments: