Saturday, May 12, 2007

నర హంతకులు

ముందు మాట

శ్రీ ఎన్. ఇన్నయ్య 1991లో రాసిన నరహంతకులు అనే సీరియల్ ప్రారంభిస్తున్నాము. విషయ ప్రాధాన్యత దృష్ట్యా యీ తరం వారికి చాలా తోడ్పడుతుందని భావిస్తున్నాం.
న్యూహ్యూమనిస్ట్ తెలుగు మాస పత్రికలో సీరియల్ గా వచ్చిన యీ శీర్షికను, హేమ ప్రచురణల వారు, పుస్తకంగా వెలువరించారు. ఇప్పుడది పునర్ముద్రణ చేయవలసి వుంది.
నియంతలు, నరహంతకులు ప్రతి శతాబ్దంలోనూ వుంటూ వచ్చారు. రాను రాను ప్రజాస్వామ్య విలువల దృష్ట్యా కొన్ని చోట్ల స్వేచ్చా రాజ్యాలు తలెత్తాయి. ప్రజల సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నారు. అయినా చాలా దేశాలలో ఇంకా నియంతృత్వాలు వున్నాయి. ఎదురు చెప్పనివ్వని ధోరణి వీటిల్లో స్పష్టం. ఆధునిక మానవ విలువలు, సమానత్వం చాలా చోట్ల అమలు జరగవలసి వుంది.
సర్వసాధారణంగా గతం నుండీ నేటి వరకూ నరహంతకులు మతాన్ని అడ్డం పెట్టుకొని, దైవం పేరిట దారుణాలు చేశారు. ఇప్పటికే చేస్తున్నారు. ఆధునిక కాలంలో ఇజాల పేరిట, ముఖ్యంగా కమ్యూనిజం, ఫాసిజం, నాజీ యిజం మనుషుల్ని నమిలేస్తున్నాయి.
సైనిక పాలనలో కూడా నియంతృత్వ ధోరణిలో, మతాల్ని ఆసరాగా స్వీకరిస్తున్నాయి. ఇందుకు ఇస్లాం, బౌద్ధం తోడ్పడుతున్నాయి.
ఇక కమ్యూనిస్టు దేశాలలో సమానత్వం, సమసమాజం పేరిట జరిగిన, జరుగుతున్న రాక్షసత్వం కనువిప్పుకావాలి. ఈ శీర్షికలో లెనిన్, స్టాలిన్, మావో, పోల్ పాట్ అందుకు మచ్చుతునకలు. ఉత్తర కొరియా, క్యూబా యింకా అదే ధోరణిలో నడుస్తున్నాయి.
క్రైస్తవ మతాన్ని అండగా చేసుకొని జార్జి బుష్ వంటి వారు అమెరికా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా వక్రీకరించి, పరోక్ష నరహంతలుగా మారారు.
ఈ నేపధ్యంలో శ్రీ నరిశెట్టి ఇన్నయ్య 1991లోనే రాసిన సీరియల్ నేటికీ అక్షర సత్యంగా పనికొస్తున్నాయి. దీనిపై స్పందనకు ఎదురుచూస్తాం.

- సి. భాస్కరరావు

No comments: