Sunday, May 27, 2007

నర హంతకులు - 3

స్టేట్ టెర్రరిజానికి శ్రీకారం చుట్టిన లెనిన్ - 2

1918లో మొదటి ఆరునెలల్లో లెనిన్ ఉత్తరువులననుసరించి, కేవలం 22 మందినే చేకా చంపినట్లు అధికార నివేదికలో పేర్కొన్నారు. ఆ తరువాత ఆర్నెల్లలో ఆరు వేల మందిని ఉరితీశారు. 1919లో కేవలం 10 వేల మందిని చంపేశారు. 1920 వచ్చే సరికి చేకా సంస్థకు చేతినిండా పని తగిలింది. ఆ యేడు 50 వేల మందిని ఉరితీసేశారు. ఇదంతా లెనిన్ ప్రోత్సాహం, ఉత్తరువుల మేరకే జరిగిన మారణకాండ. ఇలా చంపడంలో వ్యక్తిగతంగా విచారించే ప్రశ్నలేదు. వర్గాన్ని తుడిచి పెట్టడం ప్రధానం. ఈ సామూహిక హత్యలకు లెనిన్ పేర్కొన్న-వర్గాన్ని తుడిచిపెట్టాలనే సూత్రమే మూలం.

1917 నవంబరు 17వ రాజ్యాంగసభ ఎన్నికైంది. దీనిని సమావేశపరచడానికి లెనిన్ యిష్టపడలేదు. అయినా తప్పనిసరై 1918 జనవరి 5న రాజ్యాంగ సభ సమావేశం ఏర్పరచారు. చర్చలలో బోల్షి విక్కులకు వ్యతిరేకత వున్నది. ఓటు పెడితే బోల్షివిక్కులకు వ్యతిరేకంగా 237 వచ్చాయి. ఇదంతా ముందే గ్రహించిన లెనిన్ తన మనుషులను సమావేశ భవనానికి కాపలా పెట్టించాడు. లెనిన్ ఆధ్వర్యాన గల బాల్టిక్ ఫ్లీటు నావికులు కాపలా వున్నారు. రాత్రంతా చర్చలు జరిగిన అనంతరం తెల్లవారుజామున ప్రతినిధులను వెళ్ళిపొమ్మని, కాపలా సైనికులు అలసిపోయారని లెనిన్ ఆదేశాలిచ్చారు. మళ్ళీ 12 గంటల తరువాత సమావేశం కావాలని అనుకున్నా అలాంటి సమావేశం ఎన్నడూ జరగలేదు. ఆ విధంగా ప్రాతినిధ్యపు ప్రజాస్వామ్యాన్ని లెనిన్ మట్టుబెట్టి రష్యాలో నామరూపాలు లేకుండా చేశారు. రాజ్యాంగసభ సమావేశం కావలసినచోట మూడు రోజుల అనంతరం సోవియటు చేరి లెనిన్ పెత్తనానికి ఆమోదమద్ర వేసినట్లు లాంఛనంగా ప్రకటించారు.
తన అధికారానికి బయటా, లోపల తిరుగులేకుండా చెసుకోడానికి లెనిన్ చేయవలసిన దారుణ కృత్యాలన్నీ చేశాడు. జర్మనీవారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి, లెనిన్ వారితో సంధి చేసుకున్నాడు. అంతటితో రష్యాకు జర్మనీ సైవ్యాల బెడద ఆగింది. లెనిన్ రాక్షసకృత్యాలకు అంతరంగికంగా మరింత అవకాశం చిక్కింది. ఇందుకు అండగా నిలిచినవాడు స్టాలిన్.
రష్యాలో రైతులకు హామీలు గుప్పించిన లెనిన్ వారికి చెల్లని చెక్కులు యిష్టానుసారంగా యిచ్చి నమ్మించి మోసం చేశాడు. విదేశాలవారికోసం స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని వల్లించిన లెనిన్ రష్యాలో దీనిని పాటించలేదు. ఉక్రైన్, కాక్పన్, ఏషియన్ రష్యాలో లెనిన్ స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని అనుమతించలేదు. లెనిన్ కు చిట్టచివరి వ్యతిరేకత నావికదళం నుండి వచ్చింది. వారు స్వేచ్ఛను సమానత్వాన్ని కోరారు. సోవియట్లు సరైన ప్రజాప్రతినిధులు కారన్నారు. కాని లెనిన్ యివేమీ పట్టించుకోలేదు. కీలక నాయకుల పేరిట 13 గురి పేర్లను ప్రకటించి చంపారు. తరువాత వందలాది మందిని రహస్యంగా హతమార్చారు.
1921 మేలో లెనిన్ పార్టీ బయట రాజకీయ కార్యకలాపాలకు స్వస్తి చెబుతూ ప్రకటన చేశారు. అంతటితో చెకా రంగంలో ప్రవేశించి కొందరని మట్టుపెట్టగా మరికొందరిని ప్రవాసానికి పంపారు పార్టీ సభ్యత్వానికి ప్రాధాన్యత పెరిగింది. కమ్యూనిస్టు పార్టీ 1921లో లెనిన్ ఆధ్వర్యాన 585000 మందికి పెరిగింది. పార్టి సర్వాధికారి అయింది కేంద్రీకృత పార్టీ నాయకత్వాన్ని లెనిన్ కట్టుదిట్టం చేశాడు. పార్టీలో కూడా ప్రజాస్వామ్యాన్ని చంపేశాడు. స్టాలిన్ ద్వారా తన ఉత్తరువులు అమలు జరిగేటట్టు లెనిన్ వత్తాసుదారులే వుండడం వలన ఇక అరాచకాలెన్ని చేసినా అడిగేదిక్కు లేకుండా పోయింది.
1922 మే 25న లెనిన్ కు తొలిసారి తీవ్రంగా జబ్బుచేసింది. అంతకుముందే లెనిన్ కు బాగా తలనొప్పి వస్తుండేది. సెలవు తీసుకోడానికి నిరాకరించిన లెనిన్ 1921 జులైలో ఒక నెల విశ్రాంతి తీసుకున్నాడు. పనితగ్గించమని ఆగస్టులో పోలిట్ బ్యూరో ఉత్తరువులిచ్చింది. 1922లో అలాంటి ఉత్తరువులు తిరిగి యిచ్చారు. 1922 మే నుండి అక్టోబరు 2 వరకూ లెనిన్ విశ్రాంతి తీసుకోగా, తిరిగి వచ్చిన అనంతరం కూడా అధికార పత్రాలు అందుబాటులో లేకుండా చేశారు.
లెనిన్ ఆరోగ్య పరిరక్షణాధికారిగా 1922 డిసెంబరు 18న స్టాలిన్ నియమితుడైనాడు. లెనిన్ రహస్యంగా పనిచేస్తూ తన భార్య కృపస్క మాకు ఉత్తరాలు చెప్పి వ్రాయించడం స్టాలిన్ కు నచ్చలేదు.
1922 డిసెంబరు 24న ఆరుగురు సోవియట్ ప్రముఖుల్ని గురించి లెనిన్ చెప్పి వ్రాయించాడు. 1923 జనవరి 4న లెనిన్ మరో అనుబంధ నోట్ చెప్పి వ్రాయించాడు. స్టాలిన్ పట్ల దృఢమైన అభిప్రాయాలు అందులో వ్యక్తపరచాడు. 1923 మార్చి 5న స్టాలిన్ కు ఒక ఉత్తరం వ్రాస్తూ లెనిన్ తన భార్యను నిందిస్తూ ఫోనులో స్టాలిన్ చేసిన బెదిరింపును నిరసించాడు. ఈ విషయమై క్షమాపణ కోరమన్నాడు కాని, ప్రత్యుత్తరం రాకముందే లెనిన్ కు నోరు పడిపోయింది. 1924 జనవరిలో లెనిన్ మరణించాడు. కేంద్రకమీషను చేత కృపయస్కాపై విచారణ జరిపిస్తానని స్టాలిన్ ఫోను చేసి లెనిన్ భార్యను బెదిరించిన తరువాత యిదంతా జరిగింది.
పనిచేయనివాడు తినడానికి వీల్లేదనే లెనిన్ సూత్రం రష్యాలో అన్వయించారు. సమ్మెలు నిషేధించారు. క్రమశిక్షణ లేని కార్మికులు, రౌడీలు, వూరికే తిరిగేవారు మొదలైన బాపతులను పట్టుకొని చెకా సంస్థ ఆధ్వర్యాన నిర్భందపనిలో పెట్టారు. విప్లవ ట్రిబ్యునల్స్ (నార్కండ్రడ్) ఈ నిర్ణాలు తీసుకోగా అలాంటి వారితో రోడ్లు వేయడం, భవన నిర్మాణం, బండ్లు లాగడం యిత్యాది పనులెన్నో చేయించేవారు. విప్లవ ప్రతిఘాతుకులచేత అర్కిటిక్ ప్రాంతంలో నిర్భందశ్రమ చేయించేవారు. లెనిన్ ప్రారంభించిన నిర్భంద శ్రామిక శిబిరాలు, అంతర్యుద్దానంతరం కూడా కొనసాగాయి. కార్మిక రాజ్యంలో కార్మికుల స్థితి లెనిన్ ఆధ్వర్యాన అలా వుండేది.
1917లో భూముల్ని ఆక్రమించుకోవలసిందిగా లెనిన్ రైతుల్ని రెచ్చగొట్టాడు. 1918లో ఆ భూముల్ని రైతులనుండి లాగేసే ప్రయత్నం అదే లెనిన్ చేశాడు. 86 శాతం భూమి రైతుల చేతుల్లో వుండగా ప్రభుత్వ సమిష్టి వ్యవసాయానికి 11 శాతమే దక్కింది. ఇది చూచి 1918లో పంటను స్వాధీనం చేసుకోమంటూ లెనిన్ ఫాక్టరీ కార్మికులను పొలాల మీదకు పంపించాడు.
కులక్ లకు వ్యతిరేకంగా చిన్న రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా లెనిన్ చేశాడు. నగరాలలో ఆహార కొరత తీర్చడానికి రైతులకు ధనాశచూపిన లెనిన్ విఫలమైనాడు. అంతటితో రైతులకు స్వేచ్ఛను యిచ్చామన్నారు. కాని అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. 1921లో వచ్చిన కరువు కారణంగా లెనిన్ విధాన ఫలితంగా 30 లక్షల మంది చనిపోయారు. ఆ దారుణం నుండి బయటపడడానికి అమెరికా నుండి దిగుమతులు చేసుకోవలసి వచ్చింది.

లెనిన్ తన ఓటమిని ఒప్పుకున్నాడు. వెనుకంజ వేయడం కేవలం కొత్తదాడికేనన్నాడు. కాని అది జరగకముందే అస్తమించాడు.అధికారం కోసం మనుషుల్ని అరమరికలు లేకుండా హతమార్చి దానికి సిద్ధాంతపు తొడుగు చూపిన లెనిన్ ఈ శతాబ్దంలోని స్టేట్ టెర్రరిజానికి పితామహుడు. ఆయన్ను స్మరించకుండా టెర్రరిస్టు ఎవరూ తమ కృషిని సాగించలేరేమో.

References:
Work on Lenin about his dictatorship
http://www.struggle.ws/russia/cp/maximof_terror1940.html
Another reference for Lenin’s ruthless behavior to obtain power and anti democratic rule without majority
http://www.marxists.org/archive/kautsky/1930s/demvscom/ch04.htm
The following link refers to Lenin’s Cheka, the organization, which was secretly created and sustained to annihilate several people in Russia.
http://www.foreignaffairs.org/19811201fabook13273/george-leggett/the-cheka-lenin-s-political-police.html
Biography of Lenin by Shubb David – It is to be read for astonishing facts.
http://www.marxists.org/history/etol/newspape/ni/vol16/no02/shub.htmauthentic

No comments: