Monday, January 7, 2008

సాహితీపరులతో సరసాలు -2

పి.వి. నరసింహారావు
(1921-2004)

1968 ప్రాంతాల్లో పి.వి. నరసింహారావును నాకు పరిచయం చేశారు. మిత్రులు కొల్లూరి కోటేశ్వరావు. తెలుగు విద్యార్థి మాసపత్రికకు విద్యా విషయాలపై ఇంటర్వ్యూ నిమిత్తం ఆరంభమైన పరిచయం చివరి దాకా కొనసాగింది.1969లో గోరాశాస్త్రి 50వ జన్మదినం కర్నూలులో జరుపుతూ పి.వి. నరసింహారావును ఉపన్యాసకుడుగా తీసుకెళ్ళాం. గోరా శాస్త్రితో కలసి కొన్ని పర్యాయాలు పి.వి.ని కలిశాను.
తేళ్ళ లక్ష్మీ కాంతమ్మతో కలసి కూడా పి.వి.ని కలిశాను. నన్ను ఎం.ఎన్. రాయ్ భావ ప్రభావితుడుగా గుర్తించిన పి.వి., అలానే చివరిదాకా పరిగణించారు. ఆయనతో నేను చేసిన ఇంటర్వ్యూలు తెలుగు విద్యార్థి (మచిలీపట్నం నుండి మాసపత్రిక)లో ప్రచురితమయ్యాయి.
పి.వి. నరసింహారావు తెలుగు, ఇంగ్లీషు ప్రసంగాలు అనేక సందర్భాలలో విన్నాను. అసెంబ్లీలో కూడా ఆయన ధోరణి గమనించాను. ప్రసంగాలు జాగ్రత్తగా తయారు చేసుకునేవారు. ఆచితూచి మాట్లాడేవారు.
ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రానికి నేను చాలా తరచుగా వెళ్ళేవాడిని. వేలూరి సహజానంద నా ప్రసంగాలు, చర్చలు ప్రసారంచేశారు. అలా వెడుతున్నప్పుడు, హిందీ విభాగంలో మిత్రుడు దండమూడి మహీధర్ తో కాలక్షేపం చేసే వాడిని, ఆయన ద్వారా వారణాసి రామమూర్తి (రేణు కలం పేరు)తో పరిచయం అయింది. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలను ఆయన హిందీలో రాస్తున్నారు. రెండు మూడు సందర్భాలలో దీని ప్రస్తావన వచ్చింది. తరువాత కొన్నాళ్ళకు పి.వి. నరసింహారావు పేరిట సహస్రఫణి శీర్షికన అది వెలువడింది. తుది మెరుగులు పి.వి. చేశాడంటారు.
వేయి పడగలు అనువాదం చేబట్టడంలో పి.వి. నైజం బయటపడిందనేది ప్రధానాంశం. మంత్రిగా, రాజకీయాలలో తీరిక లేక, రామమూర్తి రేణు సహాయం స్వీకరించి వుండొచ్చునని, పి.వి.ని గురించి అనుకున్నాను. పదవులలో వున్నవారు యిలా యితరుల సహాయం పొందడం జరుగుతూనే వుంది. ఆ తరువాత పి.వి.కి సాహిత్య అకాడమీ అవార్డు కూడా యీ అనువాదానికి వచ్చింది. తెలుగులో ఆ పుస్తక రచయితకు జ్ఞాన పీఠ అవార్డు యిప్పించడంలో పి.వి. పాత్ర వుందన్నారు. బెజవాడ గోపాలరెడ్డి కూడా ఒక చేయి వేశాడన్నారు.
పి.వి. ప్రతిభాశాలి. ఇంగ్లీషు, తెలుగుతో బాటు మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు రావడం ఆయనకు బాగా కలసి వచ్చింది. ప్రధానిగా రిటైర్ అయిన తరువాత, రాజ్ భవన్ లో కలుస్తుండేవాడిని.
పి.వి. యింటి పేరు పాములపర్తి కాగా, లక్ష్మీ కాంతమ్మ యింటి పేరు తేళ్ళ వారిరువురికీ గల సన్నిహిత సంబంధం దృష్టిలో పెట్టుకొని, ఈ తేళ్ళ-పాముల బాధ మనం భరించలేం అని జి.సి. కొండయ్య వ్యాఖ్యానించేవారు. ఇన్ సైడర్ అనే రచనలో తేళ్ళ లక్ష్మీకాంతమ్మను అన్నాప దేశంగా ప్రస్తావించి, ఆమె శీలాన్ని బాధ పెట్టే రీతిలో రాశాడని అపవాదు వున్నది. లక్ష్మీ కాంతమ్మ యీ విషయాలు ఇంటర్వ్యూలలో ఖండించింది.
1975లో ఇందిరా గాంధి ఎమర్జన్సీ పెట్టినప్పుడు పి.వి.కి పదవి లేదు. పైగా ఇందిరపై ఆగ్రహించి, ఒక పుస్తకం రాయబూనారు. అలా రాస్తుండగా, ఢిల్లీ పిలుపు రావడంతో, ఆ పుస్తకాన్ని అంతం చేశారు. హైదరాబాద్ ఆదర్శనగర్ లో ఆయన్ను తరచు కలియడం వలన యిలాంటి విషయాలు తెలిసేవి.
పి.వి. నరసింహారావు చివరి దశలో కంప్యూటర్ నేర్చుకొని, వినియోగించారు. మిత భాషి, తొందరగా అభిప్రాయాలు చెప్పుడు. సమస్యల్ని నాన్చడం ఆనవాయితీ. శీల వంతుడు కాక పోవడం పబ్లిక్ రంగంలో పెద్దలోపం.
రచనలు : INSIDER (నవలగా స్వీయగాధ),
అనువాదాలు :
గ్రే ఎలజీ (Gray's "Elegy" ) (తెలుగులో), అబల ఫ్రణీ లక్షాత్ కోణ్ షేతో (మరాఠి నుండి తెలుగు), సహస్ర ఫణి (తెలుగు నుండి హిందీ - విశ్వనాధ సత్యనారాయణ వేయిపడగలు), వ్యాసాలు, పీఠికలు, ఇంగ్లీషు, తెలుగు.

3 comments:

chakri said...

chaalaa baavundi sir :)

http://indianwebdesign.wordpress.com/2008/01/07/12/

bujji said...

నా బాల్యంలో పొద్దున్నే నాలుగింటికి నిద్రలేచే మా తాతయ్య, తనతో పాటుగా లేచిన నాకు, ఇలాంటి ఎన్నో కబుర్లు చెప్పారు. పాత రాజకీయాలు, స్వాతంత్ర సమర గాధలు, సాహితీకారులతో తన అనుభవాలు వగైరా..

ఆ కబుర్లు మళ్ళీ విన్నట్లుంది, ఈ వ్యాసం చదువుతుంటే..

కొత్త రవికిరణ్

అనిల్ చీమలమఱ్ఱి said...

వ్యాసం అంతా బాగున్నా, శీలవంతుడు కాదు అనటమే, బాగాలేదు..

అనిల్ చీమలమఱ్ఱి