Tuesday, January 1, 2008

సాహితీపరులతో సరసాలు

రచయితలు, కవులు భిన్న రంగాలలో తమ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తారు. జీవితమంతా 24 గంటలూ కవులుగా, రచయితలుగా ఎవరూ వుండరు. అయితే పాఠకులు వాటిపై దృష్టి పెట్టరు. కవిని కేవలం కవిత్వ విలువలతో చూస్తారు. అలాగే రచయితల్ని కూడా. ఇది సహజమే.
నేను కవినీ, రచయితనూ కాను. జీవితంలో వివిధ సందర్భాలలో అనేక మంది రచయితలతో, కవులతో ఏదొక విధంగా సంబంధాలు ఏర్పడ్డాయి. కొందరితో సన్నిహితంగా స్నేహం లభించింది. ఆ విధంగా వారి వ్యక్తిత్వాలను, భిన్న కోణాలలో చూడడానికి వీలైంది.
ఈ వ్యక్తిత్వ చిత్రణలో నిశిత పరిశీలన, చనువుతో గూడిన వ్యాఖ్యలు, అంచనాలు వుంటాయి. వ్యక్తుల జీవిత చరిత్ర యిందులో వుండదు. బాగా పేరు పొందిన వారి నుండి మరుగుపడి పోయిన వారి వరకూ మీరు చూస్తారు. అందరికీ తెలియని అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అభిమానులు వీరాభిమానులు చూచిన దృష్టి యిక్కడ కనిపించకపోవచ్చు.
వ్యక్తులలో ఎన్ని వైవిధ్యాలు, విభిన్న రీతులు వుంటాయో యిక్కడ గమనించవచ్చు. చనిపోయిన వారితో ఆరంభించి, ఉత్తరోత్తరా యిప్పుడున్న వారిని గమనించడం యీ క్రమంలో చూస్తారు.
మిత్రులు సి. భాస్కర రావు మాటల సందర్భంలో, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఫోటో కోసం ఇంటర్నెట్లో వెతికితే కనిపించలేదన్నాడు. మీకు తెలుసా అని నన్నడిగాడు. పాపయ్యశాస్త్రి నాకు నాలుగేళ్ళపాటు గుంటూరు ఎ.సి. కళాశాలలో టీచరనీ, ఆయన ఫోటో నా దగ్గర వుందనీ చెబితే, ఆశ్చర్యంతో సంతోషించాడు. అలా సంభాషణలో మరికొన్ని పేర్లు రాగా, వారు నాకు తెలుసు అన్నప్పుడు, అయితే మీరు అనుభవాలు రాయాల్సిందే అని పట్టుబట్టారు. ఈ శీర్షికకు ఆ విధంగా నాంది పలికాం.
ముందే చెప్పినట్లు సమగ్ర చరిత్ర, సమాచారం అందించడం యిక్కడ వుండదు. కనుక సూచన ప్రాయంగా తప్ప, స్పష్టమైన తేదీల కోసం, వివరాల కోసం చూస్తే, నిరాశే ఎదురౌతుంది.
తెలిసిన వారి సన్నిహిత జాబితా నూటికి పైనే వుంది. కొందరి గురించి ఎక్కువగా ఇంకొందరి పట్ల తక్కువ వుండడంలో పక్షపాతం వలన కాదు.
వ్యక్తుల్ని విశాల కోణంలో చూడడానికి యిదొక దుర్భిణి మాత్రమే.
భిన్న వ్యక్తుల్ని గురించి రాయడంలో విభిన్న రీతులుంటాయి. ఒకే మూస వుండదు.
- ఎన్. ఇన్నయ్య


"Karunasree" Jandhyala Papayya Sastry

"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి (1912-1992)

ఘంటసాల పాపయ్య శాస్త్రి అని ఆయన్ను హాస్యం పట్టించిన విద్యార్థులుగా 1954-58 మధ్య గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మేము అందరి నోళ్ళలోనానే వాళ్ళం. మేము అంటే నేనూ, నా స్నేహితుడు సిద్ధాబత్తుని రామకృష్ణ. ఘంటసాల పాడినందున పాపయ్య శాస్త్రికి పేరు వచ్చిందనే వాళ్ళం.
నాలుగేళ్ళపాటు కాలేజీలో మాకు పాఠాలు చెప్పిన పాపయ్యశాస్త్రిని అలా ఆట పట్టించిన వారు అరుదే.
ఆవుల గోపాలకృష్ణమూర్తి ఆయన్ను పాపశ్రీ అనేవారు. కరుణ శ్రీ కి పారడీగా అలా పిలిచారేమో అనుకున్నాం. పాప అంటే పాము అని కూడా అర్థం వుందట.
ఇవేవీ చాటున అన్నవిగావు. ఆయనకు తెలిసేటట్లే ఎదుటబడి అన్నప్పుడు, చిన్న బుచ్చుకున్నా మమ్మల్ని ఏమీ అనేవారు కాదు.
కాలేజీలో పాపయ్యశాస్త్రి గద్య, పద్యంతో బాటు, నాటకం, నాన్ డిటైల్డ్ చెప్పేవారు. కాని ఆయన రాయడంలో కనబరిచిన లాలిత్యం మాధుర్యం చెప్పడంలో కనబడేదిగాదు. అందుకే హాస్యం పట్టించగలిగాం.
పాపయ్యశాస్త్రికి అప్పట్లో ఒక స్నేహితురాలు వుండేది. ఆ విషయం తెలిసి, పోల్చుకున్నాములే నిన్ను వైష్ణవ పడతీ అని రాగాలు తీసేవాళ్ళం.
పాపయ్యశాస్త్రి రచనలు ముఖ్యంగా బౌద్ధం, పూలు వస్తువుగా స్వేకరించి రాసినవి చదివాం. తెలుగువారికి యిష్టమైన పూలన్నిటిపైనా ఆయన కవితలు అల్లారు. బౌద్ధం ఆయన పై పరిమితంగానే ప్రభావం చూపెట్టినా, కరుణ రస ప్రధానంగా రాసి, ఆకట్టుకున్నారు. బౌద్ధ బోధనలు, తత్వం ఆయన్ను వశ పరచుకోలేదు.
పాపయ్య శాస్త్రితో పరిచయం, కాలేజీ రోజుల తరువాత కూడా సాగింది. సాహిత్య అకాడమీ సంబంధాల వలన తరచు హైదరాబాద్ వస్తుండటంతో, కలిసేవాళ్ళం, మృదువుగా, లాలిత్యంతో సంభాషించేవారు. గురు-శిష్య సంబంధం కాస్తా స్నేహంగా మారింది. ఆయన కుటుంబంతో ఎన్నడూ పరిచయం కాలేదు.
భువన విజయంలోనూ ఉగాది వేడుకల కవిసమ్మేళనాలలో పాపయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఆయన కవితల రచనలు అందంగా ఆకర్షణీయంగా వుండేవి.
క్రమేణా ఒకదశలో జంధ్యాల వారు సత్య సాయిబాబా పాదాక్రాంతు లయ్యారు. అంతటితో ఆగక, విశ్వంజీ అనే అర్థాంతపు స్వామి భక్తులయ్యారు. ఇంకా ఇతర స్వాములును కూడా ఆరాధించారేమో తెలియదు. ఏ దశలో ఆయనకు భక్తి ముదిరిందో కూడా గమనించలేదు. పూల నుండి పూజల్లోకి దిగజారారనుకున్నాం.
పాపయ్యశాస్త్రి గురువు జమ్మల మడక మాధవ రాయశర్మ ఎ.సి. కాలేజీలోనే మాకు తెలుగు పాఠాలు చెప్పారు. ఆయన సంస్కృత పండితుడైనా, తెలుగు నాటకం చక్కగా, హృద్యంగా చెప్పేవారు. ఆయన పాపయ్య శాస్త్రికి పాఠాలు చెప్పారని తరువాత తెలుసుకున్నాం.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసం ఎ.సి. కాలేజీలో ఏర్పాటు చేస్తే, పాపయ్య శాస్త్రి కూడా వచ్చి, మెచ్చుకున్నారు. అది విశేషం.
చెట్లకు ప్రాణం వుంది, అవి స్పందిస్తాయనే జగదీష్ చంద్ర, సైంటిస్టు ఎంత వరకు పాపయ్య శాస్త్రిని ప్రభావితం చేశాడో తెలియదు. కాని ఆయన కవితల్లో పూలపట్ల కదలించే తీరు గొప్పది.
బౌద్ధ ప్రభావం పాక్షికంగానే యీయన స్వీకరించి, కరుణతో ఆపేసినట్లున్నది.
పాపయ్యశాస్త్రి రచనలు -
ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు, కరుణామయి, కరుణశ్రీ, వీరభారతి, ఉదయభారతి, చారుమిత్ర, తెనుగుసేతు, కళ్యాణకాదంబరి, ప్రేమ మూర్తి (బుద్ధుని గురించి) స్వప్న వాస్తవ దత్తం, మహతి, కళ్యాణ కల్పవల్లి, మందిరము, బాల భారతి (కథలు), గురు దక్షిణ, బంగారు పద్మం (పిల్లల నాటకం), ఇంద్రధనుస్సు (పిల్లల కథలు), కళ్యాణ దంపతులు (పిల్లల కథలు), చందమామలో కుందేలు (పిల్లల కథలు), తెలుగు బాల (నీతి శతకం), శ్రీనివాస వాచకం (పిల్లల పాఠ్య గ్రంథం), నలుగురు మిత్రులు (నవల), సింహం మెచ్చిన బట్టి ఒక (పిల్లల కథలు), వసంత సేన (నవల), ఆది కవి వాల్మికి (పిల్లల కథలు), త్యాగమూర్తి (ఏసు జీవితం), దమయంతి (నవల), మహావీరుడు (నవల), భగీరథుడు (నవల), విశ్వ దశలహరి (కథలు), పద్మావతి శ్రీనివాసం (కథలు), ముద్దు బాలశిక్ష (పిల్లలకు), సాయి సుధా లహరి (కావ్యం), ఉమర్ ఖయాం (కావ్యం), ఆకాశవాణి గేయ నాటికలు (20).
ఆ రోజులలో పిల్లల సాహిత్యం యింత రాశారని నేటితరాల వారు గమనించాలి.

8 comments:

netizen నెటిజన్ said...

"ఆయనకు తెలిసేటట్లే ఎదుటబడి అన్నప్పుడు, చిన్న బుచ్చుకున్నా మమ్మల్ని ఏమీ అనేవారు కాదు." - అని మీరనుకునే వారేమో!
"పాపయ్యశాస్త్రికి అప్పట్లో ఒక స్నేహితురాలు వుండేది".అది ఇప్పుడు అవసరమా! ఐనా స్నేహితురాలు ఉండటంలో తప్పేమి ఉంది.
మీకు "స్నేహితురాళ్ళు" లేరా?
నిర్మొహమాటంగా, నిష్కపటంగా ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను అని మీరు అనుకోగానే సరిపోదు!
చదువుకునేవారికి ఇబ్బంది కలుగకూడదు!

కొన్ని సందర్భాలలో మీ "మాటలు" ఇతరులని నొప్పిస్తాయి. అది తెలిసే మీరు వ్రాస్తున్నారా?

Rajendra Devarapalli said...

నెటిజన్‌ గారు కూడా ఏ సి కాలేజి విధ్యార్దులేనా?

వింజమూరి విజయకుమార్ said...

netizen గారు చెప్పింది నిజమే. కొన్ని విషయాలు అప్రస్తుతమనిపించేవి రాయకపోతేనే మంచిది. ఇలాగే ఈ బ్లాగులో యింతకుముందు కారల్ మార్క్స్ కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం టపాల్లో మార్క్స్ యింట్లో మరో స్త్రీ ఎవరో వుండేవారనీ, ఆమె గర్భం ధరిస్తే దానికి ఏంగెల్స్ కారణమనో ఏదో రాసారు. ఇటువంటి విషయాలు కారల్ మార్క్స్ కి కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం తో పాటు మనం పట్టించే గ్రహణమే ప్రత్యక్షంగా కన్పిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతమైన బలహీనతలు అందరికీ వుంటాయి. వారు లోకానికి చేసిన సేవలు గుర్తించదగ్గవి గానీ యిటువంటివి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

cbrao said...

@netizen,రాజేంద్ర కుమార్ దేవరపల్లి,వింజమూరి విజయకుమార్ - ఇవి వ్యక్తిత్వ పరిశీలన అంచనాలు.ప్రతివారిలో వెలుగు నీడలు ఈ పరిశీలనలో కనిపిస్తాయి. తద్వారా వ్యక్తిని అంచనా వేయటానికి తోడ్పడుతుంది. మనకు రుచించని విషయాలు ప్రస్తావనకు రావచ్చు.నేటి అంతర్జాతీయ మానసిక రీతుల అధ్యయనంలో ఇదొక ముఖ్యాంశమని గమనించాలి. ఎరిక్ ఫ్రాం (Anatomy of Human Destructiveness), ఎరిక్ ఎరిక్సన్ (Gandhi's Truth) మొదలైన వారు ఈ ధోరణిలో చక్కని ప్రమాణాలు ఏర్పర్చారు కనుక మనకు రుచించనివి అప్రియమైనా అంచనాలకు గ్రహించక తప్పదు. పాపయ్య శాస్త్రి ఐనా సరే (ఆయన మాకు గురువు), కార్ల్ మార్క్స్ ఐనా సరే వీటికి మినహాయింపులు కారు. భట్రాజీయం ఈ బేరీజులో వుండదు.

-ఇన్నయ్య.

Rajendra Devarapalli said...

అయ్యా నేను కూడా ఏసి కాలేజ్ విధ్యార్ధినే అందుకే నాకు ఆ ఆసక్తి నేను ఇన్నయ్య గారి వ్యాఖ్యానం లో జోక్యం చేసుకోలేదు మీరు గమనించాలి.

వింజమూరి విజయకుమార్ said...

నిజం. భట్రాజీయం లేకుండా టపాలు రాయగలగితే మొదట సంతోషించేది నేనే. కానీ టపా మీద మనకి ఒక స్పష్టత ఉండాలని నేనంటాను. 'రాముడు మంచివాడు' అనే టైటిల్ పెట్టి 'రాముడు చెడ్డవాడు' అని అర్థమయ్యే వ్యాసం రాయడం ఏ 'ఎరిక్ ఫ్రాం' చెపుతారండీ. ఇప్పుడిది ఎరిక్ ఫ్రాం సిద్ధాంతాలకి భట్రాజీయం అని మేం అనుకుంటే. ఇంతకీ మీరు కారల్ మార్క్స్ ని 'కారల్ మార్క్స్ కి కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం' టపాల్లో పొగిడారో తిట్టారో అర్థం కావడంలా. ఆయన మూలంగా జరిగిన యుద్దాలూ, హింసా అంతా యింతా కాదని రాసారు. సార్ మీరు వయసులో పెద్దవారు. నేనొకమాటంటా ఒకవ్యక్తి ప్రపంచంలోని దరిద్ర్యాన్ని పోగొట్టడం కోసం నిద్రాహారాలు మాని సిద్ధాంతాలు చేసి, 'కాపిటల్' లాంటి గ్రంధాలు రాసి, ప్రపంచ కార్మికుడ్ని మేల్కొల్పి జీవితం యావత్తూ ప్రపంచానికి అర్పిస్తే, వ్యక్తి జీవితంలో చీకటి వెలుగుల పేరుతో అతడ్ని ఎండగట్టడం ఎంత వరకూ సబబు. అలాగే తెలుగు జాతికే మకుటాయమాన మనదగ్గ అపార పాండిత్య శాలి పాపయ్యశాస్త్రి కూడా. మీరు ఆయనకు శిష్యులైతే ఆయన దగ్గర మీరు నేర్చింది యిదేనా. అలాగే 'సైంటిఫిక్ మెథడ్' పేరుతో దేవుడు సైన్సుకి అందాలంటారు. అయ్యా యిదెంత హాస్యాస్పదం. వ్యక్తి ఆత్మ జ్ఞానం పొంది, తనలో తానే ఆవిష్కరింపజేసుకోవాల్సిందిగా భావించబడతున్న మహత్తర సత్యాన్ని సైన్సు 'టెలిస్కోపు' లాంటి పరికరంతో లోకానికంతా చూపిస్తుందనుకోవడం మన భ్రమ. అలాగని నేను సైన్సుని వ్యతిరేకిస్తున్నానని గాదు. ఆ శాస్త్రపు గౌరవం, ప్రయోజనం దానికెప్పుడూ ఉంటుంది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే మీరు రాసే టపాలకి టైటిల్లు సరిగ్గా లేవని. మనం రాసే టపాల మీద మనకి స్పష్టత వుండాలనీను. ఎటొచ్చీ మనం రాసే విషయంలో మనమే వైరుధ్యాలు సృష్టించి పాఠకుడ్ని అయోమయంలో పడవేయకూడదనీను.

innaiah said...

శీర్షికలు సరిగానే ఉన్నాయి.కమూనిస్తులు కావాలని దాచిపెట్టిన విషయాలు పరిషోధనలో బయట పడినవి.అలాగె పాపయ్య శాస్త్రి కరుణ నుండి పాదసేవలొకి పయనించారు.విషయం అది.వ్యక్తుల భిన్న కోణా లు ఇలా వుంటాయి.థామస్ సాజ్ వంటి వారి సాస్త్రీయ రచనలు అవగాహనకు ఉపకరిస్తాయి Innaiah

Anonymous said...

innaiha గారు
మేకు ఎప్పుడు నుంచో మీకు mail చెద్దాము అనుకుంటున్నాను
"అబద్ధాల వేట నిజాల బాట " is very good book
అందరు తప్పనిసరిగ చదవాల్సిన book

నా doubts చాలా clarify అయినాయి realy good book

but "దేవుడి భ్రమలొ " మాత్రం నిరాశ పరచింది.
అసలు ఏంత చదివిన అర్ధం కాలేదు, మక్కి కి మక్కి అనువాధం జరగడం వల్ల కావచ్చు
any way really good work sir