Thursday, January 31, 2008

సాహితీపరులతో సరసాలు -5


DV Narasaraju

దాట్ల వెంకట నరసరాజు
(2006 మరణం)
సినిమాలోకంలో డి.వి. నరసరాజుగా ప్రసిద్ధి చెందిన రచయిత. చక్కని నాటికలు, కథలు, వ్యంగ్య రచనలు చేశారు. గుంటూరు జిల్లా సత్తెన పల్లి ప్రాంతానికి చెందిన నరసరాజు, కొన్నాళ్ళు విజయవాడలో వున్నారు. అక్కడే 1949-50 ప్రాంతాల్లో ఎం.ఎన్. రాయ్ ను కలసి సంభాషించారు. పార్టీరహిత ప్రజాస్వామ్యం, మానవవాదం నచ్చిన నరసరాజు, చివరిదాకా ఎం.ఎన్. రాయ్ అభిమాని.
మద్రాసు సినీ రంగంలో స్ర్కిప్ట్ రచయితగా కొన్నేళ్ళు పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత చివరి దశలో యీనాడు పత్రికలో వారం వారం “అక్షింతలు” శీర్షిక రాశారు. అది బాగా ఆకట్టుకున్నది. తాను పేలవం అయినట్లు భావించిన నరసరాజు, స్వయంగా మానేసి హాయిగా వున్నారు. చివరి దాకా తన హాస్య ప్రియత్వాన్ని కాపాడుకున్నారు.
హైదరాబాద్ ఉషాకిరణ్ గెస్ట్ హౌస్ లో వుండగా, నేనూ, ఆలపాటి రవీంద్రనాథ్ (మిసిమి ఎడిటర్) ఎన్నోసార్లు కాలక్షేపం చేశాం. బెజవాడ పాపిరెడ్డి ఆహ్వానంపై నెల్లూరులో నరసరాజు, నేనూ, జయప్రకాశ్ నారాయణ జయంతి సభలో ప్రసంగించాం. ఎం.ఎన్. రాయ్ పై ఒక డాక్యుమెంటరీ తీయాలనే, నా ప్రతిపాదన మెచ్చుకొని, తాను స్క్రిప్టు రాస్తానని నరసరాజు అన్నారు. కోగంటి వీరయ్య చౌదరి కూడా కొంత ప్రయత్నం చేసినా, అది ఫలించలేదు.
“ఈ ఇల్లు అమ్మబడును” నాటిక బహుళ జనాదరణ పొందింది. సినిమా అనుభవాలు, వ్యక్తుల పరిచయాలు బాగా అంచనా వేసి నరసరాజు చెప్పేవారు. రామోజీ సినిమాలకు మాటలు, స్క్రిప్టు రాశారు. చివరి దశలో, మనవరాలి భర్త, సుమన్ ఇంట్లో వుండేవారు. అనేక మంది హేతువాదుల్ని ఆయనకు పరిచయం చేశాను.
నరసరాజుతో మాట్లాడడం ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. జీవితాన్ని ఫాజిటివ్ గా చూసిన వ్యక్తి ఆయన. 1950 నాటికి యింకా కొందరు కమ్యూనిస్టులు, ఎం.ఎన్. రాయ్ తమ వాడేనని అంటుంటే, నరసరాజు వారిని వెంటబెట్టుకుని, విజయవాడలో ఎం.ఎన్. రాయ్ బస చేసిన చోటకు తీసుకెళ్ళాడు. వారి మాటల్ని రాయ్ కు చెప్పి, ఆయనతోనే తాను కమ్యూనిస్టును కానని చెప్పించాడు. రాయ్ చెప్పిన, పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రత్యామ్నాయం అని చివరిదాకా నరసరాజు నమ్మారు. రావిపూడి వెంకటాద్రి వంటి వారిని, హైదరాబాద్ లో నరసరాజుకు పరిచయం చేశాను.
వార్థక్యంతో భక్తి రావడం తప్పని సరికాదని, మానసికంగా తనపై తనకు విశ్వాసం వుంటే, మూఢనమ్మకాలను దూరం పెట్టవచ్చని నరసరాజు నిరూపించారు.

రచనలు: తెరవెనుక కథలు, అదృష్టవంతుడి ఆత్మకథ (Autobiography).

6 comments:

Rajendra Devarapalli said...

ఇన్నయ్య గారు చిన్న సవరణ-సినీ నటుడు సుమన్ డి.వి.నరసరాజు గారి మనవరాలి భర్త,అల్లుడు కాదు,గమనించగలరు.

Anonymous said...

అక్షింతలు బాగుండేవి. టివి లో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఆసక్తిగా చూసేవాణ్ణి.

బుజ్జి

cbrao said...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి -అవును సినీ నటుడు సుమన్ డి.వి.నరసరాజు గారి మనవరాలి భర్త. వ్యాసంలో సవరిస్తున్నాను. నీ జాబుకు ధన్యవాదాలు.

Anonymous said...

@సీ.బి.రావు గారు: వారి పేరు "దాట్ల వెంకట నరసరాజు" కాదా?

innaiah said...

దాట్ల వెంకట
is correct.Thanks for correction Netizen
Innaiah

duppalaravi said...

పెద్దవాళ్లతో రాసుకు పూసుకు తిరగడమే ఒక కులుకైతే దాన్ని హృదయం చెమ్మగిల్లేట్టు చెప్పడం... మహాప్రభో వంద వందనాలు. అయితే ఒక్కటే ఫిర్యాదు. ఒక జాబుకీ మరో జాబుకీ మరీ ఆలస్యమవడం.