Thursday, January 31, 2008

సాహితీపరులతో సరసాలు -5


DV Narasaraju

దాట్ల వెంకట నరసరాజు
(2006 మరణం)
సినిమాలోకంలో డి.వి. నరసరాజుగా ప్రసిద్ధి చెందిన రచయిత. చక్కని నాటికలు, కథలు, వ్యంగ్య రచనలు చేశారు. గుంటూరు జిల్లా సత్తెన పల్లి ప్రాంతానికి చెందిన నరసరాజు, కొన్నాళ్ళు విజయవాడలో వున్నారు. అక్కడే 1949-50 ప్రాంతాల్లో ఎం.ఎన్. రాయ్ ను కలసి సంభాషించారు. పార్టీరహిత ప్రజాస్వామ్యం, మానవవాదం నచ్చిన నరసరాజు, చివరిదాకా ఎం.ఎన్. రాయ్ అభిమాని.
మద్రాసు సినీ రంగంలో స్ర్కిప్ట్ రచయితగా కొన్నేళ్ళు పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత చివరి దశలో యీనాడు పత్రికలో వారం వారం “అక్షింతలు” శీర్షిక రాశారు. అది బాగా ఆకట్టుకున్నది. తాను పేలవం అయినట్లు భావించిన నరసరాజు, స్వయంగా మానేసి హాయిగా వున్నారు. చివరి దాకా తన హాస్య ప్రియత్వాన్ని కాపాడుకున్నారు.
హైదరాబాద్ ఉషాకిరణ్ గెస్ట్ హౌస్ లో వుండగా, నేనూ, ఆలపాటి రవీంద్రనాథ్ (మిసిమి ఎడిటర్) ఎన్నోసార్లు కాలక్షేపం చేశాం. బెజవాడ పాపిరెడ్డి ఆహ్వానంపై నెల్లూరులో నరసరాజు, నేనూ, జయప్రకాశ్ నారాయణ జయంతి సభలో ప్రసంగించాం. ఎం.ఎన్. రాయ్ పై ఒక డాక్యుమెంటరీ తీయాలనే, నా ప్రతిపాదన మెచ్చుకొని, తాను స్క్రిప్టు రాస్తానని నరసరాజు అన్నారు. కోగంటి వీరయ్య చౌదరి కూడా కొంత ప్రయత్నం చేసినా, అది ఫలించలేదు.
“ఈ ఇల్లు అమ్మబడును” నాటిక బహుళ జనాదరణ పొందింది. సినిమా అనుభవాలు, వ్యక్తుల పరిచయాలు బాగా అంచనా వేసి నరసరాజు చెప్పేవారు. రామోజీ సినిమాలకు మాటలు, స్క్రిప్టు రాశారు. చివరి దశలో, మనవరాలి భర్త, సుమన్ ఇంట్లో వుండేవారు. అనేక మంది హేతువాదుల్ని ఆయనకు పరిచయం చేశాను.
నరసరాజుతో మాట్లాడడం ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. జీవితాన్ని ఫాజిటివ్ గా చూసిన వ్యక్తి ఆయన. 1950 నాటికి యింకా కొందరు కమ్యూనిస్టులు, ఎం.ఎన్. రాయ్ తమ వాడేనని అంటుంటే, నరసరాజు వారిని వెంటబెట్టుకుని, విజయవాడలో ఎం.ఎన్. రాయ్ బస చేసిన చోటకు తీసుకెళ్ళాడు. వారి మాటల్ని రాయ్ కు చెప్పి, ఆయనతోనే తాను కమ్యూనిస్టును కానని చెప్పించాడు. రాయ్ చెప్పిన, పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రత్యామ్నాయం అని చివరిదాకా నరసరాజు నమ్మారు. రావిపూడి వెంకటాద్రి వంటి వారిని, హైదరాబాద్ లో నరసరాజుకు పరిచయం చేశాను.
వార్థక్యంతో భక్తి రావడం తప్పని సరికాదని, మానసికంగా తనపై తనకు విశ్వాసం వుంటే, మూఢనమ్మకాలను దూరం పెట్టవచ్చని నరసరాజు నిరూపించారు.

రచనలు: తెరవెనుక కథలు, అదృష్టవంతుడి ఆత్మకథ (Autobiography).

Monday, January 21, 2008

సాహితీపరులతో సరసాలు -4


Kondaveeti Venkatakavi

కొండవీటి వెంకటకవి
(1918-1991)

కొండవీటి వెంకటకవిలో కవి ఎప్పుడు వచ్చి చేరిందో గాని, అది పేరులో అంతర్భాగమైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సంస్కృతంలో శిక్షణ పొందిన వాడు. పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగినట్లు చెప్పారు. అది మోతాదు మించిన ఆధ్యాత్మిక రీతి...
1945 ప్రాంతాల్లో ఆంధ్రలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బాగా వున్నప్పుడు జరిగిన ఆసక్తి కర సంఘటన ఒకటి, కొండవీటి వెంకట కవి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి స్టేషన్ సమీపంలో ఒక జమిందారు ప్రాంగణంలో జరిగిన ఘట్టం అది. ఆంధ్రలో వున్న అనేక మంది స్వాములు, బాబాలు, మాతల్ని అక్కడి జమిందారు పేరిట ఆహ్వానించారట. సన్మానిస్తామని, సత్కారాలు అందుకోమని ఆహ్వానంలో రాశారు. ఆ మేరకు వచ్చిన వారిలో కొండవీటి వెంకటకవి కూడా వున్నారు. చుట్టూ ప్రహరీ, ఒకటే గేటు. వేదిక ఏర్పరచి, సన్మానానికి వచ్చిన వారిని కూర్చోబెట్టి కార్యక్రమం ఆరంభించారట. ఒకరు సన్మాన పత్రం చదవడం, మరొకరు సన్మానించడం. అదీ కార్యక్రమం. సన్మాన పత్రంలో అంశాలు వింటుంటే చెమటలు పట్టి బ్రతుకుజీవుడా ఎప్పుడు బయట పడతామా అని అనుకున్నారట.
ఆనాడు కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి. సెక్స్ జీవితం, అవినీతి యిత్యాదులన్నీ బయటపెడుతూ పోయారట. తరువాత బెత్తాలతో బాదడం. అదీ కార్యక్రమం. బయటకు పారిపోడానికి వీల్లేదు. కనుక అందరూ గౌరవాన్ని అందుకున్నారట.
ఆ దెబ్బతో కొండవీటి వెంకటకవికి ఆధ్యాత్మికత వదలి పోయిందట. సాయంత్రానికి దగ్గరలో వున్న స్టేషన్ లో రైలెక్కి ఎవరి దారిన వారు పోయారట. కొండవీటి వెంకటకవి యీ స్వానుభవాన్ని చెప్పినవ్వించారు. ఇది రాయవచ్చా అని అడిగితే, నిక్షేపంగా రాయమన్నారు. నేను దీనిని సమీక్ష, ఈనాడు, ఉదయంలో రాశాను. అది సరే.
కొండవీటి వెంకటకవి తనను లక్షాధికారిగా చెప్పుకుంటూ, కోటేశ్వరుడిని కావాలని వుందన్నాడు. ఆశ్చర్య పోయిచూస్తుంటే, లక్షపద్యాలు చెప్పగలను, కోటి వరకూ అలా చెప్పాలని వుందన్నారు. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టు మూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. ఒకసారి ఎ.సి. కాలేజి (గుంటూరు)కు పిలిపించి ఉపన్యాసం చెప్పించాం. ఆయన ప్రసంగం ఆంధ్రపత్రికలో ప్రచురించారు. స్ఫూర్తిశ్రీ (భాస్కరరావు) అది రాశారు. నేను అప్పట్లో కాలేజి సారస్వత సంఘానికి కార్యదర్శిని. 1956లో సంగతి.
వెంకటకవికి ఇంగ్లీషు రాదు. నెహ్రూ చరిత్ర కావ్యంగా రాయాలనుకున్నాడు. తుమ్మల సీతారామ చౌదరి గాంధీ ఆత్మకథ రాస్తే మంచి పేరు వచ్చింది. అందుకు దీటుగా నెహ్రూ కథ రాయాలని సంకల్పించాడు. ఆవుల గోపాలకృష్ణమూర్తి తోడ్పాటుతో ఇంగ్లీషులో విషయాలు చెప్పించుకుని రాశాడు. నెహ్రూతో ఇంటర్వ్యూ తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఆయనకు సమర్పించి తృప్తి చెందారు. ఇది 1960 ప్రాంతాలలో సంగతి. నెహ్రూ సెక్యూలరిస్టు గనుక వెంకటకవికి తోడ్పడినట్లు ఎ.జి.కె. (ఆవుల గోపాలకృష్ణమూర్తి) చెప్పారు.
“దివ్యస్మృతులు” రచనలో రాస్తూ, ఎం.ఎన్. రాయ్ కు నివాళులు అర్పించారు. త్రిపురనేని రామస్వామి, ఏటుకూరి వెంకట నరసయ్య అంటే వెంకట కవికి యిష్టం. చిన్నయసూరి అంటే భక్తి. వాదోపవాదాలలో దిట్ట.
ఆయనతో నాకు 1954 ప్రాంతాలలో ప్రారంభమైన పరిచయం, ఆయన చనిపోయే వరకూ వుంది. హాస్య ప్రియుడు గావడం వలన మా సంభాషణ బాగా జరిగేది. హైదరాబాద్లో యీనాడులో వారం వారం శీర్షిక రాసేవాడు. పొన్నూరులో వుండగా ఆయన్ను కలిసే వాడిని. దాన వీరశూరకర్ణకు సంభాషణలు రాశాడు. అందులో కులంపై దాడి వాడివేడి సంభాషణలు ఎన్.టి.రామారావు గొంతులో వన్నెలు సంతరించుకున్నాయి.
వెంకటకవి విమర్శలు, తర్కాలు, వాదోపవాదాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. రామరాజు భూషణుడు (భట్టుమూర్తి) పట్ల, కుల విచక్షణతో, ప్రబంధకవుల నుండి జరిగిన అవమానాలు. ఆయన ఏ కరువు పెట్టేవాడు.
దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి వద్ద శిష్యరికం చేశాడు. వ్యాకరణంలో దిట్ట శాస్త్రిగారు చిన్నయసూరి అభిమాని. వెంకటకవి యిక్కడా, కులతత్వాన్ని తెచ్చి పెట్టి చిన్నయసూరి విషయంలో సాహిత్యలోకం కనబరచిన విచక్షణను నిరసించారు.ఆవులగోపాల కృష్ణమూర్తి అనుచరుడుగా వెంకటకవి చక్కని విమర్శను, హేతువాదాన్ని మానవ తత్వాన్ని అలవరచుకున్నారు. అయితే కులాభిమానం వీడలేక పోయాడు. అష్టావధానాలు చేశాడు. భువన విజయాలలో పాల్గొన్నాడు.


N.Innaiah performed the marriage of Manjulatha (Presently Vice-Chancellor of Pottisreeraamulu Telugu University) –Subramanyeswara Rao in 1970 at Exhibition Grounds, Hyderabad. The performance was secular without any religious mantras and promises were made as per Tripuraneni Ramaswamy’s guidelines, in Telugu language. Simultaneously on the same stage, at the same time, Kondaveeti Venkatakavi performed the marriage of the second son of Avula Sambasivarao and delivered the main speech.

లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. మేమిద్దరం కలసికొన్ని పెళ్ళిళ్ళు చేయించాం. అందులో ఆవుల మంజులత పెళ్ళి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో జరిపించాం. ఆయన పురోహితుడు. నేను తోటి పురోహితుడ్ని. తోటి పెళ్ళి కుమారుని వలె! సంతరావూరు (చీరాల దగ్గర) వెలది వెంకటేశ్వర్లు పెళ్ళి కూడా అలాగే జరిపించాం.
కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానే మంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండపెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు. వేయిస్తే, దుకూలాలు (తెల్లని పట్టువస్త్రం) కప్పితే చాలు అనేవాడు. చల్లపల్లి రాజాను అడిగితే ఏనుగు ఫ్రీగా యిచ్చే అవకాశం లేకపోలేదు అనేవాడు. లోగడ షష్ఠిపూర్తి జరిపించుకున్న వారిని, వెక్కిరిస్తూ అలా అన్నాడనిపిస్తుంది.
రచనలు : కర్షకా శతకం, హితబోధ, నృసింహతారావళి, చెన్నకేశవ శతకం, దివ్యస్మృతులు, నెహ్రూ చరిత్ర (కావ్యం), త్రిశతి (శతకాలు), ఈనాడులో వారం వారం కాలం.

Monday, January 14, 2008

సాహితీపరులతో సరసాలు -3


Gajjela Mallareddy

గజ్జల మల్లారెడ్డి
(1925-1997)

ఈనాడు దిన పత్రిక సంపాదక వర్గంలో పుణ్యభూమి శీర్షిక రాస్తున్న రోజులలో (1982) గజ్జల మల్లారెడ్డి పరిచయమయ్యారు. తెలుగు దేశం పార్టీ పెట్టి ఎన్.టి. రామారావు సుడిగాలి పర్యటన చేస్తున్న రోజులలో టంగుటూరి ప్రకాశంపై నా వ్యాసాన్ని గజ్జల మల్లారెడ్డి ఎడిటోరియల్ పేజీలో ప్రచురించారు. దానిపై వెయ్యి ఉత్తరాలు వచ్చాయని మల్లారెడ్డి చెప్పారు. అంతరియాక్షన్ అప్పట్లో సంచలనం కలిగించింది.
టంగుటూరి ప్రకాశం మద్రాసులో సైమన్ కమీషన్ పర్యటన సందర్భంగా, పోలీసుకు గుండీలు విప్పి గుండె చూపి కాల్చమన్నాడనే ప్రచారం నిజంకాదని రాశాను. శవాన్ని చూడడానికి వెడుతున్న ప్రకాశాన్ని పోలీస్ ఆపాడని మాత్రమే వాస్తవవిషయం. అది తన స్వీయచరిత్రలో ప్రకాశమే రాశారు. ఆయన ఆనుచరుడు తెన్నేటి విశ్వనాధం ఆమాటలే రాశాడు. అలాంటి వాస్తవాన్ని కప్పిపుచ్చి, హీరో ఆరాధన చేస్తూ, కట్టు కధను ప్రచారంలో పెట్టారు. అది కాదన్నందుకు గొడవ చేశారు. గజ్జల మల్లారెడ్డి నా పక్షానే నిలిచారు.
ఆ తరువాత, ఆయన ఉదయం దిన పత్రికకు వెళ్ళారు. అక్షింతలు శీర్షిక రాస్తుండగా, పింగళి జగన్ మోహనరెడ్డి (హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు జడ్జి) ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా తన అనుభవాలు ఇంగ్లీషులో రాశారు. దానిని ఆయన కోరికపై తెలుగు చేశాను. జి. రాంరెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా చేసిన అవకతవకల్ని అవినీతిని, అక్రమాలకు జగన్మోహన రెడ్డి ప్రమాణాలతో బయటపెట్టారు. అవి ప్రచురించాలా వద్దా అనే చర్చ ఉదయంలోరాగా, గజ్జల మల్లారెడ్డి పట్టుబట్టి సీరియల్ గా నా అనువాదాన్ని ప్రచురించారు.
తరువాత ఆంధ్రభూమిలో చురకలు శీర్షిక రాస్తూ, సంపాదకుడుగా వున్నారు.
1993 ప్రాంతాల్లో నేను కొన్ని గ్రంధాలను హైదరాబాద్ లోని బోట్ క్లబ్ కు బహుకరించారు. క్లబ్ లో ఒక లైబ్రరీ వుండాలని అలా చేశాను. అందుకు క్లబ్ వారు ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. గజ్జల మల్లారెడ్డి, సినీ నటుడు రావు గోపాలరావు సభలో నన్ను గురించి మాట్లాడారు. మల్లారెడ్డి చాలా సమాచారం సేకరించి, విశేషంగా ప్రసంగించారు.
గజ్జెల మల్లారెడ్డి కమ్యూనిస్టు పార్టీలో వుంటూ, రష్యా పర్యటన విశేషాలు చెప్పేవారు. పార్టీ నుండి బయటకు వచ్చి, పత్రికా రంగంలో స్థిరపడిపోయారు. కులతత్వం చూపాడనే విమర్శ వున్నది.
మల్లారెడ్డి రాతల్లోనే గాక, చేతల్లోనూ మాటకారి. ఘాటైన విమర్శలు చేసేవారు. మాటలు అనడం, అనిపించుకోవడం ఆయనకు అలవాటే.
గుంటూరు పొగాకు గూట్లో వుంటే ఏమిటి. నోట్లో వుంటే ఏమిటి. అనేవారు నిస్సార మైందనే అర్థంలో.
రామోజీరావు (ఈనాడు అధిపతి) ఆయన్ను ఎప్పుడూ కవిగారని పిలిచేవాడు.
గజ్జల మల్లారెడ్డి కొందరు కమ్యూనిస్టులనూ బాగా దెప్పి పొడిచేవారు. తాను పార్టీ నుండి బయటపడిన తరువాత, కాంగ్రెస్ పార్టీలో జనార్థన రెడ్డి ఎన్. కు తదితరులకు సన్నిహితుడయ్యాడు.
హిందీ, తెలుగు చదివిన మల్లారెడ్డి, ఇంగ్లీషు పట్టించుకోలేదు. విశాలాంద్ర వారపత్రికకు, 1970లో ఎడిటర్ గా, వీచిక మాస పత్రిక సంపాదకుడుగా వున్నారు.
రచనలు : శంఖారావం (1968), మాటకచేరీ (1991), రసపిపాసులు (1991), మల్లారెడ్డి గేయాలు (1963).
కడప జిల్లా అంకాలమ్మ గూడూరు నుండి హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

Monday, January 7, 2008

సాహితీపరులతో సరసాలు -2

పి.వి. నరసింహారావు
(1921-2004)

1968 ప్రాంతాల్లో పి.వి. నరసింహారావును నాకు పరిచయం చేశారు. మిత్రులు కొల్లూరి కోటేశ్వరావు. తెలుగు విద్యార్థి మాసపత్రికకు విద్యా విషయాలపై ఇంటర్వ్యూ నిమిత్తం ఆరంభమైన పరిచయం చివరి దాకా కొనసాగింది.



1969లో గోరాశాస్త్రి 50వ జన్మదినం కర్నూలులో జరుపుతూ పి.వి. నరసింహారావును ఉపన్యాసకుడుగా తీసుకెళ్ళాం. గోరా శాస్త్రితో కలసి కొన్ని పర్యాయాలు పి.వి.ని కలిశాను.
తేళ్ళ లక్ష్మీ కాంతమ్మతో కలసి కూడా పి.వి.ని కలిశాను. నన్ను ఎం.ఎన్. రాయ్ భావ ప్రభావితుడుగా గుర్తించిన పి.వి., అలానే చివరిదాకా పరిగణించారు. ఆయనతో నేను చేసిన ఇంటర్వ్యూలు తెలుగు విద్యార్థి (మచిలీపట్నం నుండి మాసపత్రిక)లో ప్రచురితమయ్యాయి.
పి.వి. నరసింహారావు తెలుగు, ఇంగ్లీషు ప్రసంగాలు అనేక సందర్భాలలో విన్నాను. అసెంబ్లీలో కూడా ఆయన ధోరణి గమనించాను. ప్రసంగాలు జాగ్రత్తగా తయారు చేసుకునేవారు. ఆచితూచి మాట్లాడేవారు.
ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రానికి నేను చాలా తరచుగా వెళ్ళేవాడిని. వేలూరి సహజానంద నా ప్రసంగాలు, చర్చలు ప్రసారంచేశారు. అలా వెడుతున్నప్పుడు, హిందీ విభాగంలో మిత్రుడు దండమూడి మహీధర్ తో కాలక్షేపం చేసే వాడిని, ఆయన ద్వారా వారణాసి రామమూర్తి (రేణు కలం పేరు)తో పరిచయం అయింది. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలను ఆయన హిందీలో రాస్తున్నారు. రెండు మూడు సందర్భాలలో దీని ప్రస్తావన వచ్చింది. తరువాత కొన్నాళ్ళకు పి.వి. నరసింహారావు పేరిట సహస్రఫణి శీర్షికన అది వెలువడింది. తుది మెరుగులు పి.వి. చేశాడంటారు.




వేయి పడగలు అనువాదం చేబట్టడంలో పి.వి. నైజం బయటపడిందనేది ప్రధానాంశం. మంత్రిగా, రాజకీయాలలో తీరిక లేక, రామమూర్తి రేణు సహాయం స్వీకరించి వుండొచ్చునని, పి.వి.ని గురించి అనుకున్నాను. పదవులలో వున్నవారు యిలా యితరుల సహాయం పొందడం జరుగుతూనే వుంది. ఆ తరువాత పి.వి.కి సాహిత్య అకాడమీ అవార్డు కూడా యీ అనువాదానికి వచ్చింది. తెలుగులో ఆ పుస్తక రచయితకు జ్ఞాన పీఠ అవార్డు యిప్పించడంలో పి.వి. పాత్ర వుందన్నారు. బెజవాడ గోపాలరెడ్డి కూడా ఒక చేయి వేశాడన్నారు.
పి.వి. ప్రతిభాశాలి. ఇంగ్లీషు, తెలుగుతో బాటు మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు రావడం ఆయనకు బాగా కలసి వచ్చింది. ప్రధానిగా రిటైర్ అయిన తరువాత, రాజ్ భవన్ లో కలుస్తుండేవాడిని.
పి.వి. యింటి పేరు పాములపర్తి కాగా, లక్ష్మీ కాంతమ్మ యింటి పేరు తేళ్ళ వారిరువురికీ గల సన్నిహిత సంబంధం దృష్టిలో పెట్టుకొని, ఈ తేళ్ళ-పాముల బాధ మనం భరించలేం అని జి.సి. కొండయ్య వ్యాఖ్యానించేవారు. ఇన్ సైడర్ అనే రచనలో తేళ్ళ లక్ష్మీకాంతమ్మను అన్నాప దేశంగా ప్రస్తావించి, ఆమె శీలాన్ని బాధ పెట్టే రీతిలో రాశాడని అపవాదు వున్నది. లక్ష్మీ కాంతమ్మ యీ విషయాలు ఇంటర్వ్యూలలో ఖండించింది.
1975లో ఇందిరా గాంధి ఎమర్జన్సీ పెట్టినప్పుడు పి.వి.కి పదవి లేదు. పైగా ఇందిరపై ఆగ్రహించి, ఒక పుస్తకం రాయబూనారు. అలా రాస్తుండగా, ఢిల్లీ పిలుపు రావడంతో, ఆ పుస్తకాన్ని అంతం చేశారు. హైదరాబాద్ ఆదర్శనగర్ లో ఆయన్ను తరచు కలియడం వలన యిలాంటి విషయాలు తెలిసేవి.
పి.వి. నరసింహారావు చివరి దశలో కంప్యూటర్ నేర్చుకొని, వినియోగించారు. మిత భాషి, తొందరగా అభిప్రాయాలు చెప్పుడు. సమస్యల్ని నాన్చడం ఆనవాయితీ. శీల వంతుడు కాక పోవడం పబ్లిక్ రంగంలో పెద్దలోపం.
రచనలు : INSIDER (నవలగా స్వీయగాధ),
అనువాదాలు :
గ్రే ఎలజీ (Gray's "Elegy" ) (తెలుగులో), అబల ఫ్రణీ లక్షాత్ కోణ్ షేతో (మరాఠి నుండి తెలుగు), సహస్ర ఫణి (తెలుగు నుండి హిందీ - విశ్వనాధ సత్యనారాయణ వేయిపడగలు), వ్యాసాలు, పీఠికలు, ఇంగ్లీషు, తెలుగు.

Tuesday, January 1, 2008

సాహితీపరులతో సరసాలు

రచయితలు, కవులు భిన్న రంగాలలో తమ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తారు. జీవితమంతా 24 గంటలూ కవులుగా, రచయితలుగా ఎవరూ వుండరు. అయితే పాఠకులు వాటిపై దృష్టి పెట్టరు. కవిని కేవలం కవిత్వ విలువలతో చూస్తారు. అలాగే రచయితల్ని కూడా. ఇది సహజమే.
నేను కవినీ, రచయితనూ కాను. జీవితంలో వివిధ సందర్భాలలో అనేక మంది రచయితలతో, కవులతో ఏదొక విధంగా సంబంధాలు ఏర్పడ్డాయి. కొందరితో సన్నిహితంగా స్నేహం లభించింది. ఆ విధంగా వారి వ్యక్తిత్వాలను, భిన్న కోణాలలో చూడడానికి వీలైంది.
ఈ వ్యక్తిత్వ చిత్రణలో నిశిత పరిశీలన, చనువుతో గూడిన వ్యాఖ్యలు, అంచనాలు వుంటాయి. వ్యక్తుల జీవిత చరిత్ర యిందులో వుండదు. బాగా పేరు పొందిన వారి నుండి మరుగుపడి పోయిన వారి వరకూ మీరు చూస్తారు. అందరికీ తెలియని అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అభిమానులు వీరాభిమానులు చూచిన దృష్టి యిక్కడ కనిపించకపోవచ్చు.
వ్యక్తులలో ఎన్ని వైవిధ్యాలు, విభిన్న రీతులు వుంటాయో యిక్కడ గమనించవచ్చు. చనిపోయిన వారితో ఆరంభించి, ఉత్తరోత్తరా యిప్పుడున్న వారిని గమనించడం యీ క్రమంలో చూస్తారు.
మిత్రులు సి. భాస్కర రావు మాటల సందర్భంలో, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఫోటో కోసం ఇంటర్నెట్లో వెతికితే కనిపించలేదన్నాడు. మీకు తెలుసా అని నన్నడిగాడు. పాపయ్యశాస్త్రి నాకు నాలుగేళ్ళపాటు గుంటూరు ఎ.సి. కళాశాలలో టీచరనీ, ఆయన ఫోటో నా దగ్గర వుందనీ చెబితే, ఆశ్చర్యంతో సంతోషించాడు. అలా సంభాషణలో మరికొన్ని పేర్లు రాగా, వారు నాకు తెలుసు అన్నప్పుడు, అయితే మీరు అనుభవాలు రాయాల్సిందే అని పట్టుబట్టారు. ఈ శీర్షికకు ఆ విధంగా నాంది పలికాం.
ముందే చెప్పినట్లు సమగ్ర చరిత్ర, సమాచారం అందించడం యిక్కడ వుండదు. కనుక సూచన ప్రాయంగా తప్ప, స్పష్టమైన తేదీల కోసం, వివరాల కోసం చూస్తే, నిరాశే ఎదురౌతుంది.
తెలిసిన వారి సన్నిహిత జాబితా నూటికి పైనే వుంది. కొందరి గురించి ఎక్కువగా ఇంకొందరి పట్ల తక్కువ వుండడంలో పక్షపాతం వలన కాదు.
వ్యక్తుల్ని విశాల కోణంలో చూడడానికి యిదొక దుర్భిణి మాత్రమే.
భిన్న వ్యక్తుల్ని గురించి రాయడంలో విభిన్న రీతులుంటాయి. ఒకే మూస వుండదు.
- ఎన్. ఇన్నయ్య


"Karunasree" Jandhyala Papayya Sastry

"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి (1912-1992)

ఘంటసాల పాపయ్య శాస్త్రి అని ఆయన్ను హాస్యం పట్టించిన విద్యార్థులుగా 1954-58 మధ్య గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మేము అందరి నోళ్ళలోనానే వాళ్ళం. మేము అంటే నేనూ, నా స్నేహితుడు సిద్ధాబత్తుని రామకృష్ణ. ఘంటసాల పాడినందున పాపయ్య శాస్త్రికి పేరు వచ్చిందనే వాళ్ళం.
నాలుగేళ్ళపాటు కాలేజీలో మాకు పాఠాలు చెప్పిన పాపయ్యశాస్త్రిని అలా ఆట పట్టించిన వారు అరుదే.
ఆవుల గోపాలకృష్ణమూర్తి ఆయన్ను పాపశ్రీ అనేవారు. కరుణ శ్రీ కి పారడీగా అలా పిలిచారేమో అనుకున్నాం. పాప అంటే పాము అని కూడా అర్థం వుందట.
ఇవేవీ చాటున అన్నవిగావు. ఆయనకు తెలిసేటట్లే ఎదుటబడి అన్నప్పుడు, చిన్న బుచ్చుకున్నా మమ్మల్ని ఏమీ అనేవారు కాదు.
కాలేజీలో పాపయ్యశాస్త్రి గద్య, పద్యంతో బాటు, నాటకం, నాన్ డిటైల్డ్ చెప్పేవారు. కాని ఆయన రాయడంలో కనబరిచిన లాలిత్యం మాధుర్యం చెప్పడంలో కనబడేదిగాదు. అందుకే హాస్యం పట్టించగలిగాం.
పాపయ్యశాస్త్రికి అప్పట్లో ఒక స్నేహితురాలు వుండేది. ఆ విషయం తెలిసి, పోల్చుకున్నాములే నిన్ను వైష్ణవ పడతీ అని రాగాలు తీసేవాళ్ళం.
పాపయ్యశాస్త్రి రచనలు ముఖ్యంగా బౌద్ధం, పూలు వస్తువుగా స్వేకరించి రాసినవి చదివాం. తెలుగువారికి యిష్టమైన పూలన్నిటిపైనా ఆయన కవితలు అల్లారు. బౌద్ధం ఆయన పై పరిమితంగానే ప్రభావం చూపెట్టినా, కరుణ రస ప్రధానంగా రాసి, ఆకట్టుకున్నారు. బౌద్ధ బోధనలు, తత్వం ఆయన్ను వశ పరచుకోలేదు.
పాపయ్య శాస్త్రితో పరిచయం, కాలేజీ రోజుల తరువాత కూడా సాగింది. సాహిత్య అకాడమీ సంబంధాల వలన తరచు హైదరాబాద్ వస్తుండటంతో, కలిసేవాళ్ళం, మృదువుగా, లాలిత్యంతో సంభాషించేవారు. గురు-శిష్య సంబంధం కాస్తా స్నేహంగా మారింది. ఆయన కుటుంబంతో ఎన్నడూ పరిచయం కాలేదు.
భువన విజయంలోనూ ఉగాది వేడుకల కవిసమ్మేళనాలలో పాపయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఆయన కవితల రచనలు అందంగా ఆకర్షణీయంగా వుండేవి.
క్రమేణా ఒకదశలో జంధ్యాల వారు సత్య సాయిబాబా పాదాక్రాంతు లయ్యారు. అంతటితో ఆగక, విశ్వంజీ అనే అర్థాంతపు స్వామి భక్తులయ్యారు. ఇంకా ఇతర స్వాములును కూడా ఆరాధించారేమో తెలియదు. ఏ దశలో ఆయనకు భక్తి ముదిరిందో కూడా గమనించలేదు. పూల నుండి పూజల్లోకి దిగజారారనుకున్నాం.
పాపయ్యశాస్త్రి గురువు జమ్మల మడక మాధవ రాయశర్మ ఎ.సి. కాలేజీలోనే మాకు తెలుగు పాఠాలు చెప్పారు. ఆయన సంస్కృత పండితుడైనా, తెలుగు నాటకం చక్కగా, హృద్యంగా చెప్పేవారు. ఆయన పాపయ్య శాస్త్రికి పాఠాలు చెప్పారని తరువాత తెలుసుకున్నాం.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసం ఎ.సి. కాలేజీలో ఏర్పాటు చేస్తే, పాపయ్య శాస్త్రి కూడా వచ్చి, మెచ్చుకున్నారు. అది విశేషం.
చెట్లకు ప్రాణం వుంది, అవి స్పందిస్తాయనే జగదీష్ చంద్ర, సైంటిస్టు ఎంత వరకు పాపయ్య శాస్త్రిని ప్రభావితం చేశాడో తెలియదు. కాని ఆయన కవితల్లో పూలపట్ల కదలించే తీరు గొప్పది.
బౌద్ధ ప్రభావం పాక్షికంగానే యీయన స్వీకరించి, కరుణతో ఆపేసినట్లున్నది.
పాపయ్యశాస్త్రి రచనలు -
ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు, కరుణామయి, కరుణశ్రీ, వీరభారతి, ఉదయభారతి, చారుమిత్ర, తెనుగుసేతు, కళ్యాణకాదంబరి, ప్రేమ మూర్తి (బుద్ధుని గురించి) స్వప్న వాస్తవ దత్తం, మహతి, కళ్యాణ కల్పవల్లి, మందిరము, బాల భారతి (కథలు), గురు దక్షిణ, బంగారు పద్మం (పిల్లల నాటకం), ఇంద్రధనుస్సు (పిల్లల కథలు), కళ్యాణ దంపతులు (పిల్లల కథలు), చందమామలో కుందేలు (పిల్లల కథలు), తెలుగు బాల (నీతి శతకం), శ్రీనివాస వాచకం (పిల్లల పాఠ్య గ్రంథం), నలుగురు మిత్రులు (నవల), సింహం మెచ్చిన బట్టి ఒక (పిల్లల కథలు), వసంత సేన (నవల), ఆది కవి వాల్మికి (పిల్లల కథలు), త్యాగమూర్తి (ఏసు జీవితం), దమయంతి (నవల), మహావీరుడు (నవల), భగీరథుడు (నవల), విశ్వ దశలహరి (కథలు), పద్మావతి శ్రీనివాసం (కథలు), ముద్దు బాలశిక్ష (పిల్లలకు), సాయి సుధా లహరి (కావ్యం), ఉమర్ ఖయాం (కావ్యం), ఆకాశవాణి గేయ నాటికలు (20).
ఆ రోజులలో పిల్లల సాహిత్యం యింత రాశారని నేటితరాల వారు గమనించాలి.