Sunday, April 12, 2009

పింగళి జగన్మోహన రెడ్డితో


సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన పింగళి జగన్మోహనరెడ్డి తన స్వీయ చరిత్ర విపులంగా రాశారు. వ్రాత ప్రతిని యువతరం చూస్తే ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోవాలని, అచ్చు కాకముందే, నా కుమారుడు నరిశెట్టి రాజుకు యిచ్చారు. అప్పుడు రాజు నిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. చదివిన తరువాత, రాజు వ్యాఖ్యానిస్తూ, మీరేమైనా బెర్ట్రాండ్ రస్సెల్ అనుకున్నారా? ఎవరు చదువుతారు యీ సోది అంతా? అవసర వివరాలు తొలగించండి.” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. కాని ఆయన విమర్శనాత్మక సూచన స్వీకరించడమేగాక, గ్రంథాన్ని తిరగరాసి, రాజుకు పుస్తకంలో కృతజ్ఞతలు చెప్పాడు.

జడ్జిగా రిటైర్ అయిన తరువాత, 1975లో ఎమర్జన్సీ కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వీధినపడి పరువు పోగొట్టుకున్న సందర్భంగా జగన్మోహన రెడ్డి వైస్ ఛాన్స్ లర్ గా వచ్చారు. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆయన్ను తెచ్చారు. అచిరకాలంలోనే యూనివర్సిటీ దారికొచ్చింది. అప్పుడే నాకు ఆయనతో పరిచయమైంది.

నా పిహెచ్.డి వ్యవహారంలో ఫిలాసఫీ శాఖాధిపతి వి. మధుసూదన రెడ్డి (అరవిందో భక్తుడు) ఆడిన నాటకం వలన, ఎన్నాళ్ళకూ డిగ్రీరాక, అదొక చర్చనీయాంశంగా మారిన రోజులవి. అప్పడు నన్ను యింటికి ఆహ్వానించి, జగన్మోహన రెడ్డి పూర్తి వివరాలు అడిగారు. అప్పటికే యీ విషయమై ఉన్నతాధికార విచారణ సంఘం వేశారు. దానికి భయపడి, మధుసూదన రెడ్డి రాజీనామా యిచ్చి, అరవిందాశ్రమానికి వెళ్ళారు!

అనేక సందర్భాలలో మేము కలుసుకుని చర్చలు చేశాం. నన్ను తరచు యింటికి ఆహ్వానించేవారు. కలసి భోజనం చేశాం. ఆయన పిసిని వాడనీ, నిన్నెలా పిలిచి భోజనం పెట్టారని అకడమిక్ స్టాఫ్ ఆశ్చర్యపడేవారు.

నా కోరికపై జగన్మోహనరెడ్డి రాడికల్ హ్యూమనిస్ట్ సభలకు, శిక్షణ శిబిరాలకు వచ్చి ఉపన్యాసాలిచ్చారు. ఎం.ఎం. తార్కుండే వచ్చినపుడు కూడా మేము కలిశాం.

జగన్మోహన రెడ్డి రచనలు కొన్ని నేను తెలుగు చేయగా తెలుగు అకాడమీ ప్రచురించింది.

ఉస్మానియా యూనివర్సిటీలో జి. రాంరెడ్డి వైస్ ఛాన్స్ లర్ గా చేసిన వ్యవహారాలన్నీ విచారణ సంఘం ద్వారా జగన్మోహన రెడ్డి బయటపెట్టారు. The University I served అని పుస్తకం రాశారు. నేనది తెనిగించాను. ఆ రచన తెలుగు యూనివర్సిటీ ప్రచురించవలసి ఉన్నది. కాని యింతలో వైస్ ఛాన్స్ లర్ మారి, సినారె (సి. నారాయణరెడ్డి వచ్చి ఆ ప్రచురణ ఆపారు.

జి. రాంరెడ్డి మరో విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉండడం, సినారే ఆయనకు బంధువు గావడం కారణం.

అయితే ఉదయం దిన పత్రిక ఆ పుస్తకంలో సంగతులకు సీరియల్ గా ప్రచురించింది. ఆప్తుడు గజ్జల మల్లారెడ్డి ఎడిటర్ గా వున్నారు.

ఓపెన్ యూనివర్సిటీ పై నేను తీవ్ర విమర్శ చేశాను. అది స్థాపించినప్పుడు వైస్ ఛాన్స్ లర్ గా వున్న రాంరెడ్డి తప్పుదారి పట్టించాడన్నాను. దానిపై రాంరెడ్డి బృందం నా పై ధ్వజమెత్తారు. కాని జగన్మోహన రెడ్డి నన్ను సమర్థించారు.

జగన్మోహనరెడ్డిగారంటే చాలా మందికి భయంవుండేది. ఆయన పెద్ద ఆస్తిపరుడనీ, పెద్ద రెడ్డి వంశం అనీ, ఉన్నత పదవులు అధిష్టించాడనీ – ఇలాంటి కారణాల వుండేది. ఏమైనా గానీ, మేమిరువురం అనూహ్యంగా, వయస్సుతో నిమిత్తం లేకుండా, దగ్గర వాళ్ళమయ్యాం. ఆయన కుమారులు పింగళి జయరాం (ఆర్థోపెడిక్ డాక్టర్) గౌతం (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి) కూడా దగ్గర మిత్రులయ్యారు. చివరి రోజులలో ఆయన వ్యాసాలు రచనలు నాకు చూపించి, సలహాలు అడిగేవారు. పద్మజానాయుడు, సరోజినీ నాయుడు మొదలైన వారితో తన పరిచయాలు, విదేశాలలో తన అనుభవాలు ఎన్నో చెప్పేవారు.

No comments: