Thursday, April 16, 2009

రచయిత్రి యంగ్ చాంగ్ తో చర్చలు

Jon Haliday,Jung Chang with Innaiah in Hyderabad


సుప్రసిద్ధ చైనా రచయిత్రి యంగ్ చాంగ్ రాసిన అడవిగాచిన వెన్నెల (వైల్డ్ స్వాన్స్) పుస్తకాన్ని చైనాలో నిషేధించారు. పాశ్చాత్య దేశాలలో అది విపరీతంగా పాఠకలోకాన్ని ఆకర్షించింది. అయితే యంగ్ చాంగ్ ను చైనా రావడానికి పోవడానికి ప్రభుత్వం అభ్యంతర పెట్టలేదు. ఆమె ఇంగ్లండులో జాన్ హాలిడే అనే బ్రిటిష్ చరిత్ర కారుణ్ణి పెళ్ళి చేసుకుని అక్కడే స్థిరపడింది. వారిరువురూ కలసి మావో అనే గ్రంథాన్ని అధునాతన చారిత్రక ఆధారాలతో వెలువరించారు. అదికూడా చైనాలో నిషిద్ధానికి గురయింది.
నా మిత్రుడు అట్లూరి అశోక్ ఇంగ్లండులో ఈ రచయితలను కలసి పుస్తకాల తెలుగు అనువాదానికి అనుమతి కోరగా వారు ఒప్పుకున్నారు. అశోక్ కోరికపై వెనిగళ్ళ కోమల (నా భార్య) అడవిగాచిన వెన్నెల పేరిట వైల్డ్ స్వాన్స్ ను తెనిగించింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సుప్రసిద్ధ ముస్లిం తిరుగుబాటు రచయిత్రి తస్లీమా నస్రీన్ హైదరాబాదు వచ్చి ఆగస్టు 9, 2007న ప్రెస్ క్లబ్ లో గ్రంథావిష్కరణ జరిపింది.
అడవిగాచిన వెన్నెల పెద్ద గ్రంథం. దానికి తెలుగులో చక్కని సమీక్షలు వచ్చాయి. రచయిత్రి యంగ్ చాంగ్, ఆమె భర్త జాన్ హాలిడే తరువాత హైదరాబాదు వచ్చారు. అక్షర పుస్తకాల షాపువారు కాకతీయ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో వెనిగళ్ల కోమల రచయిత్రిని పరిచయం చేసి గ్రంథాన్ని గురించి తెలిపింది. యంగ్ చాంగ్ తన చైనా అనుభవాలను వివరించింది.
తరువాత అశోక్ యింట్లో విందు సమావేశంలో నేను వారితో చర్చలు జరిపాను. అప్పుడు జాన్ హాలిడే నా రచనల విషయం, ఎమ్. ఎన్.రాయ్ పై పరిశోధనల సంగతులు తెలుసుకుని వాటిని తన రచనలలో ఉత్తరోత్తరా ప్రస్తావిస్తానని చెప్పారు. మాస్కోలో, చైనాలో ఎమ్.ఎన్.రాయ్ పాత్రలను గురించి రాస్తానన్నాడు. యంగ్ చాంగ్ కుటుంబీకులు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీతో, మావోతో సన్నిహిత సంబంధం గలవారు. ఆ కారణంగానే యంగ్ చాంగ్ జుగుప్స చెంది, మావో పట్ల కమ్యూనిస్టుల పట్ల అసహ్య భావాన్ని పెంచుకున్నారు. అవన్నీ రాసినందుకే చైనాలో ఆమె పుస్తకాన్ని భరించలేకపోయారు. ఆమె రాసింది వాస్తవమే అని తెలిసినా కమ్యూనిస్టు రాజకీయం వాటిని జీర్ణించుకోలేక పోయింది. యంగ్ చాంగ్, జాన్ హాలిడేలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, వారితో ముఖాముఖి చర్చలు చేయడం మంచి అనుభవం.

No comments: