Monday, January 14, 2008

సాహితీపరులతో సరసాలు -3


Gajjela Mallareddy

గజ్జల మల్లారెడ్డి
(1925-1997)

ఈనాడు దిన పత్రిక సంపాదక వర్గంలో పుణ్యభూమి శీర్షిక రాస్తున్న రోజులలో (1982) గజ్జల మల్లారెడ్డి పరిచయమయ్యారు. తెలుగు దేశం పార్టీ పెట్టి ఎన్.టి. రామారావు సుడిగాలి పర్యటన చేస్తున్న రోజులలో టంగుటూరి ప్రకాశంపై నా వ్యాసాన్ని గజ్జల మల్లారెడ్డి ఎడిటోరియల్ పేజీలో ప్రచురించారు. దానిపై వెయ్యి ఉత్తరాలు వచ్చాయని మల్లారెడ్డి చెప్పారు. అంతరియాక్షన్ అప్పట్లో సంచలనం కలిగించింది.
టంగుటూరి ప్రకాశం మద్రాసులో సైమన్ కమీషన్ పర్యటన సందర్భంగా, పోలీసుకు గుండీలు విప్పి గుండె చూపి కాల్చమన్నాడనే ప్రచారం నిజంకాదని రాశాను. శవాన్ని చూడడానికి వెడుతున్న ప్రకాశాన్ని పోలీస్ ఆపాడని మాత్రమే వాస్తవవిషయం. అది తన స్వీయచరిత్రలో ప్రకాశమే రాశారు. ఆయన ఆనుచరుడు తెన్నేటి విశ్వనాధం ఆమాటలే రాశాడు. అలాంటి వాస్తవాన్ని కప్పిపుచ్చి, హీరో ఆరాధన చేస్తూ, కట్టు కధను ప్రచారంలో పెట్టారు. అది కాదన్నందుకు గొడవ చేశారు. గజ్జల మల్లారెడ్డి నా పక్షానే నిలిచారు.
ఆ తరువాత, ఆయన ఉదయం దిన పత్రికకు వెళ్ళారు. అక్షింతలు శీర్షిక రాస్తుండగా, పింగళి జగన్ మోహనరెడ్డి (హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు జడ్జి) ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా తన అనుభవాలు ఇంగ్లీషులో రాశారు. దానిని ఆయన కోరికపై తెలుగు చేశాను. జి. రాంరెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా చేసిన అవకతవకల్ని అవినీతిని, అక్రమాలకు జగన్మోహన రెడ్డి ప్రమాణాలతో బయటపెట్టారు. అవి ప్రచురించాలా వద్దా అనే చర్చ ఉదయంలోరాగా, గజ్జల మల్లారెడ్డి పట్టుబట్టి సీరియల్ గా నా అనువాదాన్ని ప్రచురించారు.
తరువాత ఆంధ్రభూమిలో చురకలు శీర్షిక రాస్తూ, సంపాదకుడుగా వున్నారు.
1993 ప్రాంతాల్లో నేను కొన్ని గ్రంధాలను హైదరాబాద్ లోని బోట్ క్లబ్ కు బహుకరించారు. క్లబ్ లో ఒక లైబ్రరీ వుండాలని అలా చేశాను. అందుకు క్లబ్ వారు ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. గజ్జల మల్లారెడ్డి, సినీ నటుడు రావు గోపాలరావు సభలో నన్ను గురించి మాట్లాడారు. మల్లారెడ్డి చాలా సమాచారం సేకరించి, విశేషంగా ప్రసంగించారు.
గజ్జెల మల్లారెడ్డి కమ్యూనిస్టు పార్టీలో వుంటూ, రష్యా పర్యటన విశేషాలు చెప్పేవారు. పార్టీ నుండి బయటకు వచ్చి, పత్రికా రంగంలో స్థిరపడిపోయారు. కులతత్వం చూపాడనే విమర్శ వున్నది.
మల్లారెడ్డి రాతల్లోనే గాక, చేతల్లోనూ మాటకారి. ఘాటైన విమర్శలు చేసేవారు. మాటలు అనడం, అనిపించుకోవడం ఆయనకు అలవాటే.
గుంటూరు పొగాకు గూట్లో వుంటే ఏమిటి. నోట్లో వుంటే ఏమిటి. అనేవారు నిస్సార మైందనే అర్థంలో.
రామోజీరావు (ఈనాడు అధిపతి) ఆయన్ను ఎప్పుడూ కవిగారని పిలిచేవాడు.
గజ్జల మల్లారెడ్డి కొందరు కమ్యూనిస్టులనూ బాగా దెప్పి పొడిచేవారు. తాను పార్టీ నుండి బయటపడిన తరువాత, కాంగ్రెస్ పార్టీలో జనార్థన రెడ్డి ఎన్. కు తదితరులకు సన్నిహితుడయ్యాడు.
హిందీ, తెలుగు చదివిన మల్లారెడ్డి, ఇంగ్లీషు పట్టించుకోలేదు. విశాలాంద్ర వారపత్రికకు, 1970లో ఎడిటర్ గా, వీచిక మాస పత్రిక సంపాదకుడుగా వున్నారు.
రచనలు : శంఖారావం (1968), మాటకచేరీ (1991), రసపిపాసులు (1991), మల్లారెడ్డి గేయాలు (1963).
కడప జిల్లా అంకాలమ్మ గూడూరు నుండి హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

4 comments:

Anonymous said...

గజ్జెల మల్లారెడ్డి గారంటే ఈ కవిత గుర్తొచ్చింది .రాజీవు భజన చేసే వాళ్ళనుద్దేసించి అప్పట్లో వ్రాసారు. వెర్రిగా స్వాగతించటానికి వచ్చిన అంజయ్య తదితర భజనపరులని ఉద్దేశించి రాజీవ్ అన్న మాటల సందర్భాన్ని ఇలా చెప్పారు.


వచ్చాడు వచ్చాడు రాజీవుడొచ్చాడు.....
మామూలు ఎంపీకి మర్యాదలేమిటని
విస్తుపోయేటట్టి వెర్రికుంకల్లార!

మంచి పదునయిన కవితలు వ్రాసేవారు.

Saikrishna Budamgunta said...

చాలా బాగుందండి ఈ తెలుగు వెలుగుల గురించి తెలుసుకొవడం. మీరు మరియు మీ లాంటి ఇతర తెలుగు బ్లాగర్సు చేస్తున్న భాషా సేవని ఇలాగే కొనసాగించాలని కోరుతూ..

సాయిక్రిష్ణ

Rajendra Devarapalli said...

మల్లారెడ్డి గారు దమ్మపధాన్ని తెలుగులోకి అనువదించారు,జీవితచరమదశలో బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యారు అని విన్నాము.వివరించగలరు.

cbrao said...

@ రాజేంద్ర కుమార్ : మల్లారెడ్డి గారి దమ్మపధం గురించిన సమాచారం మా వద్ద లేదు.