Monday, February 4, 2008

సాహితీపరులతో సరసాలు -6


Alapati Ravindranath

ఆలపాటి రవీంద్రనాథ్
(1922-1996)
ఎన్ సై క్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్, విల్ డ్యురాంట్ హిస్టరీ ఆఫ్ సివిలిజేషన్ (12 సంపుటాలు) సాధారణంగా ఎక్కడ చూస్తాం? ప్రత్యేక గ్రంథాలయాలలో. కాని స్కూలు విద్యకూడా ముగించని ఆలపాటి రవీంద్రనాథ్ యింట్లో ఆ గ్రంథాలుండేవి. అంతేగాదు 40 సంవత్సరాల టైమ్ మాగజైన్ బౌండ్ వాల్యూమ్స్ లభించేవి. ఆరో తరగతిలో తురుమెళ్ళ స్కూలు (తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా) నుండి చదువుకు స్వస్తి పలికి, సొంతంగా ఆసక్తితో ఇంగ్లీషు, తెలుగు పఠనాశక్తి పెంచుకోవడం వ్యక్తి విశిష్టత.
1950 ప్రాంతాల్లో తెనాలి బోసు రోడ్లో, జ్యోతి ప్రెస్ లో కూర్చొని సిగరెట్టు కాలుస్తూ, సాయంత్రానికి పంచెతోనే, టెన్నిస్ ఆడిన రవీంధ్రనాధ్ ను చూచాను. నేను హైస్కూలు విద్యార్థినే. మా అన్న విజయరాజ కుమార్ వెంటవుండి, చూడడమే జ్ఞాపకం.
రవీంద్రనాథ్ అప్పటికే తెనాలి నుండి జ్యోతి పత్రిక నడిపారు. రేరాణి పత్రికతో
సెక్స్ ను, సైంటిఫిక్ గా చెప్పవచ్చని రుజువు చేశారు. ఉత్తరోత్తరా, చాలా ప్రముఖులుగా ఎదిగిన రచయిత లెందరో జ్యోతిలో రాశారు. సుప్రసిద్ధ సంచలనాత్మక, లైంగిక విద్య రచయిత చలం కథల్లో, ఎవరూ సాహసించని వాటిని రవీంద్రనాథ్ ప్రచురించారు. ఆనాటికి, యింకా ప్రజా బాహుళ్యంలోకి రాని, కుటుంబ నియంత్రణ విషయాల్ని, వెలుగులోకి తెచ్చారు. ఎం.ఎన్. రాయ్ మానవ వాద, శాస్త్రీయ ఆలోచనా ప్రభావంలో, అలాంటివి చేయగలిగారు. అప్పటికి ఆయన మాగజైనులు చదవడమే తప్ప, వ్యక్తిగత పరిచయ స్థాయికి రాలేదు.
1965 నుండీ హైదరాబాద్ లో రవీంద్రనాథ్, నేనూ కలసిన తరువాత, ఆయన చనిపోయే వరకూ అతుక్కు పోయిన స్నేహం మాది. మిసిమి పత్రిక పెట్టక ముందు కొన్నేళ్ళుగా అనేక సినిమాలకు వెళ్ళాం. జర్మన్, ఫ్రెంచి సినిమాలు హైదరాబాద్ మాక్స్ ముల్లర్ భవన్, సారధీ స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ లో చూచాం. ఏ సినిమా కూడా పూర్తిగా చూడకుండా సగంలో బయటకు వచ్చి, హాయిగా నాలుగు పెగ్గులతో కబుర్లు చెప్పుకున్నాం. చాలా విశిష్ట సమావేశాలకు వెళ్ళి ప్రసంగాలు విన్నాం. ఎడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాలలో, పార్కిన్ సన్ వంటి వారి ప్రసంగాలు ఆనందించాం. క్లబ్లో కూడా ఎం.ఆర్.పాయ్ (ఐ.ఎ.ఎస్), కేంద్రమంత్రిగా చేసిన కృష్ణ, తిక్కవరపు అనసూయ వంటి వారితో కబుర్లు ఎంజాయ్ చేశాం. రవీంద్రనాథ్ యింటి వద్ద సి.నారాయణ రెడ్డి, ఎ.బి.షా., సంజీవ దేవ్, జి. రాంరెడ్డి కంపెనీలో చర్చలు చేస్తూ, విస్కీ సేవిస్తూ, గడిపిన రోజులు వున్నాయి.
రవీంద్రనాథ్ దృష్టికి మంచి పుస్తకం తీసుకువస్తే తెప్పించే వాడు. ఎన్ కౌంటర్ ఇంగ్లీషు మాగజైన్ (స్టీవెన్ స్పెండర్, ఆడిన్ ఏడిటర్లు) తెప్పించారు. మా చర్చలకు అవి దోహదం చేశాయి.
రవీంద్రనాథ్ కు మరొక అలవాటు వుండేది. పండితులు, కవులు, రచయితలు తమ పుస్తకాలు అమ్మదలిస్తే, వెతుక్కుంటూ వెళ్ళి కొనుక్కొచ్చే వాళ్ళం. అరుదైన పుస్తకాలు అలా వచ్చి చేరాయి. అందులో సిలోన్ బౌద్ధం నుండి ఎన్నో వున్నాయి. ఉత్తరోత్తరా, మిసిమికి యివన్నీ పనిచేశాయి.
రవీంద్రనాథ్ నేనూ కలిసి మద్రాసు, బెంగుళూరు, సింధనూరు (పాపారావు వుండేచోట, ఆయన పత్తి విత్తనాల నిపుణుడు, ఎన్. జయప్రకాశ్ నారాయణ మామ) తదితర ప్రాంతాలకు వెళ్ళాం. మద్రాసులో డి. ఆంజనేయులు, పాలగుమ్మి పద్మరాజు వంటి వారిని కలిసే వాళ్ళం.
మానవ వాద పండితులు హైదరాబాద్ కు వస్తే, రవీంద్రనాథ్ కు పరిచయం చేశాను. అందులో శిబ్ నారాయణరే, వి.బి.కర్నిక్, జి.ఆర్.దల్వి, ఎ.బి.షా., వంటి వారున్నారు. హైదరాబాద్ పాత నగరంలో కొసరాజు సాంబశివరావు, పర్వతనేని కోటేశ్వరరావు, డి. శేషగిరిరావు లతో కలసి విందులు ఆరగిస్తూ చర్చలు చేసేవాళ్ళం.
సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్యను, ఒకనాడు డి. శేషగిరిరావు తన యింటికి ఉదయం ఆహ్వానించారు. నన్నూ, రవీంద్రనాథ్ నూ పిలిచారు. హైదరాబాద్ లో అమీర్ పేటలో వున్న యింట్లో కలశాం. అప్పటికి బసవపున్నయ్యతో నాకు పరిచయం లేదు. 1976లో యిది జరిగింది. బసవపున్నయ్య అనుకోకుండా నేను ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా “కారల్ మార్క్స్ కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం” వ్యాసాలు ప్రస్తావన తెచ్చారు.
డి. శేషగిరి రావు సస్పెన్స్ అట్టి పెట్టకుండా రాసిన ఇన్నయ్య మీ ఎదుటే వున్నాడన్నారు. కాసేపు వేడిగా మాటలు నడిచాయి. రవీంద్రనాథ్ లౌక్యంగా మాటమార్చారు. ఇంతకూ రాసింది తప్పు అనో, దోషాలున్నాయనో చెప్పలేదు. అదంతా ఎన్నడో జరిగిపోయిందిగదా, ఇప్పుడెందుకు రాశావు అన్నారు. ఎన్నడో తెలిస్తే మీ రెందుకు జనానికి చెప్పలేదని రవీంద్రనాథ్ అడిగారు. బసవ పున్నయ్య బుకాయింపు సెక్షన్ గలవాడు. ఆంధ్రజ్యోతి వారు నా వ్యాసాలకు జవాబు చెప్పమని ఆయన్ను అడిగితే దాటేశాడు. ఆ విషయం రవీంద్రనాథ్ కూ, నాకూ తెలుసు. నాటు కమ్యూనిస్టులు అంటూ రవీంద్రనాథ్ వారిని ఎద్దేవ చేస్తుండేవారు.
రవీంద్రనాథ్ వద్దకు వచ్చి, తమ అరుదైన పుస్తకాలు అచ్చు వేయించుకున్న వారిలో టంగుటూరి సూర్యకుమారి, కొప్పరపు సరోజని వున్నారు. “ప్రసారిత” అనే త్రైమాస, సామాజిక శాస్త్రాల పత్రికను, తెలుగులో పెడితే, రవీంద్రనాథ్, తన జ్యోతి ప్రెస్ ద్వారా, ఎంతో సహాయపడ్డారు.
నార్ల వెంకటేశ్వరరావు యింటికి వెళ్ళి మాట్లాడుకోవడం, మా యిరువురికే నిత్యకృత్యంగా వుండేది. నార్లకూ, కె.ఎల్. ఎన్. ప్రసాద్ కూ హోరా హోరిగా వ్యక్తిగత వ్యవహారాల పోరాటం జరిగినప్పుడు, రవీంద్రనాథ్ యిబ్బంది పడ్డారు. ఆయనకు యిరువురూ సన్నిహితులు కావడమే కారణం.
రాజకీయవాదులలో నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, రత్న సభాపతి, భవనం వెంకట్రాం బాగా తెలిసిన వారు. నేనూ, రవీంద్రనాథ్, భవనం వెంకట్రాం, యింట్లో కూర్చొని అనేక విషయాలు చర్చిస్తూ, విస్కీ తాగుతూ గడిపిన రోజులున్నాయి. రవీంద్రనాథ్ 1955 నుండీ పాఠ్య గ్రంథాల ముద్రణ వ్యాపారంలో వున్నందున, మద్రాసు విద్యాధికారులతో సంబంధాలు పెట్టుకున్నారు. అది కొంతకాలం హైదరాబాద్ లో కొనసాగింది. తెలుగు అకాడమీ అధికారులతో బాగా సన్నిహితంగా వుండేవారు. బూదరాజు రాధాకృష్ణ, తాళ్ళూరి నాగేశ్వరరావు, వెంకారెడ్డి మొదలైన వారం తా, ఆయనతో కలిసేవారు.
హైకోర్టు జడ్జీలలోనూ, మా ఉభయులకూ కొందరు, మేధాపరంగా దగ్గరయ్యారు. అందులో ఆవుల సాంబశివరావు, ఆమంచర్ల గంగాధర రావు, ఓ చిన్నప రెడ్డి, జయచంద్రా రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రభృతులున్నారు. రవీంద్రనాథ్ కు భిన్న సర్కిల్స్ వున్నాయి. అదే ఆయనకు మెదడు మేత గానూ ఉపయోగపడింది. ప్రింటర్స్ అసోసియేషన్, టెన్నిస్ ఆట, గుర్రపు పందాలు, పుస్తక ప్రచురణ, యిత్యాదుల వలన క్రాస్ సెక్షన్ తో కలిశారు.
పరిమితంగా రేడియో చర్చలలో రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఇంతా చేస్తే ఆయన రాసింది స్వల్పం. రాయించింది చాలా అధికం. చదివింది ఎక్కువే. ఇతరులకు చెప్పి, చదివించేవారు కూడా.
ఇంత నేపధ్యంలో చివరి దశాబ్దంలో మిసిమి పత్రిక పెట్టి దానితో తాదాత్మ్యం చెంది, విశిష్టంగా, తన ముద్ర వేశారు. నిర్మొహమాటంగా, వాసిరెడ్డి సీతాదేవి వంటి వారి రచనలు నిరాకరించారు. పెద్దవాళ్ళ రచనల్ని తిరగరాయించారు. కొత్త భావాలు చెప్పి, నూతన ఫక్కీలో, పురాణం సుబ్రహ్మణ్యశర్మ వంటి వారి మేధస్సును వాడుకున్నారు. మిసిమిలో నేను ఆది నుండీ రాశాను. నా వ్యాసాలు సెన్సార్ లేకుండా వేయడం, రవీంద్రనాథ్ అభిమానం వలన కాదు. మిసిమి సంగతి తెలిసి రాసినందు వలన.
చదివించేటట్లు రాయాలని రవీంద్రనాథ్ నొక్కి చెప్పేవాడు. ఆయనలో వున్న గొప్ప గుణం చదివింది, ఇంపుగా సొంపుగా చెప్పగలగడం. ఆయన ఆస్తిగా జ్యోతి, రేరాణి, మిసిమి మిగిలాయి.
హైదరాబాద్ లో రవీంద్రనాథ్, నేనూ తరచు కలసి, చర్చించిన వారిలో మామిడిపూడి వెంకట రంగయ్య, అబ్బూరి రామకృష్ణారావు, డి.వి. నరసరాజు వున్నారు. అదొక వినూత్న అనుభవం.
సాహిత్య రుచులు, లోతుపాతులు చవిచూచిన రవీంద్రనాథ్ శాఖాహారి, కాని అతిధులకు రుచికరంగా మాంసాహారం చేయించేవాడు. విజయవాడ లీలామహల్ యజమాని బాజీ దగ్గర, చెన్నుపాటి, కృష్ణమూర్తి (బుజ్జులు) కంపెనీలో వంటలు అనుభవిస్తూ, సాహితీ కబుర్లు చెప్పుకోవడం రవీంద్రనాథ్ ప్రత్యేకత.
సాహితీ పరులతో ఏ స్థాయిలోనైనా చర్చించగలగడం రవీంద్రనాథ్ కే చెల్లింది. బహిరంగ సభల జోలికి వెళ్ళేవాడు కాదు. ఆయన రాయని రవీంద్రనాథ్. రాయించిన రవీంద్రనాథ్ నడిపిన పత్రికలు :
జ్యోతి - తెనాలి 1946 - పక్షపత్రిక
రేరాణి - తెనాలి 1946 - పక్ష పత్రిక
మిసిమి (హైదరాబాద్) మాస పత్రిక


While Justice Gangadhararao Amancharla, released, commemorative issue, on late Ravindranath, Innaiah presided over the meeting.

1 comment:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఇన్నయ్య గారికి,ఒక అద్భుతమైన మనీషి గురించి ఎంతో బాగా చెప్పారు.జనం మరచిన జర్నలిష్టులు శీర్షికతో ఒక కాలం లాంటిది మిసిమిలో ప్ర్రారంభించి రవీంద్రగారి మరణం తో ఇద్దరితో ఆపెసాను.ఆయన రాసిన ఉత్తరాలు దాచుకున్నా.నారచనా జీవితంలో ఆయన స్మృతి అజరామరం,నిజమైన పాఠకుడు రవీంద్ర గారు