Monday, February 11, 2008

సాహితీపరులతో సరసాలు -7


Konduri Veeraraghavacharyulu

కొండూరి వీర రాఘవాచార్యులు
(1912-1995)

సింహం గడ్డి మేస్తుందా అని కొండూరు వారి ఉవాచ. తెనాలి వి.ఎస్.ఆర్. కాలేజీలో తెలుగు పండితులుగా వుండగా, నాన్ డిటైల్డ్ చెప్పమంటే, కేసరి జీర్మ తృణము మేయునే అనేవారు.
ఆవుల గోపాలకృష్ణమూర్తి యింటికి ఎప్పుడూ వస్తూ పోతుండడం వలన కొండూరుతో నాకూ పరిచయం అయింది. ఆవుల అన్ని భావాలుగల కవుల్ని, పండితుల్ని ఎలా ఆకర్షించారో నాకు తెలియదు. ఆవుల మానవ వాద, నాస్తిక భావాలకు కొండూరుకు ఎక్కడా పొత్తులేదు. కాని శిల్పం, కవితలు వారిరువురి సాధారణ స్నేహబంధాలు. పైగా మానవ సంబంధం కూడా.
నేను కలసినప్పుడు ఆప్యాయంగా పలకరించడం, వివిధ అంశాలు మాట్లాడడం మా పరిచయానికి దోహదం చేసింది. వయస్సులో నాకంటే ఎంతో పెద్ద వారైనా, ప్రేమగా మాట్లాడి ఆకట్టుకునేవారు.
ఆవుల వారు భాషా పరంగా కొండూరుతో సంభాషిస్తుంటే ఆసక్తి దాయకంగా వుండేది. ఉత్తరోత్తరా కొండూరు మనవడు ప్రపుల్ల చంద్ తో పరిచయమైనప్పుడు, ఆయన తాతగారి గురించి సమాచారం సేకరిస్తుండేవాడిని. ఆవులకు శిల్పం పట్ల ఆసక్తి వుండేది. అందలి లోతు పాతుల గురించి కొండూరుతో సంభాషించడం కద్దు.
1939లో మైసూరు మహారాజా సత్కారాలు పొందిన కొండూరుకు, అంతకు ముందటేడు, అయోధ్య సంస్కృత పరిషత్, విద్వాధురీణ ప్రసాదించింది. గుంటూరు, తెనాలి, కావలి, బుచ్చిరెడ్డి పాలెం, సత్తెన పల్లిలో పనిచేసిన కొండూరు చివరకు తెనాలి వి.ఎస్.ఆర్. కళాశాలలో కుదురుకున్నారు.
కావ్యాలు, తత్వ పరిశీలన, శిల్పం గురించి రాశారు. ప్రసంగాలు చేశారు. రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆంధ్రయూనివర్శిటీ నుండి కళా ప్రపూర్ణ గౌరవం పొందారు.
రచనలు : ఆసియా జ్యోతులు (జీవితాల), సిద్ధప్ప చరిత్ర, మన గురుదేవుడు (వీరబ్రహేంద్ర), వడ్డేపాటి నిరంజనశాస్త్రి చరిత్ర, మిత్ర సహిస్రి (ఆట వెలదులు), అమరావతి, తోరణం (ఖండకావ్యం), విమర్శలు, వ్యాసాలు, కళారాధన (నవల), లేపాక్షి (నవల), మోహనాంగి (నవల), శిల్ప దర్శనం, శిల్ప కళాక్షేత్రాలు, ఆత్మ, యోగ, రుగ్వేద, యజుర్వేద, అదర్వవేద దర్శన రచనలు. తత్వసాధన, తత్వ సూక్తులు, విశ్వకర్మాష్టకం, వీరబ్రహ్మసుప్రభాతం, విశ్వకర్మ పురాణం, గాయత్రీ విశ్వకర్మలు, విశ్వ స్వరూపం.

1 comment:

షణ్ముఖన్ said...

కొండూరి వారి అబ్బాయి ఫోన్ నంబరు ఇస్తారా? వారి గురించి wikipedia లో రాద్దామనుకుంటున్నాను..