Monday, February 25, 2008

సాహితీపరులతో సరసాలు -9


Mamidipudi Venkata Rangayya

State Book Club అనే సంస్థ వారు సంజీవదేవ్ పుస్తకాలను వెలికి తెచ్చారు.అనేక సాహిత్య కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు నిర్వహించారు.ప్రముఖుల ప్రసంగాలు చేయించారు. ఇలాంటి ఒక సమావేశం లో మాట్లాడుతున్న శ్రీ మామిడిపూడి ని చిత్రంలో చూడవచ్చు.

మామిడిపూడి వెంకట రంగయ్య
(1889-1982)

ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం అనే తెలుగు గ్రంథాన్ని నేనూ, మామిడిపూడి వెంకటరంగయ్య జాయింట్ రచయితలుగా రాశాం. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా, సర్వీస్ కమీషన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. 40 ఏళ్ళ వయస్సు తేడా గల రంగయ్యగారూ నేనూ కలసి గ్రంథం రాయడానికి అంగీకరించడం వారి ఔన్నత్యానికి నిదర్శనం. గ్రంధం రాయమని సరోజని రేగాని (ఆర్కైవ్ డైరెక్ట ర్, చరిత్ర ప్రొఫెసర్) అడిగారు. ఇద్దరం ఒప్పుకున్నాం. మీరు రాయండి, నేను సరిదిద్దుతాను అని రంగయ్యగారన్నారు. ఇంగ్లీషులో 4 సంపుటాలు పరిష్కరించి రంగయ్యగారు అప్పటికే వెలువరించారు.
తెలుగు పుస్తకాన్ని రంగయ్య గారి కోరికపై నేను రాశాను. ఆచార్య రంగా రాజకీయ పాఠశాలలో 1938 నాటికే స్థాపించి, కృషి చేసిన వివరాలు చేర్చాను. రంగయ్యగారు సంతోషించి, ఇంగ్లీషులో ఆ విషయాలు తాను రాయకపోవడం లోపంగా భావించారు.
వెంకట రంగయ్య గారిని తొలుత నాకు పరిచయం చేసిన వారు మిత్రులు కొల్లూరి కోటేశ్వరరావు (తెలుగు విద్యార్థి మాస పత్రిక ఎడిటర్) ఆ పత్రికలో వెంకటరంగయ్యగారూ, నేనూ ధారాళంగా ఎన్నో రాశాం. నేను వెంకట రంగయ్య గారిని ఇంటర్వ్యూ చేశాను కూడా.
క్రమేణా వెంకటరంగయ్య గారి కి నేను సన్నిహితుడనయ్యాను. ఆయన బ్రహ్మానందరెడ్డి (ముఖ్యమంత్రి)కి సన్నిహితులు. అయితే 1968-69లో ఆంధ్రజ్యోతి దిన పత్రికను దృష్టిలో పెట్టుకుని, ప్రెస్ బిల్ అసెంబ్లీలో బ్రహ్మానందరెడ్డి తెచ్చారు. పత్రికా స్వేచ్ఛను హరించే ఆ బిల్లును వ్యతిరేకిస్తూ, ఆందోళనలో భాగంగా మీటింగ్ పెట్టాం. వెంకట రంగయ్య గారిని పిలిచి, హైదరాబాద్ వై. ఐ.ఎం.ఎస్. హాలు (సుల్తాన్ బజార్)లో మీటింగ్ పెట్టాం. వెంకట రంగయ్యగారు తీవ్రంగా బిల్లును విమర్శించారు. జర్నలిస్ట్ నాయకులు సీతారాం (యు.న్.ఐ), జి. రామారావు (ఆంధ్రజ్యోతి), కృష్ణ (UNI) పతాక శీర్షికతో మా సమావేశ వార్తల్ని, దేశం దృష్టికి తీసుకెళ్ళారు. బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ బిల్ ను మూలబెట్టేశారు; సెలక్ట్ కమిటీకి పంపి.
వెంకట రంగయ్య గారు నేనూ చాలా విషయాలు చర్చించుకునేవారం. అంత పెద్దవాడైనా, చర్చలో ఎదుట వ్యక్తి నోరు విప్పితే, ఆయన మౌనంగా వినేవారు. అది చాలా మంచి లక్షణం. చివరి రోజులలో మంచం మీద పడుకునే రాసేవారు, చదివే వారు. మరొకరికి డిక్టేట్ చేసే అలవాటు లేదనేవారు.
విమాన ప్రయాణం అంటే ఆయనకు భయం. రైల్లోనే ప్రయాణించేవారు. ఐజాక్ అసిమోవ్ ఈ విషయంలో గుర్తుకు వస్తారు!వెంకట రంగయ్య గారి మనుమరాలు శాంత పెళ్ళి విషయంలో మాయిరువురికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. శాంత హైదరాబాద్ యూనివర్శిటీలో చదువుతూ, రాజ్యం సిన్హ కుమారుడిని ప్రేమించి పెళ్ళికి తలపడింది. అది కుటుంబానికి యిష్టంగాలేదు. ఇందుకు ఒక కారణం కులం. శ్రీమతి రాజ్యం (కాబోయే అత్తగారు) కమ్మకులం. ఆమె భర్త సిన్హ స్వాతంత్ర్య సమరయోధుడుగా, ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చి, రాజమండ్రి జైలులో వున్నాడు. ఆచార్య రంగా మాట్లాడి రాజ్యం-సిన్హా పెళ్ళికి కారకుడయ్యాడు. వారి కుమారుడిని శాంత పెళ్ళి చేసుకున్నది. నేను శాంతను సమర్ధించాను. వెంకట రంగయ్య గారికి అది నచ్చలేదు. పోలీస్ ఫిర్యాదు వరకూ వెళ్ళారు. శాంత రహస్యంగా పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ మేము బాగానే మాట్లాడుకున్నాం.
వెంకట రంగయ్య గారి జన్మదినోత్సవం, ఒకసారి ఆంధ్రమహిళా సభ (హైదరాబాద్)లో జరిగింది. అనుకోకుండా ఆ సభకు దేవులపల్లి కృష్ణశాస్త్రి వచ్చి, రంగయ్య గారి పాదపూజ చేసి, గురుపూజగా ప్రకటించారు. ఆ తరువాత వెంకట రంగయ్య నాతో చెబుతూ, కృష్ణశాస్త్రి నాకు విజయనగరంలో విద్యార్థిని అంటాడు. అలాంటి దాఖలాలు లేవు అన్నారు నవ్వుతూ.
వెంకట రంగయ్య గారు చరిత్ర, రాజకీయ గ్రంథాలు ఇంగ్లీషు, తెలుగులో రాశారు. ప్రమాణ పత్రికలలో వ్యాసాలు, వ్యాఖ్యాన సహితంగా ప్రచురించారు. వాదోపవాదాల్లో పాల్గొన్నారు. వివిధ కళాశాలలో, బొంబాయి యూనివర్సిటీ, మద్రాసు పచ్చియప్పలో పనిచేశారు. ఇంగ్లీషు, తెలుగు, తమిళం మాట్లాడేవారు. నేనూ ప్రొఫెసర్ కె. శేషాద్రి కలసినప్పుడు, నెల్లూరు కబుర్లు ఎన్నో చెప్పేవారు.


న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు ప్రసంగిస్తున్న మరో సమావేశం లో, ఇన్నయ్య, మామిడిపూడి గార్లను వేదికపై చూడవచ్చు.

స్టేట్ బుక్ క్లబ్ అనే సంస్థను పెట్టి, వెంకటరంగయ్య గారిచే ఉపన్యాసాలిప్పించాం. కె.బి. సత్యనారాయణ (బుక్ లింక్స్), పి. సత్యనారాయణ, నేనూ కలసి వెంకట రంగయ్య గారి వాయిస్ రికార్టు చేస్తూ, అనేక విశేషాలు చెప్పించాం.
రచనలు :
ఇంగ్లీషు : మద్రాసులో స్థానిక పన్నులు (1925), మద్రాసులో స్థానిక స్వపరిపాలన సంస్థలు, ప్రభుత్వ సమాఖ్య వ్యవస్థ. హిందూ దేశ చరిత్ర, ఆంధ్రలో స్వాతంత్ర సమరం (4 సంపుటాల ఎడిటెడ్), రాజ్యాంగ పరిషత్తు ఆవశ్యకత, భారత రాజ్యాంగ ముసాయిదా, విజ్ఞాన సర్వస్వంలో చరిత్ర, రాజనీతి, ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్.

No comments: