Monday, April 7, 2008
సాహితీ పరులతో సరసాలు-16 Gokulchand
త్రిపురనేని గోకుల్ చంద్
(1923-1978)
ఒక నాటికలో యీ డైలాగ్ లు గమనించండి.
“మానవత్వానికి జ్ఞానం ఎంత అవసరమో, దయాదాక్షిణ్యం, జాలి అంతే అవసరం”
వెంకట్ : చివరికి ఆడదాని మెడలో మంగళసూత్రం కట్టడం కూడా తప్పేనన్న మాట?
అమ్మాయి : తప్పు కాకపోతే మొగవాళ్ళు కూడా ఎందుకు కట్టుకోరు? స్త్రీ పురుషుల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన వివాహాలకు అంత తతంగం, అంత మంది ఎదుట ప్రమాణాలూ దేనికి? మీలో స్త్రీ పురుషులకి వొకరి నైతిక ప్రవర్తన మీద ఇంకొకరికి నమ్మకం లేదు. అందుకనే పెద్దలకీ సంఘాలకీ కట్టబెట్టి యీ భయంతో నైనా అణగి వుండడం ఆశిస్తున్నారు.
1947లో అపశ్రుతులు పేరిట వెలువడిన నాటికలో అలా వుంది.
త్రిపురనేని రామస్వామి రెండవ కుమారుడు గోకుల్ చంద్. తండ్రి చనిపోయిన 5 సంవత్సరాలకి రేడియో నాటికలు రాశారు. కరువు రోజులు, భగ్న హృదయాలు అనే నాటికలు నాడు ప్రజాసాహిత్య పరిషత్తు వారు కోగంటి రాధాకృష్ణ మూర్తి గారి ఆధ్వర్యాన వెలువరించారు.
అప్పటికే త్రిపురనేని రామస్వామి వివాహవిధి రాసి, అనేక వివాహాలు జరిపించారు. అందులో సంస్కృతంతో నిమిత్తం లేకుండా అందరికీ అర్థమయ్యే తెలుగులో పెళ్ళిళ్ళు జరిపించారు. పురోహితులుగా ఎవరైనా వుండొచ్చన్నారు. ఆనాడు అది పెద్ద మార్పు. సంప్రదాయ సమాజంపై ఎదురీత.
అలాంటి ప్రభావంలో గోకుల్ చంద్ యీ నాటికలు రాశాడు. తండ్రి ప్రభావం బాగా వున్నదని స్పష్టపడింది. అప్పటికి గోకుల్ చంద్ వయస్సు 24. మరో వైపు చలం సాహిత్యం, రాడికల్ హ్యుమనిస్టు ప్రభావం కూడా గోకుల్ చంద్ పై వున్నది.
గోకుల్ చంద్ నాకు సన్నిహిత మిత్రుడు. ఆయన చివరి 15 సంవత్సరాలు మేము కలసి మెలసి సంభాషించుకున్నాం. గోపీచంద్ తో పోల్చి చూస్తే యీయనకు ప్రచారం తక్కువ. రచనలు కూడా పరిమితమే. అడపదడప పత్రికలలో రాయడం, మిత్రులతో చర్చలు సాగించడం ఆనవాయితీగా వుండేది.
తమిళనాడులో పెరియార్ ఉద్యమ ప్రభావం త్రిపురనేని రామస్వామిపై వున్నట్లే గోకుల్ చంద్ పై కూడా వుంది. 1960 ప్రాంతాల్లో అన్నాదొరై తెనాలి రాగా, నాటి సమావేశాల్లో గోకుల్ చంద్ చురుకుగా పాల్గొన్నారు.
బెంగాల్ లో తీవ్ర కరువు వచ్చి ఎందరో చనిపోగా చలించిన గోకుల్ చంద్, కరువు రోజులు నాటిక రాశారు. ఆలిండియా రేడియో దీనిని ప్రసారం చేసింది.
కాకినాడ కాంగ్రెస్ మహాసభలు జరిగిన సంవత్సరం, కృష్ణాష్టమినాడు జన్మించినట్లు చెబుతుండేవారు. గోకుల్ చంద్, కోనేరు కుటుంబరావు, ఆలూరి భుజంగరావు, ఎం.వి. రామమూర్తి, నేనూ అప్పుడప్పుడూ చర్చలలో కాలక్షేపం చేసేవాళ్ళం.
విజయవాడలో అశోక్ ఆటో మొబైల్స్ షాపు నడిపిన గోకుల్ చంద్, రోజూ అక్కడే చర్చా సమావేశాలు జరిపేవారు.
సమకాలీన విషయాలపై బాగా స్పందించే వాడు సాహిత్యం విరివిగా చదివేవారు. సంభాషణశీలి. స్వేచ్ఛా న్వేషి.
గోపీ చంద్ వలె దిగజారకుండా, అరవిందుడి భక్తి రసంలో మునిగితేలకుండా చివరి వరకూ గోకుల్ వివేచనా పధంలో వున్నారు.
దేశంలో ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి పేరిట స్వేచ్ఛను కాలరాసినప్పుడు గోకుల్ చంద్ తీవ్రంగా స్పందించారు. మల్లాది రామమూర్తి ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడుతూ, రహశ్య జీవనం గడపవలసి వస్తే, కొన్నాళ్ళు గోకుల్ చంద్ ఆశ్రయం యిచ్చి దాచి పెట్టారు.
తెనాలి భావపునర్వికాస కేంద్రంగా వున్న రోజులలో గోకుల్ చంద్ చురుకుగా వున్నారు. తన నాటికల్ని హిందీ పండిత్ నన్నపనేని సుబ్బారావుకు అంకితం యిచ్చారు.
విజయవాడనుండి వెలువడిన చార్వాక పత్రికను ప్రోత్సహించారు. కాళీపట్నం రామారావు నాడు దిన పత్రికలలో గోకుల్ చంద్ పై వ్యాసాలు రాశారు.
1978 నాటికే గోకుల్ చంద్ హైదరాబాద్ లో చనిపోయారు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
గోపీ చంద్ గురించె ఇప్పటి వరకూ తెలుసు.
ఈ గోకుల్ చంద్ గురించి కొత్తగా తెలుసుకొన్నాను.
ఆధునిక కవిత్ర్వంలో మెరుపులా మెరసి మాయమయిన త్రిపుర నేని శ్రీనివాస్ ఎవరు. రహస్యోద్యమము తరువాత అతని సాహిత్రం ఏమిటి అవకాసం ఉంటే తెలుపగలరు.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Post a Comment