PORTRAITS by Edward Shils. Introduction, edited Joseph Epstein, The University of Chicago Press, London & Chicago, PP 255.
ఒకసారి మనదేశం నుండి ఒకాయన “ఎడ్వర్డ్ షిల్స్, సోషల్ సైంటిస్ట్, ఇంగ్లండ్” అని ఉత్తరం, రాస్తే అది చేరింది. ఇది బ్రిటిష్ పోస్టల్ విధానపు గొప్పతనం చాటుతుండగా, ఎడ్వర్డ్ షిల్స్ ఖ్యాతిని కూడా చూపుతున్నది.
సోషియాలజి అంటే కొద్దో గొప్పో తెలిసిన ప్రతివారికీ ఎడ్వర్డ్ షిల్స్ పరిచయమే. ప్రపంచ మేధావుల గురించి రాసిన షిల్స్, తానూ ఆ కోవలోని వాడే. అతని పుస్తకం :

10 మంది మేధావుల గురించి ఎడ్వర్డ్ షిల్స్ రాసిన వ్యాసాలను ఎంపిక చేసి, ఆయన మరణానంతరం ప్రచురించారు. 1995 జనవరి 23న షిల్స్ 84వ ఏట కాన్సర్ తో చికాగోలో మరణించాడు. అమెరికన్ స్కాలర్ అనే మేధావుల ప్రతిక సంపాదకుడు జోసెఫ్ ఎఫ్ స్టైన్, షిల్స్ గురించి సుదీర్ఘ పీఠిక రాసి, ఆసక్తికరంగా అందించారు.
మనదేశం నుండి నీరద్ చౌదరి మాత్రమే యిందులో వుండగా, మిగిలిన వారు రేమండ్ ఆరన్, సిడ్నీ హుక్, రాబర్డ్ మేనార్క్ హచిన్స్, లె పోల్డ్ లబెజ్, హెరాల్డ్ లా స్కీ, కార్ల్ మన్ హం, అర్నాల్డొ డాంటెమొమిగ్లి యానో, జాన్ యు, నెఫ్, లియోజి లార్డ్ వున్నారు. షిల్స్ రాసిన మేధావుల పీఠిక కూడా వుంది.
ఎడ్వర్డ్ షిల్స్ మన దేశ మేధావులకు సుపరిచితుడు. 1956 నుండి 57 వరకు ఇండియాలో గడిపిన షిల్స్, ఆ తరువాత యేటా ఒకసారి వచ్చి వెడుతుండేవాడు 1967 వరకూ. అప్పుడే ఒకసారి బొంబాయిలో 1964లో ఎ.బి. షా తో ఆయన్ను కలిశాను. మినర్వా అనే పత్రిక నిర్వహించిన షిల్స్ అనేక రచనలు చేశాడు. ఎన్ కౌంటర్ ఇంగ్లీషు మాసపత్రికలో రాశాడు. The Bulletion of the Atomic Scientists అనేది కూడా లియోజి లార్డ్ తో కలసి నిర్వహించాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, క్రేంబ్రిడ్జి, చికాగో యూనివర్శిటీలలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎడ్వర్డ్ షిల్స్ కు సమకాలీన ప్రపంచ మేధావులతో సన్నిహిత పరిచయం వుంది. భారత మేధావుల గురించి ఒక పెద్ద వ్యాసం రాశాడు, అలాగే యూరోప్ మేధావుల గురించి కూడా.
ఆర్నాల్డొ మొమిగ్లియానో (Amaldo Momigliano)ను తన గురువుగా షిల్స్ భావించాడు. ఆయన మెచ్చుకున్న మేధావులలో ఎ.ఎస్. నయపాల్, ఫిలిప్ లార్కిన్, పీటర్ బ్రౌన్, అలెగ్జాండర్ సోల్జినిట్సిన్, బార్చగాహి ఇ.హెచ్. గోంబ్రిక్, ఎలికెడోరి వున్నారు.
రేడియో, టి.వి. సైతం వాడకుండా, న్యూయార్క్ టైమ్స్ కే పరిమితమైన ఎడ్వర్డ్ షిల్స్, సాహిత్యం ద్వారా సోషియాలజిలోకి వచ్చిన మేధావి, ఆయన రచనలు ప్రామాణికంగా ఉన్నత స్థాయిలో వుండేవి.
చికాగో విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు ఎంత వున్నతస్థాయి పరిశోధన, పరిశీలన, బోధన కొనసాగిందో షిల్ప్ పీఠికలో అవగాహన అవుతుంది. హెరాల్డ్ లాసెవెల్, టాల్కాట్ పార్సన్స్, రాబర్డ్ పార్క్, ఫ్రాంక్ నైట్ వంటి వారు ఉద్దండులుగా వున్న యూనివర్శిటీలో షిల్స్ రాటు తేలాడు. వారి సహచర్యం, బోధనా పటిమలు స్ఫురణకు తెచ్చుకొని, ప్రస్తుతించాడు. కాని ఎక్కడా అతిశయోక్తి, భట్రాజీయం కనిపించదు. షిల్స్ అంచనాలు మాత్రం ఆకర్షణీయంగా వున్నాయి. లూయిస్ విర్త్ (Louise Wirth) తనపై చూపిన ప్రభావాన్ని షిల్స్ వివరించాడు.
జాన్ నెఫ్ నాడు చికాగో విశ్వ విద్యాలయంలో పేరొందిన ఆర్థిక శాస్త్రవేత్త, అతని లెక్చర్స్ కూడా షిల్స్ విన్నాడు. అప్పటికే మాక్స్ వెబర్, ఎమిలిడర్క్ హైగెల సోషియాలజీతో ప్రభావితుడైన షిల్స్ చికాగో వాతావరణంలో పైస్థాయికి ఎదిగాడు. ఆ పరిస్థితులు నేడు మారిపోయాయని, ఫెడరల్ ప్రభుత్వ యిష్టాయిష్టాలపై వుండడం, నిధులకోసం ట్రస్ట్రీలపై ఆధారపడడం, గిరిగీసుకొని గూడుకట్టుకొని ముడుచుక పోవడం నేడు స్పష్టంగా వున్నదనీ షిల్స్ విచారం వ్యక్తపరిచాడు. నేటికీ చికాగోలో ఉన్నతస్థాయి విద్యావాతావరణం వున్నదననే వారితో షిల్స్ అంగీకరించలేక పోయాడు. తరాల అంతరం కనిపిస్తున్నదన్నాడు. షిల్స్. ఒక్కొక్క వ్యక్తినీ కూలంకషంగా పరిశీలించిన వ్యాసాలు వున్నాయి.
నీరద్ సి ఛౌదరి : షిల్స్ చిత్రణలో ఒక భారతీయ మేధావి నీరద్ ఛౌదరి చోటు చేసుకున్నాడు. ఆ విధంగా ప్రపంచ మేధావుల కోవలో నీరద్ ఛౌదరి నిలబడ్డాడు. షిల్స్ కు బాగా పరిచితుడు, యిష్టుడైన మరొక భారతీయ నవలాకారుడు ఆర్.కె. నారాయణ.

1921లో కలకత్తా యూనివర్శిటీలో డిగ్రీ పొందలేక, వదిలేసిన నీరద్ ఛౌదరి ఆలిండియా రేడియోలో వుద్యోగం చేస్తూ పదవీ విరమణానంతరం ఇంగ్లాండ్ ప్రవాసం వెళ్ళాడు. రచయితగా భారతదేశంలో పేరున్నా బ్రతకడానికి తగిన ఆధారవృత్తి కాలేదు. అందుకని భార్య ప్రోత్సహంతో దేశాంతరం తరలి, పెద్ద పేరు పొందాడు. కాని దేశాన్ని ప్రేమించడం మానలేదు. ఆయన నిశిత పరిశీలన, విమర్శ చాలా మందికి నచ్చకపోయినా, అలాగే చెప్పదలచింది నిర్మొహమాటంగా రాశాడు. గాంధీజీ పట్ల తీవ్ర విమర్శ చేస్తూ, దేశాన్ని వెనక్కు నడిపించే ఆయన ధోరణిని దుయ్యబట్టాడు. ఆయన రచనలలో ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏన్ అన్ నోన్ ఇండియన్, ది హేండ్ గ్రేట్ అనార్క్ అనే రెండూ గొప్పవని షిల్స్ పేర్కొన్నాడు. భారత సమాజం, పాశ్చాత్య భావాలతో సంబంధం అనేవి ఛౌదరి దృష్టిని బాగా ఆకట్టుకున్నాయి. 50 సంవత్సరాల ప్రాయంలో తొలిరచన ప్రచురించిన ఛౌదరి. ది ఇండియన్ ఇంటలెక్చువల్, హిందూయిజం కాంటినెంట్ ఆఫ్ సర్సి, క్లైవ్, మాక్స్ ముల్లర్ గురించి రాశాడు.
భారతీయుడుగా, బెంగాలీగా, యూరోప్ వాసిగా, స్పందించిన ఛౌదరి, విశిష్ట రచయితగానే నిలిచాడు. ప్రపంచ పౌరుడుగా పరిణమించాడు.
పొట్టిగా, బక్కపలచగా వుండే ఛౌదరి, ఎంతో ఆత్మ విశ్వాసంతో, నిబ్బరంగా రచన సాగించి తన జ్ఞాన పరిధిని విస్తరించి, ప్రతిభచూపాడని షిల్స్ రాశాడు. ఇంగ్లండ్ లో స్థిరపడినా ఇండియాను వదలని రచయిత ఛౌదరి, భారతదేశ విభజన పట్ల కూడా ఆయన బాధతో రచన చేసి Thy Handలో చూపాడు.
1955లో తొలుత యూరోప్ వెళ్ళిన ఛౌదరి అట్టే ప్రయాణం చేయని రచయిత, అంతవరకూ కలకత్తాలోనే గడిపిన ఛౌదరి, ప్రపంచాన్ని ఎంతో సన్నిహితంగా చూచాడని షిల్స్ అన్నాడు. బ్రహ్మసమాజ ప్రభావితుడైన ఛౌదరి, ఉదారవాది.
ఛౌదరి ఇంగ్లీషులో రాయడం మొదలు పెట్టిన తరువాత, ఇంగ్లండులో గుర్తింపు లభించింది. క్రమంగా ప్రపంచం గుర్తించింది. భారతదేశంలో ఆయనకు అవమానాలు నిరాదరణ వున్నా, తట్టుకొని నెగ్గుకొచ్చాడు. తలవంచని రచయితగా నీరద్ చౌదరి తన అభిప్రాయాలను చాటాడు. చాలా లోతుగా అధ్యయనం చేసిన అనంతరమే రచనకు ఉపక్రమించేవాడు.
ఎడ్వర్డ్ షిల్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించి ఛౌదరికి న్యాయం చేకూర్చాడు.
సిడ్నీహుక్ : రాజకీయం పలికినా, తత్వం మాట్లాడినా సిడ్నీహుక్ హేతుబద్ధంగా రాసేవాడు. ఆయన ప్రభావం సమకాలీన సామాజిక శాస్త్రాలపై చాలా కనబడుతుంది. బెర్ట్రాండ్ రస్సెల్, జాన్ డ్యూయీ, మెరిస్ కోహెన్ ల శిష్యరికం చేసిన సిడ్నీ హుక్ మార్క్సిజం బాగా అధ్యయనం చేశాడు. సత్యాన్వేషణ అత్యున్నతమైనదని ఆయన సిద్ధాంతం. సోషలిస్టు భావాలు వున్నా, ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్ఛను తప్పనిసరిగా ఆదరించాలన్నాడు.

ట్రాట్ స్కీ రక్షణ సంఘంలో పాల్గొన్న హుక్, మాస్కోలో మారణ కాండపై విచారణలో ఆసక్తి చూపి, సాంస్కృతిక స్వేచ్ఛ కావాలనే సంఘాల స్థాపనలో చేరాడు. ప్రజా జీవిత సమస్యలతో స్పందించిన హుక్, రేమాండ్ ఆరన్ వలె చాలా సందర్భాలలో పాల్గొని, వివాదాస్పద చర్యలకు దిగాడు. చాలా ప్రతిభావంతుడైన యూదుగా హుక్ తన జీవితంలో అత్యధిక కాలం న్యూయార్క్ లోనే గడిపాడు.
హెరాల్డ్ లాస్కీ : లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో 3 దశాబ్దాలు పనిచేసిన లాస్కీ పుస్తకాలు నేడు ఆ సంస్థలోనే చదవడం లేదు. కాని ఆయన సమకాలీనులు రాజకీయాల్లో లాస్కీ వద్ద వ్యాకరణం నేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా లాస్కీ ప్రభావం వుండగా, వామ పక్షాలపై యీ ప్రభావం వీరారాధనకు పోయింది. 1993లో లాస్కీ శతజయంతి కూడా జరిపారు.

మాంచెస్టర్ లో సంపన్న యూదుకుటుంబంలో పుట్టిన హెరాల్డ్ లాస్కీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బోధించి గొప్ప పేరు పొందాడు. తరువాతే లండన్ లో స్ధిరపడి 1950లో చనిపోయే వరకూ ఉపాధ్యాయుడుగా వున్నాడు. ఆయన రచయితే గాక, గొప్ప వక్త కూడా. ఇంగ్లండ్ రేషనిలిస్ట్ సంఘాధ్యక్షుడుగా కొంతకాలం వున్న లాస్కీ, లేబర్ పార్టీ సోషలిస్టుగా వున్నాడు. అయితే ఒకసారి నమ్మిన వాటిని మళ్ళీ మళ్ళీ రాస్తూ, కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని సరిగా గమనించకపోవడం ఆయన లోపం.
ఫేబియన్ సోషలిస్ట్ గా పరిణమించిన లాస్కీ, బలీయ కేంద్ర ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించాడు. కొన్నాళ్ళు సిడ్నీ బీట్రిస్ వెబ్ సిద్ధాంతాల ప్రభావం కింద లాస్కీ వున్నాడు. సోవియట్ యూనియన్ ను సమర్థించి, అమెరికా సామ్రాజ్య వాదాన్ని లాస్కీ ఖండించాడు. లెప్ట్ బుక్ క్లబ్ స్థాపించిన లాస్కీ అటు ఉపాధ్యాయుడుగానూ యిటు ప్రపంచ వ్యవహారాలలోనూ ఆసక్తితో పాల్గొన్నాడు.
No comments:
Post a Comment