Saturday, April 26, 2008

sahiti parulatho sarasaalu 19






కొన్ని విశిష్ట కోణాల్లో ఆవుల గోపాలకృష్ణమూర్తి (ఎ.జి.కే.)






సుప్రసిద్ధ కవి ఒకరు ఎజికే దగ్గరకు వచ్చి ‘అడ్వకేటుకి, కవికి తేడా ఏమిటి? అని అడిగాడట. ఏముంది? అబద్ధానికి, అసత్యాలకి ఉన్న తేడానే అన్నాడట. చుట్టుపక్కల విన్నవారంతా, గొల్లుమని నవ్వారట. అడ్వకేటుగా తెనాలిలో ప్రాక్టీసు చేసిన ఎజికే తనపై తాను జోక్స్ వేసుకోగల సాహితీ ప్రియుడు, ఆయనకు కొన్ని కోణాలు గుర్తుపెట్టుకోదగినవి ప్రస్తావిద్ధాం.
ఒకేఒక్కసారి తెనాలి మున్సిపల్ చైర్మన్ గా ఎజికే పదవిలో ఉన్నప్పుడు గవర్నర్ సి.యం. త్రివేది వచ్చాడు. మున్సిపల్ సన్మానం ఏర్పాటు చేశారు. త్రివేది ఇతర కార్యక్రమాలన్నీ ముగించుకుని చివరగా మున్సిపల్ సన్మానానికి వచ్చాడు. ఆహ్వానం పలుకుతూ ఎజికే, ఐ.సి.ఎస్. అధికారిగా విధి నిర్వాహణ నియమాలు, బాగాతెలిసిన త్రివేది మున్సిపల్ కార్యక్రమానికి ప్రప్రధమంగా రావాలని మరచిపోవటం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. అంతటితో త్రివేది లేచి క్షమాపణ చెప్పి మాట్లాడాడు. ఆనాడు త్రివేది రాష్ట్రపతి పాలన విధించిన ఆనందంలో తిరుగులేని వ్యక్తిగా పేరున్నవాడు, ఆయన చేత కూడా ఎజికే అలా చెప్పించగలగటం చాలామందిని ఆశ్చర్యపరచింది.

ఎజికే మున్సిపల్ చైర్మన్ గా ఉండగానే రాష్ట్రముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తెనాలి వచ్చి మున్సిపాలిటీ అడిగిన రెండు రోడ్లలో ఒకటి మంజూరు చేసినట్లు సభలో ప్రకటించారు. రెండులో ఒకటి సగమని, అంటే అడిగిన దానిలో 50 శాతం ఇచ్చామని, ఏ మున్సిపాలిటీకి అలా ఇవ్వలేదని ముఖ్యమంత్రి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ గా ఎజికే ధన్యవాదాలు చెబుతూ, అడిగిన రెండు రోడ్లలో ఒకటి సగం కాదని, ఒకరోడ్డు బడ్జట్ 1 లక్ష 20 వేలు అని, రెండవ రోడ్డు ఖర్చు 50 వేలు అని, 1 లక్ష ఇరవై వేల రోడ్డు కనుక మంజూరు చేస్తే వారు చెప్పిన లెక్క ఒప్పుకుంటాం అని జనం చప్పట్ల మధ్య అన్నారు. సంజీవరెడ్డి బిత్తరపోయి ఆ రోడ్డు ఇస్తున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. తరువాత ట్రావిలర్స్ బంగళాకు వెళ్ళి స్థానిక ఎం.ఎల్.ఎ. ఆలపాటి వెంక్రటామయ్యను సంజీవరెడ్డి బాగా చీవాట్లు పెట్టాడట. నన్ను పిలిచి వేధిక మీద వెక్కిరించేటట్లు చేస్తావా అని.

అదే సంజీవ రెడ్డికి ముఖ్యమంత్రిగా శ్రీవెంకటేశ్వరర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. అప్పుడు గోవిందరాజుల నాయుడు-వైస్ ఛాన్సలర్, రామానుజల నాయుడు-రిజిస్ట్రార్, సెనేట్ అనుమతి లేకుండా అలా ఇచ్చినందుకు స్థానిక సంస్థల సెనేట్ సభ్యుడు ఎన్. విజయ్ రాజ్ కుమార్ అది చెల్లదని కోర్టులో దావా వేశారు. కేసు తేలేవరకు పేరు ముందు డాక్టర్ అని వాడరాదని ఛీప్ సెక్రటరీ భగవాన్ దాస్ ఉత్తరువులు జారీ చేశారు. కేసు నెల్లూరులో విచారణ జరిగింది. ఆవుల గోపాలకృష్ణమూర్తి అడ్వకేటుగా, యూనివర్శిటీ అధికారులను బోను ఎక్కించి నీళ్ళు తాగించారు. చివరకు తట్టుకోలేని జడ్జి విచారణ అనంతరం అది తన పరిధిలో లేదని, చిత్తూరు ప్రాంతంలో కేసు పెట్టుకోమని చెప్పారు. ఆ నాటి పరిస్థితి అది.

ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య, ఉన్నప్పుడు విజయవాడలో ఒక కొండ గుట్టమీద దళిత బాలికల హాస్టల్ సందర్శన కార్యక్రమం పెట్టుకొని వచ్చారు. పాత బెజవాడలో ఉన్న ఈ హాస్టల్ దగ్గర సంజీవయ్య కారు దిగి, ‘కొండపైకి ఎక్కాలా, నా వల్ల కాదు’ అని కార్యక్రమం మానుకుని వెళ్ళిపోయారు. ఈ వార్త తెలిసి ఎజికే, ‘ముఖ్యమంత్రి పదవికి దేక గలిగినవాడు దళిత బాలికల కోసం గుట్ట ఎక్కలేక పోయాడా’ అన్నాడు. అది ఆంధ్ర పత్రిక పతాక శీర్షికలో ప్రచురించింది. ఆ దెబ్బతో సంజీవయ్య వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని హాస్టల్ కు వెళ్ళి చూసి, ఎజికే కి ఉత్తరం రాశారు. ‘మీరన్నది నాకు బాగా తగిలింది, కళ్ళు తెరిపించింది’ అని.

1940 ప్రాంతాలలో కమ్యూనిస్ట్ పార్టీ వారు ఒక రహస్య తీర్మానం చేసి ఎమ్.ఎన్. రాయ్ పార్టీలోని రాడికల్ డెమోక్రాట్స్ తో మాట్లాడరాదని నిర్ణయించుకున్నారు. తెనాలి బోసు రోడ్డులో ఒకనాడు ఎజికే, కమ్యూనిస్ట్ నాయకుడు మాకినేని బసవ పున్నయ్య ఎదురయ్యారు. వారు ఎసి కాలేజీ, గుంటూరులో క్లాస్ మేట్స్, బసవ పున్నయ్య ముఖం తిప్పుకుని ఎరగనట్లు వెళుతుంటే, ఆయన వెనక చాలామంది అనుచరులు కూడా ఉన్నారు. అప్పటికే రహస్య తీర్మానం సంగతి తెలిసిన ఎజికే కావాలని, ఏడిపించటానికి బసవ పున్నయ్యను పిలిచి మాట్లాడబోతుంటే, నాకు అర్జంటు పని ఉన్నది వెళ్ళాలి అన్నాడట. ఆగవోయ్ ‘విప్లవాలు పరిగెత్తటం లేదులే’ అని ఎజికే 10 నిమిషాలు పిచ్చాపాటి కబుర్లతో నడివీధిన నిలిపేసరికి కమ్యూనిస్టులు లబలబ కొట్టుకున్నారట.

ఎజికే 1938 ప్రాంతాలలో లక్నోలో ఎం.ఏ. ఎల్.ఎల్.బి. చదివారు. ఆయన చదువుతుండగానే సుబాస్ చంద్రబోస్ కాంగ్రేస్ అధ్యక్షులుగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. గాంధీజీ అనుచరులను కార్యవర్గంలో వేసుకోవద్దని ఎమ్.ఎన్. రాయ్ ఆనాడు బోసుకి సలహా చెప్పారు. కానీ ఆయన మంచితనానికి పోయి గాంధేయులను కార్యవర్గంలోకి తీసుకుంటే వారే ద్రోహం చేసి బోసుని ఒక సంవత్సరంలోనే దింపేశారు. అలా పదవి కోల్పోయిన బోసు లక్నో వస్తే స్టేషన్ కు ఎవ్వరూ రాకపోవటం, పలకరించే దిక్కు లేకపోవటం ఆశ్చర్యకరమైనదని ఎ.జి.కె. అన్నారు. విద్యార్ధిగా బోసును తన హాస్టల్ గదికి తీసుకు వచ్చి, సహచరులతో భోజనాలు చేసి బోసును ఆదరించి, గెలిచినా, ఓడినా, మాకు వ్యక్తిత్వం ముఖ్యమని రాయ్ అనుచరులుగా ఎజికే చెప్పటం గొప్ప సత్యం.

ఎజికే ఎమ్.ఎన్. రాయ్ శిష్యుడు అయినా గుడ్డి అనుచరుడు కాడు. 1948లో డెహరాడూమ్ లో జరిగిన శిక్షణ చర్చా శిభిరంలో కొరియా విషయమై రాయ్ తో తీవ్రంగా విభేదించాడు. రాయ్ రెండు రోజులు మాట్లాడలేదట. చివరకు ఆయనే దిగివచ్చి మళ్ళీ ఎజికే చెప్పిందే సరైనదని సర్ధుకు పోయాడట.

ఆచార్య ఎన్.జి. రంగా తరచు, ఎజికే దగ్గరకు సలహాలకు వచ్చేవారు. 1951లోనే కృషీకార్ లోక్ పార్టీ పెట్టినప్పుడు కేంద్రంపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఊడుతుందని రంగాను రాడికల్ హూమనిస్ట్ పత్రికద్వారా ఎజికే హెచ్చరించారు. అప్పటి నుండి అప్పుడప్పుడు రాజకీయాల్లో సలహాలకు ఎజికేను సంప్రదించటం ఆనవాయితీ అయింది.

ఆలపాటి వెంకట రామయ్య, తెనాలి కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఎ.గా, మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక పరిపాలన గురించి బిల్లు రాసిపెట్టి ఎజికె సహాయపడ్డాడు. ఆ బిల్లు చూసి చాలామంది ఆలపాటిని మెచ్చుకున్నారు. అతడిని మూడక్షరాల పండితుడని ఎజికే గమ్మత్తుగా అనేవాడు. ఎమ్.ఎల్.ఎ. అనే అక్షరాలను దృష్టిలో పెట్టుకు అలా నవ్వులాట పట్టించేవాడు.

ఎజికే దగ్గరకి వచ్చిన కవులు, ఎప్పుడైనా కుల ప్రస్థావన తెస్తుండేవారు. అప్పుడు ఆయన వార్ని ఉద్దేశించి “మీరు బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, రెడ్డి, కమ్మ, కాపు కావచ్చు, దళితులు కావచ్చు, కానీ మనుషులు ఎప్పుడౌతారు” అని అన్నప్పుడు వారు అవాక్కు అయ్యేవారు.

అలాంటి ఎజికేని గుర్తించిన అమెరికా ప్రభుత్వం 1963లో బి.ఎస్.ఆర్. కృష్ణ ద్వారా ప్రత్యేక ఆహ్వానం పంపి తమ దేశం సందర్శించమని కోరారు. కృష్ణ తెనాలి వచ్చిన నాడు (1963) ఎజికే కుమార్తె జయశ్రీ పెళ్ళిరోజు. మేకా రాజగోపాల్ పెళ్ళికుమారుడు. ఆవుల సాంబశివరావు పెళ్ళి నిర్వహిస్తూ కవుల గోష్టి జరిపారు. అందరూ ఆవుల-మేకల వియ్యం అంటూ కవిత్వాలు చదివారు. ఎజికే గుర్తింపుని మాత్రం ఎవరూ విస్మరించలేక పోయారు.

1 comment:

cbrao said...

ఇందులో జరిగిన సంఘటనలు, సమయ స్ఫూర్తి,ఎంతటి పెద్దవరినైనా వారి తప్పు ఎత్తి చూపగలిగే ధైర్య సాహసాలు ఎ.జి.కె., వద్ద వున్నవని నిరూపిస్తాయి. ఇలాంటి అరుదైన లక్షణాలతో ఎ.జి.కె., విశిష్ట వ్యక్తయ్యారు.