Monday, March 3, 2008

సాహితీపరులతో సరసాలు -10






Narla Venkateswararao

వి.ఆర్. నార్లతో మాటామంతీ, పిచ్చాపాటీ

(నార్ల వెంకటేశ్వరరావు - 1908-1985)

ఒకనాడు పొద్దున్నే నార్ల వెంకటేశ్వరరావు యింటికి వెళ్ళాను. కొత్తగా రాసిన నరకంలో హరిశ్చంద్ర నాటకం నా చేతిలో పెట్టారు. తెరిచి చూడగా, నాకు అంకితం యిచ్చినట్లున్నది. ఆశ్చర్యపోయి ధన్యవాదాలు చెప్పాను. చివరిదశలో మేమిరువురం అంత సన్నిహితులమయ్యాం.

1970 ప్రాంతాల నుండే నాకూ నార్లకూ పరిచయమైంది. ఆయన్ను మొదటిసారి 1955లో గుంటూరులో చూశాను. హైస్కూలు రోజులనుండీ ఆంధ్రప్రభ, ఆ తరువాత ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు చదివాను.

1954లో ఎం.ఎస్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే తారరాలింది, వటవృక్షం కూలింది అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవులగోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా దెప్పిపొడిచారు. అది బాగా ఆయనకు గుచ్చుకున్నది. వెంటనే గుత్తి కొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. అవి కళ్ళు తెరిపించగా, నార్ల అప్పటి నుండీ రాయ్ అభిమానిగా, క్రమేణా మానవవాదిగా పరిణమించారు. ఆ దశలో మాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఏర్పడింది.

1970 నుండీ అనేక చిన్న, పెద్ద సమావేశాలకు నేను నార్ల ను ఆహ్వానించగా వచ్చి ప్రసంగించారు. అఖిల భారత హ్యూమనిస్టు నాయకులు వి.ఎం. తార్కుండే, ఎ.బి.షా, ప్రేమనాధ్ బజాజ్, వి.బి. కర్నిక్ వంటి వారిని ఆయనకు పరిచయం చేశాను. కలకత్తాలో మినర్వా అసోసియేట్స్ ప్రచురణ కర్త, హ్యూమనిస్టు సుషీల్ ముఖర్జీని పరిచయం చేయడమే గాక ఆయన ద్వారా నార్ల పుస్తకాలు ప్రచురింపజేశాను. (Gods, Goblins and Men) రచన అలా వచ్చిందే. తన పుస్తకాలు వి.ఎం., తార్కుండే, ప్రేమనాధ్ బజాజ్లకు నార్ల అంకితం యిచ్చారు కూడా. ప్రేమనాథ్ బజాజ్ రాసిన గీత విమర్శ నార్లను ప్రేరేపించగా, దిట్రూత్ ఎబౌట్ గీత రాశారు. బ్రతికుండగా అది ప్రచురణ కాలేదు. ఆయన తదనంతరం నేను ప్రచురించాను. అంతే కాకుండా, తెలుగులో గీతా రహస్యంగా వెలువరించి, e-book (http://naprapamcham.blogspot.com/2007/11/e.html) గా కూడా పాఠకులకు అందచేశాను.

జర్నలిస్ట్ గా ప్రారంభమైన నార్ల, రచయితగా, విమర్శకుడుగా రాణించాడు. నార్లకు రాగద్వేషాలు మెండు. విశ్వనాధ సత్యనారాయణపై విరుచుక పడిన వారిలో నార్ల ప్రముఖుడు. సంపాదకీయాల ద్వారా పుస్తక పరిచయం చేసిన ఒరవడి కూడా నార్లదే.

నార్ల ద్వారా నాకు కొందరు ప్రముఖులు పరిచయమయ్యారు. అందులో ఎం. చలపతిరావు ఒకరు. ఆయన నార్ల ఇంట్లో వుండేవారు. నాకు పరిచయమైన నాటికి విపరీతంగా నత్తి వుండేది. ఆయన సంపాదకీయాలు, నేషనల్ హెరాల్డ్ లో పెద్ద ప్రవాహం వలె పారేవి. తన అభిప్రాయాలు, అనుభవాలు చెప్పేవారు. మరొకరు గూటాల కృష్ణమూర్తి. ఆయన విశాఖవాడైనా, లండన్ లో స్ధిరపడ్డారు. 1890 ప్రాంతాలలో సుప్రసిద్ధ రచయితలంతా పుట్టారని ఆయన నమ్మకం. వారి రచనలు గిల్డ్ ప్రచురణలు చేసి, పరిమిత ప్రతులు వేసేవారు. చాలా అందంగా వుండేవి. విద్యాన్ విశ్వం కూడా నార్ల ద్వారానే నాకు పరిచయమయ్యారు.

నార్లను సభలకు పిలిచినప్పుడు ఆయన ప్రసంగాలు ఆకర్షణీయంగా వుండేవి కావు. విషయం వున్నా, ఆయన సభారంజకుడుకాదు. రచనలలో వున్న పట్టు, ప్రసంగాలలో లేదనిపించేది. నార్లకు వ్యక్తుల పట్ల అభిమానాలు ద్వేషాలు తీవ్రస్థాయిలో వుండేవి. ఎవరినైనా విమర్శించదలిస్తే బాగా పూర్వాపరాలు తెలుసుకొని ధ్వజమెత్తేవారు.

గురజాడ లేఖలు, రచనల విషయమై నార్ల తీవ్రస్థాయిలో స్పందించారు. గురజాడపై మోనోగ్రాఫ్ రాశారు. అవసరాల సూర్యారావు, గురజాడ ఇంగ్లీషు, అర్థం చేసుకోలేక తప్పుగా రాశాడని నార్ల ఉద్దేశ్యం. ఆ విషయంలో ఆయనకు కమ్యూనిస్టులకూ తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చాయి. కమ్యూనిస్టులు సూర్యారావును వెనకేసుకొచ్చారు. ఆ సాహితీ యుద్ధంలో, నార్లను తొలుత సమర్ధించిన పురాణం సుబ్రహ్మణ్యశర్మ, ఒకదశలో కమ్యూనిస్టులను వెనకేసుకొచ్చారు. దాంతో నార్లకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అప్పట్లో నార్ల వద్ద ఉద్యోగం చేస్తున్న పురాణం, తన తప్పు తెలుసుకున్నారు. ఒకనాడు నేను నార్ల యింటికి వెళ్ళేసరికి, పురాణం సాక్షాత్తూ నార్ల కాళ్ళ మీద బడి, తప్పయింది క్షమించమని వేడుకుంటున్నాడు. క్షమించాను పో అని నార్ల అన్నారు. సాహిత్య రంగంలో అవకాశ వాదాలు అలా వుంటాయి. అవసరాల సూర్యారావుకు, ఇంగ్లీషు సరిగా రాని మాట వాస్తవమే అయినా, ఆయన చిత్త శుద్ధిని శంకించ వీల్లేదని చలసాని ప్రసాదరావు వంటివారనే వారు. చిత్త శుద్ధితో తప్పు చేస్తే ఒప్పుకోవలసిందేనా?. అవును అంటారు కమ్యూనిస్టులు!. అది నార్ల ఒప్పుకోలేదు.

వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వాఙ్మయ మహాధ్యక్ష అని బిరుదు తగిలించుకొని, విమర్శనా రచనలు చేస్తుండేవారు. ఆయన ఓరియంటల్ తాళపత్ర గ్రంథాల పీఠానికి, డైరెక్టర్ గా వున్నారు. ఎక్కడ పేచీ వచ్చిందో తెలియదు గాని, నార్ల అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అతడి సెక్స్ దుర్వినియోగం మొదలు అవినీతి వరకూ బయటపెట్టి వుతికేశారు. మంత్ర శక్తితో ప్రత్యర్థిని నాశనం చేయగలనని బెదిరించే గోపాలకృష్ణయ్య నార్లను తట్టుకోలేక పోయారు.

విశ్వనాథ సత్యనారాయణపై నార్ల కేవలం విమర్శించడమే గాక, సంపాదకీయాల ద్వారా అతడి కుల విషబీజాల్ని, ఛాందసహైందవ అహంకారాన్ని బట్టబయలు చేశారు. ఆ సంపాదకీయాన్ని మళ్ళీ వేయమన్నప్పుడు నండూరి రామమోహనరావు నిరాకరించాడు. అది చిలికి చిలికి పెద్ద కలహంగా మారింది. 1978-79 నాటి మాట అది. చివరకు నార్ల ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా రాజీనామా చేశారు.

నార్ల వెంకటేశ్వరరావు ఎమర్ఙన్సీలో ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా ప్రొటెస్ట్ చేశారు. సంపాదకీయం స్థానంలో ఏమీ రాయకుండా వదలేయమన్నారు. నండూరి రామమోహన రావు పిరికివాడు బయపడి, యజమాని కె.ఎల్.ఎన్. ప్రసాద్ ఆజ్ఞానుసారం సంపాదకీయాలు రాశాడు. నార్ల తీవ్ర అభ్యంతరపెట్టి రాజీనామా చేశాడు. ఎమర్జన్సీలో కొంత కాలం అమెరికా వెళ్ళి పర్యటించి వచ్చారు. నండూరి రామమోహనరావును గుమస్తా సంపాదకుడు అనేవాడు. నార్లను అనుసరించి, అలాగే సంపాదకీయాలు రాయాలని నండూరి ప్రయత్నించాడు. జర్నలిస్టుగా సొంత వ్యక్తిత్వం నిలబెట్టుకోలేని నండూరి రామమోహనరావు గుమస్తా ఎడిటర్ గానే మిగిలిపోయాడు.

నార్ల రాజ్యసభ సభ్యుడుగా 12 ఏళ్ళు వున్నారు. అప్పటి అనుభవాలు చెప్పేవారు. ఇందిరాగాంధి పట్ల తీవ్ర ద్వేషం పెంచుకున్నారు. ఆమె కుటుంబవారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. పౌరహక్కులు, మానవ విలువలు కావాలనేవారు. ఆ విషయంలో జయప్రకాశ్ నారాయణను మెచ్చుకునేవారు.

నార్ల కళాభిమాని, బౌద్ధ కళల పట్ల ప్రత్యేక అభిరుచి, విదేశాలలో సేకరించిన బౌద్ధ మినీ విగ్రహాలు, కళాఖండాలు అట్టి పెట్టేవారు. శివుడు, కృష్ణుడి పరంగా వచ్చిన కళా ఖండాల్ని కూడా సేకరించారు. మ్యూజియంలో, శిల్ప సౌందర్యాలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వాటి విశేషాలు చెప్పేవారు.

నవయుగాల బాట నార్ల మాట అనే మకుటంతో, పద్యాలు రాశారు. మొత్తం వెయ్యి పూరించాలని వుందనేవారు. వాటిని హైదరాబాద్లో సైంటిఫిక్ సర్వీసెస్ సంస్థ పక్షాన గోపాలరావు ప్రచురించారు. పద్యాలు రాస్తున్నప్పుడే చదివి వినిపించి, అభిప్రాయం అడిగేవారు. చనువు కొద్దీ నేను కొన్ని సూచనలు చేయగా ఆమోదించేవారు. కొన్ని పద్యాలు కొందరు వ్యక్తుల్ని ఉద్దేశించి రాస్తున్నట్లు చెప్పేవారు. పేర్లు లేవు గనుక, భావితరాల వారికి అవి సాధారణ సూత్రాలుగానే వుంటాయి.

ఇంగ్లీషులో తరచు వచ్చిన ఆలోచనల్ని కూడా చిన్న వాక్యాలుగా రాయగా Man and His world పేరిట అచ్చు వేయించాం. గోపాలరావు ప్రచురించారు. నార్ల పుస్తకాలు రాస్తున్నప్పుడు ఆయన ఇంగ్లీషు పట్ల ఆయనకే అంత గట్టి విశ్వాసం లేదు. డి. ఆంజనేయులు వాటిని చూచి సవరించేవారు. ఏమైనా ఇంగ్లీషు రచనలు అంత బాగాలేవు.

గీత పై విమర్శ రాయడంలో చాలా రిఫరెన్స్ లు నార్ల వాడారు. అనేక రచనలు పరిశీలించారు. అలాగే ఉపనిషత్తులపై నిశిత పరిశీలనా వ్యాసం పూర్తి చేశారు. నాటకాలు రాసినప్పుడు ముందుగా చదివించి, అభిప్రాయ సేకరణ చేసేవారు. ఆయన రాసిన సీత జోస్యం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. అకాడమీ పత్రికలోనే ఆ నాటకాన్ని దుయ్యబడుతూ సమీక్ష రాయడాన్ని నార్ల తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. అదొక రసాభాసగా మారింది.

నార్ల ఇంగ్లీషు రచనలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. కందుకూరి, గురజాడ, వేమన యీ విషయంలో పేర్కొన్నదగినవి. నార్ల తెలుగు నాటికలు కొత్తగడ్డ పేరిట రాగా అవి కొన్ని స్టేజిపై ప్రదర్శించారు గూడా. తెలుగు జాతీయాలు, నుడికారం బాగా ప్రయోగించారు. (To be contd….)

1 comment:

Bolloju Baba said...

ఎన్ని అద్భుతమైన విషయాలు, ఎన్ని అద్భుతమైన విషయాలు - పీచుమిఠాయి అక్షరాల లోకంలో మద్య మద్య ఇటువంటి వజ్ర కాంతులీనే వ్యాసాలు చదువుతూంటే ఎంత ఆత్మతృప్తి.

బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/