Sunday, March 30, 2008

సాహితీపరులతొ సరసాలు-15


Chalasani Prasada Rao

చలసాని ప్రసాదరావు
(1939-2002)
1965 నుండీ చనిపోయే వరకూ మిత్రులుగా గడిపిన మేము, తొలుత ఎలా పరిచయస్తులమయ్యామో చెప్పలేను. అప్పట్లో ప్రభుత్వ సమాచార శాఖలో ఆర్టిస్టుగా పని చేస్తూ, సైదాబాద్ కాలనీ (హైదరాబాద్) నుండి బస్సులో వస్తుండేవారు. ప్రసాదరావు మాట్లాడటమే గాని వినడం లేదు. 8 ఏళ్ళ ప్రాయం నుండీ ఆయనకు చెముడు వచ్చింది. నా వంటి వారికి ఆయన మాటలు విని, అర్థం చేసుకోవడం అలవాటుగా మారింది.
1972లో ఈనాడు పత్రిక విశాఖపట్టణం నుండి వెలువడినప్పుడు, ప్రసాదరావు ఆదివారం సంచిక చూచేవారు. అందులోనే ఆయన కోరికపై వ్యాసాలు రాశాను. ఎ.బి.కె. ప్రసాద్ అప్పుడు ఎడిటర్. ఈనాడు హైదరాబాదు కు తరలిన తరువాత ప్రసాదరావు ప్రభుత్వ ఉద్యోగం నుండి ఈనాడుకు మారారు. నేను అడపదడపా వ్యాసాలు రాశాను.
కమ్యూనిస్టుగా ఆరంభమైన ప్రసాదరావు, విజయవాడ వరంగల్లు, హైదరాబాద్ లో అనేక మంది కమ్యూనిస్టుల గోత్రాలు, లోతు పాతులు తెలిసినవాడు. ఆ అనుభవంతో ‘ఇలా మిగిలేం’ అని పుస్తకం రాశాడు. అందులో కమ్యూనిస్టులు కొందరు ఎలా దిగజారారో రాశాడు. చలసాని ప్రసాదరావు అలారాయడం కమ్యూనిస్టులకు మింగుడు పడలేదు. రావి నారాయణరెడ్డి ఎన్.ఆర్. దాసరి మెదలు గజ్జల మల్లారెడ్డి మొదలైన వారిని దుమ్ముదులిపేశాడు. వ్యక్తుల్ని పసిగట్టి బాగా అంచనా వేసేవాడు.
చలసాని ప్రసాదరావు ఈనాడులో చేరి, పెట్టుబడిదారీ పత్రిక అధిపతి రామోజీరావు గులాం అయ్యాడన్నారు. కాని అలా విమర్శించిన మార్క్సిస్టులు కొందరు ప్రసాదరావు దగ్గరకు వచ్చి, తమ పిల్లలకు ఉద్యోగాలిప్పించమని అడిగారు. ప్రసాదరావు నవ్వుకున్నాడు. ఆయన హాస్యప్రియుడు. కళాభిమాని, రచయిత, ఆర్టిస్టు. మిత్రులతో కలసి క్లబ్ లో హాయిగా రెండు పెగ్గులు వేసుకొని, సిగరెట్లు తాగి, ఆనందించిన ప్రసాదరావు జీవితంలో రంగులు చూచాడు.
ఈనాడు పత్రికలో ఆదివారంతో బాటు, విపుల, చతుర పత్రికలు జయప్రదంగా నిర్వహించారు. అవి పడిపోతున్నప్పుడు, ఆపేయమని సలహా యిచ్చాడు. కాని రామోజీరావు పంటి బిగువుతో నడిపాడు.
ప్రసాదరావుకు నాకూ తాత్విక రాజకీయ భావాలలో పొసిగేది కాదు. నన్ను రాయిస్టు అని పరిచయం చేసేవాడు. ఏ రాయి అయితేనేం, తలపగల గొట్టుకోడానికి అని వెక్కిరించేవాడు.
నాపై వైస్ ఛాన్సలర్ జి. రాంరెడ్డి, ఆయన బృందం ధ్వజమెత్తినప్పుడు, ప్రసాదరావు మద్దత్తు కోరారు. అందుకు స్పందిస్తూ ఇన్నయ్య మొండిఘటం, ఆయన్ను మిరేమీ చేయలేరు. నేను ఆయన పక్షమే అని బద్దలు కొట్టి చెప్పిన మిత్రుడు. గుండె పోటు వచ్చితట్టుకున్నా, సిగరెట్లు మానలేకపోయాడు. చివరి వరకూ ఈనాడు కబుర్లు రాశాడు.
ప్రసాదరావుకూ నాకూ కామన్ మిత్రులన్నారు. సంజీవదేవ్, రవీంద్రనాథ్ ఆలపాటి, సి. భాస్కరరావు, వెనిగళ్ళ వెంకట రత్నం, దండమూడి మహీధర్. నార్ల అంటేనూ, ఎ.బి.కె. ప్రసాద్ పట్లా ప్రసాదరావుకు సదభిప్రాయం లేదు. నార్ల గురజాడపై విమర్శలు చేసినప్పుడు, అవసరాల సూర్యారావు పరిశోధనను దుయ్యబట్టినప్పుడు, ప్రసాదరావు మెచ్చలేదు. అయితే ఆ రంగంలో ప్రసాదరావుదే దోషం. రంగనాయకమ్మపై కూడా తీవ్ర విమర్శలు చేస్తుండేవారు.
చలసాని ప్రసాదరావు అమెరికా పర్యటనలో న్యూయార్క్ వెళ్ళి మారుమూల వున్న నికలస్ రోరిక్ కళాకారుని మ్యూజియం సందర్శించాడు. ఆయన ఆసక్తి, ప్రత్యేకంగా పనిగట్టుకుని రావటం చూచి అభినందించిన మ్యూజియం డైరెక్టర్, ప్రసాదరావుకు వారి ఆల్బమ్ బహూకరించి సత్కరించారు. ఆ తరువాత మరొకసారి నేను అదే మ్యూజియంకు వెళ్ళినప్పుడు ప్రసాదరావు రాకను గురించి చెప్పారు. సంజీవదేవ్ - రోరిక్ లు మిత్రులు. వారి ఉత్తర ప్రత్యుత్తరాలు నేను సంజీవదేవ్ నుండి స్వీకరించి మ్యూజియంకు బహూకరించాను.
ప్రసాదరావు నాకు కుటుంబ మిత్రుడు. నా పిల్లలతో కూడా సన్నిహితంగా వుంటూ, అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మాయి నవీన దగ్గర గడిపాడు. చక్కని బొమ్మలు వేసి పిల్లలకు యిచ్చేవాడు.
రచనలు :
రవికథ, కథలు కాక్లర కాయలు, మాస్టర్ పీచు, మార్పు, నిజాలు, రాజుల బూజు, ఆరడుగుల నేల, రక్తా క్షరాలు, కాకతీయ శిల్పం, ఆధునిక చిత్రకళ, రష్యన్ చిత్రకళ, చిట్టి ప్రసాద్, ఇలా మిగిలేం, రసన, కళ (ఎడిటర్), కబుర్లు (ఈనాడు).

No comments: