Thursday, March 20, 2008

Book review-2 Vivekananda


(వివేకానందపై సుప్రసిద్ధ బెంగాలీ పరిశోధక రచయిత నిరంజన్ ధర్ వేదాంతం - బెంగాల్ రినైజా న్స్ రాసారు. దాని సారాంశం చెప్పమని కొందరు కోరినట్లు, యిక్కడ రివ్యూ చేస్తున్నాను. వెబ్ సైట్ లో నుండి యీ పుస్తకం తెప్పించుకోవచ్చు.)

మనకు యీ వివేకానంద తెలుసా?

వివేకానందకు అమ్మ నాన్న పెట్టిన పేరు నరేంద్రనాథ్. 1863 జనవరి 12న కలకత్తాలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. అక్కడే బి.ఎ. వరకూ చదివాడు. ఇంటర్ మీడియట్ చదువుతుండగా, ఇంగ్లీషు లెక్చరర్ మాటల సందర్భంలో రామకృష్ణ విషయం ప్రస్తావించాడు. తొలిసారి ఆ విధంగా చూచాయగా పేరు విన్న వివేకానందుడు, ఎప్పుడైనా రామకృష్ణను చూడాలనుకున్నాడు. విద్యార్థిగా ఆయనకు సందేహాలుండేవి. దేవుణ్ణి చూచినవారెవరైనా వున్నారా అనేది ప్రధాన సంశయం. అంతేగాని నాస్తికుడుగా ఏనాడూ వివేకానందుడు లేడు. ఎవరైనా గట్టిగా చెబితే నమ్మడానికి సిద్ధంగా వున్న వివేకానందునికి తాను చూచానని రామకృష్ణ తడుముకోకుండా చెప్పేసరికి వివేకానంద నమ్మేశాడు.

దక్షిణేశ్వర్ లో తొలిపర్యాయం రామకృష్ణను చూచినప్పుడు, వివేకానంద పట్ల రామకృష్ణకే ఎక్కువ ఆకర్షణ ఏర్పడింది. ఒకనెల తరువాత రెండో పర్యాయం వివేకానంద వచ్చినప్పుడు ఆయన మీద రామకృష్ణ కాలుపెట్టాడు. నాకు తల్లిదండ్రులున్నారు. వారిని చూడవలసిన బాధ్యత నాది. మీరు ఏం పని చేశారనివివేకానందుడు వాపోయాడు. తల్లిదండ్రులు వివేకానందకు పెళ్ళి సంబంధాలు చూస్తుండగా వివేకానందుడు విముఖుడు గాకపోయినా, అతని తండ్రి మరణించడంతో ఆ సమస్య వాయిదా పడింది. పెళ్ళి అంతకు ముందు కుదరబోయి కూడా చిన్న విషయాల వద్ద తేడాలు రాగా తాత్కాలికంగా ఆగింది. ఇంటికి పెద్ద కుమారుడైన నరేంద్రనాథ్ (వివేకానంద) సంపాదించి, పోషించవలసి వచ్చింది. ఉద్యోగాన్వేషణ చేశాడు. వివేకానందకు కొందరు రౌడీ మిత్రులుండేవారు. రౌడీ పనులకు వారు పురమాయించారు. కాని వివేకానంద తమాయించుకొని రామకృష్ణ వద్దకు వెళ్ళి తన దుస్థితి చెప్పగా, ఆయన కాళికామాతను వేడుకొమన్నాడు. ప్రయోజనం లేకపోయింది. ఇక ముందు తినడానికి, కట్టుకోడానికి లోపం వుండబోదని రామకృష్ణ హామీయిచ్చి వివేకానందను ఓదార్చాడు. (చూడు : లీలాప్రసంగం).

ఉద్యోగాన్వేషణలో ఒకనాడు అలసి సొలసి రోడ్డుపక్క అడ్డం పడ్డ వివేకానంద, ఇక ప్రయోజనం లేదని సంసార పక్షాన్ని వదలేశాడు. దక్షిణేశ్వరాలయానికి తరచు వెడుతుండేవాడు. రామకృష్ణ ప్రభావంలో నరేంద్ర సన్యాసిగా మారి, విరాజహోమం జరిపి, సంసారలోకంతో సంబంధం తెంచుకొన్నాడు. సంసార బాధ్యతల్ని ఆ విధంగా తప్పించుకొని ఆశ్రమానికి చేరిన వివేకానంద తన వారిని విస్మరించలేకపోయాడు. తల్లి అప్పుడప్పుడూ మఠానికి వచ్చి కుటుంబ విషయాలు చెప్పి, సంప్రదించి వెడుతుండేది. పూర్వీకుల ఆస్తిపాస్తుల విషయమై తన కుటుంబానికీ తన మేనత్తకూ వచ్చిన తగాదా కోర్టు వరకూ వెళ్ళగా, వివేకానంద ఆ విషయమై శ్రద్ధ కనబరచాడు.


అంతా జమిందార్ల మయమే :


వివేకానంద చాలా వరకు జమిందార్ల సహవాసంతోనే గడిపాడు. బాగా సుఖాలు కోరుకునేవాడు. అమెరికా వెళ్ళబోయేముందు తన తల్లికి సోదరులకు నెలకు 100 రూపాయల చొప్పున డబ్బు పంపించేటట్లు ఖేత్రి మహారాజా ద్వారా ఏర్పాట్లు చేశాడు. ఆ తరువాత స్వామిజీ కోరికపై మహారాజా ఆయనకు కూడా వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం నెలకు వంద రూపాయల చొప్పున మంజూరు చేశాడు. (చూడు ఫర్ గాటెన్ ఛాప్టర్స్, వేణి శంకర్, పుట 146-191) తాను రిటైర్ అయిన తరువాత నివసించడానికి అనువుగా తన తల్లి పేరిట గంగానది ఒడ్డున ఒక యిల్లును నిర్మించవలసిందని, అందుకు గాను 10 వేల రూపాయలు యివ్వమని మహారాజును వివేకానందుడు కోరాడు. తన పేరిట స్థలం కొనమని 1895లో రామకృష్ణానందకు వివేకానంద వ్రాశాడు. వివేకానందుడి పేరిట కొన్న మఠం భూమిపై బెల్లి మునిసిపాలిటీకి ఆయనకూ దావాలు నడిచాయి కూడా. (ప్రబుద్ధ భారత, 1901 ఆగస్టు) స్వామిజీ కోర్కె ననుసరించి తొలుత 500 రూపాయల్ని అజిత్ సింగ్ పంపాడు. బేలూరుమఠం నుండి 3 వేల రూపాయల్ని వివేకానంద అప్పుగా తీసుకొన్నాడు. కాని డబ్బు చాలనందున ఇంటి ప్రయత్నం విరమించాడు. (చూడు : మిసెస్ బుల్ కు వ్రాసిన లేఖ 1900 మే 18).

వివేకానంద ఎక్కడకు వెళ్ళినా సర్వసౌకర్యాలు కోరుకునేవాడు. అమెరికా వెళ్ళినప్పుడు బాల్టిమోర్ లోని ఫస్ట్ క్లాస్ హోటల్ లో వుండాలనుకున్నాడు. ఉన్నాడు కూడా. ఇంగ్లండ్ లో తన శిష్యుడు ఎడ్వర్డ్ స్టర్జీ అతిథిగా వున్నందున, వివేకానందుడిలో సన్యాసత్వం లేదని తెలుసుకున్న శిష్యుడు నిస్పృహ చెందాడు. ఆయనతో సంబంధాలు తెంచేసుకున్నాడు.


సన్యాసిగా యింటికి డబ్బు :


ఖేత్రి మహారాజా యిచ్చిన డబ్బు తన పుస్తకం రాజయోగం (ఆంగ్ల ప్రతి)పై వచ్చిన డబ్బును కూడబెట్టి న్యూయార్క్ లో సెయింట్ ఫ్రాన్సిస్ లెగెట్ వద్ద వివేకానందుడు దాచాడు. ఇదంతా (వెయ్యి డాలర్లు) తన కుటుంబానికే ఉద్దేశించాడు. 1900 డిశంబరు 27న ఓక్ బుల్ కు వ్రాస్తూ తను చనిపోతే డబ్బంతా తన తల్లికి అప్పగించమన్నాడు. వివేకానందుడి అభిమాని శ్రీమతి సెవియర్ అమెరికాలో 6 వేల రూపాయలు యివ్వడమే గాక, తరచు డబ్బు పంపింది. ఆ విధంగా పంపడం మానేయవద్దని వివేకానందుడు కోరాడు. మరో వెయ్యి రూపాయలు అదనంగా యివ్వమని కూడా కోరాడు. అమెరికా, ఇంగ్లండ్ లలో స్వామీజీ విలాసంగా గడిపిన తీరు పట్ల అసంతృప్తితో లియోన్ లాండ్స్ బర్గ్ తన శిష్యరికానికి స్వస్తి పలికాడు. (వివరాలకు చూడు : మేరీ బర్క్ : సెకండ్ విజిట్ పుటలు 71, 79, 81-82, 85-87, 379) సన్యాసిగా నివసించలేని వివేకానందుడు, తన కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాల వలన తోటి సన్యాసులకు, మఠంలోని వారికి చాలా యిబ్బంది కలిగింది. వారెంతగా చెప్పినా వివేకానందుడు మారలేదు.

రామకృష్ణ చనిపోయిన తరువాత బేలూరుమఠం ఆర్థిక చిక్కుల్లో పడింది. కొందరు భిక్షాటన చేశారు గాని ప్రయోజనం అట్టే లేకపోయింది. ఆ బాధ్యత తన నెత్తిన వేసుకొన్న వివేకానంద అఖిలభారత భిక్షాటనకు 1891లో బయలుదేరాడు. రెండేళ్ళపాటు దేశమంతా తిరిగాడు. ముఖ్యంగా స్వదేశీసంస్థానాలలో హిందువుల పాలన క్రింద వున్న వాటికి వెళ్ళాడు. ఎక్కువగా రాజాలు, దివాన్ల వద్ద బస చేశాడు. రాజాల వద్ద పరిచయపత్రాలు ఆధారంగా పర్యటన సాగించాడు. బాగా డబ్బు వసూలు చేసి మఠాన్ని పోషించాడు : వివేకానందుడు వసూళ్ళకై వెళ్ళిన జమిందారీ, స్వదేశీ సంస్థానాలు యివి : ఆల్వార్, జైపూర్, అజ్మీర్, ఖెత్రి, అహమ్మదాబాద్, కధియవార్, జునాగఢ్, పోరుబందరు, ద్వారకా, పైలితానా, బరోడా, ఖండ్వా, బొంబాయి, పూనా, బెల్గాం, బెంగుళూరు, కొచ్చిన్, మలబార్, తిరువాన్కూర్, త్రివేండ్రం, మధురై, రామనాడ్, రామేశ్వరం, కన్యాకుమారి.


అమెరికా యాత్ర :


అమెరికాలో జరుగనున్న ప్రపంచ మత సమావేశానికి వెళ్ళమని ముగ్గురు జమిందార్లు వివేకానందుడిని ప్రోత్సహించి, డబ్బిచ్చి పంపారు. ఖెత్రి, రామనాడ్, మైసూరు మహారాజులు యీ కృషి చేశారు. వివేకానందుడి అమెరికా ప్రయాణానికి మద్రాసులో ఆయన శిష్యులు ప్రయత్నిస్తే అతికష్టం మీద 500 రూపాయలు వసూలయ్యాయి. జమిందార్లపై ఆధారపడిన వివేకానందుడు ఆ డబ్బును పేదలకు పంచేయమన్నాడు. జమిందార్లు బాగా కోపు వేసికొని ఆమెరికాకు సాగనంపారు. పెనెన్ సులా స్టీమర్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ కొనిపెట్టి, కొంత డబ్బిచ్చి, ఇతర వస్తువులు కొనిచ్చారు. ఆ సందర్భంగానే కాషాయ సిల్కు వస్ర్తాలు, సిల్కు, తలపాగా జమిందార్లు కుట్టించారు. దివాన్ జగమోహన్ లాలా తన జమిందారు ఉత్తరువుల మేరకు స్వామీజీ అవసరాలన్నీ చూచి ప్రయాణానికి ఓడ ఎక్కే వరకూ బొంబాయిలో వున్నాడు. వివేకానందుడనే పేరు కూడా ఖెత్రి మహారాజా ఒక దర్బారులో ప్రకటించాడు. అప్పటి నుంచీ నరేంద్రనాథ్ కాస్తా వివేకానందుడైపోయాడు. కాని ఆయన కావాలనుకున్న పేరు సచ్చిదానంద మాత్రమే. హరిదాస్ మిత్రకు 1892 అక్టోబరులో వ్రాసిన లేఖలో సచ్చిదానంద అని సంతకం చేశాడు. కాని వివేకానంద అనే పేరు స్థిరపడి బహుళ ప్రచారానికి వచ్చింది. తలపాగా ధరించడానికి వివేకానందుడు తొలుత తటపటాయించాడు. అదే అతడికి ప్రతీకగా, సుప్రసిద్ధ చిహ్నంగా మారింది.

మహారాజా యిచ్చి పంపిన డబ్బును అమెరికాలో స్వామీజీ పారేసుకున్నాడు. ఆ విషయం తెలిసి వెంటనే 500 రూపాయలు స్వామీజీకి యివ్వమని మహారాజా వారు థామస్ కుక్ అండ్ సన్స్ కు కేబిల్ యిచ్చాడు. (ఫర్ గాటెన్ ఛాప్టర్స్ - శర్మ పుట 34-94) ఇండియా నుండి జమిందార్లు స్వామిజీకి పార్సిల్స్ పంపుతూ, ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూ వచ్చారు. ఈ విధంగా అమెరికాలో స్వామీజీ అవసరాలకు ఎలాంటి లోపం రాకుండా జమిందార్లు జాగ్రత్త వహించారు. అమెరికాలో వివేకానందుడిపై జరిగిన దుష్టప్రచారాన్ని కూడా ఖేత్రి, జూనాగడ్ మహారాజాయే ఎదుర్కొని పరువు కాపాడారు.

చికాగోలో హిందూమత ప్రతినిధిగా పాల్గొని ఇండియాకు తిరిగి వచ్చిన వివేకానందకు జమిందార్లు ఎగబడి, పోటీబడి స్వాగతం పలికి సన్మానించారు. తొలుత రామనాడ్ రాజా, వివేకానందకు స్వాగతం పలికి, ఆయన విగ్రహం కూడా ప్రతిష్ఠించాడు. పేదలకు అన్నదానం చేసాడు. రాజా స్వయంగా వివేకానంద ఎక్కిన బండిని లాగాడు. అందుకు బదులుగా రాజావారికి రాజర్షి అని బిరుదును ప్రసాదించాడు వివేకానందుడు. రామనాధపురం జిల్లాలో రాజకీయంగా రాజావారు చేయని అవినీతి అంటూ లేదు. ప్రజల్ని పీల్చి పిప్పి చేశాడు. కాని, భక్తికి లొపం లేదు. తరువాత వివేకానందకు మద్రాసులో రాజాలు క్యూలో వుండి స్వాగతం పలికారు. (చూడు గంభీరానంద : యుగనాయక్ వివేకానంద మొదటిభాగం 267-270 354-400) ఈ సభకు హెచ్.హెచ్. గైక్వార్ అధ్యక్షత వహించాడు. తరువాత కలకత్తాలో వివేకానందను సన్మానించారు. ఉత్తర పరరాజా ప్రియ మోహన్ ముఖోపాధ్యాయ, సోవాబజార్ మహారాజా, మహారాజా వినయ్ కృష్ణదేవ్ బహుదూర్, దర్భంగా మహారాజా, మహారాజా నరేంద్రకృష్ణ బహుదూర్, మహారాజా గోవిందలాల్ రాయ్ బహుదూర్, రాజా రాజేంద్ర నారాయణ్ బహుదూర్ గారలు సన్మాన సంఘంగా ఏర్పడి ముందుకు వచ్చారు. రాజా రాధాకాంతదివ్ భవన ప్రాంగణలో స్వాగత సభ జరిగింది. గ్వాలియర్ మహారాజా వచ్చి పాల్గొన్నారు. తరువాత స్వామీజి డార్జిలింగ్ వెళ్ళగా బర్ద్వాన్ మహారాజా తన భవనాన్ని వాడుకోమని వివేకానందకు యిచ్చాడు. ఇల్లు కట్టుకోడానికి కాశ్మీరు మహారాజా స్థలం యిచ్చాడు. అద్వైత ఆశ్రమ నిర్మాణానికి గాను భింగరాజా డబ్బిచ్చాడు. వివేకానందకు ఎటుచూచినా స్వదేశీ సంస్థానాధిపతులు, జమిందారులు, యువరాజులు, సంపన్నులు అండగా నిలచారు. ఆదరించారు. రాజాలపట్ల తన ప్రేమను వెల్లడిస్తూ వివేకానంద 1897 మేలో జునాగడ్ దివాన్ కు ఉత్తరం వ్రాశాడు. సముద్ర ప్రయాణం చేసినందుకు తనను వెలివేస్తే, తనతో సాంగత్యం గల దేశీయ సంస్థానాధిపతుల్ని కూడా వెలివేయాల్సి వస్తుందని 1897 జులై, 9న సిస్టర్ మేరీకి వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు. వివేకానంద సన్యాసి అయిన తరువాత ఆయనకు ఘనంగా మహారాజా వినయ్ కృష్ణదేవ్ బహద్దూర్ ఒక విందు ఏర్పరచాడు. (ది బెంగాలీ పత్రిక సంపాదకీయం 1895 మే 18)

దేశీయ ప్రభువుల్ని శ్లాఘించడంలో వివేకానంద వెనుకాడలేదు. బ్రిటిష్ వారి పాలనలో కరువు తాండవిస్తుండగా స్వదేశ సంస్థానాలు హాయిగా వున్నాయన్నాడు. (1899 అక్టోబరు 30 మేరీకి లేఖ) అంతటితో ఆగలేదు. బ్రిటిష్ వారిని తరిమేసి స్వదేశ సంస్థానాధిపతులకు పట్టం కట్టాలని ఉవ్విళ్ళూరాడు. అందుకు గాను ఒక కూటమి ఏర్పాటు చేయాలనుకున్నాడు. అవసరమైతే ఆయుధాలు ప్రయోగించడానికి గాను తుపాకులు తయారు చేసే సర్ హిరాం మాక్సింతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. (పరివ్రాజక్ పుట 123).


వివేకానందపై తిరుగుబాటు :


1899లో గిరీంద్ర, హరధన్ అనే యిరువురి నాయకత్వాన కొందరు భక్తులు బేలూరు మఠం నుండి చీలిపోయి, వివేకానంద చర్యలకు నిరసనగా పేదల రామకృష్ణ సభను ఏర్పరచారు. స్వామిజీ సహజంగానే దీనిని అంగీకరించలేదు. ఎదురు తిరిగిన బేలూరు మఠం భక్తులు అక్కడ జరిగే ఉత్సవాలను, చివరకు రామకృష్ణ జన్మదినోత్సవాన్ని సైతం బహిష్కరించారు. సన్యాసిగా వుంటానన్న వివేకానంద జమిందార్ల సాంగత్యంలో చేసే పనులు నచ్చక యీ తిరుగుబాటు వచ్చింది.

అమెరికాకు రెండు పర్యాయాలు వెళ్ళిన వివేకానంద ప్రధానంగా ధన సేకరణకే ప్రయత్నించాడు. కాని కొంతవరకే సఫలీకృతుడైనాడు. అమెరికాలో సంపన్నులు కొందరు శిష్యులైన పిమ్మట వివేకానందకు డబ్బు కొరతలేదు. ఇండియాకు తిరిగి వచ్చిన వివేకానంద దేశంలోని ఉగ్రవాదులకు (టెర్రరిస్టులు) ఉత్తేజాన్ని కలిగించాడు. అమెరికాలో వుండగా వివేకానందకు క్రైస్తవ సంఘాలతో, యూనిటేరియన్ చర్చితో బాగా సన్నిహిత పరిచయం ఏర్పడింది. వారి సేవాదృక్ఫధం ఆయన్ను ఉత్తేజపరచింది. క్రైస్తవ సోషలిస్టుల నినాదాలు, సేవలు ఆయన్ను ఆకట్టుకున్నవి. వీటన్నిటిని రంగరించి, ఇండియాలో రామకృష్ణ మిషన్ ఏర్పరచాడు. సాంఘిక సేవ అనేది మతపరంగా చేయడం సన్యాసులకు యిష్టం లేకున్నా వివేకానంద మాత్రం యీ విషయంలో పట్టుదలగా ముందుకు పోగలిగాడు.

అయితే హైందవ ఔన్నత్యం అనే అతి జాతీయవాదాన్ని బోధించిన వివేకానంద, ఫాసిజానికి పునాదులు వేశాడు. పాశ్చాత్య దేశాలకన్నా ఇండియా గొప్పది అనే శుష్కనినాదం తాత్కాలికంగా కొందరిని ఉత్తేజపరచినా ఆచరణలో ప్రయోజనం లేదని తేలింది. హేతువాదాన్ని చంపడానికి ప్రయత్నించిన వివేకానంద దేశంలోని మూఢ విశ్వాసాలకు పునాదులు గట్టిపరచాడు. ఆధునీకరణ గావించడాన్ని పాశ్చాత్యంగా భోధించాడు.


రెండు వ్యక్తిత్వాలు :


వివేకానందలో రెండు వ్యక్తిత్వాలున్నవి ఒకటి దేశభక్తి, బాధితుల పట్ల ఆదరణ. దీనితోనే ఆయన చాలా మందిని ఉత్తేజపరచగలిగాడు. రెండవది వేదాంతసారమైన మాయావాదం. సంపన్నులంతా యీ మాయావాద వివేకానంద పట్ల ఆకర్షతులయ్యారే గాని, ఆయన సేవాతత్పరతను చూచికాదు. తప్పనిసరి పరిస్థితులలో బ్రహ్మచారిగా వుండిపోవలసిన వివేకానందను సన్యాసిని చేసి రామకృష్ణ మరీ యిబ్బంది పెట్టేశాడు. ప్రకృతి ఆయనపై కసి తీర్చుకోగా 39 సంవత్సరాలకే 1902లో వివేకానంద చనిపోయాడు.

రామకృష్ణ తెలిసీ తెలియక జమిందార్లకు ఉపయోగపడితే, వివేకానంద కావాలని జమిందార్లను వెనకేసికొని, వారికి అండగా నిలిచాడు. పేదల పొట్ట గొడుతున్న జమిందార్లను ప్రజల ఆగ్రహానికి గురికాకుండా వేదాంత చక్రాన్ని అడ్డేశాడు. దొపిడీ విధానానికి అణచివేతకు అండగా నిలిచాడు. పేదలపట్ల ఎంత జాలి చూపినా, జమిందార్లకే ఫలితం దక్కింది.


చిట్కాయోగం :


వివేకానంద యోగ ప్రచారాన్ని అగేహానంద భారతి విమర్శించాడు. ఆత్మ పరమాత్మల సంలీనాన్ని సూచించే లయ యోగానికి వివేకానంద రాజయోగం అనే ఆకర్షణీయ పదం వాడాడన్నారు. గురువు లేకుండా యోగం అభ్యసిస్తే ప్రమాదకరమని హెచ్చరించిన వివేకానంద, అలాంటి ప్రమాదాన్నే చిట్కా కరపత్రాలలో ప్రచారం చేశాడన్నారు. వైద్యం చేసేవారు నాలుగు రకాల డాక్టర్లన్నట్లు, యోగాన్ని 4 రకాలుగా వర్గీకరించి వివేకానంద ప్రచారం చేయడాన్ని భారతి పెద్ద దోషంగా పేర్కొన్నారు. రాజ, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల పేరిట వివేకానంద చేసిన ప్రచారం ఆధారంగా చాలా మంది పాశ్చాత్య లోకంలో, అదే పరమసత్యం అనే భ్రమలో వున్నట్లు భారతి చూపారు. పతంజలి యోగాన్ని వక్రీకరించిన వివేకానందను, కొందరు స్వాములు బాగా వాడుకుంటున్నారన్నారు.

4 comments:

TV de LCD said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the TV de LCD, I hope you enjoy. The address is http://tv-lcd.blogspot.com. A hug.

MP3 e MP4 said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the MP3 e MP4, I hope you enjoy. The address is http://mp3-mp4-brasil.blogspot.com. A hug.

Anonymous said...

See here or here

koresh said...

motthaniki goppa maanasika aanandanni pondinnatlunnaru, enni cotradictions unnayo indulo, nastika innayya garena idi raasindi, santhosanga unda,enjjoy.........