Monday, March 10, 2008

సాహితీపరులతో సరసాలు -12

Rachakonda Viswanadha Sastry

రావిశాస్త్రి

(1922-1993)

రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనలంటే ఎంతో మందికి యిష్టం లేదు. రావిశాస్త్రి ఏది రాసినా పడీ పడీ చదివి, అభినందించేవారెందరో! ఈ వైవిధ్యానికి కారణాలు లేకపోలేదు. విశాఖపట్నం ప్రాంతంలో భాష, యాస వంటబడితే నచ్చితే, రాచకొండకు తిరుగులేని అభిమానులౌతారు. లేకుంటే దూరంగా పెట్టేస్తారు.

సంస్కృతంలో కాళిదాసు రచనలకు ఉపమానాలు బాగా వన్నెతెచ్చాయంటారు. అదేమో గాని తెలుగులో ప్రజల భాషతో రాచకొండ ఉపమానాలు చాలా గొప్పగా వుంటాయి. బీనాదేవి తప్ప మరెవరూ ఆ దరిదాపులకు రాలేకపోయారు. రచనలతో బాటు కోర్టులను, ప్లీడర్లను, డాక్టర్లను, గుడిసెల జనాన్ని ఎంత పరిశీలించాడో రావి శాస్ర్తి. అది ఆయన జీవితమంతా కనిపిస్తుంది. సామాన్యుల జీవితాల్ని కథల్లో, నాటకాల్లో, నవలల్లో రాచకొండ రాసిన తీరు ఒక పట్టాన పట్టు బడేది కాదు.

1995 ప్రాంతంలో అమెరికాలోని ఫిలడల్ఫియాలో రాచకొండ నరసింహశాస్త్రిని కలిశాను. ఆయన రావి శాస్ర్తి సోదరుడుని తెలిసి, కాస్త ఇంటర్వ్యు చేశాను. తన సోదరుడి రచనలు కొన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయదలచినట్లు చెప్పారు. సంతోషించాను. కాని చాలా జటిలమైన ప్రయత్నం అన్నాను. రాచకొండ నుడికారంలోనే ఆ కష్టం వుంది. నరసింహశాస్త్రి డాక్టర్ గా రిటైర్ అయి, విశాఖకు వెళ్ళిపోయారు తరువాత.

గోరాశాస్త్రి నన్ను రాచకొండకు పరిచయం చేశారు. 1970 ప్రాంతాల్లో ఆరంభమైన ఆ పరిచయం చివరి దాకా సాగింది. మేము హైదరాబాద్ నియోమైసూరు కేఫ్ (అబడ్స్ సెంటర్) లో కలసినప్పుడు, సి. ధర్మారావు వచ్చి చేరేవారు.

రాచకొండ శిష్యుడు, మిత్రుడు, అనుచరుడు సంకు పాపారావును మిత్రుడు తుమ్మల గోపాలరావు పరిచయం చేశారు. పాపారావు అనేక విషయాలు చెప్పారు రాచకొండ గురించి, వారిద్దరికీ చివర్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, రాముడికి దేవాలయాలుంటే, హనుమంతుడికీ గుడులుంటాయని సంకు పాపారావు అనేవారు.

కన్యాశుల్కంలో, నిజం నాటకంలో రాచకొండ పాత్రధారి అయినప్పుడు చూచి సంతోషించాను. రాచకొండతో పరిచయమయ్యేనాటికే ఆయన రచనలు కొన్ని చదివాను. ఆ తరువాత చాలా చదివాను. నాకు బాగా నచ్చిన రచనలవి.

కనక మహాలక్ష్మికి మొక్కడం మొదలు విరసం (విప్లవ రచయితల సంఘం) వరకూ పయనించిన రావి శాస్త్రి చివరి దశలో అజ్ఞేయవాది (Agnostic) గా మిగిలానన్నాడు. రచనలకు పరిమితంగాని ఆచరణ వాదిగావడంతో 1975లో ఇందిరాగాంధి విధించిన ఎమర్జన్సీలో జైలు పాలయ్యాడు.

హాస్య ప్రియుడు రావిశాస్త్రి, చతుర సంభాషణకారుడు. బాగా ఔపోసనం నాలుగు పెగ్గులు పట్టించినప్పుడు సమయస్ఫూర్తి జోక్స్ చెప్పి, నవ్వించేవాడు. అందులో పచ్చివీ, ఎండువీ మిళితమై వుండేవి. ఒకసారి మాటల్లో ఒకాయన చెబుతూ రావిశాస్త్రి స్నేహితుని భార్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు. అయితే భోజనం ఎలా మరి అని రావిశాస్త్రి పరామర్శించాడు. వంటావిడ వుందని చెప్పగా మంచిదే... తింటాడన్నమాట అన్న రావిశాస్త్రి సమయోచిత శృంగార పలుకులు, విస్కీమత్తులో నవ్వులు పుట్టించాయి. కోర్టులో మాజిస్త్రేట్ బోనులోని ముద్దాయిని చూస్తూ అనుకున్నాడట. ఇంత చదువుకున్న నేనే దొంగలంజ కొడుకునైతే, వాడెలాంటి వాడు కావాలి అని, పూర్తి శిక్ష కుమ్మేశాడట.

రాచకొండకు ఇరువురు భార్యలు, విశాఖపట్నంలో రిక్షా వాళ్ళందరికీ ఆపద్భాంధవుడైన రాచకొండ తాగినప్పుడు ఎక్కడకు తీసుకెళ్ళాలో వారందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన ఒక రిక్షావాడు ఒకనాడు రాచకొండను అలాంటి దశలో పెద్ద భార్య దగ్గరకు తీసుకెళ్ళి తలుపు తడితే. ఏరా, ఆసికాలా, ఏసికాలా అంటూ తలుపేసుకున్నదట. అప్పుడు రెండో భార్య దగ్గరకు చేరేశాడట. స్వవిషయం చెప్పికూడా రాచకొండ నవ్వించాడు.

రాచకొండ సీరియల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడలేదు గాని, అచ్చయిన తరువాత చదివి ఆనందించిన పాఠకులలో నేనూ వున్నాను. ఆరు సారాకథలు, ఆరు సారోకథలు, నిజం నాటకం, రాజు మహిషి, సొమ్ములు పోనాయండి, అల్పజీవి అభిమాన రచనలు.

పేదల్ని ఆదుకునే ప్లీడర్ గా రావిశాస్త్రి ఒకసారి ఆసక్తికరమైన కేసును ఎదుర్కోవలసి వచ్చింది. రాజమండ్రిలో బోగం యువతికి అండగా నిలచినందుకు, నిరసనగా వినుకొండ నాగరాజు (కమెండో పత్రిక ఎడిటర్ ఉత్తరోత్తరా) కేసు పెట్టాడు. అది చాలా ఏళ్ళు సాగింది. చివరలో రావిశాస్త్రి స్వయంగా కోర్టులో నాగరాజును కలసి పరిచయం చేసుకున్నాడు. అలా ప్రత్యర్థి వచ్చి పరిచయం చేసుకోవడం నాగరాజును ఆశ్చర్యపరచింది. ఇద్దరూ హైదరాబాద్ లో మందు పార్టీ చేసుకుందామనుకున్నారు.

విరసం వారు రాచకొండను తమవాడిగా ముద్రవేసినా, కమ్యూనిస్టేతర వ్యక్తులతో రావిశాస్త్రి సన్నిహితంగానే మెలగాడు. గోరాశాస్త్రితో స్నేహమే అందుకు తార్కాణం. కథ చెప్పడమే కాదు వినడం కూడా తెలియాలంటాడు రావిశాస్త్రి.

విజయవాడలో ఒక సారి రావిశాస్త్రి రెస్కూ హోంకు వెళ్ళారు. వ్యభిచార వృత్తిలో వున్నవారిని తప్పించి, సాధారణ జీవితం గడపడానికి ఉద్దేశించిన ఆ
Rescue Homeలో రావిశాస్త్రికి లోగడ తెలిసిన వారెందరో వున్నారు. వారిని పేరు పేరునా పిలిచి పరామర్శించి, కష్టసుఖాలు తెలుసుకున్నారు. పక్కనే వున్న తుమ్మల గోపాలరావు యిదంతా చూచి, ఆశ్చర్యపోయారు. రావిశాస్త్రి వారి పట్ల కనబరచిన మానవ సంక్షేమ దృష్టి గమనార్హం.

సుంకు పాపారావు ఎన్నో అంశాలు ఆసువుగా రావిశాస్త్రికి చెబుతుండేవారు. పోలీస్ ఉద్యోగం చేసిన పాపారావు తన అనుభవాలను, పోలీస్ ధోరణిలో చెబితే, తన యితివృత్తాలుగా రావిశాస్త్రి వాడారు. అలాంటివి గుర్తించి పాపారావుకు ధన్యవాదాలు చెప్పారుకూడా. హనుమంతుడి తోక ఎంతుందో R & B (రోడ్డు భవనాల శాఖ) కొలిచిందా ఏమిటి అంటూ సుంకు పాపారావు యధాలాఫంగా హాస్యంగా వాడే విషయాలు రావి శాస్త్రి కలంలో నిలిచాయి.

రచనలు : దేముడే చేశాడు (కథ), అల్పజీవి (నవల), కధాసాగరం (నాటిక), వచ్చేకాలం (నాటిక), ఆరు సారాకథలు, నిజం (నాటకం), ఆరు చిత్రాలు (కథలు), ఆరు సారో కథలు, మరో ఆరు చిత్రాలు, రాజు మహిషి (నవల), విషాదం, కలకంఠి, బాకీ కథలు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, ఋక్కులు, రత్తాలు-రాంబాబు, సొమ్ములు పోనాయండి, మూడు కధల బంగారం నవల, ఇల్లు-నవల.

5 comments:

krish said...

నమస్తే, మీ అర్టికాల్స్ అన్ని చదువుతున్నాను. ఎన్నో తెలియని విషయాలు మీ ద్వారా తెలుసు కొంటున్నందుకు ఆనందంగా ఉన్నది. కమేన్దో నాగ రాజు గురించి .. తెలిసుకోవాలని ఉంది. అప్పట్లో ఆ పత్రికకు నేను రెగ్యులర్ రీడర్ని.

innaiah said...

వినుకొండ నాగరాజు ఇప్పటికి కమండొ పత్రిక నడుపుతున్నారు.వూబిలొ దున్న నవల రాశారు. సాహిత్య అకాడమి అవార్డ్ నిరాకరించారు.

Anonymous said...

See Here

koresh said...

racha konda rachnala goppadanaani cheppandi mastaru, siggodilesina vedava vishayyaalu anni dabba gabbu nu vaayinchi mi medha sakthini chinna paruchu kovaddu plz

మాలతి ని. said...

రావిశాస్త్రిగారి కథలని ప్రత్యేకశ్రద్ధతో చదివి ఆనందించినవారిలో నేను కూడా వున్నాను. ఆయనకథల అనువాదాలు పుస్తకంగా వచ్చింది, values and other stories అన్నపేరుతో. దానిమీద వీలైతే మీ అభిప్రాయం రాయగలరు.