Thursday, March 6, 2008

సాహితీపరులతో సరసాలు -11























Narla Venkateswararao
వి.ఆర్. నార్లతో మాటామంతీ, పిచ్చాపాటీ -2

అకాడమీలపేరిట జరిగిన కులప్రచారం, దుర్వినియోగాన్ని నార్ల విమర్శించి, వాటి రద్దుకు కారకులయ్యారు. ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా, నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహా దారుగా నియమించారు. అప్పుడు వచ్చిన ఫైళ్ళను నాకిచ్చి చూచి పెట్టమన్నారు. చేత నైనంత వరకు తోడ్పడ్డాను. 1982 నాటి మాట అది.

ఆంధ్రజ్యోతి యజమాని కె.ఎల్.ఎన్. ప్రసాద్ కు నార్లకు అభిప్రాయ భేదాలురాగా నార్ల అతి తీవ్రస్థాయిలో ఆయనపై దాడి చేశారు. ఇంటికి వచ్చిన వారికి ఆ విషయాలే ఏకరువు పెట్టేవారు. వద్దని ఆయన భార్య సులోచన చెప్పినా వినిపించుకోలేదు. కొందరు ఇంటికి రావడం మానేశారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్ లోగుట్టు అంతా నార్ల రట్టు చేసి, ఆయన్ను ఉతికేశారు. ఆవివాదంలో నేను నార్ల పక్షానే నిలిచాను. ఆంధ్రజ్యోతికి ఎడిటర్ గా రాజీనామా చేసిన ఘట్టం అది.

ఆంధ్రజ్యోతి స్థాపనకు ప్రధాన కారకుడు నార్ల. ఆయన్ను చూచి చాలా మంది షేర్లు కొన్నారు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త వరవడులు ప్రవేశపెట్టారు. 1970 ప్రాంతాలలో హైదరాబాద్ లో స్థిరపడి, సంపాదకీయాలు టెలిప్రింటర్ ద్వారా పంపేవారు. ఆయన రాత ఒక పట్టాన అర్థం అయ్యేదికాదు. ఉడయవర్లు అనే జర్నలిస్టు తిప్పలు బడి రాసి పంపేవాడు. నండూరి రామమోహనరావు కొన్నాళ్ళు నార్ల వలె సంపాదకీయాలు రాసే ప్రయత్నం చేశారు.

ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా నార్ల రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆయన్ను ఢిల్లీలో నేను కలిసినప్పుడు, మ్యూజియంలకు వెళ్ళేవాళ్ళం. నార్లకు వేలాది ఇంగ్లీషు, తెలుగు గ్రంథాలుండేవి. వాటి పోషణ అంతా ఆయన భార్య సులోచన చేబట్టింది. తమ పూర్వీకులు బ్రటిష్ సైన్యానికి ఎడ్ల బండ్లపై ఆహారం సరఫరా చేసే కంట్రాక్టు తీసుకున్నారని నార్ల చెప్పారు. ఆ విషయాలు వున్న గ్రంథాలు చూపెట్టేవారు. ఆయన చనిపోయిన తరువాత ఆ గ్రంథాల్ని ద్రవిడ పరిశోధనా సంస్థ పేరిట తార్నాకలో పెట్టాం. కాని అట్టే కాలం అది సాగలేదు. తరువాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి తరలించగలిగాం. అక్కడ సురక్షితంగా వున్నాయి. బౌద్ధానికి చెందిన కళాఖండాలు, మినీ విగ్రహాలు నార్ల సేకరించి ఇంట్లో పెట్టుకున్నారు. బిర్లా సంస్థ ఆడి గినా వారికి యివ్వలేదు.

తరచు ఆదివారాలు హైదరాబాద్ లో అబిడ్స్ ప్రాంతాన పేవ్ మెంట్స్ పై పాత పుస్తకాలు వెతికే నార్లకు నేను కూడా ఎప్పుడైనా జతగూడేవాడిని. ఆయనకు యీ అలవాటు మద్రాసులో మోర్ మార్కేట్ నుండి, విజయవాడ వీధుల ద్వారా హైదరాబాద్ వరకూ వచ్చింది. జీవిత మంతా అలాంటి అన్వేషణ చేశారు.

కార్ల్ మార్క్స్ కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం అనే వ్యాసాలు పరిశోధనాత్మకంగా రాశాను. వాటిని ఆంధ్రజ్యోతిలో ఆదివారాలు 1975 ప్రాంతాల్లో ప్రచురించారు. తొలుత వీటిని నండూరి రామమోహనరావు అభ్యంతర పెట్టారు కాని నార్ల

ఆదేశాల మేరకు ప్రచురించగా, సంచలనం ఏర్పడింది. సమాధానం రాయమని మాకినేని బసవపున్నయ్యను అడిగారు. ఆయన రాయలేదు. మిగిలిన కమ్యూనిస్టు లెవరూ రాయలేకపోయారు.

జి.వి. కృష్ణారావు బి.ఎ. డిగ్రీతోనే 1950 ప్రాంతాల్లో పింగళి సూరన కళాపూర్ణోదయంపై పి.హెచ్.డి. సిద్ధాంతం ఇంగ్లీషులో రాసి మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఆయన ఇంగ్లీషు బాగా లేదని ఎగ్జామినర్లు ఒక పట్టాన థీసిస్ను అంగీకరించలేదు. బోర్డులో పింగళి లక్ష్మీ కాంతం వంటి పండితులున్నట్లు నార్ల తెలుసుకున్నారు. వారిచ్చిన అభిప్రాయంలోనే ఇంగ్లీషు తప్పులు చూపి, వీరికి తప్పుల పట్టే అర్హత లేదని, కుల పక్ష పాతంతో కుంటి సాకులు పెడుతున్నారని, నార్ల వైస్ ఛాన్సలర్ కు తీవ్రస్థాయిలో రాశారు. అది తెలిసి తక్షణమే పి.హెచ్.డి. యిచ్చేశారు. ఆ తరువాత నేను దానిని తెలిగించి గోలకొండ పత్రికలో సీరియల్ గా (1962లో) ప్రచురించాను.

సాహిత్యాన్ని, జర్నలిజాన్ని ఔపోశనం పట్టిన నార్ల, కళాభిమాని. సంజీవదేవ్ వంటి వారిని పరిచయం చేశారు. రచనలతో ఉద్యమాలు నడిపిన దిట్ట. స్వయంగా స్వాతంత్రోద్యమంలోనూ, ఆంధ్ర రాష్ట్రం కోసం, విశాలాంధ్ర నిమిత్తం పోరాడారు. ఏది చేసినా తీవ్రస్థాయిలోనే వుండేది.

నార్లకు నేను చాలా సన్నిహితుడనయ్యాను. ఆయన వాయిస్ రికార్డు చేస్తూ, జీవితాను భవాలను ఇంటర్వ్యూగా రూపొందించాం. ఇందులో కె.బి. సత్యనారాయణ (బుక్ లింక్స్ సంస్థ యజమాని) పి. సత్యనారాయణ కూడా వున్నారు. 1930 నుండీ 1984 వరకూ నార్ల రచనలు చేశారు. విదేశాలు పర్యటించి, కళాఖండాలు, సాహిత్యం పరిశీలించారు. రాజ్య సభ సభ్యుడుగా అంత రాణించలేదు. తన అనుభవాలను, ఆలోచనలను అనేక పర్యాయాలు నాకు చెప్పారు. అది గొప్పనిధి.

నార్ల ఎప్పుడూ ఏదొక రుగ్మతతో బాధపడుతుండేవారు. మధురాపుట్ అని కాలికి జబ్బు. గుండెపోటు రెండు సార్లు వచ్చింది. విపరీతంగా తాగే సిగరెట్లు అప్పటితో మానేశాడు. కొన్నాళ్ళు చెవుల్లో రొదతో సతమతమయ్యారు. ఆ దశలో పావులూరి కృష్ణ చౌదరి ప్రవేశించి హోమియో చికిత్స చేశారు. అది అశాస్త్రీయమని, దాని వలన నయం కాదని నేను చెప్పేవాడిని. చివరకు నా మాటే నిజమైంది. తియ్యటి మాత్రలతో తీవ్రరోగాలు నయంకావని, హోమియోలో నిరూపణ అయిన మందు లేదని తేలింది. చివరకు నార్ల నా వాదన అంగీకరించారు. హోమియో వైద్యానికి స్వస్తి పలికారు.

నార్ల తన సుదీర్ఘ అనుభవాలలో అనేకం నాకు వెల్లడించేవారు. ఆయనకు త్రిపురనేని రామస్వామి రచనా శైలి నచ్చలేదు. త్రిపురనేని గోపీచంద్ కు ఆయనకూ పడలేదు. గోపీచంద్ ఆపదలో వున్నప్పుడు సహాయపడినా, విశ్వాసం లేదని నార్ల అనేవాడు. కాని గోపీచంద్ చనిపోయినప్పుడు ఎంత గుండె గలవాడికీ గుండె పోటు అంటూ ఎత్తుగడతో గొప్ప సంపాదకీయం రాశారు.

నార్ల దగ్గర వుద్యోగం చేసిన తిరుమల రామచంద్ర వెర్రి వేషాలేస్తే, ఉద్యోగానికి వుద్వా సన చెప్పారు. అప్పుడు వేటూరి ప్రభాకర శాస్త్రి వచ్చి, చేతులు పట్టుకొని, వాడు బుద్ధి హీనుడు, కాని ఉద్యోగం లేకపోతే బ్రతకలేడు. దయచేసి ఉద్యోగం యివ్వండి. నేను హామి యిస్తున్నాను అని రామచంద్ర పక్షాన అన్నారు. నార్ల ఆయన మీద గౌరవం కొద్దీ ఉద్యోగం యిస్తే మళ్ళీ కొన్నాళ్ళకు తోకాడించాడు. తిరిగి ఉద్యోగం కోల్పోయాడు. ప్రభాకరశాస్త్రి (మీగడతరకలు ఫేం) ఏమీ అనలేక నొచ్చుకున్నారు.

నార్ల ఏ రాజకీయ వాదినీ వదలలేదు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఆయన కలానికి గురైన వారే. కమ్యూనిస్టులను వెంటాడి బాదేసిన ఖ్యాతి నార్లదే. ఎన్.జి. రంగాపై ధ్వజం ఎత్తినప్పుడు, గోగినేని రంగనాయకులు అని పతాక శీర్షికలతో రోజూ ఆయన వార్తలు ప్రచురించేవారు. రంగా గింజుకున్నారు. అమ్మ నాన్న పెట్టిన పేరు వాడితే అంత గింజులాట దేనికి అని నార్ల అనేవాడు. ఏడిపించడంలో నార్ల జర్నలిజాన్ని అలావాడారు.

మీరు మేము అనే విచక్షణ చూపిన సంజీవరెడ్డిపై రోజూ కార్టూన్లు వేయించి (వాసు కార్టూనిస్టు) తల తిరిగేటట్లు చేయగలిగిన సత్తా నార్ల జర్నలిజానిదే. ప్రెస్ బిల్లు పెట్టి పత్రికా స్వాతంత్యాన్ని హరించాలని బ్రహ్మనంద రెడ్డి తలపెడితే, నార్ల ప్రతిఘటించిన తీరు, 1968లో జర్నలిజానికి వన్నె తెచ్చింది.

మూడు దశాబ్దాలు పేరిట నార్ల సంపాదకీయాలు వెలువడినప్పుడు వాటిని నమూనాగా తీసుకొని ఎ.బి.కె. ప్రసాద్ వంటి వారు తమ సంపాదకీయాలు వేసుకున్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావుకు నార్లను పరిచయం చేశాను. ఆయనెంతో సంతోషించారు.

నార్లకు ఆయన కుటుంబానికీ నేను సన్నిహితం కావడంతో, నార్ల పుస్తకానికి నాకుమార్తె నవీన, నాకుమారుడు రాజు ఇండెక్స్ తయారు చేసిపెట్టారు. Man and his world లో నార్ల ఆ విషయంరాశారు.

నార్లలో భిన్న కోణాలు, రాగద్వేషాలు చూపడానికి యిన్ని వివరాలు రాశాను.

రచనలు : కొత్తగడ్డ - నాటికలు, జగన్నాటకం, నేటి రష్యా, జాబాలి, సేత జోస్యం, నరకంలో హరిశ్చంద్ర పాంచాలి (నాటకాలు), నవయుగాలు బాట (పద్యాలు), మాటమంతీ, పిచ్చాపాటీ (వ్యాసాలు).

English: The Truth about the Gita, An essay on Upanishads, Man and his World, Gods Goblins and Men, Vemana, Gurajada, Veeresalingam.

1 comment:

cbrao said...

mezik సందేశం లోని లింక్స్ ప్రమాదకర వైరస్ సైట్స్ కు వెళ్తాయి కావున వాటి జోలికి వెళ్లవద్దు.mezik లింక్ కు కూడా వెళ్లవద్దు.