Abburi Ramakrishna Rao
అబ్బూరి రామకృష్ణారావు
(1896-1979)
ఆంధ్ర చరిత్రలో ఒక ప్రధాన పాత్ర వహించిన కవి అబ్బూరి. స్టేజి స్పెషలిస్ట్ గా, కవిగా తెలిసిన వారు, ఆయన రాజకీయాలు గుర్తెరుగరు. కమ్యూనిస్టుగా జీవితం ఆరంభించిన అబ్బూరి, రాడికల్ హ్యూమనిస్ట్ గా మారి, చివరకు భక్తుడుగా మిగిలారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్ గా వుంటూ, స్టేజి గురించి శ్రద్ధ వహించారు. అప్పుడే విద్యార్థిగా ఆయన్ను చూచాను. నాడు వైస్ ఛాన్స లర్ గా వున్న కట్టమంచి రామలింగా రెడ్డికి సన్నిహితుడు అబ్బూరి. అబ్బూరి రామకృష్ణారావు తెనాలి నుండి వచ్చారు. ఆంధ్ర యూనివర్శిటీలో ప్రముఖంగా స్థానం సంపాదించారు.
కాంగ్రెస్ లో రాడికల్ పాత్ర చేబట్టిన ఎం.ఎన్. రాయ్ (మానవేంద్ర నాథరాయ్) పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన్ను ఎం. వి. శాస్త్రి ద్వారా ఆంధ్రకు రప్పించాడు. వైస్ ఛాన్సలర్ కు పరిచయం చేశాడు. ఎం.ఎన్. రాయ్ ను యూనివర్శిటీలో చేరమని సి.ఆర్. రెడ్డి చేసిన ఆహ్వానాన్ని, మర్యాదగా రాయ్ తృణీకరించాడు.
అబ్బూరి, కమ్యూనిస్టు కాంగ్రేస్ రాజకీయాలకు భిన్నంగా, రాడికల్ డెమొక్రటిక్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహకుడయ్యారు. 1940 నుండీ 1948 వరకూ ఆ బాధ్యతలు నిర్వహించి, ఎం.ఎన్. రాయ్ మానవ వాద కార్యక్రమాలు ఆంధ్రలో ప్రచారం చేశారు. ఆయనకు తోడుగా విజయనగరంలో తాతా దేవకీనందన్, శ్రీకాకుళం నెల్లిమర్లలో పెమ్మరాజు వెంకట్రావు, కాకినాడలో ములుకుట్ల వెంకటశాస్త్రి తెనాలి నుండి ఆవుల గోపాలకృష్ణ మూర్తి, త్రిపురనేని గోపీచంద్, గుత్తి కొండ నరహరి మరెందరో తోడ్పడ్డారు.
కన్యాశుల్కం మొదలు అనేక నాటకాలు స్టేజిపై నిర్దుష్టంగా ప్రదర్శింపజేసిన అబ్బూరి, మంచి కవి, రచయిత. హైదరాబాద్ లో చివరి దశలో స్ధిరపడ్డారు. ఆయన గురువు ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు, 1954లో ఒక గేయం ఇంగ్లీషులో రాసి డెహ్రడూన్ సమాధిలో వుంచారు.
1966 నుండీ నాకు బాగా సన్నిహితంగా అబ్బూరిని చూచే అవకాశం కలిగింది. ఆలపాటి రవీంద్రనాధ్ నేనూ చాలా సార్లు ఆయన్ను ఇంటి నుంచి సికింద్రాబాద్ సైలింగ్ క్లబ్బుకు తీసుకు వచ్చి, రెండు పెగ్గుల అనంతరం, ఆయన కబుర్లు విని ఎంతో సంతోషించేవాళ్లం.
ఆరోగ్యరీత్యా ఆయన డ్రింక్స్ మానేస్తే మంచిదని డాక్టర్ చెప్పారట. ఆయన భార్య యింట్లోనిష్ఠగా ఆహార పానీయాలు కంట్రోల్ చేసింది. అది భరించలేక మాకు ఫోను చేసేవారు వెళ్ళి, ఆయన భార్యకు హామీ యిచ్చి, బయటకు తీసుకెళ్ళేవాళ్ళం. అదొక పెద్ద అనుభవం.
ఆయన చివరిసారిగా పాల్గొన్న హేతువాద సభ హైదరాబాద్ లో 1970 ప్రాంతాల్లో జరిగింది. మహారాష్ట్రలో వాయ్ WAI నుండి తర్క తీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి వచ్చినప్పుడు సభ ఏర్పరచి, అబ్బూరిని పిలిచాం. అప్పటికే ఆయనలో బాగా వార్ధక్య లక్షణాలు వచ్చేశాయి. హేతువాదం సన్నగిల్లింది. ఆయన వాయిస్ రికార్టుచేశాం. అనుభవాలు చెప్పించాం. ఆ సమాచారాన్ని అబ్బూరి ఛాయాదేవి (ఆయన కోడలు) వాడారు.
ఒకసారి క్లబ్బులో చెప్పిన మాటలు యిలా వున్నాయి. జాబాలి కథ అబ్బూరి చెబుతూ, చదువు నేర్పమని గురువు దగ్గరకు వెడితే నీది ఏ కులం అని అడిగాడట. మా అమ్మను అడిగి చెబుతానని అతడు వెళ్ళాడట. మరునాడు వచ్చి, మా అమ్మ ఎన్నో యిళ్ళలో పనిచేసిందట. అప్పుడు గర్భం ధరించగా, నేను పుట్టానట. కనుక ఎవరికి పుట్టానో చెప్పజాలను అన్నదట. ఈ విషయం విని, నిజం చెప్పావు గనుక నీవు బ్రాహ్మణుడికే పుట్టి వుంటావని, గురువు చదువు చెప్పాడట. ఇలాంటి వ్యాఖ్యానాలు అబ్బూరి ఎన్నో చెప్పేవాడు.
1940 ప్రాంతాల్లో గాంధీని దుయ్యబడుతూ ఆవుల గోపాలకృష్ణ మూర్తి వ్యాసం రాస్తే, ఘాటైన విమర్శ భరించలేక, అబ్బూరి దానిపై ఎం.ఎన్. రాయ్ కి ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ అది చదివి, ఆవులను ఏమీ అనలేక పోయాడు.
అబ్బూరికి వరద రాజేశ్వరరావు, గోపాలకృష్ణ అని యిరువురు కుమారులు. రాయ్ అనుచరులుగా వారూ వుండేవారు. ఒకసారి ఒక విదేశీ పండితుడు ఆంధ్ర యూనివర్శిటీకి వచ్చి, సి.ఆర్. రెడ్డి ఎక్కడ వుంటాడని అబ్బూరిని అడిగాడు. ఆంధ్ర యోని వర్శిటీలో అని నర్మ గర్భంగా జవాబు చెప్పాడట.
రచనలు : అభినవ కవితా ప్రశంస (వ్యాసం), సూర్యరాజు (కథలు), ఊహాగానం, నదీ సుందరి, మంగళ సూత్రం (నవల), త్రిశంకు (కావ్యం), చాటువులు. అనువాదాలు – రవీంద్ర రచనలు.
Thursday, May 8, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Nice Post !
Use a Telugu social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.
Post a Comment