Sunday, May 18, 2008

పుస్తక సమీక్ష

సుభాష్ బోసు గెలవక పోవడమే మంచిది!

1. Milan Hauner : India in Axis Strategy, 1981, Klett-Cotta, Stuttgart.
2. Agehanand Bharathi : The Ochere Robe, 1961, George Allen and Unwin, London.

సుభాష్ చంద్రబోసు చనిపోయిన తరువాత చాలా గాధలు వ్యాపించాయి. కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేసింది. వీరభక్తులు కొందరు చిలవలు పలవలుగా బోసు గురించి వదంతులు ప్రచారంలో పెట్టారు. హిమాలయాలలో వున్నాడన్నారు. తిరిగి వస్తాడన్నారు.
ఒకవైపు గాంధీజీ మరో పక్క ఎం.ఎన్. రాయ్ సలహాలు చెప్పినా బోసు వినిపించుకోలేదు. బ్రిటిష్ వారిని దేశం నుండి ఎలాగైనా తరిమేయాలనే పట్టుదలతో బోసు వ్యవహరించారు. చిత్త శుద్ధిలో లోపం లేదు. ఎటోచ్చీ ఆ వేశంలో విచక్షణ తగ్గింది.
జైలునుండి తప్పించుకుని రహశ్యంగా రష్యా మీదుగా వెళ్ళి జర్మనీలో హిట్లర్ ను కలసిన బోసుకు ఏమైంది? ఆ తరువాత జపాన్ వారెలా ప్రవర్తించారో గమనిస్తే, బోసు చేసింది ఏమంత విజ్ఞతతో కూడిన పనికాదనిపిస్తుంది.
1942 మే 27 సాయంత్రం హిట్లర్ ఎట్టకేలకు బోసుకు దర్శనమిచ్చాడు. అప్పుడు రిబ్బన్ ట్రాప్, కెప్లర్, హెవెల్ కూడా వున్నారు. హిట్లర్ ను వృద్ధ విప్లవ కారుడుగా పేర్కొని బోసు అభివాదం చేశాడు. జపాన్ చేతుల్లోకి ఇండియాకు సంబంధించిన ప్రచారం పూర్తిగా పోకుండాచూడమని, తరువాత తన పథకాన్ని బోసు చెప్పాడు.
హిట్లర్ ఏక పాత్రాభినయంలో ప్రసంగం వలె భవిష్యత్తులో ప్రపంచాన్ని గురించి తన భావాలేమిటో ఏకరువు పెట్టాడు. శత్రువును పూర్తిగా ఓడించకుండా ఇండియా స్వాతంత్ర్య ప్రకటన చేసినందువలన ప్రయోజనం లేదన్నాడు. తానొక సైనికుడుగా రాజకీయాధికారంతో పోరాడుతున్నందున తప్పుడు అంచనాలు వేయనన్నాడు. ప్రకటన చేయాలంటే తనకు యింకా అనేక డివిజన్ల సైన్యం అవసరమన్నాడు. అయితే మూడు మాసాలలో గాని, ఒకటి రెండు సంవత్సరాలలో గాని అలాంటి అవకాశం లభించగలదన్నాడు. ఇండియా చాలా దూరాన వున్నందున విమానాల్లో చేరగలమని లేదా పర్షయన్ అఖాతం, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కాల్బలంతో వెళ్ళవలసి వుంటుందని అన్నాడు. హిట్లర్ అలా మాట్లాడుతూ ఇండియాకు సరైన దారి రష్యామీదుగా వుందన్నాడు. జపాన్ వారు తరువాత ఏం చేయనున్నారో తెలియదనీ, చాంగ్ కై షేక్ పై దాడి చేస్తారో, ఆస్ట్రేలియా పైకి పోతారో, ఇండియా పైకి వస్తారో చూడవలసి వున్నదని అన్నాడు. ఇండియాకు ప్రత్యక్ష సహాయంతో జర్మనీ పాత్ర తక్కువే అయినా, ఉత్తర ఆఫ్రికాలో సైన్యాల ఓటమి వలన ఇండియాలో జాతీయ పోరాటానికి తోడ్పడినట్లేనని హిట్లర్ చెప్పాడు. బ్రిటిష్ వారిని ఓడించాలంటే ఇండియాలో అంతర్గత పోరాటం, బయట జర్మనీ, ఇటలీ, జపాన్ లు దాడి చేస్తేనే సాధ్యమన్నాడు. జర్మనీ ప్రభావం మాత్రం కొన్ని మాసాలలోనే వుండొచ్చునని అన్నాడు. కనుక జపాన్ వెళ్ళ వలసిందిగా బోసుకు సలహాయిస్తూ జపాన్ వారివ్వక పోతే, తానే ఒక సబ్ మెరైన్ యిస్తానని హిట్లర్ తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాడు.
తనను స్కూలు పిల్లాడివలె హిట్లర్ పరిగణించడం బోసుకు నచ్చలేదు. అయినా మెయిన్ కాంపులో (జైలులో హిట్లర్ రచన) ఇండియన్ల గురించిన వ్రాతలపై వివరణ అడుగుతూ, శత్రువులు వీటి ఆధారంగా తనకు అనుకూల ప్రచారం చేసుకున్నారని బోసు చెప్పాడు.
తన భావాలలో తప్పేమీ హిట్లర్ కు అగుపించలేదు. ఇండియాను చూచిన తరువాత అహింసాయుత పోరాటాన్ని జర్మనీలో నిరుత్సాహ పరచి ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు గురైన వారి ఐక్య సంఘటన ఏర్పరచాలన్నదే తన ధ్యేయమని హిట్లర్ అన్నాడు.
ఇది జరిగిన తరువాత, హిట్లర్ తలబిరుసుగా స్వేచ్ఛా భారతదేశం ఎలా ఉండాలో చెప్పాడు. బ్రిటిష్ ప్రభావాన్ని తటస్థం చేయడం, రష్యా ఒత్తిడికి అడ్డుగా నిలవడం తూర్పు సరిహద్దు గురించి ఒకటి రెండు వందల ఏళ్ళు పట్టొచ్చని హిట్లర్ అభిప్రాయపడ్డాడు.
హిట్లర పై బోసు పెట్టుకున్న ఆశలన్నీ ఆ విధంగా ఏకైక సమావేశంలో పటాపంచలయ్యాయి. కనీసం కొద్ది నిమిషాలైనా ఏ ఒక్క విషయాన్ని గురించి కూడా హిట్లర్ తో చర్చించడం సాధ్యం కాదని బోసు చెప్పాడు. జర్మనీలో 14 మాసాలు పడిగాపులు కాచిన బోసు శ్రమ అంతా వృధా అయింది.
1942 సెప్టెంబరులో బోసు, ఎమిలీషెంకిల్ దంపతులకు కుమార్తె పుట్టింది. బెర్లిన్ లోని ఇండియా కేంద్రాన్ని ఎ.సి.ఎన్. నంబియార్ కు బోసు అప్పగించేశాడు. అప్పటికి ఆ కేంద్రంలో 25 మంది భారతీయులకి, 10 మంది జర్మన్ లు పనిచేస్తున్నారు.
1943 జనవరిలో ఎట్టకేలకు జపాన్-జర్మనీ మధ్య ఒప్పందం వలన బోసు ఒకే భారతీయ అనుచరుడు అబిద్ హసన్ తో పాటు కీవ్ హార్బరుకు చేరాడు. ఫిబ్రవరి 8 జర్మనీ సబ్ మెరైన్ యు-180 ఎక్కాడు. రిబ్బన్ ట్రాప్ వీడ్కోలు తంతి పంపాడు. జపాన్ వారు మడగాస్కర్ కు తమ సబ్ మెరైన్ ను పంపిస్తామన్నారు. ఏప్రిల్ 28న జర్మనీ సబ్ మెరైన్ నుంచి బోసును జపాన్ సబ్ మెరైన్ కు మార్చారు. అక్కడి నుండి బోసు మే 6కు సబంగ్ చేరారు.
1943 మే 16న బోసు టోక్యో విమానంలో వెళ్ళారు. ప్రముఖ రాజకీయ, సైనికాధిపతుల్ని కలిశారు. రాస్ బిహారి బోసు తక్షణమే బోసుకు ఉద్యమ నాయకత్వం అప్పగించారు. జపాన్ ప్రధాని టోజో జూన్ 10న 14న బోసును కలిశారు. బోసుతో సమావేశం టోజోకు బాగా నచ్చింది. ఇండియాకు అన్ని విధాలా తోడ్పడి బ్రిటిష్ వారిని పారద్రోలడానికి కృషి చేస్తామని జపాన్ పార్లమెంట్ డయట్ లో టోజో రెండు రోజుల అనంతరం ప్రకటించారు.
టోకియో రేడియో ద్వారా ప్రతిరోజు ప్రసారం చేయడానికి బోసుకు అనుమతిచ్చారు. సహాయ నిరాకరణోద్యమం సాయుధ పోరాటంగా ఇండియాలో మారాలని, భారతీయులు అగ్ని కణాలతో పునీతమైతేగాని స్వాతంత్ర్యానికి అర్హులుకారని బోసు అన్నారు.
1943 జులై 4న సింగపూర్ లో ఇండియా ఇండిపెండెంట్ లీగ్ అధ్యక్ష పదవిని బోసు అంగీకరించాడు. ఆగష్టు 26న పునర్వ్యవస్థీకరించిన అజాద్ హింద్ ఫౌజు నాయకత్వాన్ని స్వీకరించాడు. 1943 అక్టోబరు 21న స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని బోసు ప్రకటించాడు.
జర్మనీలో నిరాశానిస్పృహలుచెంది, అవమానాలకు గురై, జాప్యానికి విసుక్కొన్న బోసు అక్కడ సైన్యాన్ని సమకూర్చడంలోనూ, నచ్చజెప్పడంలోనూ విఫలుడయ్యాడు.
అయితే చాలామంది భ్రమలో ఉన్నట్లు అజాద్ హింద్ ఫౌజును సుభాస్ చంద్రబోసు స్థాపించలేదు. ఆయన జర్మనీలో ఉండగానే ఆజాద్ హింద్ ఫౌజు ఆసియాలో స్థాపితమైంది. అక్కడ 25 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తుండేవారు. జపాను బందీగా 55 వేల మంది భారతీయ సైనికులున్నారు. బ్రిటిష్ వారు ఓడిపోవడం, ఇండియాకు దగ్గరగా మలయా, బర్మా ఉండటం కూడా కలసివచ్చింది. 1942 వేసవి వరకూ భారత సైనికులను గూఢచారి పనులకు, ప్రచారానికి మాత్రమే జపాన్ ప్రయోగించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అజాద్ హిందుఫౌజు స్థాపనకు ప్రోత్సహం లభించింది. రామస్వరూప్ ముఠాను, అమర్ సింగ్ ముఠాను, సంఘటితపరచి, కెప్టెన్ మన్ మోహన్ సింగ్ ఆధ్వర్యాన ఫౌజు ఏర్పరచడానికి జపాను సిద్ధపడింది.
1942 ఆగస్టులో 40 వేల మంది భారత ఖైదీలు అజాద్ హింద్ ఫౌజులో చేరడానికి సంసిద్ధత వ్యక్తపరచారు. ఇందులో సైనికాధికారుల బెదరింపుల వలన, చిత్రహింసల వలన చేరారు. సెప్టెంబర్ నాటికి పదహారు వేల మూడు వందల మందితో ప్రథమ అజాద్ హింద్ ఫౌజు ఏర్పడింది. మోహన్ సింగ్ మాజీ సైనికాధికారి. ఆయన విజ్ఞప్తికి చాలా మంది ఉద్విగ్నులయ్యారు. జాతీయవాదం, బ్రిటిష్ వారి ఓటమి, తాను నాయకత్వం వహించడం ఫౌజు ఏర్పడడానికి తోడ్పడినట్లు మోహన్ సింగ్ చెప్పాడు.మోసపోయిన సుభాష్
లాహోర్ లో రహమత్ ఇచ్చిన సమాచారం బ్రిటిష్ వారికి ఎంతో ఉపయోగపడింది. సోవియట్ రష్యా రికార్డ్ లలో ఇతడిని గురించి ఏమున్నదో బయటపడితే గాని మరికొన్ని సత్యాలు తెలియవు. ఏమైన రహమత్ మొదటి నుండి సౌవియట్ రష్యాకు విధేయుడుగా ఉంటూ బోసుకు నమ్మకద్రోహం చేశాడు.
1943లో రష్యావారు కాబూల్ లోని జర్మన్ వాణిజ్యాధికారి రస్మస్ ను, ఇతరులను ఇరకాటానబెట్టి వారి రహస్య చర్యలను బట్టబయలు చేస్తామనే సరికి, వారంతా తెల్లబోయి రహమత్ ఖాన్ పేరు చెప్పారు. అయినా ఈ విషయం బైటకు పొక్కితే జర్మనీలో తమ బాధలను గుర్తు తెచ్చుకొని కాబూలులో జర్మనీలు రహమత్ జోలికి పోలేదు. ఇలాంటి వ్యక్తిని నమ్మి సుభాస్ ఎలా మోసపోయోడో చెప్పనక్కరలేదు.
అజాద్ హింద్ ఫౌజు
రద్దయిన ఆజాద్ హింద్ ఫౌజుకు బోసు మళ్ళీ జీవం పోసి 20 వేలకు పెంచాడు. ఝాన్సీరాణి పేరిట స్త్రీల దళాన్ని ఒకటి ఏర్పరచాడు. 10 వేల మందితో కూడిన మరో మూడు దళాల్ని ఏర్పరచాలనే కోర్కె కాగితంపై నిలిచిపోయింది.
1943 అక్టోబర్ లో తాత్కాలిక స్వేచ్ఛా భారత ప్రభుత్వాన్ని సుభాస్ ప్రకటించాడు. రాష్ట్రపతి, ప్రధాని, యుద్ధ మంత్రి, విదేశాంగ మంత్రిగా తన పేరును బోసు ప్రకటించుకున్నాడు. ఉద్యమ నేతగా తనను ఇక ముందు నేతాజీ అని పిలవాలన్నాడు. సైనిక యూనిఫారం వేసుకున్నాడు.
1943 నవంబరులో అండమాన్, నికొబార్ దీవులకు బోసు తాత్కాలిక ప్రభుత్వాన్ని అప్పగించి పెత్తనమంతా తమ సైనాధ్యిపత్యం క్రింద జపాన్ అట్టిపెట్టింది. అజాద్ హింద్ ఫౌజులో నిర్బంధించిన 4 వేల మందిని, వారి నాయకులను, ముఖ్యంగా బోసు నాయకత్వాన్ని తొలుత నుండి కోరిన మోహన్ సింగ్ ను విడిపించడానికి సుభాస్ కించిత్తు ప్రయత్నం చేయలేదు. జర్మనీలో ప్రతి భారతీయ ఖైదీని కాపాడడానికి బోసు ప్రయత్నించాడు.
బోసు ఓటమి
1943 డిసెంబరులో బోసు వెళ్ళి మోహన్ సింగ్ ను జైలులో చూచి చర్చలు జరిపారు. బోసు సరైన వ్యక్తి అయినప్పటికి తగిన సమయం, తగిన సాధన లేదన్నాడు. సింగ్ అజాద్ హింద్ ఫౌజుకు తగిన సాధనా సామగ్రి లేదని బోసు అంగీకరిస్తూనే, తన “ఛలో ఢిల్లీ” నినాదానికి దేశంలోని సైన్యమంతా బ్రిటిష్ వారిపై తిరగబడి, తనను అనుసరిస్తారన్నాడు. మోహన్ సింగ్ సైన్యం నుంచి వచ్చిన వ్యక్తి. బోసు ఆత్మ విశ్వాసం పట్ల అతను దిగ్భ్రమచెంది, పట్టుబడిన సైనికులందరినీ బ్రిటిష్ వ్యతిరేకులుగా చేయడంలో విఫలమైన విషయం గుర్తుచేశాడు. జర్మనీలో బోసు వైఫల్యంతో తిరిగి వచ్చినవాడే. ఇండియాలో జనంగాని సైన్యం యావత్తు, గాని బ్రిటిష్ వారిపై తిరగబడతారనేది మిధ్య అంటూ, జపానుకు వ్యతిరేకంగా వాతారవరణం ప్రబలిందని మోహన్ సింగ్ చెప్పాడు. బ్రిటిష్ వారిని సరైన సమయంలో కొట్టే అవకాశాన్ని జారవిడచిన రీత్యా, బోసు సాహసం కేవలం చెలగాటమవుతుందని హెచ్చరించాడు. బోసుకు మోహన్ సింగ్ వాస్తవిక ధోరణి నచ్చలేదు. 1943 వేసవిలో అజాద్ హింద్ ఫౌజు భారత భూభాగంపై అడుగుపెడుతుందని బోసు సైన్యాలతో చెప్పాడు. జపాను వారు కూడా ఇది విని ఆశ్చర్యపోయారు. జపాను దాడిలో 6 వేల మంది అజాద్ హింద్ ఫౌజును జపాను అనుమతించింది. అది కూడా యుద్ధరంగంలో కాదు. జపాను సైన్యాలకు అండగా సరఫరాలు అందించే ద్వితీయ శ్రేణి ఫౌజుగా అనుమతించారు. ఇంఫాల్ పై దాడిలో జపాను సైన్యాలు చింద్విన్ నదిని దాటారు. అజాద్ హింద్ ఫౌజుకు షా నవాజ్ ఖాన్ ఆధ్వర్యం వహించగా, మరికొందరు ఫౌజులో గూఢచారులుగా దేశంలో ప్రచారానికి వినియోగించబడ్డారు.
పర్వత ప్రాంతాలుగా భారీ వర్షాలవలన దార్లన్నీ కొట్టుకుపోగా, జపాను సైన్యాలకు ఆహారం, ఆయుధాలు సరఫరా కాలేదు. అజాద్ హింద్ ఫౌజువారు స్థానిక గిరిజనులపట్ల క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించి వారి ఆగ్రహానికి గురైనారు. ఫౌజులో చాలా మంది లొంగిపోయారు. కొందరు సైన్యం వదలి పారిపోయారు. 2,20,000 ల జపాను సైన్యంలో బ్రతికిబయటపడిన వారు 1,30,000 మాత్రమే. అజాద్ హింద్ ఫౌజులో బ్రతికిన 2,600 మందిలో 2,000 మంది ఆస్పత్రి పాలైనారు. 715 మంది సైన్యం వదలిపోగా 800 మంది లొంగిపోగా, చనిపోయినవారు 400 మంది. పదిహేను వందల మంది రోగాలతో, ఆకలితో అలమటించి చనిపోయారు. అజాద్ హింద్ ఫౌజు ఎత్తుగడలు, ఎదురుదెబ్బతీసే ధోరణి లోపించిందని జపాను సైన్యాధిపతి పూజివారీ వ్యాఖ్యానించాడు. ఇదంతా 1944 వర్షాకాలంలో జరిగింది.
బోసు దశాలలో దిగజారుడుతనం ప్రబలింది. ఇంఫాల్ లో ఏమీ జరగనట్లే బోసు ఇంకా ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు. బ్రిటిష్ సైన్యాలకంటే అజాద్ హిందు ఫౌజు గొప్పదని ప్రసంగాలు చేశాడు. ఫౌజును ఇంకా విస్తరించి శిక్షణ ఇవ్వాలని, జపాను సైన్యం కాడికింద పారేసినా ఫౌజు పోరాటం సాగించాలని బోసు ఆవేశంతో మాట్లాడేవాడు. బ్రిటిష్ వారిపై పోరాటంలో సోవియట్ సహాయం స్వీకరించాలనే ధోరణి బోసుకు ఆఖరు క్షణాలవరకు అంటే పెట్టుకునే ఉన్నది.
జపానువారు ఫౌజులోని వారు బోసుకు నచ్చజెప్పి ఆయన్ను మంచూరియా ప్రయాణానికి సన్నద్ధం చేశారు. అక్కడకు సోవియట్లువస్తే వారికి నచ్చజెప్పి, సహాయం స్వీకరించాలని బోసు ఆశ. కాని 1945 ఆగష్టు 18న తైవాన్ లోని తైహూకూవద్ద విమాన ప్రమాణ ప్రమాదంలో బోసు దుర్మరణం చెందాడు. ఆకర్షణీయమైన ఉద్రేక పూరితమైన దేశభక్తుడు బోసు అలా అంతమయ్యాడు.
జపాను వారు ఇండియాపట్ల ఏం చేయదలచిందీ బోసుకు ఎన్నడూ చెప్పలేదు. ఆయన్ను వాడుకోవడమనేదే జపాను ఎత్తుగడ. ఉద్రేకంలో, ఉద్వేగంలో ఉన్న బోసు జపానువారి ప్రోత్సాహాన్ని అపార్థం చేసుకున్నారు. జర్మనీవలె ఇండియా స్వాతంత్ర్యం కొరకు జపాన్ తో బోసు పట్టుబట్టలేదు. ఇదీ చరిత్ర. దీనిని నిష్పాక్షికంగా అవగాహన చేసుకోవడం ముఖ్యం.
సుభాస్ చంద్రబోసు పట్ల మనదేశంలో వీరావేశ అభిమానులు ఎందరో ఉండేవారు. వారందరూ ఫాసిజం, నాజీయిజం, జపాను సామ్రాజ్యవాదం పట్ల నిరసన వ్యక్తం చేయలేకపోయారు. ఇందుకు బోసు కారణం. జర్మన్ లు ఆర్యులన్నట్లే, మనమూ ఆర్య జాతివారమనే ఆహంభావం బోసుతోబాటు వీరూ పెంచుకున్నారు. ముందు చూపులేని యీ సంకుచిత జాతీయ భావం వలన, బోసు మనదేశంలో పునర్వికాసానికి ఏమాత్రం దోహదం చేయలేకపోయారు.

1 comment:

bolloju ahmad ali baba said...

caalaa baaguMdi

bollOju baabaa