దేవులపల్లి కృష్ణశాస్త్రి
(1897-1980)
శబ్ద శిల్పి కృష్ణశాస్త్రి. చెవికి యింపుగా లేని పదం తొలగించి మళ్ళీ తగిన పదం లభించే వరకూ పూరించే వాడు కాదు. ఆయన పోగారి.
‘మల్లీశ్వరి’ నుండి ‘వుండమ్మా బొట్టుపెడతా’ వరకూ కృష్ణశాస్త్రి రాసిన పాటలు అనితర సాధ్యాలు. ఒకసారి ఉండమ్మా బొట్టుపెడతా సినిమాకు రాయాల్సిన చివరి పాట ఎన్నాళ్ళకూ పూర్తి చేయలేదు. ప్రొడ్యూసర్లు కలవరం చెందారు. చివరకు గుమ్మడి వెంకటేశ్వర రావును రాయబారం పంపారు. అప్పటికే గొంతు పోయిన కృష్ణశాస్త్రి విషయం గ్రహించారు. గుమ్మడికి ఒకచీటే మీద రాసిచూపారు. ఏమని?
నిజలింగప్పకు ఆరోగ్యంగా లేదు నయం కాగానే రాస్తాను అని.
ఆ మాటే గుమ్మడి వెళ్ళి ప్రోడ్యూసర్లకు చెబితే, ఎక్కడో కర్నాటక ముఖ్యమంత్రి నిజ లింగప్పకు ఆరోగ్యం బాగా లేకుంటే, పాట పూర్తి చేయడానికీ దానికీ ఏమిటి సంబంధం అన్నారు. గుమ్మడి గుట్టు విప్పి, చెప్పాడు. గురువు గారి ఉద్దేశం-నిజ లింగప్ప అంటే, తన లింగానికి అని గ్రహించమన్నారు. అందరూ విరగబడినవ్వారు.
కృష్ణశాస్త్రి అబద్దాలలో బ్రతికాడని గోరాశాస్త్రి అన్నారు. ఆయన్ను దగ్గరగా చాలా కాలం చూచిన వాడు గనుక అలా అనగలిగాడు.
బ్రహ్మ సమాజ ప్రభావితుడైన కృష్ణశాస్త్రి, 1936లో పిఠాపురం రాజా కొలువులో వున్నారు. జస్టిస్ పార్టీ నుండి చీలి సొంత పార్టీ పెట్టిన రాజా కాంగ్రెస్ పై పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణశాస్త్రి జన రంజకంగా పిట్ట కథలు చెప్పి, కనుక రాజావారికి ఓ టెయ్యండనేవారు. చివరలో జనం గొల్లున నవ్వేవారు. రాజావారు ఓడిపోయారు.
కృష్ణశాస్త్రి చాటువులు కూడా రాశారు. అవి చదివి వినిపించారే గాని ప్రచురించలేదు. అంతశృంగారం జనం తట్టుకోలేరనుకున్నారేమో.
మద్రాసులో డి. ఆంజనేయులుగారు, సికింద్రాబాద్ లో గోరా శాస్త్రి గారు నన్ను తీసుకెళ్ళి కృష్ణశాస్త్రికి పరిచయం చేశారు.
కృష్ణశాస్త్రి కవితలు, వచన రచనలు చదివాను. ఆయన సినిమా పాటలు ప్రత్యేక ఆకర్షణ.
జరుకే శాస్త్రి (జలసూత్రం రుక్మిణీ నాధశాస్త్రి) పేర డీలలో కృష్ణశాస్త్రిపై విసుర్లు వేశారు.
తెలుగు కవులలో ఒక మేజర్ గా కృష్ణశాస్త్రి నిలబడతారు. సీత, అనసూయ ఆయన మేనకోడళ్ళే. హైదరాబాద్ లో ఆదర్శనగర్ లో కృష్ణశాస్త్రి వుండగా తరచు కలిసే వాడిని.
ఒకసారి మామిడిపూడి వెంకట రంగయ్య గారి జన్మదినోత్సవం ఆంధ్ర మహిళా సభ (హైదరాబాద్)లో అతి ఘనంగా జరిపారు. నేనూ ఆ సభకు వెళ్ళాను. వెంకట రంగయ్య గారితో నాకు సన్నిహిత పరిచయం వుంది. నేనూ ఆయనా కలసి ఆంధ్రలో స్వాతంత్ర సమరం గ్రంధం రాస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించింది. సన్మానం జరుగుతుండగా కార్యక్రమంలో లేకున్నా, హఠాత్తుగా కృష్ణ శాస్త్రి రంగ ప్రవేశం చేశారు.
గురుపూజ అంటూ కాళ్ళకు నమస్కరించి, శాలువా కప్పి, సత్కరించారు. కాలేజీలో తనకు వెంకట రంగయ్య గారు టీచర్ అని చెప్పారు. ఇంటి కెళ్ళిన తరువాత వెంకట రంగయ్య గారు నాతో చెబుతూ, “వీడు నా శిష్యుడ్ని అంటాడు, నా గుర్తున్నంత వరకూ యితగాడికి నేను కాలేజీలో పాఠాలు చెప్పిన దాఖలాలు లేవన్నారు”. అందుకే గోరా శాస్త్రి వ్యాఖ్యానించారు. అబద్ధాలలో బ్రతుకుతాడు కృష్ణశాస్త్రి అని. శశాంక నేనూ కూడా కృష్ణశాస్త్రిని కలిశాం. దోషాలు, అబద్ధాలు ఎన్నివున్నా. కృష్ణశాస్త్రి కవిత్వం, పాటలు వేరేలోకానికి చెందినవి.
బ్రహ్మ సమాజ ప్రార్థనా సమావేశాలలో చివరగా ఏడవడం మరొక అంశం. కృష్ణశాస్త్రి ఏడిపించడమే గాక, ఏడుస్తాడుకూడా.
Imageryలో కృష్ణశాస్త్రి గొప్పవాడు. శివుడి తలపాగ వలెగంగ వున్నదనడం ఇతరులకు తట్టే అంశం కాదు. ఇలాంటివి ఆయన కవితల నిండా చూడొచ్చు.
కృష్ణశాస్త్రి బాధ లోకానికి బాధ అనే నానుడి కూడా వాడుకలోకి వచ్చింది. అలా ఏడిపించగలశక్తి ఆయనకే వుంది.
హైదరాబాద్ ఆలిండియా రేడియోలో కృష్ణశాస్త్రి, గోపీచంద్ పని చేస్తుండగా, ఇరువురూ నిందారో పణల పర్వంలో మునిగి తేలారు. అదొక కాంప్ వలె కొన్నాళ్ళు సాగింది. ఆహ్వానించదగిన విషయమేమీ కాదు.
పాలు నలుపు
పాల వెన్నెల నలుపు
శెట్టి గారింట్లో చందురుడే నలుపు
అని చాటువులు రాసిన కృష్ణశాస్త్రి, ఎంత ఘాటు ప్రేమయో అని భానుమతి పాడుతుంటే ఇంత లేటు వయస్సులోనా అని చమత్కరించాడు.
రచనలు :
కృష్ణ పక్షం, ఊర్వశి ప్రవాసము, మహతి, కన్నీరు, ఋగ్వేది, పల్లకీ, పుష్ప లాలికలు, శర్శిష్ఠ, అప్పుడు పుట్టి వుంటే, తిరుప్పావు, ధనుర్దాసు, గోదాదేవి, మేఘమాల, కవి పరంపర, పద చిత్రాలు, కవితా ప్రశస్తి.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఎంత ఘాటు ప్రేమయో అని భానుమతి పాడడమా? పాతాళ భైరవిలో మాలతి కదా (పింగళి)? సరిగా అర్థం కాలేదు నాకు.
మీరు అన్నది వాస్తవం. నేను ప్రస్తావించినది కేవలం చమత్కారము గా శాస్త్రి గారి మాటలు.
Sri Sri also made similar comments on individuals when they sang this.
Post a Comment