Wednesday, May 21, 2008

సాహితి పరులతో సరసాలు-23ఆవుల సాంబశివరావు
(1917-2003)

ఆవుల సాంబశివరావు జడ్జిగా, వైస్ ఛాన్సలర్ గా, లోకాయుక్తగా పేరు తెచ్చుకున్నారు. కాని ఆయనకు మరికొన్ని కోణాలున్నాయి.
తెనాలితాలూకా మూల్పూరు గ్రామానికి (గుంటూరు జిల్లా) చెందిన సాంబశివరావు కుటుంబానికి వూళ్ళో దేవాలయం, దానికింద ఆస్తులు, ట్రస్ట్ వుండేవి. ఏటాఉత్సవాలు జరిగేవి. సాంబశివరావు వాటిని వదులుకోలేదు.


గాంధేయుడుగా ఆరంభమైన ఆవులసాంబశివరావు, క్రమేణా ఎం.ఎన్. రాయ్ ప్రభావితుడై అఖిలభారత మానవ వాద సంఘాధ్యక్షుడుగా, భారత హేతువాద సంఘ కార్యదర్శిగా, ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక సంపాదకుడుగానూ పనిచేశారు. స్టడీ కాంపులలో ఉపన్యాసాలిచ్చారు. మానవవాద తత్వంపై వ్యాసాలు రాశారు. ఇది కొందరికే తెలుసు.

ఆయనకు సాహిత్యాభిలాష వుండేది. త్రిపురనేని గోపీచంద్ సన్నిహితుడు. ఆయనపై సంచిక వెలువరించారు. వీరేశలింగంపై రాశారు. త్రిపురనేని రామస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు.

ఆర్య సమాజ్ నాయకుడు గోపదేవ్ తో సన్నిహిత సంబంధం వుండేది. కవితా గోష్టులలో పాల్గొన్నారు.
వివాహాలలో మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి పద్ధతిలో తెలుగులో ప్రమాణాలు చేయిస్తూ ఆవుల సాంబశివరావు అనేక పెళ్ళిళ్ళు జరిపించారు. 1964లో తెనాలిలో జరిగిన నా పెళ్ళికి ఆయన అధ్యక్షత వహించి ఉపన్యసించగా, ఆవుల గోపాలకృష్ణమూర్తి పౌరోహిత్యం చేశారు. వారిరువురూ ముల్పూరు వారే. వారి తాతలిద్దరూ అన్నదమ్ములు.

సాంబశివరావు ఇంగ్లీషు, తెలుగులో సరళంగా, సాఫీగా, ఉపన్యసించేవారు. లౌక్యంగా ఆకట్టుకునేవారు.
ఆవుల సాంబశివరావు కుమార్తె మంజులత సుబ్రహ్మణేశ్వరరావు పెళ్ళి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగింది. నేనూ కొండవీటి వెంకట కవి ఉమ్మడిగా లౌకిక తీరులో పెళ్ళి జరిపించాం.

ఆంధ్రయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా ఆవుల సాంబశివరావు విఫలమయ్యారు. నేనూ, మల్లాది రామమూర్తి కలసి విశాఖ వెళ్ళి, సైంటిఫిక్ మెథడ్ (ఎ.బి.షా రచన) విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పుస్తకంగా పెట్టించమన్నాం. బెంగుళూరు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ హెచ్. నరసింహయ్య అలా చేసి సఫలమయ్యాడని ఉదాహరణ చూపాం. సాంబశివరావు తనకు నరసింహయ్య నమూనా అవసరం లేదనీ, తప్పనిసరిగా ఆ పనిచేస్తానని చెప్పి, మరచిపోయారు. మానవ వాదిగా విఫలమైన వైస్ ఛాన్సలర్ ఆయన. అలాగే లోకాయుక్త గానూ అంతగా రాణించలేదు. ఆయన దగ్గర ఆఫీసర్ గా వున్న పర్వతనేని కోటేశ్వరరావు (కీ.శే) సాంబశివరావు వైఫల్యాలు, పక్షపాతాలు చూచి, తప్పు కోవలసి వచ్చింది.

కాని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆవుల క్రమశిక్షణ పాటించి, జడ్జీల చే పాటింప జేశారు. అది అభినందనీయం. తాను మానవవాదినని ఘంటా పథంగా వేదిక మీద చాటిన సాంబశివరావు, రచనల్లోనూ ఆ విషయాలు రాశారు. కుటుంబ పరంగా విఫలమైన సాంబశివరావు, సమాజంలో పెద్దమనిషిగా హ్యూమనిస్ట్ గా నిలిచారు.

భవనం వెంకట్రాం ముఖ్యమంత్రిగా నాకు అత్యంత సన్నిహితులు. ఆంధ్రయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా పేరు సూచించమని నన్ను అడిగితే, సాంబశివరావు పేరు చెప్పాను. నన్నే వెళ్ళి అంగీకారం అడుగమన్నారు. వెళ్ళి, ముఖ్యమంత్రి ఫోను చేస్తారు. అంగీకరించండి అని ఒప్పించాను.

మద్రాసు నుండి కుంటుతూ నడుస్తున్న ఇండియనే రేషనలిస్ట్ పత్రికను హైదరాబాద్ కు తరలించినప్పుడు, ఆవుల సాంబశివరావు ఆర్థికంగా తోడ్పడి, ఎడిటర్ గా సహాయపడ్డారు. నేనూ, ఎన్.కె. ఆచార్య, ఎ.ఎల్. నరసింహారావు పత్రిక నిర్వహణ గావించాం కొన్నేళ్ళ పాటు ఎందరో కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని ఆవుల సాంబశివరావు ప్రోత్సహించి, పీఠికలు రాశారు. బౌద్ధం అంటే యిష్టపడేవారు. ఇంటిపై పెద్ద బౌద్ధ ప్రతిమ పెట్టారు. ఆయన భార్య జయప్రద సామాజిక సేవాకార్యక్రమాలలో నిమిగ్నమైంది. హ్యూమనిస్ట్ చర్యలలో విముఖత చూపింది.

మద్రాసు, గుంటూరు, హైదరాబాద్ లో హైకోర్టు న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, జడ్జిగా పనిచేసిన ఆవుల, ఉన్నత విద్య అంతా మద్రాసులోనే అభ్యసించారు. ఎం.ఎన్. రాయ్, సి. ఆర్. రెడ్డి, వి.ఎం. తార్కుండే, ఇందుమతి పరేఖ్, వి.బి. కర్నిక్, గోరా, పండిత గోపదేవ్

వంటి వారితో పరిచయాలున్నాయి.

రచనలు : నాటికలు, వ్యాసాలు, వీరేశలింగం (సవనీర్), గోపీచంద్ (సవనీర్), ప్రజలు-రాజ్యాంగం, మనిషి కథ, నవ భావన, త్రిపుర నేని రామస్వామి, టేకింగ్ రూరల్ ఇండియా ఇన్ టు ది 21 సెంచరి, నీ డెడ్ ఎ కల్చరల్ రివల్యూషన్.
రచనలన్ని మూడు సంపుటాలుగా 2008 లొ వెలువడ్డాయి

2 comments:

Anonymous said...

ఇన్నయ్య గారికి,
మీ వ్యాసాలు బాగుంటున్నాయి. ప్రముఖుల గురించి సంక్షిప్తంగా మీకోణంలో వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు వారి గురించి ఒక అవగాహన కు ఉపకరిస్తాయి. నాకు కొన్ని సందేహాలున్నాయి.

1. మానవ వాదం ఏమితి? ఏమి చెప్తుంది?
2. హ్యూమనిస్ట్ ఏమి విశ్వసిస్తారు, వారి ఆదర్శాలేమితి?
3. రేషనలిస్ట్ అనగా ఎవరు?

వీటి గురించి తెలుగులు లింకులేమన్నా లభ్యమవుతాయా? కృతజ్ఞతలు.

-కొత్త రవికిరణ్
www.poolavaana.wordpress.com

innaiah said...

మానవ వాదం లొ మానవుడు కెంద్రం.మానవ విలువలు ,నీతి ప్రధానం.భారత దేశములొ ఎం.ఎన్ .రాయ్ ,విదేశాలలొ జూలియన్ హక్షలి, ఎరిక్ ఫ్రాం, ఐజక్ అసిమోవ్ మానవ వాదాన్ని ప్రచారం చేశారు.
హెతువాదం ఇందులొ భాగమె .వివేచన ,కార్య కారన సంబంధం కావాలంటారు.
వీరి అందరికి ఆయుధం శాస్త్రియ పధతి.
సమాచారం బాగా ఉన్నది.
www.secularhumanism.org
http://www.csicop.org/
www.centerforinquiry.net
rationalist press association
http://innaiahn.tripod.com