Sunday, May 11, 2008
Book review-rare and unique
గాంధీజీ అధ్యయనంలో తవ్వేకొద్దీ నిత్య సత్యాలు
1. The year of the phoenix.
2. Dwija : A Prophet Unarmed,
( Arnold Hanniman, New Delhi)
- T.K. Mahadevan
Editor : Gandhi Marg (Quarterly)
పుస్తకాలు రాసింది సిసలైన గాంధీయుడు.పైగా పరిశోధకుడు. కనుక జాగ్రత్తగా చూడాలి.
గాంధీజీ గొప్ప స్వాతంత్ర పోరాట రధసారధి. సత్యాగ్రహాన్ని ఆయుధంగా స్వీకరించి, అహింసా పద్ధతిలో, అశేష ప్రజానీకాన్ని పోరాట రంగంలోకి దింపిన వ్యక్తి గాంధీజీ, దేశ స్వాతంత్ర విషయంలో రాజీపడకుండా పోరాడిన విశిష్ట నాయకుడు. చరిత్రలో గాంధీజీ ఆ విధంగా చిరస్మరణీయుడుగా నిలుస్తాడు. స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లింలను కలుపుకురావాలని ఆకాంక్షించిన గాంధీజీ, మత సామరస్యతకై కృషి చేశారు. స్వాతంత్ర పోరాటాన్ని గ్రామాలలోకి తీసుకెళ్ళారు. మహిళల్ని ఉత్తేజపరచారు. ఎటు చూచినా దేశ స్వాతంత్ర పోరాట నాయకుడుగానే గాంధీజీ కనబడతారు. మంచి లక్ష్యానికి మంచి మార్గం అనుసరించాలని చెప్పిన వ్యక్తిగా గాంధీజీ ఆదర్శప్రాయుడే. అలాంటి గాంధీజీ తన జీవితమే సత్య పరిశోధనగా పేర్కొన్నారు. అందుకే జీవిత చరిత్ర రాశామన్నారు.
ముఖ్యంగా గాంధీజీ తొలిజీవితం, దక్షణాఫ్రికా రంగంలో ఆయన పాత్ర శాస్త్రీయ ఆధారాలలో అధ్యయనం చేయాలి. అప్పుడు గాని అసలు గాంధీ మనకు అర్థం కారు.
1922లోనే సంపూర్ణ స్వరాజ్యం వస్తుందన్న గాంధీజీ, కేవలం తన మనస్సాక్షికి దైవం చెబుతున్న దృష్ట్యా అలా ఘంటాపధంగా చెప్పగలుగుతున్నామన్నారు. కాని, శాస్త్రీయాధారాలతో మనస్సాక్షి మాటల్ని పరిశీలించలేదు. స్వాతంత్రం 1922లో రాలేదు. హిమాలయాలంతటి తప్పు చేశానన్నాడు గాంధీజీ. కాని.
గాంధీజీ తన తొలి జీవిత వాస్తవాలు లండన్ డైరీ పేరిట ఇంగ్లీషులో రాశారు. 20 సంవత్సరాలు జాగ్రత్తగా అట్టి పెట్టి 1909లో 120 పేజీల లండన్ డైరీని తన బంధువు ఛగన్ లాల్ కు అప్పగించారు గాంధీ కార్యదర్శిగా సేవలు చేసిన మహదేవ దేశాయికి 1920లో అవి చేరాయి, ఉత్తరోత్తరా అది ప్యారీలాల్ కు చేరిందో లేదో తెలియదు. కాని, గాంధీజీ స్వయంగా నోట్ పుస్తకాలలో ఇంగ్లీషులో నిర్మొహమాటంగా రాసిన నిజాలు అదృశ్యమయ్యాయి కేవలం 20 పేజీలు అట్టిపెట్టి గాంధీజీ శీలాన్ని కాపాడదలచిన భక్తులు, మిగిలిన లండన్ డైరీని నామరూపాలు లేకుండా చేశారు. ఎందుకిలా జరిగింది? లండన్ లో విద్యార్థి జీవితాన్ని యధాతధంగా గాంధీ రాస్తే, భక్తులకు షాక్ కొట్టి అదంతా బయటకొస్తే కొంప మునుగుతుందని, రచన కనబడకుండా చేసి తృప్తిపడ్డారు! గాంధీజీకి సంబంధించిన నిజాలు నాశనం చేయడంలో ఆయన శిష్యులు ఎప్పటికప్పుడు తగిన పాత్ర వహిస్తూనే వున్నారు. మహాత్మగాంధీ రచనల సంపుటాలలో ఇట్లాగే కొన్ని వాస్తవాలను 1938లో నాశనం చేస్తే, గాంధీజీకి తెలిసి కూడా వూరుకున్నారు.
లండన్ డైరీలో మిగిలిన 20 పేజీల ఆధారంగా లండన్ ప్రయాణం గురించి కొన్ని వివరాలు లభిస్తున్నాయి. దక్షిణాఫ్రికా గురించి 30 ఏళ్ళ తరువాత జ్ఞాపకం వున్నంతవరకూ గాంధీజీ రాస్తే, అదే మిగిలిన వారికి ఆధారమైంది.
గాంధీజీ జీవితంలో మలుపుతిప్పిన సంఘటన 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళడమే, అక్కడ ప్లీడరుగా ప్రాక్టీసు పెట్టి, సంపాదించుకోవాలని, ఇండియాలో అలాంటి అవకాశం లేదని గాంధీజీ భావించి ప్రయాణం కట్టారు. కాని, ఆ విషయం దాచిపెట్టి, 1983 ప్రయాణం గురించి పట్టీపట్టనట్లు రాశారు. ఇండియాలో పొందిన వైఫల్యానికి బదులు, దక్షిణాఫ్రికాలో పట్టుబట్టి సాధించాలని గాంధీజీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సాధించారుకూడా. కాని ఆ విషయం తన రచనలో దాచారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ జీవితంలో ఎంత మలుపు తిప్పిందో, అంతగా ఆ విషయాన్ని ఆయన దాచారు. దాదా అబ్దుల్లా కేసు కోసమే ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళలేదు. వెళ్ళి అక్కడ పట్టంగట్టి, ప్లీడరీగా కుదురుకోవాలనే నిశ్చయంతోనే వెళ్ళారు. అది సాధించారు కూడా.
గాంధీ జీవిత రచన చేసిన ప్యారీలాల్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ వెళ్ళకముందు జాతి విచక్షణ పట్టించుకున్నవారే లేరని మనల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కాని అప్పటికే ప్రిటోరియాలో సి.ఎం. పిళ్ళె, కింబర్లీలో దొరస్వామి పిళ్ళె, ఎ.ఒ. అల్లె వున్నారన్న సంగతి ఆయన పరిశోధించనే లేదు. మునుస్వామి అనే మరొ వ్యక్తి కూడా యధాశక్తి జాతి విచక్షణకు వ్యతిరేకంగా, తమ హక్కుల కోసం పోరాడిన వారిలో వున్నారు. ఇదంతా గాంధీయులు దాచారు. గాంధీ కూడా దాచాడు. అదే బాధ, దక్షిణాఫ్రికాకు కేవలం కేసునిమిత్తం వెళ్ళివుంటే, అది పూర్తికాగానే గాంధీజీ వచ్చివుండేవారు. ఆయనకు వీడ్కోలు సభ కూడా జరిగింది. అయినా గాంధీజీ అక్కడ వుండాలని భావించినందున, అందుకు తగిన పోరాట కారణాలు కూడా ఆయనకు లభించాయి. అలా చెబితే బాగుండేది. సత్యం కోసమే పుట్టినట్లు చెప్పిన గాంధీ, యీ విషయాన్ని దాచనక్కరలేదు, పైగా భారతీయులు సంతోషించేవారు. గాంధీజీ అబద్ధాలతో దక్షిణాఫ్రికాలో కొనసాగడానికి, భారతీయుల పక్షాన ఒక విజ్ఞాపన పత్రం సిద్ధం చేశారు. కొందరి సంతకాలు సేకరించారు. భారతీయులకు ఓటు హక్కు నిరాకరించే బిల్లును వ్యతిరేకించడానికి ఉద్యమించారు. అదంతా బాగానే వుంది, కాని స్వీయ చరిత్రలో, ఓటు హక్కు బిల్లు గురించి తనకు తెలియనే తెలియదని గాంధీజీ పచ్చి అబద్ధం ఆడారు. సత్యశోధనకై అంకితమైన వ్యక్తి అలా ఎందుకు చేశారు?
దక్షిణాఫ్రికాలో వుండదలచలేదు గనుక, వచ్చినపని పూర్తి అయింది గనుక, ఇండియాకు వెళ్ళదలచానని గాంధీజీ రాశారు. ఇది కూడా దారుణ అబద్ధం. ప్రిటోరియాలో కేసు విషయం చూస్తూనే, మరోపక్క దక్షిణాఫ్రికా సాంఘిక రాజకీయ పరిస్థితిని గురించి నోట్స్ రాసుకున్నారు. నేటాల్ భారతీయుల నిమిత్తం, వారి ప్లీడరుగా అక్కడే వుండదలచి గాంధీజీ తన కృషి అంతా కేంద్రీకరించారు. నేను ఇండియా వెళ్ళాలనుకుంటే, దైవం మరో విధంగా తలచింది అని గాంధీ రాశారు. కాని గాంధీ చేసిన కృషి అంతా ఒక పధకం ప్రకారమేనని సాక్ష్యాధారాలు, ఆయన ఉపన్యాసాలు, భారతీయుల సమావేశాలు తెలుపుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో వుండదలచిన గాంధీజీ కావాలని పార్లమెంటుకు దరఖాస్తు సమర్పించడంలో జాప్యం చేశాడు. సమయానికి దరఖాస్తు యిస్తే పార్లమెంటులో ఓటు హక్కు బిల్లు ఆగేదే, అప్పుడు గాంధీజీ చేసేది లేక, ఇండియా తిరిగి రావలసి వచ్చేది. అక్కడే వుండదలచి, జాప్యం చెయ్యాలని, బిల్లు వస్తుందని తెలిసి కూడా వూరకున్నాడు. భారతీయులకు ఓటు హక్కు వున్నట్లే, నేటాల్ భారతీయులకు వుండాలని గాంధీ తన స్వీయ గాధలలో రాశారు. 1890లో భారతీయులకు ఓటు హక్కు లేదని తెలిసీ గాంధీ అలా వ్రాశారంటే, దీనిపై వ్యాఖ్య పాఠకులకే వదలేస్తున్నాను. 1893 సంవత్సరం గాంధీ జీవితంలో పెద్ద మలుపు అని ఇంతకు ముందే పేర్కొన్నాం. అంతకుముందూ ఆ తరువాత ఓడ ప్రయాణాలు, అనుభవాలు క్షుణ్ణంగా పూసగుచ్చినట్లు రాసిన గాంధీ, 1893 ఓడ ప్రయాణం మాత్రం అంటీ అంటనట్లు రాశాడు. ఆయన జీవిత చరిత్ర పరిశోధకులు ఆ విషయం పట్టించుకోలేదు.
“గాంధీ మార్గ్” త్రైమాస పత్రిక సంపాదకుడు, గాంధేయ అధ్యయనంలో నిపుణుడు టి.కె. మహాదేవన్ ప్రత్యేక పరిశోధన చేస్తే అనేక నగ్న సత్యాలు బయటపడ్డాయి. వృత్తి రీత్యా తనకు సంబంధించిన విషయమై గాంధీ రహస్యంగా వ్యవహరించడం కద్దు గాంధీ తన జీవిత చరిత్రను గుజరాత్ లో రాసి, వారం వారం నవజీవన్ పత్రికకు పంపారు. 1922 నుండే జైలులో వుంటూ కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడి గాంధీ రాశాడు. తన సత్య శోధన రచనలో చాలా తప్పులు దొర్లినట్లు మగన్ లాల్ గాంధీకి రాసిన లేఖలో అంగీకరించారు. కాని దక్షిణాఫ్రికాకు చెందిన విషయాలు రాసిన తరువాత గాంధీ ఎన్నడూ దిద్దలేదు. పుస్తక రూపంలో జీవిత చరిత్రను వేస్తున్నప్పుడు కూడా గాంధీ మళ్లీ దిద్దలేదు. కనుక, దొర్లిన దోషాలు అలాగే వున్నాయి. చరిత్రలు రాసిన గాంధేయులుగాని, అభిమానులుగాని ఆయన రచనలలో నిజానిజాలు పరిశీలించలేదు. గోవింద బాబు కొన్ని విషయాలు గాంధీ తన జీవిత చరిత్రలో ఎలా వదిలేసిందీ ప్రస్తావించగా, సత్యాన్వేషణకు రాశాకగాని, కార్యకర్తలకు ధృడపత్రాలివ్వడానికి కాదని గాంధీ యంగ్ ఇండియాలో బదులిచ్చారు (జనవరి 31-1929) గాంధీ తన సత్యశోధనలో కావాలని నిజాల్ని దాచేస్తే ఎవరేం చేస్తారు. దక్షిణాఫ్రికాలో తాను ప్లీడరుగా దాదా అబ్దుల్లా కేసు చేబట్టినా, అతడు దొంగ సరుకు రవాణా చేస్తుండేవాడనే సత్యాన్ని గాంధీజీ దాచేశారు. కాని తన కుటుంబ మిత్రుడైన రుస్తుంజీ మాత్రం దొంగ సరుకు రవాణాలో పట్టుబడ్డాడని రాశాడు ఆయన మీద ప్రేమతోనే అలా రాశానని, జీవితగాధ వున్నంతవరకు రుస్తుంజీ పేరు చిరస్తాయిగా వుండాలని తన ఉద్దేశమని, అందుకే ఇతరుల పేర్లు వదలేశానని, తన కుమారుడు మణిలాల్ అభ్యంతరానికి సమాధానమిచ్చారు (1928 జూలై 15).
వివేకానంద శిష్యురాలు నివేదితను కలసిన విషయమై గాంధీ ప్రస్తావనను వివరిస్తూ 1927 జులై మోడరన్ రివ్యూ విమర్శించగా, గాంధీ తప్పుడు కూడా కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడి రాశానని, సత్యశోధనకై ఉద్దేశించాను గనుక మనస్సుపై పడిన ముద్ర దృష్ట్యానే యిది చూడాలన్నారు.
కేవలం జ్ఞాపక శక్తిపై ఆధారపడి సత్య శోధన చేస్తే వచ్చిన దోషాలు గాంధీ జీవితంలో యిన్నీ అన్నీ కాదు. అయితే 30 సంవత్సరాల తరువాత జీవిత చరిత్ర ధారావాహికంగా రాసినా, కొన్ని సంగతులు ఫోటో తీసినట్లే రాశారు. తన జీవిత చర్రిత ప్రభావం చాలా మందిపై వుంటుందని తెలిసిన గాంధీ నిజాలు చెప్పడంలో జాగ్రత్త వహిస్తే, సత్య శోధన బాగుండేది. ప్యారీలాల్, పెయిన్, హటన్ బాక్ తో సహా జీవిత చరిత్ర రాసిన వారంతా గాంధీ రాసిన దానినే యధాతధంగా మనకు చెప్పడం వలన, శాస్త్రీయ పరిశోధన జరగలేదని తేలింది. గాంధీ అబద్దాలు రాస్తే, ఆయన చరిత్ర కారులు అవే చిలక పలుకుల్లాగా మనకు తిప్పి చెప్పారు. దక్షిణాఫ్రికాలో గాంధీ వీడ్కోలు సమావేశం అందుకు మచ్చుతునక. గాంధీజీ తన సత్యశోధనలో తన బాల్య ముస్లిం మిత్రుడు షేక్ మెహతాబ్ గురించిన అనేక వాస్తవాలు వదలేశానన్నారు. వాళ్ళిద్దరి మధ్య స్వలింగ సంపర్క సంబంధం వుందని ఎరిక్ ఎరిక్ సన్ తన గాంధీస్ ట్రూత్ లో అంటాడు. షేక్ మెహతాబ్ చిన్నప్పటినుండే మిత్రుడుగా గాంధీచేత చేయించని పాపం అంటూ లేదు. చివరకు దక్షిణాఫ్రికాకు సైతం షేక్ మెహతాబ్ ను పిలిపించుకున్నాడు. అయినా సత్యశోధన రచనలో చాలా వాస్తవాలు వదలేశారు.
దక్షిణాఫ్రికాలో గాంధీజీ చాలా పరిశోధనలు చేశారు. ఆయన కీర్తి ఇండియాలో వ్యాపించింది. భారతీయుల కోసం పోరాడి, దెబ్బలుతిని, నిలిచిన ధైర్యశాలి గాంధీ. దక్షిణాఫ్రికా అనుభవాలే గాంధీని భారతదేశంలో నాయకుడిగా రూపొందించడానికి పునాదులు వేశాయి. దక్షిణాఫ్రికాలో తన భార్య కస్తూరిబాను ఒక దశలో ఇంట్లో నుంచి గెంటశాడు యువతతో టాల్ స్టాయ్ ఫాంలో పరిశోధనలు చేశాడు. చెరువులో స్నానాలు చేస్తున్న యువతీ యువకులు చిలిపి చేష్టలు చేయగా, వారిని నగ్నంగా నడిపించి, ఆడపిల్లల జుట్టు కత్తిరించిన పరిశోధన కూడా యిందులో ఒకటి. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత, ఇక లైంగిక సంబంధం వద్దని ఒట్లు పెట్టుకున్నది కూడా దక్షిణాఫ్రికాలోనే. గాంధీ బాల్య వివాహం చేసుకొని, విపరీతంగా లైంగిక కార్యకలాపంలో మునిగి తేలిన విషయం విస్మరించరాదు. అది గ్రహిస్తే ఆయన పెళ్ళి అయిన వారికి బ్రహ్మచర్యం పాటించమని సలహా యివ్వడంలో విజ్ఞతను గమనించవచ్చు. లైంగిక వాంఛలు ఆగాయో లేదోనని వృద్ధాప్యంలో కూడా కలకత్తా-నౌఖాళిలో ఇద్దరు యువతుల మధ్య నగ్నంగా పడుకుంటే, ఆయన కార్యదర్శి నిర్మలకుమార్ బోసు అభ్యంతరపెట్టి రాజీనామా యిచ్చిన విషయం గుర్తుంచుకోవాలి.
గాంధీ జీవితంలో స్వాతంత్ర పోరాటం ఆయనకు గొప్పతనాన్ని తెచ్చి పెట్టింది. అంతవరకే స్వీకరించకుండా ఇతర విషయాలు కూడా ప్రభావితం చేయడంతో మనం పరిశీలించి, అర్హతలు గమనించవలసి వచ్చింది. గాంధీ అభిప్రాయాలు ఆయుర్వేదం మొదలు ఆవుల వరకూ అనేక అంశాలపై వున్నాయి. అవన్నీ సత్యశోధన అనలేం. గాంధీ సైన్స్ బొత్తిగా చదువుకోలేదు. శాస్త్రీయ ధోరణిలో చూస్తే గాంధీ భావాలు అసలే నిలబడవు. అశాస్త్రీయమైన భావాలు వదిలేద్దాం. బీహారులో భూకంపం వస్తే, ప్రజలు పాపం చేశారు గనుక దేవుడు ఆగ్రహించాడని గాంధీ ప్రకటించాడు. ఆయన సన్నిహిత అనుచరులై-పండిట్ నెహ్రూతో సహా యీ అశాస్త్రీయ ధోరణిని బాహాటంగా ఖండించారు. దేశీయ దుస్తులే ధరించాలంటూ, రవీంద్రనాథ్ ఠాగూర్ ను సిల్కుబట్టలు వదలేయమంటే ఆయన నిర్మొహమాటంగా నిరాకరించారు. దేవాలయాలపై బూతుబొమ్మలున్న చోట, తనకు పెత్తనం వుంటే కూలగొడతానని గాంధీ అంటే, ఖొజరాహో దేవాలయ శిల్ప సంపద అభినందించిన వారు నవ్వుకున్నారు (అగేహానంద భారతి) కనుక స్వాతంత్ర పోరాటం మినహా మిగిలిన విషయాలలో గాంధీ భావాలు అట్టే పట్టించుకుంటే మనం నవ్వులపాలవుతాం. రాజకీయాలలో మాత్రం గాంధీ గారి చిత్తశుద్ధిని కొన్ని సందర్భాలలో శంకించినవారు లేకపోలేదు. అది కూడా అషామాషీగా కాదు, ఆధారాలతోనే అందులో అంబేద్కర్ పేర్కొనదగిన వ్యక్తి, ఆయన అడిగిన ప్రశ్నలు, చూపిన ఆధారాలు తిరుగులేనివి. గాంధీజీ అబద్ధాలకు మరో నిదర్శనంగా యీ విషయాలు నేటికీ మనముందున్నాయి. అటు గాంధీని ఇటు అంబేద్కర్ ను ఒకే వేదికపై నిలబెట్టి పొగిడే రాజకీయ వాదులను విస్మరించి యీ విషయాలు పరిశీలించాలి. ఓట్ల కోసం పడే పాట్లు వున్నంతకాలం రాజకీయ వాదులు ఎవరినైనా వాడుకుంటారు. శాస్త్రీయ పరిశీలనకు వారు ప్రవర్తన అడ్డురాకూడదు.
గాంధీకి చరిత్రలో ఏ మేరకు గౌరవ స్థానం యివ్వాలి అనేది కూడా శాస్త్రీయ పరిశీలకులు నిర్ధారించాలి. స్వాతంత్ర పోరాటంలో ఆయనకు సముచిత స్థానం యివ్వడానికీ మిగిలిన విషయాలలో పాటించడానికీ తేడా గ్రహించాలి.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
వ్యాసం చాలా బాగుంది. కానీ ఈ అంశం అంతగా ప్రాచుర్యం చెందనటువంటిది. గాంధీ తన హేడేస్ లో చేసిన తప్పుల గురించి వస్తారనుకున్నాను అంతలోనే వ్యాసం అయిపోయింది.
అంబేధ్కర్ వ్రాసిన వాట్ గాంధి అండ్ కాంగ్రెస్ డం టు అం టజబుల్స్ (పేరు అదేనా? కొంచెం అనుమానంగా ఉంది. బహుసా అర్ధం అయిందను కుంటాను.)అనె పుస్తకాన్ని పరిచయం చేయరూ. విశ్లేషణాత్మకంగా వివరిస్తూ, ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
ఇది పుస్తక సమీక్ష గదా.రచయిత తీసుకున్న అంశాలకే పరిమితం కావాలి. అంబేద్కర్ రాసిన What Congress and Gandhi have done to the untouchbles, 1930 కాలానికి చెందినది.
క్షమించండి పొరపడ్డాను.
బొల్లోజు బాబా
Post a Comment