left S.V.Pantulu,right Innaiah
ఎస్.వి.పంతులు –
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు వెడితే అక్కడ సాధారణమైన దుస్తులతో పొట్టిగా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నాయకులు తరచు పంతులుగారిని పిలవండి అంటూంటారు. ఆయనే ఎస్.వి. పంతులు. ఎవరికి ఏ సందేహం వచ్చినా, ఏ సమాచారం కావలసినా పంతులుగారే ఆదుకుంటారు. విషయ పరిజ్ఞానంలో అసాధారణ జ్ఞాపక శక్తిగల పంతులుగారు సౌమ్యుడు, స్నేహపాత్రుడు.
ఎస్.వి. పంతులు పూర్తి పేరు సంకా వినయ పంతులు. 1934లో తెనాలిలో పుట్టారు. 1950 ప్రాంతాల నుండి ఆచార్య ఎన్.జి. రంగాకు సన్నిహితంగా, అనధికార పి.ఏ.గా ఉన్నారు. ఆయన చనిపోయే వరకూ అలాగే కొనసాగారు. పార్టీ రాజకీయాలలో తలదూర్చకుండానే ఎందరో నాయకులకు కార్యకర్తలకు సలహాదారుగా, సన్నిహితుడుగా ఉండగలగడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రంగా గారి సాన్నిహిత్యం వల్ల రాష్ట్ర, దేశనాయకులతో దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి.
పంతులుగారి పరిచయాలు పరికిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో పేర్కొనదగింది కీ.శే. బి.ఆర్. అంబేద్కర్ తో 1952లో పరిచయం. అటు ఆచార్య రంగా, ఇటు అంబేద్కర్ 1952 ఎన్నికలలో ఓడిపోయి, న్యూఢిల్లీ వెస్ట్రన్ కోర్టులో పక్క పక్క గదుల్లో ఉండేవారు. వారిని పలకరించడానికి ఎవరూ వచ్చేవారు కాదు. భారతదేశంలో ఓడిపోయిన వారి పరిస్థితి అలాగే ఉంటుంది. అప్పుడు పంతులుగారు వారిరువురికీ సేవలు చేస్తూ సన్నిహితంగా ఉండడాన్ని మధురస్మృతిగా భావిస్తారు. అంబేద్కర్ తో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడం అసాధారణ విషయమే.
ఎస్.వి. పంతులు 1951లో తెనాలిలో నాకు పరిచయమయ్యారు. అప్పటి నుండి మా స్నేహం కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్ నుండి చీలిపోయి ఆచార్య రంగా కృషికార్ లోక్ పార్టీ పెట్టి తెనాలిలో తొలి మహాసభలు నిర్వహించారు. ఎడ్లపాటి వెంకటరావు, ఎలవర్తి శ్రీరాములు మొదలైనవారు ఆ సభల ఏర్పాట్లు చూశారు. వాటికి హాజరైన నాయకులలో గౌతు లచ్చన్న, కందులు ఓబుల రెడ్డి, విద్యార్థి నాయకుడుగా ఉన్న కె. రోశయ్య (నేటి మంత్రి) వీరాచారి, విజయరాజకుమార్, ఆర్.సి.హెచ్. మనోహరం, వై.ఆర్.కె.రెడ్డి, సుంకర సత్యనారాయణ ఇత్యాదులెందరో ఉన్నారు. సినీ నటుడు చిత్తూరు నాగయ్య వచ్చారు. శ్రీకాకుళం నుండి అంపోలు అప్పల స్వామి ఆనాడు తాటిచెట్టు పెకలించి వేయడం సభలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పంతులుగారు నేను అప్పుడు ప్రేక్షకులుగా వాటిని ఆనందించి అనేకమందితో పరిచయాలు ఏర్పరుచుకున్నాం.
పంతులుగారికి టంగుటూరి ప్రకాశంపంతులు, తెన్నేటి విశ్వనాథం, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కె. విజయభాస్కరరెడ్డి, బండారు రత్న సభాపతి, కాకాని వెంకటరత్నం. పి.వి.చలపతిరావు బాగా తెలుసు. కమ్యూనిస్టు నాయకులలో తరిమెళ నాగిరెడ్డి, సి.హెచ్. రాజేశ్వరరావు దగ్గరా తెలుసు. ఆ తరువాత కాంగ్రెసువారిలో కేంద్రరాష్ట్రాలలో తెలిసినవారు అసంఖ్యాకంగా ఉన్నారు.
అఖిల భారత స్థాయిలో రాజగోపాలాచారి, మీనూ మసానీ, పీరూ మోడీ, హెచ్.ఎమ్.పటేల్, ఎన్. దండేకర్, ఆర్.సి.కూపర్, సంతోష్ బగ్వోడియా, దగ్గరగా తెలుసు.
1975లో పంతులుగారు యూరోప్, రష్యా పర్యటన చేశారు. అప్పుడు జర్మనీ పరిచయస్తులకు మీనూ మసానీ లేఖనిచ్చి, పంతులుగారికి తోడ్పడమని రాశారు. ఇంగ్లండు పర్యటనలో సహాయపడమని అక్కడి వారికి ఆచార్య రంగా లేఖ పంపారు. రష్యాలో పర్యటనకు ఇస్కస్ సంస్థ పంతులుకు సహాయం చేసింది. ఫ్రాన్స్ హాలండ్ తదితర దేశాలు చూచి విశేషాలు తెలుసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ ప్రకటించిన రోజులలో పంతులుగారు అలాంటి విదేశీ పర్యటన చేశారు.
సుప్రసిద్ధ సైంటిస్ట్ స్వామినాథన్ పంతులుగారికి ఎలా తెలుసు అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. హైదరాబాదులో స్వామినాథన్ తో సమావేశాలు ఏర్పాటు చేసిన ఘనత పంతులుగారిదే. ఆయనకు వ్యవసాయమంటే రైతుల సమస్యలంటే ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో నిపుణలుగా ఉన్న వ్యవసాయ సైంటిస్టులను గుర్తించి రాష్ట్ర ఫ్రభుత్వంతో వారికి సత్కారాలు అందించగలిగారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ గా చేసిన ఎమ్.వి. రావు ఎంతో ఆదరణగా పంతులుగారిని చూస్తారు.
పత్రికారంగంలో ఎమ్.చలపతి రావు (నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు), న్యాపతి నారాయణ మూర్తి (ఆంధ్రప్రభ తొలి సంపాదకుడు – పాన్ సుపారీ శీర్షిక ద్వారా పాఠక లోకానికి సుపరిచితుడు), బి.ఎస్. ఆర్. కృష్ణ (ప్రసుతం మదరాసులో ఉంటున్నారు), వామన రావు (ఖాసా సుబ్బారావు అల్లుడు – న్యూ స్వరాజ్య సంపాదకుడు), ఆంధ్రపత్రిక విలేఖరి శర్మ (ముక్కు శర్మ అనేవారు), రాజేద్రప్రసాద్ (హిందూ పత్రికలో చనిపోయేవరకూ పనిచేశారు), నర్రావుల సుబ్బారావు (ఆలిండియా రేడియో, దూరదర్శన్ లో పనిచేశారు. ఇలాంటి వారి జాబితా సుదీర్ఘంగా ఉన్నది.
కీర్తి శేషులు వి.వి.గిరి రాష్ట్రపతిగా పోటీ చేసినపుడు పంతులుగారు ఎన్నికల ఏజెంటుగా పనిచేశారంటే వినేవారికి వింతగానే ఉంటుంది. హైదరాబాదులో శాసన సభ్యుల సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క వావిలాల గోపాలకృష్ణయ్య తప్ప గిరిగారిని సమర్థించడానికి ఎవరూ రాలేదని పంతులుగారు చెపుతుంటారు.
ఎమ్. రత్న స్వామి, వి.కె. సుందరం, హండే, మారిస్వామి మొదలైనవారు తమిళనాడునుండి పంతులుగారికి దగ్గర మిత్రులుగా ఉండేవారు. సంజీవరెడ్డి హైదరాబాదు వచ్చినప్పుడు పంతులుగారిని ఫోన్ చేసి సరోవర్ హోటల్ లో రూము అట్టి పెట్టమని చెపుతుండేవారు. 1955 ఎన్నికలలో ఐక్య కాంగ్రెస్ పక్షాన ఆచార్య రంగా సంజీవరెడ్డి ఒకే కారులో ఆంధ్రదేశమంతా పర్యటిస్తూ పంతులుగారినే వెంటబెట్టుకెళ్ళారు.
అలాంటి పంతులుగారికి నేటికీ సొంత ఇల్లు లేదు. ఏర్పరుచుకోవాలనే ఆసక్తీ లేదు. ఒకప్పుడు ఒక డొక్కు స్కూటరు మీద తిరుగుతూండేవారు. వృద్ధాప్యం వలన ఇప్పుడు సి.టీ.బస్సులలోనే వెళ్ళివస్తుంటారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోకి నిరాఘాటంగా ఎన్నోసార్లు వెళ్లివచ్చిన పంతులుగారు సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. విషయాలను విడమరచి చెప్పడంలో ఎన్నికల ఫలితాలు అంచనా వేయడంలో ఆయన వాస్తవ వాది. పబ్లిసిటీ కోరని వ్యక్తి. పంతులుగారిని గురించి చెప్పదలచుకున్న అంశాలలో ఇప్పటి వరకూ ప్రస్తావించింది మొదటి దశ.