Thursday, April 2, 2009

హోమియోకు సైంటిఫిక్ ఆధారాలు లేవా?

James Randi who offered $million for scientific evidence of Homeo


హోమియో సృష్టికర్త హానిమన్. పూర్తిపేరు శ్యామ్యూల్ హానిమన్. జర్మన్ దేశస్తుడు. బహు భాషలు నేర్చిన వైద్యుడు. ఆనాడు అలోపతి వైద్యం చదివాడు. ఆ వృత్తిలో కనిపించిన దోషాలు, రోగాలు తగ్గించడానికి ఆవలంబించే పద్ధతులు ఆయనకు నచ్చలేదు. ముఖ్యంగా శరీరం నుండి రక్తం తీసే రీతులు చూసి అసహ్యపడ్డాడు

.

క్రమేణా మార్గంతరాలు ఆలోచించాడు. అప్పట్లో మలేరియా వ్యాధి ప్రబలి ఉండేది. దీనికిగాను క్వినైన్ వాడేవాడు.

హానిమన్ ఒకసాకి సింకోనా బెరడు తిన్నాడు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో సింకోనా బెరడు విస్తారంగా లభిస్తుంది. అది తీసుకున్నప్పుడు హానిమన్ చలితో వణికి పోయాడు. మలేరియా జ్వరలక్షణాలు వచ్చాయి. జ్వరం నయం చేయడానికి ఉపకరించే వస్తువు, ఆరోగ్యంగా ఉన్నవారు తీసుకుంటే, రోగలక్షణాలు రావడం విశేషమని భావించాడు. ఇలాంటి రీతిలో ఇతర రోగాలకు వాడ వస్తువులతో ప్రయోగించి చూచాడు. అంటే రోగలక్షణాలు, ఔషధ లక్షణాలు ఒకటే అయితే, దీనిని సూత్రీకరించి, సారూప్య సూత్రం చెప్పాడు.

అయితే ఔషధం బాగా పనిచేయడానికి దాని శక్తి పెంచాలనుకున్నాడు. ఔషధాన్ని పలచబరిచి బాగా కుదుపుతూ పోతే, శక్తి పెరుగుతుందని హానిమన్ నమ్మాడు. తాను పరిశోధించే ఔషధశక్తిని, పనిచేసే తీరును పరిశీలించ నారంభించాడు. కొన్ని స్వయంగా తీసుకున్నాడు. అలాగే ఇతరులకు యిచ్చాడు. అలా తీసుకున్నప్పుడు కొన్నాళ్ళపాటు కనిపించే లక్షణాలన్నీ రాసుకున్నాడు. ఇతరులనూ రాయమన్నాడు. వాటినే రుజువులుగా హానిమన్ స్వీకరించాడు. అలా క్రోడీకరించిన వాటిని ఆరు సంపుటాలుగా ప్రచురించాడు. అదే హోమియో పవిత్ర గ్రంథం అయింది.

హోమియో ఔషధాలు తయారు చేయడానికి, మొక్కలు, లోహాలు, కొన్ని ఆహారపదార్థాలు, కొన్ని రోగాలకు మూలమైన క్రిములు స్వీకరించాడు. అలా స్వీకరించిన వస్తువును నీటితోగాని, సారాయితోగాని కలుపుతారు. మూల వస్తువును మదర్ టింక్చర్ అంటారు. ఒక కూజాలో దీనిని అట్టిపెడతారు. నీటిలో అట్టిపెట్టిన కొన్నాళ్ళకు మూలవస్తువు తొలగిస్తారు. ఆ నీటినే మదర్ టింక్చర్ అంటారు. దానిని క్రమంగా పలచబరుస్తూ ఉంటారు. ఒక భాగం మూల టింక్చర్ కు 9 భాగాల నీటిని కలుపుతారు. బాగా కుదుపుతారు. అలా కుదిపినప్పుడు శక్తి పెరుగుతుందంటారు. మళ్ళీ అందులో ఒక భాగం తీసుకుని 9 పాళ్ళు నీరు కలిపి కుదుపుతారు. అలా కుదుపుతూ, కుదుపుతూ పలచబరుస్తూ పోయి, తరువాత చక్కెర బిళ్ళలో కలుపుతారు.

100 కణాలు మూల పదార్థం వున్నది క్రమేణా ఏ ఒక్క కణం లేని స్థితికి పోతుంది. అది 3x స్థాయి.

30c అనబడే హోమియో ఔషధం సిద్ధం చేయడానికి 30 సార్లు పలచబరచి, ప్రతిసారీ కుదుపుతూ పోతారన్నమాట. అంటే మూల పదార్థాన్ని శక్తివంతం చేయడానికి చేసిన పద్ధతిలో చివరకు మూలకణాలు వుండవు. అంటే రోగులకు యిచ్చే ఔషధ టింక్చర్లో కేవలం నేడు తప్ప ఎలాంటి కణాలూ మిగలవు.

నీటిలో కరగని మూలపదార్థాలను హోమియో వారు, నూరడం, పొడి చేయడం ద్వారా పలచబరుస్తారు. అప్పుడు చక్కెర కలుపుతారు. ఇది లోహాల వంటి వాటికి అన్నమాట.

ఇంతకూ హోమియో ఔషధంలో ఎలాంటి ఔషధకణం లేకున్నా ఎలా పనిచేస్తుంది. వారిచ్చే ఔషధ పిల్, టింక్చర్కు జ్ఞాపక శక్తి వుంటుందా? దివ్యశక్తి వుంటుందా? ఎనర్జీ వుంటుందని వారినమ్మకం. దీనికి ఆధారాలు, రుజువులు లేవు. హానిమన్ ప్రకారం హోమియో చికిత్స వ్యక్తి లక్షణాలకు ప్రాధాన్యతయిస్తుంది. రోగాన్ని నయం చేయడం గాక, వ్యక్తి స్వభావం, లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటామంటారు. కనుకనే రోగిని సుదీర్ఘంగా ఇంటర్వూ చేసి, అన్ని లక్షణాలు రాసుకుంటారు.

అప్పుడు హోమియో మెటీరియా మెడికోలో యీలక్షణాలకు పోలినది చూచి, ఔషధ నిర్ణయం చేస్తారు. హోమియో ప్రకారం అన్ని రోగాలకూ చికిత్స ఉంది.

హానిమన్ తన కాలంలో కొన్ని చికిత్సలు పేర్కొనగా, తరువాత అనుచరులు వాటిని పెంచుతూ వేల సంఖ్యకు చేరారు. రాను రాను మూల విధానాలకు మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. కాని ‘’జీవశక్తి’’ సూత్రం పై నమ్మకం మాత్రం మారలేదు.

హోమియోలో అన్ని రోగాలనూ సిఫిలిస్, సోరోసిస్, సైకోసిస్ అనే మూడుగా వర్గీకరించారు.

హోమియో శాస్త్రీయం కాదనే విమర్శ వుంది. ముఖ్యంగా హోమియో చెప్పే, జీవశక్తి (వైటల్ ఫోర్స్), కుదుపుతూ పలచబరుస్తూ పోతే శక్తి పెరుగుతుందనేది శాస్త్రీయ పరిశోధనకు గురి చేస్తే ఎక్కడా నిలబడడం లేదు.

పాశ్చాత్య దేశాలలో కొందరు సైంటిఫిక్ పద్ధతులలో హోమియోనూ రుజువు చేయడానికి తిప్పలు పడి, చతికిలబడ్డారు. అయినా హోమియోకు బలమైన లాబీ వుంది. పాశ్చాత్య దేశాలలో హోమియో ఆటుపోటులు జరుగుతూనే ఉన్నాయి. హోమియో వ్యాపారం జోరుగా సాగుతున్నది. కొన్ని విశ్వవిద్యాలయాలలో హోమియో డిగ్రీలు యిస్తున్నారు. నమ్మకానికి ఎంత విలువ వుందో దీనివలన తెలుస్తుంది. ఫ్రాన్స్, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాలలో కొందరు హోమియోను శాస్త్రీయం అని రుజువు పరచడానికి కృషి చేశారు. ఒక స్థయిలో రుజువు అయినట్లు పరిశోధనా ఫలితాల వ్యాసాలను మెడికల్ మేగజైన్లకు పంపారు. లాన్సట్ వంటి ప్రతిష్ఠాకరమైన సైన్స్ పరిశోధనా పత్రికలు వాటిని ప్రచురించేసరికి, సైన్స్ లోకం విస్తుపోయింది. తీరా ఆరా తీస్తే పరిశోధనలు అన్నీ మోసపూరితంగా, కృత్రిమంగా తయారు చేశారని తేలింది. పత్రికలు క్షమాపణలు చెప్పాయి. జేమ్స్ రాండీ వంటివారు మిలియన్ డాలర్ల అవార్డు పెట్టి, హోమియోను శాస్త్రీయం అని నిరూపించమన్నారు. నిరూపించామని ప్రగల్భాలు పలికినవి, బూకరింపులని తేలింది.

అయినా హోమియో కొన్ని చోట్ల, ముఖ్యంగా ఇండియా, అమెరికా బెల్జియం, ఇంగ్లండ్, ఫ్రాన్స్ లో సాగిపోతున్నది. ఎందుకని?

నమ్మకం, మూఢవిశ్వాసం ఒక్కటే కారణం కాదు. అలోపతిలో వున్న దోషాలు, పాలనా లోపాలు, వ్యయం సాకుగా చూపుతున్నారు. హోమియోవారు ముందుగా అలోపతిని విమర్శించడంతో రోగిని ఆకర్షిస్తారు. తరువాత క్షుణ్ణంగా ఇంటర్వూ చేయడంతో మరియు బుట్టలో పడేస్తారు. దీనికి తోడు రోగిలో వున్న విశ్వాసం, మూఢనమ్మకం హోమియోకు పెట్టుబడిగా పనికొస్తుంది.

ఇంతకూ మొదటి ప్రశ్న అలాగే మిగిలిపోయింది. మందు లేని మందు ఎలా రోగం నయం చేస్తుంది?

మేరీమాత కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. వినాయకుడు పాలు తాగుతున్నాడు. అయ్యప్ప కొండపై జ్యోతి వెలుగుతుంది. అల్లా ఒక్కడే దేవుడు. వెంకటేశ్వర స్వామికి మొక్కితే తీరుస్తాడు. షిరిడీ సాయి మహత్తులు నిజమైనవి. ఈ నమ్మకాలు చదువుకున్నవారిలో చదువురాని వారిలో వున్నాయి. అలాగే హోమియో వలన రోగాలు నయం అవుతాయనడం కూడా.

దీనికి ఆధారంగా కొందరు సినిమా తారలు. క్రికెట్ ఆటగాళ్లు, నాయకులకు నయం అయినట్లు చెబుతారు.

కొందరు ప్రముఖుల సర్టిఫికెట్లు ప్రదర్శిస్తారు.

నేడు హోమియో వైద్యులు కొందరు ఆధునిక కంప్యూటర్లు. పరికరాలు వాడుతున్నారు. వీటివలన రోగ లక్షణాలు తెలుసుకోవడం శాస్త్రీయంగా ప్రదర్శిస్తున్నారు. ఎలక్ట్రో హోమియో అందులో ఒకటి.

కాని హోమియో మూలతత్వం, మందు మాత్రం శాస్త్రీయం కాదనేది స్పష్టం.

ఆధునిక వైద్యాన్ని విమర్శించేటప్పుడు ఒక విషయం మరచిపోతున్నారు. అది సంపూర్ణతను ప్రదర్శించడం లేదు. లోపాలను ఒప్పుకుంటుంది. నిత్య నూతనంగా పరిశోధన చేస్తూ పోతుంది. తప్పులను దిద్దుకుంటూ సాగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో తప్పులు ఒప్పుకొని దిద్దుకుంటూ పోవడం కీలక అంశం.

అది హోమియోలో వుండదు. హోమియో అన్ని విధాలా యిప్పటివరకూ అశాస్త్రీయం.

హోమియో వలన ప్లాసిబొ ప్రభావంతో తత్కాలిక ఉపశమనాలను చికిత్స చూపడం దారుణం. రోగంలో హెచ్చుతగ్గులు ప్రతి రోగికీ వుండగా, వాటిని ఆసరాగా హోమియో తమ గొప్పతనం అని చాటడం తప్పు.

ఇంతకూ హోమియోకు మూలధనం నమ్మకమే. శాస్త్రీయ రుజువులు అడగరాదు.

భారతదేశంలో రిజిష్టర్ చేయించుకోకుండా ప్రాక్టీసు చేసే హోమియోలకు లెక్కలేదు. ఇంగ్లండ్ లో హోమియో ప్రాక్టీసుకు ముందు కనీసం ఎం.బి.బి.ఎస్. చదవాల్సిందే. ఇక అమెరికా హోమియో మందులు విచ్చలవిడిగా అమ్ముకోవచ్చు. దీనికి అదుపు లేకపోవడానికి రాజకీయ లాబీ కారణం. ఇది 1938 నుండీ నడుస్తున్న చరిత్ర.

హోమియో గురించి ఇంటర్నెట్ లో చూడదలచినవారు Quackwatch.com చదవదలచినవారు Trick or Treatment by Simon Singh, Edzard Erust (2008 W.W.Norton & Co. Publication) గ్రహించవచ్చు.

హైదరాబాద్ లో డా. పి.ఎం. భార్గవ (సైంటిస్ట్) నేను పత్రికా సమావేశంలో హోమియోను విమర్శిస్తే, హెమియో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు దాడి చేశారు. శాస్త్రీయ రుజువులు చూపగలవారు రౌడీలుగా మారడం దేనికి ?

హోమియో మందును మీ యిష్టం వచ్చిన లాబ్ (పరిశోధనాలయం)కు తీసుకెళ్ళి, టెస్ట్ (పరీక్ష) చేయించండి. ఏదైనా మందు వుందేమో గమనించండి.

కొందరు టీకాల వైద్యం పద్ధతి హోమియోకు పోల్చి చెప్పబోతారు. కాని టీకాల మందులో మందు వున్నది. హోమియోలో లేదు. అదే ప్రధాన తేడా

నేను బ్రస్సెల్స్ వెళ్ళినప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో హోమియోను గురించి చెబితే చాలా ఆశ్చర్యపోయి, అనేక ఆసక్తికర ప్రశ్నలు వేశారు.


9 comments:

దిన్నెల కృష్ణ కుమార్ said...

యాండోయ్ ఇన్నయ్యగోరు

య్హమ్హాగా ఉందండే. ఓమియోపతి వైద్దాన్ని వైద్దమే కాదనేసిన మగానుబావులు మీరు, మీలాటి భేతాళవాదులేనండే. మీలాటోరు నేపోతే పపంచకం ఏటయిపోతాదీ అనిపిత్తాదండే అప్పుడప్పుడు.

యాండే, మరి "కాన్సంట్రేటేడ్" అనే మాటకి అర్దం ఏటండే? సపోసు , ఫర్ సపోసు సరిపడా నారింజ రసం, అంటేనండే ఓ గిద్దెడండే - తీస్కోని ఓ పేద్ద గిన్నెలో పోసి, దాన్ని ఓ యాబై శార్లు, యాబై ఒస్త్రాలు దొంతరగా ఎట్టి, అందులో వడగట్టి ఆపైన మిగిలిందాన్ని మీరు తాగారాండే ?

ఓపాలి తాగి సెప్పండే. అద్దాగాకా మీకు మేరిమాత కనపడుద్దండే, నిజ్జంగానే ఏడుస్తా కనపడిద్దండే. ఏటి నమ్మకం కలగట్నేదా మీకు, మారాజా ప్రగల్భాలు, బూకరింపులు కాదండే, అచ్చంగా మీరు ఆ సిఫిలిస్సో, సైకోసిస్సులోకో దిగిపోతారండే. ఆ హానిమన్ను మీద ఒట్టండే. అదండే సంగతి

Praveen Mandangi said...

ఆయుర్వేదంతో రోగాలు తగ్గుతాయి కానీ ఆయుర్వేదంపై జనంలో నమ్మకం తక్కువ ఉండడం వల్ల ఆయుర్వేదం చదివిన డాక్టర్లు కూడా అల్లోపతి వైద్యం చెయ్యడం జరుగుతోంది. హోమియోపతిపై అనేక వివాదాలు ఉన్న మాట నిజమే. కొన్ని దేశాలలో ఆ వైద్యాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. లోపాలు లేని ఆయుర్వేదాన్ని నమ్మనివాళ్ళు లోపాలు ఉన్న హోమియోపతిని ఎలా నమ్ముతున్నారు? కొంత మంది మోసగాళ్లు ఆయుర్వేదం పేరు చెప్పి నాటు మందులు అంటగడుతున్నారు. నాటు మందులు పెద్దగా పని చెయ్యవు కాబట్టి జనం వాటిని సులభంగా నమ్మరు. అయితే హోమియోపతిని జనం సులభంగా ఎందుకు నమ్ముతున్నట్టు? హోమియోపతి పూర్తిగా అశాస్త్రీయం అయితే మారుమూల పల్లెటూరిలో భూతవైద్యుడి దగ్గరకి వెళ్ళిన వాళ్ళు చనిపోయినంత సులభంగా టౌన్ లో హోమియోపతిని నమ్మే పేషెంట్స్ కూడా చనిపోవడం జరగాలి. హోమియోపతి వల్ల రోగం కొంచెమైనా తగ్గే అవకాశం ఉంటే అది నాటు వైద్యం లాగ తక్కువ ప్రభావంతో పని చేస్తుందనుకోవాలి? హోమియోపతి నాటు వైద్యం లాంటిదా, లేదా భూతవైద్యం లాగ పూర్తి మూఢనమ్మకమా? ఈ విషయం హోమియోపతిని విమర్శించేవాళ్ళు క్లియర్ గా చెప్పాలి.

Gopal said...

అంటే మీరు హోమియోపతీ పనిచెయ్యదంటారు?

మా అబ్బాయికి ప్లాంటార్ సోరియాసిస్ వచ్చి అల్లోపతీ వైద్యం చేయించగా నయంకాక సంవత్సరం పాటు బాధపడ్డాడు. అప్పుడు వాడి వయసు 4 సం. రెండు కాళ్లల్లోను మడమనుండి మధ్య వరకు చీరుకుపోయినట్లుండేది. ఇదేమి బాధరా భగవంతుడా అని నేను నాభార్యా బాధపడుతుండేవాళ్లం. ఎందుకో హైదరాబాదు వెళ్తే మావాళ్లు దగ్గర్లో హోమియో డాక్టర్ గారు బాగా మందిస్తారు ఒకసారి ట్రై చెయ్యమంటే వెళ్ళాం. 15 రోజులలో సగం తగ్గిపోయింది. ఇంకొన్నాళ్లు వాడగా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు 14 సంవత్సరాలు మళ్లీ రాలేదు. మరి దీన్నేమంటారు? అల్లోపతీకి ఎందుకు తగ్గలేదు?

మా అమ్మగారు కడుపునొప్పితో బాధపడుతుంటే గైనకాలజిష్టు కు చూపించగా కడుపులో కంతి ఉంది ఆపరేషను చెయ్యాలి అని చెప్పింది. మా అమ్మగారు ఆపరేషను చేయించుకోడానికి ఒప్పుకోలేదు. అప్పటికి ఆవిడకు 65 సం. పైగా వయసు. ఎవరో చెప్పగా హోమియోపతి వైద్యం చెయించాం. 10 రోజులలో నొప్పితగ్గింది. తరువాత 10 సంవత్సరాలు ఆవిడ ఎబాధ లేకుండా ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగి ఆవిడ పోయారు.

మా చిన్నవాడు రాత్రిళ్ళు విపరీతంగా దగ్గువచ్చెది. పగలంతా బాగుండేవాడు. పడుకునే సరికి దగ్గు మొదలయ్యేది. అల్లోపతీలో మందులు మార్చి, మార్చి, చివరకు ప్రతిరోజు పడుకునేముందు 10 రూ. ఖరీదు చెసే బిళ్ళ రోజూ వేస్తేనే కాని నిద్రపోలేక పోయేవాడు. అల్లాంటిది హోమియో వాడాక ఆదగ్గు అవీ శుభ్రంగా తగ్గాయి. దీనికేమంటారు.

అల్లోపతీవైద్యులు బాగా డబ్బుమరిగిన రకాలు. కొడుకులను కూడా డబ్బులుకట్టి డాక్టర్లను చేస్తుంటారు. మరి తక్కువ డబ్బఖర్చుతో జనాలకు బాగయ్యిపోతే వీళ్లకు వందలువందలు ఫీజులు ఎవరు ఇస్తారు, వీళ్లు చేయించే టెస్టులు ఎవరు చేయించుకుంటారు (వీళ్లు చేయించే ప్రతి టెస్టుకు వీళ్లకు 20 - 30% కమీషను ముడుతుంది), వీళ్లు రాసే మందులకు కమీషను ముడుతుంది (1 రూపాయి చేసే మందును మందుల కంపెనీలు 40 రూపాయలకు అమ్మేది తెలవదా). అందుకనే ఇలా హోమియోపతి, ఆయుర్వేదాలమీద విరుచుకు పడతారు.

మీకు ఇస్టం లేకపోతే మీరు వాడడం మానెయ్యండి. ఆ విధానాన్నే మూసెయ్యాలంటే డబ్బులేని వాళ్లంతా ఎమవుతారు?

Praveen Mandangi said...

ఇన్నయ్య గారి వాదన పై కొన్ని డౌట్లు ఉన్నాయి కానీ అంతమాత్రాన ఈ వ్యాసం పూర్తిగా తప్పు అనుకోలేం. హోమియో మందులు వాడినవాళ్ళు చావడం లేదంటే దానికి కారణం అవి నాటు మందులలాగ కొద్దిగా ప్రభావం చూపడం కావచ్చు లేదా హోమియో వైద్యులు అల్లోపతి మందులు ఇంక్లూడ్ చేసి ఇచ్చి ఉండొచ్చు. నాకు తెలిసిన ఒక ఆయుర్వేద డాక్టర్ ఆయుర్వేదం మీద నమ్మకం లేక నాకు అల్లోపతి మందులు ఎక్కువగా రాసి ఇచ్చేవాడు. ఆయుర్వేదం సశాస్త్రీయమైనదే కానీ కొంత మంది ఆయుర్వేద డాక్టర్లకి కూడా ఆయుర్వేదం పై నమ్మకం లేకపోవడం బాధాకరం. హోమియోపతి విషయంలో ఇన్నయ్యగారు లేవనెత్తిన డౌట్లని అంత సులభంగా ఇగ్నోర్ చెయ్యలేం. హోమియోపతిని కొన్ని దేశాలలో పూర్తిగా నిషేధించడం జరిగింది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న కొన్ని అల్లోపతి మందులని కూడా చాలా దేశాలలో నిషేధించడం జరిగింది. హోమియోపతి ఎంతవరకు పని చేస్తుంది, ఎంతవరకు hazardous ప్రభావం చూపుతుంది అన్న విషయం చర్చించడంలో తప్పులేదు. చాలా విషయాలలో ఇన్నయ్య గారి పాయింట్స్ ఆఫ్ వ్యూ నిజమనే అనిపిస్తున్నాయి కానీ హోమియో మందులు వాడినవాళ్ళు చనిపోయిన కేసులు ఎందుకు కనిపించడం లేదు అన్నది నా డౌట్.

krishna rao jallipalli said...

దీర్ఘ కాల వ్యాదులకి చాలా మంది హోమియో మందులనే వాడతారు. హోమియో డాక్టర్లు అల్లోపతి వైద్యం చేయడం నేరం. ఆ మద్య ఇలా చేస్తున్న వారిపై ప్రభుత్వం దాడులు చేసి కొంతమందిని బొక్కలో కూడా వేసారు. అయినా సరే ఇప్పటకి చాలా మంది హోమియో వైద్యులు అల్లోపతి వైద్యం చేస్తూనే ఉన్నారు. ఇంకొక విశేషమేమిటంటే... గుంటూరు జిల్లా పొన్నూరులో హానిమన్ శిలా విగ్రహం ఉన్నది.

హరి said...

మనిషికి సహజంగా రోగ నిరోధక శక్తి ఉంటుంది. దాని వలన ఏ చికిత్స లేక పోయినా కొన్ని జబ్బులు ఆలస్యంగానైనా సరే తగ్గుతాయి. ఆ విధంగా చాలా మంది అమాయకులు తమకు హోమియో, నాటు వైద్యాల వల్లనే జబ్బులు తగ్గాయని భ్రమిస్తుంటారు. ఎలాగూ హోమియో వైద్యులు కూడా తమ వైద్యం నిదానంగా తగ్గిస్తుందని నమ్మ బలుకు తుంటారు. కామెర్లు వస్తే అల్లోపతి డాక్టరు మందు లేదంటే నాటు వైద్యుడు తగ్గించడం నేను చూసాను. అంత మాత్రాన నాటు వైద్యం శాస్త్రీయమని చెప్పలేం. అదృష్టం ఉన్న వాడు తన రోగ నిరోధక శక్తితో బతుకుతాడు. లేనివాడు చస్తాడు. బతికిన వాడి వల్ల ఆ వైద్యుడి కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది.

అసలు హోమియో మందులో మందే లేనపుడు ఆ మందు కారణంగా మాత్రం ఎవడూ చావడు, బ్రతకడు. అంత వరకు సంతోషించాలి. కాని సరయిన వైద్యం లేక పోవడం వల్ల రోగం ముదిరితే మాత్రం తప్పక చస్తాడు, లేదా మరో అల్లోపతి వైద్యున్ని చూసుకుంటాడు.

ఈ సందర్భం గా ఒక ఉదంతం గుర్తొస్తుంది. మా మామయ్య ఒకాయనుండేవాడు, ECIL లో ఇంజనీరు. హోమియో వైద్యమంటే పిచ్చి అభిమానం. కడుపు నొప్పని చెప్పి చాలా రోజులు హోమియో వైద్యుల చుట్టూ తిరిగాడు. వారిచ్చే మందులతో కడుపు నొప్పి అప్పటికప్పుడు తగ్గినట్టు అనిపించేది. కొంత కాలానికి జబ్బు బాగా ముదిరి మంచం మీద పడితే, అల్లోపతి నర్సింగ్ హోం లో పరీక్షలు జరిపిస్తే అసలు విషయం తెలిసింది. కాని అప్పటికే చిన్న ప్రేగులో క్యాన్సరు బాగా ముదిరి పోయింది. ముందే పరీక్షలు జరిపించి వుంటే చికిత్సకు అవకాశం వుండేది. ఆయన తాను నమ్మిన హోమియో వైద్యం వల్లే కాటికి పోవాల్సి వచ్చింది.

ఇవే కాక ప్రాణిక్ హీలింగ్, రెకీ లాంటి రక రకాల వైద్యాలు వాడుకలో వున్నాయి. ఆశ్చర్యకరంగా వీటికి ప్రజాదరణ బాగానే వుంది. ప్రజలు నిరూపణలు కోరకుండా గుడ్డిగా నమ్మినంత కాలం వీటికి డోకా లేదు.

Praveen Mandangi said...

మా చిన్నప్పుడు విజయనగరం జిల్లా మానాపురం దగ్గరలో అక్షరం ముక్క రాని ఒక నాటు వైద్యుడు 26 రోగాలకి ఒకే మందుతో చికిత్స చెయ్యగలనని జనాన్ని నమ్మించాడు. అతను ఎంత పాపులర్ అయ్యాడంటే విశాఖపట్నం, శ్రీకాకుళంల నుంచి కూడా అనేక మంది కార్ల మీద మానాపురం వెళ్ళేవాళ్ళు. అతని మందులు తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపడం వల్ల ఎవరికీ రోగాలు తగ్గలేదు. దాంతో జనం మానాపురం వెళ్ళడం మానేశారు. శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రగిరి అనే గిరిజన ప్రాంతంలో ఒక సన్యాసి చేతి స్పర్శ ద్వారా రోగాలు తగ్గిస్తాను అని జనాన్ని నమ్మించాడు. మహేంద్రగిరులకి వంద కిలో మీటర్ల దూరాన ఉన్న శ్రీకాకుళం నుంది, రెండు వందల కిలోమీటర్ల దూరాన ఉన్న విశాఖపట్నం నుంచి కూడా కార్లు వేసుకుని వచ్చేవాళ్ళు. బాబాలు, సన్నాసులు, మంత్రగాళ్ళని నమ్మేవాళ్ళు ఒకవైపు అల్లోపతి మందులు వాడుతూనే మరో వైపు మహిమలని నమ్ముకుంటారు. పూర్తిగా మంత్రాలు, మహిమలని నమ్మితే మనిషి నిజంగా చావడం ఖాయం. వీళ్ళు సైమల్టేనియస్ గా వాడిన అల్లోపతి మందుల వల్ల రోగాలు తగ్గితే అది అల్లోపతి ప్రభావం అని చెప్పుకోకుండా అది బాబా దయ అనో, సన్యాసి దయ అనో, మంత్రగాడు ఇచ్చిన రక్షరేకు మహిమ అనో అనుకుంటారు. చర్చిలో స్వస్థత ప్రార్ధనలు చేసేవాళ్లు కూడా సైమల్టేనియస్ గా అల్లోపతి మందులని వాడుతారు. వాళ్ళు కూడా రోగాలు తగ్గితే యహోవా (YHWH) కరుణించాడని చెప్పుకుంటారు. ఎలాంటి మత నమ్మకాలు లేని నాస్తికులకి కూడా అల్లోపతి మందుల వల్ల రోగాలు తగ్గుతాయి. లేనివి ఉన్నట్టు భ్రమపడుతూ, ఆ భ్రమలలో సంతృప్తిని చూడడం వల్ల మనిషిలో నిజాయితీ లోపిస్తుంది.

Praveen Mandangi said...

ఇంకో విచిత్రం ఏమిటంటే హేతువాద సర్కిల్స్ లో కూడా హోమియోపతి డాక్టర్లు ఉండడం. ఎన్.ఎవి. బ్రహ్మం గారు కూడా వృత్తి రీత్యా హోమియో వైద్యులే. హోమియోపతి గురించి అతన్ని అడిగితే హనీమన్ గారు చెప్పిన విషయాలు తప్ప వేరే సమాధానాలు చెప్పలేకపోయారు. బైబిల్ లోని అనేక అశాస్త్రీయ వచనాలని బయట పెడుతూ పుస్తకాలు వ్రాసిన ఎన్.వి.బ్రహ్మం గారు కూడా అశాస్త్రీయమైన హోమియోపతి గోతిలో పడ్డారు.

Mangesh Devalaraju said...

హోమియోపతి వైద్య విధానంలో పదార్ధము మందుగా ఇవ్వబడదు. గుణం మందుగా ఇవ్వబడుతుంది. అల్లోపతిలో పదార్థమే మందు. అందుకనే హోమియోపతిలో మందు కనపడదు. అది సూక్ష్మము. మనకి వున్న ప్రాణం ఎలా కనపడదో ఇదీ అంతే. అంత మాత్రాన మందు లేదు అనటం దాన్ని అందరూ నమ్మటం చాలా అవివేకం. ఏ వైద్యమైతే పదార్థమయమైన మందు తగ్గించి సూక్ష్మమైన మందు ఇస్తుందో దానికే ఎక్కవ భవిష్యత్తు. ఈ నమ్మకం లేని వాళ్ళు కనక ఇంకొక 100, 150 సం|| బ్రతికి వుంటే తెలుస్తుంది. ప్రయత్నించండి.