Friday, May 23, 2008

పుస్తక సమీక్ష

పురాణ ప్రలాపం








ఇన్నాళ్ళు హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు, సందేహ వాదులుసూటిగా, ఘాటుగా, చెప్పిన తీరు జనంలోకి ఆకర్షణీయంగా పోలేదు. ఈ గ్రంథ రచయిత హరిమోహన్ ఝా అనుసరించిన పద్ధతి వ్యంగ్య, వినోద ప్రక్రియ. కనుక ఇది పిల్లలకు, పెద్దలకు పట్టే అవకాశం ఉన్నది.

తెలుగులో అనువదించిన జె. లక్ష్మి రెడ్డి చూపిన దోరణి గమినిస్తే ఇందులో అనువాదం అనిపించే లక్షణాలు లేవు. సొంతంగా వ్రాశారేమో అనే భ్రమ కలుగుతుంది. అది గొప్ప చేయితిరిగిన విధానం.

రచయిత 23 అంశాలను ఎంపిక చేసి, తన సునిసిత విమర్శలకు, వ్యంగ్య బాణాలకు, నవ్వించే దోరణికి పొందికగా అమ్మర్చారు. ఆ విధానమే ఈ పుస్తకానికి తిరుగులేని, మణిపూస.

వేధాలు మొదలు గీత వరకు, రామాయణం నుండి భారతం వరకు, ఆయుర్వేదం నుండి గ్రహణాలు, జ్యోతిష్యం వంటి ప్రజాబాహుళ్య అంశాలు చర్చనీయాంశాలుగా స్వేకరించారు. ప్రతి అంశాన్ని చీల్చి చండాడు తున్నప్పుడు మూల గ్రంధాలనుండి ఆధారాలు చూపి, విమర్శకులు, భక్తులు మాట్లాడకుండా చేయగలిగారు.

రచయిత బీహార్ ప్రాంతంలోని మిధిలకు చెందినవాడు. ఆ భాషలోనే ఈ పుస్తకం రాశాడు. దీనిపై వీరభక్తులు, చాందసులు ధ్వజమెత్తారు. కానీ విమర్శలకు సమాధానం చెప్పలేకపోయారు. ‘ఖట్టర్ కాకా’ శీర్షికన ప్రచారంలోకి వచ్చిన హరిమోహన్ గ్రంధం విస్త్రుత ఆదరణకు గురైంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ శాఖలో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన లక్ష్మిరెడ్డి ఈ పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చి శాస్త్రియ ఆలోచనకు, నేటి సమాజంలో రాను రాను ముదిరిపోతున్న మూఢ భక్తిని ఎదుర్కోటానికి బాగా ఆయుధాలని అందించారు.

వేదాలు చదవరాదని పూర్వం స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు ఆంక్షలు విధించారు. ఈ రచయిత ఇందుకు కొత్త వారిని చేర్చి, బ్రహ్మచారులు కూడా వేదాలు చదవరాదన్నారు. వింతగా అనిపిస్తుంది కదూ. వేధాలలో సోమపానం తాగి తందనాలాడిన పురుషులు, పచ్చి శృంగారంలో తేలిపోయిన మునులు, వావి వరసలు చూడకుండా వ్యభిచరించి సంతానాన్ని ఉత్పత్తి చేసిన పద్ధతులు, భోగలాలసత్వం, ఆధికారికంగా చూపాడు. జిగుప్స కలిగించే సెక్స్ వేధాలనిండా నిండిపోయిన విధానాన్ని మూలగ్రంథాలనుండే చూపాడు.

వేధాల తర్వాత నేడు అంత ప్రమాణాన్ని, అధికారాన్ని చూపుతున్న గీతను చేపట్టి కృష్ణుడు దారుణమైన ప్రవర్తన, హింసను పురికొలిపి విధ్వంసాన్ని చేయించటం, వికటించిన శృంగారం సర్వత్ర విమర్శకు గురిచేశాయి. కర్మ ఫలం పేరిట జరిగిన నాటకాన్ని గుట్టు రట్టు చేశాడు.

ప్రజలలో మూలగ్రంథాలు తెలియకపోయినా, మూఢాచారాలకు లోపం లేదు. అందులో పేర్కొనధగినవి, జ్యోతిష్యం, సత్యనారాయణపూజ, దుర్గాస్తోత్ర పారాయణం, భూతాల మంత్రం, బ్రాహ్మణ సందర్పణ, పురోహితుల నీచపాత్ర చెప్పుకోదగినవి. వాటిని వెంగ్యంగా, ఎత్తిపొడిచి గొప్పగా నవ్వించి ఆటపట్టించాడు. జ్యోతిష్య మూలగ్రంథాల నుండే ఉదాహరణలు ఇచ్చి వెక్కిరించాడు. ‘పారాశర హోరాసారః!’ నుండి ఉదాహరణలు చూపినప్పుడు సాక్ష్యాత్తు జ్యోతిష్యుడే పారిపోతాడు. అందులో ఒకచోట ఇలా ఉంది. శుక్రుడు మంగళగ్రహ క్షేత్రంలో ప్రవేశించినా, లేక మంగళ గ్రహంతో పాటు కనిపించినా ఆ జాతకునికి భగచుంబన సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఇక జ్యోతిష్యుడు ఆదరబాదరగా వెళ్ళిపోక ఏం చేస్తాడు.

ఆయుర్వేదం :

‘భావప్రకాశ్’ అనే ఆయుర్వేద మూలగ్రంథం నుండి ఉదాహరణలు చూపి, శివుని అంగం నుండి భూమిపైన పడిపోయిన ధాతువే పాదరసం అని, మరొక చోట “లావుపాటి తొడలు, స్థూల నితంబాలు ఉన్న యువతి పుష్టి కలిగిన తన స్తనాలతో గాఢాలింగనం చేస్తే చలి తొలగి పోతుంది” అని చూపి ఇలా అంటాడు : ఇలాంటి ప్రిస్క్రిప్షన్ ఏ మెడికల్ పుస్తకంలోనైనా దొరుకుతుందా? తరువాత విమర్శ చేస్తూ - ఇతర దేశాల్లో చికిత్సా పద్ధతి వైజ్ఞానిక రీతిలో వికసించింది. కాని, ఈ దేశంలో మాత్రం తాత-తండ్రులు చెప్పిన మాటే సత్యం అదే ఆయుర్వేదంలో ప్రధాన లోపంగా చూపుతారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఇచ్చి ఆయుర్వేదాన్ని అపహాస్యం చేస్తాడు.

రచయిత ఈ పుస్తకంలో చిన్నాన్న అనే పాత్రను ప్రధానంగా ప్రవేశపెడతాడు. విమర్శలన్నీ నవ్విస్తూ, కవ్విస్తూ, దెప్పి పొడుస్తూ, ఆ పాత్ర ద్వారానే చెప్పిస్తాడు. చిన్నాన్న ప్రాచీన హిందూ సంప్రదాయ ఆచార్య వ్యవహారాల్లో స్వీకరించిన భంగును తాగుతూ, వక్కపొడి నములుతూ ఇలాంటి విషయాలు అవలీలగా చెబుతాడు. ఒకవేళ భంగు తాగి ఆషామాషీగా చెప్పాడనటానికి, ఎక్కడికక్కడ ప్రమాణాలు చూపుతూనే పోతాడు. కనుక అతడి తర్కానికి ఎదురు లేదు.

భూతాల మంత్రం :

మన మూర్కత్వానికి సూచనగా భూత మంత్రాలు కొల్లలుగా ఉదహరిస్తారు. శత్రు సంహారానికి ప్రయోగించాల్సిన మంత్ర తంత్రాలను అగ్ని పురాణం నుండి చూపి అలాంటివి మనల్ని లోకం దృష్టిలో ఎలా చవకబారుగా చెస్తుందో చెబుతాడు. ఈ మంత్రాల కిటుకులు చాలా దారుణమైనవని విమర్శిస్తాడు. ఉదాహరణకు తంత్రసారంలో “శుభనక్షత్రంలో అపామార్గ మూలిక నూరి పూసుకుంటే ఏ ఆయుధం దెబ్బా శరీరానికి తగలదు”. దత్తాత్రేయ తంత్రంలో “శనివారం గాని, బుధవారం గాని శత్రువు మూత్ర విసర్జనం చేసే చోట ఒక ఊసరవెల్లిని పట్టుకొచ్చి పాతిపెట్టు. అంతే, శ్రతువు నపుంసకుడైపోతాడు”. ఈ గుప్త రహస్యం స్వయంగా శంకరుడే చెప్పాడు. రచయిత ప్రకారం మన తలపైన కూర్చొని సవారీ చేస్తున్న మూర్ఖత్వమనే భూతం భస్మీభూతం అయిన తరువాతే దేశ భవిష్యత్తు బాగుపడుతుంది.

శాస్త్ర వచనాలు :

ఎవరు గానీ తన ఇష్టప్రకారం ఒక పూచిక పుల్ల కూడా తుంచకూడదు మరి. మనవు ఆదేశమంటే - గోళ్ళతో గడ్డిపరకను తుంచరాదు, ఇక్కడ తుమ్మినా, దగ్గినా, ఉమ్మినా ప్రాయశ్చిత్తం చేయాలి అని శాతాతప స్మృతిలో ఉందట. ఇలాంటివి రచయిత కోకొల్లుగా ఉదహరించి, మన శాస్త్రకారులు లెక్కలేనన్ని విధి-నిషేధాలు కల్పించి మనుషులను బంధించారు. ధర్మశాస్త్రంలో ఏదైనా కొరత ఉండి ఉంటే దాన్ని జ్యోతిష్యం పూర్తి చేసింది అన్నాడు. మనువు, యాజ్ఞవల్క్యుడు ధర్మమనే బేడీలు ప్రజల చేతులకు బిగించారు. భృగువు, పరాశరుడు కాలపు సంకెళ్ళు కాళ్ళకు తగిలించారు. ఈ దేశంలో బంధనాలకు ముఖ్యకారణం శృతులు, స్మృతులు, జ్యోతిష్యం, పురాణాలు. రచయిత అంత ఘాటుగానూ, సాధికారికంగానూ విషయాలు చెప్పాడు.

రామాయణాన్ని స్వీకరించి రాముడి పాత్రను తీవ్రంగా విమర్శకు గురిచేశారు. అందులో భార్యను అడవి పాలు చేయటం. ఆమె శీలాన్నిశంకించడం గర్హిస్తాదు

భారతాన్ని పరిశీలించి ధర్మరాజు ప్రవర్తనను, జూదరిగా భార్యను తాకట్టు పెట్టడం మొదలుకొని ద్రౌపది చేసిన తప్పులను ఎత్తి చూపుతాడు.

సత్యనారాయణ పూజ :

వ్రత ప్రభావంతో ధన ఫ్రాప్తి, పుత్ర ప్రాప్తి లభిస్తుందని ప్రచారం చేసిన రీతులను భ్రోకర్, భీమా ఏజెంట్ లతో పోల్చి చెప్పాడు. సత్యనారాయణుడు లోభి, స్వార్ధపరుడు, క్షుద్రుడు, దుష్టుడుగా అర్థమౌతాడని కథను చదివినవారికి తెలుస్తుందన్నారు. గృహస్తులకు ఆశలు చూపి, చవక బేరాలకు ఎగబడేటట్లు బ్రాహ్మణులు ప్రచారం చేశారని, చిన్నాన్న పాత్ర విమర్శిస్తుంది. పూజ చేయించే గృహస్తుడి కోరిక సిద్ధిస్తుందో లేదో గాని, పురోహితుడి కోరికలు మాత్రం తీరతాయన్నాడు.

కావ్య రసం :

ప్రాచీన కావ్యాలలో విద్యాపతి పదావళి వంటివి పిల్లలకు పాఠ్యగ్రంథాలుగా చెప్పటాన్ని రచయిత తీవ్రంగా పరిగణించారు. వాటినిండా సెక్స్ అది అశాస్త్రీయమైన ధోరణిలో ఉండటాన్ని విపులంగా చూపారు. ఇలా సెక్స్ నిండిపోయిన కావ్యాలను గీతగోవిందం మొదలు శంకరాచార్యుడి భగవతి భుజంగ స్తోత్రం వరకు చూపారు. ఈ సందర్భంగా అనువాదకుడు లక్ష్మిరెడ్డి వెంకటేశ్వర సుప్రభాతం నుండి పచ్చి శృంగారాన్ని ఉదహరించారు.

సుప్రభాతంలో 1వ శ్లోకం :

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుని తాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీ భవ వేంకట శైలపతే
దీని అర్థం తెలుగులో యిది : లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమపూ రంగువల్ల అంతటా ఎర్రగా చేయబడ్డ సాటిలేని నల్లని శరీరం కలవాడా తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవాడా జగన్నాయకుడా, వెంకటాచలపతీ, జయించే స్వభావం కలవాడవు కమ్ము.
23వ శ్లోకం

కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తి
కాంతాకు చాంబురహ కుట్మలలోల దృష్టే
కళ్యాణ నిర్మలగుణాకర దివ్యకీర్తి
శ్రీ వెంకటాచలపతీ తవసుప్రభాతమ్

తెలుగులో అర్థం : మన్మధుడి గర్వాన్ని హరించగల అందమైన ఆకారం గలవాడా. ప్రియురాలి తామర మొగ్గుల వంటి చన్నుల మీద ఆసక్తితో చూపులు పెట్టినవాడా. శుభాన్ని కలిగించే మంచి గుణాలకు నిలయమైనవాడా. గొప్ప కీర్తి కలవాడా. వెంకటాచలపతీ నీకు సుప్రభాతముగుగాక.

ఇలాంటివి పిల్లలచేత పారాయణం చేయిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్న సమాజం మనది. సంస్కృతంలో బూతు ఉంటే పరవాలేదనే ధోరణి ప్రభలి ఉన్నది.

ఈ పుస్తకాన్ని 23 చిన్న నాన్ డీటేల్డ్ పాఠ్యగంధ్రాలుగా పెట్టించటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. నవ్విస్తూ, వాస్తవాలను ఇంత బాగా చెప్పిన ఈ విషయాలు భవిష్యత్తు తరాలవారికి ఉండాలి. ఒక వైపున సమాజం, చదువుకున్న వారితో సహా మూడనమ్మకాలతో, వెన్నకి పోతుండగా, సొంత శక్తిపై ఆధారపడలేని వాళ్ళు చదువుకున్న వారిలో కూడా ఉండగా అలాంటి వారికి కళ్ళు తెరిపించే ఈ పుస్తకం బహుళప్రచారంలోకి రావాలి.

పురాణప్రలాపం :
వ్యంగ్య వినోద ప్రసంగం
మైథిలీ మూలం : హరిమోహన్ ఝా
తెలుగు అనువాదం : జె. లక్ష్మిరెడ్డి.
పేజీలు : 268, వెల : రూ.100.
అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్ లలో లభించును.

Translater

3 comments:

Anonymous said...

Innaih,

Hope this website will be usefull to you
http://free-university-in-internet.blogspot.com/

Indian Minerva said...

ఛాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ సారి హైదరాబాద్ వెళ్ళి నప్పుడు తప్పక సంపాదిస్తాను "గృహస్తుడి కోరికలు తీరుతాయో లేదో తెలియదుకానీ పురోహితుడి కోరికలు మాత్రం తీరుతాయి" ఇది మాత్రం అక్షర సత్యం. నన్నడిగితే మతాలన్నీ పనిచేయడం ఇష్టంలేని సోమరి తండాలు వాళ్ళని వాళ్ళు జనాల జేబులతో పోషించుకోవడానికి కనిపెట్టిన ఒక గొప్ప చట్రం.

మనం లౌకిక వాదులం అని చెప్పుకుంటూనే చిన్న పిల్ల చేత ఏదో ఒక మత పారాయణం చేయిస్తామే తప్ప ఏ వైపు మొగ్గటం అనేది ఊహ తెలిసిన తరువాత వాళ్ళంతట వాళ్ళే తీసుకోవలసిన నిర్ణయం అని మనమెప్పుడూ భావించం. మరలాంటప్పుడు నాస్తిక వాదాన్ని బుర్రలో జొప్పించడం కూడా తప్పే. మన విద్యా విధానం మన పిల్లనను ఆలోచనా పరంగా స్వతంత్రులను చెయ్యాలే తప్ప ఏదో ఒక గాట్లోకి గుడ్డిగా నడిపేది కాకూడదని/ కాకుండుండాల్సిందని నా అభిప్రాయం. కాబట్టి Non detailed పాఠ్య పుస్తకాలుగా ప్రవేశ పెట్టాలనేది నేనేమాత్రం అంగీకరించలేకపోతున్నాను పై పెచ్చు వాటిల్లో మన "పవిత్ర శ్లోకాలకు" అర్ధాలు కూడా వున్నాయయ్యే...

Indian Minerva said...

ఇన్నయ్య గారూ చాలా thanks. మంచి లైబ్రరీనే చూపించారు.