Thursday, May 29, 2008

పుస్తక సమీక్ష

అంబేద్కర్ ను ఎలా అర్థం చేసుకోవాలి!























1. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన సంపుటాలు ఇంగ్లీషులో.
2. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన అనువాద సంపుటాలు.

దేశంలో ఎక్కడ చూచినా అంబేద్కర్ పేరు వినవస్తున్నది. వినిపించే వారెవరనుకున్నారు? కాంగ్రెసు, భారతీయ జనతాపార్టీ, జనతాదళ్ పార్టీలు అంబేద్కర్ ను భుజాన వేసుకొని మోస్తున్నాయి. పోటీపడి ఫోటోలు పెడుతున్నారు. విగ్రహాలు వేస్తున్నారు. వీధులకు పేర్లు పెడుతున్నారు. ఉత్సవాలు చేస్తున్నారు. అంబేద్కర్ ను తెగ పొగిడేస్తున్నారు. అన్ని పార్టీలు, అందరు రాజకీయవాదులు అంబేద్కర్ ను గౌరవిస్తుండగా ఇక కావాల్సిందే మున్నది! సాంఘిక న్యాయం రాకేం చేస్తుంది!
అంబేద్కర్ కూలంకషంగా హిందూ సమాజంలోని దోషాల్ని పరిశీలించారు. వాటిపై పోరాడారు. ధ్వజమెత్తారు. ఆయన చెప్పినవి, చేసినవి సబబే అనిపించారు. అంటరాని కులాలవారు, శూద్రులు సమాజంలో గణనీయంగా వున్నారు. వారికి ఓట్లున్నాయి అవి లేనిదే ఏ పార్టీ గెలవదు. కనుక రాజకీయపార్టీలు కొత్త ఎత్తుగడలతో, తాత్కాలికంగా ఓటర్లను మభ్యపెట్టే వ్యూహాలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగా నేడు అంబేద్కర్ ను తెగ పొగిడేస్తున్నారు. అది విని అటు దళితులు, ఇటు శూద్రకులాలు సంతోషపడి ఓట్లు వేయాలని రాజకీయ పార్టీల ఉద్దేశం.
అంబేద్కర్ సిద్ధాంతీకరించిన వాటిని ఆమోదించి ఆచరిస్తామంటే అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అంబేద్కర్ రాసినవి, చెప్పినవి ఏ రాజకీయపార్టీ ఆమోదిస్తున్నది? ఎంతవరకు ఆచరించగలవు నిజంగా ఆమోదిస్తే సంతోషం. కాని పొగుడుతూ, గోతులు తవ్వి అంబేద్కర్ ను పూర్తిగా చంపేయాలనే ఎత్తుగడ అయితే, జాగ్రత్త పడాలి. ఆ విషయం శ్రద్ధగా, లోతుగా పరిశీలించాలి. అంబేద్కర్ పేరిట, కొందరు బయలుదేరి ప్రభుత్వాన్నికి విజ్ఞప్తులు చేస్తూ కమిటీలు వేయమనీ, విగ్రహాలు ప్రతిష్ఠించమనీ, ఉత్సవాలు జరపమనీ కోరుతున్నారు. ఇలాంటి అంబేద్కర్ వాదులను సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధమే. అది కూడా అంబేద్కర్ వాదాన్ని ఉరితీయడానికి పన్నుగడే. ఈ విషయం గ్రహించడానికి అంబేద్కర్ వాదులకు కొంతకాలం పట్టొచ్చు. ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది.
కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ ప్రేమ
“కాంగ్రెస్, గాంధీజీ అంటరాని వారికేం చేశా”రని ప్రశ్నిస్తూ అంబేద్కర్ పుస్తకం రాసి, గాంధీ బ్రతికుండగానే ప్రచురించారు. ఆ ప్రశ్నలకు నాటికీ, నేటికీ సమాధానం రాలేదు. బహుశా రాదుకూడా. గాంధీజీ సమాధానం చెప్పకపోవడానికి వ్యూహం, ఎత్తుగడ కారణాలైతే, కాంగ్రెసు వారు జవాబివ్వకపోడానికి ఆశక్తత కారణం. అప్పటి కాంగ్రెసు వేరు, నేటి కాంగ్రెసు వేరు అనడానికి వీలున్నదా అంటే, వీల్లేదేమో. 100 సంవత్సరాల కాంగ్రెసు ఉత్సవాలు జరుపుకున్న కాంగ్రెసు వారు, కాంగ్రెసు సంస్కృతి పుణికి పుచ్చుకున్నట్లు సగర్వంగా చెప్పుకున్నారు. కనుక, అదంతా చరిత్ర. నేడు కొత్తగా ఆరంభిద్దాం అనడానికి వీల్లేదు. అలాగే కాంగ్రెసుకు గుత్తాధిపత్యంగా గాంధీజీని స్వీకరించిన పార్టీ అంబేద్కర్ ప్రశ్నలకు ఏం చెబుతారు?
అంటరానితనం తొలగించాలంటూ అనిబిసెంట్ అధ్యక్షతన కాంగ్రెస్ తీర్మానించి, ఆచరణలో ఏమీ చేయకుండా వుండడం (1917లో) గమనిస్తే, నిమ్మజాతుల్ని మోసగించడం ఒక పథకం ప్రకారం సాగిపోయిందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.
గాంధీజీకి చిత్తశుద్ధి లేదా?
ఆ తరువాత గాంధీజీ రంగప్రవేశం చేసి, కాంగ్రెసును ఆక్రమించి, అంటరానివారి ఉద్ధారకుడుగా ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించడం, ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. అంటరానితనం తొలగించడానికి కార్యక్రమం చేబట్టాలని 1922లో గాంధీజీ ఆధ్వర్యాన కాంగ్రెసు పార్టీ తీర్మానించింది. దీనినే బార్డోలీ తీర్మానం అంటారు. అంతే, తీర్మానంతోనే పని ఆగిపోయింది. గాంధీజీ మాత్రం అంటరానివారి ఆర్తత్రాణపరాయణుడుగా పేరు తెచ్చుకున్నాడు. కాంగ్రెసు వారు కమిటీలు వేశారే తప్ప, ఏమీ చేయలేదు. గాంధీజీ మిగిలిన విషయాలలో వెంటాడి పనులు చేయించినా, అంటరానితనం వరకూ తీర్మానాలకే పరిమితం చేశారు. తిలక్ స్వరాజ్యనిధి మసూళ్ళు చేసి, నిర్మాణ కార్యక్రమం సాగించి, అంటరానితనం నిర్మూలనకు ఉపక్రమించారు. గాంధీజీ విజ్ఞప్తి మేరకు ప్రజలు 1921లోనే ఒకకోటి 30 లక్షల రూపాయల నిధి యిచ్చారు. అంటరానితనం నిర్మూలనకు ఎంత ఖర్చు చేశారయ్యా అంటే 43 వేలు మాత్రేమే. గాంధీజీ యీ విషయమై ఏమీ అనలేదు.
అంటరానివారికి ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలని అంబేద్కర్ కోరారు. బ్రిటిష్ పాలకులు అంగీకరించారు. ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం అంగీకరించిన గాంధీజీ, అంటరానివారికి ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలంటే ఆమరణ నిరాహారదీక్ష పూనారు. అంటరానివారు శతాబ్దాలుగా ఎలా వుంటున్నా సరే, వారు బాగుపడక పోయినాసరే, గాంధీజీ ప్రాణం విలువైంది గనుక, ఆయన్ను బ్రతికించుకోవాలన్నారు. అంబేద్కర్ పై వత్తిడి తెచ్చి, బలవంతంగా ఆయనచేత ప్రత్యేక ప్రాతినిధ్యం కొరకు పట్టుబట్టనని ఒప్పించారు. అంటే గాంధీజీ కోరినట్లు అంటరానివారు హిందువులలో భాగంగా అలాగే అణిగిమణిగి పడివుండేటట్లు పూనా ఒడంబడిక చేసిందన్నమాట. అంబేద్కరంను ఓడించి, గాంధీ నెగ్గి, అంటరానివారిని చాలా అన్యాయాలకు గురిచేశారు.
కేరళలోని గురువాయూర్ దేవాలయంలో అంటరానివారికి ప్రవేశం కల్పించకపోతే ఆమరణ నిరాహారదీక్ష పూనుతానని బెదిరించిన గాంధీజీ ఆ మాట ఎన్నడూ నిలబెట్టుకోలేదు. అగ్రవర్గాలవారు అంటరానివారి దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుంటే, కాంగ్రెసు పార్టీ ఓట్లకోసం అగ్రకులాల వారిని సమర్థిస్తుంటే, గాంధీ, కాంగ్రెసును ఖండించలేదు.
చీటికిమాటికి సత్యాగ్రహాలు, ఆమరణ నిరాహారదీక్షలు చేసిన గాంధీజీ, ఒక్కసారైనా అంటరానితనం నిర్మూలనకు నిరాహారదీక్ష పూనలేదు. ఎందుకని? హిందూ సమాజంలో అంటరానివారిని అట్టిపెట్టాలని గాంధీజీ ప్రయత్నించడమే గాక సనాతనవాదిగా కులాలు, వర్ణాలు వుండటాన్ని సమర్థించాడు. వాటికి మూలమైన శాస్త్రాల్ని, గీతను ప్రచారం చేశాడు. కులాన్ని కాదని, వర్ణ వ్యవస్థను సమర్థించడం కూడా గాంధీజీ ఎత్తుగడే.
కనుకనే గాంధీజీవల్ల జాగ్రత్తగా వుండమని అంబేద్కర్ పదేపదే హెచ్చరించాల్సి వచ్చింది. అంటరానితనం తొలగించనిదే స్వరాజ్యం రాదన్న గాంధీజీ ఒక్కసారైనా నిరాహారదీక్షకు పూనుకోపొవడం, కాంగ్రెసు చేత ఎలాంటి కార్యక్రమాన్ని చేబట్టించకపోవడం గాంధీజీ చిత్తశుద్ధికి గీటురాయి. అలాగే సత్యాగ్రహం అనే ఆయుధాన్ని అంటరానివారి కోసం ఎన్నడూ ఉపయోగించని గాంధీజీ, 1929లో దేవాలయ ప్రవేశానికి అంటరానివారే సత్యాగ్రహానికి పూనుకుంటే, గాంధీజీ స్వయంగా వారిని ఖండించారు. అంబేద్కర్ ఆశ్చర్యపోయాడు. దేవాలయ ప్రవేశార్హత బిల్లును కేంద్ర శాసనసభలో రంగ అయ్యర్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ జనరల్ అనుమతించకపోతే, చూసుకోమరి అని గాంధీజీ బెదిరించాడు. ఎన్నికల దృష్ట్యా యీ బిల్లుకు కాంగ్రెసు పార్టీ మద్దత్తును ఉపసంహరించింది. గాంధీజీ కాంగ్రెసును వెనకేసుకొచ్చారే గాని, అంటరానివారిని కాదు. హరిజన సేవాసంఘం పక్షాన హక్కుల పోరాటానికి గాంధీజీ ఎన్నడూ అనుమతించలేదు. పైగా హరిజన సేవాసంఘ యాజమాన్యంలో హరిజనుల్ని గాంధీజీ తొలగించారు. పూనా ఒడంబడిక తరువాత అంటరాని వారికి కేటాయించిన స్థానాలలో వారిపై పోటీపెట్టవద్దని కాంగ్రెసుకు గాంధీజీ సలహాయివ్వలేదు. కాంగ్రెసు మంత్రివర్గాలలో అంటరానివారికి ప్రాతినిధ్యం వుండాలని గాంధీజీ ఎన్నజూ పట్టుబట్టలేదు. పైగా మధ్య పరగణాలలోని మంత్రిమండలిలో అగ్నిభోజ్ అనే అంటరాని ప్రతినిధి నియామకాన్ని గాంధీజీ వ్యతిరేకించాడు.
గాంధీజీకి అంటరానివారిపట్ల చిత్తశుద్ధి లేదనడానికి అంబేద్కర్ ఎన్నో ఉదాహరణలు చూపాడు. అలాగే కాంగ్రెసువారి చర్యల్ని వస్త్రకాయంపట్టి వారి విద్రోహచర్యల్ని బట్టబయలు చేశాడు. కనుక వీటికి సమాధానం కాంగ్రెసువారే చెప్పాలి. లేదా, గాంధీజీని, స్వాతంత్ర్యానికి ముందున్న కాంగ్రెస్ ను పూర్తిగా ఖండించాలి. తాము కొత్త అవతారం ఎత్తామని చూపాలి. అది సాధ్యమా? ఆచరణలో కాంగ్రెసువారు ఎలా వున్నారు? అదీ పరిశీలిద్దాం.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన హిందూ కోడ్ బిల్లును సనాతన హిందువులు వ్యతిరేకించారు. జవహర్ లాల్ నెహ్రూ పైకి సెక్యులర్, అభ్యుదయవాదిగా వున్నా ఎన్నికల సమయానికి సనాతనులకు లొంగిపోయాడు. ఫలితంగా అంబేద్కర్ నెహ్రూ మంత్రిమండలి నుండి రాజీనామా చేసి బయటకు పోవాల్సి వచ్చింది. ఆ తరువాత అంబేద్కర్ అంటరానివారి విమోచనకై ఉద్యమించి, హిందువులలో వున్నంతకాలం వారికి సమానత్వం రావడానికి వీల్లేదని గ్రహించి, బౌద్ధంలో చేరాడు, చేర్పించాడు. అంటరానివారి పట్ల ప్రేమ నటించిన కాంగ్రెసువారు, అంతవరకూ వున్న సౌకర్యాలను, ప్రత్యేక కేటాయింపులను అంబేద్కర్ అనుచరులకు లేకుండా చేశారు. జనతా ప్రభుత్వంలో గాని మళ్ళీ వారి హక్కుల పునరుద్ధరణ కాలేదు.
భారతీయ జనతాపార్టీ - అంబేద్కర్
అంబేద్కర్ కు ప్రస్తుతం దేశంలో కొత్త అభిమానులు ఏర్పడ్డారు. భారతీయ జనతాపార్టీ ఇటీవల ఒకనోట గాంధీజిని, మరోనోట అంబేద్కర్ ను పొగుడుతూ, వారి ఆశయాలను ఆచరిస్తామంటున్నది. ఒక వేదికపై గాంధీజీని, అంబేద్కర్ ను చేర్చారంటేనే బిజెపిని శంకించవలసి వస్తున్నది. గాంధీజీని కొత్తగా గుత్తకు తీసుకున్న బి.జె.పి. తమ ఎత్తుగడలో అంబేద్కర్ ని కూడా చేర్చడం గమనార్హం. కాని యీ ఎత్తుగడ విఫలంగాక తప్పదు. అంబేద్కర్ లో బి.జె.పి. ఆమోదించే అంశమేదీ కనిపించడం లేదు. కేవలం ఓట్ల కోసమే, కాంగ్రెసువారి వలె, బిజెపి కూడా అంబేద్కర్ ను శ్లాఘిస్తున్నా, అది మరీ కృత్రిమంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది. అయినా, బిజెపి నీతికి తానే పట్టం గట్టినట్లు పేర్కొంటున్నది.
ఇటీవలే బిజెపి వారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికై కంకణం కట్టుకున్నారు. రామరాజ్యం నిర్మిద్దాం అంటూ, అయోధ్య మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు రాళ్ళు మోసుకొని వెళ్ళారుకూడా. అదంతా మతకలహాలకు దారితీసింది. కాని అంబేద్కర్ ను పొగుడుతూ, ఆయన ఆశయాలను పాటిస్తామంటున్న బి.జె.పి వారికి అసలు విసయం తెలియదనుకోలేం గదా. అందులో బాగా చదువుకున్న నాయకులు, అనుచరులు ఉన్నారు. వారిలో అందరూ కాకున్నా, కొందరైనా అంబేద్కర్ రచనలు చదివి వుంటారు. హిందూమతాన్ని గురించి, రాముడిని-రామాయణాన్ని గురించి అంబేద్కర్ రాసింది వారి దృష్టికి వచ్చే వుంటుంది.
అంబేద్కర్ రచనలలో అముద్రితంగా వున్న రచనలు కొన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించగా, అందులో రాముడి గురించిన విషయమై పెద్ద ఆందోళన జరిగింది. బిజెపి శివసేన, హిందూ ఛాందసులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక అంబేద్కర్ లో బిజెపి వారు అంగీకరిస్తున్నదేమిటో, నిరాకరిస్తున్నదేమిటో జనానికి తెలియాలి. ఫలానా విషయం తృణీకరిస్తున్నామంటే, ఎందుకో కారణాలు కూడా బిజెపి చెప్పాలి. ఇదేమీ చేయకుండానే బిజెపి హఠాత్తుగా అంబేద్కర్ వర్థంతులు, జయంతులు జరుపుతూ వూరేగింపులు చేస్తుంటే అంబేద్కర్ వణికిపోతుండాలి. బుద్ధుడికి హిందువులు పట్టించిన గతి, అంబేద్కర్ కు బిజెపి వారు పట్టించదలచారా?






















అంబేద్కర్ హిందుమతాన్ని ఖండించారు. వేదాలనుండే మొదలైన వర్ణవ్యవస్థ, పురుషసూక్తం నుండీ 4 వర్ణాల వర్ణన పేర్కొని, నిరసించారు. ధర్మశాస్త్రాల అమానుష నియమాలను, రామాయణ, మహాభారత అవినీతి పంధాను బట్టబయలు చేశారు. హెచ్చుతగ్గుల హిందూసమాజంలో శూద్రుల స్థితి, బౌద్ధంపై పోరాడి సృష్టించిన అంటరానితనం హిందువులు ఎలా పోషించారో చారిత్రకంగా పెర్కొన్నారు. హిందువులు పూర్వం యజ్ఞయాగాదులు పేరిట ఆవుల్ని చంపి, ఆవు మాసం తిన్న ఉదంతాల్ని చూపారు. హిందూమతంలో అంటరాని వారికి స్థానం లేదని, సమానత్వం రాదనీ స్పష్టం చేశారు. కనుక హిందూమతాన్ని తృణీకరించి, బౌద్ధులుగా మారి అంటరానివారంతా సమానతను సాధించుకోవాలన్నారు.
అంబేద్కర్ కేవలం ద్వేషంతో, పగతో హిందువులలో అగ్రవర్ణాల వారిని, ముఖ్యంగా బ్రాహ్మణ ఛాందసులను తిట్టలేదు. సుదీర్ఘంగా పరిశోధించి, ప్రమాణాలతో విషయ పరిశీలన చేసి చూపారు. పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తి ప్రస్తావించారు.
మనువు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్న అమానుష, క్రూర, ఘోర నియమాలు, నిషిద్ధాలు, అక్రమశిక్షలు, నిచ్చెనమెట్ల సమాజాన్ని బిగించిన తీరు చూపారు. అంటరానితనాన్ని శాస్త్రోక్తంగా సమర్థిస్తున్న ధర్మాలను అంబేద్కర్ చూపారు. ఇవేవీ తెలియనట్లు బిజెపి నటిస్తోందా? లేక అవన్నీ మరచిపోదాం అంటోందా? అంబేద్కర్ ఆశయాలు అమలు జరగాలంటే, కొన్ని శాస్త్రాల్ని, గీతను, వేదాలను, రామాయణ, మహాభారతంలోని అంశాలను, ధర్మశాస్త్రాల్ని పక్కన బెట్టాలి. వాటిని పాటించరాదని, మానవ హక్కులకు అవి విరుద్ధమని గ్రహించాలి. పాఠ్యగ్రంథాలలో యీ అంశాలు రాకుండా చూడాలి. అంటరానితనాన్ని పాటించే ఆశ్రమాధిపతుల్ని ఖండించాలి. ఇవి చేయడానికి బిజెపి సిద్ధపడితే మనం సంతోషించాలి, ఆహ్వానించాలి. కేవలం అంబేద్కర్ ను పొగిడితే అది ఓట్ల వ్యూహంగానే భావించాలి. ఎన్నికల నినాదంలో (ప్రణాళికలో) రాంమందిర్ ప్రస్తావన బిజెపి విరమించాలి. రాముడిని గురించి అంబేద్కర్ ఏమంటున్నాడు?
రాముడు కావాలా? మానవ హక్కులు కావాలా? తేల్చండి
రాముడని దేవుడిగా పరిగణిస్తూ వుండేవారు. అతడు సీత శీలాన్ని శంకించి ప్రవర్తించిన తీరుకు అసహ్యపడాలి. ఈ విషయంలో రాముడి చర్య నేరంతో కూడింది. రాజుగా రాముడు, తపస్సు చేస్తున్న శూద్రుడు శంబుకుడిని చంపడం, అతడు ధర్మాన్ని అతిక్రమించాడనడం, ఇదంతా ఒక చనిపోయిన బ్రాహ్మణ యువకుడి నిమిత్తం చేశాడనడం తప్పు.
రాముడి పుట్టుక వ్యవహారమంతా ఆదర్శప్రాయం కాదు. బుద్ధ రామాయణం ప్రకారం సీత రాముడి సోదరి. కనుక యీ యిరువురి పెళ్ళి ఆదర్శం కాదు. రాముడు ఏకపత్నీవ్రతుడూ కాదు. వాల్మీకి రామాయణాన్ని బట్టి కూడా రాముడికి చాలామంది భార్యలున్నారు. (అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకం) ఇంకా ఉంపుడుకత్తెలు కూడా వున్నారు. రాముడిని దేవుడిగా చూచేవారు ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని అంబేద్కర్ అన్నారు. సమాధానం చెప్పజాలని భక్తులు కర్రలు తీసుకొని వీధిన పడ్డారేగాని సహనంతో చర్చించలేకపోయారు. అదీ రామ సంస్కృతి.
మనం కోరుకునే మానవ హక్కుల్ని హిందూమత సమాజంలో సాధించడం సాధ్యంకాదని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సమానత్వం లేదు. స్వేచ్ఛకు గుర్తింపు లేదు. జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో వుండే అవకాశం లేదు. సౌభ్రాతృత్వం అసలే లేదు. కనుక హిందుమతం ప్రజాస్వామిక విలువలకు చోటు పెట్టడం లేదని అంబేద్కర్ స్పష్టం చేశాడు (ఫిలాసఫి ఆఫ్ హిందూయిజం). హిందూ ధర్మాలు, పవిత్ర గ్రంథాల ఆధారంగానూ, ఆచరణరీత్యానూ జరుగుతున్న తంతును అంబేద్కర్ విశదీకరించాడు. సాంఘిక న్యాయానికి తోడ్పడని హిందూమతాన్ని అమానుషమైనదిగా సహజంగానే అంబేద్కర్ నిర్థారించాడు.
బి.జె.పి. వారు అంబేద్కర్ తత్వాన్ని, వాదనల్ని ఏ మేరకు అంగీకరిస్తున్నారో, ఎక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలి. అంటరానితనం పోవాలి అని చిలుకపలుకులు ఉచ్ఛరిస్తే సరిపోదు. అది ఎలా సృష్టి అయిందీ, మూలస్థంభాలుగా నిలచి దీనిని ఎవరు పోషిస్తున్నదీ, అది పోవాలంటే ఏం చేయాల్సిందీ అంబేద్కర్ చెప్పారు. హిందూ సమాజం పాటిస్తున్న యీ మహానేరం ప్రపంచ చరిత్రలోనే మచ్చగా నిలచింది. అంబేద్కర్ ను వాడుకుని ఓట్లు తెచ్చుకుందామనే బిజెపి తప్పు త్రోవలో పయనిస్తున్నదేమో చూచుకోవాలి. బుద్ధుడిని చంపేసినట్లే, అంబేద్కర్ ని కూడా నాశనం చేయాలనే పెద్ద కుట్రలో భాగస్వామిగా బి.జెపి. వ్యవహరిస్తున్నదా? కాదంటే, అందుకు భిన్నంగా ఆచరణలో కనిపించాలి.
జనతాదళ్ కూడా అంబేద్కర్ ను గౌరవిస్తున్నది. పార్లమెంటు హాలులో నిలువెత్తు ఫోటో పెట్టారు. దళితులపై అత్యాచారాల్ని అందరూ ఖండిస్తున్నారు. కాని వాటికి మూలంగా నిలచిన మతం, ధర్మశాస్త్రాలు, ఆశ్రమాలు, హిందూ దురభ్యాసాలు రూపుమాపకుండా, అంబేద్కర్ ను గౌరవించడం సాధ్యం కాదని గ్రహించాలి. కాంగ్రెసు, జనతాదళ్ ఒక తానులో వస్త్రాలే. ఎటొచ్చీ బిజెపి కొంచెం భిన్నమైంది. ముగ్గురూ కలసి అంబేద్కర్ వాదాన్ని తియ్యని మాటల్తో, చేతల్తో ఉరితీయదలచారు. ఈ విషయం అమాయకులైన వారికి అర్థం గావడానికి కొంత సమయం పట్టొచ్చు.




మార్క్సిజం-అంబేద్కర్
అంటరానివారు, శూద్రులు హెచ్చుతగ్గుల సమాజంలో అనుభవిస్తున్న కిరాతక చర్యల్ని గమనించిన అంబేద్కర్ అనేక మార్గాంతరాలను అధ్యయనం చేశారు. మార్క్సిజాన్ని పోల్చి కూడా అంబేద్కర్ చూచాడు.
శాస్త్రీయ సోషలిజంగా తన సిద్ధాంతాన్ని నిలపదలచిన మార్క్స్ అది విధిగా వచ్చి తీరుతుందని భావించినట్లు అంబేద్కర్ విశ్లేషించాడు. కాని 1917లో రష్యాలో వచ్చిన విప్లవం మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా రాలేదన్నాడు. అది విధిగా సంభవించలేదంటే, ఎంతోహింస, రక్తపాతం జరిగిందనీ, మానవ ప్రయత్నం వలన రష్యాలో విప్లవం వచ్చిందనీ అంబేద్కర్ చెప్పారు. చరిత్రను ఆర్థిక దృక్పధంతో చూడడం సరైనది కాదని రుజువైందని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. క్రమేణా కార్మికుడు పేదరికంలోకి పయనిస్తునట్లు కూడా సిద్ధాంతీకరించడాన్ని ఎవరూ అంగీకరించడం లేదన్నారు. ప్రపంచాన్ని పునర్నిర్మించడమే తత్వం చేయాల్సిన పని అని మార్క్స్ చెప్పింది సరైనదిగా అంబేద్కర్ భావించారు. వర్గాలమధ్య సంఘర్షణ వున్నట్లు మార్క్స్ అన్నది వాస్తవం. వ్యక్తిగత ఆస్తివలన ఒకరు శక్తివంతమైన వర్గంగా, దోపిడీ వలన పరిణమిస్తున్నారు. ఈ వ్యక్తిగత ఆస్తిని తొలగించి సమాజం శ్రేయస్సును కాపాడాలి.
ఈ లక్ష్యాలను సాధించడానికి మార్క్స్, హింసను, కార్మిక నియంతృత్వాన్ని సూచించగా, బుద్ధుడు అహింసను, మానసిక మార్పును అవలంబించాడు.
మార్క్సిజంలో రాజ్యపరమైన సిద్ధాంతం బలహీనమైనదని, శాశ్వతంగా నియంతృత్వాన్ని అది సూచిస్తున్నదనీ అంబేద్కర్ విమర్శించాడు. రాజ్యం హరించిపోతుందని చెప్పినా అది ఎన్నడు జరుగుతుందో, అలా జరిగిన అనంతరం ఏమౌతుందో స్పష్టపరచలేదన్నాడు.
రష్యా విప్లవం సమానత్వాన్ని సాధిస్తుందని ఆహ్వానించాం. కాని స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం సమానత్వం సమాజానికి అవసరం. కమ్యూనిజంలో ఇవి లేవు గనుక తృణీకరించాలని అంబేద్కర్ అన్నాడు.
చివరగా
అంబేద్కర్ భారత సమాజాన్ని విభిన్న కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశోధనా ఫలితాలను ప్రచురించారు. శూద్రులెవరు అనే అంశం తీసుకొని, వేదకాలం నుండీ వర్ణాలుగా విభజించి చీల్చిన విషయాలను చూపారు. వేదాలలో వర్ణాలు లేవనే వారి వాదనను ఖండించారు. వర్ణాలు, కులాలు వేరని చూపి, సమర్థించుకొనే ధోరణులు కూడా అంబేద్కర్ ఖండించారు. ఈ విషయంలో ఆర్యసమాజ్, గాంధి మొదలైన వారంతా అంబేద్కర్ విమర్శలకు గురైనారు. చారిత్రకంగా బ్రాహ్మణులు నిర్వహించిన పాత్ర వివరంగా పరిశీలించాడు.
అంటరానివారంటూ మనువుకు పూర్వం లేరనీ, గుప్తుల కాలం నుండీ యీ జాడ్యం అమలులోకి వచ్చినట్లు అంబేద్కర్ చూపారు. మను ధర్మశాస్త్రాన్ని బాగా పరిశీలించి, ఖండించారు. ఆ మాటకొస్తే ధర్మశాస్త్రాలలో వున్న హెచ్చుతగ్గుల ప్రస్తావన, అమానుష ధోరణులు అంబేద్కర్ విమర్శలకు గురైనాయి. హిందువులకు, బౌద్ధులకు జరిగిన సంఘర్షణలో అంటరానివారు ఏర్పడినట్లు, అలాగే గోవధ నిషేధం కూడా మతపరం చేసినట్లు చూపారు.
హిందూ సమజాంలో ప్రజాస్వామిక లక్షణాలు, మానవహక్కులు లేవనీ, ఉండడానికి వీల్లేదని సోదాహరణగా అంబేద్కర్ తెలిపారు. సమానత్వం సోదరత్వం, స్వేచ్ఛలకు హిందూమతంలో తావులేదన్నారు. హిందుమతం అనేది కలగాపులగం అనీ, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధంలవలె నిర్ధుష్టంగా నిర్వచించ వీల్లేదనీ విపులీకరించారు.
హిందువులలో భాగంగా అంటరానివారిని పరిగణించినంతకాలం వారికి వియోచన, సమానత్వం, స్వేచ్ఛ రాదని అంబేద్కర్ నిర్థారించారు. అందుకే వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలన్నారు.
రాజకీయాధికారం లేనిదే, అంటరానివారికి హక్కులు ఏర్పడవనీ, బానిసలకంటె అధములుగా వారిని చూస్తారని అంబేద్కర్ పేర్కొన్నాడు.
ఆచరణలో, రాజకీయవాదులు కేవలం ఓట్ల కోసం అంటరానివారిపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు అంబేద్కర్ గ్రహించారు. ఇందులో అగ్రగణ్యుడు గాంధీజీగా ఆయన పసిగట్టి పోరాడారు. గాంధీ చెప్పే మాటలకు, చేసే వాటికి ఎలా పొంతనలేదో చూపారు. హిందువులలోనే అంటరాని వారిని అట్టిపెట్టి, శాశ్వత వెట్టిచాకిరీ చేయించుకొనే ధోరణిని గాంధీ సమర్థించారన్నారు. బౌద్ధంలో మాత్రమే సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం లభించగలవని అంబేద్కర్ నమ్మారు. బౌద్ధం మనదేశంలో ఏనాడో చంపేయబడింది. దీనిని పునరుద్ధరించడం చాలా కష్టమని అంబేద్కర్ గ్రహించలేదు. మానవ హక్కులకై అంబేద్కర్ పోరాటం ముందుకు సాగించవలసి వుంది.
అంబేద్కర్ మనువా?
అంబేద్కర్ ను తరచు మనువుతో పోల్చి, ఆధునిక రాజ్యాంగనిర్మాత అనీ, ఆధునిక మనువు అనీ నాజూకుగా తిడుతుంటారు. జీవితమంతా అంబేద్కర్ ఎన్నో పరిశోధనలు చేసి మనువు చేసిన ఛండాలమంతా బయటపెట్టాడు. మనదేశంలో విప్లవ ప్రతీఘాతుకం మనువుతోనే వచ్చిందన్నాడు. అంటరానితనం మనువునుండే ఆరంభమైనదన్నాడు. ఆడవాళ్ళకు స్వేచ్ఛ పోవడం, హక్కులు పోవడం మనువుతోనే మొదలయ్యాయన్నాడు. అలాంటి చండాలపు మనువుతో అంబేద్కర్ ను పోల్చడం పరోక్షంగా ఆయన్ను అవమానపరచడమే.
మన రాజ్యాంగాన్ని తగులబెట్టాలని అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాల్గొన్నప్పటికీ, తనకు యిష్టం లేనివి ఎన్నో చోటుజేసుకోవడంతో ఆయన అలా భావించాల్సి వచ్చింది. కనుక రాజ్యాంగంలో వున్న వాటన్నిటికీ అంబేద్కర్ ను బాధ్యుడుగా చేయడమూ భావ్యంకాదేమో.
అంబేద్కర్ ఆరంభించిన కృషి అడుగడుగునా అగ్రకులాల అవరోధాలతో వెనుకంజ వేసింది. కనుక రాజకీయ, ఆర్థిక, మత ప్రలోభాలకు లొంగక, మానవహక్కుల నిమిత్తం పోరాడటం, అంబేద్కర్ లక్ష్యాలను సాధించడానికి కృషిచేయడమే.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి వచ్చినా, అంబేద్కర్ తత్వాన్ని అమలుపరచడం లేదు.

7 comments:

Anonymous said...

చాలా పెద్దది, విలువైన వ్యాసం. దీనిని దయచేసి పిడిఎఫ్ లోకి మార్చి నాకో కాపీ పంపగలరా? కొంతమంది మిత్రులకు పంపుతాను. చాలా ఆలోచనలు రేకెత్తించే విషయాలు ఇందులో ఉన్నాయి. చాలా ఓపికతో రాసిన వ్యాసాన్ని పది మందికీ అందివ్వగలిగినప్పుడే మీ శ్రమకు సార్ధకత. దయచేసి పిడిఎఫ్ పంపించండి. నమస్తే.

Bolloju Baba said...

శబాష్ ఇన్నయ్య గారు శబాష్
మీ భావ ప్రవహాన్ని అందుకొని తమ బుర్రలకు పదును పెట్టుకొనే ఒక తరం ఉన్నదన్న విషయాన్ని మీరు విశ్మరించనందుకు మీకు ధన్యవాదాలు.

చిన్న అనుమానం.
కాని స్వేచ్చ, సౌబ్రాతృత్వం లేని సమానత్వం సమాజానికి అవసరం.
అనె వాక్యం లో ఏదో టైపింగు మిస్టేక్ ఉన్నట్లు అనిపిస్తుంది. పరిశీలించగలరు.

బొల్లోజు బాబా

innaiah said...

Thanks.I sent the PDF file as suggested by you

Kathi Mahesh Kumar said...

చాలా విలువైన విశ్లేషణ,అవసరమైన విశిదీకరణ. ఈ వ్యాసాన్ని కాస్త సమాజం గురించి ఆలోచించే అందరికీ ఒక కంపల్సరీ రీడింగ్ చెయ్యాల్సిన అవసరం ఉంది.

నాకు కూడా ఈ వ్యాసం మొక్క PDF mahesh.kathi@gmail.com కు పంపి వీలైనంత మంది మిత్రులతో పంచుకునే అవకాశం కల్పించగలరు.

Anil Dasari said...

నాకో సంగతి అర్ధం కావటం లేదు. అంటరానితనం తప్పు అని చెప్పటానికి దాని మూలాల శోధనలోకి వెళ్లాల్సిన అవసరమేముంది? వర్ణ వ్యవస్థ వేదకాలం నాటిదా, దాని ముందుదా, తర్వాతిదా లాంటి చర్చల వల్ల ఒరిగేదేముంది? కులాలు, వర్ణాలు ఒకటేనా కాదా అనేది కూడా అనవసరమైన చర్చే.
ఎప్పుడు పుట్టుకొచ్చినా అంటరానితనం తప్పే.

బుద్ధ రామాయణం బౌద్ధుల దృష్టి కోణం నుండి రాయబడింది. దాని ప్రకారం రావణుడు బౌద్ధుడు. హైందవ వ్యతిరేకులచే రాయబడ్డ రామాయణంలో రాముడు-సీత అన్నా చెల్లెళ్లేం ఖర్మ, అమ్మా కొడుకులని రాసినా వింత లేదు. అటువంటిదాన్ని అంబేద్కర్ తన వాదనకి మద్దతుగా వాడుకోవటమేంటి?

మీ వ్యాసం మొత్తం చదివాక అంబేద్కర్ చేసిందల్లా ఇటువంటి అనవసర విషయాలమీద పరిశోధనలు చేసి సమయం వృధా చేయటమే కానీ అంటరానివారికోసం చేయవలసినంత ఏమీ చేసినట్లు నాకనిపించలేదు. దళితులని ఉద్ధరించినట్లు కనిపించటానికి గాంధీ పడినంత కష్టం అంబేద్కరూ పడ్డట్లుంది.

అంబేద్కర్ జీవితం గురించి నాకు పెద్దగా తెలీదు. మీ వ్యాసం చదివాక నాకనిపించినదాన్ని రాస్తున్నానంతే.

yogirk said...
This comment has been removed by the author.
yogirk said...

"అంబేద్కర్ హిందుమతాన్ని ఖండించారు. వేదాలనుండే మొదలైన వర్ణవ్యవస్థ, పురుషసూక్తం నుండీ 4 వర్ణాల వర్ణన పేర్కొని, నిరసించారు. ధర్మశాస్త్రాల అమానుష నియమాలను, రామాయణ, మహాభారత అవినీతి పంధాను బట్టబయలు చేశారు."

Neither you, nor your Ambedkar have the faintest idea what Purusha Sukta talks about. Please do not regurgitate undigested stray bits of western work and delude yourself that its knowledge.

RK