Tuesday, February 10, 2009

గోపీచంద్ లో వెలుగు నీడలు

AGK
Gopichand with family











గోపీచంద్ 1910-1962

ఆవుల గోపాలకృష్ణమూర్తి (ఎజికె) వ్యక్తుల్ని అంచనా వేయటంలో అందెవేసిన, ఆరి తేరిన మేధావి. సునిసితంగా విమర్శించటం, కటువుగా హెచ్చరించటం ఆయన నిరంతరం చేసిన పని. వ్యాసోపన్యాసకుడు అని పేరొందిన మానవ వాది. తన మిత్రుడు త్రిపురనేని గోపీచంద్ గురించి తనదైన శైలిలో మనకు చూపిన రచనను మీకు అందిస్తున్నాను.
- ఇన్నయ్య




గోపీచంద్ 1910-1962




కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి విప్లవజ్యోతి. ఆయన తొలిబిడ్డ త్రిపురనేని గోపీచంద్. యిద్దరూ లాయరు వృత్తిలోవున్నా, అది వారికి ప్రధాన వ్యాసంగం- ముఖ్యవృత్తి కాదు. యిద్దరికీ రచన ప్రధాన విక్రియ. ఒకరు విమర్శక, విప్లవ కవిరాజులు, యింకొకరు ప్రతిభాయుత వచన రచయిత, అంతవరకే వారి సామ్యం. గోపీచంద్ 938 నుంచి 1950 దాకా రాడికల్ వుద్యమంలోనే వున్నాడు. ‘ఇండిపెండెంటు ఇండియా’ అన్న రాడికల్ వారపత్రికలో 1940 దాకా, అప్పుడప్పుడూ వ్రాసేవాడు. తెలుగు ‘రాడికల్’ పత్రికలో 1942 నుంచి 1949 దాకా వ్యాసాలు, కథలు వ్రాసేవాడు.
గోపీచంద్ తెలుగు, యింగ్లీషు భాషలు బాగా చదివినవాడు. యింగ్లీషులో చదువు జాస్తి, తెలుగులో రచన జాస్తి, గోపీచంద్ సంభాషణల్లో నిపుణుడు కాని మంచివక్తి కాదు వుపన్యాసాలంటే, కొంత వెనకాడేవాడు. చర్చలకు దూకేవాడు. రచనకు ముందడుగు వేసేవాడు.
గోపీచంద్ రచనలను కథలుగా, నవలలుగా, వ్యాసాలుగా, నాటికలుగా, నాటకాలుగా చూడవచ్చు. నాటికలు, నాటకాలు తక్కువ. మాంచాల, నాయకురాలు వ్యాసాల్లో రాజకీయ, సామాజిక, తాత్త్విక రంగాలు ప్రధానం. అందులో తాత్విక రచనలు ప్రముఖాలు. పోస్టు చెయ్యని వుత్తరాలు, తత్త్వ వేత్తలు - యీ రంగంలో ప్రశస్తాలు. సామాజిక రచనలుగా, ‘ఉభయకుశలోపరి’ వుత్తమ మైనది.
గోపీచంద్ రచనల్లో రాజకీయ వ్యాసాలు తక్కువ. పట్టాభిగారి సోషలిజం ముఖ్యం. యితర వ్యాసాలు యితరాలే. గోపీచంద్ నవలా రచయితగా ప్రఖ్యాతినార్జించాడు. అసమర్ధుని జీవయాత్ర, పరమేశ్వర శాస్త్రి వీలునామా, చీకటి గదులు, యెన్నికైనవి. డైరెక్టరుగా రైతుబిడ్డతో కథ మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయి తరువాత ఐదారేళ్ళు ఆరంగంలోనే వున్నాడు. ప్రియురాలు, లక్ష్మమ్మ, గృహప్రవేశం మొదలైనవి ఆయన తీసిన చిత్రాలు.
గోపీచంద్ అసలు రంగం కథా క్షేత్రం. కథకుడుగా - అది రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక, సాంకేతిక విషయాల్లో యేమైనా కానివ్వండి – అతను మూసపోసి, తనది గాజేసి, సిసలైన బాణీలో కథా వస్తువును రంగరించి అన్ని హంగులూ తీర్చి దిద్ది సర్వాంగ సుందరంగా కథను తయారు చేస్తాడు. యిందులో గోపీచంద్ సిద్దహస్తుడు. అందె వేసిన చేయి.
గోపీచంద్ లో చక్కటి చమత్కారం. భాషా పటిమ, నాటకీ కరణ గుణం వున్నవి. అది కథగాని, నవలగాని, వ్యాసంగాని, పరిచయం గాని గోపీచంద్ రచనల్లో అతను హెచ్చుగా కనబడతాడు. గోపీచంద్ ని యెరిగిన వాళ్ళు, ఆయన్ని ఆయన రచనల్లో చిరస్థాయిగా చూడవచ్చు, వినవచ్చు. ‘’శైలి ఆ వ్యక్తి యొక్క గురుతు’’ అనడానికి గోపీచంద్ సాక్షం. ప్రమాణం గూడాను. అది రచనలో ఆయన విశిష్టత. గోపీచంద్ రాడికల్ సాక్షం. ప్రమాణం గూడాను. అది రచనలో ఆయన విశిష్టత. గోపీచంద్ రాడికలం డెమో క్రాటిక్ పార్టీలో పనిచేసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడా పనిచేశాడు. రాడికల్ వుద్యమంతో సంబంధం వున్నన్నినాళ్లూ గోపీచంద్ ప్రధానంగా హేతువాది గానే వున్నాడు. హేతువాది నాస్తికుడు గనుక, ఆయనా నాస్తికుడుగానే వున్నాడు. ఆ వుద్యమంతో సంబంధం పోయినకొలదీ ఆయనలో పరి వర్తనం వచ్చి రాను రాను ఆస్తికుడైనాడు. అరవిందుని భక్తుడైనాడు. తనలోని పరివర్తననే తండ్రితో గూడా చూడగలిగినాడు. ‘వర్గచైతన్యం’ సడలిపోయింది.
గోపీచంద్ వాక్య విన్యాసం కోసం చాలా తాపత్రయపడతాడు. శ్రమపడతాడు, తెగతిరగ వ్రాస్తాడు. రానురాను ఆ గుణంమారి, రచన వలచబడింది. వేగంలో రచన చిక్కితె, ఆ పరివర్తన తప్పదు.
కాని, గోపీచంద్ యేది వ్రాసినా విశుద్ధంగా క్లిష్టతలేకుండా సూటిగా చెప్పుతాడు. అట్టి గోపీచంద్ ని తన 52వ యేట మనం కోల్పోవటం మనలో ఒక మేధావిని, పెద్దను కోల్పోవటమే.

గోపీచంద్ కవిరాజు రామస్వామి చౌదరిగారి అబ్బాయి. అందుచేతనే గోపీచంద్ మా గోపీచంద్ కాలేడు. ఒకనాడు గోపీచంద్ రాయిస్టు, అప్పటికి రాడికల్ అవునోకాదో తెలియదు. ‘రాయ్ వ్యాసాలు’ ‘ప్రజామిత్ర’ వార పత్రికలో వ్రాసేవాడు. అది 1938 ప్రాంతంలో ఎం.ఎన్. రాయ్ సంపాదకత్వాన నడిచే ‘ఇండిపెండెంటు ఇండియా’ అనే ఇంగ్లీషు వారపత్రికలో సంపాదకుని లేఖలుగా వ్రాసేవాడు.
కవిరాజు మీద నాకు అప్పటికే వున్న విశ్వాసం, రాయ్ మీద కలిగిన గురుత్వం, నన్ను గోపీచంద్ వైపుకు కదల్చినవి.
కాని ఆరోజుల్లో తీవ్రతరమైన గ్రాంథిక భాష వాదిని. మా ఎలవర్తి రోశయ్య గారితో కలసి ‘యధార్థ నవ్య సాహితీ సమితి’ని పెట్టి దాని పీఠాధిపత్యం వహిస్తూ వున్న రోజులు. అంటే మిత్రులు, పెద్దలు తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి గారు (తరువాత స్వామి శివ శంకరులు) అధ్యక్షత వహిస్తూ వున్న ‘నవ్య సాహితీ సమితి’కి ప్రతిగా, పోటీగా, భాషావివాద పరిష్కారం కోసమని, మేము మడిగట్టిన భాషా వాదాల్ని ప్రోత్సహించే రోజులవి.
గోపీచంద్, శ్రీ జి.వి. కృష్ణయ్య (డా. జి.వి. కృష్ణారావు). కోగంటి రాధాకృష్ణ మూర్తి, పి.వి. సుబ్బారావు మొదలైన వారంతా ఒకవైపున రాయిస్టులు, మరో వైపు సాహిత్యావలంబులు, సాహిత్యంలో రాయిస్టు దృక్పధగాములుగా వీరివంక ఆంధ్రదేశం చూచేది.
నేను, మిత్రుడు ఎలవర్తి రోశయ్య గోపీచంద్ సాహిత్యాన్ని గురించి వ్రాసిన వ్యాసాన్ని చూచి, వారి పరిభాషను చూచి (సాహిత్యంలో బూర్జువా డెమొ క్రాటిక్ విప్లవం రావాలి అన్న వారి నినాదాన్ని) అంగీకరించకపోగా, యేవగించు కొనేవాళ్లము.
అందువల్ల రాజకీయరంగంలో, సాంఘిక రంగంలో నాకు గోపీచంద్ కు వున్న సన్నిహితత్వం, సాహిత్య రంగంలో లేకపోయింది. తరువాత కొన్నాళ్లకు నేను గ్రాంధిక వాదాన్ని వదలటం జరిగింది. గోపీచంద్ సాహిత్యాన్ని రాజకీయదృష్టితో అన్వయించటం ఆపివేశాడు.
నేను తెనాలికి 1942లో వచ్చినప్పటి నుంచీ మా యిద్దరికీ యెక్కువ సాన్నిహిత్యం వుండేది. అంతకు ముందు 1942 వేసంగిలో కవిరాజు సన్మాన సంచిక వేసేరోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రం కలిశాము.
గోపీచంద్ చురుకైన సంభాషణలు చేసే వ్యక్తి. అతనిలో ప్రధానమైన గుణం అదే. అతని సంభాషణలు అతనికి ఎంతో సంతోషాన్ని, బలాన్ని యిచ్చేవి. ఆ చురుకుదనంలో ఒక రకమైన హాస్యం వుండేది. వక్రోక్తి కొంతహెచ్చు, అయినా రక్తి కట్టేవి.
గోపీచంద్ లో మరొక ముఖ్యగుణం – బాగా చదివేవాడు. చదివినట్లు కనబడేవాడు కాదు. చదివింది మననం చేసేవాడు. తనలోకి లాక్కొని తనదిగా చేసేవాడు. చేసిన తర్వాత గాని వ్రాసేవాడు కాదు. వ్రాయటం మొదలుపెట్టినా అచ్చుకు వెళ్లనిచ్చే వాడుకాదు.
వ్రాసిన కథలే అనేక పర్యాయాలు వ్రాసేవాడు. చెడగొట్టి, చెడరాసి, అచ్చుకిచ్చాక మళ్లీ చూచి, ప్రూపుల్లో దిద్ది. ఫారం కట్టినాక గూడా దిద్ది దుంప త్రెంచేవాడు. అదంతా మంచిగా చెప్పాలన్న మనోగత భావాన్ని పురస్కరించుకొని జరిగేది. రచనలో తన వ్యక్తిత్వాన్ని బాగా ప్రతిబింబించేవాడు. శైలిని బట్టి మనిషి వరవడిని చెప్పటానికి గోపీచంద్ శైలి మంచి నమూనాపాకంగా వుండేది.
1942 నుండి మూడునాలుగేళ్లు పార్టీగత, రాయి గత విషయాలమీద బాగా శ్రద్ధ చూపి, ఆంధ్రరాష్ట్ర రాడికల్ డెమెక్రాటిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినాడు. ‘రాడికల్’ పత్రికలో తరచు వ్రాసేవాడు.
ఆనాటి సాంఘికాభిప్రాయాలుగాని, రాజకీయాభిప్రాయాలు గాని, తాత్త్విక రంగానికి సంబంధించిన భావాలు గాని హేతువాద పునాది మీద వుండేవి. ఆనాడు గోపీచంద్, నావంటి చాలా మంది లాగ నాస్తికుడు.
తరువాత గోపీచంద్ రాడికల్ పార్టీకి దూరంగా, తెనాలికీ దూరంగా వెళ్ళి, మద్రాసులో సినిమా రంగంలోకని వెళ్ళినదగ్గర నుండి గోపీచంద్ లో క్రమానుగత పరిణామం వచ్చింది. సినిమా డైరెక్టరు కావాలన్న ధ్యాస ఆయనకు హెచ్చుగా వుండేది. మనతత్త్వాన్ని కదిపడదు. అందులో మీకు బొత్తిగా పడదు. వ్రాస్తే దూరంగా వుండి కథలు వ్రాస్తూ, రచనలోనే ప్రధానంగా వుండండి అని నేనెన్నో సార్లు చెప్పాను. మీ తత్త్వానికిపడదేమో - కాదనట్లు నవ్వేవాడు. గోపీచంద్ నవ్వు అనేది ప్రత్యేకం, పెద్దగా యిల్లు కప్పు యోగిరేటంతగా నవ్వేవాడు.
సినిమాలో యిమడలేదు. కొన్నాళ్లు కాసట బీసటగా వుంది. హేతువాదిగా వున్న గోపీచంద్ దిగజారి, మతవాదిగా మారిపోయాడు. రాయ్ ని వదిలి అరవిందుని ఆశ్రయించాడు. కవిరాజులో నాస్తికతకు బదులు ఆస్తికత చూడనారంభించాడు. రచనలో పూర్వం వున్న బిగువుపోయి పలచబడింది. గోపీచంద్ లో అపూర్వ పరిణామం వచ్చింది. పోస్టు చెయ్యని ఉత్తరాల్లో పడింది వరవడి. దాంతో గోపీచంద్ మాకు కొంచం దూరంగా జరగటం మొదలు పెట్టాడు. మనుషులము దగ్గరగా కూర్చున్నా భావాల వలయాలు వేరువేరుగా వుండిపోయినై.
హేతువాదంలో కన్నా మత వాదంలో పరిధి పెద్ద దన్న భ్రాంతిలోపడ్డాడు. రాడికల్ గా వున్న గోపీచంద్, హ్యూమనిస్టు కాకుండానే మతవాదిగా రూపాంతరం పొందాడు. దానితో మాకు మార్గభేదం, వాదభేదం యేర్పడినవి. రచయితగా గోపీచంద్ ప్రాయికంగా కథకుడు. కథకుడుగా అతని స్థానం వుదాత్తమైంది. మనిషిగా గోపీచంద్ అతని రచనల్లో కనబడినట్లు తెలుగునాటి మరే రచయితా కనబడడు. అతని వ్యక్తి త్వానికిదే తార్కణం. రచయితగా, వ్యక్తిగా గోపీచంద్ చిరస్థాయిగా మనగలడు.

2 comments:

durgeswara said...

తన బిడ్ద మరణావస్తలో వుంటే బ్రతికితే నేను నిన్ను నమ్ముతానని ప్రార్ధించి పరీక్షించి మరీ సాయిని నమ్మి తనబిడ్దకు సాయిపేరు పెట్టుకున్న గోపీ చంద్ గారి గూర్చి చెప్పారు,సంతోషము.అన్వేషన చివరదశలో సత్యము కనుక్కున్న చలం గారు గోపీచంద్ గార్ లాంటి వారిని దిగజారారనటము. మీలాంటి పెద్దలకు తగదేమో.మనం నమ్మినది మాత్రమే సత్యమని భావించటము ఖచ్చితమయిన సిద్ధాంతమా అని అనుమానం.ఇక వాదాలకు వాస్తవాలకు తేడా తెలియని ్వారు కాదు మీరు. జగమెరిగిన హేతువాదులు మీరు. హేతువేదీ లేదంటే ఏమి చెప్పగలము. మీలాంటి భాషా వాదనా పటిమ మాకు వుండదు కదా? అంతమాత్రము చేత సూర్యుడు తూర్పునేవుదయిస్తాడన్నది తెలియని చిన్నపిల్లవాడివల్ల సత్యప్రమాణానికే లోటురాదుకదా?ధన్యవాదములు

శరత్ కాలమ్ said...

మంచి వ్యాసం. గోపీచంద్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను.