Saturday, March 7, 2009

ఎడిసన్ మూఢనమ్మకాల ఊబిలో


ఎడిసన్
ఎడిసన్ కనుగొన్న విషయాలతో ప్రపంచం ఎంతో సంతోషించింది. బల్బు మొదలు ఫోనోగ్రాఫ్ వరకూ అతడు వెయ్యికి పైగా ఉపయుక్తమైనవి అందించాడు.
థామస్ అల్వా ఎడిసన్ (1847-1931) స్వేచ్ఛాపరుడుగా జీవితం ఆరంభించాడు. థామస్ పెయిన్ రచనలతో ప్రభావితుడై, నమ్మకాలు లేని సైంటిస్టుగా లోకానికి సేవచేశాడు. ఎడిసన్ భౌతికవాదిగా క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యాడు.
ఎడిసన్ కనుగొన్న విశేషాలతో అతడికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మానవాళికి సైన్స్ ద్వారా ఎనలేని సేవలు అందించాడు. అది తొలి అధ్యాయం. సైంటిఫిక్ పద్ధతిలో ఉన్న గొప్పతనం అది.
అయితే ఎడిసన్ అలా కొనసాగలేదు. మధ్యలో దారితప్పాడు. జీవితం చివరి దశాబ్దాలలో ఎడిసన్ ఆలోచనలు వక్రీకరించాయి. వృద్ధాప్య లక్షణం అయితే కావచ్చు. జీవితానంతరం ఏదో ఉందనే విశ్వాసంతో, మరణించినవారితో మాట్లాడడం సాధ్యమని భ్రమపడ్డాడు. అందుకుగాను ఒక విద్యుత్ పరికరం తయారు చేసే ప్రయత్నం చేశాడు! సైంటిఫిక్ అమెరికన్ పత్రిక వెల్లడించిన ఈ వార్త, చాలామందిని ఆశ్చర్యపరిచింది. చనిపోయిన తరువాత వ్యక్తికి చెందిన జ్ఞాపకాలు, తెలివితేటలు, జ్ఞానం ఉంటాయని, కనుక అలాంటివారితో ప్రసారం సాగించవచ్చునని నమ్మాడు. అందుకు సున్నిత పరికరాన్ని కనుగొనాలని తలపెట్టాడు. చనిపోయినవారితో మాట్లాడి రికార్డు చేసే ప్రయత్నం ఫలిస్తుందన్నాడు. దీనికిగాను ఎలాంటి పరిశీలన, పరిశోధన చేశాడో వివరాలు తెలియదు. కాని అలాంటి ప్రయత్నంపై చాలాకాలం వృధా చేసినట్లు తెలుస్తున్నది. ఫలితం మాత్రం రాలేదు. లోపం ఎక్కడుంది? గుడ్డిగా నమ్మడంలో ఉంది. శాస్త్రీయ పద్ధతి విడనాడి, నమ్మకం ఆధారంగా సాగితే అదే గొడవ, సరిగా, ఎడిసన్ ఒక మలుపులో అలాంటి తప్పటడుగు వేశాడు.
ఎడిసన్ పై దుమ్మెత్తిపోసిన క్రైస్తవులు, హఠాత్తుగా ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు.
ఎడిసన్ క్రమంగా ఆత్మ, దైవం మత్తులోపడి, క్రైస్తవ మతం చాలా గొప్పదని ప్రచారం చేశాడు. మానవులలో సూక్ష్మ కణాలు ఆకాశంలో ఇతర గ్రహాల నుండి వచ్చాయన్నాడు. వ్యక్తి చనిపోతే, అవి మరో చోటకు పోతాయని కూడా నమ్మాడు. ఎడిసన్ చివరి దశలో థియోసఫీ (దివ్యజ్ఞాన సమాజం) ప్రభావంలోపడి, బ్లావ టీస్కీ రచనలు చదివి, సమావేశాలకు వెళ్ళి, వారి నుండి డిప్లొమా స్వీకరించాడు. మనోబలంతో వస్తువుల్ని కదిలించ వచ్చని ఎడిసన్ నమ్మాడు. అలాంటి ప్రయత్నాలు చేసి, ఫలించక వదిలేశాడు. టెలిపతి రుజువు చేయడానికి విద్యుత్ పరికరాలు వాడి, పనిచేయవని తెలుసుకుని, నిరుత్సాహపడ్డాడు. బెర్డ్ హోర్డ్ రీస్ (1841-1926) అనే సమకాలీన మెజీషియన్ చేసిన పనులు చూసి, అద్భుతంగా భావించిన ఎడిసన్, ఇంద్రియాతీత శక్తులకు అదే నిదర్శనం అన్నాడు. మెజీషియన్లు చాలా సందర్బాలలో సైంటిస్టులను బోల్తాకొట్టిస్తారనడానికి అదే నిదర్శనం. రీస్ ఎలా చేస్తాడో తరువాత వివరణ వస్తే, ఎడిసన్ జుట్టు పీక్కున్నాడు... ఎడిసన్ తన ఇంద్రియాతీత శక్తిపై నమ్మకంతో కొన్ని జోస్యాలు చెప్పాడు. అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఎడిసన్ శాస్త్రజ్ఞుడుగా తొలి దశలో ఉన్నందున, అతడి మాటల ఆధారంగా సైన్స్ కథలు చాలా వచ్చాయి.
సుప్రసిద్ధ ఫోర్స్ పత్రిక ఎడిటర్ బి.సి.ఫోర్బ్స్ ఒకసారి న్యూయార్క్ లో ఎడిసన్ వద్దకు ఇంటర్వ్యుకు వెళ్ళాడు. అయితే కొత్తగా చెప్పడానికి ఏమీలేక మృతుల ఆత్మలతో మాట్లాడ వచ్చనే కథ అల్లానని ఎడిసన్ చెప్పాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక 1926 అక్టోబర్ 15న ఇంటర్వ్యూ విషయం వచ్చింది. ఇటీవల వెలువడిన ఎడిసన్ జీవిత చరిత్రలలో ఇలాంటి సత్యాలు బయటపడ్డాయి. అయితే ఎడిసన్ నిజంగా ఆత్మలతో మాట్లాడే విషయం నమ్మలేదా అంటే నమ్మాడు. తన డైరీలలో అలా రాసుకున్నాడు. సైంటిస్టులు లోకానికి ఉపయోగపడడం ఎంత గొప్పదనమో, మూఢనమ్మకాల ఊబిలో కూరుకపోవడం అంత ద్రోహం కూడా.

2 comments:

krishna rao jallipalli said...

సైంటిస్టులు లోకానికి ఉపయోగపడడం ఎంత గొప్పదనమో, మూఢనమ్మకాల ఊబిలో కూరుకపోవడం అంత ద్రోహం కూడా....ఎడిసన్ సంగతేమో గాని...ప్రస్తుతం శ్రీహరి కోట కేంద్రం వారు తప్పక పాటిస్తున్నారు, పోషిస్తున్నారు.

Praveen Mandangi said...

సైంటిస్టులు తిరుపతి గుడిలో కొబ్బరికాయలు కొట్టడం చూస్తోంటే నాకు నిజంగా నవ్వొస్తోంది.
---మార్తాండ