Sunday, March 15, 2009

ఆంధ్రప్రదేశ్ లో పునర్వికాసం పునాదులు




Alapati Ravindranath

Yelavarthi Rosaiah



Abburi Ramakrishnarao




D V Narasaraju




















M N Roy

Some pictures of stalwarts who worked for renaissance in Andhra Pradesh and followed M N Roy`s scientific humanist thought













AGK Murthy







ఆంధ్రప్రదేశ్ లో పునర్వికాసం
పునాదులు వేసిన ఎమ్.ఎన్. రాయ్
స్వాతంత్ర పోరాటపు రోజులలో మన రాష్ట్రంలో ముమ్మరంగా వివిధ ఉద్యమాలు చిగురించి, వ్యాపించాయి. అందులో పునర్వికాస ఉద్యమానికి నాంది పలికి ఎందరో మేథావులను, రచయితలను ఆరితేరినవారుగా మలచిన ఖ్యాతి ఎమ్.ఎన్.రాయ్ ది. గాంధీజీ రాజకీయాలకు మార్గాంతరంగా వివేచనా ధోరణులతో ఫైజ్ పూర్ (మహరాష్ట్ర) కాంగ్రెస్ లో కొత్త దారులు తొక్కిన ఎమ్.ఎన్.రాయ్ ఎందరినో ఆకర్షించాడు. కుందూరు ఈశ్వరదత్ తన పత్రిక ప్రతినిధిగా ఎమ్. వి. శాస్త్రి (ములుకుట్ల వెంకట శాస్త్రి)ని పంపారు. రాయ్ ను ఆంధ్రకు ఆహ్వానించి వచ్చారు. 1938 జులై 31న నెల్లూరులో జరిగిన వ్యవసాయ కూలీ మహాసభకు ఎమ్.ఎన్.రాయ్ ను ప్రారంభకులుగా వెన్నెలకంటి రాఘవయ్య పిలుచుకువచ్చారు. అప్పటి నుండి 1954లో చనిపోయే వరకూ ఎమ్.ఎన్.రాయ్ తెలుగు మేథావులపై చెరగని ముద్ర వేశారు.
రచయితలలో అబ్బూరి రామకృష్ణారావు, త్రిపురనేని గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు, డి.వి.నరసరాజు, జి.వి.కృష్ణారావు, ఏ.యస్. అవధాని, పెమ్మరాజు వెంకటరావు, పి.హెచ్. గుప్తా, ఆవుల గోపాల కృష్ణమూర్తి ఎంతో ప్రభావితులై రాయ్ చెప్పిన పునర్వికాస ధోరణిలో ఎన్నో రచనలు వెలువరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి రాస్తూ రాయ్ జైలు లేఖలు సాహిత్య రంగంలో మణిపూసలని మెచ్చుకున్నారు. పైగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్ గా ఉండమన్నారు కూడా. ఫిలాసఫీ ప్రఫెసర్ గా అక్కడే ఉన్న కొత్త సచ్చిదానందమూర్తి తాను వ్రాసిన భారత తత్వ పరిణామ చరిత్రకు ఎమ్.ఎన్. రాయ్ తో సుదీర్ఘ పీఠిక రాయించుకున్నారు.
1938 నుండి గూడవల్లి రామబ్రహ్మం తన ప్రజామిత్ర పత్రికలో రాయ్ ఆలోచనలను తెలుగువారికి అందించటంలో చాలా తోడ్పడ్డారు. ఆయన తీసిన సంస్కరణల సినిమాలు కూడా రాయ్ హేతుబద్ధ ఆలోచనా ప్రభావాల ధోరణి కనిపిస్తుంది.
గోపీచంద్ తొలి రాజకీయ కథలు, వ్యంగ్యాస్త్ర విమర్శలూ రాయ్ అనుచరుడుగా వెలువరించినవే. జి.వి. కృష్ణారావు కీలుబొమ్మలు, పాపికొండలు తాత్విక విమర్శలు అన్నీ రాయిస్ట్ గా వ్రాసినవే. నవ్య మానవవాద తత్వాన్ని తన నవల రెండో అశోకుడి మూన్నాళ్ళ ముచ్చట అనే నవలలో పాలగుమ్మి పద్మరాజు చిత్రీకరించారు. రాయ్ ప్రభావంతో ఆయన చెప్పిన మానవ వాదాన్ని పత్రికా ముఖంగా అందించివారు ఆవుల గోపాలకృష్ణమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, ఆలపాటి రవీంద్రనాథ్, పి.వి. సుబ్బారావు, కోగంటి సుబ్రహ్మణ్యం, కొల్లి శివరామిరెడ్డి, ఎమ్.వి. రామమూర్తి, రావిపూడి వెంకటాద్రి, పెమ్మరాజు వెంకటరావు పేర్కొనదగినవారు. ఆ రోజులలో రాయ్ ఆలోచనలను ఒకపట్టాన దినపత్రికలు కానీ వారపత్రికలు గానీ, ప్రచురించేవి కావు. కనుక ఆయన అనుచరులు సొంత పత్రికలు పెట్టి, భావాల ప్రభావాన్ని చూపారు. అలా వచ్చిన పత్రికలలో పేర్కొనదగినవి-ప్రజామిత్ర, రాడికల్, జ్యోతి, రాడికల్ హ్యూమనిస్ట్, రాడికల్ విద్యార్థి, సమీక్ష, వికాసం ఉన్నవి.
ఎమ్.ఎన్.రాయ్ అనేక శిఖణ శిబిరాలు నిర్వహించి, శాస్త్రీయంగా రాజకీయాలు ఉండాలని రాజ్యాంగం సెక్యులర్ గా రూపొందించాలనీ, వికేంద్రీకరణ పిరమిడ్ రూపంలో ఏర్పడాలనీ, చరిత్రను వైజ్ఞానికంగా రాయాలనీ చెప్పారు. అవి ఆంధ్రలో చక్కని పునాదులు వేశాయి. భట్టిప్రోలు హనుమంతరావు, కల్లూరి బసవేశ్వరరావు, జాస్తి జగన్నాధం, ఆవుల సాంబశివరావు, ఎ.ఎల్. నరసింహారావు, ఆలూరి బైరాగి, సి.హెచ్, రాజారెడ్డి. మల్లాది సుబ్బమ్మ మొదలైనవారు రచనలు చేశారు. ములుకోల (బండి బుచ్చయ్య సంపాదకుడు), ప్రజావాణి (వట్టికొండ రంగయ్య సంపాదకుడు) వంటి పత్రికలు భావ ప్రసారాలకు తోడ్పడ్డాయి. రాయ్ ప్రభావంతో విమర్శనాత్మక రచనలు, నిశిత పరిశీలనా గ్రంథాలు వెలువడ్డాయి. అందులో పి.హెచ్. గుప్తాగారి రామాయణ విమర్శ, ఆవుల గోపాలకృష్ణమూర్తి వ్యాసాలు, జి.వి. కృష్ణారావు సారస్వత రచనలు గమనార్హం.
ఎమ్.ఎన్. రాయ్ తో 1940 ప్రాంతాలలోనే ఆలోచనా సమావేశాలను చేయడానికి సుప్రసిద్ధ రచయిత చలం, విమర్శక పితామహుడు త్రిపురనేని రామస్వామిలతో ఆవుల గోపాల కృష్ణమూర్తి చర్చలు ఏర్పాటు చేశారు. ఆంధ్రలో అనేక సెక్యులర్ వివాహాలు జరపడానికి పునర్వికాస ఉద్యమం తోడ్పడింది. పి. కృష్ణ చౌదరి సంపాదకత్వాన రాడికల్ విద్యార్థి పత్రిక విద్యా సంస్థలలో ప్రభావం కనబరిచింది. ఎమ్.ఎన్.రాయ్ రచనలు తెలుగులోకి తీసుకురావడంలో ఎందరో కృషి చేశారు. వాటిని తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, ప్రజాపరిషత్తు, నలంద పబ్లిషర్స్, హేమ ప్రచురణలు తోడ్పడ్డాయి. ఇలా తెలుగు అనువాదాలు చేసినవారు భట్రిప్రోలు హనుమంతరావు (రాయ్ స్మృతులు), కోగంటి రాధాకృష్ణమూర్తి (రాయ్ వ్యాసాలు), రాడికల్ హ్యూమనిజం (ఆవుల గోపాలకృష్ణమూర్తి), పిల్లి ఆత్మకథ (వెనిగళ్ళ కోమల), రాయ్ ప్రధాన రచనలు (ఎన్.ఇన్నయ్య) ఉన్నారు.
తెలుగులో ఎమ్.ఎన్.రాయ్ ప్రభావంతో భావ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఖ్యాతి ఆంధ్రజ్యోతి సంపాదకులు కీ.శే. నార్ల వెంకటేశ్వరరావుకు దక్కుతుంది. తన గ్రంథాలను కొన్నిటిని ఎమ్.ఎన్.రాయ్ కు, మానవ వాదులకు అంకితం చేయడమే కాక, ఆ భావాల ప్రభావంతో గీతా రహస్యం, ఉపనిషత్తుల పరిశీలన, పురాణాల విమర్శ, శాస్త్రీయ ఆలోచన రచనలను నార్ల వెలువరించారు.
తెలంగాణా ప్రాంతంలో ఎమ్.ఆర్. కృష్ణ, ఎమ్. నారాయణ, ఆలం ఖుంద్ మెరీ, ఎ.ఎస్.వడ్వాల్కర్ వంటివారు రాయ్ ఆలోచనలను ప్రసారం చేశారు. రాయ్ రచనలలో పార్టీలు అధికారం, రాజకీయాలు అనే వ్యాస సంపుటి నక్సలైట్ కమ్యూనిస్టులను ఆకట్టుకోవటం గమనార్హం.
రాజకీయాలలో శాస్త్రీయ ధోరణి అవసరమని ఆమేరకు వారిని శిక్షితులను చేయడం మనకర్తవ్యమని రాయ్ చెప్పాడు. రాజకీయ పార్టీల నిర్హేతుక ధోరణిని అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారే పద్ధతులను రాయ్ తీవ్రంగా నిరసించారు.

2 comments:

Ajit Kumar said...

చాలా బాగుంది. ఎంతో విలువైన సమాచారాన్ని అందించినందుకు థాంక్స్.

ఈగ హనుమాన్ (హనీ), said...

చాలా విలువైన సమాచారాన్ని అందించారు, బావుంది
మీ
ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)