Tuesday, March 24, 2009

జ్యోతిష్యంలో వింతలు, విడ్డూరాలు, అశాస్త్రీయాలు

ఖగోళ శాస్త్రం – జ్యోతిష్యం :
ఖగోళశాస్త్రం సైన్స్ లో భాగం. ఇందులో పరిశీలన, పరిశోధన ప్రధానంగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఈ ప్రక్రియ జరుగుతున్నది. కనుక క్రమేణా తెలుసుకునేది విస్తృతమౌతున్నది. పూర్వం తెలియని గ్రహాలు, నక్షత్రాలు, శకలాలు ఇలా ప్రకృతిలో ఎన్నో విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పటికి పరిమితంగా తెలిసింది. ఇంకా తెలియవలసింది అనంతంగా ఉన్నది. కనుక ఖగోళ శాస్త్రంలో ఏప్పుడూ నిత్య నూతనంగా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇందులో మరొక విశేషమేమిటంటే లోగడ తెలుగుకున్న వాటిలో దోషాలున్నా, అసంపూర్ణతలు ఉన్నా అవి దిద్దుకుంటూ పోవటం శాస్త్రియ ప్రక్రియలో ఒక ఉత్తమ గుణం. తన తప్పులను తాను సవరించుకుంటూ రుజువైన వాటిని అంగీకరిస్తూ, రుజువు కానివాటిని మూఢంగా నమ్మకుండా, రుజువుల కోసం ఎదురు చూడటం ఈ శాస్త్రంలో మంచి లక్షణం. ఇది సైన్స్ లో అన్ని విభాగాల్లోనూ ఉంటుంది. ఇందులో జ్యోతిష్యాలకు, ఊహలకూ, మనుషుల బలహీనతలను అట్టం పెట్టుకుని వ్యాపారం చేసే ధోరణి ఉండదు.
జ్యోతిష్యం భారత దేశం సొత్తు కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక చోట్ల ఇది ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా మత, ధోరణిలో జోతిష్యం సాగింది. ఎక్కువగా పూర్వీకుల రచనలు, వాదనలు, ఆధారంగా జ్యోతిష్యం నడుస్తున్నది. మనుషులలో ఉన్న బలహీనతలు, నమ్మకాలు, పెట్టుబడిగా జ్యోతిష్యం వాడుకుంటున్నది. ఇందులో దోషాలు దిద్దుకోవటం, తప్పులు సవరించుకోవటం కనిపించదు. పైగా కుంటి సాకులతో కప్పి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రుజువులు ఆధారాలు లేకపోవటమే. గ్రహాల నుండి మనుషులపై ప్రభావం చూపే ఆధారాలేమీ లేవు. కానీ ఉన్నట్లుగా నమ్మించి, చెప్పి వ్యక్తులను తప్పుదారిన పట్టిస్తున్నారు. ప్రాచీనమైనంత మాత్రాన అదే సరైనదనే ధోరణి నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో దోషాలు అమలులో ఉన్నాయి. మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేయటం అవసరం. ఉదాహరణకు అంటరాని తనం, కులహెచ్చుతగ్గులు, చాలా కాలం నుంచి వస్తున్నాయి. అంతమాత్రాన అవి మంచివని, వాటినే అనుసరించాలని అనలేము. అలాగే జ్యోతిష్యం ప్రాచీన కాలంలో ఎవరో చెప్పారని ఇప్పటికీ మూర్కంగా అనుసరించటం మన జనాన్ని వెనక్కి నడిపించటమే. ఇదే దోరణి విదేశాల్లోనూ ఉన్నది. అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు వారు రుజువులకు ముందుకు రారు. ఇండియాలోనూ అదే ధోరణి ఉన్నది.

ప్రపంచంలో చాలా దేశాలలో జ్యోతిష్య నమ్మకాలు ఉన్నాయి. కానీ భారతీయ జ్యోతిష్యం వాటికి భిన్నంగా, చాలా ప్రత్యేకతలతో ఉన్నది.
భారతీయ జ్యోతిష్యానికి మూలం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 108 పాదాలు, పుట్టుక కాలం.
9 గ్రహాలలో ప్రపంచంలో ఎక్కడా లేని, శాస్త్రీయ ఆధారాలకు అందని రెండు గ్రహాలున్నాయి. ఒకటి రాహువు, కేతువు.
గ్రహాలకి కులాలున్నాయి. అంటరానితనం ఉన్నది. శని శూద్ర కులానికి చెందగా, వైశ్య కులానికి చెందినవారు చంద్రుడు, బుధుడు అట. రాజ వంశానికి చెందినవారు కుజ, రవి కాగా బ్రాహ్మణులలో శుక్రుడు గురువున్నాడు. ఇంతటితో ఆగలేదు. శుక్రుడు, చంద్రుడు స్త్రీ గ్రహాలట. గురుడు, కుజుడు, రవి పురుషులట. శని, బుధుడు నపుంసకులట. ఈ విచక్షణ వర్గీకరణ ప్రపంచంలో మరే జ్యోతిష్యంలోనూ లేదు. వీనికి తోడు ప్రతి గ్రహానికి ఒకళ్ళో ఇద్దరో దేవుళ్ళు కూడా ఉన్నారు. అందుకే గ్రహాలను దేవతలంటారు. పైగా మన జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు గ్రహం. అంతేగాని నక్షత్రం కాదు.
వ్యక్తి భవిష్యత్తును చెప్పటానికి జనన కాలం, లగ్నం ఆధారంగా సూచిస్తారు.
భారతీయ జ్యోతిష్యానికి మూలం ఎక్కడో కచ్చితంగా తేల్చి చెప్పటంలేదు. వేదాలలో జ్యోతిష్యం లేదు. వేదాంగాలలో 6 భాగాలుండగా అందులో జ్యోతిష్యం ఒకటి. ఎక్కువమంది జ్యోతిష్యులు పరాశరహోరా శాస్త్రాన్ని పాటిస్తారు. ఆ తరువాత చిలవలు పలవలుగా చాలా పుస్తకాలు, చాలామంది పండితులు బయల్దేరి అనేక చిట్కా జ్యోతిష్యాలు చెప్పారు. వీటిలో ఉత్తరోత్తర ఖగోళ శాస్త్రంలో కనుగొన్న గ్రహాలు లేవు. నెప్ట్యూన్, యురేనస్ వంటివి వారికి తెలియదు. గ్రహాలకు బలం ఉంటే అవి మనుషుల మీద ప్రభావం చూపితే మరి ఆ గ్రహాల సంగతి ఏమవుతుందో తెలియదు.
గ్రహాల నుండి వెలుగు రాదు. అయినప్పటికీ గ్రహాల ప్రభావం మనిషిమీద ఎలా ఉంటుంది అనేది ప్రాచీన శాస్త్రాల, అంకెల గారడీతో చెప్పటం తప్ప ఋజువుపరచటానికి ఏమీ లేదు. కానీ కొత్త ఎత్తుగడలతో నామ నక్షత్రం పేరిట మొదటి అక్షరాన్ని బట్టి జన్మ లగ్నం చెప్పటం, ప్రశ్న కాలాన్ని బట్టి చెప్పటం అనేవి బతుకు తెరువుకు వేసిన ఎత్తుగడలు మాత్రమే.
ఖగోళ శాస్త్రంలో ఋజువులూ ఆధారాలూ ఉంటాయి. ఆధునిక పరికరాలతో పరికించే తీరు ఉంటుంది. జ్యోతిష్యంలో ప్రాచీన గ్రంథాలు తప్ప మరే పరిశీల, పరిశోధన ఉండదు. గ్రహానికీ, నక్షత్రానికీ తేడా వీరికి తెలియదు. రాశులు అనేవి ఊహించిన రూపాలే తప్ప వాస్తవంలో లేవు. అయినా వాటినే నేటికీ పాటిస్తున్నారు.
జనన కాలాన్ని నిర్ధారించడానికి, తల్లి గర్భంలో బిడ్డ ప్రవేశించినపుడు, ప్రసవించేటప్పుడు తల బయటికి వచ్చినప్పుడు, తొలిసారి బిడ్డ ఏడ్చినప్పుడు, తొలుత శ్వాస పీల్చినప్పుడు లెక్కలు వేస్తున్నారు. ఇవన్నీ అభిప్రాయ భేదాలతో ఉన్న అంశాలే. కచ్చితంగా జన్మ నక్షత్రాన్ని నిర్ణయించే ఆధారాలేవీ వీరికి లేవు. అయితే నమ్మకం, మూఢవిశ్వాసం సంప్రదాయంగా వస్తున్నాయి గనక జ్యోతిష్యం ఒక వ్యాపారంగా సాగిపోతోంది. ఖగోళ శాస్త్రం పక్కన పెట్టుకొని పరిశీలిస్తే జ్యోతిష్యం నిలబడదు. కనకనే దాని జోలికి పోరు. యూనివర్సిటీలలో జ్యోతిష్యం కోర్సులు పెట్టిన చోట కూడా శాస్త్రీయ పరిశీలన, ఖగోళంతో పోల్చి చూడటం అనేవి లేవు. సూర్యుని నుండీ వచ్చే వెలుగు ప్రతి క్షణం అనంత కిరణాలతో ఉంటుంది అందులో ఏ కిరణంతో పుట్టినప్పుడు ప్రభావితం అవుతారో చెప్పలేరు. అయినా లగ్నాలు, ముహుర్తాలు, మంచి గిట్టుబాటు వాణిజ్యంగా చదువుకున్న వారిలో సైతం సాగుతుండటం పేర్కొనదగిన అంశం.

13 comments:

Praveen Mandangi said...

పూర్వం పగటి పూట సూర్యుని దిక్కు, రాత్రి పూట చంద్రుని దిక్కు చూసి ఆ కదలికలు ఆధారంగా టైమ్ నిర్ణయించే వారు. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యోదయం అన్ని ప్రాంతాలలో కంటే తొందరగా అవుతుంది, గుజరాత్ లో అన్ని ప్రాంతాలలో ఆలస్యంగా అవుతుంది. సూర్య చంద్రుల దిక్కులు చూసి టైమ్ చెప్పే పద్దతి నుంచి చేతి గడియారం చూసి టైన్ చెప్పే పద్దతిలోకి మారితే టైమ్ లో చాలా తేడా వస్తుంది. మా ఇంటికి కూడా పంతులు వస్తుంటాడు. అతను కూడా చేతి గడియారం టైమే చూస్తాడు కానీ సూర్య చంద్రుల దిక్కు చూసి టైమ్ చెప్పలేడు. అతను చెప్పే జ్యోతిషం తప్పని మాత్రం అతను ఒప్పుకోడు. మా అమ్మానాన్నలు ఆ మోసగాడిని ఎలా నమ్మారో నాకు అర్థం కాదు.

Malakpet Rowdy said...

భారతీయ జ్యోతిషాన్ని ఎద్దేవా చెయ్యడం ప్రతీ ఒక్కడికీ ఫేషన్ అయ్యింది. అసలు అది ఏ సందర్భంలో వ్రాయబడిందో, దానిని ఎలా అన్వయించుకోవాలో ఎవరికైనా తెలుసా? అసలు గ్రహాలని ఎలా నిర్వచించారో ఎవరికైనా తెలుసా? థియరీ ఆఫ్ రెలటివిటీ బట్టీ చూస్తే జియో సెంట్రిక్ థీయరీ కూడా నిజమే. రాహు కేతు అనేవాటిని గ్రహాలుగా కాకుండా 'ప్లానెటరీ పొసిషన్స్ ' గా చూసుకుంటే సరిపోతుందని సైంటిస్టులే అన్నారు.

ఇక అతిశయోక్తులు - ఇలాంటివి లిండా గుడ్మాన్ పుస్తకంలో కోకొల్లలు. కానీ ఈ గుడ్డిమాలోకపు కమ్యూనిష్టులకి అవి కనిపిస్తే కదా? అవిడే గనక హిందువు అయ్యుంటే గోల గోల పెట్టుండేవాళ్ళు. గ్రహాలకి కులాలున్నాయి అనే సదరు రచయితే మతపరంగా విమర్శలు చెయ్యడం నవ్వుతెప్పిస్తోంది.

Praveen Mandangi said...

జియోసెంట్రిక్ థియరీ నిజమయ్యే అవకాశం లేదు. సూర్యునికి ఉండే గ్రావిటేషన్ శక్తి ప్రభావం వల్లే గ్రహాలన్నీ సూర్యిని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుని గ్రావిటేషన్ శక్తితో పోలిస్తే భూమికి ఉన్న గ్రావిటేషన్ శక్తి చాలా తక్కువ. ఎంత తలక్రిందులుగా చూసినా సూర్యుడు భూమి చుట్టూ తిరిగే అవకాశం కనిపించదు.

పెదరాయ్డు said...

ఖగోళ శాస్త్రంలో ఋజువులూ ఆధారాలూ ఉంటాయి. ఆధునిక పరికరాలతో పరికించే తీరు ఉంటుంది.
- ఖగోళ శాస్త్రం, లేక మరేదైనా శాస్త్ర౦ కూడా, ఈ నాటికీ ఎన్నో పరికరాలున్నా, అనేక ప్రశ్నలు సశేష౦గానే వున్నాయి. అ౦దుకని పూర్తిగా ఖగోళ శాస్త్రం అపద్దమని చెప్పొచ్చా?

9 గ్రహాలలో ప్రపంచంలో ఎక్కడా లేని, శాస్త్రీయ ఆధారాలకు అందని రెండు గ్రహాలున్నాయి. ఒకటి రాహువు, కేతువు.

- E= mc**2 + k. తెలుసా మీకు. అ౦దులోని K నే ఈ రాహువు, కేతువు. ౭ గ్రహాలే కాకు౦డా మరిన్ని అటువ౦టి మూలకాల ప్రభావాన్ని రాహువు, కేతువులుగా స౦గ్రహి౦చారు.

ఖగోళ శాస్త్రం పక్కన పెట్టుకొని పరిశీలిస్తే జ్యోతిష్యం నిలబడదు.
- మీరు ఖగోళ శాస్త్రం పై విపరీతమైన పక్షపాత౦తో వున్నారు. జ్యోతిష్య శాస్త్రం పక్కన పెట్టుకొని పరిశీలిస్తే ఖగోళ శాస్త్రం కూడా నిలబడదు. మీకు తెలిసినదే నిజమని మీరు ఎలా నమ్ముతారు?

ప్రస్తుత రూప౦లోని జ్యోతిష్య శాస్త్రం బతుకు తెరువుకోస౦ రూపా౦తర౦ చె౦దినా, అ౦దులోని శాస్త్రీయతనె౦దుకు గుర్తి౦చరు? వేదాంగాల కాల౦లో ఇన్ని గ్రహాల గురి౦చిన అవగాహన వారికి ఎలా వచ్చి౦ది? పరిశోధి౦చి నిజ౦ తెలుసుకోకు౦డా, మీరే ఒక తీర్పు ఇచ్చేస్తే ఎలా?

పాశ్చ్యాత్యుల పై ఆ మోహమె౦దుకు? వారైనా మనుషులే, వారిని అభిమాని౦చినా పర్వాలేదు. మన ప్రతిభను అవహేళన చేసి, మరుగున పడవేయట౦ వల్లే మనకీ గతి.

prashanth said...

/*గ్రహాల నుండి వెలుగు రాదు. అయినప్పటికీ గ్రహాల ప్రభావం మనిషిమీద ఎలా ఉంటుంది*/

వెలుగు వస్తేనే మనుషుల మీద ప్రభావం ఉంటుందని అనుకుంటున్నరా...?

Praveen Mandangi said...

మీరు స్కూల్ చదువులు చదివిన వాళ్ళ లాగ మాట్లాడడం లేదు. మఠాలలోని సన్నాసుల శిష్యుల లాగ మాట్లాడుతున్నారు. ఎక్కడా లేని ఫార్ములాల పేర్లు చెప్పి రాహుకేతువులునాయని చెపితే నమ్మేయడానికి మేము పంగనామాలు ఉన్న వాళ్లం కాదు.

Malakpet Rowdy said...

బుర్ర తక్కువ కమ్మ్యూనిష్టు ద్రోహుల కన్నా మఠం లోని సన్యాసులే నయం. సన్యాసులు చెడగొట్టేది వాళ్ళ శిష్యులనే. కానీ కమ్మునిష్టులు మొత్తం ప్రపంచంలోనే కలుపుమొక్కలు.

థియరీ ఆఫ్ రిలేటివిటి అనేది గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడదు .. "ఫ్రేం ఆఫ్ రిఫరెన్స్" మీద ఆధారఫడుతుంది. భూమి ఫ్రేం ఆఫ్ రిఫరెన్స్ అయితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు లెక్ఖ.

అన్నట్టు హీలియో సెంట్రిక్ సిద్ధాంతం ప్రతిపాదించింది భారతీయుడయిన వరాహమిహిరుడే ( కొపర్నికస్ కన్నా ముందు)

Praveen Mandangi said...

మస్జీద్ లలో ఇప్పుడు కూడా సూర్యుడి డైరెక్షన్ ఆధారంగానే టైమ్ నిర్ణయించి ఆజాన్ చదువుతారు. సూర్యుడు ఉదయించకముందు ఒకసారి, మిట్ట మధ్యాహ్నం ఒకసారి, మిట్ట మధ్యాహ్నం తరువాత ఒకసారి, సాయింత్రం ఒకసారి, రాత్రి ఒకసారి ఇలా రోజుకి ఐదుసార్లు మస్జీద్ లో ఆజాన్ చదువుతారు. ఎందుకంటే సూర్యుని దిక్కు చూసి టైమ్ చెప్పే పద్దతి నుంచి చేతి గడియారం చూసి టైమ్ చెప్పే పద్దతిలోకి మారితే ప్రాంతానికొకలాగ టైమ్ తేడా వస్తుంది. జ్యోతిషులు మాత్రం చేతి గడియారం చూసే టైమ్ చెపుతారు కానీ సూర్యచంద్రుల డైరెక్షన్ చూసి టైమ్ చెప్పడం ఎక్కడా చూడలేదు. సమయాలు, ముహూర్తాలు పేరుతో జ్యోతిషులు చేసేది మోసమే.

Praveen Mandangi said...

@మలక్ పేట్
వరాహ మిహిరుడు హీలియో సెంట్రిక్ థియరీని నమ్మలేదు. ఆర్యభట్టు భూమి కదులుతోంది అని నమ్మేవాడు కానీ ఆధారాలు చూపించలేకపోయాడు. మొట్టమొదట శాస్త్రీయంగా ఆధారాలు చూపించింది మాత్రం కోపర్నికస్.

Malakpet Rowdy said...

"సూర్య: జగత చక్షు" - Gurutvaakarshan is attributed to varahamihira .. which obviously means that he was the one who proposed it!

నేను అన్నది ప్రతిపాదించిన వాళ్ళ గురించి .. నిరూపించిన వాళ్ళ గురించి కాదు .. అయినా నేను లేపిన మొదటి పాయింటు ఫ్రేం ఆఫ్ రిఫరెన్స్ గురించి. ఐన్శ్టయిన్ ఎప్పుడు దానికి గురుత్వాకర్షణ శక్తికీ ముడి పెట్టలేదు.

హరి said...

"సూర్య: జగత చక్షు" అంటే ఏమిటో?
భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడనా? సూర్యుడి వలన దృష్టి కలుగుతుంది అనే అర్థం వస్తుందే?

పోనీండి. భూమినే రిఫరెన్సుగా తీసుకుందాం. ఇప్పుడు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. బాగుంది. మరి మిగతా గ్రహాల సంగతో. అవి భూమి కక్ష్యలోకి కుడా రావే మరి! అవి ఒక రాశి లోంచి ఇంకొక రాశి లోకి మారుతుంటాయి తప్ప ఓ పట్టాన భూమి చుట్టూ తిరగవు. దీనికేమంటారు? అవి భూమి చుట్టూ తిరగటం లేదు కాబట్టి రాహువు, కేతువుల్ని Constants (k) గా తెచ్చుకున్నామంటారా. ఏదయినా చెప్తారు, జ్యోతిష్యులు కదా!

భాస్కర రామిరెడ్డి said...

హరి గారు, నాకు తెలిసిన భావం, జగత్ చక్షు అంటే జగత్తుకు చూపు(వెలుగు) నిచ్చేవాడు అంటే సూర్యుడు. కామెంట్లు అన్నీ చదవలేదు.సందర్భము వేరే ఎమో తెలియదు.

Praveen Mandangi said...

ఇసాక్ న్యూటన్ పుట్టక ముందు ఎవరికీ గురుత్వాకర్షణ గురించి తెలియదు. వరాహమిహిరుడికైనా తెలిసే అవకాశం లేదు. అప్పట్లో సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని చాలా మంది సైంటిస్టులు కూడా నమ్మేవారు. కోపర్నికస్ కంటికి కనిపించే కొన్ని గ్రహాల కదలికలు ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని నిరూపించాడు. కోపర్నికస్ పద్దతి కంటే చాలా శాస్త్రీయంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని నిరూపించే పద్దతులు ఇప్పుడున్నాయి.