జర్నలిస్టులకు, వార్తా సేకరణకు చరిత్ర వుంది. ఇప్పుడది ప్రపంచ ప్రదర్శనశాలలో అందుబాటులోకి వచ్చింది. వార్తలు, మ్యూజియం, కలిపేసి, న్యూజియం (Newseum) గా అవతరించింది. వాషింగ్టన్ రాజధానీ నగరంలో 6 అంతస్తుల యీ మ్యూజియం జర్నలిస్టుల కృషికి అద్దం పడుతున్నది.
ఇటీవలే యీ న్యూజియంను నేను చూచాను. ఇందులో విశేషాలు సమకాలీనమే గాక, పరిశోధకులకు కావలసినంత సమాచారం వుంది.
కనుక జర్నలిస్టులు యీ న్యూజియంను సందర్శించాలి. అది ఒక పట్టాన సాధ్యమయ్యేదికాదు. ఖర్చుతో కూడిన పని. కనుకనే మారుమూలల వుండే జర్నలిస్టులకు సైతం – తెలుసుకోడానికి అనువుగా న్యూజియం వెబ్ సైట్ ఏర్పరచారు.
వార్తల్ని సేకరించడంలో జర్నలిస్టులు పడే ఇబ్బందులు, ముఖ్యంగా యుద్ధాలలో, సంక్షోభాలలో, తుఫానులలో, సునామీ వంటి ప్రమాదాలలో ఎదుర్కొనే కష్టాలు చెప్పనలవి కాదు. అందులో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయినా రిస్క్ తీసుకుంటున్నారు. వారందరి సమాచారం సేకరించి, వారికి జోహార్లు అర్పిస్తూ, జ్ఞాపికలు ఏర్పరచారు. అది ఉత్తేజాన్ని కలిగించే దృశ్యం ఈ మ్యూజియంలో.
ప్రపంచ చరిత్రలో మలుపులు తిరిగిన సంఘటనలు ఉన్నాయి. బెర్లిన్ గోడ కూలగొట్టినప్పుడు (1989), అందులో ఒక భాగం తెచ్చి పెట్టారు. దాని చరిత్ర రాశారు. అలాంటివి ఇంకెన్నో యీ మ్యూజియంలో ఎదురౌతాయి.
రహస్య వార్తల్ని సేకరించడానికి జర్నలిస్టులు చేస్తున్న కృషిని వివరిస్తూ, థియేటర్లో దృశ్యరూపాలు ఏర్పరచారు. ఉదాహరణకు ఒక మానసిక వికలాంగుల శరణాలయానికి ఒక స్త్రీ జర్నలిస్టును రహస్యంగా పంపి, ఆమె కూడా పిచ్చెక్కిన మనిషివలె ప్రవర్తించినట్లు చేశారు. అలాంటప్పుడు అక్కడి డాక్టర్లు, నర్సులు ఎలా చూస్తారో, ఏం చేస్తారో ఆమె ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆ తరవాత వాటిని వార్తల రూపేణా ప్రపంచానికి బయటపెట్టింది.
ప్రతి అంతస్తులోనూ ఒక థియేటర్ ఏర్పరచి వివిధ అంశాలు ఆకర్షణీయంగా, సంక్షిప్తంగా చూపడం ప్రత్యేక ఆకర్షణ.
ఇందులో భాగంగా 4-డి చిత్రం కూడా వుంది. మనం కూర్చున్న కుర్చీలు సన్నివేశాలకు అనుగుణంగా కదలాడడం, మన మీదకు గాలి తెమ్మెరలు, నీటి తుంపరలు పడడం మరో విశిష్టత.
కార్టూన్ల విభాగం, హస్యపూరిత బొమ్మల భాగం మరో ఆకర్షణ.
ప్రపంచంలో సుప్రసిద్ధ పత్రికలు పాతకాలపు నాటివి అట్టి పెట్టారు. తాజాగా ఏరోజుకారోజు ఎడిషన్లు చూపుతూ టి.వి.లలో ఎప్పటికప్పుడు ప్రసారాలు అందిస్తున్నారు.
సందర్శకులు స్వయంగా టి.వి. వార్తల్లో పాల్గొ నేటట్లు ఏర్పరచారు. అది గొప్ప ఆకర్షణ.
అబ్రహాం లింకన్, కెన్నడీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారిని హతమార్చిన ఘట్టాల చరిత్రలు అమర్చారు. ఏదైనా సరే యథేచ్ఛగా ఫొటో తీసుకోవచ్చు.
పిల్లలకు ఆకర్షణీయమైన అంశాలు ఆట్టే లేవు. పెద్దలకు మాత్రం మెదడుకు మేత బాగా వుంది.
పత్రికాస్వేచ్ఛ చరిత్ర చూపుతున్నారు. రాజ్యాంగంలో పొందుపరచినవ విధానాలు ప్రస్తావిస్తున్నారు. వార్తలలో నీతి అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొని, సెన్సార్ రీతులను ప్రదర్శిస్తున్నారు.
జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా వార్తా సేకరణలో తీసిన ఫోటోలు, అందులో పులిట్జర్ అవార్డులు లభించినవి ప్రదర్శించారు.
ప్రదర్శనలో ప్రవేశించగానే ఒక థియేటర్ లో ప్రేక్షకులకు మ్యూజియంలో చూపబోయేవి, చూడవలసిన అంశాలు వివరించడం వలన, ఎవరికి తగ్గట్టు వారు ఎంపిక చేసుకోవచ్చు.
పెద్ద తెరలు పెట్టి, ఎప్పటికప్పుడు వార్తలు చూపుతున్నారు. ఆ ప్రక్రియ వెనక జరిగే కృషి వివరిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ అనేది నేడు అందరూ అనుసరిస్తున్నారు. అదేమిటో వివరించడం గమనార్హం.
ప్రపంచంలో పత్రికలు, పుస్తకాలు తొలి రోజులలో ఎలా వుండేవి. ఏ విధమైన అచ్చు యంత్రాలు వాడుతూ పోయారు, ఆపరిణామాలు ప్రదర్శిస్తున్నారు. సుప్రసిద్ధ పుస్తకాలు, పత్రికల నమూనాలు వుంచారు.
ప్రపంచంలో జర్నలిస్టులు అక్కడికి వచ్చినప్పుడు వారితో చర్చలు, ప్రసంగాలు ఏర్పాటు చేయటం నిత్యకృత్యంగా ఉన్నది. వివిధ వార్తా సంస్థలతో సంబంధాలు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత ఈ మ్యూజియం వాషింగ్టన్ శివార్లలో ఉండేది. నేను అది చూచిన తరవాత జర్నలిస్టు మిత్రులు కె. శ్రీనివాస రెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రభృతులు వాషింగ్టన్ రాగా వారికి వివరించి వెళ్ళి చూడమన్నాను. ఆ తరువాత ఆ మ్యూజియం మూసేసి, ప్రస్తుతం రాజధాని మధ్యలో కొత్తగా మ్యూజియంను ఏర్పాటు చేశారు. అందరూ దీని వెబ్ సైట్ (www.newseum.org)కు వెళ్ళి వివరంగా చూచి ఆనందించవచ్చు. వెబ్ సైట్ లో యూ ట్యూబ్, లైవ్ పిక్చర్స్ చూస్తూ మ్యూజియంని ఆనందించవచ్చు. కనుక అమెరికా రాజధాని వెళ్ళి చూడలేకపోయిన వారు కంప్యూటర్ ద్వారా ఆ విషయాలను గ్రహించి మెదడుకు మెతగా స్వీకరించవచ్చు.